సుదర్శన చక్రధర - Sudarsana Chakra
శ్రీ మహావిష్ణువుకు పంచాయుధాలు ఉంటాయి.  అవి:  సుదర్శన చక్రం, పాంచజన్య శంఖం, కౌమోదకీ గద, నందా ఖడ్గం, శార్ జ్గ ధనువు;  కింది శ్లోకం పంచాయుధ స్తోత్రంలో సుదర్శన స్తుత్యాత్మకం.

స్ఫురత్ సహస్రార శిఖాతి తీవ్రం
సుదర్శనం భాస్కర కోటి తుల్యం
సురద్విషాం ప్రాణవినాశి విష్ణో:
చక్రం సదాహం శరణం ప్రపద్యే!!
సౌరమాసం – కర్కాటాకంలో – చిత్తానక్షత్రాన సుదర్శన చక్రరాజం అవతరించినట్లు క్రింది తిరునక్షత్ర తనియన్ తెలియజేస్తుంది.

కర్కటే చిత్తనక్షత్రే జాతం సవాయ్ధేశ్వరం |
విష్ణో: సంకల్ప వృక్షంతం చక్రరాజ మహం భజే !!
ప్రపంచ సృష్టిస్థితిలయ కారకుడయిన భగవంతునికి కూడా ఆయుధాలు అవసరమా అనే సందేహం కొందరికి కలుగుతుంది.  యథార్థంగా ఆళ్వార్లు ఈ ఆయుధాలను భగవానుని భూషణాలుగా అభివర్ణించి స్తుతించారు. భగవానుడు జరిపే కార్యాలకు తన చిహ్నాలయిన ఆయుధాలను ఉపయోగిస్తుంటాడు. భగవానుని ఆయుధాలన్నింటిలోనూ చక్రత్తాళ్వార్ శక్తి వంతమైనది. పంచాయుధాలు నిత్యసూరి వర్గానికి చెందినవి. ఈ నిత్య సూరులు సర్వకాల సర్వవస్థలయందు భగవదాజ్ఞను ఆలోచనలను అమలుపరచటానికి సంసిద్ధమై ఉంటాయని విశ్వసింపబడుతోంది.

విష్ణుపురాణంలో, విష్ణువర్ణన సందర్భాన మాధవుని మేధస్సు గదారూపంగా ఉంటుందని చెప్పబడింది. పాంచజన్య శంఖం, శార్ జ్గధనువు భగవానుని జ్ఞానేంద్రియ ద్విభాగాలను సూచిస్తాయి.
మహాభారతంలో సుదర్శన చక్రధారి
విష్ణువు ధరించిన చక్రం వాయు వేగ మనోవేగాలతో పయనించే శక్తి కలిగి ఉంటుంది. ఆచ్యుతుని ప్రకాశవంతమైన ఖడ్గం పవిత్రమైన వివేకానికి చిహ్నం. దానిని భగవానుడు వరలో నుంచి తీసి భక్తుల అజ్ఞానపు తెరలను చీల్చటానికి ఉపయోగిస్తుంటాడు.

విష్ణువు ధరించే వైజయంతి అనే కంఠహారభూషణం అమూల్యమణిఖచితం. ముత్యం, పగడం, పచ్చ, నీలం, వజ్రం అనే ఆ మాలికలోనిమణులు ఆకాశం, గాలి, అగ్ని, భూమి, నీరు అనే మూలకాలని తెలీయజేస్తాయి. పంచాయుధాలను భగవానుడు భక్త సంరక్షణార్థం ఉపయోగిస్తుంటాడు.

పంచాయుధాలు భగవానునికి సౌందర్యాన్ని కూర్చుతాయని వేదాంతదేశికులవారు సెలవిచ్చారు. ఈ పంచాయుధాలు కూడా వైజయంతిలోని మణులవలె తత్త్వాన్ని తెలియచేసే చిహ్నాలని విజ్ఞులు చెప్పారు. చక్రం మనస్తత్వాత్మకం, శార్ జ్గం సాత్విక తామస రాజస గుణాలకు సంబంధించిన అహంకార తత్త్వాత్మకం, కౌమోదకీ బుద్ధితత్త్వాత్మకం, నందకం జ్ఞానతత్త్వాత్మకం, నిశిత పరశీలనవల్ల ఈ తత్త్వం క్రమేపీ అవగతమౌతుంది.

విష్ణు సహస్ర నామాలలో భగవానుడు ధరించే ఆయుధ సంబంధమైన నామాలు గోచరిస్తాయి.
 • 993వ నామం నుంచి 998వ నామం (విశిష్టాద్వైతభాష్యానుసారం) వరకు ఉన్నవి. భగవానుని ప్రధాన ఆయుధాలకు సంబంధించిన నామాలు.
 • 993వ నామం శంఖభృత్. శంఖాన్ని ధరించినవాడు శంఖభృత్. ఈ శంఖానికి పాంచజన్యం అని పేరు. ఇది అహంకార తత్త్వాన్ని తెలియజేస్తుంది. తామసం కూడా అహంకారమే. 
 • ఇది పంచభూతాల పుట్టువునకు తావు (పాంచజన్య).
 • 994వ నామం నందకీ. నందక అనే ఖడ్గాన్ని ధరించటంచేత భగవానుని నందకి అని పిలిచారు.
 • 995వ నామం చక్రి. చక్రం ధరించినవాడు కనుక చక్రి.
 • 996వ నామ శర్ జ్గధన్వ. శార్ జ్గము అనే ధనువుకలవాడు.
 • 998వ నామ రథాంగపాణి. భగవానుడు ఒకానొక సందర్భాన రథచక్రాన్ని ధరించాడు. రథాంగం అంటే చక్రం అని కూడా అర్థం ఉంది. 
అయితే చక్రాన్ని ధరించినవాడు చక్రి కాగా రథాంగాన్ని (రథచక్రాన్ని) పాణియందు కలవాడు రథాంగపాణి, భారత యుద్ధంలో ఎలాంటి ఆయుధాన్ని ధరించనని కృష్ణుడు అర్జునునకు చెప్పి ఉంటాడు. అయితే యుద్ధం 9వ రోజున రథచక్రాన్ని (రథాంగాన్ని) పాణియందు ధరించి అర్జునుణ్ణి ప్రేరేపించి ఉత్తేజితుడిని చేసేందుకు భీష్మసంహారానికి సంసిద్ధుడవుతాడు. ఆ దృశ్యం అపంపశయ్యపై ఉన్న అంతిమ ఘడియల్లో కూడా మెదలడంచేత భీష్ముడు ఆ నామాన్ని విష్ణు సహసంలో చేర్చి ఉంటాడనుకోవచ్చు.

విష్ణుసహస్రనామలలో “సర్వప్రహరణాయుధ” అనే నామం ఉంది. ‘సర్వేషాం ప్రహరణాని ఆయుధాని యస్యస: సర్వ ప్రహరణాయుధ:” అంటే తననే రక్షకంగా ఆశ్రయించినవారికి సకల అనిష్టాలను సమూలంగా తొలగించే అనంతాలై, అపార సామర్థ్యంకలవై, తనకు తగినవై, ‘అనేక ఆభరణాలా? ఇవి?” అని సందేహించినట్లు, సదా సర్వత్ర సర్వప్రకారములచేత, అశ్రయించిన వారలను రక్షించటం అనే దీర్ఘ సత్రయాగాన దీక్షితాలై, సర్వైశ్వర్య భారాలను వహించి ఉండే దివ్యాయుధాలు కలవాడని అర్థం.

పూర్వపుదినాలలో విష్ణుసహస్రనామంతోపాటు పంచాయుధస్తోత్రం కూడా పారాయణం చేసేవారు. పంచాయుధ స్తోత్రాన్ని, ఎవరైతే పఠిస్తారో,  వారు పాపభయవిముక్తులవుతారని ఫలశ్రుతిలో చెప్పబడింది. అరణ్యంలో, యుద్ధంలో, అపాయంలో ఉన్న సమయాన పంచాయుధస్తోత్రం జపిస్తే వారికి భగవానుడు  పూర్తి రక్షణ కలిగిస్తాడని నమ్మకం.

“రామానుజనూట్రందాది” అనే ద్రవిడప్రబంధం లోని 33వ పాశురంలో మహావిష్ణువు పంచాయుధాలు ప్రపంచాన్ని రక్షించేదుకు శ్రీరామానుజులుగా అవతరించాయని దాని కర్త తిరువరంగత్తముదనార్ గారు చెప్పరు.  స్వామిదేశికుల  వారు కూడా “యతిరాజసప్తతి” లో ప్రభువైన విష్ణువు యొక్క పంచాయుధాలు రామానుజులుగా అవతరించాయన్నారు.

పంచాయుధాల బొమ్మలను చిత్రించిన దండను పసిపిల్లల గొంతులో (మెడలో) రక్షగా వేసే ఆచారం తమిళనాడులో ఉండేది. ఈ ఆచారాన్ని తమిళుల పూర్వ రచనలు కూడా ఉదహరిస్తున్నాయి.

ఉదాహరణలు:- 
 • కంబరామాయణంలో ఈ విషయం తెలియచేయబడింది. 
 • పంచాయుధ తాళీ బాలరక్ష. 
 • అయితే పంచాయుధ స్తోత్రం పెద్దవారిని రక్షిస్తుందని భావించవచ్చు. 
 • అయితే దీనిని అన్యధా అపార్థం చేసుకోరాదు.
పెరియాళ్వారు తిరుమొళి పాశ్రురంలో (1-5-9) మహావిష్ణువు కృష్ణావతారంలో ఉన్నప్పుడు గొంతులో పంచాయుధ చిత్రిత హారం వేసుకొని ఉన్నట్లు వర్ణించబడటం ఈ సందర్భాన స్మరణీయం.

పంచాయుధాలు – పుట్టుపూర్వోత్తరాలు
పాంచజన్యం: ఓ బలవంతుడయిన అసురుడు శంఖంలో నివసిస్తుంటాడు. అందువల్ల అతనిని పంచజనుడు అని పిలుస్తారు. సాందీపుని ఆశ్రమంలో శ్రీకృష్ణుడు, బలభద్రుడు విద్యాభ్యాసం చేస్తుంటారు. వారి విద్యాభ్యాసం పూర్తి అవుతుంది. ఆ సంధర్భాన పంచజనరాక్షసుడు ప్రభాత తీర్థం దగ్గర స్నానం చేస్తున్న సాందీపుని పుత్రుని ఎత్తుకొని వెళతాడు. అసురుడు ఆ బాలుని తాను నివసించే శంఖంలో బంధిస్తాడు. తన పుత్రుని గురుదక్షిణగా తెమ్మని సాందీపుడు బలరామకృష్ణులను కోరతాడు. వారు నదీతీరానికి వెళ్ళీ వరుణుని ప్రార్థిస్తారు. వరుణుడు బలరామకృష్ణులకు ప్రత్యక్షమౌతాడు. వరుణుని సాయంతో బలరామకృష్ణులు పంచజనుని చంపి దక్షిణగా గురుపుత్రుని సాందీపునికి సమర్పిస్తారు.  అసురుడు నివసించిన శంఖాన్ని కృష్ణుడు జ్ఞాపికగా గ్రహిస్తాడు.  పంచజన సబంధితమైన శంఖం కాబట్టి దానికి పాచజన్య అనే పేరు వ్యవహారంలో నిలిచింది (భాగవతం – దశమస్కందం) .

గోదాదేవి “నాచ్చియార్ తిరుమొళి” లోని పదిపాశురాలలో శంఖ సౌందర్యాన్ని వర్ణించింది. ధ్రువుని చెక్కిలిని భగవానుడు తన శంఖంతో స్పృశించటం విష్ణుపురాణంలో చెప్పబడింది. శ్రీ కౄష్ణుని సుందర మృదు మధురాధర స్పర్శను అనుభవించిన శంఖానిదే మహద్భాగ్యమని – ఎందరో భాగవతులు మధురభక్తి తన్మయులై తమ కవితల్లో పాంచజన్యాన్ని అభివర్ణించారు.

కౌమోదకి: శ్రీకృష్ణుని గదను కౌమోదకి అంటారు.  ఈ ఆయుధం కృష్ణునికి వరుణునిచే ఇవ్వబైంది. (భారతం – ఆదిప్ర్వం – 224 అధ్యా – 23 శ్లోకం). ఈ గద ఉరుము మెరుపులను పుట్టించి ఏ దైత్యులనైనా చంపే సామర్థ్యం కలిగి ఉంటుంది.

నందక: ఒకానొక సందర్భాన బ్రహ్మదేవుడు స్వర్గంగా తీరాన యజ్ఞం చేస్తుంటాడు. బ్రహ్మ ద్యానాని భగ్నం చేసేందుకు లోహాసురుడు అనేవాడు వస్తుంటాడు. వెంటనే బ్రహ్మ ధ్యానం నుంచి ఒక పురుషుడు వస్తాడు. ఆ పురుషునికి దేవత ల ఆశీస్సులు లభిస్తాయి. అతడు వెంటనే నందక అనే కత్తిగా మారిపొతాడు. నందకం అంటే ఆనందం కలిగించేది అని అర్థం. దేవతలకు ఆనందం కలిగించినందులకు ఆ కత్తి నందక అనే పేరు కలిగింది.  దేవతల కోరికమేరకు నందకం ఖడ్గం విష్ణువుచే గ్రహించబడుతుంది. లోహాసురుడు నల్లని ముఖంతో వెయ్యి చేతులతో ఉంటాడు. అతడు తన చేతులతో దేవతలను గుంపు కూడనీయక చెల్లాచెదురు చేస్తుంటాడు. మహావిష్ణువు లోహాసురుని సహస్ర హస్తాలను నరికివేసే ప్రయత్నం చేస్తాడు. నందకం తగలగానే లోహాసురుని చేతులు లోహంగా మారిపోతాయి. అది గమనించి విష్ణువు అసురుని సంహరిస్తాడు. అప్పుడు నందకం స్వచ్చమైన ఆయుధంగా అవతరించెనని పురాణగాథ.

శార్ జ్గము: శార్ జ్గము విష్ణువుధనువు. దీనికి సంబంధించిన వివరాలు మహాభారతంలో ఉన్నాయి. కౌరవసభలో కృష్ణుడు విశ్వరూపాన్ని ప్రదర్శించినపుడు, ఒక హస్తంలో శార్ జ ధనువు  కలిగి ఉంటాడు.  (ఉద్యోగపర్వం – 131 ఆధ్యాయం – 10 శ్లోకం). కృష్ణుని శార్ జ్గం ఇంద్రుని విజయధనువుతో సమానమైనది అని కూడా మహాభారతంలో చెప్పబడింది. (ఉద్యోగపర్వం – 158 ఆధ్యా – 5 శ్లో).  శార్ జ్గం బ్రహ్మచే నిర్మించబడింది. (అనుశాసనిక పర్వం 141 ఆధ్యాయం).

సుదర్శనం: దీని పుట్టుకను గురించి మూడుకథలున్నాయి.

1. సూర్యభగవానుడు విశ్వకర్మపుత్రిక అయిన సంజ్ఞను పరిణయమాడతాడు. సూర్యతేజాన్ని భరించలేనని సన తన తండ్రి విశ్వర్కర్మతో చెబుతుంది. అప్పుడు విశ్వకర్మ ఒక యంత్రం ద్వారా సూర్యతేజస్సును తగ్గిస్తాడు. యంత్రంలో సూర్యుని పెట్టి త్రిప్పిన సందర్భాన రాలిన రజం వల్ల విశ్వకర్మ చక్రాన్ని తయారు చేస్తాడు. ఇది విష్ణువుకు ఇవ్వబడుతుంది. (విష్ణుపురాణం – 3వ ఆంశం – అధ్యాం 2).

2. ఇంద్రుడు వర్షాన్ని వర్షించడంవల్ల ఖాండవదహనాన్ని అడ్డుకుంటాడు. ఆ సందర్భాన సుదర్శనాన్ని, గాంఢీవాన్ని కృష్ణార్జులకు అగ్నిదేవుడు ప్రసాదిస్తాడు. అందువల్ల సుదర్శనానికి అగ్నేయం అని కూడా పేరు. ఖాండవదహనం పూర్తయ్యాక ఈ ఆయుధాలు తిరిగిగ్నికి ఇవ్వబడతాయని కూడ ఒకచోట వ్రాయబడింది.

3. సుదర్శనాయుధాన్ని శివుడు కృష్ణునికి ఇచ్చినట్లు కూడ మహాభారతంలో ఉంది. నీటిలో నివసించే ఒకానొక దైత్యుని సమ్హరించేందుకు గాను చక్రన్ని శివుడు విష్ణువుకు ఇస్తాడు. దానిని శివుడు సుదర్శనచక్రం అని పిలుస్తాడు.

సుదర్శనానికి సంబంధించి వివిధ పురాణలలో చాలా గాథలున్నాయి. కృష్ణావతారానికి పూర్వమే సుదర్శనం విష్ణువు దగ్గర ఉంది. విష్ణువు దుష్టసంహారణార్థం సుదర్శనాన్ని కృష్ణావతారానికి ముందు కూడా ప్రయోగించినట్లు పురాణగాథల వల్ల తెలుస్తోంది.

సుదర్శనశక్తి అద్భుతమైంది. ఇది శత్రువులను అగ్నివలె దహిస్తుంది. శత్రుసంహారం కోసం విష్ణువు ఎప్పుడైతే సుదర్శనాన్ని ప్రయోగిస్తాడో, అప్పుడు అది సూర్య తేజో విరాజితమవుతుంది. శత్రుసంహారం చేసి తిరిగి భగవానుని చేరుకుంటుంది.
మహాభారతం ఆదిపర్వం 16వ ఆధ్యాయంలో సుదర్శన చక్రాన్ని గురించిన వర్ణన ఉంది.
శ్రీవైష్ణవ సంప్రదాయంవారు సుదర్శనాన్ని చక్రత్తాళ్వార్ అని కూడా పిలుస్తారు. బ్రహ్మోత్సవాల ముగింపునాడ్ జరిగే చక్రస్నానం/అవబృదస్నానం చక్రత్తాళ్వార్ కే చేస్తారు.నిగమాంతమహాదేశికులవారు సుదర్శనం గొప్పతననాన్ని చాటి చెప్పారు.

తమిళనాడు – చెంగల్పట్టు జిల్లాలోని తిరుపుళ్కుషి గ్రామంలో ఒకానొకప్పుడు ప్రజలు తీవ్రజ్వరంతో బాధపడుతుంటారు.  ఆ సందర్భాననిగమాతదేశికులవారు సుదర్శనాన్ని ఎంతో విశ్వాసంతో ప్రార్థిస్తారు.  తను రచించిన రమణీయమైన సుదర్శనాష్టకాన్ని పఠిస్తారు.  అప్పుడు ఆ గ్రామస్తులు జ్వరపీడ నివృత్తులై ఆరోగ్యవంతులవుతారు.

చక్రత్తాళ్వార్లు సర్వకాల సర్వావస్థలయందు కూడ  భగవానుని సన్నిధానంలోనే ఉంటారు.  పెరుమాళ్ళు హిరణ్యాక్షుని సంహరించిన సందర్భంలోచక్రత్తాళ్వార్లు వరహాస్వామివారి కోరలరూపంలో ఉన్నారని విశసించబడుతోంది. హిరణ్యాక్షుని చీల్చిన నరసింహుని పదివేళ్ళకు ఉండే నఖాలరూపంలో సుదర్శనుడు ఉన్నాడంటారు.

పరశురామావతారంలో సుదర్శనం పరశువుగా మారినట్లు చెప్తారు. రామావతారంలో సుదర్శనం ఒక జ్యోతి ఆకారంలో రాముని అంటిపెట్టుకొని ఉండేదట. రాముని విల్లు అంబులుగా సుదర్శనం అవతరించిందని కూడా చెప్తారు. వామనావతారలో సైతం సుదర్శనం పెరుమాళ్ళుకు సహాయంగా ఉందంటారు. దీని ఆధారంగా పెరియాళ్వార్లు రచించిన ఓ పాశురంలో కమండలం ద్వారా నీరు రాకుండా తేనెటీగ రూపంలో అడ్డూడిన శుక్రుని, సుదర్శనుడు దర్భరూపంలో ఉండి తొలగించినట్లు చెప్పబడింది. ఒకానొక సందర్భాన శివపార్వతులు కైలాసంలో రత్న సింహాసనాసీనులయి ఉంటారు. పార్వతి ఏమంత్రాన్ని జపిస్తే కార్యసిద్ధి కలుగుతుందని శివుని ప్రశ్నిస్తుంది. అప్పుడు పరమశివుడు పార్వతికి ప్రేమతో సుదర్శన మహామంత్రానికి అంతటిశక్తిని కలిగి ఉందని తెలియజేస్తాడు.

సుదర్శనం మహావిష్ణువునకు అయుధంకాగా సుదర్శనానికి పదునారు (16) ఆయుధాలు ఉండటం విశేషం.  నిగమాంతదేశికులవారు సుదర్శనాయుధ స్తోత్రాలలో ఆ 16 ఆయుధాలను అభివర్ణించారు. ఆ స్తోత్రాన్ని పారాయణం చేయటం వల్ల సర్వ భయాలు తొలిగిపోతాయని నమ్మకం.

సుదర్శనం ధరించే 16 ఆయుధాల వివరాలు

కుడివైపు పైనుంచి వరుసగా చక్ర, పరశు, కుంట, దండ, అంకుశ, అగ్ని, నిస్త్రింశ, శక్తి; కాగా వామహస్తాలలో పైనుంచి క్రమంగా పాంచజన్య, శార్ జ్గ, పాశ, సీర, వజ్ర గధ, ముసల, త్రిశూల  ఆయుధాలు. శత్రుశంహారం కోసం కృష్ణుడు ప్రయోగించిన సుదర్శనాయుధానికి సంబంధించిన ఆసక్తికరమైన కథలు చాలా ఉన్నాయి.

గజేంద్రమోక్షంలో మకరసంహారం; శిశుపాలవధ, జయద్రధ సంహారం కోసం కృష్ణుడు సుదర్శనాన్ని సూర్యునికి అడ్డుపెట్టిన సందర్భం, అంబరీషుని దగ్గర అహం ప్రదర్శించిన దుర్వాసుని తరిమిన సందర్భం, పౌండ్రకవాసుదేవ సంహారం మొదలయిన ఘట్టాలలో సుదర్శన ప్రయోగం జరుగుతుంది. ఈ గాథలన్నీ సుదర్శనం గొప్పతనాన్ని వెల్లడిస్తాయి.

తమిళనాడు – త్రిప్లికేన్ (తిరువళిక్కేణి) చెన్నైలోని పార్థసారధి స్వామి వారి దేవస్థానంలో జరిగే బ్రహ్మోత్సవ సందర్భాన  వర్దరాజ పెరుమాళ్ళు మకర సంహారార్థం సుదర్శనాన్ని ప్రయోగించే భంగిమ నేటికీ బ్రహ్మోత్సవాల సందర్భాన ప్రదర్శితమౌతుంది.

కూరనారాయణా జీయర్ స్వామి వారు ఓ గొప్ప సుదర్శన భక్తుడు. వారు ప్రసిద్ధమైన సుదర్శనశతకాన్ని సంస్కృతంలో రచించారు. శ్రీరంగంలో తిరువాయ్ మొళిని పాడే ఓ వ్యక్తి ఒకానొకప్పుడు ‘ కంఠమాల ‘ అనే జబ్బుతో చాల బాధపడుతుంటాడు. ఆయన సుదర్శనాళ్వారును అతడి జబ్బును నయం చేయమని ప్రాథిస్తారు. ఆ సందర్భాననే కూరనారాయన స్వామి వారు సుదర్శన శతకాన్ని రచించాడని చెబుతారు.

శ్రీనాథకవిసార్వభౌముడు భీమేశ్వరపురాణంలో పంచాయుధాలను గొప్పగా వర్ణించారు.

నరకాసుర సంహార సందర్భాన నరకుని చేతులు సుదర్శనం బంధిస్తుంది. బాణాసురవధలో కృష్ణుడు సుదర్శనాన్ని ప్రయోగిస్తాడు. తిరువయ్ మోళిలోని (4-1-8) పాశురంలో పెరియాళ్వారు జయద్రధ సంహారంలో సుదర్శనపాత్రను అభివర్ణించారు.

కొన్ని దేవస్థానాలలో ప్రత్యేకించి సుదర్శన సన్నిధులు కూడా ఉన్నాయి. తిరుక్కోవలూరు, తిరుమహీంద్రపురం, తిరుక్కుడందై (కుంభకోణం), కందియార్, శ్రీవిల్లిపుత్తూర్, వానమామలై, ఆళ్వార్ తిరునగరి, తిరుక్కురునంగుడి, శ్రీరంగము, వరదరాజపెరుమాళ్ కోయిల్, కాంచీపురం తిరుమోగూర్ లలోని దేవస్థానాలలో సుదర్శన సన్నిధులు ఉన్నాయి.

చక్రం ప్రగతికి చిహ్నం, ప్రగతికి సాధనం. ప్రపంచం సర్వత్రా చక్రమే కనిపిస్తుంది మనకు. ఈ విషయాన్ని ఏనాడో మన పూర్వులు గ్రహించారు. వారు “తతశ్చక్ర మయం సర్వం జగత్ స్థావర గంగమం” అని తెలియ చేశారు. సర్వ ప్రపంచమంతా చక్రమయమే. అట్టి చక్రం మహావిష్ణుస్వరూపం. ఈ అంశాన్ని కూడా మనపెద్దలు ఇలా తెలిపారు.

చక్రాంభోజే సమాసీనం
చక్రాధ్యాయుధ ధారిణం
చక్రరూపం మహావిష్ణుం
చక్ర్ మంత్రేణ చింతయేత్;
-సౌలభ్యచూడామణీస్తోత్రం

సుదర్శనవాజ్ఞ్మయం చాల ఉంది. అయితే అది చెల్లాచెదురుగా మరుగున ఉంది. నేడున్నా కొందరు మహనీయులు సుదర్శనోపాసకులు ఉన్నారు. వారి దగ్గర సుదర్శన వాజ్ఞ్మయం లభిస్తుంది. తెలియవచ్చినంతలో సుదర్శన వాజ్ఞ్మయాన్ని నామమాత్రంగా ప్రస్తావించు కుందాం. “సుదర్శనవాద:” అనే గ్రంథాన్ని వేదాంతదేశిక విహారసభా, పరకాలమఠం – మైసూరువారు ప్రచురించారు.

చెన్నైలోని అడయార్ లైబ్రరీ 2 గ్రంథలిపిలో “సుదర్శనమీమాంస” అనే బృహత్ గ్రంథం ఉంది. సుదర్శనోపాసకులయిన కూరనారాయణజీయరుస్వామివారు “సుదర్శన శతకాన్ని” 101 వృథ్వీవృత్తాలలో సంస్కృతంలో రచించారు.

ఈ శతకంలో సుదర్శనజ్వాల 24, నేమి 14, ఆర్ 12, నాభి 11, అక్షం 13, పురుష 26  మొత్తం 100 శ్లోకాలు ఉన్నాయి. బీజక్షర సంపుటితమైన ఈ సోత్రశతకానికి సంస్కృతాంధ్రాలలో  వ్యాఖ్యానాలు వెలూడ్డాయి.

ఉభయ వేదాంత సభ వారు శ్రీసుదర్శన శతకాన్ని వెలువరించారు.  దానితోపాటు కొన్ని సుదర్శన స్తోత్రాలు కూడా చేర్చారు. వేదాంతదేశికులవారు కూడా ఒక సుదర్శనశతకం రచించినట్లు తెలుస్తుంది. దానికి కూడా వ్యాఖ్య రచించబడిందట.  దానిని ఖగేంద్రాచార్యగారి సంపాదకత్వాన హజారిమల్ సోమాని స్మారకట్రస్ట్ – బొంబాయివారు 1967 దేవనాగరిలో ప్రచురించినట్లు సమాచారం ఉంది. కుంభకోణంలోని గోపాలవిలాస ప్రెస్ లో కూడా భారద్వాజ గోపాలచార్య, శ్రీనివాసగోపాల తాతాహార్య వివరణ వ్యాఖ్యానాలతో వేదాంత దేశికులవారి సుదర్శనశతకం ప్రచురించినట్లు తెలుస్తోంది.  సుదర్శనాష్టోత్తర శతనామస్తోత్రాలు రెండు లభిస్తున్నాయి.  సుదర్శన సహస్రనామ స్తోత్రం,  హేతిపుంగవస్తవ:, సుదర్శనషట్కం, సుదర్శనాష్టకం, సుదర్శనకవచం, షోడశాయుధస్తోత్రం,  అంబరీషకృత సుదర్శన స్తోత్రం, సౌలభ్యచూడామణిస్తోత్రం, చక్రరాజమంగళం, అపరాధస్తవం మొదలయినవి సుదర్శన స్తోత్రవాజ్ఞ్మయానికి సంబంధించిన రచనలు. ఇవికాక ఇంకా ఉన్నాయి.

సుదర్శన షడక్షరమంత్రం, సుదర్శనా ష్టాక్షరీమంత్రం,  సుదర్శన నారసిమ్హ మంత్రం, సుదర్శన నరసింహ మంత్రం (మరోపత్థతి), జ్వాలా సుదర్శనం, ఆత్మరక్షాకర సుదర్శనం, పరవిద్యాభేదన సుదర్శనం, అస్త్రమంత్రసుదర్శనం, సుదర్శన హృన్మంత్రం, ఆకర్షణ సుదర్శనం, సుదర్శానమాలామంత్రం, మొదలయినవి మంత్ర శాస్త్ర సంబంధితాలు. సాధకులు నియమనిష్ఠలతో ఆయా మంత్రాలను అనుష్టిస్తే, ఆయా ఫలితాలు ఉంటాయని పరంపర విశ్వాసం. ఇక సుదర్శన యంత్రమును బహువిధాలుగా వినియోగిస్తుంటారు. దాని ఉపయోగాలు చాలా ఉన్నాయి.

జ్యోతిశ్శాస్త్రరీత్యా గ్రహపీడ కలిగిన వారు ఆయా గ్రహాలను పూజించి నవగ్రహాది జపాలను చేస్తుండటం అద్వైతాది మతాలలో కనిపిస్తుంది. అయితే విశిష్టాద్వైతులు మాత్రం ఆయా బాధల నివారణార్థం సౌలభ్య చూడామణి స్తోత్రం, సుదర్శన కవచం, సుదర్శనశతకం, సుదర్శన నారసింహం, సుదర్శనాష్టోత్తర శతనామస్తోత్రాలను జపించటం, పారాయణం చేయటం సంప్రదాయంగా వస్తోంది.  వైష్ణవ సంప్రదాయ పూర్వ వర్తమాన పంచాంగాలను పరశీలిస్తే కూడా ఈ విషయం స్పష్టమౌతుంది. అందుకే కేవల విశిష్టాద్వైత సంప్రదాయ దేవాలయ పరిధులలో నవగ్రహాది ప్రతిష్టలు కానరావు, సుదర్శన ప్రతిష్టలు దర్శనమిస్తాయి. సుదర్శన విగ్రహాలకు ముందువైపు సుదర్శనుడు దర్శనమివ్వగా వెనుకవైపు నారసింహుడు దర్శనమిస్తాడు.

దుర్మాంత్రికుల బెడదను నివారించేందుకు శ్రీరంగ క్షేత్రంలో శీసుదర్శన నారసింహమూర్తి ప్రష్టించబడిందని పెద్దలమాట. నేడు కూడా శత్రుభయ నివారణార్థం సుదర్శన నారసింహ మంత్రాన్ని పారాయణం చేయటం ఉంది. పరవిద్యాభేదనం, వశీకరణం, ఆకర్షణం, సంమోహనం అనే పేరుతో లభిస్తున్న వివిధ సుదర్శన మంత్రాల ప్రయోజనం, వాటి పేరే సూచిస్తున్నాయని వేరుగా చెప్పనవసరం లేదు. చక్రాంకనం కానివాడు శ్రీవైష్ణవుడే కాదు అని విశిష్టాద్వైత సంప్రదాయ గ్రంథాలు తెలుపుతున్నాయి.

సర్వపీడానివారణకూ,సర్వఫలప్రదాలకూ సుదర్శన చక్రరాజ మహామంత్రం మహోన్నతమైనదని మహనీయుల మాట.

మంత్రశాస్త్రంలో చక్రషట్కం (ఆరుచక్రాలు) చెప్పబడింది. అవి కాలచక్రం, పురుషచక్రం, ప్రకృతిచక్రం , మహాచ్చక్రం, అహంకార చక్రం జగచ్చక్రం.

ఏదైనా బాగా జరుగుబాటు వుండె చక్రం బాగా తిరుగుతూ ఉందని అంటుంటాం. జరుగుబాటు లేకుంటె చక్రం ఆగి పోయిందని అంటుంటాం. అంటే మనకు తెలియకనే మన జీవితచక్రంలో చక్రం చోటు చేసుకుంది.

భీజాక్షరసంపుటితమైన మహా సుదర్శన మంత్రాన్ని నియమనిష్ఠలతో గురుముఖత: అభ్యసించి జపిద్దాము, సుదర్శనమంత్రాని పూజిద్దాము. “సర్వ ధర్మే నిధనం శ్రేయ: పరధర్మోభయావహా:” అనే గీతాచార్యుని ఉందేశం అనుష్ఠేయం కదా!

మంగళం చక్రరాజాయ
మహనీయ గుణాబ్దయే
పద్మనాభ కరాంభోజ
పరిస్ఖారాయ మంగళం||
జాలాజ్వాలా విభూషాయ
సహస్రాదిత్య తేజసే
సర్వాఘ హరినే విష్ణో:
చక్రరాజాయ మంగళం||

శాంతాకారం భుజగశయనం – పద్మనాభాం సురేశం
విశ్వాకారం గగనసదృశం – మేఘవర్ణం శుభాంగం,
లక్ష్మీకాంతం కమలనయనం – యోగిహృద్ద్యానగమ్యం
వందే విష్ణుం భవభయహారం – సర్వలోకైకనాథం ||


రచన: నాగవరపు రవీంద్ర
"తెలుగు-భారత్" జాలిక లాభాపేక్ష లేకుండా నడపబడుతున్నది. మన సంస్కృతీ, సంప్రదాయాలను మరింత లోతుగా విశ్లేషించి ప్రపంచానికి తెలియచేస్తూ మన ధర్మాన్ని కాపాడేందుకు మీ వంతు సహాయం చేయండి.
Supporting From Bharat:#buttons=(Accept !) #days=(20)

Our website uses cookiesLearn..
Accept !
To Top