తెలుగు భాష తీపిదనం - Telugu Bhaasha Tiyyadanamతెలుగు భాష తీపిదనం

సి.వేదవతి గారి పుస్తకం 'తెలుగు-వెలుగు' నుంచి.

"మహిమున్ వాగను శాసనుండు సృజియంపం గుండలీంద్రుండు దన్
మహనీయస్థితి మూలమై నిలువ శ్రీనాథుండు ప్రోవన్ మహా
మహులై సోముడు భాస్కరుండు వెలయింపన్ సొంపు పాటించు నీ
బహుళాంధ్రోక్తిమయ ప్రపంచమున తత్ప్రాగల్భ్య మూహించెదన్."
                                                                                                   - రామరాజ భూషణుడు.

వేయి ఏళ్ళుగా తెలుగుజాతి వేయి విధాలుగా పండించుకొన్న సజీవ భాష తెలుగు భాష. ఆంధ్రభాష అమృతం వంటిదనీ, దేశ భాషలలో ఎన్నికను గడించిందనీ అనటానికి నిదర్శనం - శ్రీకాకుళ క్షేత్రంలో వెలసిన శ్రీ ఆంధ్ర మహావిష్ణువే స్వయంగా శ్రీకృష్ణదేవరాయల వారికి స్వప్నంలో సాక్షాత్కరించి అన్న మాటలు -

" తెలుగదేల యన్న దేశంబు తెలుగేను
దెలుగు వల్లభుండ దెలుగొకండ
యెల్ల నృపులు గొలువ నెరుగవే బాసాడి
దేశ భాషలందు దెలుగు లెస్స!"

కన్నడ రాయడైన శ్రీకృష్ణదేవరాయలవారిని కావ్యం కన్నడంలో కాక తెలుగులో చెప్పమనడానికి కారణం - తాను తెలుగు వల్లభుడవటమే కాకుండా, దేశ భాష లన్నిటిలోనూ తెలుగుకు విశిష్టత గూడా వుంది కనుక - అంటాడు ఆ ప్రభువు.

ఆంధ్ర మహావిష్ణువూ, క్రీడాభిరామకర్తా అనటమే కాదు, పాశ్చత్య పండితులు సైతం తెలుగు భాషలోని తీపిదనాన్ని ప్రశంసించారు. పదాల ఉచ్చారణలో ఒక లాలిత్యం కలిగి, శ్రావ్యతా మాధుర్యంలో ప్రథమస్థానం వహిస్తుందని కల్ట్వెల్ పండితుడు అన్న మాటలు ఇందుకు ఉదాహరణగా చెప్పుకోవచ్చును. Telugu is the Italian of the East - అనే ప్రశంస కూడా పాశ్చాత్య పండితులదే. మాటలలోని అర్థం తెలియకపోయినీ, వీనులక విందు కలిగించే ఒకానొక రమణీయకత తెలుగు భాషకు ఉన్నదని నిరూపితమవుతుంది.

తెలుగు దేశంలో పుట్టడం, తెలుగు చదవడం, మాట్లాడటం, జన్మాంతర సుకృతఫలమని అప్పయ్య దీక్షితుల వంటి మహాపండితులు అన్నట్లు ప్రమాణముంది.

తనదైన తెలుగు భాష మాధుర్యాన్ని గురించి ఎన్నో మధురమైన పదార్థాలతో పోల్చి - అన్నిటి కన్నా మిన్న అయినది అదేనని ఇలా నిగ్గు తేలుస్తాడు ఆధునిక కవి -

మంచి గుమ్మడి కన్న దంచిన యెఱ్ఱని
క్రొవ్వడ్ల బియ్యము కూడు కన్న
మేల్ జహంగీరు మామిడు పండు కన్న సుం
కారిన లేసజ్జ కంకి కన్న
కమియ పండిన దాక కన్న, చక్కెర తగ
బోసి వండిన పాల బువ్వ కన్న
రసదాడి కన్న, పనస తొన కన్న
జూరము కన్నను జూన్ను కన్న
అలతి రెరతేనియన కన్న నామని తఱి
కొసరి కూసిన కోయి కూత కన్న
ముద్దు లొలికెడు జవరాలి మోవి కన్న
తియ్యనైన దెయ్యది యదే తెలుగు బాస
                                                               - ముదిగొండ వీరభద్రమూర్తి

సంస్కృతమే సకల దేశ భాషలకూ జనని అనీ, ఆ దేళ భాష లన్నిటిలో - సంస్కృతంలో సమ్మోహనకరంగా కలిసిపోచే సమ్మేళన శక్తి తెలుగు భాషకు ఉన్నదనీ పండితుల అభిప్రాయం. తెలుగుకు - సంస్కృతంతో చెలిమి చేసినా - అందులోని పారుష్యం తనకు అంటకుండా - ఒక స్వతంత్ర భాషగా సరళగీతిలో తేలిపోయే నేర్పు ఉన్నది. ఎంతగా కలిసిపోయినా, తనదైన ప్రత్యేకత కలిగిన జీవద్భాష తెలుగు - అనటానికి ఎన్నో ఉదాహరణలు ఇవ్వవచ్చును. మచ్చుకు పారిజాతాపహరణంలోని ఈ పద్యం -
ఈసున బుట్టి డెందమున హెచ్చిన దవానలంబు చే
గాసిలి యేడ్చె ప్రాణ విభు కట్టెదుటన్ లలితాంగి పంకజ
శ్రీ సఖమైన మోముపై చేల చెరంగిడి...

ఈ భాషల మిళాయింపులోని సౌలభ్యం వలన పొంకం శ్రవణానందకరమైనదిగా ఉంటుంది.

తెలుగులో మాట, అప్రయత్నంగా పలికిన పాట - అంతకు ముందు నంచే ఉన్నా, తెలుగు కవిత్వానికి గ్రంథస్థితి కలిగించింది తొలిగా కవిత్రయం వారే. పదకొండో శతాబ్దిలో భారతంను ఆంధ్రీకరణం చేసి గ్రంథస్థం చేసిన వాగను శాసనుడికంటె పూర్వం కూడా తెలుగు భాష ప్రాచీనమైనదేనని శాసనాల ద్వారా మనకు తెలుస్తున్నది. కాని, నన్నయ భట్టారకుడు తెనిగించిన భారతంతోనే అక్షరబద్ధం చేయబడిన ఆంధ్రసారస్వత చరిత్ర ప్రారంభమవుతున్నది.

సంస్కృత పదభూయిష్టమైన కవత్వమైనా, ధారాశుద్ధితో సాగిపోయే సరస పదజాలంతో కూడిన రచన నన్నయ విరచిత భారత భాగం. సంస్కృతంలో వున్న మహాభారతాన్ని, అందులోని నిరూపితార్థాన్ని - సర్వజనులకు అర్థమయ్యే విధంగా తెలుగులో వ్రాయమని రాజకులైక భూషణుడైన రాజరాజ నరేంద్రుడు కోరగా, నన్నయ అప్పటి వరకు గాసట బీసటగా ఉన్న తెలుగును సంస్కరించి - భారతాంధ్రీకరణం ప్రారంభించి, తెలగు కవితావిర్భావానికి మూలపురుషుడుగా ప్రఖ్యాతి పొందాడు.

"సారకథాసుధారస మజస్రము నా గళ పూరితంబుగా
నారగ గ్రోలుచున్ జనులు హర్షరసాంబుధి దేలునట్లుగా
భారత సంహితన్ మున్ను ద్రిపర్వము లెవ్వడొనర్చె నట్టి వి
ద్యా రమణీయ నాంధ్రకవితాగురు నన్నయభట్టు గొల్చెదన్"

ఆదికవిని గూర్చి మారనకవి చెప్పిన ప్రశంసా పద్యం ఇది.

తన భాషలో ఉండే అక్షర రమ్యతను గురించి నన్నయ కవీంద్రుడు స్వయంగా తానే చెప్పుకొన్న మాటలు -
"సారమతిం గవీంద్రులు ప్రసన్న కవితార్థ యుక్తిలో,
నారసి మేలునా నితరులక్షర రమ్యత నాదరింప నా
నా రుచిరార్థ సూక్తినిధి నన్నయభట్లు తెనుంగునన్ మహా
భారత సంహితా రచన బంధురుడయ్యె జగద్ధితంబుగన్!"

ఆ విధంగా ప్రారంభమైన ఆంధ్ర సాహిత్య చరిత్రలో ఆనాటి నుంచి వేలవేల కావ్యాలు పుట్టినవి. కొన్ని మాత్రం కాలం తాకిడికి నిలవకుండా పోయినా, ఉత్తమ శ్రేణికి చెందిన కావ్యాలు, ప్రబంధాలు - నేటికీ చిరస్థాయిగా నిలిచిపోయినవి. అలా చిరంజీవిత్వం సంపాదించుకున్న కావ్యాలలోని కొన్ని పద్యాలు తెలుగువారి నోటపట్టి తరాలుగా నిలిచిపోయినవి.

మహాభారతం తర్వాత సంస్కృతం నుండి పురాణేతిహాసాలు, కావ్యాలు, సంప్రదాయ రీతిలో తెలుగులోకి అనువదించబడ్డాయి. ప్రబంధ రచన సాగింది. దేశి కవితా మార్గావలంబకులైన నన్నెచోడుడు, పండితారాధ్యుడు, తిక్కన, ఎఱ్ఱాప్రగడ, నాచన సోముడు, శ్రీనాథుడు, పోతనామాత్యుడు, విద్వత్ప్రభువు శ్రీకృష్ణదేవరాయలు, అల్లసాని పెద్దన, ఇతర అష్టదిగ్గజ కవులు, మరింకెందరో మహామహులైన కవీశ్వరులు ఆంధ్ర సరస్వతిని సర్వాలంకార భూషితను చేసి ధన్యులైనారు. శాశ్వత ప్రయోజనం కలిగిన ప్రాచీన సాహిత్య సంపద మనం కలకాలం పరిరక్షించుకోవలసిన నిధి వంటిది.

అన్ని కాలాలలోను సాహితీ స్రష్టలందరి పైనా సంప్రదాయ ముద్ర ఉంటుంది. ఈ సంప్రదాయం పునాదుల మీద సరికొత్త ప్రయోగాలు మొదలైనాయి. కావ్యరచనా రీతులతోపాటు, శైలి, భాష, రీతి - అన్నిటా క్రమంగా మార్పు వచ్చింది. నేటి కవిత్వం నిజంగా ప్రజల భాషలో, ప్రజల కోసం, ప్రజల ప్రయోజనం కోసం ఉద్భవిస్తున్నది. ఇలా క్రొత్త ప్రయోగాలు చేసే నవయుగ కవితా ప్రయోక్తలు కొందరు జాతి పునాదుల మీద సాహిత్య సౌధాన్ని నిర్మిస్తే, మరికొంత మంది అధునాతన కవులు పాత జోలికి పోక పూర్తిగా కొత్త పోకడలతో కలం నడుపుతున్నారు.

చెప్పదలుచుకున్నది సూటిగా మాత్రమే కాక, సుందరంగా, అలంకారయుక్తంగా చెప్పటం కావ్య లక్షణమైతే, సూటిగా మనం మాట్లాడుకునే భాషలో అందరికీ అర్థమయ్యేట్లు చెప్పడం నేటి కవిత్వ లక్షణం. ఒక్కొక్క రకమైన కవిత్వానికి ఒక్కొక్క బిగి, జిగి, ఇంపుల, సొంపు. భాషలోని ఈ మాధర్యం ఏ శైలికైనా రాణింపు తెచ్చేదే.

మాట పుట్టినప్పటినుండీ ప్రజల నోటిలో నాని ఏర్పడిన పదజాలం ఏ భాషా చరిత్రలోనైనా తొలి కవిత్వమే అవుతుంది. ఈ కవిత అప్రయత్నంగా జానపదుడి నోటినుండి వెలువడే సహజ సుందరమైన భాష. ఏ విధమైన అనుభూతికైనా అద్దంపట్టే ఈ పల్లె పదాలు అచ్చమైన తెలుగు నుడికారానికీ పద సౌందర్యానికీ మచ్చుతునకలు.
"వెల్లుల్లి పాయల్లు తోక మిరియాలు
వుడికించి యశోదమ్మ ఉగ్గు పోయంగ
మందాని తాగేడు మాయ కృష్ణమ్మ
చేదాని తాగేడు చిన్ని కృష్ణమ్మ!"

అంటూ జానపద భామలు చిన్న కృష్ణమ్మకు ఉగ్గు పోసుకుంటే -
"పాపనికి తలయంటి పసుపు బూసి
బోరుకాడించి హరి రక్ష పొమ్మటంచు
జలములొక కొన్ని చుట్టి రా జల్లి తొట్ల
నునిచి దీవించి పాడి రా యువిదలెల్ల!"

అంటూ, పోతన్నగారు పాపడికి తల యంటి ఉయ్యాలలో వేసే విధం అతి మనోజ్ఞంగా వర్ణిస్తారు.
"తలనంటి మేన జొబ్బిలిగ జముర్బూసి
సకలాంగములు దిద్ది చక్కనొత్తి
జలకముల్ గోర్వెచ్చ జలములచే నారిచి
తడి బోవ కర్ణ రంధ్రముల నూది
చలువ సన్నపు పుట్టముల మేన దడి యొత్తి
పట్టు పొత్తుల మెత్త పడక నునిచి
నునుపైన కాటుక గను దమ్ముల ఘటించి
బొమలు దీరిచి యుక్క బొట్టు బెట్టి
పొదిగిటను చేర్చి పాలిచ్చి బుజ్జగించి
కెంపు రవ చెక్కడంపు నిద్దంపు సొంపు
నింపు నుయ్యాలలోన నిద్రింపు సొంపు
నింపు నుయ్యాలలోన నిద్రింపు మనుచు
బాట బాడుచు నూచిరా పట్టి నపుడు!"
- మరింగంటి వేంకట నరసింహాచార్యులు

ఛందో బద్ధమైన కవిత్వంలోనూ ఇంత ధారాశుద్ధి - పదబంధ మాధుర్యం! పల్లె పదంలోనూ, పద్య బంధంలోనూ కూడా అందంగా అమిరే చక్కనైన భాష తెలుగు భాష.
"సంకాశితో దయాచల పంకజ సఖ కిరణ రాగ
పరిపూర్ణంబై, పంకేరుహ గర్భాండము
కుంకుమ నలలింపు గ్రోవి కొమరున నొప్పెన్!"

అంటూ, సూర్యోదయాన్ని పోతన కవీంద్రుడు సంప్రదాయ రీతిలో వర్ణిస్తే -
"పొడుస్తున్న సూర్యుడు పొన్న పువ్వు చాయ
క్రుంకుచూ భానుడూ కుంకమ్ము చాయ!"

అంటూ పల్లె పడుచు సూర్యోదయాన్నీ, అస్తమయాన్నీ తన పాటతో మన కన్నుల ముందు పరిచి పెడుతుంది.

ఆంధ్ర భాగవతంలోని పద్యాలు అమృతోపమానమైనవి. శ్రవణానందమే కాక, భక్తి రసానికి పరాకాష్టగా హృదయానందం కలిగించే కమ్మని కవిత -
నల్లనివాఁడు పద్మనయనంబుల వాఁడు కృపారసంబు పైఁ
జల్లెడువాఁడు మౌళిపరిసర్పిత పింఛమువాఁడు నవ్వు రా
జిల్లెడుమోమువాఁ డొకఁడు చెల్వలమానధనంబు దోచె నో
మల్లియలార! మీ పొదల మాటున లేఁడుగదమ్మ! చెప్పరే!

తెలుగు పలుకుబడిలోని ఒడుపులు, ఒయ్యారాలు సంతరించుకున్న పూర్వ, ఆధునిక కవుల రచనలు ఎన్నెన్నో! ఉదహరించటానికి ఈ సంక్షిప్త వ్యాసం చాలదు.

తెలుగులోని సరళమైన పదజాలం, పదలానిత్యం, సంగీతానికి సరిపోయి, గానానికి ఉపకరించింది. సుప్రసిద్ధ దాక్షిణాత్య వాగ్గేయకారులంతా తెలుగు భాషను అభిమానించి, అందులోనే కృతులూ, పదములూ అల్లుకున్నారు. రాయప్రోలు వారి మాటలలో -
"తన గీతి యరవజాతిని పాటకులనుగా దిద్ది వర్థిల్లి" నది తెలుగు వాణి. అన్నమయ్య, క్షేత్రయ్య, త్యాగయ్య, కంచెర్ల గోపన్న - మొదలైన వాగ్గేయ కారులు భక్తి పారవశ్యంతో పాడుకున్న కృతులు తెలుగులోనే!

అన్నమయ్య చిన్ననాటి నుండి ఆడిన మాట అమృతవాక్యంగా, పాడిన పాట పరమ కావ్యంగా - అమరిన వాడట!
"పచ్చ కప్పురమె నూరి పసిడి గిన్నెల నించి
తెచ్చి శిరసాదిగ ది నలది
అచ్చెరు పడి చూడ, అందరి కన్నుల కింపై
నిచ్చ మల్లె పూవువలె నిటు తానుండే స్వామి" ని
గూర్చి ఎన్ని పదములో అందముగా అల్లినాడు అన్నమయ్య.

ప్రతి పదంలోను రాగం, భావం, పొందికగా అమిరే విధంగా మువ్వ గోపాల పదాన్ని తెలుగు వాణికి అలంకారం చేశాడు క్షేత్రయ్య.

ఎన్నో భక్తిపరమైన కృతులను రచించి, దాక్షిణాత్య కర్నాటక సంగీతానికి తెలుగును సంగీత భాషగా తీర్చిదిద్దిన మహనీయుడు త్యాగయ్య. స్వర సాహిత్య సమ్మేళనం అద్భుతంగా సృష్టించిన వాడు ఆయన. తమిళదేశంలో పుట్టి పెరిగినా త్యాగయ్య తెలుగువాడు. ఆయన పలికినది తెలుగు పలుకు. "పలుకువేమి నా దైవమా రామ!" - అంటూ, అచ్చ తెలుగులో ఆత్మనివేదన చేసుకున్న త్యాగయ్య తెలుగుకు సంగీత సుభగత్వం సమకూర్చిన మహనీయుడు.

సీతమ్మకు చింతాకు పతకం చేయించి పెట్టటమే కాక సీతమ్మకనూ, రామయ్యనూ ప్రతి తెలుగింటా తన పదాలతో ప్రతిష్టింపచేసిన వాడు రామదాసుగా వాసికెక్కిన కంచెర్ల గోపన్న. భక్త్యావేశంతో గానంలో భావం రంజితం చేసి, మృదు మధురమైన పాటలు అల్లి పాడుకున్నాడు ఆయన. రామచంద్రుడితో మొరపెట్టుకున్నా, మాట్లాడినా, పోట్లాడినా, రామదాసు అచ్చ తెనుగునే వాడుకున్నాడు. అందుకే ఆయన పాట ప్రజా సంగీతమైంది.

"ఏ తీరుగ నను దయ చూచెదవో
ఇన వంశోత్తమ రామా!"
అనే పాట తెలుగు నాట ఇంటింటా తమ దైవమైన రామచంద్రుడిని ఆర్తితో అభయం అడిగే పాట.

తెలుగలో - కవులు, రాజకవులు, కవయిత్రులు, శతక కర్తలు, వాగ్గేయ కర్తలు, జానపద గేయకర్తలు, మరింకెంతోమంది తేనెలూరే తెలుగు పదాన్ని తమ సాహిత్యంలో సంగీతంలో - నిక్షిప్తం చేసి ధన్యులైనారు.

ఏ విధమైన సాంప్రదాయక సాధనం లేకుండానే నిసర్గ సుందరమైన పద్య రచనతో ఎంతో ఆత్మజ్ఞానముతో కూడిని లోక సత్యాలను చెప్పినవాడు యోగి వేమన. నిజమైన ప్రజా కవిత్వం వేమనది. ఆట వెలదిలో అపూర్వమైన సత్యాలను, నీతిని అందించిన తేట తెలుగు కవి ఆయన.
"ఉప్పు కప్పురంబు నొక్క పోలిక నుండు
జూడ జూడ రుచుల జాడ వేరు
పురషులందు పుణ్య పురుషులు వేరయా
విశ్వదాభిరామ వినుర వేమ!"

అనే పద్యం నోటినుండా చదువుకోని తెలుగు వాడు ఉండడేమో!

తెలుగు భాష కాలగమనంతో పాటు ఎన్నెన్నో మలుపులు తిరిగి వైవిధ్యం కల అనేక ప్రక్రియలలో ఆరితేరి, పరిపుష్టం అయింది. వచనం చలం వంటి వారి చేతులలో పడి పదును తేలింది. నవల, నాటకం, విమర్శ, కథ, వ్యాసం, జీవిత చరిత్ర, వచన కవితి - ఇలా అనేక రూపాలలో అనంతత్వాన్ని అందుకొనే విధంగా రూపు దిద్దుకున్నది తెలుగు వాణి.

అయితే, ఇంతటి భాషా సంపద ఉన్నా, ఆధునికుడైన ఆంధ్రుడికి ఎందుకో తన భాషపైన అంత చిన్న చూప! తెలుగు పాఠం చెప్పే పంతులుగారిపై విద్యార్థులకు గౌరవం ఉండదు! అన్నిటి కన్నా వింత - ఇద్దరు తెలుగువాళ్ళు ఎక్కడైనా కలిస్తే వాళ్ళు తెలుగులో సంభాషించుకోక పోవటం. ఏ ఇతర భాషలో నయినా మాట్లాడుతారు గాని, ఉగ్గుపాలతో నేర్చిన తెలుగు మాట్లాడటం ఏదో న్యూనతగా భావిస్తారు. ఈ భావన యువతరంలో ఎక్కువగా కనిపిస్తూ ఉంది. తెలుగు వారు తెలుగు మీరటం అంటే ఇదేనేమో!

మాతృభాష పట్ల గౌరవం పెంపొందించుకోవలసిన అవసరం నవతరానికి ఉంది. పంచదార చిలక వంటి తెలుగు పలుకు తెలుగు జిహ్వపై చిందులాడాలి.

పారిజాత పుష్పం వలె సౌందర్యాన్నీ సౌరభాన్నీ స్వారస్యంగా వెదజల్లడమే కాదు - నిజంగానే -

"పరిమళము చెడదు, వాడదు
పరువము తప్పదు - పరాగ భరితంబై
నిరతము జగదేక మనోహరమగు"
- నంది తిమ్మన

రచన: షణ్ముగన్

buttons=(Accept !) days=(0)

Our website uses cookies. Learn More
Accept !
To Top