యజ్ఞోపవీతం - The Vedic Sacred thread

yagnopavidamu-Sacred-thread

'యజ్ఞ+ఉపవీత ' అను రెండుపదాలలో ఈ యజ్ఞోపవీతశబ్దం ఏర్పడుతుంది. యజ్ఞ = యజ్ఞార్థము- అనగా ఉత్తమ కర్మలాచరించుటకు చిహ్నంగా ధరింపబడు, ఉపవీతం = దారం. కనుక దీనిని యజ్ఞోపవీతమంటారు. "యజ్ఞో వై శ్రేష్ఠతమం కర్మ"- శ్రేష్ఠమైన (సత్) కర్మలన్నీ యజ్ఞపదంతో చెప్పబడుతాయి. కావున యజ్ఞోపవీత శబ్ధంలోని యజ్ఞ పదం మానవుడు పురుషార్థ సాధనకు చేయునుత్తమకర్మల కన్నింటికి బోధకంగా- సూచకంగా- ఉంటుంది. కనుక ఆర్యులు వ్రతమయంగా జీవితం గడుపదలంచి దీనిని వ్రతచిహ్నంగా - దీక్షాచిహ్నంగా - ధరిస్తారని గ్రహించాలి.

ఈ యజ్ఞోపవీతధారణ ఉపనయన సంస్కారంలో చేయబడుతుంది. ఉపనయన సంస్కారంలో రెండు భాగాలున్నాయి. ఒకటి యజ్ఞోపవీతధారణ, రెండు వేదారంభము (గాయత్రీ మంత్రోపదేశము). బాల్యంలో ఐదవయేటనో ఎనిమిదవయేటనో బాలబాలికలకు ఉపనయనం చేయబడుతుంది. బ్రహ్మచర్యాశ్రమంలో ఉండి విద్యాబుద్ధులార్జించుటకు తమచెంత చేరిన విద్యార్థినీ విద్యార్థులకు ఉపనయన సమయంలో గురువులు మొదట విద్యాచిహ్నంగా యజ్ఞోపవీతధారణ చేస్తారు.

సత్యవ్రత మంత్రాలతో జీవితం వ్రతమయంగా గడపాలని బోధిస్తారు. పిమ్మట గాయత్రీ మంత్రోపదేశంతో వేదారంభం చేస్తారు. కాబట్టి వ్రతమయంగా జీవితం గడపడానికి యజ్ఞోపవీతం బాహ్యచిహ్నంగా ధరింపబడుతుందనుటలో సందేహంలేదు. అయితే బాహ్యచిహ్నం ధరించినంతమాత్రన శారీరకంగా మానసికంగా ప్రవృత్తిలో మార్పువస్తుందా? యజ్ఞోపవీతధారి ఉత్తముడగునా ? అని ప్రశ్నింపవచ్చు. బాహ్యచిహ్నం బాహ్యచిహ్నమే. బాహ్యచిహ్నంలో ఒక విశేష కార్యాచరణకు పురికొల్పు శక్తి ఉండనేరదు. అయితే, ఒక విషయం చూడాలి. యూనివర్సిటీవారు గ్రాడ్యుయేటుకు చిహ్నంగా గౌను ఇస్తారు గదా! ఆ గౌను గ్రాడ్యుయేటు నొనరిస్తుందా ? ఒనరించదు. కాని అంతమాత్రాన అది అనావశ్యక మనగలమా ? అనజాలము. గ్రాడ్యుయేటు గౌను నాన్ గ్రాడ్యుయేటులనుండి భేదింపజేస్తుంది. బాలభటుడు దుస్తులు తదితరుల నుండి వానిని వేరుస్తారు. ఇట్లు చిహ్నము లన్నీ భేదబోధకములే అవుతాయి. చిహ్నలక్షణమే భేదబోధకత్వం. అట్లే ఆర్యులకు, అనార్యులకు (దస్యులకు) భేదబోధక చిహ్నమే యజ్ఞోపవీతం అవుతుంది. ఇతర చిహ్నాలను ఆదరించినట్లే సమాజం యజ్ఞోపవీతాన్ని కూడ ఆదరించాలి. యజ్ఞోపవీత నియమాలను బోధించి, పాలించి, పాలింపజేసి సమాజం దానిని ఆదరిస్తూఉంటే తప్పకుండా యజ్ఞోపవీతంవల్ లజనులకు (యజ్ఞోపవీతధారులకు) మేలు కలుగుతుంది. యజ్ఞోపవీతధారులు శ్రేష్ఠులు అవుతారు. సందేహం లేదు.
అయితే యజ్ఞోపవీతధారులై కూడా కొందరు దృఢసంకల్పంతో దాని నియమాలు పాలించకపోవచ్చు. అట్టి వారికి దాని ప్రయోజనం లభించదు. ఏలయనగా- ప్రార్థనలో మొదటి భాగం సంకల్పం మాత్రం చేసి, రెండవ భాగమైన ప్రయత్నం - ఆచరణ - చేయనిచో (ప్రార్థన పూర్తికాకుండ) ప్రార్థనా ఫలం ఎట్లు సిద్ధిస్తుంది.? రెండుభాగాలు నెరవేర్చిననాడే ప్రార్థన పూర్తవుతుంది. ఫలితం సిద్ధిస్తుంది. ఇది నియమం.
యజ్ఞోపవీత నిర్మాణం:
యజ్ఞోపవీత పరిమాణం దానిని ధరించు మానవుడి పొడవు (ఎత్తు)ననుసరించి ఉంటుంది. యజ్ఞోపవీతాన్ని ధరించి కుడిచేతి బొటనవ్రేలి పంగలో తగిలించుకొని చేయి సాచినపుడు అది వదులుగాగాని బెట్టుగాగాని లేకుండ ఉండటమే దానిని ధరించువారికి తగిన పరిమాణం అని నిర్ణయింపబడింది. ఆ యా యజ్ఞోపవీతధారుల బెత్తకు (నాలుగువ్రేళ్ల మొదట) దారమును తొంబదియారుచుట్లుచుట్టి దాని నొక ఆకునకు తగిలించాలి. తరువాత ఆ కొనను త్రెంచకుండానే మడచి రెండవ పేట చేర్చి దానినంతయు రెండవ ఆకునకు చుట్టాలి. అట్లే దారం త్రెంచకుండ మరల మడచి మూడవా పేటగా చేర్చి దానినింకొక ఆకునకు చుట్టాలి. అప్పుడది మూడు పేటలవుతుంది. అట్లు చుట్టడానికి మోదుగాకు నుపయోగించుట ప్రశస్తంగా చెప్పబడింది. లేక మరొక విధంగా మెలికవేయుచు ఒకే పర్యాయం మూడుపేటలు వచ్చునట్లు బెత్తకు తోడవచ్చును. అట్లు చుట్టిన మూడు పేటలను కలిపి చేతి తకిలితో వడికి పురి పెట్టాలి. దానిని మరల ముప్పేటగా మడచి వడికి పురిపెట్టాలి. ఇప్పటికి తయారైన పోగునందు తొమ్మిది ఒంటిపోగులుంటాయి. దానిని మరల యజ్ఞోపవీత-ఆకారంగా మూడు చుట్లు త్రిప్పి మూడు పోగులు సమానంగాజేసి మెలికలు పడకుండ, జారిపోకుండ గట్టిగా ముడివేయాలి. ఆ ముడిని బ్రహ్మముడితో పోలుస్తారు.

లోకంలో వ్యక్తిగతమైన మతాలు వెలసి సంప్రదాయాలు పెరిగినకొలది ఈ ముళ్ళలో మార్పులు చేయబడి శైవముడి, వైష్ణవముడి, స్మార్తముడి అంటూ రకరకాలుగా భేదాలు కల్పించబడినాయ్. కాని యేది యెట్లు మారినా మూడుపోగులు వేరువేరుగా విడిపోకుండునట్లు, మెలికలు పడకుండునట్లు వేయు గట్టి ముడియే ఇట ఉద్దిష్టము. ఆముడి వేస్తూ ఉండగా చూచియే గ్రహించాలి. ఇట్లు తయారుచేయబడిన యజ్ఞోపవీతం బెత్తకు చుట్టితే తొమ్మిది బెత్తలుంటుంది. బారుగా తీసిచూస్తే పదునెనిమిది బెత్తలవుతుంది. ఈ బెత్తలు కొంచెం పెద్దవి. జేనలతో కొలిచినచో ఏడుజేనలుంటుంది. ప్రతి మనుష్యుడు తనజేనతో ఏడుజేనలే పొడవుంటాడు. యజ్ఞోపవీత నిర్మాణంలో ఈ అభిప్రాయం గర్భితమై ఉంది. పర్యవసానంగా తేలిన యజ్ఞోపవీతంలోని మూడుపోగులలోను ఇరవై యేడు ఒంటిపోగులుంటాయి. కావున బెత్తల లెక్కలలో చూస్తే బెత్తల పొడవుగల ఒంటిపోగుంటుంది. కాని మొదట తీసికొన్నపుడు బెత్తల బారు తీసుకొన్నాం. వడివేసి ముడివేయగా సుమారు ఏడవ వంతు బారు తగ్గిపోతుంది. ఇది యజ్ఞోపవీతం యొక్క బాహ్య స్వరూపం; నిర్మాణ (పద్ధతి) విధానం.

యజ్ఞోపవీత నామములు:
యజ్ఞోపవీతమునకు బ్రహ్మసూత్రమను నామము సమస్త సూత్ర గ్రంధములందు, సంస్కారకోశములందును వాడబడింది. బ్రహ్మశబ్దమునకు 'వేదము, విద్య, జ్ఞానము 'అను నర్థములు సంస్కృతకోశములలో వ్రాయబడినాయి. కావున బ్రహ్మ (వేద) ఆరంభసమయంలో ధరింపజేయబడుటవల్లనిది బ్రహ్మసూత్రమనబడుతున్నది. కనుకనే మహర్షి దయానందసరస్వతి తన సత్యార్థ ప్రకాశంలో ("బ్రహ్మణి వేద గ్రహణకాలే- ఉపనయన సమయే ధృతం యత్సూత్రం ఇతి బ్రహ్మసూత్రమ్."- వేదారంభ కాలంలో ఉపనయన సంస్కారమునందు ధరింపబడు సూత్రం గనుక బ్రహ్మసూత్రమనబడును.) విద్యకు చిహ్నము యజ్ఞోపవీతమని పేర్కొన్నారు. కాలాంతరంలో ఈ బ్రహ్మసూత్రమే యజ్ఞసూత్రం, యజ్ఞోపవీతం, వ్రతబంధం మొదలగు నామాలతో ప్రఖ్యాతమైంది. యజ్ఞమునకు తద్భవరూపం జన్నము, ఆ జన్నమునుండి (యజ్ఞోపవీతర్థములో) ఏర్పడినదే 'జన్నిదమూ అనేపదం. జన్నిద పదమే జందెముగా మారినది. కాగా యజ్ఞోపవీతమను సంస్కృత పదానికి బదులుగా తెలుగులో జన్నిదము, జందెము అను పదాలు వాడబడుతున్నయ్. జంధ్యము అనునది అపభ్రంశరూపంగా కనబడుతుంది. ఉపవీత శబ్దానికి సూత్రం అని అర్థం. సాధారణంగా జందెమనునర్థంలో ఇది వాడబడుతుంటుంది. ఉపవీతమునకు బదులుగా వేదములో పరివీత శబ్దం కూడ వాడబడుటుంది. ఈ రెండు శబ్దాలలో 'ఉప, పరీ- ఉపసర్గం భేదమేగాని అర్థంలో భేదంలేదు. ఉపవీతమన్నా పరివీతమన్నా జందె మనియే అర్థం.

యజ్ఞోపవీత మంత్రం:
 • ఓం యజ్ఞోపవీతం పరమం పవిత్రం 
 • ప్రజాపతే ర్యత్ సహజం పురస్తాత్ | 
 • ఆయుస్య మగ్ర్యం ప్రతిముంచ శుభ్రం 
 • యజ్ఞొపవీతం బలమస్తు తేజః 
 • యజ్ఞొపవీత మసి యజ్ఞస్య త్వా 
 • యజ్ఞొపవీతేన ఉపనహ్యామి || 
హే వత్సా! జందెము మిక్కలి పవిత్రమైనది. అంత:కరణ శుద్ధికి అది తోడ్పడుతుంది. జీవున కాదికాలమునుండి ప్రాణముతోపాటు శరీరంలో ఉండేదిగా నిర్ధిష్టమైంది. అది అయుర్వర్ధకమై సాటివారిలో అగ్రేసరత్వమును కలిగిస్తుంది. తేజోబలములను చేకూరుస్తుంది. కాన దీనిని ధరింపుము.

వత్సా! నీవు వేదాధ్యయనం కొరకు నాచెంత చేరితివి. ఉత్తమ జీవనాదుల సంపాదించుకొరకు ఈ యజ్ఞోపవీతముతో నిన్ను వ్రతధారిని చేయుచున్నాను." అనుచు గురువు యజ్ఞోపవీత మంత్రంలో శిష్యునికి ఉపనయనసంస్కార సమయంలో యజ్ఞోపవీతధారణ చేస్తారు.
యజ్ఞోపవీత మంత్రం వలన ఈక్రింది విషయాలు ప్రకటితములవుతున్నయ్.

పరమం పవిత్రం:-
జీవితాన్ని వ్రతమయంగా పరమ పవిత్రంగా చేసుకోవడానికే యజ్ఞోపవీతం ధరించబడుతుంది. కనుక యజ్ఞోపవీతధారి జీవితం పరమ పవిత్రంగా ఉండాలి.

ఆయుష్యం:-
వ్రతమయంగా నియమబద్ధంగా జీవితం ఉంటుంది. కనుక య్జ్ఞోపవీతధారికి దీర్ఘాయువు లభిస్తుంది.

అగ్ర్యం:-
లోకహితకరములగు శ్రేష్ఠకార్యములందు యజ్ఞోపవీతధారి అగ్రగామిగా ఉండాలి.

బలమస్తు తేజ :-
యజ్ఞోపవీతధారి తేజోబల సమన్వితుడుకావాలి.

శుభ్రం:-
పవిత్రతకు చిహ్నమగు యజ్ఞోపవీతం సదా పరిశుభ్రంగా ఉండాలి. పసుపు కుంకుమలు పూయరాదు.

యజ్ఞోపవీతధారణ:
 • యజ్ఞోపవీతధారణ చేయుటకు ముందు-
 • ఓం అమృతో ప స్తరణ మసి స్వాహా '
 • ఓం అమృతా పిధాన మసి స్వాహా|
 • ఓం సత్యం యశః శ్రీర్మయి శ్రీః శ్రయతాం స్వాహా |
అను మంత్రములతో ముమ్మారు ఆచమనం చేయాలి. ఆచమనము- కంఠము నుండి హృదయము వరకు తడుపునంత మాత్రమే నీటిని అఱచేతిలో పోసుకొని, అఱచేతి మొదటను నడుమను పెదవులనుంచి పీల్వవలయును. దీనివలన కంఠమునందలి కఫము, పిత్తము కొంత నివర్తిస్తాయి.

పిమ్మట -
 • ఓం వాజ్మే ఆస్యే అస్తు.
 • ఓం నసోర్మే ప్రాణోస్తు.
 • ఓం అక్ష్ణో ర్మే చక్షురస్తు.
 • ఓం కర్ణయోర్మే శ్రోత్రమస్తు.
 • ఓం బాహ్వొర్మే బలమస్తు.
 • ఓం ఊర్వోర్మే ఓజోస్తు.
 • ఓం అరిష్టాని మేజ్గాని తనూ స్తన్వా మే సహ సంతు.
అను మంత్రములతో నీటిని ఆ యా అంగములపై చల్లుకోవాలి. దీనివలన బద్ధకము దూరమవుతుంది. పిదప జందెమును సరిచేసి రెండు చేతులతో పట్టుకొని యజ్ఞోపవీత మంత్రాన్ని చదివి తలమీదుగా మొదట మెడలో హారములాగ వేసుకోవాలి. అనంతరం కుడిచేతి క్రిందికి తీసుకోవాలి. వ్రతచిహ్నమయిన యజ్ఞోపవీతంలో మూడుపేట లుంచబడినాయి. ఆ మూడుపేటలు ఈ మూడు రుణాలను తీర్చవలెనని స్ఫురింపజేస్తూ ఉంటాయి. మరియు యజ్ఞోపవీతంలోని మూడు పోగులు వ్రతమయంగా జీవితం గడపు మానవుని కర్తవ్యాలెన్నింటినో సూచిస్తూ ఉంటాయి.

ప్రపంచ సమస్యల పరిష్కరించుకొనుటకు సృష్టికి అనాది (మూల) పదార్థములయిన జీవేశ్వర ప్రకృతుల గుణకర్మ స్వభావములదెలుసుకోవాలి - అను సూచన ఈమూడు పోగులలో గర్భితమై ఉంది. అంతేగాదు. పదార్థ విజ్ఞానము ద్వారా అనాది పదార్థములయిన జీవేశ్వర ప్రకృతుల యొక్క గుణకర్మ స్వభావములను గుర్తెరిగి నిష్కామంతో వేదవిహిత ధర్మకర్మలాచరిస్తూ అంతఃకరణశుద్ధి సంపాదించాలి. అనంతరం అనన్య చిత్తంతో ధ్యానించి పరమేశ్వర సాక్షాత్కారం మానవుడు పొందాలి. అనగా పరమ పురుషార్థ సాధనకు జ్ఞానకర్మోపాసనలు మూడు అవసరం- అను సూచనయు ఈమూడు పోగులలో ఉన్నది. ఇంకను ప్రపంచం యొక్క సృష్టి స్థితి లయములు, ప్రకృతి యొక్క సత్వరజ స్తమో గుణములు, పురుషార్థములగు ధర్మాథకామములు, ఆధ్యాత్మిక ఆధిభౌతిక ఆధిదైవికములను త్రివిధ దుఖములు, తల్లి తండ్రి ఆచార్యుడు నను త్రివిధ విద్యాసంస్థలు, మనోవాక్కాయకర్మలు- ఇత్యాది త్రిత్వముల జ్ఞానం సంపాదించి జీవితం వ్రతమయంగా మానవుడు గడుపాలను సూచన ఈ మూడు పోగుల నిర్ణయంలో గర్భితమైఉంది. మరియు బ్రహ్మచర్య గృహస్థ వానప్రస్తములను మూడు ఆశ్రమముల వరకు ఈ యజ్ఞోపవీతధారణ పరిమితమను సూచనయు నిందు గలదు. సన్యాసులకు శిఖాయజ్ఞోపవీతములుండవు. మరియు శరీరంలో కుడివైపును దక్షిణభాగంగాను, ఎడమవైపును ఉత్తర భాగంగాను చెప్పుతుంటారు. యజ్ఞోపవీతం ఎడమ భుజం మీదుగా కుడి చంక క్రిందికి ధరింపబడుతుంది.

అంటే యజ్ఞోపవీతం యొక్క పైభాగం ఉత్తర దిశకు ఒరిగి క్రింది భాగం దక్షిణ దిశకు ఉంటుంది అన్నమాట. గోళాకారంగా ఉన్న భూమి కూడ పైభాగం ఉత్తర ధృవం వైపునకు ఒరిగి క్రింది భాగం దక్షిణ దిశకు ఉంటుంది. కావున యజ్ఞోపవీతధారి మెడలో వృత్తరూపంగా ఉన్న యజ్ఞోపవీతం భూగోళాన్ని స్ఫురింపజేస్తూ ఉంటుంది. దీనినిబట్టి మానవుడు భూగోళంలో బంధితుడై ఉన్నట్లు బోధపడుతుంది. కాన నాతడు స్వార్థపరుడై సాటిమానవుల శ్రేయస్సే తన శ్రేయస్సుగా భావించి వ్యవహరింపవలసి యుంటుందని యజ్ఞోపవీతం సూచిస్తుంది.

యజ్ఞోపవీతము గాయత్రీబోధకము:-
మూడు పెద్ద సూత్రములు, బ్రహ్మముడి కలది యజ్ఞోపవీతము. ఒక్కొక్క పెద్ద సూత్రానికి మూడేసి అంతర సూత్రములు, ఒక్కొక్క అంతర సూత్రానికి మూడేసి ఒంటిపోగులు ఉంటాయి. కాగా యజ్ఞోపవీతంలో మొత్తం ఇరువదియేడు ఒంటిపోగులుంటాయి.

అ + ఉ + మ్ = ఓమ్- అకార ఉకార మకారములతో కూడినది ప్రణవం. భూః, భువః, స్వః- ఈ మూడు మహావ్యాహృతులు.
 1. తత్సవితుర్వరేణ్యం
 2. భర్గో దేవస్య ధీమహి
 3. ధియో యో నః ప్రచోదయాత్
ఈ మూడు గాయత్రీమంత్రంలోని మూడు పాదములు.

యజ్ఞోపవీతం అర్థసహితంగా గాయత్రీ మంత్రాన్ని జ్ఞప్తికి తెస్తూ యజ్ఞోపవీతధారికి ప్రయోజనకారి అవుతుంది. ఇట్టి పరమ పవిత్రమైన యజ్ఞోపవీతాన్ని దీక్షా చిహ్నంగా ఆర్యులు ధరిస్తారు.

యజ్ఞోపవీత మంత్రార్ధము:-
యజ్ఞోపవీతం పరమం పవిత్రం ప్రజాపతే యత్సహజం పురస్తాత్| ఆయుష్యమగ్ర్యం ప్రతిముంచ శుభ్రం యజ్ఞోపవీతం బలమస్తు తేజః తా|| వేదోక్త కర్మలు చేయు అధికారము పొందుటకు తయారుచేయబడిన, పరమ పవిత్రమయినది, బ్రహ్మ దేవునికి సహజముగా సిద్ధించినదియు, మొదట పుట్టినదియునగు ఈ యజ్ఞోపవీతము నేను ధరించుచున్నాను. యజ్ఞోపవీతము నాకు ఆయుర్వృద్ధి, నిర్మలత్వము, బలమును, పుష్టి, తేజస్సును ఇచ్చుగాక.

నందీసమారాధన :-
శోభన దేవత స్వరూపులైన ఐదుగురు బ్రహ్మచారులను పూజించి పసుపు బట్టలనిచ్చుట ఆచారము.
శ్లో|| వటురక్షార లవణం సప్రాణాహుతి ముత్తమమ్|
ఏక ఏవమి భుంజీత వ్రతే క్రమ పీడయన్||
తా|| బ్రహ్మచారి కారము, ఉప్పు విడిచి ప్రాణాహుతులతో పాత్రకమైన, ఉత్తమైన ఆహారమును ఈ వ్రతమందు వ్రతభంగము కాకుండా భుజించవలెను. అనగా బ్రహ్మచారి తన బ్రహ్మచర్య దీక్షా వ్రతము పూర్తి అగువరకు ఉప్పు, కారంలేని భోజనం చేయవలెను.

శ్లో|| మాత్రసహకుమారం భోజయేత్ తా|| గాయత్రీమంత్ర ప్రోక్షణతోసహా సహపంక్తిలో వటుడు భోజనము చేయవలెను. మాత్రాసహ అంటే తల్లితో కలిసి అని భావించి మధ్వులు ఆవిధంగా ఆచరిస్తున్నారు. కాని మాత్రాసహా అంటే గాయత్రీ మంత్రముతో సహా అని అర్ధము. ఆ సమయమున ఆచార్యుడు గాయత్రీ మంత్రము చెప్పగా వటుడు అన్నముపై ఉదకము ప్రోక్షించును. అమృతో పస్తరణమసి అనుచోట ఉదకము బదులు నేయి వేయవలెను.

అశ్వారోహణము:- అగ్నిహోత్రమునకు ఉత్తరపువైపున ఆచార్యుని వలే తూర్పు తిరిగి కూర్చొనవలెను. దక్షిణ దిశగా శానము (సన్నికల్లు లేక రాయి) ఉంచి, ఉపనయనము చేయుచున్న వ్యక్తి (ఆచార్యుడు)"అతిష్టేమ" అను మంత్రమును చెప్పి, సన్నికల్లును త్రొక్కించవలెను. ఈ రాయివలె చాలాకాలము బ్రహ్మచర్య నిష్ఠలో స్థిరుడవై యుండుమని దీని యర్ధము.

వస్త్రధారణ:- పంచల చాపు ఉత్తరించి ఆచార్యుడు వాటిని అభిమంత్రణచేసి రాతిమీదనే మంత్రయుక్తముగా వటువనకు కట్టవలెను. ఈ వస్త్రములు దేవతలు తయారుచేసినవి. నీవు నిండు నూరేళ్ళు సుఖముగాయుండుటకు ధనము సంపాదించి ఆప్తులకు, అర్ధులకు యివ్వవలెను అని మంత్రార్ధము.

మౌంజీ మేఖల ధారణ:- ఆచార్యుడు "ఇయందురుక్తా....సుభగామేఖలేయం" అను మంత్రమును జెప్పి ముంజగడ్డితో పేని ముప్పిరవేసిన త్రాడును వటువు మొలకు ప్రదక్షిణముగా మూడు చుట్లు త్రిప్పి కట్టవలెను. వటువుచే కూడ ఈ పైమంత్రము చెప్పించవలెను. ఈ మంత్రార్ధమేమనగా ఈ మౌంజీ దేవతలకు ప్రియమైనది. ఉఛ్ఛ్వాసనిశ్శ్వాసములచేత ఆత్మ బలమును శరీర బలమును కూడా కలిగించునది. దీనిని ధరించుటచే ఆపదలు రావు. మిత్రస్య అను మంత్రముచే కృష్ణాజినమును ఆచార్యుడు వటుడు మెడలో ఉపవస్త్రముగా వేయవలెను. ఈ కృష్ణాజినము విశేష తేజస్సు, కీర్తి, వృద్ధిగలది. ధూర్తులకు ఉపయోగపడనిది. అన్నమును యిచ్చునది. స్తోత్ర పాత్రమైనది. సూర్యుని నేత్రమయినది. దీనిని వస్త్రముగా ధరించుచున్నాను అని మంత్రార్ధము.

గమనిక:- మౌంజీ, మేఖలలు క్షత్రియ వైశ్యులకు వేరువేరుగాయున్నవి. ఆచార్యుడు వటువును దగ్గరకు తీసుకొని పంచల చావు (నూతన వస్త్రము) యిద్దరిపై కప్పి"సుప్రజ" అను మంత్రమును వటుని చెవిలో చెప్పవలెను.

సుప్రజాః ప్రజయా భూయాస్సువీరో వీరై సువర్చా వర్చసా సుపోషః పోషైః| తా|| మంచి సంతానము గలవాడవై పుత్ర పౌత్రాదులచే మంచి వర్చస్సు గలవాడవై పోషకులగు పుత్రులచే వృద్ది చెందుము.

వటువు చెప్పవలసిన మంత్రము:-
మం|| బ్రహ్మచర్య మాగా ముపమానయస్య దేవేన సనితా ప్రసూతః తా|| నేను బ్రహ్మ చర్యవ్రతమును వేదాధ్యయనము కొరకు స్వీకరించితిని. ఓ ఆచార్యా! మీరు సూర్యుని అనుమతితో వేదోపదేశము చేయుటకై మీ దగ్గర ఉంచుకొనుమని వటువు చెప్పును. బ్రహ్మోపదేశం:- తూర్పు దిక్కుగా ఆచార్యుడు కూర్చుండగా కుమారుడు అభిముఖముగా ఆచార్యుని కుడిపాదమును కుడిచేతితో పట్టుకొని అయ్యా! గాయత్రీ మంత్రోపదేశమును ఆచార్యుడు వటువు కుడి చెవిలో చేయవలెను.

ఉపదేశ విధానము:-
 • మం|| ఓం భూః తత్సవితురువరేణ్యం |
 • ఓం భువః భర్గోదేవస్య ధీమహి
 • ఓ గుం సువః ధీయోయోనః ప్రచోదయాత్||
 • ఓం భూః తత్స వితురువరేణ్యం భర్గోదేవస్య ధీమహి | ఓం భువ: ధీయోయోనః ప్రచోదయాత్|
గోదానము:- ఓ ఆచార్యుడా నీకు వరమును (వరమనగా గోవు అని వేదమున గలదు) ఇచ్చుచున్నానని గురువునకు వటువు శేష్ఠమైన గోవునీయవలెను. గురువు 17సార్లు ప్రణవము చేయవలెను. లేచి "దేవస్యత్వా" అను మంత్రమును చదివి గోవును స్వీకరించవలెను. పిమ్మట ఆచార్యుడు పడమట దిక్కుగా కూర్చొన్న వటుని 'ఉదాయుషా' అను మంత్రము చదువుచు లేవదీసి వానిచే చెప్పించవలెను.

ఉదాయుషా మంత్ర భావము:- నూరు వత్సరముల ఆయువుతో బలకరమైన ఔషధముల రసముతో మేధుని యొక్క బలముతో దేవతలను ధ్యానము చేయుటకులేచి నిలబడుచున్నాను. సూర్యుని దర్శించుట: "తచ్చక్షుః" అను మంత్రము మొదలుకొని - సూర్యం దృశే అని ఆచార్యునిచే చెప్పబడిన పదిమంత్రములతో వటుకు సూర్యుని సేవించవలెను.

అవి:
1. తచ్చక్షుర్దే వహితం పురస్తాచ్ఛు క్రముచ్చరత్
తా|| నేత్రములయందు ఇంద్రునిచే యుంచబడినదియు తూర్పుదిక్కున బయలుదేరి వెళ్ళునదియు శుభ్రమైనదియునగు ఆ ప్రసిద్ధమైన సూర్య తేజస్సును.

2. పశ్యేమ శరదశ్శతమ్||
తా|| నూరు సంవత్సరములు చూచెదను(జీవింతును)

3. మం||జీవమ శరదశ్శతమ్||
తా|| నూరు సంవత్సరములు జీవించగలను

4. మం|| నందామ శరదశ్శతమ్
తా|| నూరు సంవత్సరములు ఆనందంగా ఉండగలము

5. మం|| మోదామ శరదశ్శతమ్
తా||నూరు సంవత్సరములకు బ్రహ్మానందమును పొందుచుందుము

6. మం|| భవామ శరదశ్శతమ్
తా|| నూరు సంవత్సరములు సంపదగలవారమైయుందుము

7. శృణవామ శరదశ్శతమ్||
తా|| నూరు సంవత్సరముల వరకు వేద శాస్త్రములలు వినుచుందుము

8. మం|| ప్రబ్రవామ శరదశ్శతమ్
తా|| నూరు సంవత్సరములు చక్కగా మాట్లాడుచుండగలము

9. మం|| అజీతాశ్యామ శరదశ్శతం
తా|| నూరు సంవత్సరముల వరకు హింసలేని వారమైయుందుము

10. మం|| జ్యోక్చసూర్యం దృశే||
తా|| జీవించినంతకాలము అంధత్వము లేక మంచి దృష్టిగలవారమైయుందుము సూ|| యంకామయేత............... విధిమాహ|| స్నాతకవ్రత పర్యంతము ఈ వటువు నన్ను విడువకుండ నుండవలెనని ఆచార్యుడు కోరుచు క్రింది యస్మిన్ భూతంచ అను మంత్రమును చెప్పి అతని కుడిచేతితో వటువు కుడిచేయి పట్టుకొనవలెను.
మం|| యస్మిన్ భూతంచ-------- గృహ్ణామి నారాయణశర్మన్||
తా|| జరిగినదియు, జరుగుచున్నదియు, జరుగబోవుచున్నదియునగు ప్రపంచమునకు సృష్టికర్తయగుయే బ్రహ్మయందు సమస్తలోకములు నిలిచియున్నవో ఆ బ్రహ్మయొక్క అనుమతిచే నిన్ను నామనసునందెపుడును ధ్యానము చేయచుండెదను.వటువు మూడు అహోరాత్రములు ఈ అగ్ని అవిచ్ఛన్నముగా నిలుపుకొనవలెను. ఈ అగ్నిలోనే ఉదయము, సాయంకాలము హోమము చేయవలెను. మూడు రోజుల తరువాత నుండి సమావర్తనము వరకు రెండుపూటల లౌకికాగ్నిలో సమిధలు హోమము చేయవలెను.

భిక్షా కార్యము : ఆచార్యుడు వటువునకు ఏదైనా ఒక వస్తువుతో కూడిన పాత్రను యిచ్చి ముందుగా తల్లిని యాచించమని చెప్పవలెను. కుడి చెవిని ఎడమ చేతితోను ఎడమ చెవిని కుడి చేతితోను పట్టుకోని ఈ క్రింది మంత్రమును చెప్పవలెను. చతుస్సాగర పర్యంతం గోబ్రాహ్మణేభ్య శుభం భవతు-----------ఋషులపేర్లు సంఖ్య చెప్పి-- గోత్రస్య (గోత్రం పేరు చెప్పాలి) ---- శర్మ (తనపేరు చెప్పాలి) అహంభో అభివాదయే అని చెప్పి పాదములకు నమస్కరించి స్త్రీలనయితే భవతి భిక్షాందేహి అని పురుషులనైతే భవాన్ భిక్షాందదాతు అని భిక్ష అడిగి నడుముకు కట్టుకున్న వస్త్రము కొనను రెండు చేతులతోను పట్టుకొని అందులో భిక్ష స్వీకరించాలి. మొదట తల్లి పళ్ళెములో బియ్యము తెచ్చి వెండి గిన్నెతో రెండు సార్లు బియ్యం వటువు యొక్క వస్త్రములో వేసి మూడవసారి గిన్నెతోసహా బియ్యమును వేయవలెను. ఈ వెండి గిన్నె బ్రహ్మగారు తీసుకొనుచున్నారు. ఉంగరము(భటువు) వేలికి తొడుగుట కొందరి ఆచారముగా యున్నది.

వస్త్రమునిచ్చుట: సూ|| వానశ్చరుర్ధీ ముత్తరయా దత్తే దతృదావ్యః | గురోవానస్తేదదామీతి దద్యాత్||వటువు ఉపనయనమునాడు తనకు గట్టిన వస్త్రమును ఓ గురువర్యా ఈ వస్త్రమును నీకు యిచ్చుచున్నాను అనుచు ఈయవలెను.

ఉపాకర్మ: ఉపనయనమైన తర్వాత వచ్చు మొదటి శ్రావణ పూర్ణిమరోజున గ్రహణం సంభవించిన భాద్రపద పూర్ణిమనాడు ఉపాకర్మ చేయాలి. కాని ఉపాకర్మ యిపుడు ఎవరు చేయటంలేదు.

బ్రహ్మచర్య ధర్మములు: బ్రాహ్మణ క్షత్రియ వైశ్యులకు ఉపనయనము అయినది మొదలు బ్రహ్మచర్య వ్రతము ప్రాంభమగును. ఉపనయనమైన తర్వాత గురుకులమున 12 సంవత్సరములు బ్రహ్మచర్యమును పాటించుచు ఒక వేదమునైనను పూర్తి చేయవలయును. సూ|| ద్వాదశ వర్షాణ్యేకవేదే బ్రహ్మచర్యం చరేత్| ఒక్కొక్క వేదమునకు, 12 సంవత్సరములు చొప్పున బ్రహ్మచర్యము జరుపవచ్చును. కానియది విధికాదు. మరియు ఋషుల మతమున కలియుగములో దీర్ఘబ్రహ్మచర్యము పనికిరాదు. కాబట్టి 12 సంవత్సరములే బ్రహ్మచర్యము చాలును, దీనిని బట్టి బ్రాహ్మణుడు కనీసము 20 సంవత్సరములవయస్సులోను, క్షత్రియుడు 23 సంవత్సరముల వయస్సులోను, వైశ్యుడు 24 సంవత్సరముల వయస్సులోను వివాహము చేసికొనుట శాస్త్రసమ్మతమని తెలియును. శూద్రుడు గురుకులమున కేగనక్కరలేదు. కావున ఆయుర్దాయములో నాల్గవవంతు అనగా 25 ఏండ్లు వయస్సు వరకు ఆతడు అవివాహితుడుగానుండి పిమ్మట వివాహమాడవలయును.
 • బ్రహ్మచర్యాశ్రమములో బహు ప్రయోజనములు సాధింపవలసియున్నవి.
 • ద్విజులు వేదమునభ్యసించుట, ఇతరులు పురాణేతిహాసముల పఠించుట.
 • ఇంద్రియముల నిగ్రహించుట నలవఱచుకొని మనస్సును పరమార్థ జీవితమున కనుకూలముగా చేసికొనుట.
 • శరీరరము భోగపరము కాకుండ శ్రద్ధ వహించుట.
 • శారీరక తేజస్సును వృద్ధినొందించుకొనుట.
 • దీర్ఘాయుష్యమునకు తగినరీతిగా వ్యవహరించుట.
మానవుడు గృహస్ధాశ్రమములో భోగములను తగినరీతిననుభవించుటకును, భోగములకు లోబడి ధర్మమును విస్మరింపకుండుటకు, వివేకియై లౌకిక, వైదిక ధర్మములను నిర్వర్తించుటకును బ్రహ్మచర్యాశ్రమము యొక్క శిక్షణ సహకరించును. బ్రహ్మచర్యాశ్రమములో ఉపర్యుక్తమైన శారీరక మానసిక సాధన కంగములుగ నియమములనేకములు గలవు.
 • బ్రహ్మచారి వాక్ నియమము గల్గియుండవలెను.
 • బ్రహ్మచారి చేష్టానియయము గల్గియుండవలెను.
 • బ్రహ్మచారి ఉదర నియమము గల్గియుండవలెను.
 • బ్రహ్మచారి మితభాషియై సత్యవాక్యమునే పల్కవలెను.
 • బ్రహ్మచారి తనకర్తవ్యమునకు మించిన యేపనిలోను జోక్యము కల్గించుకొనరాదు.
 • బ్రహ్మచారి సత్వగుణ వర్థకమగు నాహారమునే మితముగ తినవలయును.
 • బ్రహ్మచారి భిక్షచేసి యాహారము తెచ్చుకొని దానిని గురువునకు చూపి యాతని అనుమతిగైకొని భుజింపవలయును.
ఉప్పు, కారము, మాంసము, మధువు మున్నగు రజోగుణ ప్రకోపకములైన పదార్ధములను తినరాదు.

బ్రహ్మచారి ఆచరించవలసిన ఇతర ధర్మములు: గంధేత్యాది సుగంధ వస్తువులను ధరింపరాదు. పగలు నిద్రపోరాదు. కాటుక పెట్టుకొనుట మొదలగు శృంగార విషయములను వీడవలయును. తైలాభ్యంగనము చేయరాదు. విలాసార్థమై బండి మొదలగు వాహనముల ఎక్కరాదు. చెప్పులను తొడగరాదు. కామమును దరిచేరనీయరాదు. క్రోధము పనికిరాదు. దేనియందును లోభము తగదు. వివేకమును వీడరాదు. వదరుబోతుగా నుండరాదు. వీణా వాదనాదుల యందనురక్తుడు కారాదు. వేడినీటి స్నావము చేయరాదు. సుంగంధాదులచే విలాసముగా దంతధావనాదులు చేయరాదు. దేనిని చూచినను సంతోషముతో పొంగిపోరాదు. నృత్యగానములందు ఆసక్తుడు కారాదు. పరుల దోషములనెంచరాదు. ప్రమాదముల చెంతకుపోరాదు. బ్రహ్మచారి యిట్టి నియమములు గలవాడై, భిక్షచే జీవించుచుసాయం ప్రాతఃకాలములందగ్ని కార్యము చేసికొనుచుండవలయును. సూ||బహిః సంధ్యత్వంచ|- సంధ్యా వందనమును గ్రామముయొక్క బయటకుపోయి చేసికొనవలయును.

బ్రహ్మచారి ప్రధానముగ చేయవలసిన ధర్మము రేతస్సంరక్షణము. ఆ ధర్మముచెడినచో బ్రహ్మచర్య వ్రతము చెడినట్లే. అట్లు బ్రహ్మచర్యము పోగొట్టుకొన్నవారికి అవకీర్ణియని పేరు. అవకీర్ణికి ఘోరములైన ప్రాయశ్చిత్తములు విధింపబడినవి. కాబట్టి బ్రహ్మచర్యమునకు భంగము కల్గించు ప్రసక్తులన్నియు బ్రహ్మచారికి నిషేధింపబడినవి. శృంగార విషయమునకు సంబంధించినవన్నియు విడిచి విడిచి పెట్టవలసినదే.

ఇతర నియమములు:
వటువు అద్దములో తన ముఖమును చూచుకొనుట కూడ నిషిద్ధమైయున్నది.
బ్రహ్మచారి స్త్రీలముఖమును చూడరాదు; వారితో సంభాషింపరాదు.
బ్రహ్మచారి అధ్యయనము చేయునపుడు గురుదక్షిణనేమియు నీయనక్కరలేదు.

యజ్ఞోపవీతాన్ని వ్రతచిహ్నంగా భావించి దాని పూర్తి ప్రయోజనం పొందదలచినవారు తాము స్వయంగా తయారుచేసుకోవడం ఉత్తమం. యజ్ఞోపవీతం తెగినప్పుడు, మురికియైనపుడు నూతన యజ్ఞోపవీతాన్ని ఈ క్రింది శ్లోకాన్ని పఠించి తలపైగా తీసి నదిలోగాని, ఏదైనా చెట్టుపైనగాని వేయాలి.
"ఏతావద్దినపర్యంతం బ్రహ్మ త్వం ధారితం మయా
జీతత్వాత్ త్వ త్పరిత్యాగో గచ్చ సూత్ర యథాసుఖం"
"ఓ బ్రహ్మ సూత్రమా! ఇంతవరకు నిన్ను నేను ధరించితిని. జీర్ణమగుట వల్ల ఇప్పుడు నిన్ను త్యజించుచున్నాను. నీవు సుఖంగా పొమ్ము" అని శ్లోకార్ధము.
ఓం తత్ సత్.

రచన: కోటి మాధవ్ బాలు చౌదరి

buttons=(Accept !) days=(0)

Our website uses cookies. Learn More
Accept !
To Top