వ్యాసభగవానుడు - Vyasa Bhagwan

0
వ్యాసభగవానుడు - Vyasa Bhagwan

వ్యాసభగవానుడు
పరాశర్యం పరం పురుషం విశ్వవేదైకయోనిం
విశ్వాధారం విబూధ వినుతం వేదవేదాంతవేద్యం |
శశ్వచ్చాంతం శమిత విషయం శుద్ధబుద్ధి విశాలం
వేదవ్యాసం విమల మతిదం సర్వదా హం నమామి ||

పరాశరుని కుమారుడు, పరమపురుషుడు, ఙ్ఞానులచే స్తుతింపబడువాడు, వేదవేదాంత వేద్యుడు, మంచి బుద్ధిని ప్రసాదించు వేదవ్యాసునికి సదా నమస్కరిస్తున్నాను.
వ్యాస భగవానుని జననం :
వ్యాస మహర్షి, సత్యవతీ గర్భాన జన్మించిన వృత్తాంతాన్ని దేవీ భాగవతం పేర్కొన్నది.
యమునాద్వీపంలో సత్యవతి సద్యోగర్భంలో అపర మన్మధుని వలె ఉన్న మహాతేజస్సంపన్నుడైన వ్యాసమహర్షి జన్మించాడు. ఆ ద్వీపంలోనే జన్మించి ఆ ద్వీపంలోనే ఉంచబడిన బాలుడు కాబట్టి అతనికి "ద్వైపాయనుడు" అని పేరు వచ్చింది. ఆయన పుట్టిన వెంటనే తల్లికి నమస్కరించి, తపస్సు చేయడానికి ఆమె అనుమతిని పొంది నిష్క్రమించాడు.

వ్యాసశ్రమం :
వ్యాసాశ్రమం బదిరికి వెళ్ళే త్రోవలో అలకానందా సరస్వతీ నదుల సంగమస్థానంలోని "శమ్యాప్రాస" తీర్ధానికి సమీపంలో ఉంది. వ్యాసుడు వేద ప్రచారం ఇక్కడనుండే ప్రారంభించాడని, పైలుడు, వైశంపాయనుడు, జైమిని, సుమంతుడు మొదలైన మహర్షులు ఇక్కడే వేదశాస్త్రాలలో శిక్షణ పొందారని పురాణాలు చెబుతున్నాయి. కాని, వరాహ పురాణం ప్రకారం వ్యాసుడు, మధుర వద్దనున్న సోమతీర్ధం, వైకుంఠ తీర్ధముల మధ్యనున్న విష్ణు గంగాతీరంలో తపస్సు చేసినట్లు వివరణ.

వ్యాసుడు జగత్కళ్యాణం కోసం ఒకే రాశిగా ఉన్న వేదాలను విభజించి వాటి శాఖలను విడివిడిగా నిర్దేశించాడని భట్టభాస్కరుడు, తైత్తిరీయ సంహితలో స్పష్టం చేశాడు. అలాగే దుర్గాచార్యుడు, వేదరాశి ఒకటిగా ఉండి, అధ్యయన చేయడం కష్టంగా ఉండేదనీ, దానిని నాలుగుగా విభజించి, సులభతరం చేసారని పేర్కొన్నారు. 
       ఇప్పుదు జరుగుచున్నది, వైవస్వత మన్వంతరం. ఈ మన్వంతరంలో ఇది 28వ కలియుగం. ముందు గడిచిన 27 మహాయుగాలలో అనేక పేర్లుగల "వ్యాసులు" ఆవిర్భవించి, 27సార్లు వేదవిభజన చేశారు.కృష్ణద్వైపాయనుడు చేసిన వేదవిభజన 28వది. దీని బట్టి, ఇంద్రుడు మొదలైన పదవుల పేర్లు ఉన్నట్లే, "వ్యాస" అనేది కూడ ఒక పదవికి సంబందించినది అని. దానిని అధిష్టించు వ్యాసులు అనేకమంది ఉంటారని తెలుస్తొంది.

గతంలోని వ్యాసుల పేర్లు విష్ణుపురాణం ప్రకారం
 •  1) స్వయంభువు 
 •  2) ప్రజాపతి 
 •  3) ఉశనుడు (శుక్రాచార్యులు) 
 •  4) బృహస్పతి 
 •  5) సూర్యుడు 
 •  6) యముడు 
 •  7) ఇంద్రుడు 
 •  8) వసిష్టుడు 
 •  9) సారస్వతుడు 
 • 10) త్రిధాముడు 
 • 11) త్రివృషుడు 
 • 12) భరద్వాజుడు 
 • 13) అంతరిక్షుడు 
 • 14) ధర్ముడు 
 • 15) త్రయారుణి 
 • 16) ధనుంజయుడు 
 • 17) కృతంజయుడు 
 • 18) సంజయుడు 
 • 19) అత్రి 
 • 20) గౌతముడు 
 • 21) హార్యాత్మకుడు 
 • 22) వేణుడు 
 • 23) సోముడు 
 • 24) తృణబిందుడు 
 • 25) భార్గవుడు 
 • 26) శక్తి మహర్షి 
 • 27) జాతుకర్ణుడు 
 • 28) కృష్ణద్వైపాయనుడు 
ఈ విధముగా ప్రతి ద్వాపరయుగంలోను ఒక మహనీయుడు వ్యాసపీఠాన్నలంకరిస్తాడు. వ్యాసభగవానుడు వేదమూర్తి, హిమాలయా శిఖరాలే ఆయన సముత్తుంగ శిరస్సు. కన్యాకుమారి ఆయన పాదద్వంద్వం. శ్రీలంక పాదపీఠం. యుగయుగాల వేదఘోషలోని ప్రణవనాదమే ఆయన హృదయ స్పందన. గంగాది సర్వనదీనదాలే రక్తనాళాలు. భారతీయ సంస్కృతే ప్రవహించే రక్తం. ఆయన నేర్పిన నడవడే ధర్మం. ఆయన అడుగుజాడలే భారతదేశాన్ని ప్రపంచదేశాలకు గురువుగా నిలిపాయి. ఆయనే వేదవ్యాసులు.

ఈ ప్రపంచ వాఙ్మయంలో ప్రతిదీ లోతుగా పరిశోధిస్తే చివరకి వాటి మూలంలో వ్యాసమహర్షే కనిపిస్తారు. అందుకే "వ్యాసోచ్చిష్టం జగత్సర్వం" అన్నారు. వేదవిఙ్ఞాన సర్వఙ్ఞ పీఠాధిపతి. అందుకే ఆయన జన్మదినమైన ఆషాఢ పూర్ణిమను భారతదేశమంతా వ్యాపూర్ణిమగా/గురుపూర్ణిమగ జరుపుకుంటాము. మహాయోగి అరవిందులు, వ్యాసుడిని జాతీయ కవిగాను, భారతాన్ని జాతీయ కవ్యంగాను అభివర్ణించారు. వ్యాసుడు తన నలుగురి శిష్యుల ద్వార 4వేదాలను, సూతమహర్షి ద్వారా సకల పురాణ సంపదను, వైశంపాయనుని ద్వార మహాభారతాన్ని, శుకయోగి ద్వార భాగవతాన్ని మానవజాతికి అందించారు.
 
రచన: గాయత్రి

కామెంట్‌ను పోస్ట్ చేయండి

0 కామెంట్‌లు
* Please Don't Spam Here. All the Comments are Reviewed by Admin.
కామెంట్‌ను పోస్ట్ చేయండి (0)

buttons=(Accept !) days=(0)

Our website uses cookies. Learn More
Accept !
To Top