కర్మయోగము - Karma Yogamu

కర్మయోగము - Karma Yogamu

మూడవ అధ్యాయము

కర్మయోగము

శ్లోకము - 1

అర్జున ఉవాచ

జ్యాయసీ చేత్ కర్మణస్తే మతా బుద్ధిర్జనార్ధన  |
తత్కిం కర్మణి ఘోరే మాం నియోజయసి కేశవ ||

అర్జునః ఉవాచ - అర్జునుడు పలికాడు; జ్యాయసీ - మంచిది; చేత్ - ఒకవేళ; కర్మణః - కామ్యకర్మ కంటే; తే - చే; మతా - భావించబడితే; బుద్ధిః - బుద్ధి; జనార్దన - ఓ కృష్ణా; తత్ - కనుక; కిం - ఎందుకు; కర్మణి - కర్మలో; ఘోరే -ఘోరమైనట్టి; మాం - నన్ను; నియోజయసి - నియోగిస్తున్నావు; కేశవ - ఓ కేశవా.

అర్జునుడు పలికాడు : ఓ జనార్దనా! ఓ కేశవా! కామ్యకర్మ కంటే బుద్ధి మంచిదని నీవు తలిస్తే ఎందుకు నన్ను ఈ ఘోరమైన యుద్ధంలో నియోగించాలని కోరుతున్నావు ?

భాష్యము : దేవదేవుడైన శ్రీకృష్ణుడు తన సన్నిహిత మిత్రుడైన అర్జునుని దుఃఖసాగరము నుండి ఉద్ధరించే ఉద్దేశంతో ఆత్మ స్వభావాన్ని కడచిన అధ్యాయంలో అతివిపులంగా వివరించాడు. ఆత్మానుభూతి మార్గము, అంటే బుద్ధియోగము (కృష్ణ భక్తిభావన) అందులో మంచిదని చెప్పబడింది. ఒక్కొకప్పుడు కృష్ణభక్తి భావన అనేది జడత్వమని అపార్థము చేసికోబడుతుంది. అటువంటి అపార్థము కలవాడు కృష్ణనామజపం చేస్తూ పూర్తిగా కృష్ణభక్తి భావనలో ఉండడానికి ఏకాంత స్థలానికి వెళతాడు.
   కాని కృష్ణ భక్తి భావన తత్త్వంలో శిక్షణను పొందకుండ ఏకాంతస్థానంలో కృష్ణనామజపం చేయడం హితకరము కానేకాదు. అక్కడ అతనికి కేవలము అమాయక జనుల ద్వారా చవుకబారు ప్రశంస మాత్రమే లభిస్తుంది. అర్జునుడు కూడ కృష్ణభక్తి భావన (బుద్ధియోగము లేదా ఆధ్యాత్మికజ్ఞాన ప్రగతిలో బుద్ధి) అంటే క్రియాశీలక జీవితము నుండి విరమణను పొంది ఏకాంత ప్రదేశములో తపోవ్రతాలను చేయడమని అనుకున్నాడు. ఇంకొక చెప్పాలంటే కృష్ణభక్తి భావనను ఒక నెపంగా తీసికొని యుద్ధాన్ని అతడు తెలివిగా తప్పించుకోవాలనుకున్నాడు. కాని మంచి శిష్యునిగా అతడు గురువు ఎదుట విషయాన్ని ప్రస్తావించి తన ఉత్తమ కార్యాచరణ మార్గం గురించి ప్రశ్నించాడు. దానికి సమాధానంగా శ్రీకృష్ణ భగవానుడు ఈ మూడవ అధ్యాయంలో కర్మయోగాన్ని, అంటే కృష్ణభక్తి భావనలో కర్మను విస్తారంగా వివరించాడు.

శ్లోకము - 2
వ్యామిశ్రేణీవ వాక్యేన బుద్ధిం మోహాయసేవ మే |
తదేకం వద నిశ్చిత్య యేన శ్రేయోకహమాప్నుయాం ||

వ్యామిశ్రేణ - అనేకార్థాలు కలిగిన; ఇవ - నిక్కముగా; వాక్యేన - వాక్కులచే; బుద్ధిం - బుద్ధి; మోహయసి - మోహింపజేస్తున్నావు; ఇవ - వలె; మే - నా యొక్క; తత్ - కనుక; ఏకం - ఒకే ఒక్కటి; వద - చెప్పవలసినది; నిశ్చిత్య - నిశ్చయించి; యేన - దేనిచేతనైతే; శ్రేయః - నిజమైన లాభము; అహం - నేను; ఆప్నుయాం - పొందుతానో.

అనేకార్థాలు కలిగిన నీ బోధలచే నా బుద్ధి మోహము చెందింది. కనుక నాకు ఏది అత్యంత శ్రేయోదాయకమైనదో నిశ్చయముగా చెప్పవలసింది.

భాష్యము: భగవద్గీతకు పీఠికగా కడచిన అధ్యాయములో సాంఖ్యయోగము, బుద్ధియోగము, బుద్ధి ద్వారా ఇంద్రియనిగ్రహము, ఫలాపేక్షరహిత కర్మ, సాధకుని స్థితి పంటి చాలా భిన్నమైన మార్గాలు వివరించబడ్డాయి. అయితే ఇదంతా ఒక పద్ధతి ప్రకారం లేకుండ చెప్పబడింది. కాని ఆచరణకు, అవగాహనకు మరింత క్రమమైన వర్ణన విధానము ఎంతో అవసరమౌతుంది. అందుకే అర్జునుడు బాహ్యానికి అస్పష్టంగా గోచరిస్తున్న ఈ విషయాలను స్పష్టము చేసి సామాన్యుడైనా వాటిని ఎటువంటి స్వంత వ్యాఖ్యానము లేకుండ స్వీకరించేటట్లు చేయాలని అనుకున్నాడు. పదగారడితో 'అర్జునుని కలతపెట్టడం శ్రీకృష్ణుని ఉద్దేశం కాకపోయినా కృష్ణభక్తి భావన పద్ధతి అంటే జడత్వమో, క్రియాశీలక సేవయో అర్జునుడు అర్థం చేసికోలేకపోయాడు. ఇంకొక రకంగా చెప్పాలంటే తన ప్రశ్నల ద్వారా అతడు భగవద్గీత రహస్యాన్ని అర్థం చేసికోవాలని కోరుకునే శ్రద్ధావంతులైన శిష్యులకు కృష్ణ భక్తి భావనా మార్గాన్ని సుగమము చేస్తున్నాడు.

శ్లోకము - 3

శ్రీభగవానువాచ

లోకేఃస్మిన్ ద్వివిధా నిషా పురా ప్రోక్తా మయానఘ
జ్ఞానయోగేన సాంఖ్యానాం కర్మయోగేన యోగినాం ||

శ్రీభగవాన్ ఉవాచ - శ్రీభగవానుడు పలికాడు; లోకే - లోకములో; అస్మిన్ - ఈ; ద్వివిధా - రెండు రకాలైన; నిష్ణా - శ్రద్ధ; పురా - పూర్వము; ప్రోక్తా - చెప్పబడింది; మయా - నాచే; అనఘ - ఓ పాపరహితుడా; జ్ఞానయోగేన - జ్ఞానయోగ పద్ధతి ద్వారా; సాంఖ్యానాం - సాంఖ్య తత్త్వవేత్తల; కర్మయోగేన - భక్తియోగము ద్వారా; యోగినాం - భక్తుల.

శ్రీభగవానుడు పలికాడు : పాపరహితుడవైన అర్జునా! ఆత్మానుభూతి కొరకు యత్నించే మానవులు రెండు రకాలుగా ఉన్నారని నేను ఇదివరకే వివరించాను. ఒకరు దానిని జ్ఞానముతో కూడిన తాత్త్వికకల్పన ద్వారాను, మరొకరు భక్తియోగము ద్వారాను అర్థం చేసికోగోరుతారు.

భాష్యము : రెండవ అధ్యాయంలోని 39వ శ్లోకంలో భగవంతుడు రెండు రకాల పద్ధతులను అంటే సాంఖ్యయోగాన్ని, కర్మయోగాన్ని (బుద్ధియోగము) వివరించాడు. 
   ఈ శ్లోకంలో భగవానుడు అదే విషయాన్ని మరింత స్పష్టంగా వివరిస్తాడు. ఆత్మ, భౌతికపదార్థము అనేవాటి స్వభావాన్ని విశ్లేషణాత్మకంగా అధ్యయనం చేయడమనే సాంఖ్యయోగము ప్రయోగాత్మక జ్ఞానం, తత్త్వం అనే వాటి ద్వారా విషయాలను ఆలోచించి అర్థం చేసికోవాలనుకునేవారికి సంబంధించినట్టిది. ఇక రెండవ రకము జనులు రెండవ అధ్యాయంలోని 61వ శ్లోకంలో వివరించబడినట్లుగా కృష్ణ భక్తి భావనలో పని చేస్తారు. బుద్ధియోగ (కృష్ణ భక్తి భావన) నియమాల ననుసరించి పనిచేయడం ద్వారా మనిషి కర్మబంధము నుండి విడివడతాడని, అంతే కాకుండ ఆ పద్ధతిలో ఎటువంటి దోషము లేదని 39వశ్లోకంలో కూడ భగవంతుడు వివరించాడు. అదే సిద్ధాంతము 61వ శ్లోకంలో మరింత స్పష్టంగా, అంటే భగవంతుని పైననే (మరింత ప్రత్యేకంగా శ్రీకృష్ణుని పైననే) పూర్తిగా ఆధారపడడమే బుద్ధియోగమని, ఆ పద్ధతిలో ఇంద్రియాలన్నీ అత్యంత సులభంగా అదుపులోకి రాగలవని వివరించబడింది. కనుక ధర్మము, తత్త్వము లాగా రెండు యోగవిధానాలు పరస్పర ఆశ్రితాలై ఉంటాయి. తత్త్వము లేనట్టి ధర్మము మనోభావన లేదా ఒక్కొకప్పుడు మూఢ విశ్వాసము అవుతుంది. కాగా ధర్మము లేనట్టి తత్త్వము మానసిక కల్పన అవుతుంది. పరతత్త్వాన్ని శ్రద్ధగా అన్వేషించే తత్త్వవేత్తలు కూడ చివరకు కృష్ణభక్తి భావనకే వస్తారు కనుక శ్రీకృష్ణుడే చరమ లక్ష్యము. ఈ విషయం కూడ భగవద్గీతలో చెప్పబడింది. భగవంతుని సంబంధములో ఆత్మ యొక్క నిజస్థితిని అర్థం చేసికోవడమే అసలైన పద్ధతి. తాత్త్విక కల్పనమనేది పరోక్ష పద్ధతి. దాని ద్వారా మనిషి క్రమంగా కృష్ణభక్తి భావనా స్థితికి చేరుకునే అవకాశం ఉన్నది. ఇంకొక పద్ధతి ప్రతీదానిని భక్తిభావనలో నేరుగా శ్రీకృష్ణునితో సంబంధము కలుగజేస్తుంది. ఈ రెండింటిలో కృష్ణ భక్తి భావన మార్గము మంచిది. ఎందుకంటే ఇది తాత్త్విక పద్ధతి ద్వారా ఇంద్రియాలను పవిత్రం చేసికోవడంపై ఆధారపడదు. కృష్ణభక్తి భావనే నిశ్చయంగా పవిత్రీకరణ పద్ధతి. భక్తియుతసేవ అనే ప్రత్యక్ష పద్ధతి ఏకకాలంలో సులభము, ఉదాత్తము కూడ అయి ఉంటుంది.

buttons=(Accept !) days=(0)

Our website uses cookies. Learn More
Accept !
To Top