'భగవద్గీత' యధాతథము: రెండవ అధ్యాయము - " గీతాసారము " - Bhagavad Gita' Yadhatathamu - Chapter Two, Page-11

'భగవద్గీత' యధాతథము: రెండవ అధ్యాయము - " గీతాసారము " - Bhagavad Gita' Yadhatathamu - Chapter Two, Page-11
కృష్ణార్జునులు

శ్లోకము - 27
జాతస్య హి ధ్రువో మృత్యుర్ర్దువం జన్మ మృతస్య చ |
తస్మాదపరిహార్యేఃర్థే న త్వం శోచితుమర్హసి || 

జాతస్య - పుట్టినవానికి; హి - నిశ్చయముగా; ధ్రువః - యథార్థము; మృత్యుః - మరణము; ధ్రువం - ఇది కూడ యథార్థము; జన్మ - పుట్టుక; మృతస్య - మరణించిన వానికి; - కూడ; తస్మాత్ - కనుక; అపరిహార్యే- అనివార్యమైనట్టి; అర్థే - విషయంలో; త్వం - నీవు; శోచితుం - దుఃఖించడము; న అర్హసి - తగదు.

పుట్టినవానికి తప్పక మరణము కలుగుతుంది, మరణము తరువాత జీవుడు తిరిగి తప్పక జన్మిస్తాడు. కనుక అనివార్యమైన నీ విధినిర్వహణలో నీవు దుఃఖించకూడదు.

భాష్యము : జీవిత కలాపాలను బట్టి మనిషి జన్మను స్వీకరిస్తాడు. ఒక నిర్ణీతకాల కార్యాలు పూర్తి కాగానే అతడు మరణించి వేరొక జన్మను పొందుతాడు. ఈ ప్రకారంగా జీవుడు ఒక జన్మమృత్యువలయం నుండి వేరొకదానికి ముక్తి లేకుండ తిరుగుతుంటాడు. అయినా ఈ జననమరణచక్రము అనవసరమైన హత్యను, జంతువధను, యుద్ధాన్ని సమర్థించదు. కాని అదే సమయంలో శాంతిభద్రతలను నెలకొల్పడానికి మానవసంఘంలో హింస, యుద్ధము అనేవి అనివార్యమైన అంశాలు అవుతాయి.
    భగవంతుని సంకల్పమైనందున కురుక్షేత్రయుద్ధము అనివార్యమైన సంఘటన. ఇక ధర్మం కొరకు యుద్ధం చేయడమనేది క్షత్రియుని విధి. తన సక్రమమైన విధిని నిర్వహిస్తున్నప్పుడు అర్జునుడు ఎందుకు తన బంధువుల మరణానికి భయపడాలి లేదా దుఃఖించాలి? ధర్మభంగం చేసి తత్కారణంగా పాపానికి గురికావడం అతనికి  తగదు. నిజానికి పాపానికే అతడు ఎంతో భయపడుతున్నాడు. తన సక్రమమైన విధినిర్వహణను విడిచిపెట్టడం ద్వారా అతడు తన బంధువుల మరణాన్ని ఆపలేడు కాని తప్పు కార్యపథాన్ని ఎంచుకోవడం వలన అతడు పతనం చెందగలడు.

శ్లోకము - 28
అవ్యక్తాదీని భూతాని వ్యక్తమధ్యాని భారత |
అవ్యక్తనిధనాన్యేవ తత్ర కా పరిదేననా ||

అవ్యక్త ఆదీని - ఆదిలో కనపడక ఉండి; భూతాని - సృజించబడిన వారందరు; వ్యక్త - కనపడుతూ; మధ్యాని - మధ్యలో; భారత - ఓ భరతవంశీయుడా; అవ్యక్త - కనపడకుండ పోతారు; నిధనాని - నశించినప్పుడు; ఏవ - ఇది ఈ విధంగా ఉంటుంది; తత్ర - కనుక; కా - ఏమిటి; పరిధేవనా - దుఃఖము.

సృష్టించబడే జీవులందరు ఆదిలో అప్రకటంగా ఉంటారు, మధ్యలో ప్రకటమై ఉంటారు నశించినప్పుడు తిరిగి అప్రకటమౌతారు. కనుక దుఃఖించవలసిన అవసరమేమున్నది. 

భాష్యము : ఆత్మ ఉనికిని విశ్వసించేవారు, ఆత్మ ఉనికిని నమ్మనివారు అనే రెండు తరగతుల తత్త్వవేత్తలు ఉన్నారని అంగీకరించినప్పుడు ఈ ఇద్దరిలో ఎవరిని అనుసరించినా దుఃఖానికి కారణం లేదు. ఆత్మ ఉనికిని నమ్మనివారు వేదజ్ఞానాన్ని అనుసరించేవారిచే నాస్తికులుగా పిలువబడతారు. మాట వరుసకు ఈ నాస్తికవాదాన్ని మనం అంగీకరించినా దుఃఖానికి ఎటువంటి కారణం లేదు. ఆత్మకు ప్రత్యేకమైన ఉనికి ఉండగా భౌతికతత్త్వాలు సృష్టికి ముందు అప్రకటంగా ఉంటాయి. ఈ అప్రకటస్థితి నుండి ప్రకటస్థితి వస్తుంది. ఆకాశము నుండి వాయువు, వాయువు నుండి అగ్ని, అగ్ని నుండి నీరు, నీటి నుండి భూమి ప్రకటము కావడము ఇటువంటిదే. భూమి నుండి అనేకమైనవి ప్రకటమౌతూ ఉంటాయి. ఉదాహరణకు ఒక ఎత్తైన భవంతి భూమి నుండే ప్రకటమౌతుంది. దానిని పడగొట్టినపుడు ఆ రూపము తిరిగి అప్రకటమై చరమదశలో ధూళికణాలుగా మిగిలిపోతుంది. శక్తి నశింపకుండ ఉంటుందనే నియమము నిలిచి ఉన్నప్పటికిని తేడా ఏమిటంటే కాలక్రమంలో అనేకమైనవి ప్రకటమై అప్రకటమౌతుంటాయి. అటువంటప్పుడు ప్రకటస్థితిలో గాని, అప్రకటస్థితిలో గాని దుఃఖానికి కారణమేమున్నది? అప్రకటస్థితిలోనైనా ఏదో ఒక రకంగా అన్నీ నశింపు లేకుండ ఉంటాయి. ఆది, అంతము రెండింటిలోనూ అన్ని మూల తత్త్వాలు అప్రకటంగా ఉంటాయి; కేవలము మధ్యలో అవి ప్రకటమౌతాయి. ఇది ఎటువంటి నిజమైన భేదాన్ని కలిగించదు 
   ఈ భౌతికదేహాలు కాలక్రమంలో నశించేవేయైనా (అస్తవస్త ఇమే దేహాః) ఆత్మ నిత్యమైనదని (నిత్యస్యోక్తాః శరీరిణః) భగవద్గీతలో చెప్పబడిన వేదాల తుది అభిప్రాయాన్ని మనం అంగీకరిస్తే ఈ దేహము ఒక వస్త్రము వంటిదని సర్వదా తప్పక గుర్తుంచుకోవాలి. కనుక వస్త్రమార్పు విషయంలో ఎందుకు దుఃఖించాలి? నిత్యమైన ఆత్మతో పోలిస్తే భౌతికదేహానికి వాస్తవమైన అస్తిత్వము లేనేలేదు. అదొక కల లాంటిది, కలలో మనము ఆకాశంలో ఎగురుతున్నట్లు లేదా రాజులాగా రథంలో కూర్చున్నట్లు భావించినా మేల్కొనగానే ఆకాశంలో గాని, రథంలో కూర్చొనిగాని లేమని తెలుసుకుంటాము. భౌతికదేహానికి అస్తిత్వం లేదనే విషయం ఆధారంగా వేదజ్ఞానము ఆత్మానుభూతిని ప్రోత్సహిస్తున్నది. కనుక మనిషి అత్మ ఉనికిని నమ్మినా లేదా ఆత ఉనికిని నమ్మకపోయినా, అంటే ఈ రెండింటిలో దేనిలోనైనా దేహనష్టము గురించి దుఃఖంచడానికి ఎటువంటి కారణము లేదు.

శ్లోకము - 29
ఆశ్చర్యవత్ పశ్యతి కశ్చిదేనం
ఆశ్చర్యవద్ వదతి తథైవచాన్యః |
ఆశ్చర్యవచ్చైనమన్య: శ్రుణోతి
శ్రుత్వాప్యీనం వేద న చైప కశ్చిత్ ||

ఆశ్చర్యవత్ - ఆశ్చర్యకరమైనదిగా; పశ్యతి - చూస్తాడు; కశ్చిత్ - ఒకడు; ఏనం - ఈ ఆత్మను; ఆశ్చర్యవత్ - ఆశ్చర్యకరమైనదిగా; వదతి - వర్ణిస్తాడు; తథా - ఆ విధంగా; ఏవ - నిక్కముగా; - కూడ; ఏనం - ఈ ఆత్మ; అన్యః - ఇంకొకడు; శ్రుణోతి - వింటాడు; శ్రుత్వా - విని; అపి - అయినా; ఏనం - ఈ ఆత్మ;  న వేద - అర్థం చేసికోలేడు; - మరియు; ఏవ - నిశ్చయంగా; కశ్చిత్ - ఇంకొకడు.

కొందరు ఆత్మను ఆశ్చర్యకరమైనదిగా చూస్తారు, కొందరు దానిని ఆశ్చర్యకరమైనదిగా వర్ణిస్తారు, మరికొందరు దానిని ఆశ్చర్యకరమైనదిగా వింటారు. కాగా ఇంకొందరు దానిని గురించి వినినప్పటికీనీ ఏమాత్రము అర్థం చేసికోలేరు.

భాష్యము : గీతోపనిషద్ ముఖ్యంగా ఉపనిషత్తుల పైననే ఆధారపడియున్నందున ఈ కఠోపనిషద్ లో  (1.2.7) కూడ కనిపించడము ఆశ్చర్యాన్ని కలిగించదు.

శ్రవణయాపి బహుభిర్ యో న లభ్యః శృణ్యన్తోఃపి బహవో యం న విద్యుః | 
ఆశ్చర్యో వక్తా కుశలోఃస్య లబ్ధా ఆశ్చర్యోస్య జ్ఞాతా కుశలానుశిష్టః || 

అతిపెద్దదెన జంతువు దేహంలోను, మహావటవృక్షంలోను, కేవలం అంగుళమాత్ర స్థలంలో కోట్లాది సంఖ్యలో ఇమడగలిగే సూక్ష్మ జీవులలో కూడ ఆణుపరిమాణ ఆత్మ ఉన్నదనే విషయము నిక్కముగా పరమాశ్చర్యకరమైనది. విశ్వమందలి తొలిజీవుడైన బ్రహ్మదేవునికే బోధలు చేసినట్టి పరమజ్ఞాన ప్రామాణికుడు వివరించినప్పటికిని వ్యక్తిగత అణుమాత్ర ఆత్మ యొక్క అద్భుతాలను జ్ఞానరహితులు, తపోరహితులు అర్థం చేసికోలేరు. స్థూల భౌతికవస్తు పరిజ్ఞానమే ఉన్నందున ఈ కాలపు జనులు అతిసూక్ష్మ మైన కణము మహాఘనమైనదిగాను, అతి చిన్నదిగాను ఎలా కాగలదో ఊహించలేరు. అందుకే వారు ఆత్మను నిర్మాణరీత్యా లేదా వర్థన రీత్యా అద్భుతమైనదిగా చూస్తారు. ఆత్మావగాహన లేనప్పుడు జీవనసంఘర్షణలోని సమస్త కార్యాలు చివరకు భంగపడతాయనేది యథార్థమే అయినప్పటికిని ప్రకృతిచే మోహితులై జనులు ఇంద్రియభోగ విషయాల పట్ల ఎంతగా ఆకర్షితులౌతారంటే ఆత్మావగాహన అనే ప్రశ్నను అర్ధం చేసికోవడానికి వారికి సమయమే ఉండదు. ప్రతియొక్కడు ఆత్మ గురించి తప్పక ఆలోచించి, ఆ విధంగా భౌతిక్షేశాలను పరిష్కరించుకోవాలని వారికి బహుశ తెలిసి ఉండకపోవచ్చును.
  ఆత్మను గురించి వినగోరిన కొందరు జనులు సత్సంగములో ఉపన్యాసాలకు హాజరు అవుతుంటారు. కాని అజ్ఞానవశంగా ఒకప్పుడు వారు పరమాత్మ, అణుఆత్మ పరిమాణ భేదము లేకుండ సమానమని భావించి పెడత్రోవపడతారు. పరమాత్మస్థితిని అణుఆత్మ స్థితిని, వాటి కలాపాలను, వాటి మధ్య సంబంధాన్ని, ఇతర పెద్దచిన్న వివరాలను పరిపూర్ణంగా అర్థం చేసికొన్న వ్యక్తిని కనుగొనడం చాలా కఠినం. ఇక ఆత్మజ్ఞానము నుండి నిజంగా పూర్ణలాభాన్ని పొందినవాడు, ఆత్మస్థితిని నానారకాలుగా వర్ణింపగలిగినవాడు అయిన వ్యక్తిని కనుగొనడం ఇంకా చాలా కఠినం. కాని మనిషి ఏదోవిధంగా ఆత్మ విషయాన్ని అర్థం చేసికొనగలిగితే జీవితము ధన్యమౌతుంది.
   అయినా ఇతర సిద్ధాంతాలచే దారి తప్పకుండ పరమప్రామాణికుడైన శ్రీకృష్ణునిచే చెప్పబడిన భగవద్గీత వాక్యాలను అంగీకరించడమే ఆత్మవిషయాన్ని ఆర్ధం చేసికోవడానికి అత్యంత సులభమైన పద్ధతి. కాని మనిషి శ్రీకృష్ణుడిని దేవాదిదేవునిగా అంగీకరించగలగడానికి ముందు ఈ జన్మలోనో, పూర్వజన్మలలోనో గొప్ప తపస్సు త్యాగము కూడ అవసరమౌతాయి. అయినా విశుద్ధభక్తుని కరుణచే శ్రీకృష్ణుడు యథార్థముగా తెలియబడతాడు గాని అన్యథా కాదు.

« Page - 10  మునుపటి పేజీ. 

buttons=(Accept !) days=(0)

Our website uses cookies. Learn More
Accept !
To Top