సింహాద్రి అప్పన్న ఆలయంలో 31మంది సిబ్బందిపై వేటు - Simhadri Appanna


సింహాద్రి అప్పన్న ఆలయ అధికారులు దిగి వచ్చారు. అక్రమార్కులపై చర్యలకు ఉపక్రమించారు. సింహాచలం కొండపై అక్రమ నిర్మాణాలు, పలు పనుల్లో చోటుచేసుకున్న అవకతవకల్లో భాగస్వాములైన కిందిస్థాయి సిబ్బందిని తప్పించారు. 

ప్రత్యేక భూ పరిపాలన అధికారి శేషశైలజ ఇచ్చిన నివేదిక ఆధారంగా చర్యలు చేపట్టారు. ఆరుగురు హోం గార్డులు, మరో 25మంది కమ్యూనిటీ గార్డులను విధుల నుంచి తప్పించి వెనక్కు పంపించేశారు. అధికారుల నివేదిక మేరకు వారిపై చర్యలుంటాయని పేర్కొంటూ ప్రత్యేకంగా ఆదేశాలిచ్చారు.

కొండపై పలు ప్రైవేట్ భవనాలు నిర్మిత మవుతున్నా సిబ్బంది పట్టించుకోలేకపోయారని, అప్పన్న ఖజానాకు గండి పడేలా అధికారులు వ్యవహరించినా వీళ్లు కూడా వంత పాడారనే ఆరోపణలపై మొత్తం 31 మంది సిబ్బందిపై వేటు వేస్తూ నిర్ణయం తీసుకున్నారు.

గతంలో నామమాత్రపు చర్యలు :
అక్రమ నిర్మాణాలకు సంబంధించి భూ పరిపాలన విభాగంలో ముగ్గురు అధికారుల తప్పిదాలున్నాయంటూ శేషశైలజ నివేదించినా ఆలయ అధికారులు ఆ లేఖను తొక్కి పెట్టినట్టు చెబుతున్నారు. అంతే కాకుండా మీడియాలో వస్తున్న కథనాల ఆధారంగా కేవలం వారికి మెమోలిచ్చి, సరిపెట్టేశారనే ఆరోపణలు వస్తున్నాయి. కొండపై విధులు నిర్వహిస్తున్న హోంగార్డుల, కమ్యూనిటీ గార్డుల విషయంలోనూ పోలీస్ శాఖ నుంచి పలుమార్లు లేఖలు వెళ్లాయని తెలిసింది. పత్రికల్లో వస్తున్న వార్తలు స్పందించి తప్పు చేసిన వారిని వెనక్కు పంపించేస్తే శాఖా పరంగా ఫిర్యాదు మేరకు తాము చర్యలు చేపడతామని కోరినా దేవాలయ అధికారులు స్పందించకపోవడం వల్లే పరిస్థితి ఇంత వరకు వచ్చిందని ఓ పోలీసు అధికారి తెలిపారు.

BJP ఆందోళనల ఫలితం :
శ్రీ సింహాచల లక్ష్మీనరసింహ స్వామివారి దేవస్థానం యొక్క భూములు లాక్‌డౌన్‌ నేపథ్యంలో ఆక్రమణకు మరియు అక్రమకట్టడాలకు గురవుతున్నట్లు BJP నాయకులు, MLC శ్రీ PVN  మాధవ్  స్వీయ పర్యవేక్షణలో భారతీయ జనతాపార్టీ మరియు జనసేన పార్టీ కార్యకర్తలతో  కలిసి ఆక్రమణకు గురైన దేవస్థానం భూములను వెంటనే ఆక్రమణ నుంచి విడిపించాలని కోరుతూ సింహాచల దేవస్థానం ఈవో గారిని కలవడం జరిగింది. ఈ విషయాలను దేవాదాయ శాఖకు కూడా నివేదించారు. ఈ విషయమై పలుమార్లు ఆందోళనలు కూడా నిర్వహించారు. దానితో అధికారులలో చలనం వచ్చింది. అందులో భాగంగా చర్యలు మొదలైనాయి.

__విశ్వ సంవాద కేంద్రము (ఆంధ్ర రాష్ట్రము)

buttons=(Accept !) days=(0)

Our website uses cookies. Learn More
Accept !
To Top