![]() |
Telugu padyaṁ |
తెలుగు పద్యమంటే ఏమిటి ?
తెలుగువాళ్ళకి తెలుగుపద్యమంటే ఏమిటో చెప్పాల్సిన అవసరమేముందీ అని దీర్ఘం తీస్తున్నారా నిజమే, కానీ "పద్యం" అన్న పదానికి కాలక్రమంలో నానార్థాలు ఏర్పడ్డాయి కదా. కాబట్టి స్పష్టతకోసం ఈ వివరణ.
కొందరు పద్యం అన్న పదాన్ని కవిత్వానికి పర్యాయపదంగా ఉపయోగిస్తారు. ఛందోబద్ధమైనా కాకపోయినా కవితాఖండికని పద్యం ఆంటూ ఉంటారు. కానీ నా నిర్వచనం అదికాదు.
ఛందోబద్ధమైన అక్షర సముదాయం పాదం. అలాటి పాదాల సమాహారం పద్యం నిర్వచనం.
"పద సముదాయం" అని కాకుండా "అక్షర సముదాయం" అని ఎందుకన్నానూ అంటే, తెలుగులో, ఒక పదంలో కొంత భాగం ఒక పాదంలోనూ మరికొంత రెండవపాదంలోనూ ఉండే అవకాశం ఉంది. ఉదాహరణకి ఈ పద్యం చూడండి:
శ్రీరఘురామ, చారు తులసీ దళ ధామ, శమ క్షమాది శృం
గార గుణాభిరామ, త్రిజగన్నుత శౌర్య రమాలలామ, దు
ర్వార కబంధ రాక్షస విరామ, జగజ్జన కల్మషార్ణవో
త్తారక నామ, భద్రగిరి దాశరథీ కరుణాపయోనిధీ!
ఇందులో ఏ పాదం తీసుకున్నా చివరి పదం కొంతభాగమే ఆ పాదంలో ఉండి మిగతాభాగం రెండవ పాదంలోకి వెళుతోంది. అయితే, ఈ నిర్వచనంలో ఒక చిన్న చిక్కువుంది.
తాన తాన తాన తానాన తానాన
తాన తాన తాన తాన తాన
తాన తాన తాన తానాన తానాన
తాన తాన తాన తాన తాన
పైది ఛందోబద్ధమైన పాదాల సమాహారమే. కానీ పద్యం కాదు, దానికి అర్థం లేదు కాబట్టి. అందువల్ల పద్యాన్ని ఇలా నిర్వచించుకోవచ్చు. "ఛందోబద్ధమైన అక్షరాల సమాహారం పాదం. పాదాల అర్థవంతమైన సమాహారం పద్యం".
- కామేశ్వరరావు