ఈశ్వర రూపం - Eshwara Roopamఈశ్వరుడి రూపం ఎలా ఉంటుంది? ఇది చాలా మందికి వచ్చే అనుమానం.

ఏకో దేవః సర్వ భూ, సర్వభూతేషు….
సర్వభూతాంతరాత్మ సర్వభూతాధివాసః
సాక్షీ చేతో కేవలో నిర్గుణశ్చ, కర్మాధ్యక్షః సర్వభూతాధివాసః - అని చెబుతారు. "పరమేశ్వరుడికి రూపమే లేదు. నిర్గుణుడు. నిర్జనుడు.." అని దీని అర్థం. 

అలాంటి వాడు కూడా మానవులకు ఒక ఆధారం దొరకాలి కాబట్టి ఒక రూపాన్ని స్వీకరిస్తాడు. అందుకే గీతలో కృష్ణభగవానుడు "పరిత్రాణాయ సాధూనాం వినాశాయ చ దుష్కృతాం
ధర్మసంస్థాపనార్థాయ సంభవామి యుగే యుగే" అని చెబుతాడు. "నన్ను ఒక రూపంతో చూడాలని కోరుకునే పరమభాగవతోత్తములైన వారి కోర్కె తీర్చడం కోసం వారి మాంస నేత్రానికి దర్శనమవటానికి ఒక పాంచభౌతిక స్వరూపంతో ఆవిర్భవించాను తప్ప అదే నా స్వరూపం కాదు. నా అసలు స్వరూపం వ్యాపకత్వం. అంతటా నిండి నిబిడీకృతమైపోయాను" అనేది ఈ శ్లోక తాత్పర్యం. దీనిని భాగవతంలో మరింత సరళంగా ప్రహ్లాదుడి నోట - ఇందుగలడందులేడని సందేహము వలదు చక్రిసర్వోపగతుండెందెందు వెదకి చూచిన నందందే కలడు దానవ్రాగణి వింటే.. (భాగ. 7-275) అని పలికిస్తాడు. "నాన్నా, నువ్వు విష్ణువు ఎక్కడున్నాడు ఎక్కడున్నాడు అంటావేంటి? వ్యాపకత్వం వల్ల అంతటా నిండిపోయాడు" అని హిరణ్యకశపుడికి వివరిస్తాడు. మనం ఈశ్వర స్వరూపంలో కూడా శివకేశవుల ఐక్యతను చూడవచ్చు.

సహస్రశీర్షా పురుషః సహస్రాక్ష సహస్రపాత్
స భూమిం విశ్వతో వృత్వా అత్యతిష్ఠద్దశాంగుళమ్.. అని ఒక శ్లోకం ఉంటుంది. ఈ బ్రహ్మాండాలు ఎంతవరకు వున్నాయో అంతవరకు మహావిష్ణుడు పెరిగిపోయి ఉంటాడు. శివుడు ఈ బ్రహ్మండమంతా నిండిపోయి ఉంటాడు. మనకు ఏది ప్రీతిపాత్రమో- ఆ నేత్రం నుంచి ఆ దేవదేవుడిని చూస్తాం.

కానీ ఈ రెండింటికీ ఉన్న భేదం ఏమి లేదు. వస్తువు ఒకటే. దానిని నిర్ధారించేది మార్గశీర్షం. ఉపాసనలో చిట్టచివరకు వెళ్లిపోయిన తర్వాత ద్యోతకాలు కావాల్సినది అదే. అందుకోసమే ఉపాసనా కాలమైన కార్తీకం తర్వాత మార్గ శీర్షం వస్తుంది.

ఉపాసనకు ఉత్తమమైన కాలం కార్తీకం

కార్తీక మాసం ఉపాసనా కాలమని మనకు తెలుసు. పరమేశ్వరుడికి చేరువ కావటానికి అనువైన కాలం ఇది.

ఆషాడం నుంచి కార్తీకం వరకూ ఉన్న కాలాన్ని ఉపాసనా కాలం అంటారు. ఈ సమయంలో భక్తులందరినీ పరమేశ్వరుడు గమనిస్తూ ఉంటాడు. వారి భక్తికి తగినట్లుగా అనుగ్రహిస్తూ ఉంటాడు. భక్తి అపారమైనప్పుడు ఆయన వశమయిపోతాడు. వారు తిట్టినా, కొట్టినా ప్రీతిగా స్వీకరిస్తాడు. ఈ ఉదాహరణ కోసం ఎక్కడి దాకానో వెళ్లాల్సిన అవసరం లేదు. మహా పుణ్యక్షేత్రం తిరుమలలో అనంతాచార్యుల వారు గునపం విసిరితే శ్రీవారి గడ్డానికి తగిలింది. అందుకే ఇప్పటికీ స్వామి వారి గడ్డానికి గంధం పెడతారు. శివార్జునల యుద్ధం కూడా అలాంటిదే. భగవంతుడికి, మనకు మధ్య ఉన్న ప్రేమానుబంధం తెలియనప్పుడు చేసే పూజ యాంత్రికమవుతుంది. ఇప్పుడు మీలో కొందరు మనకు భగవంతుడిపై ప్రేమ ఎందుకుండాలని అడగవచ్చు. మనలో చాలా మందికి కుటుంబమంటే ప్రేమ ఉంటుంది. మనం ఏ పని చేసినా వారిని కూడా గుర్తు పెట్టుకుంటాం.

వారిని నొప్పించే పనులు చేయం. మనకు వారిపై ఉన్న ప్రేమ ఈ విధంగా చేయిస్తుంది. కానీ మనకు కనిపించని పరమేశ్వరుడిపై ప్రేమెందుకు ఉండాలి? ఎందుకంటే మన జీవం, జీవితం ఆయన ప్రసాదమే.

దీనినే అన్నమాచార్యుల వారు - "వడిబాయక తిరిగే ప్రాణబంధుడా! " అని అద్భుతంగా చెప్పారు. మన శ్వాసకు, మన పుట్టుకకు, మన అస్తిత్వానికి అన్నింటికీ కారణం ఆయనేనని దీని అర్థం. మానవ జన్మలో జీవుడు ఉన్నంత కాలం శరీరంతో అనుబంధం ఉంటుంది. ఆ అనుబంధం ఉన్నంత కాలం ఈశ్వరుడిపై ప్రేమ ఉంటుంది. ఆ ప్రేమకు ఒక రూపం భక్తి. ఇక్కడ ఒక విషయం చెప్పాలి. భక్తి అంటే అరగంటసేపు పూజా మందిరంలో కూర్చోవటం కాదు. ఈ ప్రపంచాన్నే ఒక పూజామందిరంగా చూడగలగటం. అలా ఉపాసన చేయగా చేయగా పరమేశ్వర కృప కలుగుతుంది. ఇది ఒక రోజో, రెండు రోజులో చేసే ప్రక్రియ కాదు. జీవితాంతం చేయాల్సిన యజ్ఞం. దక్షిణాయనంలో ఉపాసన చేశాం, పరమేశ్వర సాక్షాత్కారం కలగలేదని ఆగిపోకూడదు. ప్రయత్నిస్తూ ఉంటే పరమేశ్వరుడిని చేరుకుంటాం.

భక్తులకు ఒక లక్ష్యం నిర్దేశించటానికి ఒక ఆకృతిని సృష్టిస్తారు. ఉదాహరణకు, కర్రతో గోడను దూకే వారు ఉంటారు. వాళ్ళు చేత్తో కర్ర పట్టుకుని పరుగెత్తుకొస్తారు. కర్రను భూమికి తాటించి ఆ కర్రను ఆధారం చేసుకొని తన శరీరాన్ని అలా పైకెత్తి గోడ మీద వరకు తీసుకెళతారు. గోడ మీద వరకు వెళ్ళిన తరువాత కర్రను ఇటువదలి తానటు పడిపోతాడు. అప్పుడు కర్ర కిందపడిపోతుంది. అంతే తప్ప, "ఓ కర్రా! గోడ దూకడానికి నాకింత దూరం సహకారంగా వచ్చి, నా శరీరాన్ని పైకెత్తడానికి ఉపయోగపడ్డావు. నువ్వు కూడా నాతో రా అనడు." అంటే కర్రతో పాటు ఆ వ్యక్తి కూడా కిందపడిపోతాడు. ఈశ్వర ఉపాసన కూడా అలాంటిదే.

అనుగ్రహం ఎలా పొందాలి?
వ్యాపారం చేసేవాడు తన దగ్గర ఉన్న డబ్బును పెట్టుబడిగా పెట్టి వ్యాపారం చేస్తాడు. ఉపాసన క్రమంలో మొదటి పెట్టుబడి పరమేశ్వరుడిచ్చిన ఈ శరీరం. స్నానం చెయ్యడం, ఓ మడిబట్ట కట్టుకోవడం, జీవుని కష్టపెట్టడం, సామ్రగి తెచ్చుకోవటం, కూర్చోవడం, పూజ చెయ్యడం, పుష్పార్చన చెయ్యడం – ఇవన్నీ శరీరాన్ని కష్టపెట్టడానికి. ఈశ్వరుడి అనుగ్రహం అంత సులభం కాదనే విషయాన్ని తెలియజేయటానికి. ఉపాసనలో తొలి అడుగు అమ్మవారి అనుగ్రహం పొందటం. ఆ తల్లి అనుగ్రహం లేకపోతే ఇంద్రియ లౌల్యం మీద భ్రాంతి పోదు. అందుకే పరదేవతా స్వరూపాన్ని వర్ణన చేసినప్పుడు-"సింధూరారుణ వ్రిగహాం త్రినయనాం, మాణిక్యమౌళిస్ఫుర తారానాయక శశిశేఖరాం, స్మృతముఖాం ఆపీతవక్షోరుహాం, పాణిభ్యామలిపూర్ణ రత్నచషకం రక్తోత్పలం బిభ్రతీం" అని వర్ణిస్తారు. 

"అమ్మవారి చేతిలో ఒక అమృత పాత్రవంటి పాత్రను పట్టుకుంటుంది. ఎవరిని అన్రుగహించాలో వాడికి భక్తి పాశాలు వేస్తుంది ఎవడు భక్తి భావన లేకుండా కేవలం లౌల్య బుద్ధితో ఉంటాడో అటువంటి వాడికి ఆమె భక్తి పాశాలు దొరకవు. వాడు ఇంద్రియ లౌల్యంతో నశించిపోతాడు" అని దీని అర్థం. అందుకే ఉపాసనను అశ్వనీ నక్షత్రంతో కూడుకున్న ఆశ్వయుజ మాసంతో మొదలుపెట్టమంటారు. దీని వల్ల అమ్మవారి అనుగ్రహం కలుగుతుంది. ఆషాఢ మాసంలో అసలు ప్రయాణం ప్రారంభమవుతుంది. అందుకే ఈ మాసంలో గురు పూర్ణిమ వస్తుంది. ఆ తర్వాత మనల్ని అన్ని విధాలుగా అనుగ్రహించాల్సిన తల్లి లక్ష్మీదేవి. శరీరంలో బలం, తేజస్సు, ఉపాసనను కొనసాగించే శక్తి అన్నీ ఆమె ఇవ్వాలి. అందుకే ఆమెను శ్రావణ మాసంలో కొలుస్తారు. ఇక కార్తీకం ఉపాసనా కాలం కాబట్టి పార్వతీదేవిని కొలవమని చెబుతారు.

రచన: కళ్యాణ్ 

buttons=(Accept !) days=(0)

Our website uses cookies. Learn More
Accept !
To Top