'భగవద్గీత' యధాతథము - మొదటి అధ్యాయము : 'Bhagavad Gita' Yadhatathamu - Chapter One, Page-6

'భగవద్గీత' యధాతథము - మొదటి అధ్యాయము : 'Bhagavad Gita' Yadhatathamu - Chapter One, Page-6

శ్లోకము - 19
సఘోషో ధార్తరాష్ట్రాణాం హృదయాని వ్యచారయత్ |
నభశ్చ పృథివీం చైవ తుములోక అభ్యనునాదయన్ ||

సః - ఆ; ఘోషః - ధ్వని; ధార్తరాష్ట్రాణాం - ధృతరాష్ట్రుని కుమారుల; హృదయాని - హృదయాలను; వ్యదారయత్ - బద్దలు చేసింది; నభః - ఆకాశమును; -కూడ; ఏవ - నిశ్చయముగా; తుములః - అతి భీకరముగా; అభ్యనునాదయన్ - ప్రతిధ్వనింపజేస్తూ.
  ఆ వివిధ శంఖముల ధ్వని అతి భీకరముగా అయింది. ఆకాశము, భూమి రెండింటిని కంపింపజేస్తూ అది ధృతరాష్ట్ర కుమారుల హృదయాలను బద్దలు చేసింది.

భాష్యము : దుర్యోధనుని పక్షంలో భీష్మాదులు తమ తమ శంఖాలను ఊదినపుడు పాండవ పక్షము వారికి హృదయము బద్దలు కాలేదు. అటువంటి సంఘటనలు ప్రస్తావించబడలేదు. కాని పాండవ పక్షమువారు చేసిన ధ్వనులతో ధృతరాష్ట్ర తనయుల హృదయాలు బ్రద్దలైనాయని ఈ ప్రత్యేకమైన శ్లోకంలో చెప్పబడింది. పాండవులు, వారికి శ్రీకృష్ణుని యందు ఉన్నట్టి విశ్వాసమే దీనికి కారణం. దేవదేవుని శరణుజొచ్చినవారికి ఎంతటి ఘోరవిపత్తులోనైనా భయపడవలసిన అవసరము ఉండదు.

శ్లోకము - 20
అథ వ్యవస్థితాన్ దృష్ట్వాధార్తరాష్టాన్ కపిధ్వజః |
ప్రవృత్తే శస్త్రసమ్పాతే ధనురుద్యమ్య పాణావః |
హృషీకేశం తదా వాక్యమిదమాహ మహీపతే ||

అథ - అప్పుడు; వ్యవస్థితాన్ - నిలిచి ఉన్నట్టి; దృష్ట్యా - చూసి; ధార్తరాష్ట్రాన్ - ధృతరాష్ట్ర తనయులను; కపిధ్వజః - హనుమంతుని చిహ్నముతో ఉన్నట్టి ధ్వజము కలిగినవాడు; ప్రవృత్తే - సిద్ధపడుతూ; శస్త్రసమ్పాతే - బాణాలను విసరడానికి; ధనుః - ధనస్సును; ఉద్యమ్య - చేపట్టి; పాణ్డవః - పాండుసుతుడు (అర్జునుడు); హృషీకేశం - శ్రీకృష్ణ భగవానునితో; తదా - అప్పుడు; వాక్యం - వాక్యమును; ఇదం - ఈ; ఆహ - అన్నాడు; మహీపతే - ఓ రాజా.
  ఆ సమయంలో పాండుసుతుడైన అర్జునుడు కపిధ్వజము కూర్చబడిన రథంలో నిలిచినవాడై ధనస్సును చేపట్టి బాణాలను విసరడానికి సిద్ధపడ్డాడు. ఓ రాజా! వ్యూహముగా నిలిచి ఉన్నట్టి ధృతరాష్ట్ర తనయులను చూసి అతడు శ్రీకృష్ణ భగవానునితో ఈ మాటలు పలికాడు.

భాష్యము : యుద్ధం కొద్ది సమయంలో ప్రారంభం కాబోతున్నది. యుద్ధరంగంలో శ్రీకృష్ణ భగవానుని ప్రత్యక్షోపదేశాలచే నిర్దేశితులైన పాండవుల ద్వారా ఏర్పాటుచేయబడినట్టి అనూహ్యమైన సేనావ్యూహముచే ధృతరాష్ట్ర తనయులు దాదాపు పూర్తిగా నిరుత్సాహపడ్డారని పై వాక్యము ద్వారా అర్థమౌతోంది. హనుమద్ చిహ్నితమైన అర్జునుని ధ్వజము విజయానికి మరొక సూచనగా అయింది. ఎందుకంటే రామరావణుల హనుమంతుడు శ్రీరామునికి సహాయము చేసాడు; అప్పుడు శ్రీరామునికే విజయము లభించింది. ఇప్పుడు శ్రీరాముడు, హనుమంతుడు ఇద్దరు అర్జునునికి సహాయ్యంగా అతని రథంలో ఉన్నారు. శ్రీకృష్ణ భగవానుడు స్వయంగా శ్రీరాముడే. 
  అంతే కాకుండ శ్రీరాముడు ఎక్కడ ఉంటే ఆతని నిత్యసేవకుడైన హనుమంతుడు, ఆతని నిత్యదేవేరియైన సీతాదేవి (లక్ష్మీ దేవి) అక్కడే ఉంటారు. కనుక అర్జునునికి ఎటువంటి శత్రుభయం లేనే లేదు. అన్నింటికి మించి హృషీకేశుడైన శ్రీకృష్ణుడు అతనికి మార్గదర్శనము చేయడానికి స్వయంగా ఉన్నాడు. ఈ విధంగా యుద్ధనిర్వహణ విషయంలో సంపూర్ణ సహకారము అర్జునునికి లభ్యమై ఉంది. తన నిత్యభక్తుని కొరకు భగవంతుడు ఏర్పాటు చేసినట్టి అటువంటి మంగళకరమైన పరిస్థితులు సునిశ్చితమైన విజయానికి సూచనలుగా అయ్యాయి.

శ్లోకము - 21-22
అర్జున ఉవాచ
సేనయోరుభయోర్మధ్యే రథం స్థాపయ మే అచ్యుత |
యావదేశాన్నిరీక్షే అహం యోధుకామానవస్థితాన్ |
కైర్మయా సహ యోద్ధవ్యమస్మిన్ రణసముద్యమే ||

అర్జునః ఉవాచ - అర్జునుడు పలికాడు; సేనయోః - సేనల; ఉభయోః - రెండు; మధ్యే - మధ్య; రథం - రథమును; స్థాపయ - నిలుపవలసింది; మే - నా యొక్క అచ్యుత - ఓ చ్యుతి లేనివాడా; యావత్ - అంతవరకు; ఏతాన్ - వీరినందరిని; నిరీక్షే - చూడగలిగిన; అహం - నేను; యోధుకామాన్ - యుద్ధము చేయగోరి; అవస్థితాన్ - యుద్ధరంగంలో నిలిచినవారిని; కై - ఎవరితో; మయా - నేను; సహ - కూడా; యోద్ధవ్యం - యుద్ధము చేయాలో; అస్మిన్ - ఈ; రణసముద్యమే - యుద్ధయత్నంలో. 
  అర్జునుడు పలికాడు : ఓ అచ్యుతా! దయచేసి రెండు సేనల మధ్య నా రథమును నిలుపవలసింది. తద్వారా యుద్ధం చేయగోరి ఇచ్చట నిలిచినవారిని, మహాసంగ్రామంలో నేను తలపడవలసినవారిని చూడగలుగుతాను.

భాష్యము : శ్రీకృష్ణుడు దేవాదిదేవుడే అయినప్పటికిని నిర్హేతుకమైన కరుణతో తన మిత్రుని సేవలో నెలకొన్నాడు. తన భక్తుల పట్ల అనురాగము చూపడంలో ఆతడు ఏనాడూ విఫలుడు కాడు, అందుకే ఇక్కడ ఆతడు అచ్యుతునిగా సంబోధించబడినాడు.
  రథసారథిగా ఆతడు అర్జునుని ఆదేశాలను అమలు చేయవలసి వస్తుంది. ఆ విధంగా చేయడానికి ఆతడు సంకోచింపని కారణంగానే అచ్యుతునిగా సంబోధించబడినాడు. తన భక్తునికి రథసారథి స్థానాన్ని స్వీకరించినా ఆతని దివ్యస్థితికి ఎన్నడు భంగము రాదు. అన్ని పరిస్థితులలో ఆతడు దేవదేవుడే, సర్వేంద్రియాధిపతియైన హృషీకేశుడే. భగవంతుడు, సేవకుని మధ్య సంబంధము అతిమధురమైనది, దివ్యమైనది. సేవకుడు సర్వదా భగవంతునికి సేవ చేయడానికి సన్నద్ధుడై ఉంటాడు. అదేవిధంగా భగవంతుడు కూడ భక్తునికి ఏదో కొంత సేవ చేసే అవకాశాన్ని ఎల్లప్పుడు కోరుకుంటాడు. తాను ఆదేశాలను ఇచ్చేవానిగా అవడం కంటే తన విశుద్ధభక్తుడు తననే ఆజ్ఞాపించే స్థానాన్ని స్వీకరిస్తే ఆ దేవదేవుడు ఎక్కువ ఆనందిస్తాడు. ఆతడు ప్రభువు కనుక ప్రతియొక్కరు ఆతని ఆజ్ఞలకు లోబడి ఉంటారు. ఎవ్వరూ ఆతనిని ఆజ్ఞాపించే ఉన్నత స్థితిలో ఉండరు కాని విశుద్ధభక్తుడు తనను ఆదేశించినట్లు కనిపించినప్పుడు తాను అన్ని పరిస్థితులలో అచ్యుతుడైన ప్రభువే అయినప్పటికిని ఆ దేవదేవుడు దివ్యానందాన్ని అనుభవిస్తాడు. 
  భగవంతుని విశుద్ధభక్తునిగా అర్జునుడు జ్ఞాతులతో, సోదరులతో యుద్ధం చేయగోరలేదు. కాని ఎటువంటి శాంతిమయ రాయబారాలకు ఏనాడూ సమ్మతించని దుర్యోధనుని మొండితనము కారణంగానే అతడు బలవంతంగా యుద్ధరంగానికి రావలసి వచ్చింది. అందుకే యుద్ధరంగంలో ఉన్నట్టి ప్రముఖులను చూడడానికి అతడు అత్రుతపడ్డాడు. యుద్ధరంగంలో శాంతియత్నమనే ప్రశ్నే లేనప్పటికిని వారిని అతడు తిరిగి చూడాలని అనుకున్నాడు. అవాంఛితమైన యుద్ధం వైపుకు వారెంతగా మ్రొగ్గి ఉన్నారో అతడు చూడగోరాడు.


'భగవద్గీత' యధాతథము
'భగవద్గీత' యధాతథము - పుస్తకము కొరకు ఇక్కడ క్లిక్ చేయండి »

buttons=(Accept !) days=(0)

Our website uses cookies. Learn More
Accept !
To Top