యాజ్ఞవల్క్యుడు - Yagnavalyudu

వేదఋషులలో ప్రముఖమైన స్థానాన్ని పొందినవాడు యాజ్ఞవల్క్యుడు. మహాయోగి, బ్రహ్మవేత్త, మంత్రద్రష్ట అయిన యాజ్ఞవల్క్యుని స్మరించినంతనే ఈ ప్రపంచమంతా మహాయజ్ఞంగా గోచరిస్తుంది. ఆయన వాక్కు వేదవాక్కు అతినిగూఢమైన ఆధ్యాత్మిక రహస్యాలను అవలీలగా చెప్పగల ప్రాజ్ఞుడు యాజ్ఞవల్క్యుడు.

గంగానదీ తీరంలో, చమత్కారపురంలో సకల సద్గుణ సంపన్నుడైన యజ్ఞవల్క్యుడనే బ్రాహ్మణుని కుమారుడే యాజ్ఞవల్క్యుడు. యజ్ఞవల్క్యుడు, యజ్ఞం, వేదాలను సలక్షణంగా వచించేవాడు కనుక యజ్ఞవల్క్యుడని, నిరంతరం అన్న ప్రదాత అవడం చేత వాజసని అని, బ్రహ్మం, వేదం శిష్యులకు బోధించుటే వృత్తిగా గలవాడు కనుక బ్రహ్మరాతుడని వివిధనామాలను కలిగి ఉండేవాడు.

అతని భార్య సునంద, వారికి కార్తీక శుద్ధ ద్వాదశి, భానువారం, ధనుర్లగ్నంలో బ్రహ్మదేవుడే జన్మించాడా అన్నట్లుగా ఒక కుమారుడు కలిగాడు. అతనికి యాజ్ఞవల్క్యుడని నామకరణం చేశారు. తండ్రిని అనుసరించి వాజసని, బ్రహ్మరాతుడని, దేవీ వరప్రసాదియగుటచే దేవరాతుడనే వివిధ నామాలను కూడా ఇతను పొందాడు. అయిదో ఏట అక్షరాభ్యాసం, ఎనిమిదో ఏట ఉపనయనం జరిగిన పిమ్మట విద్య నేర్చుకునేందుకు బయలు దేరి వెళ్ళాడు. ఋగ్వేదాన్ని పాష్కలుడి వద్ద, సామవేదాన్ని జైమిని వద్ద, ఆరుణి వద్ద అధర్వణవేదాన్ని నేర్చుకున్నాడు. తరువాత, వైశంపాయనుడి వద్దకు పంపించారు. వేదవ్యాసునిచే నియోగించబడి యజుర్వేదాన్ని శిష్యులకు చెప్పే వైశంపాయనుడు, ఈ కుర్రవాడిలో ఉత్తమలక్షణాలు ఉన్నాయని గ్రహించి శిష్యునిగా అంగీకరించాడు. గురు శుశ్రూషలో అంకితభావం కలిగిన యాజ్ఞవల్క్యుడు గురుహృదయాన్ని చూరగొని అనతి కాలంలోనే అనంత విద్యావైభవాన్ని పొందగలిగాడు. బ్రహ్మతేజోదీప్తిచే వెలుగొందే యాజ్ఞవల్క్యునిలో, విధివశాత్తు కొంతకాలానికి సాత్త్వికాహంకారం కలిగి గురువుని ధిక్కరించే విధంగా మాట్లాడించింది.

ఆ కారణంచేత వైశంపాయనుడు, ఆగ్రహించి 'అహంకరిస్తున్న నీకు ఈ విద్య తగనిది దానిని నాకు తిరిగి ఇచ్చి వెళ్ళి పొమ్మని’ కఠినంగా పలికాడు. అందుకు పశ్చాత్తాపపడిన యాజ్ఞవల్క్యుడు, రక్తరూపంలో తాను నేర్చిన యజుర్వేద విద్యను వెడలగక్కి వెళ్ళిపోగా, తిత్తిరీ పక్షుల రూపంలో కొందరు మహరషులు దానిని గ్రహించారు. యజుర్వేదంలో ఆ శాఖను 'తైత్తరీయశాఖ' అని అంటారు. దానినుండి వచ్చిందే తైత్తరీయోపనిషత్గా ప్రసిద్ధి పొందింది.

     అయితే తన నిజతపశ్మక్తితో గురువైన వైశంపాయనునికి సంప్రాప్తమైన బ్రహ్మహత్యాదోషాన్ని తొలగించగలిగిన ధన్యుడు యాజ్ఞవల్క్యుడు. ఈ గురు భక్తి మూలంగా, దోషరహిత చిత్తుడై ఏకాంతంగా సూర్యదేవుని ఆరాధించసాగాడు. ఆయనను మెప్పించి తను నేర్చుకున్న విద్యను వదిలివేయవలసివచ్చిన దుస్థితిని తెలిపాడు అంతట సూర్యభగవానుడు, 'నీ గురువుకి తెలియని శుక్ల యజుర్వేదాన్ని బోధిస్తానని తెలిపి', ఆ ప్రకారంగా శుక్ల యజుర్వేదాన్ని అతనికి నేర్పాడు. తక్కిన విద్యలను సరస్వతీ కటాక్షంచే పొందమని సలహా ఇచ్చి అదృశ్యుడైనాడు.

ఈ విధంగా యాజ్ఞవల్క్యుడు సూర్యుని వలన నేర్చిన విద్యను 'శుక్లయజుర్వేదమని', అతను గురువు వద్ద వదిలేసిన దానిని 'కృష్ణయజుర్వేదమని' అంటారు. అటు తరువాత సరస్వతీ మాతను ప్రసన్నం చేసుకుని సకల విద్యలను సముపార్జించుకుని, విద్యానిధిగా తన స్థానాన్ని పొందగలిగాడు యాజ్ఞవల్క్యుడు.

శుక్ల యజుర్వేదమును, వాజసనేయ శాఖ అని కూడా అంటారు. అది ఇతని శిష్యప్రశిష్యులచే విశ్వ వ్యాప్తం అయింది. ఇతని ప్రథమ శిష్యుడు కణ్వుడు కాగా ఈ శాఖ వారినే కాణ్వశాఖీయులని, ప్రథమశాఖీయులని అంటారు. శుక్లయజుర్వేదం మధ్యాహ్న కాలంలో సంప్రాప్తమైనందున దానిని 'మాధ్యందిన శాఖ' అని కూడా వ్యవహరిస్తారు.

    విదేహరాజైన జనకుడు సంకల్పించిన సన్మాన సభలో, ఎనిమిది మంది తత్త్వవేత్తలు అన్ని విధాలుగా ప్రశ్నించి, బ్రహ్మవేత్తలలో సర్వశ్రేష్ఠునిగా యాజ్ఞవల్క్యుని గుర్తించారు. ఆ తరువాత జనకుడు యాజ్ఞవల్క్యుని వద్ద ఆధ్యాత్మ తత్త్వవిద్యను నేర్చుకున్నాడు. ఇందు బృహదారణ్యకోపనిషత్తులోని మొదటి బ్రాహ్మణమైన షడాచార్య బ్రాహ్మణం, ఆ పైన కూర్చ బ్రాహ్మణం, జోతిర్ర్రాహ్మణం (శారీరక బ్రాహ్మణం) మున్నగునవి వివరించబడ్డాయి.

      రుద్రాభిషేకంలో పఠించబడే రుద్రాష్టాధ్యాయి శుక్లయజుర్వేదం లోనిది. అంతేకాక 'శతపథ బ్రాహ్మణం' యాజ్ఞవల్క్యుని మంత్రశక్తికి ప్రబల నిదర్శనం. ధర్మశాస్త్రంలో స్మృతికర్తగా పేరు పొందిన యాజ్ఞవల్క్యుని స్మృతి, మనుస్మృతి తర్వాత చెప్పుకోదగిన స్మృతి గ్రంధం. ఇందు ఆచార, వ్యవహార, ప్రాయశ్చిత్తాలను మూడు కాండలలో ఉపదేశించాడు.

        యాజ్ఞవల్క్యుడు యోగాన్ని గురించి, ఉపాంగాలు మొదలైన వాటిని గురించి బృహదారణ్యకోపనిషత్తులో పన్నెండు అధ్యాయాలలో వివరించినట్లుగా, ఇది అతను బ్రహ్మవాదిని గార్గితో చేసిన సంభాషణ సారమని తెలుస్తోంది. దీనినే 'యోగా యాజ్ఞవల్క్యమని' అంటారు. కర్మజ్ఞానాల సమ్మిళితమే మోక్ష ప్రాప్తికి దారి తీయగలదు అని తెలిపే భావాలు ఇందు కలవు. ఇది మొత్తం పన్నెండు అధ్యాయాలను కలిగి ఉండి ప్రశస్తిని పొందింది.

      యాజ్ఞవల్క్య మహర్షికి ఇద్దరు భార్యలు - మైత్రేయి, కాత్యాయని, బ్రహ్మజ్ఞానిగా ఆయన గడిపిన గార్డస్త జీవితంలో, బ్రహ్మవాదినిగా మైత్రేయి భర్తకు సహకరించి సహధర్మచారిణిగా ఉపచరించింది. ఆత్మత్వ్వంలోని అమృతత్త్వాన్ని భర్త ద్వారా అర్ధం చేసుకుని స్వాత్మానందలహరిలో లీనమైన మైత్రేయి ధన్యురాలు. వారిరువురి నడుమ జరిగిన ఈ ఆసక్తికర సంభాషణమంతా బృహదారణ్యకోపనిషత్తులోని చతుర్ధాధ్యాయంలోని చతుర్భబ్రాహ్మణంలో వివరించబడింది. దీనికే 'మైత్రేయీబ్రాహ్మణం' అని పేరు.

    యాజ్ఞవల్క్యుని యజ్ఞస్వరూపాన్ని, ఆత్మశక్తిని, నిగూఢ రహస్యాలను కరతలామలకం గావించ గలిగిన ధీశక్తి గుర్తించి మహర్షులందరూ కలిసి మాఘశుద్ధ పౌర్ణమి నాడు 'యోగీంద్రుడని' అతనిని పట్టాభిషిక్తుని గావించారు. ఇటువంటి అరుదైన గౌరవం: యాజ్ఞవల్క్యునికే దక్కింది.

సాక్షాత్ యజ్ఞ స్వరూపాయ యాజ్ఞవల్క్యాయ మంగళమ్"

సంకలనం, రచన: డా. అపర్ణా శ్రీనివాస్

buttons=(Accept !) days=(0)

Our website uses cookies. Learn More
Accept !
To Top