'భగవద్గీత' యధాతథము: రెండవ అధ్యాయము - " గీతాసారము " - Bhagavad Gita' Yadhatathamu - Chapter Two, Page-13

'భగవద్గీత' యధాతథము: రెండవ అధ్యాయము - " గీతాసారము " - Bhagavad Gita' Yadhatathamu - Chapter Two, Page-13
కృష్ణార్జున !

శ్లోకము - 33
అథ చేత్త్వమిమం ధర్మ్యం సంగ్రామం న కరిష్యసి |
తతః స్వధర్మం కీర్తిం చ హిత్వా పాపమవాప్స్యసి ||

అథ - కనుక; చేత్ - ఒకవేళ, త్వం - నీవు; ఇమం - ఈ; ధర్మ్యం - ధర్మయుతమైన; సంగ్రామం - యుద్ధమును; న కరిష్యసి - చేయకపోతే; తతః - అప్పుడు; స్వధర్మం - నీ ధర్మమును; కీర్తిం - కీర్తిని; - కూడా; హిత్వా - కోల్పోతావు; పాపం - పాపమును; అవాప్స్యసి - పొందుతావు.

ఒకవేళ నీవు నీ యుద్ధధర్మమును నెరవేర్చకపోతే ధర్మమును అలక్ష్యపరచినందుకు నిక్కముగా పాపమును పొందుతావు. ఆ విధంగా యోధుడవనే నీ కీర్తిని కోల్పోతావు.

భాష్యము : అర్జునుడు పేరు గాంచిన యోధుడు. పలువురు దేవతలతో, శివునితో కూడ యుద్ధం చేసి అతడు కీర్తిని పొందాడు. వేటగాని రూపంలో ఉన్న శివునితో పోరాడి ఓడించి మెప్పించిన తరువాత అర్జునుడు అతని నుండి పాశుపతాస్తాన్ని బహుమతిగా పాందాడు. ఆర్జునుడు గొప్ప యోధుడని ప్రతియొక్కరికి తెలుసు. ద్రోణాచార్యుడు కూడ అతనికి వరాలనిచ్చి, గురువునైనా వధించగల విశేషమైన ఆయుధాన్ని ప్రసాదించాడు. 
   ఈ విధంగా అతడు స్వర్గరాజు, తన జనకుడు అయిన ఇంద్రునితో పాటు పలువురు ప్రామాణికుల నుండి పలు యుద్ధయోగ్యతలను పొందాడు. కాని అతడు యుద్దాన్ని విడిచిపెడితే క్షత్రియునిగా తన విశేషమైన ధర్మాన్ని అలక్ష్యపరచడమే కాకుండ పేరుప్రతిష్ఠలు అన్నింటిని కోల్పోయి ఆ విధంగా నరకానికి రాచమార్గాన్ని తయారు చేసికొంటాడు. ఇంకొక రకంగా చెప్పాలంటే యుద్ధం చేయడం వలన గాక యుద్ధం నుండి తప్పుకోవడం ద్వారా అతడు నరకానికి వెళతాడు.

శ్లోకము - 34
అకీర్తిం చాపి భూతాని కథయిష్యన్తి త్యెఃవ్యయామ్ |
సంభావితస్య చాకీర్తిర్మరణాదతిరిచ్యతే || 

అకీర్తిం - అపకీర్తిని; - కూడా; అపి - పైగా; భూతాని - జనులందరు; కథయిష్యన్తి - చెప్పుకుంటారు; తే - నీ యొక్క; అవ్యయామ్ - ఎల్లప్పుడు; సంభావితస్య - గౌరవనీయునికి; - కూడ; అకీర్తిః - అపకీర్తి; మరణాత్ - మరణము కంటే; అతిరిచ్యతే - ఎక్కువ అవుతుంది.

జనులు నీ అపకీర్తిని ఎల్లప్పుడు చెప్పుకుంటారు. గౌరవనీయునికి అపకీర్తి మరణము కంటే దారుణమెనది.

భాష్యము : అర్జునుని యుద్ధవిముఖత గురించి శ్రీకృష్ణభగవానుడు అతని స్పేహితునిగా, తత్త్వబోధకునిగా ఇపుడు తుది తీర్పు ఇస్తున్నాడు. "అర్జునా యుద్ధము ఇంకా ప్రారంభము కాకముందే నీవు యుద్ధరంగాన్ని విడిచిపెడితే జనులు పీరికివాడని అంటారు. జనులు దూషించినా యుద్ధరంగము నుండి పారిపోతే ప్రణాన్ని రక్షించుకోవచ్చునని నీవు అనుకోవచ్చును. కాని యుద్ధంలో మరణించడమే మంచిదని నేను సలహా ఇస్తున్నాను. నీ వంటి గౌరవనీయునికి అపకీర్తి మరణము కంటే దారుణమైనది. కనుక నీవు ప్రాణభీతితో పారిపోక యుద్ధంలో మరణించడమే ఉత్తమము, అది నా స్నేహాన్ని దుర్వినియోగపరిచావనే అపకీర్తి నుండి, సంఘంలో అప్రతిష్ట నుండి నిన్ను కాపాడుతుంది” అని భగవానుడు అన్నాడు. కనుక భగవంతుని తుదితీర్పు ఏమిటంటే అర్జునుడు యుద్ధంలో మరణించాలే గాని దాని నుండి తప్పుకోకూడదు.

శ్లోకము - 35
భయాద్ రణాదుపరతం మంస్యస్తే త్వాం మహారథాః |
యేషాం చ త్వం బహుమతో భూత్వా యాస్యసి లాఘవమ్ ||

భయాత్ - భయంతో; రణాత్ - యుద్ధరంగం నుండి; ఉపరతం - తొలగినవానిగా; మంస్యన్తే - వారు తలుస్తారు; త్వాం - నిన్ను; మహారథాః - మహాసేనానులు; యేషాం - ఎవరికైతే; - కూడా; త్వం - నీవు; బహుమతః - గొప్ప గౌరవము కలవాడివి; భూత్వా - అయినట్టి; యాస్యసి - అవుతావు; లాఘవమ్ - చులకన.

నీ పేరుప్రతిష్ఠల పట్ల గొప్ప గౌరవము కలిగినట్టి మహాసేనానులు కేవలము భయంతో నీవు యుద్ధరంగమును విడిచిపెట్టావని తలచి నిన్ను చులకన చేస్తారు.

భాష్యము: శ్రీకృష్ణభగవానుడు తన తీర్పును అర్జునునికి ఇవ్వడం కొనసాగించాడు: “నీ సోదరులు, పితామహుని పట్ల జాలితోనే నీవు యుద్ధరంగం నుండి వెళ్ళిపోయావంటూ దుర్యోధనుడు, కర్ణుడు, ఇతర సమకాలీనుల వంటి మహాసేనానులు భావించగలరని అనుకోకు. నీపు నీ ప్రాణభయంతోనే వెళ్ళిపోయావని వారు అనుకుంటారు. ఆ విధంగా నీ స్వభావము గురించి వారికి ఉన్నట్టి మహాగౌరవము నాశనమౌతుంది." 

శ్లోకము - 36
అవాచ్యవాదాంశ్చ బహూన్ వదిష్యన్తి తవాహితాః |
నిన్దన్తస్తవ సామర్థ్యం తతో దుఃఖతరం ను కిం ||
 

అవాచ్య - క్రూరమైన; వాదాన్ - మాటలు; - కూడ; బహూన్ - పలు; వదిష్యన్తి - పలుకుతారు; తవ - నీ; అహితాః - శత్రువులు; నిన్దన్తః - నిందిస్తూ; తవ - ని యొక్క; సౌమర్థ్యం - సామర్థ్యాన్ని; తతః - అంతకంటే; దుఃఖతరం - మిక్కిలి దుఃఖమయమైంది; ను - నిజానికి; కిం - ఏముంటుంది.

నీ శత్రువులు నిన్ను పలు క్రూరమైన మాటలతో వర్ణించి నీ సామర్థ్యమును నిందిస్తారు. అంతకంటే నీకు దుఃఖతరమైనది ఏముంటుంది.

భాస్యము : అర్జునుని అనవసరమైన జాలి పట్ల ఆరంభంలో శ్రీకృష్ణభగవాసుడు ఆశ్చర్యపోయాడు. అతని జాలి అనార్యులకు తగినట్టిదని ఆ దేవదేవుడు వర్ణించాడు. ఇప్పుడు పలు మాటలతో ఆతడు అర్జునుని నామమాత్ర జాలికి విరుద్ధంగా తన వాదనను నిరూపించాడు.

శ్లోకము - 37
హతో వా ప్రాప్స్యసి స్వర్గం జిత్వా నా భోక్ష్యసీ మహీమ్ |
తస్మాదుత్తిష్ట కౌస్తేయ యుద్ధాయ కృతనిశ్చయః ||

హతః - చంపబడి; వా - లేదా; ప్రాప్స్యసి - పొందుతావు; స్వర్గం - స్వర్గరాజ్యమును; జిత్వా - జయించి; వా - లేదా; భోక్ష్యసీ - అనుభవిస్తావు; మహీమ్ - ప్రపంచాన్ని; తస్మాత్ - కనుక; ఉత్తివ్ఠ - లెమ్ము; కౌన్తేయ - ఓకుంతీపుత్రా; యుద్ధాయ - యుద్ధము చేయడానికి; కృతనిశ్చయః - నిశ్చయముతో.

ఓ కౌంతేయా! నీవు యుద్ధరంగంలో వధింపబడితే స్వర్గలోకముసు పొందుతావు లేదా జయిస్తే భూతల రాజ్యమును అనుభవిస్తావు. కనుక కృతనిశ్చయుడవై లేచి యుద్ధం చేయవలసింది.

భాష్యము: తన పక్షానికే విజయం కలుగుతుందనే నిశ్చయం లేనప్పటికిని అర్జునుడు యుద్ధం చేసి తీరాలి. ఎందుకంటే అక్కడ వధింపబడినా అతడు స్వర్గలోకాలకు చేరుకోగలడు.

శ్లోకము - 38
సుఖదుఃఖే సమే కృత్వా లాభాలాభౌ జయాజయౌ |
తతో యుద్ధాయ యుజ్యస్వ నైవం పాపమవాప్స్యసి ||

సుఖ - సుఖము; దుఃఖే - దుఃఖము; సమే - సమానముగా; కృత్వా - చేసి; లాభ అలాభౌ - లాభము, నష్టము రెండింటిని; జయ అజయౌ - జయము అపజయము రెండింటిని; తతః - తరువాత; యుద్ధాయ - యుద్ధము కొరకు; యుజ్యస్వ - యుద్ధము) చేయవలసింది; ఏవం - ఈ రకంగా; పాపం - పాపము; న అవాప్స్యసి - పొందవు.

సుఖదుఃఖాలను గాని, లాభనష్టాలను గాని, జయాపజయాలను గాని పట్టించుకోకుండ కేవలము యుద్ధము కొరకే నీవు యుద్ధము చేయవలసింది. ఆ రకంగా చేయడం వలన నీకెన్నడూ పాపం కలుగదు. 

భాష్యము : తాను యుద్ధాన్ని కోరుతున్న కారణంగా శ్రీకృష్ణభగవానుడు ఇప్పుడు ఆర్జునునితో యుద్ధం చేయమని నేరుగా చెబుతున్నాడు. కృష్ణభక్తి భావనతో చేసే కర్మలలో సుఖము లేదా దూఃఖము, లాభము లేదా ప్రయోజనము జయము లేదా అపజయము అనే భావనే ఉండదు. ప్రతీదీ శ్రీకృష్ణుని కొరకు చేయాలనేదే దివ్యచైతన్యము; అప్పుడు భౌతికకలాపాలకు కర్మఫలమనేది కలుగదు. స్వీయ ఇంద్రియభోగము కొరకు పనిచేసేవాడు, అది సత్త్వగుణంలోనే కాని రజోగుణంలోనే కాని మంచి లేదా చెడు కర్మఫలానికి గురౌతాడు. కాని కృష్ణభక్తిభావనలో చేసే కర్మలకు పూర్తిగా శరణాగతుడైనవాడు ఇక ఏమాత్రము ఎవ్వరికీ ఉపకారబద్దుడై ఉండడు, ఋణపడడు సాధారణ కలాపాలలో మనిషి ఉపకారబద్దుడౌతాడు, ఋణి అవుతాడు. దీనిని గురించి ఇలా చెప్పబడింది.

దేవర్షి భూతాన్తనృణాం పితృణాం
న కింకరో నాయం ఋణీ చ రాజన్ |
సర్వాత్మనా యః శరణం శరణ్యం
గతో ముకున్దం పరిహృత్య కర్తమ్ ||

" ఇతర ధర్మాలన్నింటిని విడిచిపెట్టి ముకుందునికి, అంటే శ్రీకృష్ణునికి సంపూర్ణ శరణాగతుడైనవాడు దేవతలకు గాని, ఋషులకు గాని, జనసామాన్యానికి గాని బంధువులకు గాని, మానవకోటికి గాని లేదా పిత్సదేవతలకు గాని ఋణపడడు ఉపకారబద్ధుడు కాడు." (భాగవతము 11.5.41), ఈ శ్లోకంలో ఇది శ్రీకృష్ణుని ద్వారా అర్జునునికి పరోక్షంగా సూచన చేయబడింది. ఈ విషయం రాబోవు శ్లోకాలలో మరింత సృష్టంగా వివరింపబడుతుంది.

« Page - 12  మునుపటి పేజీ. 

buttons=(Accept !) days=(0)

Our website uses cookies. Learn More
Accept !
To Top