ఇంద్రియములు, ఇంద్రియార్థములు - Indiriyamulu, Indriyardhamulu

0
ఇంద్రియములు, ఇంద్రియార్థములు - Indiriyamulu, Indriyardhamulu

ఇంద్రియములు - ఇంద్రియార్థములు

ప్రజాపతి: 
చతుర్ముఖ బ్రహ్మ. అంతఃకరణ చతుష్ఠయమే నాలుగు ముఖములు. చిత్‌శక్తి ఈ నాలుగు ముఖముల ద్వారా ప్రకటించబడును.

ప్రాజపత్యులు:
ప్రజాపతి సంతానము. అంతఃకరణమునుండి పుట్టుచున్న వృత్తులే సంతానము. ఆ వృత్తులే ప్రాజపత్యులు.

అంతఃకరణ:
 • ⧫ కామము, 
 • ⧫ సంకల్పము, 
 • ⧫ విచారేచ్ఛ, 
 • ⧫ శ్రద్ధ, 
 • ⧫ అశ్రద్ధ, 
 • ⧫ ధైర్యము, 
 • ⧫ అధైర్యము, 
 • ⧫ లజ్జ, 
 • ⧫ జ్ఞానము, 
 • ⧫ భ్రమలు, మొదలగు వృత్తులే మనస్సు అని చెప్పబడును. 
శబ్ద, స్పర్శ, రూప, రస గంధములలో ఏది అజాగ్రత్తగా నున్నప్పుడు తెలియబడదో ఏది జాగ్రత్తగా నున్నందున తెలియబడునో అదియే మనస్సు. అన్ని విషయములను తెలుసుకొనే మనస్సు సామాన్యము. ఇంద్రియాతీత విషయములను తెలుసుకొనె మనస్సు విశేషము.
మననము చేయుటచేత మనస్సు అనియు, చింతన చేయుటచేత చిత్తము అనియు, వృత్తిభేదముచేత రెండుగా చెప్పబడినను అది ఒక్కటే. అలాగే తనలోనున్న గొప్ప గుణములచేత తనలో లేని అల్ప గుణములచేత తనను ఇతరులకంటె హెచ్చుగా తలచుకొను వృత్తి అహంకారము, తాను అల్పమని, ఇతరులు ఎక్కువ అని అనుకునేది కూడా అహంకారమే. బుద్ధి విజ్ఞాన నిలయము. మనస్సు అనగా ఆ విజ్ఞానములో ఏర్పడే సంకల్ప వికల్పాది వృత్తులు. మనస్సు సంశయాత్మకము. బుద్ధి నిశ్చయాత్మకము. నిశ్చయ బుద్ధి గలవాడు మనీషి. ఇవన్నీ కలిపి ఒకటైనది అంతఃకరణమే.

అంతఃకరణ - హృదయము:

ఆత్మలో కలిగెడు వేరు వేరు స్థితులు  నాలుగు విధములు.
 • 1. ఆత్మలో ఇచ్ఛ కలిగినప్పుడు అది మనో వ్యాపారము.
 • 2. విమర్శచేసి నిశ్చయించునప్పుడు అది బుద్ధి.
 • 3. నిశ్చయమై, ఆ నిశ్చయమే తన స్వభావముగా మారినప్పుడు అది చిత్తము.
 • 4. నేను శక్తుడను, నేను చేయగలను అనెడి అనేక భావములు కలిగినప్పుడది అహంకారము.
 • 5. పై స్థితులు ఏవీ లేనప్పుడది హృదయము. అంతఃకరణ వృత్తులు ఖాళీ అయినప్పుడది హృదయము. ఆ ఖాళీలో అనగా హృదయమందు ఆత్మ ప్రత్యేకముగా సిద్ధమై యున్నందున తురీయానుభవము కలుగును.
హృదయం :
హృ+ద+యం= హారతి+దాతి+యాతి అనగా ఇస్తుంది, నడిపిస్తుంది, గ్రహిస్తుంది. ఇది ఆత్మ తత్త్వము. దీనికి అంతఃకరణ వృత్తులు చేరితే ఆత్మ తత్త్వము మరుగునపడి విషయములు, కర్మలు, అనుభవములు, ఫలితములు ప్రకటితమగును. అంతఃకరణ శుద్ధమైనప్పుడు హృదయమే ఆత్మ.

దుఃఖభాగులు:
ఈర్ష ్య, జుగుప్స, సంతోషము లేకపోవుట, క్రోధము, నిత్య శంక, పర భాగ్యోపజీవనము కలవారు నిత్య దుఃఖితులు. వీరే దుఃఖభాగులు.

సంసరణ:
ఒక ఉపాధినుండి మరొక ఉపాధికి మారుట, నిర్గమించుట, ప్రవేశించుటగా తెంపులేకుండా సాగిపోవుట. జనన మరణ చక్రము, సంసరణ, సంసృతి, సంసారము అనునవి పర్యాయ పదములు.

సంసారము:

 • ➣ విషయాసక్తివలన విషయములను విషయీకరించుచూ క్రియలను చేయుచూ, సాధించుచూ, ఫలితములను అనుభవించుట, చచ్చుట, పుట్టుట అనెడి చక్రభ్రమణమును సంసారమందురు. సుఖదుఃఖముల కారణముతో నేను, నాది ఇతరము అనే విభజనతో ఆశామోహ  భయములతో ఆకలి, నిద్ర, మైధునముల కొఱకు చేయు క్రియలు, వాటి ఫలితములను అనుకూల, వ్యతిరేక భావములతో అనుభవించుటను సంసారమందురు. 
 • ➣ సంసారమనేది కుటుంబము వరకే కాదు. జననము మరణముల మధ్యకాలమందు ఇంటా, బయట, ఏయే వస్తువులతో, జీవులతో, మానవులతో సంబంధము కలిగి వ్యవహరించుట కలదో, అది మనోవాక్కాయ కర్మలు, ఫలితములుగా నున్నదో అది సంసారమనబడును.  
 • ➣ సంసారము బయట నున్నది కాదు. లోపలనే వాసనా రూపముగా, వ్యక్తిత్వ రూపముగా, త్రిగుణ స్వభావముగా, విషయాసక్తి రూపముగా నున్నది  అసలైన సంసారము. అది బయటి సంసారమునకు కారణమై యున్నది. 
 • ➣ కారణము నశించిన కార్యముండదు గనుక, సాధనచేత తనను తాను నిర్విషయ, నిర్వాసన, నిర్గుణ స్థితికి చేరునట్లు విడుదల పొందవలెను. అహంకారము పూర్తిగా శూన్యమైనదే బంధమునుండి విముక్తి. వ్యక్తిత్వమును తుత్తునియలు చేసుకున్నవాడు ముక్తుడు.

సుఖం-దుఃఖం:

ఖం అనగా ఆకాశము, శూన్యము, సమస్థితిలో నుండుట, సహజానందము. సమస్థితికి దూరమైన వానికి, దగ్గరగా జరిగినందున కలిగే తృప్తిని సుఖం అందురు. దూరముగా జరిగినందున కలిగే అసంతృప్తిని దుఃఖం అందురు. సమస్థితిలో నుండే సాధనచేత సుఖదుఃఖములు రెండూ లేని సహజానందము సిద్ధించును.

లోకము:

ఏది ఇంద్రియ గోచరమై, ఇంద్రియ స్పందనకు కారణమో అది లోకము. ఏది ప్రత్యక్ష ప్రమాణమునకు గోచరమగునో, దానివలన సుఖదుఃఖాదులు అనుభవమునకు వచ్చునో, అది లోకము. ఇంద్రియములను జయించిన వానికి లోకము లేదు.

కృపణుడు: అల్పుడు, ఇంద్రియములకు వశుడై కాలయాపన చేయువాడు.

స్వతంత్రుడు:

విషయాసక్తి లేనివాడు, అనుబంధ, సంబంధ బాంధవ్యములు కలిగియున్నను, సర్వదా అతీతుడై అంతరంగములో విషయములపట్ల ప్రమేయము లేనివాడు.

అస్వతంత్రుడు:

గుణసంగుడు, విషయములపట్ల, సందర్భ సంఘటనలపట్ల ఆసక్తి కలిగినవాడు. గుణ సంబంధమైన ఆవేశము కొనసాగించేవాడు.

మూర్ఖుడు:

ఈ శరీరముపట్ల ఆయా దృశ్య విషయములపట్ల బంధుమిత్ర గృహ తదితర లోక సంబంధమైన విషయములపట్ల ఇవి నావి, నేను వీటికి సంబంధించినవాడను అనే భావమును బలముగా ఆశ్రయించినవాడు.

పండితుడు:

దేనివలన బంధము, ఏది బంధము, దేనివలన మోక్షము, ఏది మోక్షము - ఈ తత్త్వము నెరిగినవాడు.

ఉచ్ఛాస్త్ర పురుష ప్రయత్నము:
శాస్త్ర పద్ధతిని వీడి, నియమ నిబంధనలు పాటించకుండా చేసే ప్రయత్నము. ఈత రానివాడు ఏటిలోకి దూకి ఈదుటకు ప్రయత్నించినట్లుండును. మోక్ష లక్ష్య సాధనకు ఇది పనికిరాదు.

శాస్త్రిత పురుష ప్రయత్నము:
ఇహలోక పరలోక సుఖమునకై శాస్త్రములను, నియమ నిబంధనలను పాటించుచూ చేసెడి పురుష ప్రయత్నము. ఇచ్చోట ఫలితమును లక్ష్యించవచ్చును.

పురుష ప్రయత్నము : (పురుషకారము):

పురుషకారము క్షేత్రమైతే దైవము (విధి) విత్తనమువంటిది. పురుషుడు ప్రయత్నము చేయకపోతే దైవము ఫలమును ఇవ్వలేడు. దైవము తోడ్పాటు లేనిదే పురుష ప్రయత్నము సఫలము కాదు. కనుక ఫలితము మీద కాక, కేవలము కర్తవ్య నిర్వహణ, లక్ష్యముల పైనే దృష్టిపెట్టి ప్రయత్నించవలెను. ఇట్లు చేయుటనే పురుష ప్రయత్నము అందురు.

సంస్కారము:

పురుషకారము, పురుష ప్రయత్నము, వివేచనతో సమయ సందర్భోచితముగా ప్రవర్తించుట. విధి తప్పదు అని వదలివేయక తగిన ప్రయత్నము చేయుచుండుట. ఒకప్రక్క ప్రారబ్ధ ఫలితమును అంగీకరించుచు, పురుష ప్రయత్నము చేయుచుండినచో పుట్టుకతో వచ్చిన స్వభావము సంస్కరింపబడుచూ ఉండును. క్రమముగా సాత్వికుడై, ఆత్మాను భవమును పొందును. సాధకుడు సంస్కరింపబడుట సంస్కారము క్రిందికి వచ్చును. పురుష ప్రయత్నము వలన విధి తప్పినప్పుడు అహంకరించక, విధి తప్పనప్పుడు అది దైవేచ్ఛ అని భావించి, క్రుంగిపోకుండా ఉన్నప్పుడు అతడి స్వభావము సంస్కరించబడును.

అధ్యయనము :
అధి+అయనము = ఏదైనా ఒకదానిని తెలిసికొని, అధిగమించి, ఆపై లక్ష్యమునకు ప్రయాణము చేయుట. ప్రపంచాను భవములను దాటి అనంతములోనికి ప్రయాణము చేయుట.

అహింస:
అజ్ఞానముచేత శరీరము నేను అని సుఖదుఃఖములు జనన మరణములు, చక్రభ్రమణముగా కొనసాగుట హింస. జ్ఞానముచేత ఆత్మయే తాననుకొని, జన్మరాహిత్యమగుట అహింస.

అస్తేయము:
తనదికాని దానిని తనదిగా చేసుకొను దొంగ బుద్ధిని వదలుట. అనగా తనవికాని శరీరేంద్రియ ప్రాణ మనస్సులను తనవిగా చేసుకొనుటకు కారణమైన అజ్ఞానమును వదలించుకొనుట అస్తేయము.

అసంగత్వము:
దేనిపట్ల సంగత్వము లేకుండుట. సద్వస్తువు లక్ష్యముగా సకల అసద్వస్తువులమీది సత్యత్వ భావనలను వదలి యుండుటను అసంగత్వము అందురు.

అసంచయము:
దృశ్యమైన వాటితో తన్మయత్వము, తాదాత్మ్యత, లేక కలసిపోయి యుండుట వంటివన్నీ లేకపోయిన స్థితి. కూటస్థాత్మ స్థితి. కూడియున్నను, కూడకయుండు స్థితి.

ఆస్తిక్యము:
ఈ కనబడే ప్రతి దృశ్యమునందు, దాని సృష్టికి ఆధారమైన పరమాత్మ ఉన్నాడని గ్రహించి మెలగుట.

ఆతిథ్యము : ఇతరులను పరమాత్మ యొక్క ప్రతిరూపముగా భావించి సేవాభావము కలిగియుండుట.

అర్చన:
చేసే ప్రతిపనిలోను, పరమాత్మను పూజించుచున్నట్లు గాను, పొందే ప్రతి లాభమును పరమాత్మ యెడల కృతజ్ఞతాభావముతో స్వీకరించుట గాను భావన చేయుట అర్చన అనబడును. జరిగే ప్రతి నష్టమును తనయొక్క పూర్వదోషముగా నెంచి ఓర్చుకొనుటకు తగిన శక్తిని ప్రసాదించమని వేడుకొనుట కూడా అర్చనయే.

అంతర్‌శౌచము:
సదాచారము, సచ్చీలత, సత్వగుణము, దైవీభావము కలిగి యుండుట అంతర శౌచము. ఇతరులవలన కలిగే కష్టనష్టములకును మానావమానములకును చలించక, ప్రతిస్పందించక తన సచ్చీలతను, సదాచారమును, సత్వగుణమును విడనాడకయుండు చిత్తము కలిగిన యెడల అది అంతరశౌచమనబడును.

బాహ్య శౌచము:
ఇతరులయెడ సద్భావన, ప్రేమ, సహకారము, క్షమ, మొదలైనవి సహజమై యుండుట బాహ్య శౌచము. శత్రువు యెడల, అపకారి యెడల కూడా అదే సద్భావన కలిగియుండుట బాహ్యశౌచము.

బ్రహ్మచర్యము:
ఇహలోక భావములను ఉపశమింపజేయుచు, అధిగమించుచూ, అన్నిటినీ పారలౌకికమగు పరబ్రహ్మముగానే భావించుటను శీలించుట, చివరకు తద్దర్శనము.

అభయము:
తాను అద్వితీయ బ్రహ్మమని తెలిసి, తనకంటె అన్యముగా ఏమీ లేదని నిర్భయముగా నుండుట.

శ్రద్ధ:
నియమిత కర్మలపట్ల, భగవత్‌ సాధనలపట్ల, గుర్వాజ్ఞానుసారము ప్రవర్తించుటపట్ల బుద్ధిని మరీ మరీ నియమించి ఏ మినహాయింపు లేకుండుట శ్రద్ధ అనబడును.

స్థైర్యము:
ఇదంతా బ్రహ్మమేననెడి భావనను విడువకయుండుట. నామరూప వృత్తులయెడ ఆకర్షణ, వికర్షణ, ఇష్టాయిష్టములు కలుగక బ్రహ్మభావన స్థిరముగా కొనసాగుట.

జపము:

భగవంతుని, అవతారుని, గురుగీతను, ఓంకారమును, గురూపదేశ మంత్రమును ఉపాసించుట, నిరంతర మననము జరుపుట.

సంతుష్ఠి:
ప్రాప్తిస్తున్న దానికి దైవమునకు కృతజ్ఞుడై, సంతుష్ఠులై ఉండుట, లభించని దానిగురించి విచారపడక కాలము వ్యర్థము చేయకయుంటూ, దైవముపై విశ్వాసము తగ్గకయుండుట. ప్రాప్తి, అప్రాప్తిలయందు కూడా దైవముపై భక్తి ప్రపత్తులు సడలక యుండుట.

శమము: బుద్ధిని పరమాత్మమీద లగ్నముజేసి నిశ్చలమగుట.
దమము : పరమాత్మ నిష్ఠనుండి జారకుండా నిగ్రహించి యుండుట.

శాంతుడు:
శమము యొక్క అంతము. శమించుట అనే అవసరము తీరిపోవుట. శమమనగా బ్రహ్మమే. శాంతుడనగా బ్రహ్మము. క్రియాత్మక ముగా నున్నప్పుడు కూడా నిష్క్రియానుభూతుడుగా నుండుట.

దాంతుడు:
దమము యొక్క అంతము. దమించు అవసరము తీరిపోయిన స్థితి. దాంతుడనగా బ్రహ్మమే.

తితిక్ష:
అంతర్ముఖమున బ్రహ్మనిష్ఠుడై, బహిర్ముఖమున తోచిన జగత్తును కూడా బ్రహ్మముగానే గ్రహించుటయందు సహనము కలవాడై, దృశ్యముతో అనుసంధానము కాక సమస్థితుడై యుండుట.

ధర్మి:
సాధకుడు శాంతి పొందిన స్థితిలో వ్యక్తావ్యక్త భావములను అనుసరించు దానిని ధర్మి అందురు. ధర్మిలోనున్న ధర్మము ప్రకటన మగుటకుగాను ఆ ధర్మి చైతన్య సాన్నిధ్యమును కలిగియుండును.

అమృతాహారి:
తాను ఏది భుజించునో దానినే తన పంక్తిలోనున్న వారికి కూడా పెట్టేవాడు. తన సేవకులు తినిన తరువాత తాను తినేవాడు. మిగిలిన అన్నమును తిని తృప్తి చెందువాడు.

నిజమైన ఉపవాసము:
బ్రహ్మ సమీపమున వసించుట, విషయాకార చిత్త వృత్తులను అనుభవముదాకా రానీయక బ్రహ్మాకార వృత్తిరూప జ్ఞానము కలిగినవాడు నిజమైన ఉపవాసి. ఆహారమును తీసికొనని వారికి ఆకలి బాధ ఉండును. తృప్తి ఉండదు. బ్రహ్మోపవాసికి తృప్తి, ఆనందముండును. సాధారణ ఉపవాసమనే సాధన ఇంద్రియములను బలహీనపరచుకొనుటకు ఉపయోగపడును. అందువలన శమదమాదుల సాధన ఫలించును.

అమానిత్వాది గుణములు:

 •  1. అమానిత్వము (అహం ప్రశంస లేకుండుట) 
 •  2. అదంభము 
 •  3. అహింస 
 •  4. ఓర్పు 
 •  5. అవక్రత 
 •  6. గురుసేవ 
 •  7. బాహ్యాభ్యంతర శుద్ధి 
 •  8. సన్మార్గమందు స్థిరమైన నిష్ఠ 
 •  9. మనోనిగ్రహము 
 • 10. విషయములయందు వైరాగ్యము 
 • 11. అహంకారము లేకుండుట 
 • 12. జన్మము, మృత్యువు, ముదిమి, రోగము మొదలగు వానియందు దుఃఖములను తన దోషములేనని చింతించుట. 
 • 13. పుత్రుడు, భార్య, గృహము మొదలగువానియందు ఆసక్తి లేకుండుట. 
 • 14. సదా ఇష్టాయిష్టము లేక, సమచిత్తుడై యుండుట 
 • 15. పరమేశ్వరుని యందు సర్వకాల సర్వావస్థలలో అనన్యభక్తి 
 • 16. నిర్మలమైన ఏకాంత స్థలమందు వాసము చేయుట 
 • 17. సంసార జన సంగమందుండుటకు ఇష్టము లేకుండుట 
 • 18. ఆధ్యాత్మ జ్ఞానమే నిత్యము అని నిశ్చయమై స్థిరమై యుండుట 
 • 19. మోక్షమే సర్వోత్కృష్టమని చింతించుట 
 • 20. అచలస్థితినందుట
విషాదయోగము:
విష+అదం = విషమును తినేది అనగా విషము వంటి ప్రాపంచిక విషయములతో కొట్టబడి తనలోనే ఉన్న భగవంతునితో తనగోడును వెళ్ళబుచ్చుకొని హరింపజేసుకొనుట. ఇదియే విషాద యోగము.

సాంఖ్య యోగం: సమ్యక్‌+ఖ్య= సక్రమమైన జ్ఞానమును పొందుటను సాంఖ్య యోగమందురు.
 • జ్ఞాతుమ్‌: తెలుసుకొనుట (ద్వైతము)
 • ద్రష్టుమ్‌: సమీపమునకు చేరుట (విశిష్ఠాద్వైతము)
 • ప్రవేష్ట్రుమ్‌: ఐక్యత (అద్వైతము)
అవినాభావత్వము:
ఒక వస్తువుగాని, ప్రాణిగాని, మనిషిగాని - అది లేకపోతే నేను లేను అని గాని, అదీ నేను విడదీయరానిది అనిగాని, అది లేకుండా నేను ఉండలేను అని గాని, అది లేకపోతే ఎలా అని గాని భావించుటను అవినాభావత్వము అందురు. ఇదే సంసారము, బంధము, అజ్ఞానము.

నిర్వేదము:
ఈ లేని ప్రపంచము యెడల ఏర్పడిన మిథ్యాభావమును నిర్వేదము అందురు. జ్ఞానికి జగన్మిథ్య అనెడి భావము కలిగినప్పుడు ప్రపంచము యెడల ఏ విధమైన స్పందన ఉండదు. దానినే నిర్వేదము అందురు.

ఆనందుడు దుఃఖితుడుగా ఎట్లయ్యెను?:
నిజానికి ఆనందరూపుడైన జీవుడు తనచే కల్పింపబడిన చిత్తము కారణముగా బుద్ధి వృత్తులను సేవించుచూ, వృత్తుల కారణముగా తోచిన విషయముల ప్రభావముచే అహంకారము జనించగా అట్టి అహంకారము తన సహజానందమును ఆవరించగా బంధన భావము కలిగెను. ఆ బంధన అనే భావమే దుఃఖహేతువగుచున్నది.  విషయ విరక్తుడై, చిత్తవృత్తి నిరోధము చేసుకుని, చంచల బుద్ధిని స్థిరము చేసుకుని, స్థితప్రజ్ఞుడైన జీవునికి దుఃఖనాశనము, బంధ విముక్తి కలిగి తిరిగి ఆనందరూపుడగుచున్నాడు.

ఏ సాధన ఎట్లు చేయవలెను ?:
అనునిత్యము నియమము ప్రకారము ఆహారమును తీసుకొనుట, ఇంద్రియములను స్వాధీనములో ఉంచుకొనుట, రాత్రి ప్రథమ భాగములోను, చరమ భాగములోను యోగ ధారణలో నుండుట, కామక్రోధాదుల పట్ల ఏమరుపాటు లేకుండుట, అన్ని విధములుగా ఇంద్రియములను జయించి ఉండుట. నిత్యము తనదైన కర్మను నిష్కామముగా నిర్వర్తించుట. మొదట ఇంతవరకు చేయుచూ, సాధన చతుష్టయ సంపత్తిని కలిగి యుండవలెను. దైవభక్తి, పరోపకారము, అష్టాంగ యోగాభ్యాసము చేయవలెను. సజ్జన సాంగత్యము, దైవీక ఆధ్యాత్మిక విషయములను శ్రవణ పఠనములు చేయవలెను. విరక్తి వైరాగ్యములను పెంపొందించుకొనుట, ఓర్పు, సహనము, త్యాగము, దైవీ భావముతో జీవించవలెను. తగిన సమయమున గురుని చేరి గురూపదిష్ఠ మార్గములో నడువవలెను.

ఏ సాధనతో ఏది శుద్ధియగును:
 • 1. పంచభూతములతో ఏర్పడిన స్థూల శరీరము ఆసనముల వలన శుద్ధియగును.
 • 2. పంచతన్మాత్రలతో ఏర్పడిన సూక్ష్మ శరీరము సాంఖ్య విచారణచేత శుద్ధియగును.
 • 3. పంచ శక్తులతో ఏర్పడిన జీవుడు తారక యోగము వలన శుద్ధియగును.
 • 4. పంచ బీజములతో ఏర్పడిన ప్రాణము హంస విచారణచేత శుద్ధియగును.
 • 5.పంచ అధి దేవతలతో ఏర్పడిన ఆత్మ మహావాక్యార్థ విచారణచేత శుద్ధియగును.
ప్రాణాది వాయు చలనము:
ప్రాణము చిత్తమునకు బీజము. ప్రాణాదుల చలనము చేత చిత్తవృత్తులకు శబ్దాది విషయ జ్ఞానము కలుగుచున్నది. సర్వేంద్రియ భోగములు పొందబడుచున్నవి. అందువలన ప్రాణ నిరోధము చేత వృత్తిరూప జ్ఞానము నశించును. వెనువెంటనే స్వస్వరూప జ్ఞానము సిద్ధించును.

గర్భస్థ శిశువులో పంచవాయువుల క్రమము:
పురుషునిలో సమాన వాయువు వలన శుక్లము, స్త్రీలో వ్యాన వాయువు వలన శోణితము కలిగి దైవప్రేరణ వలన పొందుపడితే గర్భము నిలుచును. అప్పుడు శుక్ల శోణితముల వలన ప్రాణవాయువు వర్తించును. ఆ ప్రాణవాయువు, శుక్లములను ఆధారము చేసుకొని, వాటిలో అపానము నడచును. ప్రాణము ఊర్ధ్వ గతిలోను, అపానము అధోగతిలోను నడచును. ఈ స్థితిలో ఆ రెండింటిలో అగ్నిమయమైన ఉదానము, వ్యానము, సమానము వర్తించును. ఉదానమనగా  ప్రాణమునకు, అపానమునకు గల అంతరంగములో వెలిగే అగ్ని. ఆ అగ్నియే సర్వదేహాత్మకుడు.

ప్రాణాయామము ద్వారా ధ్యానము:
1728 ఉత్తమ ప్రాణాయామములను జరుపుట వలన ధ్యానము ఫలించి ఆత్మ విషయకమైన స్థిర లక్ష్యము కలుగును.

ప్రాణాయామము ద్వారా ధారణ:
144 ఉత్తమ ప్రాణాయామములను జరుపుట వలన ధారణ ఫలించి, ఆత్మ విషయముమీద ఏకాగ్రత కలుగును. నిశ్చల బుద్ధిని లక్ష్యమందుంచి, బాహ్య - అంతర ఆకాశములను ఏకము చేసి రెండవది లేకుండా చేసికొనుట. కార్యకారణములను ఏకాకార మొనర్చి అద్వైత భావనను వీక్షించుట.

ప్రాణాయామము ద్వారా సమాధి:
2073 ఉత్తమ ప్రాణాయామములు జరుపుటవలన సమాధి ఫలించి, లక్ష్యమైన ఆత్మతానే అయినదియై అద్వైతమును అనుభూతమొనర్చుకొనుట.

ధ్యానము:
దేనియందు విశ్వాసము కలదో దానియందు బుద్ధిని ఎడతెగకుండా నిలిపి ఉంచుటను ధ్యానము అందురు. అహంకారము ఓంకారముల మధ్య సంఘర్షణ కలిగించుటయే ధ్యానము.

అమావాస్య దృష్టి:
ధ్యానాభ్యాసము లేనివారు నేత్రములను మూసుకొని ధ్యానమును అభ్యసించుటను అమావాస్య దృష్టి అందురు.

పాడ్యమి దృష్టి:
కొంత అభ్యాసము కలవారు కొంత చూపును బయటికి ఉంచి, చాలావరకు నేత్రములను మూసుకొని ధ్యానము చేయుటను పాడ్యమి దృష్టి అందురు.

పూర్ణిమ దృష్టి:
ధ్యానాభ్యాసమందు ఆరూఢులైనవారు, పరిపక్వతను సాధించినవారు నేత్రములు తెరచియే ధ్యానము చేయుటను పూర్ణిమ దృష్టి అందురు.

ధారణ : చిత్తమును ఒక దిశగా బంధించుట, గురిని గుర్తుమీద పెట్టి నిలిపేది ధారణ.

సమాధి:
ఏ రూపమునూ గ్రహించక ధ్యేయ వస్తువునందు లగ్నమగుట, ధ్యానము ఆగిపోయి ఆత్మ నిష్టలో ఉండుట.

సంయమము:
ధారణ, ధ్యానము, సమాధి ఈ మూండింటి అభ్యాసములను సమన్వయపరచుకొనుటకు సంయమము అందురు. ఆత్మ లక్ష్యముగా చేయుటను ఆత్మ సంయమము అందురు.

ప్రతీక్ష : వచ్చునని ఎదురు చూచు వృత్తి. సాధకులు లక్ష్య సాధనకు ప్రతీక్ష చేయుదురు.

నిరీక్ష:
వచ్చునో, రాదో తెలియకుండా ఎదురు చూచు వృత్తి. లక్ష్య నిర్ణయము సరిగా లేకపోవుట.
 • గోపగోపికలు: గోపనముగా, ఏకాంతముగా సాధన చేయువారు.
 • దశరధుడు: దశేంద్రియములనెడి గుఱ్ఱములచేత కట్టబడిన మనస్సు అనే రధము తానైనవాడు.
 • శత్రుఘ్న: అంతఃశత్రువులను నాశనము చేయువాడు.
 • విభీషణ: ఈషణాత్రయము లేనివాడు.
 • గుహుడు: అజ్ఞానాంధకారమును హరించువాడు.
ఉత్సవము:
ఉత్‌+సవము = పైకి పురోగమించుటకు చేసే సాధన, యజ్ఞము, శ్రేయోమార్గము. అదే నిజమైన పండుగ.

అరణ్యము:
అ+రణ్యము = యుద్ధ వాతావరణము లేనిది. సంసారమందు ఆరాట పోరాటములు లేనిది. అనగా ప్రశాంతత. అందువల్లనే వానప్రస్థము అనగా అరణ్యములో వసించుట అనగా సంసారబంధము నుండి విడివడే ప్రయత్నము.

యుధిష్టరుడు:
యుద్ధమునందు కూడా స్థిరమైన చిత్తము కలవాడు. సంసారమునుండి విడుదలకు చేసే సాధన అనే యుద్ధమునందు కూడా సత్వగుణములో నుండగల స్థిరచిత్తము కలవాడు.

ఇంద్రియ వృత్తి నాశనము:
బాహ్యేంద్రియ, అంతరేంద్రియ కరణములు చలించక యున్నచో అది యోగము. అట్టి యోగాభ్యాసము కూడా ఉపేక్షింప బడినప్పుడు సకల ఇంద్రియ వృత్తులు పూర్తిగా నశించును.

నిశ్శేషము కావలసినది:
 • 1. విషయ వాసన. 
 • 2. మండుచున్న అగ్ని 
 • 3. ఋణము 
 • 4. వ్యాధి 
 • 5. శత్రువు 
 • 6. శత్రు భావన 
 • 7. మమకార వ్యామోహములు 
 • 8. విషము 
 • 9. ఎరుక.
ఇవి ఏ రూపములో ఉన్ననూ, ఏ కొంచెముగా ఉన్నను తిరిగి పుంజుకొని వృద్ధి చెందును. అందువలన జరిగే హాని పదింతలు ఎక్కువ.

అవస్థావాసులు:
 • ➣ విశ్వుడు బహిఃప్రజ్ఞగా ఉన్నాడు. తైజసుడు అంతఃప్రజ్ఞగా ఉన్నాడు. ప్రాజ్ఞుడు ప్రజ్ఞాన ఘనుడై ఉన్నాడు. విశ్వునికి స్థూల, సూక్ష్మ, అజ్ఞానములనెడి మూడు ఉపాధులు కలవు. 
 • ➣ తైజసుడికి సూక్ష్మము, అజ్ఞానము అనెడి రెండు ఉపాధులు కలవు. ప్రాజ్ఞుడికి అజ్ఞానము అనెడి ఒక ఉపాధి కలదు.
 • ➣ విశ్వునిలో క్రియాశక్తి, ఇచ్ఛాశక్తి, జ్ఞానశక్తి పనిచేయును. 
 • ➣ అప్పుడది జాగ్రదవస్థ. 
 • ➣ తైజసునిలో ఇచ్ఛాశక్తి, జ్ఞానశక్తి పనిచేయును. 
 • ➣ అప్పుడది స్వప్నావస్థ. ప్రాజ్ఞునిలో జ్ఞానశక్తి మాత్రమే ఉండును. 
 • ➣ అప్పుడది సుషుప్త్యవస్థ.
జ్యోతిష్మత్వము: శోకములేని తనము అనగా సుఖ స్వరూపము

జినుడు:
అన్ని గుణములను, దోషములను, ఇంద్రియ విషయములను జయించినవాడు. అది సహజమై జయశీలుడైనవాడు.

కర్దముడు:
దముడు అనగా ఇంద్రియములను నిగ్రహించినవాడు. కర్దముడనగా జితేంద్రియుడైన సుఖస్వరూపుడు.

మౌనము:
బ్రహ్మానంద సుఖములో మనస్సు లగ్నమై యున్నప్పుడు తదితరములన్నీ మౌనపడును. సర్వ జగద్విషయములపట్ల అతీతత్వ భావనచే ప్రశాంత దృష్టితో నిస్పర్థులై యుండుట.
 • 1. వాంగ్మౌనము : వాక్కు నిరోధమగుట.
 • 2. అక్ష మౌనము : చక్షురాది జ్ఞానేంద్రియముల నిరోధము.
 • 3. కాష్ట మౌనము : శరీర అవయవములతో కూడి జరుపబడే కర్మేంద్రియముల నిరోధము. ఈ మూడు విధముల మౌనములో చిత్త వాసనలు పూర్తిగా క్షయము కావు. కొన్ని మిగిలియుండును.
 • 4. సుషుప్తి మౌనము : మూడు అవస్థల విభాగము నశించును. పై మూడు మౌనముల అభ్యాస కాలమున కలిగిన క్లేశములు తొలగును. ఆరంభించుట ఆపుటలు ఉండవు. జగత్తు బ్రహ్మాకారముగా నిశ్చయమై, సాధకుడు నిర్వికల్ప బ్రహ్మభావముతో ఉండును. నిరవధిక బ్రహ్మనిష్ఠ ఏకాకారమై యుండును. తిరిగి వికారములు జనించవు.
వాస్తవిక మౌనావస్థ:
ప్రాణాయమము చేయుచున్నను, ధ్యానము చేయుచున్నను ఒకరకమైన మత్తు కలిగినప్పుడు ఏ ఆలోచనలు ఉండవు. మాట్లాడవలెనని అనిపించదు. కాని అది నిద్రకాదు. ఆ స్థితినే వాస్తవిక మౌనావస్థ అందురు.

ధీరుడు:
శీతోష్ణాది ద్వంద్వములను విమర్శించక, ద్వంద్వాతీత స్థితిలో ఉండి, సదా అద్వయమైన బ్రహ్మయందు నిష్ఠను సాధించినవాడు.

ఉపాధి:
ఉపాధికి ఆధారము, మాధ్యమము అని అర్థములు. స్థూల, సూక్ష్మ, కారణోపాధులు, విరాట్‌, హిరణ్య గర్బ, అవ్యాకృతోపాధులు, అవిద్యోపాధి, మాయోపాధి అని వాడుక. బ్రహ్మ ప్రకాశము ఆయా ఉపాధుల ద్వారా ప్రకటితమైనప్పుడు శుద్ధ ప్రకాశము బదులు ఉపాధి దోషముతో కూడిన ప్రకాశము గోచరమై, అనుభూతమగును. ఉపాధులు మిథ్య గనుకను, బ్రహ్మ మొక్కటే సత్యము గనుకను వైరాగ్య సన్న్యాసముల చేతను, బ్రహ్మోపాసన చేతను బ్రహ్మజ్ఞానమును పొందవలెను.

మహాకర్త:
సుఖదుఃఖములు, రాగద్వేషములు, ఇష్టాయిష్టములు, సత్యాసత్యములు, ఫలాఫలములు మొదలగు ద్వంద్వములను అపేక్షించనివాడు. అహంకారము, అభిమానము, మత్సరము లేనివాడు. నిశ్చింతగా కార్యములను జరుపువాడు. విరాగి, నిష్కామి, సాక్షీభూతుడు, నిర్మల బుద్ధికలవాడు, హర్ష విషాదములు లేనివాడు. దుఃఖములోను, వృద్ధి క్షీణములలోను, వార్ధక్యములోను జనన మరణాదులలోను సమభావము కలవాడు.

మహాత్యాగి:
మహా కర్తలో ఉన్న వాటితో సహా మరికొన్ని గుణములు కలవాడు. ధర్మాధర్మములు, జనన మరణములు, సుఖదుఃఖములు మదిలోనికి రానివ్వనివాడు. కోరికలు, సందేహములు, ఊహలు విడువబడినవాడు. దృశ్య వాసనలన్నింటిని వదలినవాడు.

మహాభోక్త:
మహా కర్త, మహా త్యాగిలో ఉన్నవాటితో సహా మరిన్ని గుణములు కలవాడు. దేనినీ కోరనివాడు. దేనినీ ద్వేషించనివాడు. శరీర ప్రారబ్ధము వలన లభించిన దానిని ఔననక, కాదనక అనుభవించేవాడు. సుఖదుఃఖ హేతువులైన పనులలోను, భ్రాంతిలో తోచే సంయోగ వియోగములలోను సంక్షోభము చెందనివాడు. రాజ్యము, దరిద్రము, జరామరణములు అన్నింటినీ రమ్యమైనవిగా అనుభూతి చెందేవాడు. రుచి, అరుచి, తినదగినవి, తినదగనివి అనే భేదము లేనివాడు. సంకల్ప వికల్ప రహితుడు. దృక్‌ దృశ్య భేదము లేనివాడు.

ప్రత్యక్‌ చైతన్యానుభవమునకు అంతరాయములు:
వ్యాధి, సంశయము, స్థ్యానము, ప్రమాదము, అనాసత్వము, అవిరతి, భ్రాంతి దర్శనము, అలబ్ధత్వము, చిత్త విక్షేపము, వీటి వలన అనుత్సాహము, వేదనతో కూడిన విచారము, భీతి, క్రమము లేని ప్రశ్వాస నిశ్వాసలు - ఇవన్నీ అంతరాయములు.

ద్రష్ట: చూపునందే శ్రద్ధ కలిగి నమ్మకము ద్వారా చూచేవాడు.

నిజమైన సేవ:
నీ సాధనలో నీవు ఉంటూ ఇతరుల సాధనకు సలహా ప్రోత్సాహముల నందించుట నిజమైన సేవ.

గురుసేవ:
గురువుకు సేవ చేయుట అనగా నిన్ను నీవు మరచి పూర్తిగా గురువుకు ఏమేమి కావాలో అది చేయుటయందే నిమగ్నమై యుండుట. గురువు యొక్క శరీరము, స్థానము, భావము, ఆత్మ అనునవి నీ రూపముగా మారి నీవు లేకుండాపోవుట. గురువు బ్రహ్మము కనుక అప్పుడు గురుసేవ అనే సాధన ద్వారా నీవూ బ్రహ్మమే.

ప్రత్యాహారము:
ప్రత్యేకించబడిన ఆత్మయందు మనస్సు నుంచి అనుభవించుట, విషయములవైపుకు వ్యాపించిన ఇంద్రియములను వెనుకకు మళ్ళించి నిర్విషయమగుటను ప్రత్యాహారము అందురు.
 • జ్ఞాత: ఏదైనా కోరి చేయాలని చేసేవాడు.
 • పని: కోరికతో చేసే క్రియ
 • చేష్ట: మనస్సు, ఇంద్రియములు అనే పనిముట్ల ద్వారా జరిగే క్రియ.
 • కామము: దేహమునకు, మనస్సునకు, జీవునికి జన్మించవలసిన అవసరము కల్పించే ప్రేరణ.
చింత:
ఆశయములకు, వాసనలకు మధ్య, మనస్సులో ఏర్పడే అనుకూలత, లేక దూరము, లేక వ్యతిరేకత.

ఆశ - ప్రతీక్ష:
తెలియని, స్పష్టముకాని వస్తువును వాంఛించుటను ఆశ అందురు. నిర్దుష్టమైన వస్తువును వాంఛించుటను ప్రతీక్ష అందురు.

మతము:

మతి అనగా బుద్ధి. మతము అనగా బుద్ధియొక్క నిశ్చయము. బుద్ధి పరిధిలో ఉండి, బుద్ధి పరిధిలో విశ్వసించుట, ఆచరించుట, ఇతర బుద్ధి నిశ్చయములను నమ్మకుండుట. వేద ప్రమాణముతో సమానము కానిది.
 • మనుష్యుడు: మనన శీలమైన మనస్సు కలవాడు. అభిమానము కలవాడు మానవుడు.
 • మనీషి : నిశ్చయ బుద్ధి కలవాడు మనీషి.
ఉత్తమ వ్యక్తిత్వమును శీలించుట:
సజ్జన సాంగత్యము, సద్గ్రంథ పఠనము, సద్భావనలను పంచుకొనుట, సత్కార్మాచరణ, లక్ష్య సాధనకు అవసరమైన పట్టుదల, త్యాగము, సహనము, దైవీభావము మొదలగు వానిని అభ్యసించుటను శీలించుట అందురు. ముందుగా వ్యక్తిత్వమును ఉత్తమముగా శీలించుకొని లక్ష్యమును ఆత్మ సాక్షాత్కారము మీదికి మార్చుకొని ఇష్ట దైవమునకు బదులు, సద్గురువును నిలుపుకొని, ఇష్ట దైవముకంటే మిన్నగా సద్గురువును ప్రేమించుచు, శుశ్రూషలు చేసిన వారికి, వారి వ్యక్తిత్వము నశించును. శుశ్రూష అనగా సేవ చేయువాడు లేకుండా పోవుట గనుక అదియే మోక్షము.

బహుజనులు:
పరివర్తనను ఒప్పుకోనివారు, అభిప్రాయమును మార్చుకోనివారు, మతమును గ్రుడ్డిగా నమ్మువారు. స్వభావమును, వ్యక్తిత్వమును మార్చుకొనుటకు ఇష్టపడనివారు. వీరు ముముక్షువులు కాలేరు.

మనస్సు వేగము:
 • 1. సగటు మనో వేగముంటే సాధారణ మానవుడు. 
 • 2. మరింత వేగముగా పనిచేస్తే పిచ్చివాడు. 
 • 3. మనస్సు వేగము మందగిస్తే భగవన్మత్తుడు 
 • 4. మనస్సు పనిచేయకుండా ఆగిపోతే ముక్తుడు, తానే పరమాత్మ.

మనస్సు:

మనస్సు తెలిసిన దానినుండి తెలిసిన దానికి కదులుతూ ఉండును. తెలియనిది మనస్సు ఆలోచించలేదు, తెలుసుకోలేదు. ఎప్పుడూ విషయీకరించుకొనుచూ, ద్వంద్వములుగా విభజిస్తూ ఉండును. ఆధిక్యమును కనబరుస్తూ ఉండును. ఆలోచన మౌనపడినప్పుడు మాత్రమే క్రొత్త క్రొత్తవి స్ఫురించును. మనస్సు జ్ఞాపకములమీద ఆధారపడి ఉండును. ఎప్పుడూ విభజించి చూచే మనస్సు సమైక్యతను సాధించలేదు. మనస్సు ఆలోచనలో ఉన్నంతసేపు అది రాగమే కాని, ప్రేమ కాదు. అసలు ప్రేమ అనేది మనస్సుకు సంబంధించినది కాదు. మనస్సు అంతమైనప్పుడే దైవీ ప్రేమ పుట్టును. సమైక్యత సిద్ధించును. స్వీయ జ్ఞానము సిద్ధించును.

మనస్సు చేసే పని :
నేను నేను అని పలికేది మనస్సు. పదార్థము గురించి అనన్యమైన వాటిని గురించి కలిగే జ్ఞానము మనస్సు. నిర్వికల్పమైనప్పటికీ నామరూపాత్మక పదార్థములను స్వప్నతుల్యముగా తోపింపజేసేది మనస్సు. మనస్సుకు మనస్సే ఆలంబన. సాక్షి, మరపు, ఎరుక, జ్ఞానము మనస్సుకే. శబ్దాది అణువులుండుటకు అవకాశమగు ఆకాశ రూపమే మనస్సు. జ్ఞాత, జ్ఞానము, జ్ఞేయము అనే రూపములు మనస్సే. త్రిపుటులుగా ఉండి అనుభవించేది మనస్సే. మాయ లేనివి ఉన్నట్లెలా కల్పించునో, అలాగే మనస్సు కూడా లేనివి ఉన్నట్లు కల్పించుకొనును గనుక, మనస్సే మాయ.

మనో వ్యాపకము:
మనో వ్యాపకమనగా మనస్సుకు ఏదో ఒక కార్యకలాపము ఉన్నట్లు. మనిషి జీవించి ఉన్నట్లు. మనస్సు తాను లేకపోవుటను అంగీకరించదు. మరణించుటకు ఒప్పుకొనదు. వ్యాపకముతోనే తనను తాను పోషించుకొనుచు ఉండును. ఎప్పుడూ దేనితోనో ఒక దానితో హడావిడిగా ఉండును. వ్యాపకమునకు విరామమును సహించదు. విషయములతోనో, దేవుడితోనో, యోగాభ్యాసములతోనో, సాధనలతోనో అయినాసరే సదా వ్యాపకము పెట్టుకొనుచూ ఉండును. శాంతి కోసమే ఇవన్నీ అని అనుకొనును. కాని, ఏ వ్యాపకము లేకుండా ఉండలేదు. కలకనుట, నిద్రపోవుట కూడా మనో వ్యాపకములే. మనో వ్యాపకము నశించినప్పుడు నిశ్శబ్దము ప్రారంభమగును. వ్యాపకము పూర్తిగా ఆగిపోతేనే అమనస్కమగును. శాంతి నిజానికి మనో సాధనల వలన రాదు. మనస్సుకు వ్యాపకము పూర్తిగా ఆగిపోతేనే శాంతి లభించును. ఈ సంగతి తెలిసి ఊరకుండుటయే గాని, పరమ శాంతి లభించుటకు యే సాధనలేదు. పరమశాంతమే మోక్షము.

మనో వ్యాపారము:
మనస్సు అన్నా, సంకల్పము అన్నా ఒక్కటే. సంకల్పము కలుగుటకు కారణము వాసనలు. సంకల్పము దృశ్యరూపమగును. దృశ్యము దర్శనము కాగానే మరలా వాసనలు ఏర్పడును. సంకల్పము నిస్సంకల్పమైతే మనస్సు నశించును. మనస్సున్నంతసేపు మనస్సుకు తోచినది మనస్సుకు సత్యమనిపించును. కలలో తోచినవి కలపురుషునికి నిజమనిపించినట్లు మనోకల్పితము మనస్సుకు నిజమనిపించును. మేల్కొంటే కల అసత్యమని ఎట్లు నిశ్చయమగునో, ఆత్మానుభవములో మేల్కొనినప్పుడు జాగ్రదవస్థతో పాటు సకలము అసత్యమని నిశ్చయమగును. దృశ్యమగుచున్నను అవియన్నీ అసత్యమే. అప్పుడు మిథ్యయనియు, యదృశ్యం తన్నశ్యం అనియు భావన కలుగును.

              ఆత్మశక్తి వాసనలతో కూడిన మనస్సుకు ఆధారమైయుండగా మనస్సు అనే ఉపాధి ద్వారా ప్రకటించబడేవన్నీ నామరూపములుగా, నానా విధములుగా, జగత్తుగా తోచుచున్నవి. వాసనలెట్టివో, ప్రపంచము ప్రపంచానుభవములు అట్టివి. అందరికి ప్రపంచానుభవము ఒక్కతీరు కాదు. అభావమందు దృశ్యము లేదు. వాసనాక్షయమైతే దృశ్యము లేదు. మనోనాశ్‌ అయితే దృశ్యము లేదు. ఈ పద్ధతిని తెలిసి జాగ్రత్తపడువాడు సాధనచేసి జ్ఞానియగును. ఈ పద్ధతిని విచారించక సాధన చేయువాడు అజ్ఞానిగానే యుండును. మనస్సు పనిచేయుచుండుటయే సంసారము.

సంసారమే బంధము :

అవిద్యా కామ సంకల్పము వల్లనే బంధము. అవిద్య నశిస్తే బంధ విముక్తి. అవిద్య నశించుటకు తత్త్వజ్ఞానము అవసరము. తత్త్వము తెలిసినవారికి వైరాగ్యము కలుగును. పిదప వాసనాక్షయమగును. చివరకు మనోలయమగును, ఆత్మగా ప్రతిష్ఠితుడగును.

బహు మానసులు:
ఎవరియొక్క మనస్సు ఆత్మ రూపమగునో, అయిననూ బాహ్య విషయములయందు ప్రసరించుచున్నప్పుడు ఆయా వస్తు రూపములను పొందుచున్నప్పటికినీ, తన ఆత్మ రూపమును కోల్పోవుటలేదో, వారు బహుమానసులు. ఉత్తమ జ్ఞానులను బహుమానసులు అందురు.

మనోపరిధిసాధనకు ఆలంబనలు :
ప్రతీకలైన విగ్రహాదులపై భక్తి సాధనలు, వాచకములైన ఓంకారము మొదలగు గురూపదేశ మంత్రములు.

మనో నిగ్రహమునకు ఉపాయములు :
 • 1. దానము : ఇతరుల సంతోషము కొఱకు మాటలతో, సేవలతో, సమర్పణతో, సహకారముతో మొదలగు విధములుగా స్వకీయ స్వభావమును, ప్రవర్తనను సరిదిద్దుకొనుట.
 • 2. స్వధర్మ నిర్వహణ : వర్ణాశ్రమ ధర్మములను, నియమిత ధర్మములను లోకకళ్యాణార్థము సహజీవుల క్షేమ స్థైర్య అభయ విజయముల దృష్టితో కౌశలముగా నిర్వర్తించుట.
 • 3. నియమము : ఇంద్రియములను భగవంతుని ఉపాసించే మార్గములో నియమించుట.
 • 4. యమము : అహింస, ప్రేమ, వాత్సల్యము మొదలగు అభ్యాసముల చేత ఇంద్రియములను నిగ్రహించుట.
 • 5. శ్రుతము : వేదశాస్త్రములను, మహనీయుల ప్రవచనములను, నిర్వచనములను శ్రవణముచేసి ఆకళింపు చేసుకొనుట, విచారణ చేయుట, ఏకాంతములో స్మరించుకొనుట, నలుగురితో కలిసి సత్సంగ పూర్వకముగా సంభాషించుకొనుట.
 • 6. సత్కర్మలు : వ్రతములు, పూజలు, దేవాలయములో సేవలు మొదలగునవి.
ఈ ఆరూనే గాక ఉపాసనలు, యోగాభ్యాసములు, నడవడికలు, అనుష్ఠానములు మొదలగునవి కూడా మనో నిగ్రహమునకు సహకరించును. ఆత్మజ్ఞాన లక్ష్యములో చేసే మనోనిగ్రహము మనోనాశ్‌కు దారితీయును. ఇదియే పరమ ప్రయోజనము.

మనోనాశ్‌ కొఱకు ఉపాయములు:
 • 1. ఆధ్యాత్మిక విద్యను సముపార్జించుట.
 • 2. సాధు పురుషుల సాంగత్యము 3. సకల వాసనల పరిత్యాగము 4. వైరాగ్యాభ్యాసము 5. ప్రాణస్పంద నిరోధము.
సాధకుని మనస్సు విభజన:
 • (1) సాధారణ సాధకుని మనస్సు 4 భాగములు చేసిన 2 భాగములు విషయములకు 1 భాగము ఆధ్యాత్మిక శాస్త్ర విచారమునకు 1 భాగము గురు శుశ్రూషకు ఉపయోగించవలెను. ఇట్టి వారిది మందమోక్షేచ్ఛ. 
 • (2) కొంత జ్ఞానము పొందిన మనస్సును 4 భాగములు చేసిన 1 భాగము విషయ భోగములకు 2. భోగములు శాస్త్ర విచారమునకు 1 భాగము గురుశుశ్రూషకు ఉపయోగించును. ఇట్టివారిది మధ్య మోక్షేచ్ఛ.
 • (3) ఎక్కువ జ్ఞానము పొందిన మనస్సును 4 భాగములు చేసిన విషయ భోగములను పూర్తిగా విడచి 2 భాగములు శాస్త్ర విచారమునకు 2 భాగములు గురు శుశ్రూషకు ఉపయోగించును. ఇట్టివారిది తీవ్ర మోక్షేచ్ఛ.
మనోనాశ్‌:
పల్చని వస్త్రమును కుట్టుటకు సన్నని సూది అవసరము, దబ్బనము పనికిరాదు. అలాగే సూక్ష్మాతి సూక్ష్మమైన ఆత్మను తెలుసు కొనుటకు సూక్ష్మబుద్ధి అవసరము. స్థూల బుద్ధి పనికిరాదు. స్థూలబుద్ధి విషయ వాసనలు, త్రిగుణములతోనున్న మనస్సును అనుసరించి పనిచేయును. సూక్ష్మబుద్ధి విరక్తి, వైరాగ్యము, తత్త్వచింతన, సత్కర్మోపాసనలు వలన ఏర్పడును. అప్పుడు ఆ సూక్ష్మబుద్ధి వలన ఆత్మాను సంధానము వీలగును. ఆత్మానుసంధానము పూర్తికాగానే మనస్సు నశించును. దీనినే మనోనాశ్‌ అందురు.

ప్రశాంతత:
వ్యాకులతను అర్థము చేసుకొనుట ద్వారా వ్యాకులత అంతమగును. అప్పుడే ప్రశాంతత. గతముతో పోల్చని, భవిష్యత్తు కొఱకు ఊహించని మనస్సు, వర్తమానములో ఉన్న స్థితిని అర్థము చేసుకొనుట వలన ప్రశాంతత లభించును. మాటమాత్రము మౌనమైతే మనస్సు ప్రశాంతము కాకపోవచ్చును. ఏదైనా మానుకున్నా, వద్దకున్నా ప్రశాంతత లభించదు. ధ్యానము వలన కూడా ప్రశాంతత రాదు. వివేక వైరాగ్యముల వల్లనే ప్రశాంతత కలుగును.

కోరికలు:
 • ➣ మనస్సన్నా, కోరికన్నా ఒక్కటే. మనస్సు కారణముగానున్నప్పుడు వాసనలు, స్మృతులు. కార్యరూపముగా ఉన్నప్పుడు వాంఛలు, కోరికలు. 
 • ➣ కోరికలే పునర్జన్మకు కారణము. 
 • ➣ కోరిక సగుణము. 
 • ➣ వస్తు సంబంధములో నుండి పుట్టేది కోరిక. 
 • ➣ మొదట గ్రహించుటగా, తర్వాత సంపర్కము పెట్టుకొనుటగా క్రమముగా అనుభూతి పొందుటగా మార్పు చెందుచూ, చివరకు కోరికగా వ్యక్తమగుచుండును. 
 • ➣ విషయాసక్తియే కోరిక. మొదట విషయాసక్తి స్వభావములో ఉండును. 
 • ➣ విషయము వాసనగా ఉండును. 
 • ➣ ప్రయత్నమువల్ల క్రమముగా కోరికగా వ్యక్తమగును. 
 • ➣ ఇతరుల భోగమును గమనించినప్పుడు గాని, అవకాశము వచ్చినప్పుడు గాని, తత్సంబంధమైన విషయాసక్తి వాంఛగా, కోరికగా వ్యక్తమై, కర్మగా మారును. 
 • ➣ ఫలితము అనుకున్నట్లుగాని, విరుద్ధముగా గాని ఉండును. 
 • ➣ మళ్ళీ అదే వాసనగా మారును. తృప్తి లభిస్తే మళ్ళీ మళ్ళీ కోరును. 
 • ➣ వ్యతిరేకముగా ఉంటే మళ్ళీ మళ్ళీ సాధించుటను కోరును. కుదరకపోతే వాసనగా ఉండును.
 • ➣ సమయాను కూలముగా ఎప్పుడో ఒకప్పుడు కోరికగా వ్యక్తమగును. 
 • ➣ సమస్యకు ప్రతి క్రియలేకపోయినప్పుడు ఆ సమస్యనుండి పుట్టేది కోరిక. కోరిక ఉండుటయే జీవితము. కోరిక లుప్తమైతే మరణము. ఇబ్బంది, 
 • ➣ బాధ, సుఖమువంటి వాటిమీద దృష్టి నిలుపుటలో చైతన్యము వినియోగపడుచూ ఉండును.
 • ➣ అసలు చైతన్య వినియోగమే కోరిక. కోరికలు లేని కేవల చైతన్యము స్థిరముగా ఉండి శాంతమును కలిగించును. 
 • ➣ కోరికతో ముద్రించబడిన చైతన్యము బంధము. 
 • ➣ కోరికలు చెరిపివేయబడిన చైతన్యము మోక్షము. 
 • ➣ కోరికలు తీరకపోతే పునర్జన్మ. 
 • ➣ కోరికల విషయములో జాగ్రత్తగా గమనించి, విడుదలకు ప్రయత్నించవలెను.
కోరికలను జయించు ఉపాయము:
కోరికలను జయించవలెననే భావమే కోరిక. ధ్యానము, తపస్సు, యోగము మొదలగు సాధనలు కోరికలను జయించవలెననే భావమే కోరిక. ధ్యానము, తపస్సు, యోగము మొదలగు సాధనలు చేయాలనేది కూడా కోరికే.
 • ➣ ఉపాయమేమంటే చేసే పనికి ఇష్టాయిష్టములు మూలము కాకూడదు. అత్యవసర కర్మ జరుపబడుచున్నట్లు ఉండవలెను. 
 • ➣ ముందుగా తలచుకోకుండానే చేయబడవలెను. పని పూర్తయిన తరువాత ఆ పని చేసినట్లుగాని, ఫలితముగాని గుర్తుకు రాకూడదు. 
 • ➣ స్వబుద్ధి నిర్ణయము ఉండకూడదు. 
 • ➣ దేనినీ విమర్శ చేయరాదు. 
 • ➣ తన పేరు, ఊరు, వ్యక్తిత్వమును, గొప్పతనమును, అపరాధమును ఎప్పుడైనా, ఎక్కడైనా ప్రకటించవలెననే భావన ఉండకూడదు. 
 • ➣ అనామకునివలె ఉండవలెను. 
ఈ విధముగా ఉన్నవాడు అగస్త్యుని అన్న. అతని పేరు, చరిత్ర ఎవరికీ తెలియదు. అందువలన అతడిని అస్త్య భ్రాత అని పిలిచెదరు. లేనివాడుగా ఉండవలెను. బ్రతికియు చచ్చినవానివలె నిష్క్రియా భావముతో ఉండవలెను.

ర్మలలో ఉత్సాహము గాని, నిరసన గాని చూపరాదు. అహము పనిచేయకూడదు. సంసారము, లోకము, మనోకల్పితమని, మనస్సే మాయయని, విచారణ ద్వారా తెలిసి తూష్ణీభూతముగా ఉండవలెను. ప్రారబ్ధమే కర్మను జరుపుచున్నది. నిజానికి ఎవరూ కర్మ చేయుటలేదు. నటనగా జీవించవలెను. వ్యవహారమందు అసంగముగా నుండవలెను. గతము గుర్తు రాకూడదు. భవిష్యత్తు గురించి చింత ఉండరాదు.

ఊహలు, పగటికలలు ఉండరాదు. కలలో తోచినవేలాగో అలాగేనని తలచి, ప్రతిస్పందన మానవలెను. అవసరమైనవి ప్రారబ్ధానుసారము జరుగుచున్నప్పుడు కర్తృత్వ రహితముగా ఉండుటయే లేనెరుక. ఎరుక ఏరూపములోనూ బాధించనప్పుడది లేనెరుక. విడచుట, మానుట, ఉదాసీనముగా ఉండుట, స్పందించకుండుట, గుర్తుంచు కొనకుండుట వంటివే కాని, ఇక ఏ సాధన లేదు. దీనినే కోరికలను జయించు ఉపాయముగా అభ్యాసము చేయవలెను.

వాక్కు:
మాటలో నిగ్రహము చాలా కష్టము. అర్థవంతము, ఆకర్షము అయిన మాట ఎక్కువగా మాట్లాడలేము. అయినను వీటిని సాధించవలెను. చక్కగా, ప్రియముగా మాట్లాడిన మాట పెక్కు శుభములనిచ్చును. ఆత్మ సాక్షాత్కరిస్తే మాట మౌనమగును. మాట్లాడినను మౌనమే యగును.

కర్మాయత సిద్ధములు:
కర్మేంద్రియములు వినియోగించినందువలన గతి, ఉక్త్యుత్‌, ఉత్సర్గము, శిల్పము అని నాలుగు దశలు క్రమముగా జరుగును.
1) గతి అనగా కదలికలు
2) ఉక్త్యుత్‌ అనగా అభివృద్ధి
3) ఉత్సర్గము అనగా సంబంధము
4) శిల్పము అనగా రూపనామములు.
ఈ క్రమములో సంసారము, బంధము ఏర్పడును. ఈ నాల్గింటిలో శబ్ద, స్పర్శ, రూప, రస, గంధ విషయముల అనుభవము వాసనారూపమగుచుండును. వీటి రచయిత, యజమాని, ఆస్వాదకుడు నిజానికి పరమాత్మయే. అజ్ఞానముచేత జీవుడు తనపై వేసుకుని బద్ధుడగుచున్నాడు. పరమాత్మకు ఇవన్నీ లీలా విలాసమనుకొని జీవుడు అజ్ఞానము నుండి విముక్తుడు కావలెను.

అహంకారము:
 • 1. ఐంద్రియము : ఇంద్రియములకు వశమై విచారణ చేయక, కాలమును వెళ్ళబుచ్చుట, దురభ్యాస, దుర్య్యసనముల నుండి వెనుకకు మరలలేక పోవుట. ఇట్టి వికారములతో కూడిన అహంకారమును ఐంద్రియము అందురు.
 • 2. వైకారికము : దృశ్య విషయముపై భావావేశము పొందుట, తాపము, తపన కలుగుట. అవినాభావత్వము అనగా తాదాత్మ్యత మొదలైన వికారములతో కూడిన అహంకారమును వైకారికమందురు.
 • 3. తామసము : కోపము, ఆవేశము, అధర్మ మార్గములో ఇతరులను బాధించుట, పగ సాధించుట, వేధించుట, మొదలగు స్పందనలతో కూడిన అహంకారము తామసము.
అహంకారము యొక్క పుట్టుక:
బ్రహ్మము మాయతో కూడిన వెంటనే వికారము చెందెను. మొదటి వికారముగా అహంకారము పుట్టెను. తరువాత వికారములతో అహంకారము కలసిపోయి అదికూడా వికారాత్మకమైనది. దానినే జీవుడు అని వ్యవహరించుచున్నారు.

అహంకార అస్తిత్వము:
తనలోనున్న గొప్ప గుణములచేత, తనలో లేని అల్ప గుణములచేత తనను ఇతరులకంటె హెచ్చుగా గాని, న్యూనతగా గాని తలచుకొనుటవలన అహంకారము ఉనికి కలిగి ఉన్నది.

స్పందత్రయము:
1. ఇంద్రియ స్పందన
2. మానస స్పందన
3. సంవిత్‌ స్పందన.
ఈ మూడూ నిశ్చలము కావలెను. అప్పుడే మోక్షము.

మతి పంచకము:
1. అహంకారము 2. అనాచారము 3. అవిద్య 4. అస్పష్టత 5. అజ్ఞానము. ఈ ఐదింటిని పోగొట్టుకొనవలెను.

బుద్ధి లక్షణములు:
సేవ చేయుట, వినుట, గ్రహించుట, గుర్తుపెట్టుకొనుట, ఊహించుట, పొరబడుట, అర్థము చేసుకొనుట, తత్త్వ జ్ఞానమును పెంచుకొనుట.

ఉత్తమ బుద్ధి సమన్వితులు:
ఎవరైతే జగత్‌ దృశ్యములలోని సర్వజీవులను వారివారి గుణకర్మ వ్యవహారములతో సహాచూస్తూనే, వారందరినీ గుణాతీత కర్మాతీతమగు ఆత్మ స్వరూపముగా దర్శించుచూ ఉపరతి పొందెదరో, అట్టివారు ఉత్తమ బుద్ధి సమన్వితులు అనబడుదురు.

బుద్ది తంత్రము:
మానవుడే జీవుడు, బుద్ధి జీవి. ఆ బుద్దితో చేయబడిన కల్పనయే నామరూప జగత్తు, ఉపాధులు.
 • ➣ యత్‌భావం తత్‌భవతి. అనగా లోపలి భావమెట్లో, అట్లే బయటి ప్రపంచము. ఈ కల్పిత ఉపాధులు, నామరూప జగత్తును బుద్ధి తంత్రము అందురు. ఇంతేకాదు, భౌతిక వైజ్ఞానిక సృష్టి, ఇహము, ఆముష్మికము, స్వర్గాది లోకములు, చివరకు పరమనునది కూడా బుద్ధి తంత్రమే. 
 • ➣ వేదచోదితమైన కర్మల ఫలితముగా లక్ష్యములను భావన చేసినందువలన కలిగిన వాసనా బలముతో కల్పితమైన వాటియందు వృత్తులు జనించి దర్శన అనుభవములను కలిగించును. 
 • ➣ ఏ భావము లేకపోతే దర్శనములుండవు. అనుభవములుండవు. అనగా అభావమందు సర్వమూ శూన్యమే. దేహిలేడు, దేహములు లేవు. లోకములు లేవు, లోకేశుడు లేడు.  లోకస్థ అనుభవము లేదు, ఇహపరములు లేవు.
 • ➣ బుద్ధి తంత్రము ఆగిపోతే భ్రాంతి రహితమే. బుద్ధి తంత్రము ఉంటే సకల ఎరుకలు. అందులో ఎరిగే ఎరుక లేకపోతే దృక్‌, దృశ్య దర్శనములు లేవు. త్రిపుటి రహితము. బుద్ధి తంత్రమే ఇంద్రజాలము, మాయ, ప్రకృతి, అజ్ఞానము, ప్రజ్ఞానము. బుద్ధి తంత్రము లేకపోతే బట్టబయలే సిద్ధము.
బుద్ధిమంతులు:
 • 1. పండ : తెలుసుకొనగలిగిన బుద్ధి
 • 2. మేధ : వినినదానిని మరువని బుద్ధి
 • 3. చార్వి : ఊహ, అప ఊహలద్వారా వికసించిన బుద్ధి
 • 4. చత్త్వ : గురుబోధ వినుటయందు విసుగు కలుగని బుద్ధి
 • 5. గృహీతి : బోధింపబడిన దానిని తప్పక గ్రహించు బుద్ధి
 • 6. శ్రౌతి : గురుసేవ, గురుబోధలయందు శ్రద్ధ, సహనము కలిగిన బుద్ధి
 • 7. ప్రతిభ : శ్రుతి, యుక్తి, ప్రజ్ఞలతో శ్రవణ మననములు చేసి, విన్నది విన్నట్లు, అదే ప్రకారము తిరిగి మరొకరికి బోధించి మెప్పించు బుద్ధి.
అవివేక బుద్ధి:
తాను పేద అయినా లక్షాధికారివలె ఖర్చు చేయుచు, ఆపదల పాలగును. సోమరిగా జీవించును. శ్రమించడు, సంపాదించడు. ఉద్యోగము వచ్చినను, స్థిరముగా ఉండడు. కాని ధనకాంక్ష, భోగలాలస అధికముగా నుండును. నమ్మిన స్నేహితులను మోసగించును. అప్పులు చేసి తీర్చడు. అందరినీ అనుమానించును. ఇలవేల్పును పూజించడు. పిలువని పేరంటముగా మరొకరి వద్దకు వెళ్ళును. తాను తప్పులు చేయుచూ ఇతరుల తప్పులు వెదకుచుండును. అందరూ నిద్రించినప్పుడు మేల్కొని ఉండును. విద్య ఉన్ననూ, వినయము, వివేకము ఉండవు. మధ్యలో విద్య, ఉద్యోగములను మానివేయును. అందువలన విద్యను మరచును. వృద్ధాప్యములో అశక్తుడై, నిస్సహాయుడై, కొరగాని వాడుగా అనేక బాధలు పడుచుండును.

వివేక బుద్ధి:
ఏ పని చేయగలడో, ఏ పని చేయలేడో తెలిసిన బుద్ధి. చేయలేని పనికి ప్రయత్నించడు. పోగొట్టుకున్న దానికోసము చింతించడు. నిశ్చయించిన పనికి ప్రమాదములు సంభవించునని భయపడడు. పరిహసిస్తే పట్టించుకొనడు. పొగడ్తలకు పొంగిపోడు. తను నేర్చుకున్న దానిని, తనకు తెలిసినదానిని ఇతరులకు ధైర్యముగా తెలియజేయను. ఎవరికీ భయపడడు. ప్రారంభించిన పనిని మధ్యలో వదలిపెట్టడు. తన విజ్ఞానమునకు గర్వపడడు. తొందరపాటు నిర్ణయములు తీసుకొనడు. ఇతరులను సంప్రదించిన మీదట నిర్ణయములు తీసుకొనును. ఇతరుల నిర్ణయములను గ్రుడ్డిగా అనుసరించడు. ఒంటరిగా పయనించడు. తోటివారితో కలసిమెలిసి ఉండును. విద్యతోపాటు వివేకము, వినయము, సమయస్ఫూర్తి ఉండును.

సంకల్పములు:
 • 1. మృగ సంకల్పము : ఆహార నిద్ర భయ మైధున విషయ చింతనలు మాత్రమే ఉండి ధర్మాచరణ లేక, ఇతరులకు కీడుచేయు పశుతుల్యులైన వారి సంకల్పము మృగ సంకల్పమనబడును.
 • 2. మనుష్య సంకల్పము : తన సామాన్య ధర్మమును పోషించుచు, ఇతరులను చెరపక యుండువారి సంకల్పము మనుష్య సంకల్పము అనబడును.
 • 3. దేవ సంకల్పము : దైవిక సంబంధమగు కార్యములను చేయవలెననెడి సంకల్పము. కొంత అంతఃకరణ శుద్ధి ఉండుట దేవ సంకల్పమనబడును.
 • 4. ఋషి సంకల్పము : విషయ వాసనాతీతమైన స్థితిలో కలిగే సంకల్పము, జీవ కారుణ్యము, లోక కళ్యాణము, శాంతి కలిగించే సంకల్పము ఋషి సంకల్పము.
 • 5. ఈశ్వర సంకల్పము: త్రిమూర్తుల సృష్టి, స్థితి లయములలో, లోకపాలన, నియతి పాలన సంబంధించిన విశుద్ధ సంకల్పము ఈశ్వర సంకల్ప మనబడును.
 • 6. నిస్సంకల్పము : దృశ్యములేవీ తోచకుండుట, ఆత్మాకారమై యుండుట, కేవల జ్ఞేయ స్వరూపమైయుండుట నిస్సంకల్పమనబడును. నిస్సంకల్పుల ఆజ్ఞలు దేవతలకు, త్రిమూర్తులకు శిరోధార్యము.
స్మృతి:
సంస్కార మాత్రముచేత పుట్టే ఏ జ్ఞానమున్నదో, అది స్మృతి అనబడును. ఒకసారి అనుభవింపబడిన విషయము స్మృతి రూపములో ఉండి అదే తిరిగి తలచుకొనుటకు ఆధారమగును. అది త్రివిధము.
 • 1. వేగము : ఏ సంస్కారము క్రియాజన్యమో దానికి వేగమని పేరు.
 • 2. భావన : ఏ సంస్కారము పూర్వ అనుభవముచేత పుట్టి స్మృతి జ్ఞానమునకు జనకమై యున్నదో దానికి భావన అని పేరు. భావన ప్రకటితమునందు ఉనికి కలిగి యున్నది.
 • 3. స్థితి స్థాపకము : అన్యథా చేయబడిన వస్తువునకు పూర్వమువలె స్థితిని చేయునట్టి సంస్కారమునకు స్థితిస్థాపకము అని పేరు.
 • ఈ మూడింటి పర్యవసానముగా అసత్య అనుభూతి, ఫలరహిత జ్ఞానము కలుగును.
 • 1. అనుభూతి : స్మృతి జ్ఞానమునకు భిన్నమైన ఏ జ్ఞానమున్నదో అది అనుభూతి. యధార్థ స్మృతి రూపమనగా యధార్థ అనుభవ రూపము, లేక యధార్థ నిశ్చయము.
 • 2. ఫలరహిత జ్ఞానము : ఏ వస్తువు యొక్క నిశ్చయానంతరము ప్రవచించిన పురుషునికి ఆ వస్తువు యొక్క ప్రాప్తియగుట లేదో అది అ యధార్థ నిశ్చయము లేక ఫలరహిత జ్ఞానము.
వృత్తి వ్యాప్తి:
అంతఃకరణ వృత్తి ఏదైనా విషయమునకు దగ్గరగా రాక మునుపు, ఆ విషయము ఆవరించబడి, తెలియబడదు. అదే వృత్తి విషయమునకు దగ్గరగా వచ్చినప్పుడు ఆవరణ తొలగి ఆ విషయము తెలియబడును. ఈ విధముగా ఒక వృత్తి తెలియని స్థితినుండి తెలియబడే స్థితికి వ్యాపించుటను వృత్తివ్యాప్తి అందురు.

ఫలవ్యాప్తి:
విషయముపైన ఆవరించిన అజ్ఞత తొలగినంతనే అంతఃకరణ వృత్తియందు ఉపహితమైయున్న చైతన్యము దీపకాంతివలె ఆ విషయమును దర్శింపజేయును అనగా అక్కడ ఉన్న విషయమును ప్రకాశింపజేయును. అప్పుడు అజ్ఞత తొలగి, విషయము తెలియబడును. ఈ పద్ధతిని ఫలవ్యాప్తి అందురు.

తురీయ జ్ఞానము:
అంతఃకరణ వృత్తి నిరోధమైనప్పుడు అజ్ఞత ఉండుట - తొలగుట యను ప్రసక్తి ఉండదు. విషయములు ప్రకాశింపబడవు. అట్టి నిర్విషయమందు దీపకాంతిగా నున్న చైతన్యము మాత్రమే ఉండి, స్వప్రకాశమై యుండును. దీనినే తురీయ జ్ఞానము అందురు.

కుపథము : చిత్త విక్షేపము, తత్త్వమును ఏమరుస్తూ ఉండే ప్రవృత్తి మార్గము.

చిత్తము:
చిత్‌+తమము= తమముచేత ఆవరించబడిన చైతన్యము, అనగా ఆవరించబడిన జ్ఞానము. అనగా అజ్ఞానము. వ్యాప్తమైన చిత్‌, సంకోచము చెందుట వలన ఏర్పడినది చిత్తము. పరిమితముగా మిథ్యా వస్తువులను గ్రహించి, స్పందించునది చిత్తము. అపరిమితముగా సత్యమే తానుగా ఉన్నది చిత్‌. కనుక చిత్‌ యొక్క అణుమాత్రమైన పరిమితిని చిత్తము లేక అజ్ఞానము అందురు. సాధనచేత, పరిమితమైన చిత్తమును అపరిమితముగా వ్యాపింప జేయగా ఏర్పడినది చిత్‌ లేక జ్ఞానము.

విపర్యయము:
మిథ్యా భూత రూపములందు జ్ఞానమును నిలుపుటను విపర్యయమందురు. మిథ్యాభూత విషయములు నిర్విషయమైనప్పుడు చిత్తమనునది ఉండదు అనగా ఆవరణ తొలగి చిత్‌ అనెడి జ్ఞానము సిద్ధించును.

ఆవృత్తి లేక కృష్ణగతి:
స్వతః ఆత్మ స్వరూపుడైన వాడే జీవుడు. కాని కొందరు యోగాభ్యాసకులు, అనాత్మ రూపమైన స్థితిగతులవైపుగా ఆశయములు కలిగియుందురు. వారిది ఆవృత్తి మార్గము లేక కృష్ణగతి అందురు. వీరు జన్మరాహిత్యమును పొందరు, పునరావృత్తికి లోనగుదురు.

క్లిష్ట వృత్తులు:
చిత్తమందు గల రాగద్వేషాదులను అసుర వృత్తులందురు. ఈ వృత్తులను, దైవ వృత్తులను ఆధారము చేసుకొని నిరోధించుకొనవలెను.

అక్లిష్ట వృత్తులు:
అభయ, అమానిత్యాది వృత్తులను అక్లిష్ట వృత్తులందరు. వీటిని దైవ వృత్తులని కూడా అందురు. ఈ దైవ వృత్తులు కూడా నశింపచేసుకొనవలెను. అప్పుడే ముక్తి.

కషాయము : తీవ్రమైన చిత్త దోషములు, తీవ్రమైన రాగద్వేషములు వాసనా రూపముగా నున్న దానిని కషాయము అందురు. ఈ కషాయము చిత్త లయము కానీయకుండా సమాధి నిష్ఠను చేరనీయకుండా నిరోధించును. ఒకవేళ సమాధి నిష్ఠ సమీపించినప్పటికీ తిరిగి విక్షేపమును కలిగించును. ఒకసారి చిత్తము స్థబ్ధమగును. దీనిని ఉన్మనీ అవస్థగా పొరబడుచుందురు.  దీనికి కారణము కషాయము. అందువలన చిత్తదోష నివారణకు, వైరాగ్యాభ్యాసము చేయవలెను.

చిత్తము యొక్క విశ్లేషణ:
సకల జీవరాశులయొక్క అనేక జన్మల సంచిత కర్మ రాసి, సంస్కార రూపమున ఒక ముద్దగా నున్నది. దీనిని మూల ప్రకృతి అందురు. ఒకానొక దశయందు, కాల ప్రభావమున, ఆ సమష్టిరూప ముద్ద అనేక వ్యష్టి రూపములను దాల్చి, జీవులకు సంబంధించి చిత్తము లాయెను. పరమాత్మ చైతన్యముతో ముడిపడియున్నప్పుడు ఈ సంచిత కర్మ రాశియే అవ్యక్తము, మాయ. వ్యష్టిలో చిత్తము అనబడేది వృత్తి రహితమైతే చిత్తమే ఉండదు. ఆ స్థానములో చైతన్యము అనుభూత మగును. మాయలేనిది గనుకను, మాయ అనగా లేనివే ఉన్నట్లు గోచరింప జేయును  గనుకను, చిత్‌ స్వరూపమే అన్ని కాలములలో స్వతస్సిద్ధమై యున్నది. అందువల్లనే చిత్త వృత్తి నిరోధము కాగానే చైతన్యానుభవమునకు ప్రతిబంధకము తొలగుచున్నది.
 • ➣ చిత్తమనగా వాసనలతో కూడిన ప్రకృతిపరమైన చైతన్యమే. ఈ కూడిక విడిపోతే చిత్‌ స్వరూపము సాక్షాత్కరించును. వృత్తులున్నప్పుడది చిత్తము. వృత్తులు అణగియున్నప్పుడు అనగా గాఢ నిద్రలో అది ప్రకృతి. ఆ ప్రకృతి చైతన్యమును ఆధారము చేసుకొన్నప్పుడు అది పురుషుడు. నిజానికి ఆ పురుషుడినే చిత్తము అందురు.
 • ➣ చిత్‌పై ముద్రించబడిన అనేక వాసనలచేత, ఆ ముద్రలున్నచోట చిదంశలుగా కనబడేవన్నీ జీవుల వ్యష్టి చిత్తములు. ఈ చిత్తములలో ఆయా వాసనల కారణముగా పరిమితత్వము, అనేకత్వము, బేధములు తోచును. చిత్తము అనే ఆవరణ తొలగినంతనే శుద్ధమైన చిత్‌ ప్రత్యక్షమగును. ఒక్కొక్క చిదంశలో, చిత్తనాశనము కాగానే అక్కడి కల్పించబడిన జీవ భావము తొలగి చిత్‌ స్వరూపము సాక్షాత్కరించును. ఆ చిదంశ రూప జీవుడు వాసనలచేత ముద్రించబడిన చైతన్యానుభవమునకు బదులు నిర్వాసనా చైతన్యమును అఖండముగా, అవిభాజ్యముగా అనుభవించును. అనగా పరిమితత్త్వమును, అనేకత్వమును, భేదములను తొలగించుకొని స్వాత్మయగును.
పంచ క్లేశములు:
 • 1. అవిద్య : అనిత్య వస్తువుమీద నిత్యత్వమును, దుఃఖ విషయమును సుఖ విషయముగా ఆపాదించుకొనుట అనెడి చిత్తవృత్తి.
 • 2. అస్మిత : దృక్‌, దర్శనము, దృశ్యములతో తాదాత్మ్యత చెందినట్టి నేను ఉన్నాను (అసత్య నేను) అనెడి చిత్త వృత్తి.
 • 3. రాగము : సుఖమును అనుసరించి, చిత్తమునందు కలిగే ప్రీతి.
 • 4. ద్వేషము : దుఃఖమును అనుసరించి, చిత్తమునందు కలిగే వ్యతిరేకత.
 • 5. అభినివేశము : ఎంతటి పండితుడైనను, అన్నింటినీ తనయందే ఆపాదించుకొని, ఆరోపించుకొను చిత్తవృత్తి.
చిత్త వృత్తి బీజములు:
దృఢమైన భావనతో కార్యకారణములను గూర్చి యోచించక, పదార్థమును శీఘ్రముగా గ్రహించుటను సంస్కారము అందురు.
 • ➣ ఈ దృఢ వాసనయే ముఖ్య ప్రాణము. దీనిననుసరించియే చిత్తము ఉనికిలోనికి వచ్చును. ఈ చిత్తము శరీరోత్పత్తికి బీజము. 
 • ➣ శరీరము సంసారమునకు బీజము. 
 • ➣ సంసారము అనగా బంధము. 
 • ➣ బంధ విముక్తికి  తత్త్వజ్ఞానమును సముపార్జించుకొనవలెను. 
 • ➣ తత్త్వజ్ఞానముచేత వాసనా క్షయమగును. 
 • ➣ వాసనాక్షయముచేత చిత్తనాశనమగును. 
 • ➣ చిత్త నాశనముచేత చిత్తవృత్తి నిరోధమగును. 
 • ➣ చిత్తవృత్తి నిరోధమగుటచేత మోక్షము సిద్ధించును.
చిత్త విషయములు:
 • 1. విషయములలో మునుగుచు, తేలుచు ఉండును.
 • 2. ఒకే విషయములో స్థిరత్వము కలిగి యుండును.
 • 3. నిద్ర, లేక విశ్రాంతిలో నుండును.
 • 4. అన్ని విషయములను బాహ్యముగా వదలి యున్నను, విషయ వాసనలు అంతరముగా ఉండును.
 • 5. కాలము కర్మము కలిసి వచ్చినప్పుడు వాసనలు కార్యరూపము దాల్చి జాగ్రత్‌, స్వప్న అనుభవములను అందించును.
చిత్త వృత్తులు:
 • 1. ప్రమాణము : ప్రత్యక్ష ప్రమాణమును నమ్మే వృత్తి, అనుమాన ప్రమాణమును నమ్మే వృత్తి, ఆగమ ప్రమాణమును నమ్మే వృత్తి.
 • 2. విపర్యయము : మిథ్యా ధ్యానముతో రూపములను కల్పించుకొను వృత్తి.
 • 3. వికల్పము : శబ్ద జ్ఞానము ప్రతీతమైనను, ఆ శబ్దార్థమైన వస్తువు లేకుండుట. ఉదా : కుందేటి కొమ్ము
 • 4. నిద్ర : తాను తనయొక్క లేమితనమును నమ్మే వృత్తి.
చిత్త గతులు:
 • 1. క్షిప్తము : రజోగుణముచేత విషయములందు కదలిన చిత్త వృత్తిని క్షిప్తము అందురు. ఇది దైత్య దానవుల వృత్తి.
 • 2. మూఢము : తమో గుణముచేత నిద్రను కలిగించే చిత్త వృత్తిని మూఢము అందురు. ఇది పిశాచ, రాక్షసుల వృత్తి.
 • 3. విక్షిప్తము : సత్త్వ గుణముచేత ఏకాగ్రతను పొందుచున్నను, మధ్య మధ్యలో రజోగుణముచేత విషయాంతరములందు ప్రవర్తించు చిత్తవృత్తిని విక్షిప్తము అందురు. ఇది దేవతల స్వభావము.
 • 4. నిరోధము : సత్త్వగుణ ఉత్కర్ష చేత కలిగే పరిణామమును చిత్త వృత్తి నిరోధము అందురు. ఉత్తమమైన వైరాగ్యము ద్వారా విశుద్ధ సత్త్వముగా మరింత పరిణామము చెందును. ఇది జీవన్ముక్తులకు, సిద్ధ పురుషులకు ఉండును.
 • 5. శాంతము : స్వప్నరూపమైన చిత్తమును శాంతము అందురు.
 • 6. ఘోరము : జాగ్రత్‌ రూపమైన చిత్తమును ఘోరము అందురు.
 • 7. మృతము : సత్త్వగుణ రూపమైన చిత్తమునందు వృత్తులు సాక్షీ భూతముగా తెలియబడుచుండుట. దీనిని చిత్తము యొక్క మృతము అందురు.
చిత్త నాశము:
వ్యుత్థాన వాసనలు నశించి, నిరోధవాసనలు ప్రాదుర్భవించినప్పుడు ఆ నిరోధ క్షణముతో చిత్తము చేరియుండుటయే చిత్త నాశము. సత్త్వగుణాధిక్యత చేత అంతఃకరణము ఏకాగ్రతను పొంది, ఇతర చిత్త వృత్తులు పూర్తిగా నిరోధమైనప్పుడు అది చిత్త నాశము అనబడును.
 • ⧫ సంగము : మూఢ చిత్తము గలవారికి ఉండే సంసార మూలమైన వాసనలు.
 • ⧫ సంగ విలాసము : జన సమూహము మృతి చెంది, మరల మరల నానా యోనులలో నుండి పుట్టుచు, చచ్చుచు పునరావృత్తి చెందుచుండుటను సంగవిలాస మందురు. ఇది రెండు విధములు.
 • 1. వంధ్య సంగము : మూఢులైనవారు రౌరవము, అవీచి, కాల సూత్రము మొదలగు నరక యాతనలను పొందుట. 
 • 2. వంద్యా సంగము : తత్త్వజ్ఞులైనవారు ఆత్మానాత్మ వివేకము చేత వారిలో ఆత్మ నిశ్చయము కలుగగా, ఆత్మ రూపమగుట మరియు జనన మరణ రహితమగుట. సంగ రాహిత్యమే మోక్షము.
సమాధి విఘ్నములు:
అనుసంధానము లేకుండుట, ఆలస్యము, భోగేచ్ఛ, నిద్ర, అవివేకము, బ్రహ్మానందమును పొందితిననెడు రసాస్వాదన, అభిమానము, శూన్యత్వము, నాస్తికత్వము మొదలగు విఘ్నములు.

సమాధిలో రకములు :
 • 1. సంప్రజ్ఞాత సమాధి : రూపములను, శబ్దములను అనుసరించి వచ్చెడి వితర్కము, విచారణ, అస్మిత, ఆనందములు.
 • 2. అసంప్రజ్ఞాత సమాధి : విరామము, ప్రత్యయము, అభ్యాసము అనెడి వాటితో కూడిన సంస్కారము.
 • 3. వితర్కానుగత సమాధి : మనస్సు స్థూలమునుండి సూక్ష్మము వరకు ఆలోచించగల్గుట, మనోలగ్నతను అంతర్ముఖము చేయుట.
 • 4. విచారానుగత సమాధి : మనస్సు అంతర్నిహితమైన అంశములమీద దృష్టిని ఉంచుట, స్థూల వస్తువులందు సూక్ష్మమును చూడగల్గుట.
 • 5. అస్మితానుగత సమాధి : విశ్వ కుహరములో పూర్తిగా లయమగుట, నేను, నాది వంటివి లేకుండా నామరూప ప్రపంచము అదృశ్యమగుట, ఆధి దైవిక ప్రజ్ఞతో ఈశ్వరుడు అనెడి పరమ పురుషునితో సంగత్వమును సూచించుట.
 • 6. ఆనందానుగత సమాధి : దర్శనములో మానవ స్పృహను పూర్తిగా విడచుట, దృక్‌, దృశ్యముల మధ్యగల విభజన రేఖ చెరిగిపోవుట.
 • 7. సవితర్క, సవిచార సమాధులు : పంచభూతములు, పంచ తన్మాత్రలను గూర్చిన చింతన ఉండును. సవితర్క సమాధిచేత మనస్సు నిర్మలమగును. తదుపరి గురూపదేశము, స్వానుభవ యుక్తులు అవసరమై, తుదకు జ్ఞేయరూపము నిశ్చయమగును.
 • 8. నిర్వితర్క సమాధి : శబ్దార్థములగు తలంపులు ఏవియు లేకుండా, ధ్యానించు వస్తువు మాత్రమే మిగిలి యుండుట.
 • ఇవిగాక శబ్దాను విద్ధ సవికల్ప సమాధి, దృశ్యానువిద్ధ సవికల్ప సమాధి, నిర్వికల్ప సమాధి, సహజ నిర్వికల్ప సమాధి అని కూడా విభజన కలదు. సహజ నిర్వికల్ప సమాధియే మోక్షము.
శ్లో||  అహంకారావిష్ఠ స్సంసారీ జీవః స ఏవ పశుః
                                                                - జాబాల్యుపనిషత్‌
తా||  ఈశ్వరునియందు అహంకారము వ్యాపకము కాగా, సంసార సహితుడైన జీవుడు తోచుచున్నాడు, బద్ధుడగుచున్నాడు.


శ్రు||  చిత్తమూలం హి సంసారః తత్‌ ప్రయత్నేన శోధయేత్‌
                                                                 - వరాహోపనిషత్‌
తా||  సంసారము చిత్తమూలముగా కల్పించబడినది. కావున స్వప్రయత్నముతో సంసారమును శోధించవలెను. అందువలన చిత్త నాశమై ముక్తుడనబడును.


శ్రు||  స్వ వ్యతిరిక్త వస్తు సంగరహిత స్మరణం విభూషణమ్‌
                                                              - భావనోపనిషత్‌
తా||  తనకంటె వేరైన దృశ్య వస్తువులతో సంగత్వ బుద్ధిని విడచిపెట్టి యుండుటయే విభూషణము (అతడే ముక్తుడు).


శ్రు||  స ఏవ జగత్సాక్షి సర్వాత్మా విమాలకృతి
                                             - కఠరుద్రోపనిషత్‌
తా||  జగత్తుకు సాక్షి, సర్వాత్మకుడు, విమలాకారుడు అయివున్నవాడు ముక్తుడే.

రచన: చల్లపల్లి

కామెంట్‌ను పోస్ట్ చేయండి

0 కామెంట్‌లు
* Please Don't Spam Here. All the Comments are Reviewed by Admin.
కామెంట్‌ను పోస్ట్ చేయండి (0)

buttons=(Accept !) days=(0)

Our website uses cookies. Learn More
Accept !
To Top