దేవుడు ఒక్కడే, అయిన బహు దైవారాధన ఏల? - Hinduvulu Devudu okkade Antunnaru, Mari Bahudaivaaradha Yela

దేవుడు ఒక్కడే, అయిన బహు దైవారాధన ఏల?  - Hinduvulu Devudu okkade Antunnaru, Mari Bahudaivaaradha Yela
 దేవుడొక్కడే అని హిందువుల నమ్మకమయితే వారు శివుడు, విష్ణువు, దేవి మొదలైన అనేకమంది దేవుళ్ళను ఎందుకు పూజిస్తారు?  దీనివల్ల దేవుళ్ళు అనేకులని అంగీకరించినట్లు కాదా? 

హిందూధర్మం అనేక దేవతలను అంగీకరించినట్లు కన్సిస్తున్నా, దేవుడు లేక పరమాత్మ ఒక్కడే. ఇంద్రుడు మొదలైన దేవతలు మునుపటి సృష్టికాలంలో మనవంటి జీవులే. వీరు తమ అపూర్వ పుణ్యఫలంగా ఈ సృష్టిలో ఇంద్రుడు, వరుణుడు మొదలైన పదవులను సంపాదించారు.

సృష్టిలోని కొన్ని ప్రకృతిశక్తులను వీరు నియంత్రిస్తారు. వీరు మన ప్రభుత్వంలోని అధికారుల వంటివారు. తమ పుణ్యఫలం క్షీణించిన తరువాత వీరు తమ పదవులను కోల్పోతారు. తిరిగి వీరు ముక్తికోసం ప్రయత్నించాలి.

      ఇక బ్రహ్మ, విష్ణు, శివుల విషయం. వీరు ముగ్గురూ మూడు వేర్వేరు దేవతలు కారు. సృష్టి-స్థితి-లయాలు, చేయడానికి పూనుకున్న ఒకే పరమాత్మ యొక్క మూడు వేర్వేరు రూపాలు. ఏ విధంగా ఒకే వ్యక్తి ఇంట్లో తండ్రిగాను, ఆఫీసులో అధికారిగాను, అంగడిలో వినియోగదారుడిగా ఉంటాడో అలాగే దేవుడు కార్యానుసారంగా వివిధనామ రూపాలతో కనిపిస్తాడు.
ఈ దేవతలకుండే సృష్టి మొదలైన శక్తులను కూడ స్త్రీరూపాలుగా ఊహించి లక్ష్మి, సరస్వతి, పార్వతి మొదలైన పేర్లతో పిలుస్తారు. అగ్ని - దాని దహించే శక్తి విధంగా విడదీయరాని సంబంధాన్ని కలిగి ఉంటాయో, ఈ దేవీదేవతలు కూడా అలా అవినాభావసంబంధం కలిగి ఉంటారు.  ఈ  దేవతలందరూ కల్పించబడిన వాళ్ళని అనుకోకూడదు.  పంచదారతో చేయబడే బొమ్మలన్నీ పంచదార అయినట్లే ఈ దేవతారూపాలన్నీ ఒకే పరమాత్ముని వివిధ రూపాలు. ఊహాతీతుడైన పరమాత్మను నేరుగా ధ్యానించటం సామాన్యులకు అసాధ్యం.

భగవదనుగ్రహంవల్ల, ఆ పరమాత్మను సామాన్యుల బుద్దిశక్తికి అందుబాటులోకి తేవటం కోసం, ఋషులు వివిధ రూపాలనూ, నామాలనూ తమ తపశ్మక్తితో దర్శించి, మనకందించారు. కనుక ఈ దేవతల ధ్యానం వల్ల మనకు లభించేది ఆ పరమాత్ముని సాక్షాత్కారమే.

ఇక కొన్ని పురాణాలలో మనకు కన్పించే పరస్పర విరోధభావాలను గురించి ఒకటి రెండు మాటలు చెప్పుకుందాం. వందల కొలది సంవత్సరాల నుండి ప్రచారంలో ఉన్న ఈ పురాణాల మూలరూపం ఏదో కాలక్రమంగా వాటిలో చేర్చబడిన భాగాలు ఏవో విడదీసి చెప్పడం కష్టం.

శైవుల, వైష్ణవుల, శాక్తేయుల మధ్య అభిప్రాయ భేదాలు చెలరేగిన కాలంలో తమ మతాల శ్రేష్టత్వాన్ని నిరూపించటం కోసం ఆయా మతాల అనుయాయులు తమకు ఇష్టం వచ్చినట్లు వ్రాసి ఈ పురాణాలకు జోడించి ఉండవచ్చునని చెప్పుకోవడం సబబు. కనుక పాఠకులు ఈ పురాణాల ముఖ్యోద్దేశాన్ని మనస్సులో పెట్టుకొని, వాటి స్ఫూర్తికి వ్యతిరేకంగా యుక్తిహీనంగా కనబడే వ్రాతలను లక్షించకూడదు.

సంకలనం: కోటి మాధవ్ బాలు చౌదరి
ముద్రణ: రామకృష్ణ మఠం

buttons=(Accept !) days=(0)

Our website uses cookies. Learn More
Accept !
To Top