" చంద్రమౌళీశ్వరి " ధ్యానం - "Chandramouleshwari" Dhaynam

0
" చంద్రమౌళీశ్వరి " ధ్యానం - "Chandramouleshwari" Dhaynam

సర్వమంగళప్రదాయిని, లోకమాత, "చంద్రమౌళీశ్వరి" చరణములు ధ్యానం చేస్తే ఆనందలహరులలో మనం మునిగి తెలుతాం.

దేవీపరమైన స్తోత్రగ్రంథాలలోమూకకవి చెప్పిన మూకపంచశతికి చాలా గౌరవ మున్నది. మూగవాడొకడు పరమేశ్వరీ కరుణాకటాక్షంచేత మహాకవి అయినాడు. ఆయన వ్రాసినదే మూకపంచశతి. దీని ప్రతిశ్లోకంలోనూ జ్ఞానం చిప్పిలుతూ చదువరులను తన్మయులనుగా చేస్తుంది. ఆ గ్రంథంలో కాంచి కామకోటి అనే పదాలు దాదాపుగా ప్రతి శ్లోకంలోనూ కనపడతవి. 

ఐశ్వర్య మిందుమౌళే 
రైకాత్మ ప్రకృతి కాంచిమధ్యగతమ్‌ 
ఐందవ కిశోర శేఖర 
మైదంవర్యం చకాస్తి నిగమానామ్‌ 

పైశ్లోకం మూకపంచశతిలోనిది. దీంట్లో చంద్రమౌళికి ఐశ్వర్యం ఏమిటయ్యా అని అంటే అంబికియే అని కవిచమత్కరిస్తాడు. ఈశ్వరుని ఈశ్వరతత్త్వం ఆమె. చంద్రమౌళీశ్వరి అనుగ్రహం ఉంటేనే కాని వ్యాపకుడైన పరమేశ్వరుని తత్త్వం అవగతం కాదు. ఆమె ప్రకృతి. ఆమె కాంచీక్షేత్రం నడుమ ఉండి లేజాబిల్లిని తలలో తాల్చి నిగమ తాత్పర్యమో అనేటట్లుగా అద్వైతామృతం వర్షిస్తూ వెలసివున్నది. 

శ్రీమచ్ఛంకర భగవత్‌ పాదుల సౌందర్యలహరిలోని యీశ్లోకం చూద్దాం. 

అహ స్సూతే నవ్యం తవ నయన మర్కాత్మకతయా 
త్రియామాం వామం తే సృజతి రజనీనాయక తయా, 
తృతీయా తే దృష్టి ర్దరదళితహేమాంబుజరుచిః 
సమాధత్తే సంధ్యాం దివస నిశయో రంతరచరీమ్‌. 

ఈ శ్లోకంలో అంబిక మూడుకన్నులు కలదిగా త్రినయనిగా వర్ణింపబడినది. సూర్యచంద్రాగ్నిలోచని ఆమె. ఆమె ఎడమకన్ను సూర్యుడై పగటిని, కుడికన్ను చంద్రుడై రాత్రినీ రెంటికినీ నడుమనున్న లలాటనేత్రం రేయింబవళ్ళకు నడుమదైన సంధ్యనూ సృజిస్తూ అరవిచ్చిన బంగారు తామరపువ్వు వలె వెలుగుచున్నదని ఆచార్యుల వారనిరి. 

తృయా హృత్వా వామం నవు రపరితృప్తేన మనసా 
శరీరార్థం శంభో రపరమపి శంకే హృత మభూత్‌ 
యదేత త్త్వద్రూపం సకల మరుణాభం త్రినయనం 
కుచాభ్యా మానమ్రం కుటిల శశి చూడాల మకుటమ్‌.

నీవు ఈశ్వరుని వామభాగంమాత్రం అపహరిస్తేచాలునని మొదట అనుకొన్నట్లు ఉన్నావు. కానిదానితో నీమనస్సు తృప్తిపడలేదు. తక్కిన సాబాలు కూడా నీవే ఆశ్రమించు కొందామనుకొన్నావు. మూడు కనులతో ముక్కంటివై ఎఱ్ఱనికాంతులను వెడలగ్రక్కుచున్నావు. నీమూడో కన్ను చూచి, నెలవంకతోడి నీకిరీటంచూచి ఈశ్వరుడవని అనుకొన్నాను. తీరాచూస్తే శివస్వరూప అవశేషంగా వున్నావు. 

ఒక శుక్రవార ప్రదోషసమయంలో ఏకశరీరులైన అర్థనారీశ్వరులను ప్రత్యేకించి ప్రార్థించడం సమంజసంగా లేదు. అని ఎవరో అన్నప్పుడు ఈ శ్లోకం గుర్తుకొచ్చింది. 

త్రిమూర్తులు సత్త్వరజస్తమోగుణోపేతులు. మరో శ్లోకంలో ఆచార్యులవారు త్రిమూర్తులకూ ప్రత్యేకంగా పూజ చేయనక్కరలేదని అంటారు. అంబ అడుగుదమ్ములకు చేయు పూజ వారి పూజే. ఆమె అడుగులు మోసే మణపీఠం క్రింద, ఒగ్గిన దోసిలులే కిరీటములుకాగా ఆమె ఆజ్ఞకై వేచి ఉంటారు. కాబట్టి ఆమె పాదాలమీద సమర్పించిన పూజాద్రవ్యాలే వారి తలలమీదగూడా పడతవి. ఆమె కిచ్చు ఆరతి వారికిన్నీ ముట్టుతుంది. దైవమును తల్లిగా థ్యానించడమే అంబికాథ్యానం. అర్జునుడు శ్రీకృష్ణుని స్నేహితునిగా తలచాడు. యశోదకు కృష్ణుడు బిడ్డడే అయినాడుగదా. రుక్మిణీ సత్యభామలు ఆయను భర్తగా భావించారు. అందుచేత మనం అంబికను అమ్మగా భావనచేసి థ్యానిస్తే ఆమెయూ, మాతృ ప్రేమతో మనలను ఒడిలోకి తీసుకుంటుంది. ఏ రూపంతో మనం ధ్యానించినా ఆ రూపంతో వచ్చి అనుగ్రహంచేశక్తి పరమాత్మకుఉన్నది. పరబ్రహ్మస్వరూపిణి అయిన అంబిక అమ్మయై మనలను ఆదరిస్తుందనడంలో సందేహంలేదు. 

కాళీకటాక్షంచేత ఒకడు కాళిదాసయినాడు మూకకవి కామాక్షీదేవి ఉచ్ఛిష్టం తినగా ఆ ఉచ్ఛిష్టమే అమృతలహరియై అతని వాక్కులలో ప్రవహించి మూకపంచశతిరూపం తాల్చింది. భగవత్‌ పాదులమాట వేరుగా తలవనక్కరలేదు. ఈ మువ్వురయూ వాజ్మయం చదువుకోడానికి మనం సంస్కృతం తప్పక నేర్చుకోవాలి. 

అంబిక వాగ్రూప. ఆమె ఆకారాది క్షకారంత వర్ణస్వరూప. ముక్తావళి అనే తర్కగ్రంథంలో వీచీతరంగ న్యాయమనిన్నీ. కదంబముకుళ న్యాయమనిన్నీ రెండు న్యాయాలు (ఉపమానాలు) శబ్దాన్ని గూర్చి చెప్పబడ్డవి. గాలికి ఒక అలలేస్తుంది. దాని తాకువల్ల ఇంకో అల పుటుతుంది. దాని కింకొకటి ఇట్లా ఒడ్డువరకూ ఒక అల తరువాత వరుసగా ఇంకొక అల పుటుతూ వుంటుంది. దీనినే ‘నీచీతరంగన్యాయం’ అని అంటారు. శబ్దం పుట్టి ఒక స్పందం తరువాత మరొక స్పందంగా వచ్చి చెవికి తగులుతవి. కడిమి మొగ్గలన్నీ ఒకే ఒకసారి విచ్చుతవి. అది ‘కదంబముకుళ న్యాయం’ వెనుకటి న్యాయానికి ఇది విపరీతం. ఆకాశంలో స్పందాలెన్నో కడిమి మొగ్గలవలె ఒకే ఒకసారి పుటతై. ఈశబ్దమునే అక్షరాలనిన్నీ మాతృకలనిన్నీ అంటారు. మాతృకా స్వరూపిణియే అంబిక. శ్యామలాదండకంలో కాళిదాసు అంబికను – ‘సర్వవర్ణాత్మికే’ అని సంబోధిస్తారు. అంగన్యాస కరన్యాసాలు చేసేటప్పుడు ఆయామంత్రదేవతలకు సంబంధించిన అక్షరాలు చెప్పుతాము. అనగా ఆమంత్ర దేవత ఆయా అక్షరస్వరూపిణియై ఉన్నదని భావం. 

ఆ లోకమాతకు ‘పరాశక్తి’ అని పేరు. ఆమె కటాక్షం ఎట్టివానినైనా ఆకాశానికి ఎత్తేస్తుందని శాస్త్రాలు చెప్పుతున్నయ్‌. నాదబిందు కళాస్వరూపిణి వేదమాతా అయిన అంబికను భక్తిభరంగా అభేదంగా ధ్యానించాలి. 

సౌందర్యలహరిని గూర్చి ఈక్రింది జనశుతి ఉన్నది. ఆచార్యులవారు కైలాసం వెళ్ళి ఐదులింగాలు తెచ్చారు. వానిలో ఒకలింగమే చంద్రమౌళీశ్వరుడు. కైలాసంలో ఈశ్వర సన్నిధిని మంత్ర శాస్త్రం ఉన్నది. దానిని తీసుకువచ్చేటప్పడు నందికేశ్వరుడు ఆచార్యులవారిని అడ్డగించి లాగుకోటంలో కొంతభాగం మాత్రమే ఆచార్యులవారికి దక్కింది. దానిలో నలుబదిఒక్క శ్లోకాలు మాత్రం ఉన్నవి. యాభై తొమ్మిది శ్లోకాలను ఆచార్యులవారు స్వయంగా రచించి పూర్తి చేశారట. 

తైత్తిరీయం – ‘మాతృదేవోభవ, పితృదేవోభవ’ అని బోధించింది. ఒక్క జన్మలో ఏర్పడ్డ అమ్మనే దేవతగా చూడమని ఉపనిషత్తు ఉపదేశిస్తే ప్రతిజన్మలోనూ మనకు అమ్మగావుండే అంబికమాట వేరుగా చెప్పాలా. సొంత తల్లికి ఎంత సంతానమున్నా అయిదుగురు ఆరుగురుకంటె మించరు. పోనీండి, ఇంకా కొందరుంటారని అందాం. ఆ తల్లియో అందరికీ తల్లి. అందుచేత మనకు అన్నాదమ్ములు అక్కా చెల్లెండ్రు ఒక్క మానవలోకంలోనేకాక పశు పక్షి కీటకాది ప్రపంచంలోనూ ఉన్నారు. తల్లిని దైవముగా తలపుమని చెప్పడంచేత అట్లా తలచడానికి వీలవుతుందని తెలుసు కోవాలి.  అందుచే సౌందర్యలహరి అసమానమైన మంత్ర శాస్త్రంగా పరిగణింపబడుతున్నది. 

కైలాసంనుంచి మంత్రశాస్త్రం పూర్తిగా రాకపోవడం కూడా ఒక అదృష్టమే. లేకపోతే ఆచార్యులవారు పూర్తి చేసిన శేషభాగాన్ని చదివే భాగ్యము మనకు అబ్బేదికాదు. ఆచార్యులవారు వ్రాసిన శ్లోకాలు ఏవిధంగానూ తీసిపోవు. మొదటిభాగం మంత్రంశాస్త్రం, రెండవది ఆనందం కలిగించే స్తవం. అందలిదే మరొక శ్లోకం: 

విపఞ్చ్యా గాయంతీ వివిధ మపదానం పశుపతే 
స్త్వయా రబ్ధే వక్తుం చలిత శిరసా సాధువచనే, 
తదీయై ర్మాధుర్యై రసలపిత తన్త్రీకలరవం 
నిజాం వీణాం వాణీం నిచుళయతి చోళేన నిభృతమ్‌. 

అంబిక సన్నిధిలో సరస్వతి వీణవాయిస్తూంది. పాట పశుపతిని గూర్చి త్రినయనుని గూర్చిన వీణాలాపన అంబికకు మిక్కిలి ప్రియమైనది. సరస్వతి సర్వజ్ఞ కాబట్టి అంబికకు ఏది ప్రియమో దానినే పాడుతూంది. శ్రోతల ముఖభావాన్నిబట్టి గాయకులకైతేనేం వక్తలకైతేనేం ఉత్సాహమో నిరుత్సాహమో కలుగుతూవుంటుంది. అందుచేత శ్రోతలు రంథ్రాన్వేషణ చేస్తూ తమ అభిప్రాయం దాచిపెట్టుకోటం ఉచితంకాదు. ఔచిత్యం ఎరిగిన అంబిక ఆమోదసూచకంగా శిరఃకంపనంచేస్తూ బలే బలే అని అనడానికి ఉపక్రమిస్తూన్నది. ఆ గళమాధుర్యంలో వాణి వీణలోంచి బయలుదేరే మాధుర్యం లయమైపోయింది. సరస్వతి సిగ్గుపడి వీణకు గవిసెన తొడుగుతూందిట. 

కల మఞ్జుల వా గనుమిత 
గళ పఞ్జర గత శుకగ్రహౌత్కంఠ్యాత్‌, 
అంబ రదనాంబరం తే 
బింబ ఫలం శంబరారిణా న్యస్తమ్‌ (మూకపంచశతి)

ఈ శ్లోకంలో అంబిక గళం పంజరంగానూ గళరవం చిలుకగానూ చెప్పబడినది. అంబిక మోవి దొండపండని చెప్పబడినది. చిలుకలకు దొండపండ్లంటే ఆసక్తి మెండు. అంబికా గళరవమనే చిలుకను ఆకం్షించుటకు గళపంజరం ముందు మన్మథుడు దొండపండు ఉంచికూడా యేమి చెప్పుమా అనేటట్లుగా అంబిక అధరం ఉన్నదని కవి చమత్కరించాడు. 

చేటీ భప న్నిఖిల ఖేటీ కదంబ వనవాటీషు నాకి పటలీ 
కోటీర చారుతర కోటీ మణీకిరణ కోటీ కరంబిత పదా, 
పాటీర గంధ కుచ శాటీ కవిత్వ పరిపాటీ మగాధిప సుతా 
ఘోటీకులా దధిక ధాటీ ముదార ముఖ వీటీ రసేన తనుతామ్‌. 

దేవతా స్త్రీల కిరీటాల మణికాంతులు అంబికాచరణాలకు నివాళి ఇస్తున్నవి. ఆమె తాంబూలరసం గుఱ్ఱపునడిని మించిన వడితో అల్లే శక్తి నీయగలదని కాళిదాసు వ్రాస్తాడు. అట్టి సర్వమంగళప్రదాయిని, లోకమాత, చంద్రమౌళీశ్వరి చరణములు ధ్యానం చేస్తే ఆనందలహరులలో మనం తేలాడగలమని అంటే అది అసత్యమా?

- శ్రీ మాత్రే నమః - 

కామెంట్‌ను పోస్ట్ చేయండి

0 కామెంట్‌లు
* Please Don't Spam Here. All the Comments are Reviewed by Admin.
కామెంట్‌ను పోస్ట్ చేయండి (0)

buttons=(Accept !) days=(0)

Our website uses cookies. Learn More
Accept !
To Top