బ్రహ్మ సత్యం - జగత్తు మిథ్య, సైన్సు - Jagattu,Brahma, Science

బ్రహ్మ సత్యం - జగత్తు మిథ్య, సైన్సు  - Jagattu, Science
ద్వైత సిద్ధాంతం ప్రకారం “బ్రహ్మ సత్యం - జగత్తు మిథ్య.” ఇదే ఆదిశంకరాచార్యుని మాయావాదంగా ప్రసిద్ధమైంది. మన కంటికి కనిపిస్తున్న ప్రపంచం నిజంగా ఉంది కదా! రాయి రాయిగా కనబడుతోంది. చెట్టు చెట్టుగా కనబడుతోంది. మరి దానిని మిథ్య అంటారేంటి? ఇదంతా ఆధునిక విద్యావంతులకు మెట్ట వేదాంతం లా కనబడుతుంది. మరి దీనిని గురించి సైన్స్ ఏం చెబుతోందో చూద్దాం.

భౌతిక శాస్త్రం ప్రకారం విశ్వంలోని పదార్థమంతా పరమాణువులతో నిర్మించబడి ఉంది. పరమాణువులో కేంద్రకం, దాని చుట్టూ తిరిగే ఎలక్ట్రాన్, ప్రోటాన్ వంటి అతి సూక్ష్మ కణాలు ఉంటాయి.
గోళీ
గోళీ
ఉదాహరణకు మనం చిన్న పిల్లలు ఆడుకొనే “గోళీ” ని తీసుకుందాం. అది గుండ్రంగా, గట్టిగా ఉన్నట్లు మనకు తెలుస్తుంది.  ఆ గోళీ ని ఎలక్ట్రాన్ మైక్రోస్కోప్ తో పరిశీలిస్తే అది పరమాణువులతో నిండి ఉందని తెలుస్తుంది. ఒక్కో పరమాణువును ఒక క్రికెట్ స్టేడియంతో పోలిస్తే, ఆ స్టేడియం మధ్యలో ఒక బియ్యపు గింజను పెడితే, అది ఆ పరమాణువు కేంద్రకం. ఎలక్ట్రాన్, ప్రోటాన్ వంటివి కూడా బియ్యపు గింజ పరిమాణంలో ఉండి, ప్రేక్షకుల స్టాండ్స్ మీదుగా కేంద్రకం చుట్టూ తిరుగుతూ ఉంటాయి. మధ్యలోది అంతా ఖాళీ స్థలమే! ఒక పరమాణువులో 99.9999999 % ఖాళీ ప్రదేశమేనని శాస్త్రవేత్తలు గుర్తించారు. అంటే గట్టిగా ఉన్నట్లు మనకు అనిపించే ఒక గోళీ లో 99.9999999 % ఖాళీ ప్రదేశమే. అంటే శూన్యమే. మరి ఆ గోళీ ని మన వేళ్ళతో నొక్కితే గట్టిగా ఉంటుంది కదా! మరి గోళీ అంతా ఖాళీ  అంటారేమిటని అంటారేమో! మన వేలులో ఉండే పరమాణువులకు, ఆ గోళీ లో ఉండే పరమాణువులకు మధ్య వికర్షణ ఏర్పడడం వాళ్ళ ఆ గోళీ గట్టిగా ఉన్నట్లు మనకు అనుభవమవుతుందని భౌతిక, శారీరక శాస్త్రాలు చెబుతాయి. అలాంటి గోళీ ఏదీ లేకపోయినా, అలాంటి వికర్షణను వేరే విధంగా కృత్రిమంగా మన వ్రేలిలోని పరమాణువులలో కలిగిస్తే, గోళీ ని పట్టుకున్న అనుభవమే మనకి కలుగుతుంది.

ఆ గోళీ నీలం రంగులో ఉందనుకుందాం. ఆ గోళీ మనకు నీలం గా కనబడడానికి కారణమేంటి? సైన్స్ ప్రకారం ఆ గోళీ పై పడ్డ కాంతి (విద్యుదయస్కాంత తరంగాలు) పరావర్తనం చెంది మన కంటిలోని రెటీనాపై పడి, ఆ విద్యుత్ ప్రస్పందనలు మన మెదడుకు చేరడంతో మనకు ఆ గోళీ నీలంగా ఉన్నట్లు కనబడుతుంది. అయితే మనకు "రంగు" అనే అనుభవం ఎలా కలుగుతోందో భౌతిక శాస్త్రవేత్తలం చెప్పలేమని ఎర్విన్ ష్రోడింగర్ అనే భౌతిక శాస్త్రవేత్త అంటారు. ఆ గోళీ ని పరమాణు స్థాయిలో పరిశీలించినా, రంగుకు సంబంధించిన ఆధారాలేవీ దొరకవు. రుచి, వాసన, సాంద్రత వంటి లక్షణాలేవీ ఉపపరమాణు కణాలలో ఉండవు. ఆ స్థాయిలో అది ద్రవమా, వాయువా లేక ఘన పదార్థమా అనేది కూడా నిర్థారించలేము.

ఒక యాపిల్ పండును మనం కొరికి చూస్తే దాని రుచి తెలుస్తుంది. మన నాలుకలోని రుచిమొగ్గల నిర్మాణం వల్ల ఆ ప్రస్పందనలు మన మెదడుకి చేరి మనకు ఆ రుచి అనుభవమవుతోంది. కానీ ఆ యాపిల్ ను పరమాణు స్థాయిలో పరిశీలిస్తే దానికి రంగు, రుచి, వాసన వంటి ధర్మాలు స్వత:స్సిద్ధంగా లేవని తెలుస్తుంది. మన ఇంద్రియాలైన కన్ను, ముక్కు, చెవి, స్పర్శ, నాలుక వంటి వాటి ద్వారా మాత్రమే ఆ గుణాలు మనకు అనుభవమవుతాయి. కానీ పదార్థానికి ఆ లక్షణాలు లేవు.

కుక్కలు, పిల్లులు, చేపలు వంటి వాటి ఇంద్రియాల నిర్మాణం, మన ఇంద్రియ నిర్మాణం కంటే భిన్నంగా ఉంటుంది. అందువల్ల వాటికి ఈ ప్రపంచం మనకు కనిపించేలా కాకుండా భిన్నంగా కనిపిస్తుంది. పిల్లులు చీకటిలో మన కన్నా బాగా చూడగలవు. కుక్కలు మనకు వినబడని ఎన్నో శబ్దాలను వినగలవు. వాటి ఘ్రాణ శక్తి మన కంటే ఎన్నో రెట్లు ఎక్కువ. కాబట్టి మనకు విశ్వంలో ఉన్నవన్నీ అనుభవం కావట్లేదు. కొన్ని మాత్రమే అనుభవమవుతున్నాయి. కాబట్టి నేను చూసేదే నిజం అనుకోవడం మన అజ్ఞానం మాత్రమే!
క్వాంటం సిద్ధాంతం
క్వాంటం సిద్ధాంతం
పరమాణువులో అతిసూక్ష్మ అంశాలైన ఎలక్ట్రాన్లు, ప్రోటాన్లు, ఫెర్మియాన్లు, బోసాన్లు వంటి వాటికి “పదార్థం”, “వస్తువు” అనడానికి వీలైన ధర్మాలే లేవని శాస్త్రవేత్తలు గుర్తించారు. క్వాంటం సిద్ధాంతం ప్రకారం ఎలక్ట్రాన్, ప్రోటాన్ వంటివి మన పరిశీలనకు ఒక్కోసారి కణంగానూ, ఒక్కోసారి తరంగం గానూ ప్రవర్తిస్తాయి. ఈ వైరుధ్యాన్ని ( పారడాక్స్ ని) సైన్స్ ఇంతవరకూ సరిగా వివరించలేక పోయింది. కాబట్టి అవి అసలైన  పదార్థాలు కావనీ, శక్తి యొక్క రూపాలని నేటి సైన్స్ గుర్తిస్తోంది.

2013 లో హిగ్స్-బోసాన్ కణాన్ని (దైవ కణం) శాస్త్రవేత్తలు కనుగొన్నారు. పరమాణువులోని అతి సూక్ష్మ అంశాలకు ద్రవ్యరాశిని ఇచ్చేది ఈ హిగ్స్-బోసాన్ క్షేత్రమని శాస్త్రవేత్తలు గుర్తించారు.

ఈ క్షేత్రం విశ్వమంతా వ్యాపించి ఉంది. అది లేని చోటే లేదు. ఈ హిగ్స్-బోసాన్ శక్తి క్షేత్రం యొక్క క్వాంటం శక్తి ఆవేశాల కూర్పు హిగ్స్ కణం గా ప్రవర్తిస్తుంది. ఈ శక్తి క్షేత్రం వల్లే మనకు విశ్వంలో పదార్థం ఉన్నట్లుగా అనుభవమవుతుంది.

పరమాణువులోని ప్రాథమిక కణాలు, హిగ్స్ క్షేత్రంలోని కణాలతో ప్రభావితమై ఉండడం వల్లే వాటికి ద్రవ్యరాశి ఉన్నట్లుగా పరిశీలకుడికి తను ఉపయోగించే పరికరాలు ఇచ్చే సమాచారం ద్వారా తెలుస్తుంది.  ఈ హిగ్స్ క్షేత్రం వల్లనే యావత్ విశ్వానికి ద్రవ్యరాశి ఉన్నట్లుగా మనకు అనుభవమవుతుంది.

ఈ విశ్వంలో దాదాపు 95% కృష్ణ పదార్థం ( డార్క్ మాటర్ ) మరియు కృష్ణ శక్తి ( డార్క్ ఎనర్జీ ) ఉన్నట్లు శాస్త్రవేత్తలు గుర్తించారు. మిగిలిన 5% మాత్రమే మనకు కనిపించే పదార్థం ఉంది. ఈ కనిపించే పదార్థం యొక్క లోతుపాతులే ఇంకా సైన్స్ కి అర్థం కాలేదు. మిగిలిన 95 % లో ఏముందో ఏం అర్థమవుతుంది ? అందుకే దానికి “డార్క్ ఎనర్జీ”, “డార్క్ మాటర్” అని పేర్లు పెట్టారు. విశ్వంలోని గెలాక్సీలను పట్టి ఉంచే శక్తే ఈ ‘డార్క్ మాటర్’.  గురుత్వాకర్షణ శక్తికి వ్యతిరేకంగా విశ్వం యొక్క విస్తరణకు కారణమవుతున్న శక్తిని ‘డార్క్ ఎనర్జీ’ గా శాస్త్రవేత్తలు భావిస్తున్నారు.  మొత్తం మీద ఈ డార్క్ మాటర్, డార్క్ ఎనర్జీలలో ఏముందో సైన్స్ కి ఇంకా అర్థం కాలేదు.

ద్రవ్యరాశిత్వం కూడా శక్తి యొక్క రూపమేనని, ఆ వస్తువు స్థిరంగా ఉన్నప్పుడు ఆ వస్తువులోని శక్తి దాని ద్రవ్యరాశి రూపంలో ఉంటుందనీ, ఆ వస్తువు కాంతి వేగంతో ప్రయాణిస్తే అది కాంతి అనే శక్తి రూపం ధరించి, దాని ద్రవ్యరాశిత్వం నశిస్తుందనీ ఐన్ స్టీన్ సిద్ధాంతం చెబుతుంది.

పరమాణు స్థాయిలోని ధర్మాలన్నీ వాటికి పరిశీలకునిపై గల ప్రభావాలే. ఈ పరిశీలకుడు, అతడు ఉపయోగించే పరికరాలు కూడా ఈ విశ్వంలో భాగమే కదా! వాటిలోని పరమాణువులకు కూడా క్వాంటం సిద్ధాంతం వర్తిస్తుంది కదా! అందుకే, పరిశీలకుడు పరిశీలిస్తేనే, అతడు వాడే కొలతలను బట్టి ఈ విశ్వం లో పదార్థం ఉన్నట్లుగా అనుభవమవుతుంది. చూసే వ్యక్తులు లేక ప్రాణులు లేకపోతే ఈ విశ్వానికి వాస్తవికమైన ఉనికి లేదు.

2015 మే నెలలో ఆస్ట్రేలియన్ నేషనల్ యూనివర్శిటీ కి చెందిన శాస్త్రవేత్తల బృందం – “జాన్ వీలర్ డిలేయిడ్ ఛాయిస్ థాట్ ప్రయోగం” ద్వారా ఈ విషయాన్నే ధ్రువపరిచారు. ఈ యూనివర్సిటి అసోసియేట్ ప్రొఫెసర్ ఆండ్రూ ట్రస్కాట్ చెప్పినట్లు " పరిశీలకుడు వాడే కొలతలను బట్టే క్వాంటం స్థాయిలో వాస్తవికత అనేది ఉందా, లేదా అనేది తెలుస్తుంది. పదార్థం యొక్క క్వాంటం స్థాయిలోని అంశాలను పరిశీలించే ఒక పరిశీలకుడు లేకపోతే పదార్థం (లేక వాస్తవికత) కూడా ఉండదు."
హైసెన్ బర్గ్ అనే భౌతిక శాస్త్రవేత్త చెప్పినట్లు " సమకాలీనమైన శాస్త్రం మనకు తెల్పేది ప్రకృతిని గురించి కాదు. ప్రకృతితో మనకు గల సంబంధాన్ని మాత్రమే."
అంటే పదార్థమనేది వాస్తవం కాదు. అది శక్తి తరంగాల కూర్పు - అని నేటి సైన్స్ చెబుతోంది. అంటే మనం చూసే ప్రపంచం వేరు. దాని అసలైన స్వరూపం వేరు. పదార్థం, వస్తువులు ఉన్నట్లు మనకు కనిపిస్తాయి. కానీ పరమాణు స్థాయిలో 'పదార్థం' అని చెప్పగలిగిందేదీ లేదు. పదార్థం అనేది ఎండమావి లాంటిది. ఈ సత్యాన్నే మన ప్రాచీన ఋషులు చెప్పారు. జ్ఞానమంటే కనిపించే దాని మాటున దాగి ఉన్న వాస్తవాన్ని గుర్తించడం. జ్ఞాని ఎండవావిని చూసి మోసపోడు.

ఆధ్యాత్మికంగా చూస్తే మనందరిలో విశ్వవ్యాప్తమైన చైతన్యాన్ని అనుభవించగల సామర్థ్యం దాగి ఉంది. కానీ, నిత్య జీవితంలో మనం దేహబద్ధులమైన ప్రాణులం మాత్రమే! మిథ్య లో బ్రతుకుతున్నప్పటికీ, మనం దానికి తగ్గట్లుగా ప్రవర్తించాల్సిందే. ఒక ఏనుగు వెంట పడి తరుముతుంటే, మనం పలాయనం చిత్తగించాల్సిందే. దీనినే " ఏనుగు మిథ్య - పలాయనం మిథ్య " అని ఆది శంకరుల వారు హాస్యస్పోరకంగా చెప్పారు.

ఇలా మన పరిమిత చైతన్యానికి అనుభవమయ్యే పరిమిత సృష్టి తత్వాన్నే మతాలన్నీ "ఇహలోకం" అన్నాయి. విశ్వ చైతన్యానుభూతి పొందిన మహనీయులే సంపూర్ణ జ్ఞానం కలిగి ఉంటారని మత గ్రంథాలు చెబుతాయి. మనకి ఉన్న సామర్థ్యం పరిమితమైనది. ప్రపంచం యొక్క అసలైన స్థితిని, స్వరూపాన్ని మనం గుర్తించలేక పోతున్నాము. అందుకే మనకు గోచరించే జగత్తును ‘మిథ్య’ అని వేదాంత గ్రంథాలు చెప్పాయి. నేటి సైన్స్ ప్రకారం కూడా అదే నిజమని తేలుతోంది.
  • ‘జగత్తు మిథ్య’ అని చెప్పటమే కాక అద్వైత సిద్దాంతం ‘బ్రహ్మ సత్యం’ అని కూడా చెప్పింది. “సర్వం ఖల్విదం బ్రహ్మ” - విశ్వమంతా వ్యాపించి ఉన్న ‘చైతన్యం’ లేక ‘ఎరుక’ గల ఒకానొక అద్వితీయ శక్తే ‘బ్రహ్మము’. ఈ చైతన్యమే సర్వ జీవుల్లోనూ ‘నేను’, ‘నేను’ అని అనుభవమవుతోందని వేదాంత గ్రంథాలు చెబుతాయి.
జగత్తు యొక్క యదార్థతత్వం నామరూపరహితము, సర్వవ్యాప్తము, ఇంద్రియ మనో అగోచరము, పదాలలో ఇట్టిది అని చెప్పడానికి వీలు లేని శక్తి అని ఇటు ఆధ్యాత్మికత, అటు ఆధునిక భౌతిక శాస్త్రం చెబుతున్నాయి. కాబట్టి “జగత్తు మిథ్య” అనడం మెట్ట వేదాంతం కాదని తేలుతోంది.

నేడు “హాలోగ్రాఫిక్ యూనివర్స్” అనే సిద్ధాంతం ప్రాచుర్యంలోకి వచ్చింది. ఈ సిద్ధాంతం ప్రకారం ఈ విశ్వంలో సుదూరంగా ఉన్న తెర మీద నడపబడుతున్న 2 డి సమాచారం యొక్క ప్రక్షేపణమే (projection) మనకు 3 డి లో కనిపిస్తున్న ఈ జగత్తు. అంటే ఈ విశ్వంలో ఘనంగా ఉన్నట్లు మనకు కనిపించే వస్తుజాలం నిజానికి అలా లేదు. జగత్తు నిజానికి మన భ్రమే నని ఈ సిద్ధాంతం మరింత తేటతెల్లం చేస్తోంది.

(NOTE : మిథ్య అంటే ఏమీ లేనట్లు కాదు. అది ఫలానా అని ఖచ్చితంగా గుర్తించలేకపోవడం. పదార్థం నిజంగా ఉందనుకుంటాం. కానీ ఉప పరమాణు స్థాయిలో చూస్తే నిజమైన పదార్ధం కనబడదు. పదార్ధం శక్తి తరంగాల కూర్పు మాత్రమేనని భావించాల్సి వస్తుంది. అంటే విశ్వమంతా ఒకానొక ఏకత్వం ఉంది. అది శక్తి రూపం. అదే అన్ని రూపాలనూ ధరిస్తోంది. మన ఇంద్రియ నిర్మాణం వల్ల ఈ జగత్తు ఇలా కనబడుతోందే కానీ దాని వాస్తవ రూపం ఇది కాదు.మనలో అన్నింటినీ తెలుసుకొనే, అనుభవించే "చైతన్యం" లేక "ఎరుక" అనేది ఉంటుంది. అది సత్యం. అది మిథ్య కాదు. విశ్వవ్యాప్తమైన ఈ చైతన్యం లేక ఎరుక అనేది అన్ని జీవుల్లోనూ "నేను" గా ప్రకటమవుతోందని వేదాంతం చెబుతుంది. అదే "బ్రహ్మము" లేక Universal Consciousness.)

సంకలనం/రచన: మణి కుమార్ 
Translate this post ⬇

buttons=(Accept !) days=(0)

Our website uses cookies. Learn More
Accept !
To Top