ఓంకారము - బ్రహ్మ స్వరూపత్వం - Omkaramu


ఓంకారం


"ఓం" బ్రహ్మ స్వరూపత్వం. "ఓం" పదం శబ్ద బ్రహ్మం. "ఓం"కారం అక్షర పరబ్రహ్మ స్వరూపం.
ప్రణవోహి పరబ్రహ్మ పణవః పరమం పదం
ప్రణవం సర్వవేదాధ్యం సర్వదేవమాయం విద్దు: //

ప్రణవమే - పరబ్రహ్మం, ముక్తి, వేదాలకు మూలం, సకలదేవతలమయమైంది.
సృష్టాదిన బ్రహ్మదేవుని కంఠంనుండి వెలువడిన శబ్దములు రెండు. మొదటిది 'ఓం'కారం. రెండవది 'అధః'. కావున ఈ రెండును పరమ పవిత్రమైన మంగళశబ్దములు. విధాత ప్రప్రధమమున ఓంకారమునే ఉచ్చరించెను. ఏ యొక్క పరమాత్మ శక్తి చేత తాను సృష్టికి  శక్తిమంతుడయ్యనో, అట్టి పరబ్రహ్మం యొక్క స్వరూపం ఓంకారమనియు, అది దేవతలకు, సర్వజనులకు ధ్యేయమనియు తెలిపెను.

భగవన్ కిం తదాదౌ ప్రయుక్తం ధ్యానం ధ్యాయితవ్యం
కిం తద్ధ్యానం కో వా ధ్యాతా కశ్చ ధ్యేయః //
                                  -అథర్వశిఖోపనిషత్తు
భావం: ఓ భగవంతుడా! ఆదికాలమునందు బ్రహ్మాది దేవతలు ఉపయోగించినది ఏది? ధ్యానము ఏది? ధ్యానింపదగినది ఏది? ధ్యానమునకు సాధనమయ్యేది ఏది? ధ్యాత ఎవడు? ధ్యేయం (మంత్రముచే తెలుసుకొనదగినది) ఏది?

స ఏభ్యో థర్వా ప్రత్యువాచ ఓ మిత్యక్షరమేతదాదౌ
ప్రయుక్తం ధ్యానం ధ్యాయితవ్యం //
                  -అథర్వశిఖోపనిషత్తు     
భావం: ప్రణవాక్షరమే ఆదియందు ఉపదేశింపబడింది. అదియే ధ్యానం. దానినే ధ్యానింపవలయును.

సకృదుచ్ఛరిత మాత్ర ఊర్ధ్వమున్నామయతీత్యోంకారః
                                                      - అథర్వశిఖోపనిషత్తు
ఒక్కమారు ప్రణవం (ఓం) ఉచ్చరించినమాత్రముననే శ్రేష్టగతిని (పరమపదంను) చేర్పించుటంబట్టి ఓంకారమనబడును.

ప్రాణాన్ సర్వాన్ పరమాత్మని ప్రణానయితీ త్యేతస్మాత్ ప్రణవః
ప్రణవం అంటే సర్వప్రాణములను పరమాత్మునియందు లగ్నం చేయునది అని అర్ధం.

సర్వేవేదా యత్పదమామనన్తి తపాగ్మ్ సి సర్వాణి చ యద్వదంతి
యదిచ్చంతో బ్రహ్మచర్యం చరన్తి తత్తే పదగ్మ్ సంగ్రహేణ బ్రవీమ్యో మిత్యేతత్ //
                                                                                               -కఠోపనిషత్తు                                   

భావం: వేదములన్నియు ఏ వస్తువును పొందదగినదానినిగా చెప్పుచున్నవో, తపస్సులన్నియు దేనిని ఆచరింపమని చెప్పుచున్నవో, దేనిని కోరుచున్నవారై బ్రహ్మప్రాప్త్యర్ధం అగు బ్రహ్మచర్యం ఆచరించుచున్నారో ఆ వస్తువును గూర్చి నీకు సంగ్రహముగా భోదించుచున్నాను  - అదే "ఓం".

"ఓం" అనే పదమే అవినాశి అయిన పరబ్రహ్మం. అదే ఈ బ్రహ్మాండం-విశ్వం. ఇప్పటివరకు ఉన్నది, ఇప్పుడు ఉన్నది, ఇకపై ఉండబోయేది అంతా ఓం అనే పదమే.

ఓంకార వివరణ:
  • అకార, ఉకార, మకారములతో కూడినది ఓంకారం.
  • ❊ అక్షరములలో అకారం మొదటిది. ఈ శబ్దం కంఠంనుండి పుట్టుచున్నది. ఇది ప్రణవం యొక్క ప్రధమమాత్రయు, బ్రహ్మయు,బ్రహ్మశక్తి సృష్టియు అగుచున్నది.
  • ❊ ఉకారశబ్దం దవడల మధ్యనుండి ఉద్భవించుచున్నది. ఇది ఓంకారం యొక్క ద్వితీయమాత్రయు, విష్ణువై ఉన్నది. విష్ణుశక్తి స్థితియు అయివున్నది.
  • ❊ మకారశబ్దం పెదవుల కొసనుండి జనించును. ఇది ప్రణవం యొక్క తృతీయమాత్రయు, మహేశ్వరుడును, శివశక్తి లయ మగుచున్నది.
కంఠంనుండి అకారధ్వని ఆరంభించి ఓష్టాన్తమున అంతమగుటచే(లయమగుటచే) అన్ని అక్షరములు(శబ్దములు) ఈ మూడింటి ఆదిమధ్యాన్తములలో ఉద్భవించుట చేత వేదములన్నియు ఈ ఓంకారమునుండియే ఏర్పడినవని శ్రుతివాక్యం. కావున ఈ ఓంకారం ఒకదానిని పఠించినచో వేదములన్నింటిని చదివినవారగుదురని ఋషులు చెప్పెదరు.


ప్రణవం హీశ్వరం విద్యాత్సర్వస్య  హృది సంస్థితం
సర్వవ్యాపినమోంకారం మత్వా ధీరో న శోచతి //

జనుడు స్మరణజ్ఞానమునకు స్థానమైన హృదయమునందున్నఈశ్వరుని ఓంకారముగా తెలుసుకోవలెను. ఇట్లు సర్వవ్యాపకమైన ఓంకారమును తెలుసుకొన్న జ్ఞాని శోకనిమిత్తమైన అజ్ఞానాది నాశమగుటవలన దుఃఖింపడు.

'ఓంకార ఆత్మేవ'  ఓంకారం ఆత్మయేనని నిర్వచింపబడింది.

  • 'తస్య వాచకః ప్రణవః'  నిర్గుణ పరమాత్మ స్వరూపమును తెలుపునట్టి సమర్ధమైన శబ్దం ఒక్క ఓంకారం మాత్రమే.
  • 'అక్షరమంబరాన్త ధృతే: // (బ్ర.సూ).  పృధివి మొదలు ఆకాశం వరకు గల పంచభూతములను ధరించుటవలన అక్షరశబ్దముచే (ఓంకారముచే) చెప్పబడునది పరబ్రహ్మమే.
ధనుర్గృహీత్వౌపనిషదం మహాస్త్రం  శరం హ్యుపాసానిశితం సందదీత /
ఆయమ్య తద్భావగతేనా చేతసా  లక్ష్యం తదేవాక్షరం సౌమ్య విద్ధి //
                                                                              -ముండకోపనిషత్తు 

భావం: ఉపనిషత్తులలో ప్రసిద్ధమగు, గొప్పఅస్త్రంవంటింది అగు (ప్రణవమగు) ధనస్సును గ్రహించి ఉపాసనంచేత పదునుపెట్టబడిన (ఆత్మయను) బాణమును ఎక్కుపెట్టవలయును. ఆ అక్షరబ్రహ్మమునందు (ధ్యానంను పొందిన చిత్తంచేత లాగి ఆ పూర్వం చెప్పియుండెడి) లక్ష్యమును కొట్టవలయునని తెలుసుకొనుము.

అంటే ఉపనిషత్ ప్రసిద్ధమైన ఓంకారమనెడి ధనస్సును గ్రహించి ఆ ధనస్సునందు ఉపాసనచేత వాడిగలదియగు జీవాత్మయను బాణమును ఎక్కుపెట్టి, ఆ ఎక్కుపెట్టిన బాణమును ఇంద్రియసముదాయముల యొక్క విషయములనుండి మరలించి లక్షమునందే ఉంచి బ్రహ్మధ్యానం పొందియుండెడి మనస్సుచేత పూర్వోక్తమగు అక్షరస్వరూపమునే లక్ష్యముగా కొట్టవలనని తెలుసుకొనుము.

ప్రణవో ధనుశ్శరో హ్యాత్మా  బ్రహ్మ తల్లక్ష్య ముచ్యతే /
అప్రమత్తేన వేద్ధవ్యం  శరవత్తన్మయో భవేత్ // 

భావం: ఓంకారం ధనుస్సు, జీవాత్మయే బాణం,అక్షర పరబ్రహ్మమే ఆ బాణమునకు గురికావల్సిందిగా చెప్పబడెను. సావధానమగు (ఏకాగ్రత) మనస్సు కలవానిచేత కొట్టబడవలెను. ఆ బాణమువలనే జీవుడు లక్ష్యమగు బ్రహ్మముతో పరమసామ్యము పొందెను.


buttons=(Accept !) days=(0)

Our website uses cookies. Learn More
Accept !
To Top