కఱివేల్పుశతకము - Karivelpusatakam

కఱివేల్పుశతకము - Karivelpusatakam

: కఱివేల్పుశతకము : 
రచించినవారు - వైదర్సు అప్పయకవి

సీ. సిరిమించుమించు వైఖరి గనుపట్టు హొం- | బట్టుదుప్పటివల్లెవాటు మణికి-
రీటంబునీటు సిరిమెఱుంగుఁబోఁడితో | బుట్టిన గొప్పకెంపుపతకంబు
కమ్మకస్తురితిలకంబు డంబువిడంబ- | నం బొనర్పఁ జతుర్భుజంబులందుఁ
జిందంబు సుడివాలు సింగాణి యడిదంబు | గద మొదలగు నైదుకైదువులను  
గీ. బూని దేవకికడుపునఁ బుడుతవడువు | నఁ బొడమి, పుడమిజడు పుడుపఁ బచరించి-
నట్టి నా సామి నీకు జోహారు సేతు | బళిర కఱివేల్ప! పసిఁడిదువ్వలువదాల్ప! 1

సీ. మొలకనగవు ముద్దుమొగము చిగురుమోవి | మెఱుఁగుఁజెక్కుల మిసమిస లెసఁగ, నొ-
సలిపై ముసరి పెంపెసలు గూర్చు కురులఁ గ- | న్నులఁ దీర్చి బుగ్గపై నిలిపినట్టి
చిన్నికాటుకచుక్క చెలువంపు బొమల న- | డుమనిడ్డ యుక్కబొట్టు చెలువడర
నడుగుఁదమ్మికి గంగ యలరుదేనియఁగా నె- | గడుతండ్రివి యశోద పుడిసెడు జల-  
గీ. ములకు నుగ్గు గుడిచి, యల నలువఁ గన్న | బొడ్డుతామర కొకగుడ్డ యడ్డ మునుప
దగుదునని పవ్వళించితే తల్లియొద్ద | బళిర కఱివేల్ప! పసిఁడిదువ్వలువదాల్ప! 2

సీ. జతకుల్కు తళ్కువజ్రాలకళాసిగీ | పని చొకాటంపు కుందనపురావి-
రేక నుదుట నుదుటై కనుపింపఁ జెం- | పల పక్కిరాపచ్చబావిలీ ల-
సదుక్రొంబసల నించ నెదపయి పైగోవ | కెంపురారవ చెక్కడంపు జాళు-
వా గొలుసుకొన మువ్వన్నెమెకముగోళ్ళ | మెఱుఁగు తురఁగలింప మేల్కడాని  
గీ. తాయెతుల్సందిట నటింపఁ దల్లిమ్రోలఁ | జెలువు దీపింప ముద్దులుసేయు నీదు
చక్కఁదనమెన్న వేనోళ్లు చాలవన్న | బళిర కఱివేల్ప! పసిఁడిదువ్వలువదాల్ప! 3

సీ. పొంచి తల్లిని మఱపించి బాళ్వామొల | నూల్చిఱుగంటల నుడి నడంచి
పసిఁడిగజ్జెలను జొప్పడెడు చప్పుడుకుంచి | కుందనపు మురిడిగొలుసును మురుఁ-
గునఁ గట్టిగ బిగించి గూనలఁ చెయి ముంచి | చిన్ని బొజ్జపయి పాల్చినుకఁ గనక-
హస్తపల్లవమున హస్తపల్లవము నొం- | డొండ నుంచి భుజంబు లుబ్బఁ బెంచి  
గీ. మెడ నొకించుక కుదియించి మేను వంచి | కడలు వీక్షించి నీవు మీఁగడ భుజించు
చక్కఁదనమెన్న వేనోళ్లు చాలవన్న | బళిర కఱివేల్ప! పసిఁడిదువ్వలువదాల్ప! 4

సీ. కలికి యిచ్చిన పాలు కడుపు నిండనిలాగు | రక్కసివిసపుఁ బాల్గుక్కకొనుట
తరుణి పెట్టిన వెన్నఁ దనివి దీఱనియట్లు | వ్రేపల్లె మ్రుచ్చిలి వెన్నఁ దినుట
నతివ గట్టిన చల్ది యాపోవనటువలె | విప్రభార్యల బువ్వ వేఁడికొనుట
నన్నొసంగిన కజ్జమాస దీఱనిరీతి | మేలియపూపముల్ చాలఁ గొనుట  
గీ. రట్టడితనానఁ దల్లిని రవ్వసేయఁ | దలఁచి కాక జగంబులు గలుగ నీదు
బొజ్జ నిండింప నెవ్వరు పూనువారు | బళిర కఱివేల్ప! పసిఁడిదువ్వలువదాల్ప! 5

సీ. మెయిఁ బర్వు కార్చిచ్చు మీఁగడపరకయే | యట్టె కైకొని వడి నారగింప
రక్కసివిసపు పాల్మిక్కుటంబయ్యెనే | గుటుకుగుటుక్కున గ్రుక్కగొనఁగ
సుడిగాడ్పురాకాసి మెడఁ దూగుటుయ్యలే | యొప్పఁగా మిన్నంది యూఁచుకొనఁగ
చట్టొకకొంచెపు సంగడంబయ్యెనే | నిలిచి కెంగేలను నిగుడఁబట్ట  
గీ. దేవరకు నీకుఁ జెల్లె నీవేవి దలఁప | వా యశోదయు నినుఁ గొనియాడుచుండు
పొలఁతి నేఁ జెల్ల నీ పోవు పోకలెల్ల | బళిర కఱివేల్ప! పసిఁడిదువ్వలువదాల్ప! 6

సీ. తళుకుబంగరు పారదంపుమువ్వాయెనో? | గాటంపు ఱోల్మొలఁ గట్టుకొనుట!
దినము మ్రుచ్చుతనానఁ దిను వెన్న యఱుఁగనో? | చొచ్చి కార్చిచ్చును జుఱ్ఱికొనుట!
పూతన చనుపాలఁ బొడము చేఁదడఁగనో? | వ్రేతవాతెర మేల్నవాతు గొనుట!
బడిబడి నేతెంచు పగఱకు వెఱచియో? | పసికాఁపుపూఁబోండ్ల ప్రాపుఁ గొనుట!  
గీ. తనకు నొడ లోముకొనుటయుఁ దథ్యమే క- | దా! “శరీరమాద్యం ఖలు ధర్మసాధ-
న”మ్మనెడు మాట తన నెమ్మనమ్ము నాట | బళిర కఱివేల్ప! పసిఁడిదువ్వలువదాల్ప! 7

సీ. సొగసుగా నునుకురు లెగదువ్వి కట్టిన | తళుకుబంగరుజోరెత్రాఁడు సెలఁగ,
నెలనెలఁ గల చెన్నునెన్ను నెన్నుదుటిపై | జిలుఁగుకస్తురిరేఖ చెలువు మీఱ,
నొడికమై చెవుల నొప్పెడి గొప్పసుప్పాణి | చౌకట్ల తెలిడాలు చౌకళింప,
గుదిఁగూర్చి యెదఁ జేర్చుకొనిన గుప్పెడుతళ్కు | బంగరుగొలుసులు రంగులీన,  
గీ. సరిగపనికుట్టు హొంబట్టు చల్లడంపు | డంబు గనుపింప బురుసారుటంపు కాసె
చెఱఁగు లల్లాడవచ్చు నీ యొఱపయారె | బళిర కఱివేల్ప! పసిఁడిదువ్వలువదాల్ప! 8

సీ. నీ నగుమోము నీ నిద్దంపుఁజెక్కులు | నీ నిగారంపు పెన్నెరులు నీ రు-
వారంపుకౌను నీ వాటంపుచూపు నీ | చిగురాకుమోవి నీ సొగసులౌ క-
నుబొమలు నీ చిన్నినూనూఁగుమీసపు | రేఖలు నీ ముప్పిరిగొనిన పెను-
దొడలు నీ తలిరాకుటడుగులు నీ చొకా- | టపుసోఁగముక్కు నీ డంబయిన గ-  
గీ. ళంబు నీ బిత్తరంపుటురంబు నీ యొ- | యారపుం గండెపు భుజంబులట్టె గన్న
వనిత లేమయ్య మగవారె నలతురయ్య | బళిర కఱివేల్ప! పసిఁడిదువ్వలువదాల్ప! 9

సీ. గండస్థలంబులఁ గఱఁగెడు మదధార | కరణి గడ్డము నునుకప్పుఁ దేర
మోము చందురునందు మొనసిన కందునా | జోకయై మీసపురేక దోఁచ
సిరివెలందుక కొల్వుచేయు జేజేరాచ | రాగద్దె యన ఱొమ్ము రమణ యెసఁగఁ
తనుతమాలద్రుమంబునఁ బెనుపొందు శా- | ఖలనఁగ దీర్ఘబాహులు సెలంగఁ  
గీ. జారు సికతోడ జాళువా కేసరులతోడ | నివ్వటిలు నీదు నూనూఁగు జవ్వనంపు
హొయలు గని రాధ పయిఁబడకున్నె యహహ | బళిర కఱివేల్ప! పసిఁడిదువ్వలువదాల్ప! 10

సీ. ఇరుగ్రేవ సిగపొందు నెనయ సంపెగమొగ్గ | నిగ్గు తాయెతుచుట్లు నీటు సూప,
గంధంబు నునుపూతగాఁ బూసి తీర్చిన | ఱొమ్ము కస్తురిపట్టె లెమ్మె నెఱప,
పావలంటి సెలంగు పైఠాణి సెఱఁగుల | దువ్వల్వవలెవాటు నివ్వటిల్ల,
పసిఁడినిండొరనంటి యెసఁగు నేనికపంటి | దూబిడి నిడుసోగ తొంగలింప,  
గీ. వచ్చి నినుఁ జూడ నీతోడ ముచ్చటాడ | కోర్కెలొనఁగూడఁ గవఁగూడ గుట్టువీడ
కౌనులల్లాడఁ గనుచుండుఁ గలికిపిండు | బళిర కఱివేల్ప! పసిఁడిదువ్వలువదాల్ప! 11

సీ. చికిలిమేల్బంగరు చిలుకు గోణమ్ముతో | మొల కుందనపుఁ జేల మురువుతోడ
నపరంజిచాయ నిద్దపు రువారంబుతో | మొసలివాపోగుల మిసిమితోడ
ముక్కున హురుముంజి ముత్యంపు మురుగుతో | కొనచెవి బావిలీ కొమరుతోడ
రాణించు జిగిపచ్చరాచిల్క తాలితో | ప్రాఁగెంపు రాపాడు పత్రితోడఁ  
గీ. జెలఁగు నినుఁజూచు వ్రేరాచచిగురుఁబోండ్ల | తాలిమి బిరానఁ జింపఁ గెందలిరుటలుఁగు
నించువిలుకాఁడు చికిలి సేయించుగదర | బళిర కఱివేల్ప! పసిఁడిదువ్వలువదాల్ప! 12

సీ. సిరిపొత్తునకు నిన్నుఁ జేరనీయదొ కదా | వ్రేపల్లెఁ బెఱుఁగుట వినియెనేని,
కలిమితొయ్యలి నెమ్మొగంబుఁ ద్రిప్పునొ కదా | చిల్లరకథలెల్లఁ జెవులఁబడిన,
ననవిలుతల్లి పక్కున నవ్వునే గదా | వావిమాలిన యత్తవార్త వినిన,
రేరేనితోఁబుట్టు గ్రేణి సేయునె కదా | సత్య పెన్‍జడవేటు జాడఁ గన్న-  
గీ. ననుచు మదిఁ గొంతసంశయంబయ్యె మాకు | నైననేమాయె జాణవీ వట్టులేని
లేని వగలెల్లఁ గొన్నిఁ గల్పించలేవె, | బళిర కఱివేల్ప! పసిఁడిదువ్వలువదాల్ప! 13

సీ. కట్టడివై బలిఁ గట్టివేయఁగఁ గదా | చెలి నిండుకౌఁగిటఁ జిక్కవలసె,
పొంచి కోలను వాలిఁ బొలియించఁగాఁ గదా | మెలఁత కన్సన్నల మెలఁగవలసె,
వెలఁదికై శివుని విల్విఱిచివేయఁగఁ గదా | మదిరాక్షి బొమముళ్ళ కొదుగవలసె,
మగువవై శితికంఠు మరులుగొల్పఁగఁ గదా | విరిఁబోండ్ల వెనువెంటఁ దిరుగవలసె-  
గీ. నటుల నిటు నీకుఁ జేచేత నత్తచేత | ననుభవంబయ్యె నింక నీకీ యత్త యెదుట
నేమి కానున్నదో కదా యెఱుఁగఁ గాని | బళిర కఱివేల్ప! పసిఁడిదువ్వలువదాల్ప! 14

సీ. కర్ణాటకపు సిగ గనుపట్టు నునుపట్టు | పొంది క్రొందళ్కులందందుఁ బర్వ
సొగసు రా రాజాతి మగరాకళాసిగీ | గెల్లాపటాతేట గ్రేళ్లు దాఁట
తోరమౌ ముత్యాలఁ దులకింపు కెంపుల | చెంపఖల్లీరుచుల్ చెంగలింప
నపరంజిప్రతిమ నిద్దపు మనీలాపని | బాజుబందుల ఠీవి పరిఢవిల్ల  
గీ. నెసఁగు నిను నొంటిఁ గనియట్టి పసిడివంటి | పాయమెల్లను నీ పాలు సేయఁగోరి
మమత పాలయ్యె గద! రాధ మదనబాధ | బళిర కఱివేల్ప! పసిఁడిదువ్వలువదాల్ప! 15

సీ. మొలకనవ్వులఁ దాల్మి మూలల కొదిగించి, | మోముతేఁటలఁ గోర్కి మొలవఁజేసి,
చక్కెరకెమ్మోవి గ్రుక్కిళ్లు కొల్పించి | కడకంటిచూపులఁ గళలు రేచి,
తెలినునుకొనగోళ్ల గిలిగింత లొదవించి, | తొడబెడంగుల గగుర్పొడువఁజేసి,
రాణించు నెద నెమ్మె రవిక కప్పుల మార్చి, | యొయ్యారమున నూర్పు లుడుగఁజేసి,  
గీ. చెలఁగు నీ చెల్వు చీకాకు చేసి రాధ | సిగ్గుఁగొని జవ్వనము లూటిచేసెఁ గాక,
దోసమా యింతి చేసిన దుడుకదేమి? | బళిర కఱివేల్ప! పసిఁడిదువ్వలువదాల్ప! 16

సీ. ముసురుచుఁ జిక్కించు మొకరితుమ్మెదలకై | ముచ్చటై మోమెత్తి మురియ వెఱచు,
పొగరానుకొని వచ్చు తగరుకోయిలలకై | వేడుకైనను మోవి విప్ప వెఱచు,
పదరుచు నేతెంచు కొదమచిల్కలకునై | హవుసైన మాఱుమాటాడ వెఱచు,
పగ చాటుకొని వచ్చు వెగటుజక్కువలకై | మనసైన గుబ్బ లేమఱఁగ వెఱచు,  
గీ. ప్రౌఢయయ్యును దన ముగ్ధభావ మేర్ప- | డ, మెలఁగెఁ గదర యమునాతటంబు పొంత
నొదవు వలవంత రాధ నిన్ వెదకునంత | బళిర కఱివేల్ప! పసిఁడిదువ్వలువదాల్ప! 17

సీ. ముద్దీయ కటు మాఱుమోము సేయుటె కాని, | యలరుఁజెక్కుల గగు ర్పణచలేదు,
కౌఁగిలీయక యోరఁ గైకొంటయే కాని, | పదుటు గుబ్బల యుబ్బుఁ బట్టలేదు,
తేఱి చూడక చూడ్కి ద్రిప్పివైచుటె కాని, | యిఱ్ఱింకు కనుఁగ్రేవఁ నిముడలేదు,
కలయికీయక తొడల్ గదియించుటే కాని, | నీవి జల్లని వీడ నిల్పలేదు,  
గీ. కినుకఁ గొననేర్చి తమి దాఁచుకొనఁగ నేర | దకటకట! నీపైని యాపరాని
మోహమిరువెంద నెయ్యంపు మోడియందు | బళిర కఱివేల్ప! పసిఁడిదువ్వలువదాల్ప! 18

సీ. తొడరు రేజోతి చేఁతులకాఁక వడఁదాఁక | కలువపూటరిగెలఁ గ్రమ్మిక్రమ్మి,
పయిఁగ్రమ్ము పువుదుమ్ముఁ బాయననంటి లేఁ- | దలిరుపేటురుమాళ్లఁ దరిమితరిమి,
శుకపికాదుల పల్కులకు నుల్కుఁగొన కమ్మ- | వీనుల నంగుళు లానియాని,
చలిగాలి యుడుకుసోఁకుల ఢాకకై సారె | దట్టంపుటీరాలఁ దార్చితార్చి,  
గీ. అమ్మచెల్లంచు నిరుగడ నలమికొంచుఁ | దోడఁ జనుచుండు నుడిగంపుఁ జేడెపిండు
విరిపొదలలోను రాధ నిన్ వెదుకఁగాను | బళిర కఱివేల్ప! పసిఁడిదువ్వలువదాల్ప! 19

సీ. మునమున నడపించు ననతేనెగాసమ్ము | నెలగోలునకు మూల లీఁగలేక,
యా వెంటఁ దారసంబగు కల్వదొర కేలు | గమిచివ్వ గరబారుఁ గదియలేక,
ఆ పిఱుందున పువ్వుటందంబుపై వచ్చు | బేడిసడాల్ దేఱి చూడలేక,
ఆ పైని పచ్చతేజీపౌజు కాల్మట్ల | నడరుపుప్పొడికోర లానలేక,  
గీ. ఓడి యొడిచేతు లిడికొనియుండుఁ గాని, | హవుసునకునైన నీపైని యలుకఁబూన
దతనుజయధాటి మది నాటి యా వధూటి | బళిర కఱివేల్ప! పసిఁడిదువ్వలువదాల్ప! 20

సీ. చెక్కిటఁ జెయిచెంద సెకచింద వాతెర | గందనిట్టూర్పు లందందఁ బర్వ,
ననుఁగునెచ్చెలులందఱును మది గుంద చ- | క్కనిమేను వెన్నెల గాసిఁ బొంద,
తాలిమి డింద డెందమునఁ గొందలమొందఁ | గెందలిరుల పాన్పునందుఁ జేరి,
యసురుసురంచు మోమరవంచు విధినెంచు | నశ్రులునించు లో నలమటించుఁ,  
గీ. గదర నినుఁ బాసి యా రాధ కమ్మవిల్తు | మాయ యనఁబోలి యంతైనఁ జేయు జోలి
నడరు మది జాలి జవరాలి కా విరాళి | బళిర కఱివేల్ప! పసిఁడిదువ్వలువదాల్ప! 21

సీ. తల చూపనీయక తఱుము తుమ్మెదలకు | లపన పంకజరుచి లంచమిచ్చి,
వాయెత్తనీయక డాయు రాచిల్కల | కధరబింబద్యుతు లాసగొలిపి,
ఎలుఁగెత్తనీయక యేఁచు కోయిలలకు | కరపల్లవచ్ఛాయ కాన్కలొసఁగి,
చనుకప్పుఁ దొలఁగ పైకొను జక్కవల యొద్ద | కనుమీల డాలు తాకట్టు పెట్టి,  
గీ. కడఁగి యిబ్భంగి నేర్పునఁ గన్మొఱంగి, | డాగు నొకచెంత యమునాతటంబు పొంత,
నొదవు వలవంత రాధ నిన్ వెదకునంత | బళిర కఱివేల్ప! పసిఁడిదువ్వలువదాల్ప! 22

సీ. కళుకులూఱఁగఁ జాలు కమ్మపౌజుల డాలు | వాలుచూపులకు నివాళులీయ,
పుక్కిటి నెత్తావిఁ బొల్చు వీడెపుఁ గావి | మోవికెంపునకుఁ జేమోడ్పులిడఁగ,
జిగికడానిమెఱుంగు చీరకుచ్చు చెఱంగు | తొడబెడంగులకుఁ బావడలు వీవ,
పదములఁ దళ్కొత్తు పదనులత్తుక జొత్తు | మీఁగాళ్లరుచికిఁ గైలాగొసంగ,  
గీ. రాజసంబున నీరీతిఁ దేజరిల్లు | పొలుపు గని రాధప్రాయంబుఁ బొత్తిగాను
గుత్తకొంటివిదేమిరా! యత్త యనక | బళిర కఱివేల్ప! పసిఁడిదువ్వలువదాల్ప! 23

సీ. కరికుంభమధ్యసంఘటిత నీలాంజనం | బనఁ గుచంబుల నూఁగుటారు మెఱయ,
కాలాహిమణిఫణాగతివేణి మొదలంటి | ఠీవి కెంపులరాఁకడీ చెలంగ,
తన డాలు నిరసించు కనుమీలఁ బట్టఁ ద- | లంచి, కచయము నా లహరి ముంచి,
మీనాంకుఁ డేసిన మేలుజాలంబనఁ | జేరుపాఁపటబొట్టు చెలువ మమర,  
గీ. రాజసంబున నీరీతిఁ దేజరిల్లు | పొలుపుఁ గని రాధప్రాయంబు బొత్తిగాను
గుత్తకొంటివిదేమిరా! యత్తయనక | బళిర కఱివేల్ప! పసిఁడిదువ్వలువదాల్ప! 24

సీ. పావడఁ బాసి కన్పడు తొడనిగ్గుతో | వగఁజూపు కుఱుమాపు వలువతోడ,
సేస లిట్టట్టుగాఁ జెదరు ముంగురులతో | వసివాడు నెమ్మోము మిసిమితోడ,
పలునొక్కు లెడఁబడ్డ పలుచని మోవితో | సోగకన్నులఁ గల్గు సొలపుతోడ,
నూఱట చెందిన యుదుటు చన్మొనలతో | రహి గట్టిముడివడ్డ రవికతోడ,  
గీ. చెఱుఁగు మాసిన దినములఁ జెలఁగు రాధ | సోయగము నిన్నుఁ దరితీపు సేయుగదర!
నిముస మొకయేఁడుగాఁ బోలి నిగుడఁజాలి | బళిర కఱివేల్ప! పసిఁడిదువ్వలువదాల్ప! 25

సీ. రహి నూనెమెఱుఁగాని రాణించు వేణితో | సొలపుచూపుల తళత్తళలతోడ,
పసుపాని పసఁబూని యెసఁగు నెమ్మేనితో | దళుకుఁజెక్కుల ధగద్ధగలతోడ,
సిరిమించు సరిగంచు చీరకుచ్చెలలతో | దళుకుటందెల ఝళంఝళలతోడఁ
గడలందుఁ గడలొందు కక్షదీధితులతో | బొగరుగుబ్బల నిగన్నిగలతోడ,  
గీ. తేటపాటీల నాలవనాట నీటుఁ | జెందు రాధావధూటి కే చేటి సాటి
వ్రతము చెడ్డను సుఖము చేపడెను గదర | బళిర కఱివేల్ప! పసిఁడిదువ్వలువదాల్ప! 26

సీ. దట్టంపుఁ గౌగిళ్లఁ దగ్గుడుమొగ్గుడుల్ | కుల్కుగుబ్బల యుబ్బుఁ గొంచెపఱ
నుదుటు చక్కిలిగింత యుక్కిరిబిక్కిరి | యెడనెడ మరుసివం బెచ్చరింప
చికిలి నున్గొనగోళ్ళ చిందఱవందఱల్ | అందందుఁ జిందఱ లొందచెంద
నాపోని దప్పికి యక్కఱగిక్కఱల్ | గెడపి కెమ్మోవి సొక్కిళ్లు వోవఁ  
గీ. గూకికవరవ కెఱలి యాగుబ్బు గాఁగఁ | దనరు నాలననాటి రాధావధూటి
కూటమిఁ దలంప నదరెనో గుండె నీకు | బళిర కఱివేల్ప! పసిఁడిదువ్వలువదాల్ప! 27

సీ. ఈలువు నీలమ్ము లెసఁగు సోరణగండ్ల | నొకచాయ నెలచాయ లొఱపుఁ జేయ
కొణిగలఁ దళుకొందు కుందనంబుల గూళ్ళ | నొకదారి బకదారి యుద్దిసలుప
రాణ రంజిలు నపరంజిపంజరముల | నొకనంక గొరువంక లుబుసుపుచ్చ
గీల్బొమ్మ కైతమ్మిఁ గెరలు పూసురకటిగా- | డ్పొకయోర సెకదీఱ నూఱడింప  
గీ. పసిఁడిక్రోవులఁ బన్నీరు ముసురుకొనఁగ | రాధతోఁ గూడ జాబిల్లిరాలమేడ
వేసవులు సల్పవే క్రీడ వేడ్కతోడ | బళిర కఱివేల్ప! పసిఁడిదువ్వలువదాల్ప! 28

సీ. కలకంఠి నునువాలు కనుబెళ్కులకుఁ దోడు | సోరణగండ్ల మించులు చలింప
చెలికొప్పుపై నుప్పతిలు కప్పునకుఁ దోడు | చూఱుపట్టెల మొయిల్ చుట్టుకొనఁగ
మగువ కుత్తుకఁబల్కు మణితంబులకుఁ దోడు | రహిమించు నురుముల రవమెసంగఁ
బూఁబోఁడి చెలువంపు బొమవంపులకుఁ దోడు | తెఱగంటి దొరవింటి తెఱుఁగులంట  
గీ. గగన మేవేళ నల పచ్చికడవ లీలం | బఱఁగు జడివాన నీకు నుప్పరిగెలోన
నొదవె నా రాధతో జోక నుబుసువోక | బళిర కఱివేల్ప! పసిఁడిదువ్వలువదాల్ప! 29

సీ. బవిరి దీరిచిన యన్నువ గవాక్షుల వెంట | నొదవు సాంబ్రాణిధూపోష్మ వలన
కలయఁబర్వెడు నవ్యకస్తూరికాఘుటి- | కామిళద్దీపికాఘర్మకలన
నెయ్యంపుటలుకల నిగుడిపుక్కిళ్ళను | వెడలు నిట్టూర్పుగోర్వెచ్చ వలన
సరస మేర్పడు బాహ్యసురతశ్రమంబునఁ | బొడము నెమ్మేనుల పొగరువెట్ట  
గీ. నెట్లు చలిదీఱునబ్బ నీ కిఱుకుగుబ్బ | గుబ్బలుల నుబ్బతిలు నుబ్బ యబ్బకున్న
మిన్నయగు రాధ కౌఁగిటి మిద్దెయింట | బళిర కఱివేల్ప! పసిఁడిదువ్వలువదాల్ప! 30

సీ. మూఁపునఁ గేలూది మురియుచుఁ గూర్చున్న | తరిగుబ్బ గోరొత్తఁ దగ్గుజగ్గు
బలిమిఁ బైపడి మోవి బలునాటఁ గిలకిల | నగుచు నావలిమొగంబగు హొరంగు
మగలాగు సల్ప నెమ్మొగము తప్పక చూడ | వాలుగన్నులు దేలవైచు బాగు
కలియకు మలసి చక్కనిసామి నన్నిఁక | గాసిచేయకుమను కనికరంబుఁ  
గీ. దలఁచినను గుండె జల్లని జలదరింప | నెట్టులోర్చితొ దెలియదీ వెట్టిదిట్ట-
వైన నా రాధ చెయ్వు లిట్టట్టుసేయు | బళిర కఱివేల్ప! పసిఁడిదువ్వలువదాల్ప! 31

సీ. అలరువాతెఱ పంటి కందిచ్చి యోరయై | కడలు గన్పట్టు క్రేఁగంటిచూపు
మరుకేళి గవయు నత్తఱి తొడల్ గదియించి | పైకెక్కుటకు హౌసుపఱచు నొఱపు
మగలాగు సల్ప ముందుగ నీవు గడఁగిన | తఱిఁ జూపులను దెల్పు దైన్యవృత్తి
కలయక గిలిగింత గ్రమ్మ ఱొమ్మునఁ జేరి | ‘కదలించకుర’ యంచుఁ బదరు ఱంతుఁ  
గీ. దలఁచినను గుండె జల్లని జలదరింప | నెట్టులోర్చితొ తెలియదీ వెట్టిదిట్ట-
వైన నా రాధ చెయ్వు లిట్టట్టుసేయు | బళిర కఱివేల్ప! పసిఁడిదువ్వలువదాల్ప! 32

సీ. గంధసారముఁ బూయు కరణి చెక్కులురుండ | లాబలాకొనెడు చెల్వంపు వగలు
నుపరతి నీరీతి నొదవింతు చెమ్మట | లను మాడ్కి బన్నీరు నినుచు బాకు
కైచేసి రతిఁ జొక్కు గడిమించి గన్నారఁ | గనక ఱెప్పలు వ్రాల్చుకొనెడు వెరవు
తొడ తలాడగ నున్నయెడ మంతనముఁ దెల్ప | తగ్గి మోమున మోముఁ దార్చు నేర్పు  
గీ. తలఁచినను గుండె జల్లని జలదరింప | నెట్టులోర్చితొ తెలియదీ వెట్టిదిట్ట-
వైన నా రాధ చెయ్వు లిట్టట్టుసేయు | బళిర కఱివేల్ప! పసిఁడిదువ్వలువదాల్ప! 33

సీ. ముద్దిచ్చుతఱి చెక్కుటద్దంబు మోవివై | గదియించి యరచొక్కుఁ గాంచు సొబగు
పెదవిపైఁ బలుకెంపు లొదవింప సీత్కృతి | నించి కన్బొమదోయి వంచు సొంపు
పిఱిఁదిఁ గూర్చుండి పెన్నెఱులు దువ్వుచుఁ బొగ- | రడఁగ చన్మొనల వెన్నదుము హొయలు
కలయఁగ నీ జడఁ గట్టివైతునటన్న | ఠీవి పెన్నెఱులు జాచుకోపు  
గీ. తలఁచినను గుండె జల్లని జలదరింప | నెట్టులోర్చితొ తెలియదీ వెట్టిదిట్ట-
వైన నా రాధ చెయ్వు లిట్టట్టుసేయు | బళిర కఱివేల్ప! పసిఁడిదువ్వలువదాల్ప! 34

సీ. తమి పోకముడి ఱొమ్ము దగులుచు నోరయై | యొడికట్టు చేమాటు నువిద నీటు
బాహ్య కేళీకలాపరిపాకయై రతి- | కాంక్ష చూపులఁ దెల్పు కల్కి సొలపు
నంకపర్యంకశయనసమయోపకం- | ఠశశికాంతచషకాంతరపటీర-
పంకంబునకు నిగ్గి పైకి నించుక మ్రొగ్గి | చన్మొన లెదఁ దార్చు సఖియ నేర్పు  
గీ. తలఁచినను గుండె జల్లని జలదరింప | నెట్టులోర్చితొ చెలియదీ వెట్టిదిట్ట-
వైన నా రాధ చెయ్వు లిట్టట్టుసేయు | బళిర కఱివేల్ప! పసిఁడిదువ్వలువదాల్ప! 35

సీ. పిఱుఁదుగుట్టు బయటఁబెట్టు వల్పెంబు గ- | ట్టి బిగువురవి దొడిఁగి పొడవగు
నిండుజరీచెట్ల నీటుపైఁటచెఱంగు | నేటవాలుగ మొలనిడి కుదురుగ
చేర్చుక్క నించి పసిడిగాజులు బిగించి | యందెలు మొఱయంగ సందిదండ-
లు చలింప నెన్నుదురు చెమర్ప వగ వెల- | ర్పఁ గవును నులియంగ వగ చెలంగ  
గీ. కులుకుచుఁ గడాని చిమ్మనఁగ్రోవిఁ బూని | నిగ్గు వెదచల్ల గుంకుమనీరు చల్ల
నెదురుకొని వచ్చు రాధ చెల్వెన్నఁ దరమె | బళిర కఱివేల్ప! పసిఁడిదువ్వలువదాల్ప! 36

సీ. బరణికప్పుల లక్క భాసిల్లు విధమున | గబ్బిగుబ్బలు కంచుకమునఁ దనర
నిసుకదిన్నియలపై నెసఁగు నీరెండ కై- | వడి నితంబమునంటి వలువ సెలఁగ
తుమ్మెదచాలుపైఁ దొఱఁగు పుప్పొడి రీతి | నూగారుపైఁ బైట బాగుమీఱఁ
బొండమ్ములందుఁ గెంపులు నింపినటువలెఁ | బదములఁ గుచ్చిళ్లు గుది నటింప  
గీ. నెమ్మి చెల రేగి కుంకుమనీటఁ దోఁగి | యలఁత లెడలించు జలకేళి కఱుగుదెంచు
రాధ వగఁ గన్న మది నిల్పరాదురన్న | బళిర కఱివేల్ప! పసిఁడిదువ్వలువదాల్ప! 37

సీ. రాణించు నెఱజంటరవికపట్టీ నంటి | ముత్తరుల్ దొంతరై బిత్తరింప
జిగికుసుంబావన్నె చీరకుచ్చెల చెఱం- | గంచు లంచలకచ్చు లచ్చుపడఁగ
కుదురులై యెద నిండుకొనెడు గుత్తపుగుబ్బ | లుబ్బి క్రేవకుఁ బైట నొత్తగింప
విరులు జల్లున రాల వేనలి యిట్టట్టు | చలియించి మెఱుఁగుచెక్కులకు డిగ్గ  
గీ. నందియలు మ్రోయ వేఁడుక లలరఁజేయ | బడలికలు పాయ చెలులు పావడలు వేయ
కడఁగి నీతోడఁ జెండ్లాడు గదర రాధ | బళిర కఱివేల్ప! పసిఁడిదువ్వలువదాల్ప! 38

సీ. చెక్కుఁ జెక్కునఁ జేర్చి చెయి ప్రక్క మఱలించి | గుబ్బలు ఱొమ్మున గూరిచి తొడ-
పైనిఁ జేర్చి యలసి పవళించునెడ నీవు | చిటిపొటిసేతలఁ జెలఁగుచున్న
నించుక సిగ్గు నొకించుక జగ్గించు- | క సొలపు నొక్కించుక జలు పించు-
క యులుకు నొక్కించుక కులు కించుక యుసీ- | త్కృతి యొకించుక హుంకృతి చెలంగ  
గీ. నలరుఁ జెక్కుల లేనగ వంకురింప | నెట్టకేలకు కనుఱెప్పలెత్తి చూచు
రాధ వగఁ గన్న మది నిల్పరాదురన్న | బళిర కఱివేల్ప! పసిఁడిదువ్వలువదాల్ప! 39

సీ. ఒక మూఁపుపై రుమా లొకమూఁపుపై సరా- | లరజార నలరారు హవుసుమీఱఁ
గేల్తలాడఁగ నొత్తిగిలి తొడల్చేర్పుల | జిలిబిలిపలుకులు గులుక చేయి
మార్పులఁ బొదవి కోల్‍మడుపు నొక్కునెడ కె- | మ్మోవులఁ దగులు పల్‍మొన చుఱుకుల
కులుకుచు సీత్కృతు ల్వెలయించుచును గిలా- | ర్చుచుఁ గికాకిక నగుచు నొకరినొక-  
గీ. రూరడింపుచుఁ గదియుచు నోసరిలుచు | నొద్దికలు మీఱి, బకదారియుద్దిఁ గేరి,
యలరినావయ్య రాధతో నలరుశయ్య | బళిర కఱివేల్ప! పసిఁడిదువ్వలువదాల్ప! 40

సీ. ఆ రాధ వెతల చల్లార్పుల, వేడ్కనో | లార్పుల, రెప్పలల్లార్పుల, నగ-
వు కిలార్పుల, జెమటార్పుల, నెద సేదదే- | ర్పులఁ, గలయికల నేర్పుల, తొడదొడఁ
దార్పుల, మెయిమెయిఁ జేర్పుల, మోవిమా- | ర్పుల, మోడి తీర్పులఁ, బులుపులు గొలు-
పు తలఁపు, వలపువిల్బూనువాని కలన | సంధింపఁగాఁ జేసె నకట! నీకు  
గీ. వేగిరంబెంత? వెఱఁగెంత వేసటెంత? | వెల్లఁబాటెంత? వెగటెంత, వేఁగుటెంత?
యువిద నొకయింత యెడబాసి యున్నయంత | బళిర కఱివేల్ప! పసిఁడిదువ్వలువదాల్ప! 41

సీ. తఱిఁజూచి జుంటివాతెఱఁ జుఱుక్కునఁ బంటి- | మొనఁ బట్టి గంటుసేయనె తలంచు,
నబ్బినప్పుడె చేత నల్లనఁ జెక్కుపైఁ | గొట్టి కోర్కిని ముద్దుఁగొనఁగఁ దలఁచు,
దక్కినంతనె తాఁ జివుక్కునఁ బైకొని, | కఱఁగి హా యని సొక్కఁగను దలంచు,
ననువనైనయెడ ఖచిక్కున చన్మొనల ఱొమ్ము | గ్రుమ్మి, కౌఁగిటఁ జేర్చుకొనఁగఁ దలఁచు  
గీ. గదర, నినుఁ జూచి యా రాధ కంతుబాధఁ | బలుకు వినువేళ సాము చొప్పడెడువేళ
మంతనమువేళ ప్రక్క మార్మలయువేళ | బళిర కఱివేల్ప! పసిఁడిదువ్వలువదాల్ప! 42

సీ. తమకించి యధరామృతంబుఁ గ్రోలఁ గడంగ | నెమ్మొగం బటుసేయు నెపముఁబూని
యధరంబునకు నడ్డమగు నత్తుముత్తెంబు | నోరఁ గావించెడు హొయలు దలఁచి
దుడుకుఁగా గుబ్బచన్నొడయఁగాఁ గమకింప | నోసరిల్లెడులీల నొక్కకేల
రవిక ముడి సడల్చు రహిఁ దలంచి నిగుడి | చెక్కిలి ముద్దాడ సిగ్గుఁ గదిరి  
గీ. వదన మరవంచుకొను రీతి వదలి చెక్కు | లలముకొను కొప్పు సవరించు చెలువుఁ దలఁచి
మఱతువే యిందుముఖి పొందు మనమునందు | బళిర కఱివేల్ప! పసిఁడిదువ్వలువదాల్ప! 43

సీ. ననుఁ జెందు జనులందు నెనరొందు ననుకొందు | వదియెల్ల కల్లసు మ్మరసిచూడ
నలనాఁడు మధురకీ వరిగెడుపైనంపు | గుసగుసల కదరు గుండెతో గ-
దురునూరుపులతోఁ జెదరు ముంగురులతో ను- | దురునఁ గ్రొంజెమటలతో నిలిచిన
మ్రొక్కి గ్రక్కున నొక ముద్దిచ్చి సెలవియ్య- | వే! యని వేఁడుచు నెదను జేర్ప  
గీ. నమ్ముకొని నీకుఁ జనుదోయినిమ్మపండ్లు | కాన్కగా నిచ్చి సెలవిచ్చి కడఁక ననుప
నరిగి కలనైనఁ దలపోయవైతి రాధ | బళిర కఱివేల్ప! పసిఁడిదువ్వలువదాల్ప! 44

సీ. అందెలు మొఱయంగ నతనుపట్టపుదంతి | పగిది రాఁ గని నీవు పవ్వళించి
యట్టురా నిట్టురా నటుమోమయినఁ జూచి | తలయూచి యశ్రులు దలకొనంగ
నిట్టూర్పు నిగిడించి కట్టల్క వలకేలి | సందిదండ చలింపఁ గుందనంపు
గాజులు రొదలీనఁ గ్రక్కునఁ బ్రక్కఁ గ్రొ- | మ్మెఱుఁగు సోగ జరాన నొఱ వెడలుట  
గీ. పోలఁ జన్మొన నానుకోఁబోవ నుఱుక | నొడిసి చేఁబట్టుకొని రాధ నూఱడించి
తరయ వెఱపింపఁబోయి తా వెఱచునట్లు | బళిర కఱివేల్ప! పసిఁడిదువ్వలువదాల్ప! 45

సీ. మాటికిఁ జెలియిచ్చు మడుపులఁ గైకుంద- | నంపుగాజుల నిగ్గు సొంపునింపఁ
జెలికత్తె కైదండఁ జెలఁగు దాఁపలి కేలి | రతనంపుటుంగరా ల్రంగులీన
హొయలౌ ననుచు నెచ్చెలి “యెలా బలే”యన | ముఱిపంపుటెలనవ్వు మొలకలెత్త
సఖులకు సెలవీయ జడబెడం గడరంగ | పెడమర్లు హొయలు పింపిళ్లుగూయ  
గీ. సరుల మెలిఁదీర్చి పయ్యెదఁ జక్కఁజేర్చి | సిరులఁ గడుహెచ్చు పడకిల్లు చేరవచ్చు
రాధ వగఁ గన్న మది నిల్పరాదురన్న | బళిర కఱివేల్ప! పసిఁడిదువ్వలువదాల్ప! 46

సీ. మూఁపున జారు క్రొమ్ముడిలోని చెక్కిలి | కళకు హొంబట్టు మేల్గట్టు గాఁగఁ,
బిఱుదఁ జేర్చిన కేల మిఱుమిట్లు కొనుగోళ్ల | తెలినిగ్గు సేసముత్తెములు గాఁగ,
పుటముబ్బి ఱవికెకకప్పుల గుబ్బతిలు గబ్బి- | గుబ్బచన్నులు పూర్ణకుంభములుగఁ,
గడలకై త్రిప్పు క్రేఁగంటిచూపుల బెళ్కు | వలపుఁ గప్రంపు నివాళి గాఁగ,  
గీ. వచ్చి నీరాకకై దరవాజతలుపు | క్రేవ ఠీవిని నిల్చి రాధావధూటి
యెదురెదురుఁ జూచు మదిఁ గోరి యెమ్మె మీఱి | బళిర కఱివేల్ప! పసిఁడిదువ్వలువదాల్ప! 47

సీ. కుచ్చులు దువుముడిగొని వ్రేలు మేల్జరీ- | త్రాళ్లఁ జెలంగు బుర్సామెఱుంగు-
కుచ్చుల తొడ బెడంగుఁ గడవ మొలఁ జెక్కి- | న పసిఁడివ్రాతపని పయిఁటచెఱఁ-
గించుక జీరాడ నింపొసఁగ కొనవం- | కలెసఁగు నసదు చెంగావిచెట్ల
పావడ జిగిచీరపై దువాళింప నం- | దెల రవరవ దౌదవుల చెవుల  
గీ. చవులు దవులఁ, గల్వలదొరచట్లమెట్ల | వెంబడిగ రాధ కేళిసౌధంబుఁ జేర
వచ్చు చెలు వచ్చుపడ నోర్వవశమె నీకు | బళిర కఱివేల్ప! పసిఁడిదువ్వలువదాల్ప! 48

సీ. మేఘంబుఁ గదిసి క్రొమ్మెఱుఁగు తళుక్కను | లీల నీలపుకిటికీల మ్రోల
నిలిచి నెచ్చెలులకు సెలవొసంగెడువేళ | నోరగా దిండుపై నొత్తిగిల్లి
చెలినోర్తు మదిఁ గూర్చి చెక్కిటఁ జే చేర్చి | చింతింపుచుఁ బరాకుసేయు నిన్ను
గని, మును తన్నంతటనె చూచిరావె నా | ప్రాణేశ్వరీ! యంచుఁ బారఁజాపు  
గీ. చెలువుఁ డిదియేమొ యంచు నెచ్చెలుల నొక్క- | కంట నిన్నొక్కకంటను గాంచు రాధ
చూపు మరుతూపులకుఁ బ్రాపుఁ జూపుఁ గదర | బళిర కఱివేల్ప! పసిఁడిదువ్వలువదాల్ప! 49

సీ. చెదరు కస్తురిబొట్టు కుదురు కొల్పెడునట్లు | మొగమెత్తి మోమున మోముఁ జేర్చి,
కెలన నున్నంత దిక్కులు పరికించి చె- | క్కుచెమటఁ గొనగోటఁ గొని విదిర్చి,
యెటకేని చనుచు నొక్కించుక వెడమళ్లి | సోకిసోకమిఁ బైటఁ దాకఁజేసి,
యలుకఁ బల్కమిఁ బల్మొనల పెదవి మడచి | కీల్జడఁ బూని హుంకృతి నదల్చి,  
గీ. యిచ్చనిచ్చలు నీరీతి పెచ్చుపెఱుఁగు | దుడుకుసేతల రాధావధూటి నీకు
నించువిలుకాని యెలగోలు సంచుఁ దెలిపె | బళిర కఱివేల్ప! పసిఁడిదువ్వలువదాల్ప! 50

సీ. ఎదురైనచో దారి కిట్టట్టు దొలఁగక | ఉదుటు చన్మొన లెద నదిమి గదిమి,
చేర రమ్మని కాసెచెర గుగ్గుఁ దీర్చు కై- | వడి వాఁడికొనగోరు తొడఁ దనర్చి,
మునిపంట మడుపందుకొనుమంచుఁ గదిసి వా | తెర సోకఁ బల్మొన చుఱుకులుంచి,
దరినున్న తరిని మైవిఱుపు వీలుగఁ గేలు- | గవ మూఁపునకుఁ జేర్చి కౌగిలించి,  
గీ. యిచ్చనిచ్చలు నీరీతి పెచ్చుపెఱుఁగు | దుడుకుసేతల రాధావధూటి నీకు
నించువిలుకాని యెలగోలు సంచుఁ దెలిపె | బళిర కఱివేల్ప! పసిఁడిదువ్వలువదాల్ప! 51

సీ. ఒకవేళ దోర్మూల చకచక ల్విలసిల్ల | విరులవీవనఁ బూని విసరి విసరి,
యొకవేళ సందిటి పికిలిచెం డ్లల్లాడ | నలరునూనియఁ దల నంటి యంటి,
యొకవేళఁ గొనగోళ్ల చికిలిడా ల్తిలకింప | దులకింపఁ బెన్నెరుల్ దువ్వి దువ్వి,
యొకవేళఁ గరతలద్యుతులు పేరెమువాఱ | నిచ్చగా మడుపు లందిచ్చి యిచ్చి,  
గీ. నిచ్చనిచ్చలు నీరీతి నీకుఁ దనదు | చెలువు దీపింప నుడిగంబు సేయుఁ గదర!
తోరమగు ప్రేమ రాధావధూలలామ | బళిర కఱివేల్ప! పసిఁడిదువ్వలువదాల్ప! 52

సీ. మొకరి తుమ్మెద మూఁతి ముట్టని క్రొవ్విరి | కోయిల వాచవిఁ గొనని చివురు
చిలుకముక్కున నొక్కు చెందని బింబంబు | మెఱసిపోవక నిల్చు మెఱుఁగుఁదీవ
కసటువోఁ బన్నీటఁ గడిగిన జవ్వాది | చొక్కమౌ గోవకస్తురి బిడారు,
కలికిరాయంచ క్రేగంటఁ జూడని తూఁడు | పైపొర విడని కప్రంపుటనఁటి,  
గీ. చిత్తజు మిటారి గేదఁగిచిక్కటారి | కమ్మవిలుకానిజుల్మతీ కత్తలాని
కాయజోపనిషద్గాథ కదర రాధ | బళిర కఱివేల్ప! పసిఁడిదువ్వలువదాల్ప! 53

సీ. నెఱిలేక యొకవేళ నీటుగా నిలుచున్న | మడుఁగుగడంగు నున్దొడ బెడంగు
సొమ్ములే కొకవేళ నెమ్మెమై నిలుచున్న | మిసిమిఁ జెలంగు నెమ్మెయి వెలుంగు
ఱవికలే కొకవేళ హవుసుగా నిలుచున్న | పయ్యెదఁ బొంగు గుబ్బల మెఱుంగు
ముడికొల్ప కొకవేళఁ దడియార్ప నిలుచున్న | పిఱుఁద నెసంగు పెన్నెఱుల రంగు  
గీ. తన తళతళలఁ దన ధగధగలఁ దన ని- | గనిగలఁ దన చకచకలఁ గదిసి యిట్లు
వెత గొలిపె రాధ యవయవద్యుతుల నిన్ను | బళిర కఱివేల్ప! పసిఁడిదువ్వలువదాల్ప! 54

సీ. వలసినయెడల నవాతు వాతెర మోపి, | వదలు కౌగిళ్లను బొదలి పొదలి,
నునుమోవి సోకిసోకని పల్చుఱుకు నించి, | యసివోవఁ గొనగోట నంటి యంటి,
తొడలు పైఁ గదియించి తోడుపా టొనరించి, | సేదదీఱుట కెదఁ జేర్చి చేర్చి,
యలసినవేళ మీఁదై చుల్కగాఁ గూడి, | చిటిపొటి గిలిగింత చేసి చేసి,  
గీ. యిచ్చనిచ్చలు నీరీతిఁ బెచ్చుపెఱుఁగు | మచ్చికలు చేసి పచ్చహుమావజీరు
కలన నినుఁ దీటుకొలిపెను గదర రాధ | బళిర కఱివేల్ప! పసిఁడిదువ్వలువదాల్ప! 55

సీ. కులుకు సిబ్బెపు గబ్బిగుబ్బ లుబ్బడగ మైఁ | జేర్చి కూకీరవాల్ సెప్పి సెప్పి,
కుందనపుం జాయ గొనబూను తొడ లవి | నొవ్వఁ గేలను బట్టి నులిమి నులిమి,
కొదకెడు తఱిఁ గాంచి పెదవిచక్కెరముక్క | మచ్చికలొప్ప నందిచ్చి యిచ్చి,
గడియసేపుకుఁ గాఁచి కదియరాఁ దలయూఁచి | చూపు జంకెనవాడిఁ జూపి చూపి,  
గీ. యెసఁగు జడవేట్లఁ జదువున కియ్యకొలిపి, | శిక్ష గావించె మరువిద్యఁ జిన్ననాఁడు
దేవరకుఁ గూర్మితోడ రాధావధూటి | బళిర కఱివేల్ప! పసిఁడిదువ్వలువదాల్ప! 56

సీ. కలికి నెమ్మెయి సాముకంబంబుఁ బెనఁగించి, | మోవిమార్పుల వెన్క మొగ్గు నిల్పి,
కలయికఁ దారుమారుల డింకిఁ దొలఁగించి, | మిసిమి నున్దొడలఁ గొక్కెస ఘటించి,
కొనగోటఁ జిక్కటా ర్మొనవైరిఁ గావించి, | పొలయల్క మార్మోము తొలఁగఁ దెలిపి,
రాణించు కీల్జడ రాణావిసరుఁ జూపి, | చక్కిలిగింత హెచ్చరికఁ దెలిపి,  
గీ. యెదను గుబ్బలకుంకుమ యెఱ్ఱమట్టి | నిలిపి తన చెల్వుగరిడిలో నీకు మరుని-
సాము గఱపిన బిరుదువస్తాదు రాధ | బళిర కఱివేల్ప! పసిఁడిదువ్వలువదాల్ప! 57

సీ. ప్రక్కమో మటుచేసి పవళింపఁ దొడనాని, | యిటుమొగం బగుమని యెచ్చరించి,
తనమొగంబుగఁ జేసికొని గ్రుచ్చి కౌగిటఁ | గదియించి పలుకెంపుఁ బెదవి నుంచి,
యుద్దిలో మీఁదగు గద్దరిపికిలి కై- | వడి డింకికొను పారువంబు కరణిఁ,
బైఁ దొర్లి పేరెదఁ బవళించి ఱొమ్ముల | పొగరడంగఁగఁ గసిపోక లేచి,  
గీ. కొప్పు సవరించి, చేర్చుక్క కుదుర నించి, | సరులు మఱలించి, మగలాగు సలుపు రాధ
హొయలుఁ దలపోసి నీ వెటులోర్తు వహహ | బళిర కఱివేల్ప! పసిఁడిదువ్వలువదాల్ప! 58

సీ. ననఁబోడి పొ త్తది తనరక భుజియింప | నొల్లవుగా యొంటి నోగిరంబు
పైదలి నునుదొడపైనఁ జేర్చినఁ గాని | రాదుగా కంటికి రాత్రి నిదుర
బాల యందెలరవ మాలకించినఁ గాని | యాపఁజాలవు గుండె యదురుపాటు
నలివేణి మునిపంట నందియిచ్చినఁ గాని | యందుకో లేవుగా యాకుమడుపు  
గీ. గాటమగు ప్రేమ మది నాఁడు నాటఁ బట్టి | నెట్టుకొని యల్ల రాధపైఁ బుట్టె నిట్టి
మమత, నేఁ జెల్ల! తన చెల్వు మచ్చుఁ జల్ల | బళిర కఱివేల్ప! పసిఁడిదువ్వలువదాల్ప! 59

సీ. నెఱులు చిక్కెడలించు నెపమునఁ జేయెత్తఁ | గక్షదీధితులు చీకాకుపఱుప,
పనిలేని పనిఁ బల్కు నీ పల్కుల పానకం | బొదవి కెంబెదవి నోరూరఁజేయఁ
గైతప్పి పడు బంతికై తగ్గు జగ్గునఁ | తరుల బిత్తరము తత్తరము నింప,
నొఱపుగా మైనిక్కు నూనఁ బిక్కటిలు ఱొ- | మ్ములవి చాల విరాళి మొనయఁజేయ  
గీ. గాటమగు ప్రేమ మది నాఁడు నాటఁ బట్టి | నెట్టుకొని యల్ల రాధపైఁ బుట్టె నిట్టి
మమత నేఁ జెల్ల! తన చెల్వు మచ్చుఁ జల్ల | బళిర కఱివేల్ప! పసిఁడిదువ్వలువదాల్ప! 60

సీ. శయ్యనొయ్యన నతిశ్రమ మీఱ నొకయోర | నోరగా గూర్చుండి యొరఁగి రాధ
యూర్పులు డాచేతి దార్పులు నీకబ్బ | గేల్దమ్మి చెక్కిటఁ గీలుకొలిపి
నుదుటి క్రొంజెమటబిందువులు పాపటఁ జేరు | ముత్యాల కొక క్రొత్తమురుపు హత్తఁ
జెక్కుటద్దములపైఁ జేర్చిన నీలంపుఁ | దళుకన జాఱుకొ ప్పలమికొనఁగ  
గీ. నర కవుఁగిలింత యినుమడి యావులింత | మైవిఱుపొకింత నిద్దురమబ్బు కొంత
కలగలుపు గాఁగఁ గడువింతఁ జెలఁగెనంత | బళిర కఱివేల్ప! పసిఁడిదువ్వలువదాల్ప! 61

సీ. కబరీభరము వీడి కడుహొయల్నెఱపుచు | డామూఁపుపై చొకాటంబు నింపఁ,
బొరిపొరిఁ బుచ్చు నూర్పులసారె చనుదోయి | నిక్కి పయ్యెదపైనఁ బిక్కటిల్ల,
సొంపున నరసొక్కు చూపులచే నిక్కు | బెళుకు కన్గ్రేవల బిత్తరింప,
నొఱఁగి నీ భుజపీఠి నూనిన చెమటఁ గ్రొం- | దళ్కెక్కు చెక్కుటద్దంబు గులుకఁ,  
గీ. గోరికలు పండ నొకదండఁ గూరుచుండ | రాధ మైదోపు జిగుల రారాపు మెచ్చు
కోపు నీ చూపు తరితీపుఁ గొలుపనోపు | బళిర కఱివేల్ప! పసిఁడిదువ్వలువదాల్ప! 62

సీ. అలిగి నీ వటుమొగంబౌచును సెజ్జపై | కే ల్తలాడఁగ నొత్తిగిలిన, వేఁడు-
కొను రీతి నుదుటుఱొమ్మున వెన్ను నదుమఁగాఁ | జయ్యన దాని కీల్జడను బట్టి,
కదియ రాఁ దివిచి సొంపొదవించుచును దానిఁ | దగఁగ నెన్నొవిధాలఁ దనివిపఱచి
యుగ్గడించుచు దాని యొప్పుల కెదసొక్క | గిలకిల నగుచును వెలయునట్లు  
గీ. నిచ్చనిచ్చలు నీరీతిఁ బెచ్చుపెఱుఁగు | మచ్చికలు చేసి పచ్చహుమావజీరు
కలన నినుఁ దీటుకొల్పెను గదర రాధ | బళిర కఱివేల్ప! పసిఁడిదువ్వలువదాల్ప! 63

సీ. తెరతెర తియ్య వాతెరకొఱుకు మఱిగి | పల్గొన లేవేళఁ బలువరింపఁ,
బలుమొన చుఱుకుసోకుల బారి గడిదీఱి | తియ్యవాతెర తరితీపు సేయఁ,
గ్రొవ్వాఁడి నునుగోటి కొనపోటు మచ్చిక | నుదుటుఱొమ్ముల నెదురెదురుఁ జూడ,
నుదుటుఱొమ్ముల నెదురొత్తు పొత్తున హత్తు | క్రొవ్వాఁడి నునుగోళ్లు కోరికొనఁగ,  
గీ. నిట్లవయవంబులు దమలో నెనయఁ గోర | రాధఁ గని నీవు, నినుఁ గని రాధ, తాల్మి
నిల్పుటలు లేదుగా యొక్క నిముసమైన | బళిర కఱివేల్ప! పసిఁడిదువ్వలువదాల్ప! 64

సీ. నొసటిపై నెసఁగు క్రొమ్మిసిమి లత్తుకజొత్తు | పువుఁబోఁడి జాడ దౌదవులఁ జెప్పఁ,
బ్రక్కసందిలిదండ పెక్కు లెక్కువలౌచు | బిత్తరికౌఁగిళ్ల బిగువు దెల్ప,
కుదురులై యెద హత్తుకొనిన కుంకుమముద్ర | లింతిగుబ్బల కుదు రేరుపఱుప,
నఱుత నురల్చిన యరుణంపు జిగికెంపు | వెలఁది పైకొనుట వెన్వెంటఁ జాట,  
గీ. తనరు నీ జగ్గు మును సిగ్గుఁ గొనుట యెగ్గు | మీఁద మిక్కిలి క్రీడించి మెలఁగితేని
సారె కా రాధగుట్టు మోసాలఁ బడును | బళిర కఱివేల్ప! పసిఁడిదువ్వలువదాల్ప! 65

సీ. పలునొక్కులకు నోసరిలు చెక్కునను జెక్కు | నధరంబుఁ గదియంగ నద్దుముద్దు,
దుడుకుసేతకు సారె సడికొట్టు కైవడిఁ | బెనుచు వాతెర, పయిఁ బెట్టు మట్టు,
నీటుగా వగఁబూను నెపమునఁ దివిరి దాఁ | జూచుచు ఠీవిని జూపుకోపు,
కులుకుగుబ్బల డాఁచికొను హొరంగున నీవి- | పైఁ బరాకొక్కింత బఱపునొఱపు,  
గీ. మాటిమాటికి గిలిగింత మమత వొడమ, | నులుకు వగలింపు నెదురింపు లొదవ రాధ,
యలుకకూటమి చవిఁ దేల్చెనయ్య నిన్ను | బళిర కఱివేల్ప! పసిఁడిదువ్వలువదాల్ప! 66

సీ. మరుఁడేచఁ దమిఱేచ మనమాఁగినను వీఁగి | వలపాగి చెలరేఁగి పైనివ్రాలి,
కళదేర నెలలూర నలరారు చెక్కిటఁ | గొనగోటి మొననాట గుఱుతులుంచి,
జిగిగుల్క వగచిల్క సెగలొల్కఁ గనుమ్రొగ్గ | నెదపైని యెదనాని యదిమి గదిమి,
శ్రమజాఱ వగదీఱ రహిమీఱ మెల్లన | మునిపంట చుఱుకంట మోవి యాని,  
గీ. యించువిలుతుని కేళి దనియించి తనిసి | రాధ మదిదీఱ దొంతర రతులఁ దేఱి
మఱలఁ దమకించి నినుఁ గాంచి ముఱుపుఁ జూపు | బళిర కఱివేల్ప! పసిఁడిదువ్వలువదాల్ప! 67

సీ. ఆణిముత్తెపునత్తు హవుసుగా సవరించి, | రతనాలబేసరి జతను పఱచి,
బసుమాబుటేదారు బలుఫేషు వాజుపై | చెంపఖల్లీ రుచుల్ చిందుఁ ద్రొక్క
సొగసైన బిందీలు తగు చేరుచుక్కతో | నుదుటిపై నాడుచుఁ బొదలుచుండ
సెసిపువ్వు రాఁకడి యసియాడ జడ చాల | పిఱుఁదుపై హొయలునఁ బెనఁగొనంగ  
గీ. నుదుటువక్షోరుహంబుల హొయలు నింప | యుపరతుల నిన్ను వింతగా నోర్చు తరుణి
యున్నతిని జూచి నీ వెటులోర్తు వహహ! | బళిర కఱివేల్ప! పసిఁడిదువ్వలువదాల్ప! 68

సీ. ఆణిముత్తెపుసరుల్ హవుసుగా సవరించి | రతనాలపోచీలు జతను జేసి
బసుమాబుటేదారు బలుఫేషు వాజుడా | లొలయంగఁ దొడలపైఁ కుబికి నిలిచి
“నిబ్బరంబుగఁ జూడు నేఁడిదే నా తమా- | షా” యని, చెలరేగి చాల నలసి
యఱచూపుతోఁ జూచి యనురక్తి లజ్జించి | ముసిముసినగవున మోము వంచి  
గీ. నన్నుఁ గైకొనుమంచుఁ దా సన్ను తించి | యొక్కచేఁ బట్టి బతిమాలి హొయలుమీఱ
జెలఁగి యొకచేత ఖుర్ణీషు చేసినట్టి
వగఁదలఁచుకొన్న నెట్లోర్తు మగలమిన్న | బళిర కఱివేల్ప! పసిఁడిదువ్వలువదాల్ప! 69

సీ. విరజాజివిరులతో నరజారు పెన్గురుల్ | పిఱుఁదుపై మాటికిఁ బెనగొనంగఁ,
దోరపుఁబల్కుతోఁ దొయ్యలి తమిచేత | మనసులోఁ గోర్కులు మసగొనంగఁ,
సొగసైన జాళునా తగు గుమ్మటీల్డాలు | నునుపుఁ జెక్కిళ్లతో నెనయుచుండ,
నాణిముత్యపుసరు లలరు మల్లెలసరుల్ | బిగువుగుబ్బలమీఁదఁ బెనఁగొనంగ,  
గీ. సరుల మెలిదీర్చి పయ్యెదఁ జక్కపఱచి | సిరులఁ గడుహెచ్చు పడకల్లుఁ జేరవచ్చు
రాధ వగఁ గన్న మది నిల్పరాదురన్న | బళిర కఱివేల్ప! పసిఁడిదువ్వలువదాల్ప! 70

సీ. అలవోక యువిదదౌ వలుకులు వినవచ్చు | తడవుగా వినఁ జెవిఁ బడఁగరాదు
నిలిచి చూచినబోఁటి నెమ్మేని జిగి దోఁచు | గనుఱెప్ప లల్లార్పఁ గానఁబడదు
కోరినఁ బ్రోయాలు గొనబు మేనది తోచు | దాసిచే నంటఁగఁ దగులువడదు
యాగుబ్బుగాఁ గొమ్మ యంగవాసన వచ్చు | నరసి మూర్కొన్నచో నటమటించు  
గీ. సేఁపు నను గ్రోల సకిమోవి తీఁపుసోఁకు | మరులుకొని చేరఁ బిలిచిన మాయమగును
మోహభారంబొ? విరహంపు ముమ్మరంబొ? | బళిర కఱివేల్ప! పసిఁడిదువ్వలువదాల్ప! 71

సీ. మగరాల బిందీలు సొగసుగా రాణించు | నల చేరుచుక్కతో నందగింప
తళుకుగుబ్బలమీఁద ధగధగమనియెడి | చంద్రహారంబులు చౌకళింప
బాజుబందుల ఠీవి పైఠాణిరవికతో | బిగిగబ్బిపాలిండ్లు పిక్కటిల్ల
కరపల్లవంబునఁ గళుకు లూఱఁగఁజాలు | రతనాలపోచీలు రవళి నింప  
గీ. పైఁట సరిగంచుపావడపై నటింప | చిలుక పలుకులతోడ నెచ్చెలిని గూడి-
యున్న సఖిఁ జూచి నీ వెట్టులోర్చితయ్య | బళిర కఱివేల్ప! పసిఁడిదువ్వలువదాల్ప! 72

సీ. జిలుగులాహిరిదారు బలుకినేరా జరీ | వజమీఱు బలుఫేషు వాజుఁ దొడిగి,
రాణించు వేణిపై రతనాలరాఁకడి | తళుకులు ముసుఁగునఁ గళుకులూర,
హురుమంజిముత్యముల్ హొయలుగాఁ గూర్చిన | చంద్రహారంబులు చౌకళింప,
జాతిడాల్గల బులాకీ తేఁటకెంపుల | మిన్నాకళాసిగీ వన్నె మీఱ,  
గీ. నతులితంబైన యవయచద్యుతుల నెన్ను | చెలియ సవరించి ఖుర్ణీషు చేసినట్టి
రాధ వగఁ గన్న మది నిల్పరాదురన్న | బళిర కఱివేల్ప! పసిఁడిదువ్వలువదాల్ప! 73

సీ. జాళువాబంగారుసరిగతో రాణించు | జిగికుసుంబావన్నె చీర కట్టి
పొందమ్ములందు కెంపులు చెక్కినట్లున్న | రంతుపాణీవన్నె రవికఁ దొడిగి
సంపఁగినూనెచే జారుగా మెఱుఁగాని | వేణిపై రాఁకడి వెలయఁగూర్చి
పసుపునిగ్గులమీఁద నెసఁగు పెన్మెఱుఁగుతో | నోఱచూపులు చెక్కు లొఱసిపాఱ  
గీ. బోటి హొయలుగ నాలవనాఁటి నీటు | మొనయ ముఱియుచు నినుఁ జూచి మోము వంచు
మేడలో నీవు నొకచెంత మెలఁగునంత | బళిర కఱివేల్ప! పసిఁడిదువ్వలువదాల్ప! 74

సీ. నిలువుముకురముల నికరములకళాసి | గీగోడమేడలోఁ గేళిశయ్య
నిదురింపఁగ తలాడ నిల్పి నిద్దంపుఁజె- | క్కిటను గోరునుప నుల్కిపడి లేచి
నెదురఁ గుదురుగం జెన్నొదవు నినుం గని | ముద మెదఁ బొదలఁగా మదవతియును
దగునట్లు కిలకిల నగి తిరిగి కిలకిం- | చితమున హాసముఁ జేయుచుఁ గది-  
గీ. సి తమిదొట్టిచే మెల్లనఁ జెక్కుగొట్టి, | పలుపెదవినుంచి నిక్కు నా కులుకులాడి
రాధఁ గనకున్న క్షణ మోర్వరాదురన్న | బళిర కఱివేల్ప! పసిఁడిదువ్వలువదాల్ప! 75

సీ. రతనాల చేర్చుక్క జతకూడి బిందీలు | పొదలు నెన్నుదుటిపై ముదము మీఱ
జెంపఖల్లీ లందగింపఁగాఁ గుచమధ్య- | హారముల్ ప్రక్కల నడరి మెఱయ
సందిటి మేల్బాజుబందుబంతులు క్రింద | నందంద యెగసి యుయ్యాలలూఁగ
రాఁకడి సెసిపువ్వురంగు పైని చెలంగ | జడబెడంగు పిఱుందఁ దడఁబడంగ  
గీ. నాణిముత్తెపునత్తు దా నలరుచుండఁ | గంకణంబులు గలహంస గతుల మ్రోఁగఁ
గలికి రతిసల్పు మొలనూలు గల్లురనఁగ | బళిర కఱివేల్ప! పసిఁడిదువ్వలువదాల్ప! 76

సీ. అంతటఁ జూచిరమ్మని బాఁజాచి క- | న్గవ మూఁపులకు నించి కౌగిలించు
బటువైన గబ్బిగుబ్బలజో డెదను నాట | బిగువుమై మైఁజేర్చు బ్రేమఁ గూర్చు
దక్కితివింక నాథా యని జడఁజుట్టి | కట్టివైతునటంచు గరిమ నించు
మునిపంటిమొన నాట మొనసి వాతెర తేట- | లెమ్మె మీఱఁగఁ గ్రోలి యెసకమెసఁగు  
గీ. నిచ్చనిచ్చలు నీరీతి పెచ్చుఁ బెరుఁగు | దుడుకుసేతల రాధావధూటి నీకు
నించువిలుకానియెలగోలు సంచుఁ దెలిపె | బళిర కఱివేల్ప! పసిఁడిదువ్వలువదాల్ప! 77

సీ. ఆ రాధ వాతెర యామతింపుల, నందె | మొఱయింపుల, హవణింపుల, నద నెఱి-
గింపుల, నర గనుపింపుల, మయి పుల | కింపుల, నలుక రెట్టింపుల, నగి-
యింపుల, నలుక వారింపుల, వదలని | యింపుల, నాదరింపులను గొలుపు
పొలుపు, వలపువిలుఁబూనువాని కలన | నందింపఁజేసెఁగా నహహ! నీకు  
గీ. వేగిరంబెంత? వెఱఁగెంత? వేసటెంత | వెల్లఁబాటెంత? వెగటెంత? వేఁగుటెంత?
యువిద యొక యింత యెడబాసి యున్నయంత | బళిర కఱివేల్ప! పసిఁడిదువ్వలువదాల్ప! 78

సీ. జిలుఁగుబుటేదారుచీరపై నపరంజి | గంటలు మొలనూలు గల్లురనఁగ,
రవికాంతి హవణించు రవికసందిలి బాజు- | బందుల మేల్‍కుచ్చు లందియాడఁ
బాపట చేర్చుక్క పచ్చలబిందీలు | పొదలుచు నుదుటిపైఁ గదలుచుండ,
రతనాలబేసరి జతను కెంపుబులాకు | నాణిముత్తెపునత్తు హవుసు మీఱ,
కొదమతుమ్మెదగుంపు నదలించు కీల్జడ | యరవిరిపాన్పుపైఁ బొరలుచుండ  
గీ. వలపులీడేరఁ గళలూర వగలు మీఱ | నడుము జవ్వాడ పిఱుఁదు లానందమొంద
సరసముగ రాధ నీచెంతఁ బరఁగునంత
సోయగంబెంత? సొలపెంత? సొక్కుటెంత? | సాహసంబెంత? సౌరెంత? సరసమెంత?
వెఱఁగుపడుటెంత? యొకచెంత వెఱపు కొంత | చిఱుచెమటలెంత? శ్రమయెంత? సిగ్గు కొంత
దాని వగలెన్న వాణీశుకైనఁ దరమె? | బళిర కఱివేల్ప! పసిఁడిదువ్వలువదాల్ప! 79

కఱివేల్పుశతకము సంపూర్ణము.

: శతకములు :

శ్రీ కాళహస్తీశ్వర శతకము | వేమన శతకము | సుమతీ శతకము | దాశరథీ శతకము | భాస్కర శతకము | భర్తృహరి శతకములు | నారాయణ శతకము | కృష్ణ శతకము | ఆంధ్ర నాయక శతకము | నరసింహ శతకము | రామలింగేశ శతకము | వృషాధిప శతకము | మారుతి శతకము | దేవకీనందన శతకము | గువ్వలచెన్న శతకము | కుమార శతకము | కుమారీ శతకము | వేంకటేశ శతకము | సూర్య శతకము | సర్వేశ్వర శతకము | శ్రీ (అలమేలుమంగా) వేంకటేశ్వర శతకము | ధూర్తమానవా శతకము | కుప్పుసామి శతకము | కామేశ్వరీ శతకము | మాతృ శతకము | కఱివేల్పు శతకము | మదనగోపాల శతకము | చక్కట్లదండ శతకము | సుందరీమణి శతకము | కాంతాలలామ శతకము | తాడిమళ్ళరాజగోపాల శతకము | భక్తమందార శతకము | కుక్కుటేశ్వర శతకము | భర్గ శతకము | లావణ్య శతకము | వేణుగోపాల శతకము | విశ్వనాథ శతకము | ఒంటిమిట్ట రఘువీరశతకము | మృత్యుంజయం | చెన్నమల్లు సీసములు | సంపఁగిమన్న శతకము | కుమార శతకము | శ్రీ అలమేలుమంగా శతకము | సూర్య శతకము | నీతి శతకము | శృంగార శతకము | వైరాగ్య శతకము | మంచి మాట వినర మానవుండ | సదానందయోగి శతకము | శివముకుంద శతకము | మృత్యుంజయ శతకము

buttons=(Accept !) days=(0)

Our website uses cookies. Learn More
Accept !
To Top