నూతన వ్యాసములు:
latest

728x90

header-ad

Tuesday, October 13, 2020

భగవంతుని విలువ - Bhagawantuni viluva

భగవంతుని విలువ - Bhagawantuni viluva
కరాజ్యంలో ఒకరాజు ఉండేవాడు. అతడికి న్యాయం, ధర్మం పట్ల అనురక్తి ఎక్కువ. ప్రజలంటే వాత్సల్యం, ప్రేమ. నిత్యం భగవంతుడిని శ్రద్ధగా పూజించేవాడు. భక్తితో స్మరించేవాడు. ఒకనాడు భగవంతుడు ప్రసన్నుడై అతడికి దర్శనం ఇచ్చి రాజా, నేను చాలా సంతోషించాను. నీకు ఏదైనా కోరిక ఉంటే చెప్పు” అన్నాడు. ప్రజలంటే ఎంతో ప్రేమగల ఆ రాజు ఇలా అన్నాడు - “భగవాన్, నా దగ్గర నీవిచ్చిన సంపదలన్నీ ఉన్నాయి. నీ కృపవల్ల నా రాజ్యంలో అందరూ సుఖ సంతోషాలతో ఉన్నారు. అయినప్పటికీ నాకు ఒకటే కోరిక! మీరు నాకు కనిపించినట్టే, నన్ను ధన్యుట్ణి చేసినట్టే, నా ప్రజలందరికి కృపతో దర్శనాన్ని ఇచ్చి ధన్యులను చేయండి.” భగవంతుడు రాజును చూసి ఇది సాధ్యం కాదు కదా.” అని ఏదో చెప్పబోయాడు. కాని రాజు మాత్రం పట్టు బట్టి “ఈ కోరికను తీర్చవలసిందే” అన్నాడు. భగవంతుడు చివరకు భక్తుడికి లొంగక తప్పలేదు. ఆయన అన్నాడు సరే రేపు నీ ప్రజలందరిని తీసుకుని ఆ కొండ దగ్గరకు ర' నేను కొండమీద అందరికీ దర్శనమిస్తాను.” రాజు ప్రసన్నుడై, మరుసటిరోజు నగరంలో దండోరా వేయించాడు. “రేపు అందరూ నాతో పాటు కొండ దగ్గరకు రండి. అక్కడ మీకందరికీ భగవంతుడు దర్శనం ఇస్తాడు!”  
      రెండవరోజు రాజు తన ప్రజలందరిని, స్వజనులతో పాటు తీసుకుని కొండవైపు నడిచాడు. దారిలో ఒకచోట రాగి నాణేల కొండ కనిపించింది. కొంతమంది ప్రజలు అటువైపు పరిగెత్తారు. అప్పుడు రాజు వారందరిని “అటువైపు ఎవరు దృష్టి పెట్టవద్దు, ఎందుకంటే.. మీరు అందరూ భగవంతుడిని కలవటానికి వెళ్తున్నారు. ఈ రాగి నాణాల మోజులో మీ అదృష్టాన్ని కాలతన్ను కోకండి“ అన్నాడు. కానీ లోభం, ఆశవల్ల కొంతమంది రాగి నాణేల దగ్గరే ఆగి, వాటిని మూటకట్టుకుని తమ ఇంటివైపు వెళ్లిపోయారు.
      రాజు మాత్రం ముందుకు సాగాడు కొంతదూరం పోయాక... వెండి నాణాల కొండ కనిపించింది. మిగిలిన ప్రజలలో కొందరు అటువైపు పరిగెత్తారు. వెండి నాణేలను మూట కట్టుకుని ఇంటికి వెళ్లిపోయారు. వాళ్లకు ఈ అవకాశం మళ్లీ రాదనిపించింది. ఈ విధంగా కొంత దూరం వెళ్లిన తర్వాత బంగారపు నాణేల పర్వతం కనిపించింది. ప్రజల్లో మిగిలిన వారు, రాజు బంధువులతో సహా అటువైపే పరుగెత్తారు. వాళ్లూ ఇతరుల లాగే బంగారు నాణేలను మూటలు కట్టుకొని సంతోషంగా వెళ్లిపోయారు, కేవలం రాజు, రాణి మిగిలారు. 
    రాజు రాణితో “చూడు, ఈ ప్రజలు ఎంత ఆశపరులో భగవంతుడు లభించటం అంటే... ఎంత గొప్ప విషయమో వీరికి తెలియటంలేదు. భగవంతుని ఎదుట ప్రపంచం లోని ధనమంతా ఒకలెక్కకాదు! అన్నాడు. నిజమేనని రాణి రాజు మాటలను సమర్థించింది. వారిద్దరూ ముందుకు సాగారు కొంతదూరం వెళ్లాక రాణికి రాజుకు ఏడురంగుల్లో మెరుస్తూ రాణికి వజ్రాల పర్వతం  కనిపించింది. రాణి వజ్రాల ఆకర్షణ వల్ల అటువైపు పరిగెత్తి, వజ్రాలన్నిటిని మూట కట్టుకొంది. అదిచూసి రాజు బాధపడ్డాడు. విరక్తితో, బరువైన మనసుతో ఒంటరిగా ముందుకు సాగాడు. కొండపై భగవంతుడు నిల్చోని ఉన్నాడు. రాజును చూస్తూనే చిరునవ్వుతో అడిగాడు- “ఎక్కడ నీ ప్రజలు, నీ బంధువులు? నేను ఎప్పటి నుంచో ఇక్కడే నిల్చోని మీ అందరికోసం ఎంతో ఆత్రుతతో ఎదురు చూస్తున్నాను.” రాజు సిగ్గుతో తలదించుకున్నాడు. 
     అప్పుడు భగవంతుడు రాజుతో “ఓరాజా, ఎవరైతే తమ జీవితంలో భౌతిక సంసారిక లాభాలను నాకంటే ఎక్కువ అని భావిస్తారో వారికి ఎప్పటికీ నేను లభించను! వారు నా స్నేహాన్ని, కృపను ఎన్నటికీ పొందలేరు!" అని చెప్పాడు

__జాగృతి
« PREV
NEXT »