'భగవద్గీత' యధాతథము: రెండవ అధ్యాయము - " గీతాసారము " - Bhagavad Gita' Yadhatathamu - Chapter Two, Page-7

0
'భగవద్గీత' యధాతథము: రెండవ అధ్యాయము - " గీతాసారము " - Bhagavad Gita' Yadhatathamu - Chapter Two, Page-7

శ్లోకము - 17
అవినాశి తు తద్విద్ధి యేన సర్వమిదం తతం |
ప దిండ వినాశమవ్యయస్యాస్య న కశ్చిత్  కర్తుమర్షతి ||

అవినాశి - నశింపు లేనిది; తు - కాని; తత్ - అది; విద్ది - తెలిసికోవాలి; యేన - ఏది; సర్వం - శరీరమంతా; ఇదం - ఈ; తతం – వ్యాపించి ఉంది; వినాశం - నాశము; అవ్యయస్య - నశింపులేనట్టి; అస్య - దీనికి; కశ్చిత్ - ఎవ్వడూ; కర్తుం - చేయడానికి; న అర్హతి - సమర్థుడు కాడు.

శరీరమంతటా ఏదైతే వ్యాపించి ఉన్నదో అది నశింపు లేనిదని నీవు తెలిసికోవాలి. ఆ అవినాతియైన ఆత్మను ఎవ్వడూ నశింపజేయ సమర్థుడు కాడు.

భాష్యము : శరీరమంతటా వ్యాపించి ఉండే ఆత్మ యొక్క నిజమైన స్వభావాన్ని ఈ శ్లోకము సృష్టంగా వివరిస్తున్నది. శరీరమంతటా ఏది వ్యాపించి ఉన్నదో ఎవ్వరైనా అర్థం చేసికోగలరు. అదే చైతన్యము. దేహంలోని ఒక భాగంలో లేదా ఫూర్తి దేహంలో కలిగే బాధలు, సుఖాలు ప్రతియుక్కడు ఎరిగి ఉంటాడు. ఈ చైతన్య విస్తారము మనిషి దేహము వరకే పరిమితమై ఉంటుంది. ఒక దేహములోని బాధలు, సుఖాలు ఇంకొక దేహానికి తెలియవు, అందుకే ప్రతీ దేహము ఒక వ్యక్తిగతఆత్మకు ఆకారము అవుతుంది. ఇక ఆత్మ ఉనికి వ్యక్తిగత చైతన్యము ద్వారా అనుభూతమౌతుంది. ఈ ఆత్మ వెంట్రుక కొసలో పదివేలవ వంతు పరిమాణము కలదిగా వర్ణించబడింది. శ్వేతాశ్వతరోవనిషద్(5.9) దీనిని ఈ విధంగా ధ్రువపరుస్తున్నది.

బాలాగ్రశతభాగస్య శతధా కల్పితస్య చ |
భాగో జీవః స విజ్ఞేయః స చానన్త్యాయ కల్పతే ||
వెంట్రుక కొనను వందభాగాలుగా విభజించి, అందులోని ఒక భాగాన్ని తిరిగి వందభాగాలుగా విభజిస్తే ఆ ప్రతీ భాగము ఆత్మ పరిమాణకొలత అవుతుంది. 
ఇటువంటిదే మరొక శ్లోకములో ఇలా చెప్పబడింది :

కేశాగ్రశతభాగస్య శతాంశః సాదృభశాత్మకః |
జీవః సూక్ష్మ స్వరూపోయం సంఖ్యాతీతో హి చిత్కణః || 
"వెంట్రుకకొనలో పదివేలవ వంతు పరిమాణము కలిగిన అసంఖ్యాకమైన ఆధ్యాత్మిక అణువులు ఉన్నాయి".
    అంటే ఆధ్యాత్మిక అణువైనట్టి వ్యక్తిగతఆత్మ భౌతిక అణువుల కంటే సూక్ష్మ మైనది. అటువంటి అణువులు అసంఖ్యాకంగా ఉన్నాయి. ఈ సూక్ష్మమైన ఆధ్యాత్మిక కణమే భౌతికదేహానికి ఆధారము. ఏదైనా మందు గుణము శరీరమంతటా వ్యాపించిన రీతిగా ఈ ఆధ్యాత్మిక కణ ప్రభావము శరీరమంతటా వ్యాపించి ఉంటుంది. శరీరమంతటా ఈ ఆత్మ వ్యాపించి ఉండడము చైతన్యము ద్వారా అనుభూతమౌతుంది. ఆత్మ ఉనికికి అదే నిదర్శనము. చైతన్యము లేనట్టి దేహము శవమని, ఎటువంటి లౌకిక ఏర్పాట్ల చేతనైనా దానిలో చైతన్యాన్ని తిరిగి తెప్పించలేమని అమాయకుడైనా అర్థం చేసికొంటాడు. కనుక చైతన్యమనేది భౌతికమూలాల సమ్మేళనము వలన కాకుండ ఆత్మ వలననే కలుగుతోంది. 
ముండకోపనిషద్లో (3.1.9) అణు ఆత్మ పరిమాణము గురించి మరింత వివరించబడింది:

ఏషోణురాత్మా  చేతసా వేదితన్యో
యస్మిన్ ప్రాణః పంచధా సంవివేశ |
ప్రాణైశ్చిత్తం సర్వమోతం ప్రజానాం
యస్మిన్ విశుద్ధే విభవత్యేష ఆత్మా ॥
"అణువరిమాణము కలిగిన ఆత్మ పరిపూర్ణ బుద్ధి చేతనే అనుభూతమౌతుంది. ఈ అణు ఆత్మ హృదయంలో నిలిచి ఉండి ఐదు వాయువులలో (ప్రాణ, అపాన, వ్యాన, సమాన, ఉదాన) తేలుతూ దేహధారుల దేహమంతట తన ప్రభావాన్ని చూపుతోంది. ఈ ఐదు వాయువుల కల్మషము నుండి ఆత్మ శుద్దిపడినపుడు దాని ఆధ్యాత్మిక ప్రభావము ప్రదర్శితమౌతుంది".
     విశుద్ధ ఆత్మను చుట్టి ఉండే ఐదు రకాల వాయువులను నానారకాలైన ఆసనాల ద్వారా నియంత్రించడానికే హఠయోగము ఉద్దేశించబడింది. అది భౌతికవాతావరణ బంధము నుండి అణుఆత్మకు ముక్తిని కలిగించడానికే గాని ఏదో భౌతికలాభానికి కాదు. ఈ రకంగా అణు ఆత్మ స్థితి సమస్త వేదవాఙ్మయములో అంగీకరించబడింది. అంతే గాక ఏ బుద్ధిమంతుడైనా దీనిని ప్రత్యక్షంగా అనుభవంలోకి తెచ్చుకోగలుగుతాడు. కేవలము బుద్ధిహీనుడే ఈ అణుఆత్మను సర్వవ్యాపకమైన విష్ణుతత్త్వంగా భావిస్తాడు.
   అణు ఆత్మ ప్రభావము ఒక ప్రత్యేక దేహమంతటా వ్యాపించి ఉంటుంది. ముండకోవనిషద్ ప్రకారము ఈ అణుఆత్మ జీవుని హృదయంలో నిలిచి ఉంటుంది. అణు ఆత్మ పరిమాణము లౌకిక శాస్త్రజ్ఞుల అవగాహన శక్తికి అతీతంగా ఉంటుంది. కనుక ఆత్మ అనేదే లేదని వారిలో కొందరు మూర్ఖంగా వాదిస్తారు. వ్యక్తిగత అణుఆత్మ పరమాత్మునితో పాటుగా హృదయంలో నిశ్చయంగా ఉన్నది. అందుకే దేహకదలికలకు కావలసిన సమస్త శక్తులు ఈ దేహాంగము నుండి ఉత్పన్నమౌతున్నాయి. ఊపిరి తిత్తుల నుండి ప్రాణవాయువును తీసికోనిపోయే రక్తకణాలు ఆత్మ నుండే శక్తిని గ్రహిస్తాయి. ఆత్మ ఈ స్థానం నుండి వెళ్ళిపోగానే కరగడం ప్రారంభమై రక్తచలనము ఆగిపోతుంది. ఎర్ర రక్తకణాల ప్రాముఖ్యాన్ని వైద్యశాస్త్రం అంగీకరించినా వాటి శక్తికి మూలం ఆత్మయని కనుగొనలేకపోతోంది. అయినా హృదయమే దేహశక్తులన్నింటికీ స్థానమని వైద్యశాస్త్రము అంగీకరించింది.
   అట్టి అణురూప ఆత్మలు సూర్యకాంతికణాలతో పోల్చబడ్డాయి. సూర్యకాంతిలో అసంఖ్యాకమైన తేజోమయకణాలు ఉంటాయి. అదేవిధంగా భగవదంశలు "ప్రభా" ( సర్వోత్కృష్ట శక్తి) అని పిలువబడే భగవంతుని కిరణాలలోని కణాలు. కనుక మనిషి వేదజ్ఞానాన్ని అనుసరించినా, నవీన విజ్ఞానశాస్త్రాన్ని అనుసరించినా దేహంలో ఆత్మ ఉనికిని త్రోసిపుచ్చలేడు. ఆత్మవిజ్ఞానము స్వయంగా భగవంతుని చేతనే భగవద్గీతలో స్పష్టంగా వివరించబడింది.

శ్లోకము - 18
అన్తవన్త ఇమే దేహా నిత్యస్యోక్తాః శరీరిణ: |
అనాశినోప్రమేయస్య తస్మాత్ యుధ్యస్వ భారత ||

అన్తవన్తః - నాశవంతమైనవి; ఇమే - ఈ అన్ని: దేహాః - భౌతికదేహాలు; నిత్యస్య - శాశ్వతమైనట్టి; ఉక్తాః - చెప్పబడినాయి; శరీరిణః - దేహధారి యొక్క; అనాశినః - వినాశము చెందనివాడు; అప్రమేయస్య - అపరిమితుడు; తస్మాత్ - కనుక; యుధ్యస్వ - యుద్ధము చేయుము; భారత - ఓ భరతవంశీయుడా.

వినాశము లేనివాడు, అపరిమితుడు, నిత్యుడు అయినట్టి జీవుని భౌతికదేహము తప్పక నశించి తీరుతుంది. కనుక ఓ భరతవంశీయుడా! నీవు యుద్ధము చేయుము.

భాష్యము : స్వభావరీత్యా భౌతికదేహము నశించిపోయేది. ఇది వెంటనే నశించిపోవచ్చును లేదా వందేళ్ళ తరువాత నశింపవచ్చును. ఇది కేవలము కాలానికి సంబంధించిన విషయము దానిని అనంతంగా పోషించే అవకాశమే లేదు. కాని ఆత్మ ఎంత సూక్ష్మమైనదంటే అది శత్రువు కంటనైనా పడదు, ఇక చంపబడదని వేరే చెప్పవలసిన పని లేదు. క్రిందటి శ్లోకంలో చెప్పబడినట్లు అదెంత సూక్ష్మ మైనదంటే దాని పరిమాణాన్ని కొలిచే పద్దతి ఎవ్వరికీ తెలియదు. కనుక ఈ రెండు కోణాల దృష్ట్యా దుఃఖానికి కారణమే లేదు. ఎందుకంటే జీవుడు చంపబడడం గాని, భౌతికదేహము ఎంతకాలమైనా ఉండడం గాని లేదా శాశ్వతంగా రక్షింపబడడం గాని జరగదు. భగవదంశయైన అణు ఆత్మ కర్మానుసారము ఈ భౌతికదేహాన్ని పొందుతుంది కనుక ధర్మాచరణను తప్పక
చేపట్టాలి. 
   పరమప్రకాశ అంశయైన కారణంగా వేదాంతసూత్రాలలో జీవుడు వెలుగుగా యోగ్యతను పొందాడు. సూర్యకాంతి సమస్త విశ్వాన్ని పోషించినట్లుగా ఈ ఆత్మకాంతి భౌతికదేహాన్ని పోషిస్తుంది. ఆత్మ ఈ భౌతికదేహం నుండి వెళ్ళిపోగానే దేహము కుళ్ళిపోవడం మొదలౌతుంది. కనుక ఆత్మయే ఈ దేహాన్ని పోషిస్తున్నది. కేవలము దేహమొక్కటే ముఖ్యమైనది కాదు. యుద్ధము చేయమని, లౌకికమైన దేహభావనలతో ధర్మాన్ని త్యజించవద్దని అర్జునునికి ఇక్కడ ఉపదేశించబడింది.

శ్లోకము - 19
య ఏనం వేత్తి హన్తారం యశ్చైనం మన్యతే హతం | 
ఉభౌ తౌ న విజానీతో నాయం హన్తి న హన్యతే || 

యః - ఎవ్వడు; ఏనం - దీనిని; వేత్తి - అనుకుంటాడో; హన్తారం - చంపేవాడు; యః - ఎవడైతే; - కూడా; ఏనం - ఇది; మన్యతే - తలచేవాడు; హతం - చంపబడేవాడు; ఉభౌ - ఇద్దరు; తౌ - వారు; న విజానీతః - జ్ఞానరహితులు; అయం - ఇది; న హన్తి - చంపదు; న హన్యతే - చంపబడదు.

జీవుడిని చంపువానిగా తలచేవాడు గాని, చంపబడువానిగా తలచేవాడు గాని జ్ఞానవంతులు కారు. ఎందుకంటే ఆత్మ చంపదు, చంపబడదు.

భాష్యము : మారణాయుధాలచే దేహధారి గాయపడినపుడు దేహంలో ఉన్న జీవుడు చంపబడడని తెలిసికోవాలి. ఆత్మ ఎంత సూక్ష్మ మైనదంటే ఎటువంటి ఆయుధము చేతవైనా దానిని చంపడం అసాధ్యం. ఇది రాబోవు శ్లోకాలలో స్పష్టమౌతుంది. అంతేగాక ఆధ్యాత్మికస్థితి కారణంగా జీవుడు చంపబడనివాడు. చంపబడింది లేదా చంపబడేది కేవలము దేహమే. అయినా ఇది దేహాన్ని వధించడాన్ని ప్రోత్సహించదు. "మా హింస్యాత్ సర్వభూతాని" ఎవ్వరి పట్లను హింస చేయవద్దు అనేది వేదాదేశము. అలాగే జీవుడు చంపబడడనే అవగాహన జంతుపధను ప్రోత్సహించదు. అధికారము లేకుండ ఎవరి దేహాన్నియెనా వధించడం హీయమైనది. ప్రభుత్వ చట్టం చేత భగవన్నియమము చేత అది దండనీయమే అవుతుంది. అయినా ఇక్కడ ధర్మము కొరకే అర్జునుడు సంహారకార్యంలో నెలకొల్పబడుతున్నాడు గాని విపరీత తలంపుతో కాదు.'భగవద్గీత' యధాతథము
'భగవద్గీత' యధాతథము - పుస్తకము కొరకు ఇక్కడ క్లిక్ చేయండి »

Post a Comment

0 Comments
* Please Don't Spam Here. All the Comments are Reviewed by Admin.

ఈ వ్యాసం పై మీ అభిప్రాయాలు, సూచనలు క్రింద ఉన్న గడిలో తెలియపరచగలరు !

ఈ వ్యాసం పై మీ అభిప్రాయాలు, సూచనలు క్రింద ఉన్న గడిలో తెలియపరచగలరు !

Post a Comment (0)

buttons=(Accept !) days=(20)

Our website uses cookies to enhance your experience. Learn More
Accept !
To Top