నారు పోసినవాడు నీరు పోయడా? అని ఎందుకు అంటారు ? - Naaru Posinavade Niru Poyada

0

Naaru Posinavade Niru Poyada
“ నారు పోసినవాడు నీరు పోయడా? ”

నారు పోసినవాడు నీరు పోయడా? – ఇది ఒక ముఖ్యమైన నానుడి మన దేశంలో. హిందూదేశంలో, హైందవధర్మంలో, ఈ దేశ ప్రజలకి భగవంతుడిపైన అపారమైన నమ్మకం. రాజు,పేద అనే తేడాలేకుండా అందరికీ భగవంతుడిపైన వెలలేని నమ్మకం. తనకున్నదానికంటే పదిరెట్లు ఎక్కువ ఇమ్మని ఉన్నవాడు కోరుకుంటాడు; బ్రతకటానికి, రోజుకింత నోట్లోకి పోవటానికి తిండి దొరికితే అదేచాలు అని కోరుకుంటాడు పేదవాడు. వున్నదాంట్లో సంతృప్తిపడనివాడొకడైతే, దొరికినదాంతోనే సంతృప్తిపడేవాడు మరొకడు. ఇక ‘ అమ్మతనానికివస్తే ’, తన ప్రాణాలనే పణంగాపెట్టి, నవమాసాలుమోసి బిడ్డనుకన్న ఆ తల్లి, తన బిడ్డకు ప్రాణాపాయంవస్తే, వైద్యునికన్నా, నారుపోసిన ఆ దేవుడినే ఎక్కువగా నమ్ముకుంటుంది. అది మన దేశంలో భగవంతుడిపైన నమ్మకం.

ఈ మధ్యనే నేను ఒక పెళ్ళికి వెళ్ళాను. ముహూర్తానికి ఇంకా చాలా సమయంవున్నది. మండపం తయారవుతున్నది. పెళ్ళిపెద్ద ఒక వ్యక్తితో మాట్లాడుతున్నాడు. మండపం మధ్యలో, వెనుకభాగాన ఏ దేవుడి పటం పెట్టాలి అని. వారి సంభాషణని నేనూ వింటున్నాను. అయ్యా మీకు ఏ దేవుడు కావాలో చెప్పండి నిముషాల్లో మీ ముందు ప్రత్యక్షం చేసేస్తాను. మీకు ఆ దేవుడు నచ్చితేనే నాకు డబ్బులివ్వండి అని అదీఇదీ మాట్లాడి, పదివేలరూపాయలకి బేరమాడి, చివరకు వెంకటేశుడు,అలివేలుమంగతాయార్లను మండపంలో దింపటానికి ఒప్పందం చేసుకున్నాడు. మండపంలో పనులు చకచకా జరిగిపోతున్నాయి. నేను ఆలోచనలో పడ్డాను. ఏమిటి, దేవుళ్ళు అంటే వీళ్ళకు ఇంత చౌవక అయిపోయారా? మీకు ఏ దేవుడుకావాలో చెప్పండి, నిముషాల్లో మీ ముందు ప్రత్యక్షం చేసేస్తాను అన్న అతని మాటలు నా మదిలో ఆలోచనలను రేకిస్తున్నాయి. సరే ఏమీ తోచక, హాల్ ప్రక్కనేవున్న వరండాలోకి వెళ్ళాను. అక్కడ, ఒక ప్రక్కగా అనేక దేవతామూర్తులు బారులుతీరి కొలువైవున్నారు. ప్రతి మూర్తి చాలా అందంగా మలచబడివున్నది. ‘ దేవుళ్ళకు వాళ్ళ ఇళ్ళల్లో నిలువుటద్దాలు వున్నాయో, లేవో నాలు తెలీదుకానీ ఇక్కడ ఈ శిల్పి చేసిన ఈ ప్రతిమల్ని చూస్తేమాత్రం ఆ దేవుళ్ళు, ఓహో! మేము ఇంత అందంగా వుంటామా అని ఖచ్చితంగా అనుకుంటారు ’.

ఆ ప్రతిమల మధ్యనే ఆ శిల్పి కూర్చొని కొంత విశ్రాంతి తీసుకుంటున్నాడు. నేను అతన్ని మాటల్లో దింపాను. అతను ప్లాస్టర్ ఆఫ్ పారిస్‍తో, తన ఊహను జోడించి చక్కటి దేవతామూర్తులను తయారుచేస్తాడు. కళ్యాణమండపాలవారితో బేరంకుదుర్చుకొని, ఒక్కొక్క హాల్‍లో కొన్ని దేవతామూర్తులను పెట్టివుంచుతాడు. అవసరాన్నిబట్టి వాటిని పెళ్ళి మండపంలో అలంకరణ చేస్తాడు. హాల్ వాళ్ళకి కొంత డబ్బు ఇవ్వాలి; మిగిలింది అతనికి. సరే, ఇంతకీ ఈ దేవుళ్ళతో వ్యాపారంచేసి ఎంత సంపాదిస్తావేమిటి? అని అడిగాను. అతను చెంపలేసుకొని, అయ్యా, నేను అంతగా చదువుకోలేదు; ఈ కళ మాత్రం నాకు అబ్బింది; దేవుడ్ని నమ్ముతాను; కుటుంబాన్ని పోషించుకోవాలికాబట్టి ఏదో ఒక పనిచేయాలి; నారుపోసినవాడు నీరు పోయడా? అని నమ్మినవాడిని; ఇదిగో, ఇదొక ఆలోచన వచ్చింది; ఎంతోకొంత డబ్బుల్ని సంపాదిస్తున్నా; సుఖంగా వున్నాం అని తన కథని చెప్పాడు. దేముడిపై అతనికున్న నమ్మకం నాకు నచ్చింది.

ఆతరువాత కొన్నాళ్ళకి నేను నా స్నేహితులతో కలిసి కంచి వెళ్ళాము. కంచి కామాక్షికి అభిషేకం చేయించాలని నా భార్య, నా మిత్రులు అన్నారు. సరే, తెలిసినవాళ్ళద్వారా ముందే టికెట్లు దొరికే ఏర్పాట్లు చేసుకున్నాము. లేకపోతే ప్రవేశం చాలా కష్టం. సరే అమ్మవారి దర్శనం అయింది. పురాతనమైన మూలవిరాట్ యొక్క చిత్రపటం దొరికితే తెచ్చిపెట్టమని మావాళ్ళు కొందరు అడిగారు. గుళ్ళో పూజారిని అడిగితే, చాలా కష్టం దొరకటం అని చెప్పి, ఒక బంట్రోతును పిలిచి అతనికి చెవిలో ఏదో చెప్పి అతనితో వెళ్ళమని చెప్పాడు. అతను అయ్యా, చిన్న పటం అయితే మూడువందలు; పెద్దది అయితే ఐదువందల రూపాయలు అవుతుంది, మరి తెమ్మంటారా? అని అడిగాడు. తెమ్మన్నాను. వాటిని తీసుకొని గుడి బయటకు వచ్చాం.

గుడి బయట, ప్రవేశద్వారానికి ఇవతలగా, రోడ్డుకు అటూఇటూ అమ్మవారి, అయ్యవారి (శివపార్వతుల) చిత్రపటాలు నేలమీద పరిచి అమ్ముతున్నారు. పదిరూపాయలు, పదిహేను రూపాయలు అని ఒకరిని మించి మరొకరు గొంతెత్తి అరుస్తూ అమ్ముతున్నారు. ఆ దృశ్యం చూడగానే నాకు చాలా కోపం, బాధ కలిగినాయి. దేవుళ్ళగురించి వీళ్ళు ఏమనుకుంటున్నారు అసలు? పవిత్రమైన దేవతామూర్తులను వీరు వీధుల్లో, నేలపై, దుమ్మూ,ధూళిలో పెట్టి అమ్ముతారా? దేవుళ్ళు వీళ్ళకి ఇంత చౌక అయిపోయారా? అని అనుకున్నాను. ఇంతలో అమ్మేవాళ్ళల్లో ఒకతను నన్ను పిలిచి, అయ్యా, మీ చేతుల్లోవున్న ఆ చిత్రాల్ని ఎంతకు కొన్నారు? అని అడిగాడు. నేను సమాధానం చెప్పలేదు. అతనే మీరు వాటిని మూడొందలకు, ఐదొందలకు కొన్నారుకదా? అని అడిగాడు. ఇక నేను నోరు తెరవకతప్పలేదు. నీకెట్లా తెలుసు? అని అడిగాను. అందుకతను అవి నాదగ్గరనుంచే కొని, అతను మీకు అమ్మాడు అని చెప్పాడు. ఇంకా కొన్ని మీకు కావాలా? అవి నా దగ్గరతప్ప మరెవరిదగ్గరా దొరకవు అని చెప్పాడు. సరే ఎట్లాగో మరికొన్ని కావాలికదా అని సరే చెప్పు ఎంతకిస్తావు అని అడిగాను. అయ్యా, చిన్నవి వందరూపాయలకి; పెద్దది నూటఏభై రూపాయలకీ ఇస్తాను అని చెప్పాడు. సరే, నాకు పెద్దవి పది కావాలి; వాటిని వందరూపాయల చొప్పున చేసి ఇవ్వు అని అడిగాను. దానికతను అయ్యా, మీరు వాటిని ఐదువందల రూపాయలకి కొన్నారు; అదే పటాన్ని నేను మీకు నూటఏభై రూపాయలకి ఇస్తుంటే మీరు వందరూపాయలకే అడుగుతున్నారు; ఇది న్యాయమా? నాకు ఇందులో ఇరవై రూపాయలు మిగులుతాయి, అంతే. మీరే చెప్పండి అని అన్నాడు. ఆలోచించాను; సరేనని అతను చెప్పిన ధరకే కొని, ఇంతకీ ఈ పవిత్రమైన దేవుళ్ళ పటాల్ని ఇలా రోడ్లమీద, నేలమీద పెట్టి అమ్ముతున్నారు; ఇది చాలా అపవిత్రమైన పని అని అన్నాను. అంతేకాకుండా, నువ్వు, ఆ గుళ్ళో బంట్రోతు కలిసి ఈ ప్రత్యేకమైన పటాల్ని ఇలా ఎక్కువ ధరకు అమ్ముకోవటాన్ని ఆ దేవుడు ఒప్పుకుంటాడా? అని అడిగాను. అతను ఒక చిరునవ్వు నవ్వి, మీ రెండో ప్రశ్నకి ముందు సమాధానం చెబుతాను. నారుపోసినవాడే నీరు పోస్తాడు అని నా నమ్మకం. నాదగ్గర మాత్రమే ఈ అరుదైన చిత్రపటం వున్నది. నాకు ఆలోచన కలిగింది; అసలు చిత్రపటానికి నకళ్ళు తీసి, కొంత లాభంతో న్యాయంగా అమ్ముతున్నాను. నా చిన్ని కుటుంబానికి ఆ దేవుడు ఇస్తున్న ఈ డబ్బులు చాలు; ఎక్కువ ఆశలేదు నాకు. అయితే, మోసంతో మీకు గుడిలోపల వాళ్ళు ఎక్కువ ధరకు అమ్ముతున్నారు. దానికి నేను ఏమీ చేయలేను. ఇక మీ మొదటి ప్రశ్నకి నా సమాధానం: దేవతల విగ్రహాల్ని చెక్కతో చేస్తారు; శిలలతో చేస్తారు. ఆ చెక్కా, ఆ శిల ఈ నేలనుంచి వచ్చినవే; గుడి బయటవుంటే, అది ఒక చెట్టు; ఒక కొండ; గుడిలోపలవుంటే, అదే చెక్క, అదే కొండశిల పవిత్రమైన దేవుడు. మేము నేలపై పెట్టి అమ్ముతున్న పటాలు ఆ చెట్టు; కొండలాంటివేనయ్యా! గుళ్ళోనేవున్న ఆ దేవతని పూజిస్తే అంతా మంచి అగుతుందని మీకు నమ్మకం; మాకు ఒక కాగితపు పటమైనా, ఒక కొయ్య బొమ్మైనా, ఒక రాతి బొమ్మైనా అది నిజమైన దేవతే! మీరు ఏదో కావాలని గుళ్ళోని దేవత దగ్గరికి వెళ్తారు; కానీ, మాకు, మాకోసం ఆ దేవతే మాదగ్గరకు దిగి, నడిచివచ్చి ఇదిగో ఇలా మా చేతుల్లో అమ్ముడుపోయి (అమ్ముడుపోయినట్లు నటించి) మాకూటికి ఇంత అందిస్తున్నది. ఇదే బాబు మాకు తెలిసింది. అందుకే మేమందరం నారుపోసినవాడే నీరు పోస్తాడు అని నమ్ముతాం అని విశ్వాసంగా, ప్రశాంతంగా తన మనసులోని మాట చెప్పాడు. అతని మాటలు నా మనసుకు నచ్చాయి.

రచన: పబ్బరాజు మాధవ రావు - Asst.General Manager in Sericulture Coprn

కామెంట్‌ను పోస్ట్ చేయండి

0 కామెంట్‌లు
* Please Don't Spam Here. All the Comments are Reviewed by Admin.
కామెంట్‌ను పోస్ట్ చేయండి (0)

buttons=(Accept !) days=(0)

Our website uses cookies. Learn More
Accept !
To Top