'భగవద్గీత' యధాతథము: రెండవ అధ్యాయము - " గీతాసారము " - Bhagavad Gita' Yadhatathamu - Chapter Two, Page-10

'భగవద్గీత' యధాతథము: రెండవ అధ్యాయము - " గీతాసారము " - Bhagavad Gita' Yadhatathamu - Chapter Two, Page-10
కురుక్షేత్ర

శ్లోకము - 24
అచ్చేద్యోఃయమదాహ్యొఃయమక్లేద్యోఃశోష్య ఏవ చ |
నిత్యః సర్వగతః స్థాణురచలోఃయం నాతనః ॥

అచ్చేద్యః - ఛేదింపబడనిది; అయం - ఈ ఆత్మ; అదాహ్యః - దహింపబడదు; అయం - ఈ ఆత్మ; అక్లేద్యః - కరుగదు; అశోష్య - ఎండదు; ఏవ - నిశ్చయముగా; - మరియు; నిత్యః - నిత్యమైనది; సర్వగతః - సర్వత్ర వ్యాపించినది; స్థాణుః - మార్పులేనిది; అచలః - కదలనిది; అయం - ఈ ఆత్మ: సనాతనః - శాశ్వతంగా ఒకే రకంగా ఉండేది.

ఈ వ్యక్తిగతఆత్మ ఛేదింపబడనిది, కరుగనటువంటిది. అది దహింపబడదు, ఎండిపోదు అది నిత్యమైనది, సర్వత్ర ఉన్నది, మార్పు లేనిది, కదలనిధి, సనాతనమైనది.

భాష్యము : వ్యక్తిగతఆత్మ శాశ్వతంగా భగవంతుని అణుఅంశయని, మార్పు లేకుండ అది అదే అణువుగా శాశ్వతంగా నిలిచి ఉంటుందని అణుఆత్మకు ఉన్నట్టి ఈ యోగ్యతలు సృపష్టంగా నిరూపిస్తున్నాయి. ఈ విషయంలో అద్వైత సిద్ధాంతాన్ని అన్వయించడం చాలా కష్టం, ఎందుకంటే వ్యక్తిగత జీవుడు ఏనాడును ఐక్యము కాబోడు. భౌతికకల్మషము నుండి ముక్తిని పొందిన తరువాత అణు ఆత్మ భగవంతుని తేజోమయ కిరణాలలో ఒక ఆధ్యాత్మికకణంగా ఉండగోరపచ్చును; కాని బుద్దిమంతులైన జీవులు భగవంతునితో సాంగత్యాన్ని పొందడానికి ఆధ్యాత్మిక లోకాలలో ప్రవేశిస్తారు.
    జీవులు భగవంతుని సృష్టిలో సర్వత్ర ఉన్నారనేది నిస్సందేహము కనుక సర్వగతః" (సర్వత్ర వ్యాపించినది) అనే పదము ప్రధానమైనది. వారు భూమి పైన జలములో, గాలిలో, భూమి లోవల, అగ్నిలో కూడ నివసిస్తున్నారు. ఆత్మ అగ్నిచే దహింపబడదని ఇక్కడ స్పష్టంగా చెప్పబడిన కారణంగా అగ్నిలో వారు నశించిపోతారనే నమ్మకము అంగీకారయోగ్యము కాదు. కనుక సూర్యమండలంలో కూడ జీవులు అక్కడ జీవించడానికి తగిన దేహంతో ఉన్నారనేది నిస్సందేహము. సూర్యగోళము జీవరహితమైతే, "సర్వగత" అంటే సర్వత్ర జీవించేది ఆనే పదము అర్థరహితమౌతుంది.

శ్లోకము - 25
అవ్యక్తోఃయమచిన్త్యోయమనికాక్యోఃయ ముచ్యతే |
తస్మాదేవం విదిత్వైనం నానుశోచితు మర్హసి ||

అవ్యక్తః - కనపడనిది; అయం - ఈ ఆత్మ, అచిన్త్యః - ఊహింపలేనిది; అయం - ఈ ఆత్మ;  అవికార్యః - మార్పు లేనిది; అయం - ఈ ఆత్మ; ఉచ్యతే - చెప్పబడింది; తస్మాత్ - కనుక; ఏవం - ఈ రకంగా; విదిత్యా - బాగా తెలిసికొని; ఏనం - ఈ ఆత్మను; అనుశోచితుం - దుఃఖించడానికి; న అర్హసి - తగవు.

అత్మ కనబడనిది, ఊహింపలేనిది, మార్పురహితమైనదని చెప్పబడింది. ఇది తెలిసికొనిన తరువాత నీవు దేహము కొరకు దుఃఖించకూడదు.

భాష్యము : ఇదివరకే వర్ణింపబడినట్లు ఆత్మ పరిమాణము మన భౌతికగణనకు ఎంత సూక్ష్మ మైనదంటే అత్యంత శక్తివంతమైన సూక్ష్మ దర్శిని చేతనైనా అది కనబడదు. కనుక అది అగోచరము. ఆత్మ ఉనికికి సంబంధించినంతవరకు శృతి లేదా వేదజ్ఞానప్రమాణము మినహా ఎవ్వరూ దానిని ప్రయోగాత్మకంగా నిరూపించలేరు. ఈ సత్యాన్ని మనం అంగీకరించాలి. ఎందుకంటే అనుభూతి ద్వారా ఆత్మ యథార్థమేయైనా దాని అస్తిత్వ అవగాహనకు వేరే మార్గమే లేదు. కేవలము ఉన్నతమైన ప్రామాణికతపై ఆధారపడి మనము తప్పక అంగీకరించవలసినవి ఎన్నో ఉంటాయి. తల్లి ప్రామాణికతను ఆధారం చేసికొని తండ్రి ఉనికిని గుర్తించవలసి ఉంటుంది. తండ్రి ఉనికిని అర్థం చేసికోవడానికి తల్లి ప్రామాణికత తప్ప వేరే మార్గమే లేదు. 
   అదేవిధంగా ఆత్మ అవగాహనకు వేదాధ్యయనము తప్పవేరేమార్గమే లేదు. అంటే ఆత్మ మానవుల ప్రయోగాత్మక జ్ఞానానికి అందనిది. ఆత్మ చైతన్యము, చైతన్య సహితము అని వేదాలు కూడ ఇదే చెప్పాయి. మనము దానిని అంగీకరించాలి. దేహంలో మార్పులు జరుగుతాయి, కాని ఆత్మలో మార్పు ఉండదు. శాశ్వతంగా మార్పు లేనిదిగా ఆత్మ అపరిమితుడైన భగవంతునితో పోలిస్తే అణువుగా నిలిచి ఉంటుంది. భగవంతుడు అనంతమైనవాడు, అణుఅత్మ సూక్ష్మ మైనది కనుక మార్పులేనట్టి సూక్ష్మమైన ఆత్మ ఏనాడును అనంతాత్మతో లేదా భగవానునితో సమానము కాదు, ఆత్మ యొక్క స్థిరత్వ భావాన్ని డ్రువపరచడానికే ఈ భావన వేదాలలో నానారకాలుగా మళ్ళీమళ్ళీ చెప్పబడింది. ఒక విషయాన్ని మనం దోషకరహితంగా బాగా అర్థం చేసికోవడానికి తిరిగి చెప్పడం అవసరమౌతుంది.

శ్లోకము - 26
అథవైనం నిత్యజాతం నిత్యం వా మన్యసీ మృతం |
తథాపి త్వం మహాబాహో నైనం శోచితు మర్హసి |

అథ - ఒకవేళ; - కూడ; ఏనం - ఈ అత్మ; నిత్యజాతం - ఎప్పుడూ పుట్టేది; నిత్యం -
నిరంతరము; వా - లేదా; మన్యసీ - నీవు తలచినా; మృతం - మరణించేది; తథా అపి -
అయినా; త్వం - నీవు; మహాబాహో - ఓ మహాబాహువులు కలవాడా; ఏనం - ఈ ఆత్మను గురించి; శోచితుం - దుఃఖించడానికి; న ఆర్హసి - తగవు.

ఓ మహాబాహువులు కలవాడా! ఒకవేళ ఈ ఆత్మ (లేదా జీవలక్షణాలు) ఎప్పుడూ జన్మిస్తుందని, నిరంతరము మరణిస్తుందని నీవు తలచినా దుఃఖించడానికి ఎటువంటి కారణము లేదు.

భాష్యము : దేహానికి అతీతంగా ఆత్మకు ప్రత్యేకమైన ఉనికిని విశ్వసించని ఒక తత్త్వవేత్తల వర్గం ఎప్పుడూ ఉంటుంది. వారు దాదాపుగా బౌద్ధులను పోలి ఉంటారు. శ్రీకృష్ణభగవానుడు భగవద్గీతను పలికినప్పుడు అటువంటి తత్వవేత్తలు ఉన్నట్లుగా గోచరిస్తున్నది. వారే లోకాయతికులు, వైభాషికులని తెలియబడతారు. భౌతికతత్త్వాల ఒక ప్రత్యేకమైన పరిపక్వస్థితిలో జీవలక్షణాలు కలుగుతాయని ఆ తత్త్వవేత్తలు అంటారు. నవీన లౌకిక శాస్త్రజ్ఞుడు, లౌకిక తత్త్వవేత్తలు కూడ అదేవిధంగా తలుస్తారు. వారి అభిప్రాయము ప్రకారము దేహము ఒక భౌతికతత్త్వాల సమ్మేళనము; భౌతిక రసాయనిక తత్త్వాల చర్య వలన ఒకానొక స్థితిలో జీవలక్షణాలు ఉత్పన్నమౌతాయి. నవీన మనుష్యవర్ణన శాస్త్రం ఈ సిద్ధాంతం పైననే ఆధారపడి ఉన్నది. ప్రస్తుతము చాలా కుహనాధర్మాలు కూడ ఇదే సిద్ధాంతాన్ని అనుసరిస్తున్నాయి. ఇవి ఇపుడు అమెరికాలో మోజుగా తయారౌతున్నాయి. విధ్వంసకరమైన, భక్తిరహితమైన బౌద్ధమత వర్గాలు అటువంటివే.
   ఒకవేళ అర్జునుడు వైభాషిక తత్త్వంలో లాగా ఆత్మ ఉనికిని విశ్వసించపోయిన దుఃఖించడానికి ఎటువంటి కారణము లేదు. పెద్ద మొత్తంలో రసాయనాలు నశించడం పట్ల ఎవ్వడూ శోకిస్తూ తన విధినిర్వహణను ఆపడు. పైగా ఆధునిక విజ్ఞానశాస్త్రంలో వైజ్ఞానిక యుద్ధరీతిలో శత్రువుపై విజయాన్ని సాధించడానికి అనేక టన్నుల రసాయనాలను వృథా చేస్తారు. వైభాషిక సిద్ధాంతము ప్రకారము దేహనశింపుతో పాటు నామమాత్ర ఆత్మ కూడ నశించిపోతుంది. కనుక అర్జునుడు అణు ఆత్మ ఉన్నదనే వేదనిర్ణయాన్ని అంగీకరించినా లేదా ఆత్మ ఉనికిని విశ్వసించకపోయినా ఏ పరిస్థితిలోనూ చింతించడానికి కారణం లేదు. 
  ఈ సిద్దాంతం ప్రకారము భౌతికపదార్థము నుండి ప్రతీక్షణం అనేక జీవులు ఉత్పత్తి అవుతున్నందున, వారిలో అనేకమంది ప్రతీక్షణం నశించిపోతున్నందున అటువంటి సంఘటనలకు దుఃఖించవలసిన అవసరము లేదు. ఆత్మకు పునర్జన్మయే లేకపోతే పీతామహుని, గురువును చంపిన పావం కలుగుతుందనే భయం అర్జునునికి అక్కర లేదు. కాని అదే సమయంలో శ్రీకృష్ణుడు వ్యంగ్యంగా అర్జునుని ”మహాబాహో”, అంటే మహాబాహువులు కలవాడా అని సంబోధించాడు. ఎందుకంటే కనీసం అర్జునుడు వేదజ్ఞానాన్ని నిరాకరించే వైభాషికుల సిద్ధాంతాన్ని అంగీకరించలేదు. క్షత్రియునిగా అర్జునుడు వైదిక సంస్కృతికి చెందినవాడు. అదే అతనిని నియమాలను పాటించేవానిగా చేసింది.'భగవద్గీత' యధాతథము
'భగవద్గీత' యధాతథము - పుస్తకము కొరకు ఇక్కడ క్లిక్ చేయండి »

buttons=(Accept !) days=(0)

Our website uses cookies. Learn More
Accept !
To Top