భూమికి ఎందుకు నమస్కరించాలి - Why do you want to worship the earth?

0
Why-do-you-want-to-worship-the-earth


భూమికి ఎందుకు నమస్కరించాలి:

మనము ఎన్ని తప్పులు చేసినా, చేయకూడని పనులు చేసినా, చిన్నతనంలో తల్లి(జన్మనిచ్చిన తల్లి) గోరు ముద్దలు తినిపించి, ఎత్తుకొని, ముద్దాడి, ప్రేమతో బిడ్డే తన లోకంగా జీవిస్తుంది తల్లి. అలాగే భూమాత మన ఆకలి తీరుస్తోంది. దాహం తీరుస్తోంది. సకల జీవరాసులకు 84 కోట్ల జీవరాసుల ఆకలి దప్పులు తీర్చుతున్న తల్లి భూమాత. అలాగే 84 కోట్ల జీవరాసుల మల మూత్రములను భరించి స్వీకరిస్తున్న, మాత భూమాత. మనకు 10 సం|| వయసు వచ్చిన తర్వాత మన తల్లి మన, మల మూత్రములను తీసి శుభ్రం చేస్తుందా? మనకు ఎంత వయసు వచ్చినా, మన యొక్క, మల మూత్రములను, తన మీద భరించడమే కాక, వాటి వలన దుర్గంథము రాకుండా, తద్వారా వ్యాధులు ప్రబలకుండా, దానిని తనలో ఐక్యం చేసుకొని, ఈ జీవ కోటిని, అనంత ప్రేమానురాగములతో కాపాడుచున్న మాత భూమాత.

చివరికి మనము మరణించిన తర్వాత, మనతో పాటు అమ్మ (కన్నతల్లి), నా వారు నా వారు అని కౌగలించుకొని, మనతో సహజీవనము చేసిన భార్య/ భర్త, బిడ్డలు, స్నేహితులు, బంధువులు మనతో రాకుండా శ్మాశానములో ఆగిపోతే, నా బిడ్డ ఇంతకాలం (మరణిచిన మృతదేహము ఎలాంటి జీవనమును కలిగిఉండినా సరే) జీవించి తనువు చాలించాడు, అని అవ్యాజమైన ప్రేమతో, తన కడుపులో దాచుకునే తల్లి, భూమాత.

కేవలం మనలనే కాదు 84 కోట్ల జీవరాసులను, ఆదరించే తల్లి, భూమాత. ఇక్కడ ఒక్కక్షణం ఆలోచించండి, భూమాత అలా తన కడుపులో దాచుకోక వదిలేస్తే, ఆ శరీరాలు కృళ్లి, కృశించి, దుర్గంధ భూయిష్టమై రకరకాల వ్యాధులు( కలరా/ ప్లేగు/మలేరియా) ప్రబలితే, ఎంత జన నష్టం జరుగుతుందో, ఆలోచించండి. ఏ ఒక్కరు మరణించిన మృతదేహమును ఆ తల్లి కరుణించక, తనలో కలుపుకొనక పోతే ఈ జనారణ్యములో ఆ మృతదేహమును వదిలేస్తే కలరా/ ప్లేగు/ మలేరియా ప్రబలితే, మిగిలిన జీవరాసులు కూడా భూమి మీద అంతరించి పోవా? అందుకే భూమిపై కాలు మోపే ముందు ఆ తల్లిని, క్షమాభిక్ష కోరుతూ ప్రార్థించాలి. అలా ప్రార్థించలేక పోతే మనంత కృతఘ్నులు ఈ ప్రపంచములో మరొకరు ఉండరు. మిగిలిన జీవరాసుల విషయంలో, వాటికి జ్ఞానం లేదు, ఆలోచించే శక్తి లేదు. ఆ శక్తి కేవలం, ఈ మానవ ఉపాధికి మాత్రమే ఉంది. అందుకే ఇది పరమో ఉత్కృష్టమైన జన్మ.

సుందరకాండలో కాంచనలంక అని హనుమాదుల వారు వర్ణించారు. కాంచన లంక అంటే ఈ మానవ ఉపాధి. ఈ శరీరములో సర్వకాలముల యందు గడియారంలో ముళ్ళులాగా షడూర్ములు.

షడ్రిపులు షడ్వికారముల యందు తిరుగుతూ ఉంటాయి.
 1. షడూర్ములు:- ఆకలి, దప్పిక, శోకము, మోహము, జర(జననము), మరణము.
 2. షడ్రిపులు:- కామము, క్రోధము, లోభము, మదము, మోహము, మాత్సర్యములు.
 3. షడ్వికారములు:- పుట్టినది, ఉన్నది, పెరిగినది, మార్పుచెందినది, తరిగినది, నశించిపోయేది.
దానము చేసేటప్పుడు తండ్రి, కొడుకును దగ్గర పెట్టుకొని చేయాలి. ఎందుకంటే అలాంటి దాన గుణము కుమారునికి అలవాటు చేయడం నేర్పడం కొరకు.
శుశ్రూషలు చేయునప్పుడు, తల్లి, తన కూతురును దగ్గర పెట్టుకొని చేయాలి.ఎందుకంటే శుశ్రూష ఎలా చేయాలి, ఎవరికి చేయాలి, ఎందుకు చేయాలి నేర్పుతూ చేయాలి.
సత్ఫురుష సాంగత్యమంటే అంకుశము ఉన్న మావటి వంటిది.ఏనుగు(మనము) ఏ మాత్రం మార్గం తప్పినా,మనస్సు మాట వినక పోయినా మావటి అంకుశముతో ఏనుగు క్షణకాలం ఊరికే ఉండదు. కాలు ఊపడం, తొండమును ఊపడం, ఇలా ఎదోఒకటి చేస్తుంది. అందుకు మావటి ఏనుగును అంకుశముతో సరిదిద్దుతాడు.

ప్రాసంగిక పుణ్యం:-
పలుమార్లు (తీర్ధయాత్రలను) మననం చేయడం. మననం అంటే మనస్సుతో ఆయా తీర్ధయాత్రలను దర్శించిన తీర్థాలను దర్శనం చేయడం. ఏకుక్కా (పెంపుడు కుక్క ఐనాసరే) మహాద్వారము దాటి ఇంటిలోనికి ప్రవేశించరాదు. అలా ప్రవేశిస్తే, ఆ రోజు సింహాసనము మీద ఆసీనమైయున్న దేవతలు, ఆ రోజు ఆహారము ముట్టరు. అది మహాపరాధము. అనర్థాలకు హేతువు.

మనము తీసుకొనే ఆహారములో ఆరవ వంతు మనస్సు స్వీకరిస్తుంది. అందు కొరకు మనము సాధ్యమైనంత వరకు(తప్పనిసరిగా) సాత్వికాహారమే తీసుకొనవలయును.

రామాయణములో శ్రీ రామ చంద్రులవారు లక్ష్మణ స్వామి వారితో అంటారు. చూడండి రామచంద్రుల వారి ధర్మ నిరతి. లక్ష్మణ స్వామి దశరథ మహారాజును ఖైదు చేస్తానంటే శ్రీ రామ చంద్రుల వారు అంటారు.
“నిన్న పిలిచి రాజ్యం ఇస్తానంటే తండ్రా? ఈ రోజు పిలిచి రాజ్యం లేదంటే అదే తండ్రి మనకు శత్రువా?”
అని అంటారు. చూశారా ధర్మం. అందుకే “రామో విగ్రహవా ధర్మః” అని మారీచులు వారన్నారు. రావణా.... రాముడంటే ఎవరో కాదు కరచరణాదులతో నడచి వచ్చే ధర్మదేవత.

మిత్రుడు:-
మితము నుండి ఋతమునకు తీసుకొని వెళ్ళువాడు. నిత్యమూ సర్వకాల సర్వావస్థలయందు మనతో భగవంతుని గురించి (సన్మార్గము) భాషించే వాడు, మనలను ఆ మార్గము వైపు త్రిప్పడానికి, సదా అభిలషించే వాడు అపరాధములు 3.
 1. భగవదపరాధము:- పరమాత్మ పట్ల కృతఘ్నుడిగా ఉండడo.
 2. భాగవతాపరాధము:- భాగవతులు, భగవంతుని నమ్ముకొన్న వారి పట్ల చేసే అపరాధాలు.
 3. అసహ్యపరాధము:- గురువుల పట్ల చేయు అపరాధములు.
పక్షులకు ఆకలి ఎక్కువ
పాములకు కోపం ఎక్కువ
గంధర్వులకు కామం ఎక్కువ
పశువులకు భయం ఎక్కువ
మానవులకు అన్నీ ఎక్కువ.
“ధ్రియాలేనా జానయతి ధర్మం”
తెలిసి ఉండడం ధర్మం కాదు. ఆచరణములో ధర్మమును పాటించడమే ధర్మం. అనుష్ఠిoచనిది ధర్మం కాదు. కేవలం తెలియడం, అనుష్ఠించక పోవడం ధర్మం కాదు.
ఉదా:- ఇంటిలో అన్నం కుండ నిండుగా ఉంది. పులుసు, చారు,పెరుగు, ఊరగాయ అన్నీ ఉన్నాయి. ఇవి అన్నీ ఉన్నాయనే తలంపు, మా ఇంటిలో అన్నీ ఉన్నాయని అందరికీ చెప్పుకోవడం వలన, మన ఆకలి తీరదు. మనము కూర్చొని, క్రమాను సారముగ, అన్నము+పులుసు, అన్నము+చారు,అన్నము+పెరుగు కలిపి భుజిస్తే (తింటే ) ఆకలి తీరుతుంది. అదే విధముగ ధర్మము కూడా, కాలపరిస్థితుల నను సరించి, పద్దతిగా (వేదప్రోక్తముగా) ఆచరిస్తేనే, ధర్మవర్తనా జీవుడు. పూజ పూజ గదికే పరిమితం కాదు. ధర్మానుష్ఠానమే నిత్య పూజ.

శౌచము:- బాహ్యశుద్ది, అంతఃశుద్ధి, అభ్యంతర శౌచము.

ఆచమనము చేయడము వలన శౌచము తొలగుతుంది.కాళ్ళు, చేతులు, ముఖము కడుగుకొని ఆచమనము చేయాలి.సన్యాసి, బ్రహ్మచారి భిక్షాటనతో జీవించాలి.
 • భిక్ష అనగా వచ్చే పూటకు కొరకు దాచుకోనిది. ఒక్క ఏనుగు వెంట్రుక తప్ప ఈ ప్రపంచంలో దేని వెంట్రుక పనికి రాదు.
 •  ఏనుగు వెంట్రుకను కనురాపుకు, దృష్టి దోషమునకు, పిల్లలకు, పెద్దలకు, తాయత్తులో మంత్రప్రోక్తముతో బంధించి వాడుతారు. 
 • ఆహారం (అన్నం) లో వెంట్రుక వస్తే తర్వాత ఆ ఆహారం భుజింపరాదు. నది ఒడ్డున కానీ,పారుచున్న సెలయేరుల ఒడ్డున కానీ, ఆలయ ప్రాంగణములలో కానీ మల, మూత్ర విసర్జన చేయరాదు. అది మహా పాపము. ఆ పాపము మనలను, మన వంశమును కట్టి కుదుపు తుంది.
 • వేద విభాగము చేసిన వ్యాసుల వారు.
 • ఋగ్వేదము పయిలుడుకి, యజుర్వేదము- వైశం పాయునికి, సామవేదం- జైమినీకి, అధర్వణ వేదము-సుమంతునకు ఇచ్చారు. వేదమునకు శృతి అని పేరు శృతి అంతే “శృన్వన్ తపః”
 • చురాక్రమములు. ఆశ్రమ నియమ పాలన చాలా ముఖ్యము. చెవి కుండలములు సౌభాగ్య వస్తువులు.
 • చెవులకు ఆభరణములు లేకుండా, ఏస్త్రీ గానీ, తన భర్తకు కనిపించరాదు. ఏదీ లేకపోతే తాటంకములు, ఐనా పెట్టుకొన వలయును. ఏమి లేకుండా భర్తకు కనిపిస్తే భర్తకు ఆయు క్షీణము.
 • తాటంకములు అంటే తాటాకు ముక్క. తాటి చెట్టు లక్ష్మీ సాధనలో ఒకటి.
 • మానవుని స్వభావము రజోగుణ, తామోగుణ భూయిష్టమై ఉంటుంది.
 • స్వభావము జన్మతః వస్తుంది. పూర్వ జన్మ వాసనల ఆధారంగా వస్తుంది. దానిని అదుపు చేయడం కేవలం సద్గురు సాంగత్యములోనే సాధ్యము.
 • శిష్య – “శాశితం యోగ్యత శిష్యః”
 • శౌచము లేకుండా భాగవదానుగ్రహము కలుగదు.
స్నానం:
ఎప్పుడు పడితే అప్పుడు స్నానం చేయుట నిషిద్ధం.

పంచభూత స్నానములు:
సంవత్సరమునకు ఒక్కసారి ప్రతి ఒక్కరూ చేయవలసిన స్నానములు ఐదు.
పిండాండము బ్రహ్మాండములో కలసి యుండుట వలననే బ్రతికి యున్నాము.
 1. పృథివీ స్నానం: ఉత్తర దిక్కున ఉన్న పుట్ట మట్టితో చేయు స్నానం.
 2. వరుణ స్నానం: నిత్యమూ చేయు స్నానం
 3. అగ్ని స్నానం: విభూది తో చేయు స్నానం
 4. వాయు స్నానం: గోధూళి వేళ గోధూళిని వంటికి అలుముకొని చేయు స్నానం (పవిత్ర మైన స్నానం)
 5. ఆకాశ స్నానం: ఎండగా ఉండి వర్షం పడినప్పుడు ఆ వర్షంలో స్నానము చేయు భావనతో తడవడం ఆకాశ స్నానం.
ఈ ఐదు కర్మలయందు భుజము పై ఉత్తరీయము లేకుండా చేయరాదు.
 1. స్వాధ్యాయము: వేదము నేర్చుకొనునపుడు (గృహస్తు మాత్రమే)
 2. హోమము: హోముమనకు కూర్చున్నపుడు
 3. దానము: దానము చేయునపుడు, దానము పుచ్చుకొనేటప్పుడు.
 4. భోజనము: త్రికాల భోజన సమయములలో
 5. ఆచమనము: ఎప్పుడు ఏసందర్భములో ఆచమనం చేసి దానము చేసినా, అంచులేని

వస్త్రము దానము ఈయరాదు, దానముగా పుచ్చుకొన రాదు.

గృహస్తాశ్రమ యజ్ఞములు ఐదు.
 1. బ్రహ్మయజ్ఞము:
 2. దేవయజ్ఞము:
 3. పితృయజ్ఞము:
 4. భూతయజ్ఞము:
 5. మనుష్యయజ్ఞము:
లక్ష్మీ స్థానములు ఐదు వస్తువులు
 1. ఏనుగు కుంభస్థలము
 2. మారేడు దళము
 3. సువాసిని యొక్క పాపిట
 4. తామర పుష్పము
 5. ఆవు వెనుక భాగము
మన ప్రమేయము లేకుండా మన మనస్సును లయింపచేసేది మూడు.
 1. ఏనుగు కుంభస్థలము
 2. పూర్ణ చంద్రబింబము
 3. సముద్రము
స్నానములు 6 వేదము నందు అత్యంత పవిత్రమైన కర్మ.
 1. మలాపకర్షణ స్నానము.
 2. క్రియాంగ స్నానము.
 3. క్రియా స్నానము.
 4. కామ్య స్నానము.
 5. తీర్ధ స్నానము.
 6. నైమిత్తిక స్నానము.
 • వేడి నీటిలో స్నానం చేయరాదు.
 • వేడి నీటితో స్నానం చేయువారు కాళ్ళ దగ్గర నుండి ప్రారంభించాలి.
 • చన్నీటితో స్నానం చేయువారు శిరస్సు నుండి ప్రారంభించాలి.
 • పురుషుడు నిత్యం తల స్నానం చేయాలి.
 • స్త్రీలు నైమిత్తిక స్నానం చేయాలి.
స్నానం అంటే మజ్జనం,నదిలో గానీ, తటాకములో గానీ, సముద్రంలో కానీ చేయాలి. స్నానం అంటే బక్కెట లో నీరు ముంచి చేయడం కాదు. దేశకాల పరిస్ధితుల నను సరించి స్నానం చేయాలి. నదీ స్నానం చేయు స్త్రీలు నదికి అభిముఖముగా నిలబడాలి. నదీ స్నానం చేయు పురుషులు నదీ క్రమము నను సరించి చేయాలి.

ధర్మమునకు నాలుగు పాదములు.
 1. తపస్సు
 2. సత్యము
 3. శౌచము
 4. దయ
కలిపురుషుడు కురుజంగాల దేశములో కాలు మోపి ప్రవేశించాడు. ప్రవేశింపగానే, నాలుగు పాదములు కలిగిన(ఆవు) ధర్మదేవతను, తన కాలితో తన్నగా, ధర్మదేవత పడిపోబోయి నిలద్రొక్కుకొని, నిలబడి చూచింది. అపుడు పరీక్షిన్ మహారాజు గారు కలి పురుషుణ్ణి నిగ్రహింపబోయాడు. అపుడు కలిపురుషుడు ప్రార్థించగా పరీక్షిన్ మహారాజు గారు దయ దలచి నాలుగు స్థానములలో మాత్రమే నువ్వు ఉండడానికి అనుమతిస్తాను అని నాలుగు స్థానములు చెప్పాడు. అంత తప్ప మరెక్కడ నీవు కనబడినా నిన్ను నిగ్రహిస్తాను అని అన్నారు.

పరీక్షిత్తు కలి పురుషుని అనుమతించిన స్థానములు 4
 1. మధ్యపానము
 2. జూదము
 3. స్వేచ్ఛా విహరణ గల స్త్రీలు(వేశ్యాగృహములు)
 4. వేట
కలిపురుషుడు పరీక్షిత్తును కోరిన స్థానము-1,అది సువర్ణము 5.సువర్ణము

మహాజ్ఞాని వేద, వేదాంగములను ఔపోసన పట్టి నవాడు, సుభద్రా గర్భములలో ఉన్నప్పుడే, అశ్వద్ధామచే ప్రయోగింపబడిన బ్రహ్మాస్త్రము (బ్రహ్మశిరోనామకాస్త్రాన్ని) నుండి, శ్రీ కృష్ణ భగవానునిచే రక్షణపొంది, భగవానుని తల్లి గర్భములోనే శంఖ, చక్ర, గదాధరుడు, పట్టు పీతాంబరములతో నున్న, శ్రీ కృష్ణ పరమాత్మను దర్శించిన భాగ్యశాలి, (విష్ణు రాతుడు) పరీక్షిన్మహారాజుగారు. అలాంటి మహానుభావుడు కలిపురుషుని నిగ్రహించక (సంహరించక) ఎందుకు ఐదు స్థానములను మాత్రము కలిపురుషునకు దానము ఇచ్చాడు.

కలియుగంలో (కలిపురుషుడు ప్రవేశించాక) ప్రజలు త్రేతాయుగంలో లాగా, ద్వాపరయుగంలో లాగా,మానవుల మాంస నేత్రములకు, కరచరణాదులతో పరమేశ్వరుడు, యుగకాల మంతా, అందుబాటులో ఉండడు కాబట్టి,కలియుగ వాసులకు ఒక వరం ఏమనగా, త్రికరణ శుద్దిగా మంచి పనులు, సంకల్పము చేత సంస్కరింప బడుతారు. మరియు దేవతా కటాక్షము వాక్కుచేత, దృష్టిచేత, స్పర్శ చేత, రతి చేత కాదు. అందు కొరకు పరీక్షిన్మహరాజు కలిపురుషుని, అడుగిడడానికి అంగీకరించారు.

కలిస్థానములు
 1. మధ్యపానము వలన శుకపిక, గర్వము ప్రబలుతుంది.
 2. జూదము వలన అసత్యము, దొంగతనమూ ఇత్యాదివి ప్రబలుతాయి.
 3. స్వేచ్ఛా విహరణ స్త్రీల(వేశ్యా గృహములు) వలన ఉన్మాద కామము, వావి వరుసల భంగము, నిర్భయత్వము ప్రబలుతాయి.
 4. వేట వలన హింస, హింసాప్రవృత్తి, అధర్మహింస ప్రబలిపోతుంది.
 5. సువర్ణము సర్వనాశనముకు ప్రధాన హేతువు. స్వార్థము, అర్థ వ్యామోహము ప్రబలి శతృత్వము అశాంతి ప్రబలుతుంది.
ఉత్సాహము, ఆనందము, నిద్ర ఇవి శక్తిస్వరూపాలు వీటిని మాంస నేత్రమునకు చూపలేము.
ఇంద్రియాని బలిష్టాని- ఇంద్రియములను గెలవడం అంత సులభం కాదు.

నిద్రించునప్పుడు నవరంధ్రముల నుండి, మల మూత్రములు విసర్జింపబడతాయి. వాటిని శుభ్రము చేయకుండా(స్నానము చేయకుండా) దేవాలయ ప్రదేశము, పూజా మందిర ప్రవేశము, చేయరాదు. నిషిద్దం. పంచ మహాపాతకములు చేసిన వారితో స్నేహం చేస్తే, ఆ స్నేహితునికి కూడా పంచ మహాపాతకములను చేసిన, పాపమును వారి ఖాతాలో వేస్తారు.
ఇంద్రియములు పరమాత్మను చేరడానికి సహకరించవు. అవి ఎంతసేపు దేహాభిమానంతో ఇహలోక సుఖాభిలాషులై ఉంటాయి.

ఐదు జ్ఞానేంద్రియములు+ఐదు కర్మేంద్రీయాములు+మనస్సు కలిపి పరమేశ్వరునకు నమస్కరించాలి.

రాక్షసత్వము:-
రామాయణంలో సీతా మహాతల్లి లంకలో అశోకవనంలో అంటారు. “చనిపోదామంటే విషమివ్వరు,చావనివ్వరు, బ్రతుకుదామంటే తనకు నచ్చిన విధముగ, బ్రతుకనీయరు, వారికి నచ్చిన విధముగ, బలవంతముగా బ్రతుకమని కోరడం రాక్షసత్వం”
మనస్సును సంస్కరిస్తే ఋషి. సంస్కరింపకపోతే రాక్షసుడు.

మదజలము
ఇది ఏనుగు(మగ)కు కారుతుంది. ఆ మదజలము కారుచున్నప్పుడు ఆ ఏనుగు చేష్టలు చాలా భయంకరంగా ఉంటాయి. ఏనుగు యొక్క కంటికి, చెవికి మధ్య భాగంలో ఒక రంధ్రం ఉంటుంది. అందులో నుండి మదజలము కారుతుంది. అపుడు మగ ఏనుగు ఆడ ఏనుగు కొరకు పరుగులు తీస్తుంది.

జీవుడు ఎప్పుడూ మూడు కాలములలో తిరుగుచుంటాడు
 1. పగలు రాత్రి
 2. భూతకాలము నిద్ర
 3. భవిష్యత్ కాలము జాగృత్
వర్తమాన కాలము సుషుప్తి
మానవుడు ధనము, బలము, అధికారము ఉన్నప్పుడు చాలా మంది చుట్టూ చేరుతారు. భాగవతంలో గజేంద్రుని చుట్టూ చేరిన విధముగ, కాలములో నుండి కర్మఫలము వచ్చి పట్టుకొనిన, అప్పుడు ఒక్క భగవంతుడే దిక్కు. ఎవరూ తోడు ఉండరు సరికదా సహాయము కూడా చేయడానికి సాహసించరు.

పరిశీలన:
మనలోని ఈశ్వరుడు సర్వకాల సర్వావస్థల యందు మనలో ఉత్పన్నమయ్యే ఆలోచనలను చూస్తుంటాడు. ఆ ఆలోచన క్రియారూపం దాల్చినా, దాల్చకపోయినా, ఈశ్వరుని దృష్టిలో ఆలోచనే ఒక క్రియ. ఆ ఆలోచన మంచిదైతే అందరూ గర్హిస్తారని అని మనము అనుకుంటాము. మనయొక్క ఆలోచన ధర్మబద్దమైతేనే ఈశ్వరుడు దృష్టిలో మంచి స్థానమును పొందుతుంది. ఈశ్వరుని దృష్టిలో అధర్మబద్దమై, మిగతా ప్రపంచమంతా ఆ ఆలోచనను పొగిడినా, ఒక ఈశ్వరుని దృష్టిలో అపరాధి ఐతే, అది వృధా నే కాక, పాప పంకిలమవుతుంది.


రచన: కోటి మాధవ్ బాలు చౌదరి

కామెంట్‌ను పోస్ట్ చేయండి

0 కామెంట్‌లు
* Please Don't Spam Here. All the Comments are Reviewed by Admin.
కామెంట్‌ను పోస్ట్ చేయండి (0)

buttons=(Accept !) days=(0)

Our website uses cookies. Learn More
Accept !
To Top