హరిహర సుతనే ధర్మశాస్త్ర అయ్యప్ప - Harihara Sutane Dharmasastra Ayyappa

0
హరిహర సుతనే ధర్మశాస్త్ర అయ్యప్ప - Harihara Sutane Dharmasastra Ayyappa

ధర్మశాస్త్ర అయ్యప్ప

వర్ణనాతీతమైన దివ్యమైన ఙ్ఞానమంగళ విగ్రహం. హరిహరాత్మకమైన ఏక చైతన్యం, తత్వమసి, అహం బ్రహ్మాస్మి మొదలైన మహా వాక్యాల ద్వార ప్రతిపాదింపబడుతున్న అద్వైత తత్వానికి సాకారం. ధ్యానిస్తే చాలు సమస్త తత్వసారమూ సాక్షాత్కారమవుతుంది. అయ్యప్ప మహిమ జగద్విదితం. స్వామి లీలలు స్కాందాది (శివరహస్య ఖండాంతర్గత) పురాణగాధల్లో వర్ణించబడ్డాయి.

హరిహరాత్మకం:

నారాయణుడు, శివుడు వేరు తత్వతః ఒక్కరే అని వేద, పురాణాలు సుస్పష్టంగా వక్కాణిస్తున్నయి.

యోహం సత్వం జగచ్చేదం

స దేవాసురమానుషం

అవిద్యా మోహితాత్మానః

పురుషా భిన్నదర్శినః

"శంకరా, నేను దేవాసుర మనుషాది సహితమైన ఈ జగత్తు నీ స్వరూపమే. అవిద్యామోహితులు భిన్నభిన్నంగా భావిస్తారు" అని విష్ణుపురాణంలో విష్ణువచనం,

అహం త్వం సర్వగోదేవ

త్వమేవాహం జనార్దన

ఆవయోరంతరం నాస్తి

శబ్దై రర్ధై ర్జగత్త్రైయే

"నేను సర్వగతుడవైన నీవే. నీవే నేను. శబ్దాలచే గాని, అర్ధాలచే గాని మన ఉభయులకు భేదం లేదు" అని హరివంశంలో శంకరుడు విష్ణువుతో అన్నమాటలు. ఈ అభేద ప్రతిపత్తి అయ్యప్ప రూపంలో రూఢి అవుతోంది. హరి, మోహిని రూపం ధరించగా, హరుడు మోహించాడని కథ. నారీవేషం ధరించిన విష్ణువు సాక్సాత్తు పరాశక్తి. "పుం రూపా విష్ణువిగ్రహా" అని లలితోపాఖ్యానం చెప్తోంది.

  • "లలితాదేవి ధరించిన పురుష రూపమే విష్ణువు" ఇద్దరిలో ఒకే లక్షణం ఉంది, అందుకే ఆమె వైష్ణవి. పద్మనాభ సహోదరి (విష్ణు సోదరి). ఏకలక్షణం చేత వారు సోదర స్థానీయులు.
  • ఉమాదేవి స్వయంగా విష్ణువు. ఇదే విషయాన్ని " శివానందలహరి"లో "బాణత్వ్"శంకరా, ఆ విష్ణువు నీకు భార్యగా అర్ధ భాగాన్ని స్వీకరించాడు" అని అన్నారు శంకర భగవత్పాదులు.

శివుడు అగ్ని తత్వం కాగా, నారాయణుడు జల తత్వం. ఈ విశ్వమంతా అగ్నిసోమాత్మకం(జలం). స్త్రీవాచకంగా చెప్పినప్పుడు సోమం-ఉమాదేవి. పురుష వాచకంగా - విష్ణువు.అగ్నిసోమంగా విశ్వవ్యాప్తమైన చైతన్యం పరమాత్మ. ఆ ఏకత్వ ప్రతిపాదకమైన పరమాత్మ శివ నారాయణాత్మక జ్యోతిస్వరూపంగా దర్శించారు. అదే అయ్యప్పమూర్తి.

అన్ని యోగ రహస్యాలు స్వామి మూర్తిలోనూ, తత్సన్నిధి కోసం జీవుడు చేసే యాత్రలోనూ ప్రస్ఫొటమవుతుంటాయి. 18 పరిపూర్ణతను సాదించిన ఙ్ఞానికి సంకేతం. ఆ ఙ్ఞాన సాధనే 18 మెట్లు ఎక్కడం.

అయ్యప్పకు మరో పేరు 'ధర్మశాస్తా. 'శాస్తా అంటే గురువు అని అర్ధం. ఆదిశంకరులు 'శాస్తారం ప్రణమామ్యహం' అంటూ ఆ స్వామిని స్తుతించారు. " ఇది ధర్మం, ఇది యోగం" అని శాసించి ఆచరింపచేసేవాడు కనుకనే గురువును "శాస్త" అన్నారు.

స్వామి 'చిన్ముద్ర ధరించి ఉంటారు. అంటే "బొటనవేలు చూపుడు వేలు కలిపి" ఉంచే ముద్ర. మనం దక్షిణామూర్తి లో ఈ ముద్రను దర్శించవచ్చు. అయ్యప్ప కూడ చిన్ముద్ర ధారి. మండలం పాటు దీక్ష గా ఉండి స్వామిని దర్శించాలన్నారు. దీక్షతో వెళ్ళిన వారికే "యాత్రా ఫలం" లభిస్తుంది.

40 రోజులనేది చాలా శాస్త్రీయమైన సంఖ్య. మన శరీరమానసిక చైతన్య వ్యవస్థగా రూపుదిద్దుకోడానికి 40రోజులు పడుతుంది. { ఆయుర్వేదంలో కూడ ఒక మందు మండలం రోజులు వాడితే కాని ఫలితం ఉండదు అంటారు } అందుకే మండలదీక్ష నిర్ణయించారు.

అయ్య, అప్ప - అనే దేశీయమైన పదాలు "ఆర్యా""పితా" అనే ఆర్ష శబ్దాల రూపాలే. గురువే ఆర్యుడు. ఆయనే పరమాత్మ. ఉపాసకుల కోసం ఒకే పరతత్వం వివిధ రూపాలుగా దర్శనమిస్తుంది. అలా ధరించిన యోగ ఙ్ఞానమయ మంగళమూర్తి - ధర్మశాస్త.

"స్వామియే శరణం అయ్యప్ప" అనే మాట పరమ మంత్రమై సాధకులకు సిద్ధిని ప్రసాదిస్తోంది.

" హరిహర సుతన్, ఆనంద చిత్తన్, అయ్యన్, అయ్యప్ప స్వామియే శరణం అయ్యప్పా......"

 

ఆధారం : షణ్ముఖశర్మగారి ప్రవచనం

కామెంట్‌ను పోస్ట్ చేయండి

0 కామెంట్‌లు
* Please Don't Spam Here. All the Comments are Reviewed by Admin.
కామెంట్‌ను పోస్ట్ చేయండి (0)

buttons=(Accept !) days=(0)

Our website uses cookies. Learn More
Accept !
To Top