నూతన వ్యాసములు:
latest

728x90

header-ad

పండుగలు

పండుగలు
Showing posts with label యజ్ఞం. Show all posts
Showing posts with label యజ్ఞం. Show all posts

Thursday, September 3, 2020

యజ్ఞము - Yagnamu

యజ్ఞము - Yagnamuయజ్ఞము
శ్లో||  శ్రేయాన్ద్రవ్య మయాద్యజ్ఞాత్‌ | జ్ఞానయజ్ఞః పరంతప |
సర్వం కర్మాఖిలం పార్థ | జ్ఞానే పరిసమాప్యతే ||
తా|| నేయి, తిలలవంటి ద్రవ్యములతో చేసే యజ్ఞముకంటె జ్ఞాన యజ్ఞము శ్రేష్ఠమైనది. అది సకల కర్మలను దహించివేసి, జ్ఞానమును ప్రతిష్ఠించును.

యజ్ఞము:
పరమాత్మ అయిన నేను యజ్ఞ పురుషుడను, యజ్ఞ కర్తను, యజ్ఞ ఫలస్వరూపుడను, యజ్ఞ స్వరూపుడను అని త్రిపుటిని ఏకీకృతము చేయుట.
హోమము : వైదిక పద్ధతిగా అగ్ని కార్యములు, అగ్ని ఉపాసనలు చేయుట.

జ్ఞాన యజ్ఞము :
 • 1. ఆత్మను సర్వే సర్వత్రా అర్థము చేసుకొని ఆస్వాదించుట.
 • 2. ద్రష్టయే ఆత్మను దృశ్యరూప జగత్తుగా సంకల్పించుకొని వినోదించుచున్నాడని అనుకొనుట.
 • 3. ఈ ద్రష్ట దృశ్యములను అఖండాత్మ స్వరూపముగాను, అఖండాత్మ తత్త్వముగాను, అదియే శివతత్త్వమని గ్రహించే అభ్యాసము. ఈ మూడూ కలసినది జ్ఞాన యజ్ఞమనబడును.
ద్వాదశ యజ్ఞములు :
1. దైవ యజ్ఞము 2. బ్రహ్మ యజ్ఞము 3. ఇంద్రియ సంయమ యజ్ఞము 4. విషయ నిరోధ యజ్ఞము 5. మనో నిగ్రహ యజ్ఞము 6. ద్రవ్య యజ్ఞము 7. తపో యజ్ఞము 8. యోగ యజ్ఞము 9. స్వాధ్యాయ యజ్ఞము 10. ప్రాణాయామ యజ్ఞము 11. ఆహార నియమ యజ్ఞము 12. జ్ఞాన యజ్ఞము

పంచ యజ్ఞములు :
 • 1. బ్రహ్మ యజ్ఞము : అధ్యయనము, ప్రణవాది తారక మంత్రముల జపము, ఉపనిషత్‌ భాగవతాదుల పారాయణ మొదలగునవి.
 • 2. పితృ యజ్ఞము : పిండ ప్రదానము, అన్నదానము, మాతా పితలకు పూజ.
 • 3. దైవ యజ్ఞము : వైశ్వ దేవాది అగ్ని హోత్రము. అన్నాది నైవేద్యముల చేత దేవతలను ఆరాధించుట.
 • 4. భూత యజ్ఞము : గోవులు, కుక్కలు, పిల్లులు, పక్షులు, చీమలు, ఉడతలు మొదలగు వాటికి ఆహారమును ఇచ్చుట.
 • 5. నర యజ్ఞము : బ్రహ్మచారులు, వానప్రస్థులు, సన్న్యాసులు మొదలగు సాధు పురుషులకు అన్న వస్త్రాదులనిచ్చి పూజించుట. రోగులు, పేదలు, అనాధలు, వృద్ధులు మొదలగు నిస్సహాయులకు పాత్రోచితముగా సహాయము చేయుట.
 • 1. ద్రవ్య యజ్ఞము :  కొన్ని పదార్థములను ఉపయోగించి చేసే యజ్ఞము.
 • 2. తపో యజ్ఞము : తపస్సు ద్వారా, మనో నిగ్రహము ద్వారా, సర్వేంద్రియ భోగములపట్ల విరాగము ద్వారా, సర్వసంగ పరిత్యాగము ద్వారా సర్వభోగములను అంతరాత్మయందు వ్రేల్చి, ఏ భేదము లేనివాడై యుండుట. అతడే యజ్ఞ పురుషుడు, పరమాత్మ. జ్ఞానమే అగ్నిగా, ఇంద్రియములను సమిధలుగా, ఇంద్రియార్థములను ఆజ్యముగా, ప్రాణమును హవిస్సుగా చేయునదే తపో యజ్ఞము.
 • 3. ప్రాణ యజ్ఞము : ప్రాణమును అపానమందును, అపానమును ప్రాణమందును వ్రేల్చి హవిస్సుగా చేయునది.
 • 4. యోగ యజ్ఞము : ప్రాణాపానములను సమానము చేసి, ప్రాణాయామ స్వరూపమైన ప్రాణయజ్ఞము ద్వారా ఉచ్ఛ్వాస నిశ్వాసల రెంటిని పూర్తిగా సమము చేసి, ముక్తస్థితిని పొందుట.
 • 5. స్వాధ్యాయ యజ్ఞము : వాగ్రూపములో వేదమంత్రముల ద్వారా చేయబడే యజ్ఞము. పై దవడ, క్రింది దవడల మధ్య నాలుకతో వాగ్రూపముగా జరిగే కార్యమే స్వాధ్యాయ యజ్ఞం.
సంవత్సర యజ్ఞం :
సంవత్సర కాలములో సూర్యుడు చక్రాకారముగా నక్షత్ర మండలమును అనగా రాశి చక్రమును చుట్టి తిరిగే దానికి సంవత్సర యజ్ఞము అని పేరు. కాల చక్రమే కాల పురుషుడు. కాల పురుషుని దేహమే రాశి చక్రములో కదలుచున్నట్లు అనిపించే నక్షత్రములు.

12 మాసముల కాలము తిరిగి, మేషరాశిలోనికి ప్రవేశించే సరికి, అనగా ఒక సంవత్సర కాలగమనమును ఒక ఆవృతిగా లెక్కించినది సంవత్సర యజ్ఞము అందురు. బ్రహ్మాండములో జరిగే 12 రాశులలో ఆవృత్తి యగుట సంవత్సర యజ్ఞము పిండాండములో మూలాధారమునుండి ఆజ్ఞావరకు ఉచ్ఛ్వాసలోను, తిరిగి ఆజ్ఞనుండి మూలాధారము వరకు నిశ్వాసలోను మొత్తము 2X6=12 చక్రములలో ఆవృతమగుట మానవకుండలినీలో జరిగే సంవత్సర యజ్ఞము. బ్రాహ్మణ వర్ణము వారికి జ్ఞానయజ్ఞము, వైశ్య వర్ణము వారికి ద్రవ్య యజ్ఞము, క్షత్రియ వర్ణము వారికి పశుబలి యజ్ఞము నిర్దేశించబడినవి.

యజ్ఞమనగా :
1. దైవారాధన 2. ఐక్యత 3. దానము.
     యజ్ఞమనగా ఉపాదాన నిమిత్త కారణలు లేకనే జరిగే కార్యములు. ఈశ్వర కార్యములు యజ్ఞము. ఈశ్వరుడే యజ్ఞ పురుషుడు. సాధకులలో కర్తృత్వ భోక్తృత్వములు వదలి చేయబడే కర్మలు కర్మల క్రిందికి రావు. అది యజ్ఞమగును.

యజ్ఞము చేయుటకు ముఖ్యమైనవారు :
 • 1. హోత : యజ్ఞమునకు కర్త, యజ్ఞమునకు ఆహ్వానించువాడు.
 • 2. బ్రహ్మ : పండితుడై యుండి, 3 వేదములు తెలిసినవాడై యుండి, నిర్వహణ, పర్యవేక్షణలకు బాధ్యుడైనవాడు. దోషములను గుర్తించి, సరిదిద్దేవాడై యుండవలెను.
 • 3. ఉద్గాత : సామవేదమును వల్లెవేయుచూ మంత్రములను ఉచ్ఛరించేవాడు.
 • 4. అధ్వర్యుడు : నిర్ధిష్ట ప్రమాణముల మేరకు యజ్ఞ శాలను నిర్మించుట, కావలసిన సంబారములను సిద్ధము చేయుట, అనగా పాత్రలు, సమిధలు, వ్రేల్చవలసిన ఇతర ద్రవ్యములు, నీరు, యజ్ఞ పశువు మొదలగునవి. వీటికి బాధ్యుడు.
 • 5. సదస్యులు : యజ్ఞమును చూచుటకు వచ్చినవారు అని అర్థము. అయినను నిర్వహణ, పర్యవేక్షణలో సహాయమునందించుచు, గమనించుచు, దోషములు గుర్తించి, సవరింపజేయుట వారి విధి.
యజ్ఞ కాండకు సంబంధించిన సూత్రములు:
 • 1. హోత్రు గురించి అశ్వలాయన, సాంఖ్యాయన సూత్రములలో చెప్పబడినది.
 • 2. అధ్వర్యుని గురించి బౌద్ధాయన సూత్రములో చెప్పబడినది.
 • 3. ఔద్గాత్రు గురించి లాటాయన, వ్రీహ్యాయన సూత్రములలో చెప్పబడినది.
ఆహుతులు :
1. శ్రద్ధ 2. సోమరసము 3. వృష్టి రూపము అనగా వ్రీహి, యవాది స్థావర ఉపాధులలో చేరినది. 4. అన్నము అనే రూపము 5. రేతో రూపము.
జీవుడు శరీర పతనానంతరము:
 • 1. శ్రద్ధగా మారి 
 • 2. సోమ రసములో ఆహుతి యగును. ఆ సోమరసము మేఘమందు జేరి 
 • 3. వృష్టి రూపమై వ్రీహి యవాదుల స్థావర ఉపాధులందు జేరును. ప్రతి దశలోను పూర్వమైనది ఆహుతియై క్రొత్త రూపమును సంతరించుకొనును. ఉపాధులలో ఆహుతియైన వృష్టిరూపము. 
 • 4. అన్న రసమగును. శుక్ల శోణితములలో ఆహుతియై రేతస్సుగా మారును. రేతస్సు ఆహుతియై పిండరూపమగును. ఇదే ఆహుతుల క్రమము.
చాతుర్హోత్రము :
1. కరణము 2. కర్మ 3. కర్త 4. మోక్షము. ఈ నాలుగు హుతమైతే ఏది అన్ని కాలములలో ఉంటూ ఉన్నదో అదే బ్రహ్మ సాక్షాత్కారము.

కరణము అనగా పంచ జ్ఞానేంద్రియములు, మనస్సు, బుద్ధి అనే ఏడు కర్మ హేతువులు. కర్త అంటే కరణము ద్వారా గ్రహించుచు, ఆ విషయములను అనుభవించువాడు.
కర్మ అంటే ఏడు ఇంద్రియములను ఉపయోగించి విషయములను ఇష్టా యిష్టములుగా ఉంచుకొనుట. మోక్షము అనగా కరణము, కర్త, కర్మ వర్గములు గుణవంతములై, తమ గుణములను తామే మ్రింగివేయు చున్నవనియు, అయినను తాను వాటితో సంగత్వము చెందక నిర్గుణుడిని, అనంతుడిని అని భావించుట. ఇది పరోక్షము. అపరోక్షము కొఱకు మోక్షమును కూడా హుతము చేయవలెను.

యజ్ఞ సంబంధమైన పదములు :
 • యూప స్థంభము : బలి పశువును కట్టి ఉంచుటకు పాతిన స్థంభము.
 • చత్వాల దేశము : బలి పశువును బలిగా అర్పించు స్థలము.
శాలి వాహనుడి పని :
శాలి వాహనుడనగా కుమ్మరి. ఇతడు బలి పశువు యొక్క నవరంధ్రములను మూసి, అది ప్రాణము విడిచేదాకా ఉండి, తాంబూలము పుచ్చుకొని వెళ్ళుట.
అధ్వర్యుని పని : ఆ విధముగా చచ్చిన పశువు పొట్ట కోసి అందులో నున్న వపను బయటికి తీయుట.
వప : క్రొవ్వుతో కూడిన మాంసపు తిత్తి.

ఇడా పాత్ర :
పశువు యొక్క గుండె మొదలైన ఉత్తమ భాగములను తీసి ముక్కలుగా కోసి ఒక బానలో ఉంచెదరు. ఆ బానను ఇడాపాత్ర అందురు.

పురోడాశము :
బలి పశువు యొక్క ముఖ్య భాగములను ముక్కలు కోసి కొన్నిటిని అగ్నికి సమర్పించగా మిగిలిన భాగమును పురోడాశము అంటారు. యజ్ఞకర్త, భార్య, మరో ఆరుగురు విప్రులు ఈ పురోడాశమును మినప గింజ పరిమాణములో కొద్దిగా భక్షించెదరు.

సోమరసము :
సోమ తీగను దంచి, పెద్ద ముత్తైదువలు రసమును తీయుదురు. దీనిని సోమరసము అందురు. యజ్ఞ కర్త, భార్య ఈ సోమరసమును సేవించెదరు.

అవబృధ స్నానము :
యాగదీక్ష అన్ని విధములుగా సంపూర్ణమైన పిదప సోమయాజి దంపతులు చేసే స్నానమును అవబృధ స్నానము అందురు. దీనితో యజ్ఞము పరిసమాప్తియైనట్లు లెక్క.

కటిక సోమయాజి :
బలిమేకకు ఎన్ని వెంట్రుకలున్నవో అంతమందికి సకల కులముల వారికి అన్న సంతర్పణ చేయవలెను. కొంతమందికి మాత్రమే చేసి ఊరకుండే యజ్ఞకర్తను కటిక సోమయాజి అందురు.

అశ్వమేధ యాగము (అంతర్యాగము) :
అశ్వమనగా పరుగెత్తేది. కాలము, మనస్సు కూడా పరుగెత్తేవే. యాగాశ్వము భూమండలమంతా తిరిగి యజ్ఞ వాటికకు చేరును. గోళములు తిరుగుచుండును. దేశము, విశ్వము కూడా అశ్వమే. జీవుడు లోకాంతరములు, జన్మాంతరములు తిరుగుచుండును. జీవుడు కూడా అశ్వమే. ఇక కదలనిది ఆత్మ మాత్రమే. అది బ్రహ్మ మాత్రమే.

    కదిలే వాటిని భేదించవలెను, వధించవలెను. అప్పుడు కదలని ఆత్మయే స్థిరమై, సిద్ధమై యుండును. మేధ్యము అనగా పరిశుద్ధమైనది, పవిత్రమైనది. మేధ అనగా వధించుట, సంగమించుట అని కూడా అర్థమున్నది. దేశము, కాలము, విశ్వము, జీవుడు అన్నీ అశ్వమే అయినప్పుడు అశ్వమేధము అనగా వాటినన్నిటినీ పవిత్రపరచి, వధించవలెను అని అర్థము. కదలని బ్రహ్మతో సంగమించి, కదిలేవాటిని లయము చేయవలెను. లయము అనగా లేనివి లేకుండా పోవుటయే.

     అందువలన అశ్వమేధము అనగా జీవుడు ఆత్మతో సంగత్వము చెంది, తాను దేశకాలాదులతో సహా లేకుండా పోవలెను. ఇదే యజ్ఞమంటే. ఇక అశ్వమేధ యాగమనగా జీవుడు ఆత్మానుసంధానమై ముక్తి పొందుట.

     నూరు అశ్వమేధములు చేస్తే ఇంద్రపదవి రావటమనగా నూరేళ్ళు జీవించిన జీవితమును యజ్ఞమువలె సాధన చేయగా ఇంద్రుడు అందుకొన వలసిన పదవిని జీవుడు పొందును. అనగా ముక్తుడగును. అశ్వ రక్షకుడుగా వెళ్ళేవాడు జీవుడు. అశ్వమనగా మనస్సు. అశ్వమును వధించి హోమములో వేసి ఆహుతి చేయుట అనగా జీవోపాధి వాసనలను, ప్రపంచ వాసనలను పూర్ణాహుతి చేయుట. తుదకు చలించే జీవుడనే ఎరుక లయమైశాశ్వతమైన అచల పరిపూర్ణము శేషించినదేదో అది స్వతః సిద్ధమై యున్నది.

శ్లో||  యజ్ఞ దానతపః కర్మత్యాజం కార్యమేవ తత్‌ |
              యజ్ఞోదానంతపశ్చైవ పావనాని మనీషిణామ్‌ ||

శ్లో||  ఏతన్యాపితు కర్మాణి సంగం త్యక్త్వౌ ఫలానిచ |
       కర్తవ్యా నీతియే పార్థ నిశ్చితం ముతముత్తమమ్‌ ||

తా||  యజ్ఞ దానతపశ్చర్యాది కర్మలను త్యజించరాదు. వాటిని అనుష్ఠించిన బుద్ధిమంతులు పవిత్రులగుదురు. కాని వాటిని ప్రతిఫలాపేక్ష లేకుండా కర్తవ్య కర్మలుగా ఆచరించవలెను.

యజ్ఞవిధాయక | యజ్ఞ నియామక | యజ్ఞ ఫలాశ్రయ | యజ్ఞకరా |
యజ్ఞ ఫలావన | యజ్ఞ ఫలాశన |  యజ్ఞ ఫలప్రద | యజ్ఞదరా |
యజ్ఞవిధి ప్రియా | యజ్ఞ సమర్పిత | యజ్ఞ సుసాధన | యజ్ఞపతీ |
యజ్ఞ శరీరక | యజ్ఞ రహస్యక |  యజ్ఞ నారాయణ | యజ్ఞమయా |

___ శ్రీ సీతారామాంజనేయ సంవాదము

Saturday, February 29, 2020

యజ్ఞయాగాదులను గురించి అవగాహన - Yagnam, Yaagam Avagaahana

యజ్ఞయాగాదులను గురించి అవగాహన - Yagnam, Yaagam Avagaahana
యజ్ఞయాగాదులను గురించి ఎంతోమందికి సరైన అవగాహన లేదు. వీటిని గురించి యుక్తియుక్తంగా, సరియైన దృక్కోణం నుంచి వివరణ.

ఈ లోకంలో మనం సుఖంగా జీవించాలంటే మనలో పరస్పర సౌహార్థం, సహకారము ఉండాలి ఉపకారానికి తిరిగి ఉపకారం చేయటం మాత్రమే కాక మన సంఘం మొత్తాన్ని ఉన్నతమైనదానిగా రూపొందించడం కోసం మనం సంఘసేవ చేయాలి అనే ఒక విశిష్టమైన మనోభావం మనలో కలగాలి.

హిందూధర్మం ప్రకారం లోకమంటే కేవలం మనుష్యులు మాత్రమే కాదు. మనుష్యుల లాగానే పశుపక్ష్యాది ఇతర జీవకోట్లు అన్నీ అందులో ఉన్నాయి ప్రకృతియొక్క వివిధ శక్తులు కూడా ఉన్నాయి. ఈ శక్తులను నియమించి, నియంత్రించే అధిపతులుగా మనుష్యులకంటే ఉత్కృష్టమైన చైతన్యం కలిగిన జీవులు వేరే ఉన్నారు. వీరే దేవతలు. ఈ దేవతలు యజ్ఞయాగాది ధార్మికకర్మలతో తృప్తి చెంది, మనకు పాడిపంటలను ఆయురారోగ్యాలను, సకాల వర్షాలను అనుగ్రహించి మనను కాపాడుతారు.

ఇలా మానవులు దేవతలను దేవతలు మానవులను పరస్పరం సంతృప్తి పరచటం వలన లోకమంతా సంతుష్టిని పొందుతుంది. యజ్ఞయాగాదుల వెనుక ఉన్న నిజమైన తత్త్వం ఇదే. శాస్త్రోక్తంగా అగ్నిని వెలిగించి, దేవతలను ఆహ్వానించి, ఆ అగ్నిలో సరియైన మంత్రాల ద్వారా ఇష్టార్ధసిద్ధది కోసం ఆహుతులనివ్వటమే యజ్ఞం యొక్క విధానక్రమం.

శ్రీకృష్ణభగవానుడు గీతలో యజ్ఞాన్ని గురించి వివరించాడు. యజ్ఞం అనే పదానికి విపులంగా వివరించాడు. యజ్ఞం అనే పదానికి గీతాచార్యుడు చాలా విస్తృతమైన అర్థాన్ని ఇచ్చాడు. నిస్వార్ధమైన బుద్ధితో చేసే ఏ ఆరాధన నయినా, సేవ నయినా, దానాన్ని అయినా యజ్ఞంగా భావించవచ్చు. విద్యావంతులు విద్యను, తపోధనులు తపాన్ని దానమివ్వటం కూడా యజ్ఞమే.

మన జీవితంలో ఇలాంటి యజ్ఞాన్ని అవలంబించటానికి అందరికీ అపరిమితమైన అవకాశం ఉంది. కనుక ఇటువంటి యజ్ఞాలను అందరూ తమ తమ అర్హత మేరకు చేయవచ్చును చేయాలి కూడా.

రచన: దయాత్మనంద స్వామి

Wednesday, December 11, 2019

పంచ మహా యజ్ఞములు - Pancha Mahaa Yagnamulu

పంచ మహా యజ్ఞములు - Pancha Mahaa Yagnamulu


పంచ మహా యజ్ఞాలంటే ఏమిటి?
ఇవి ఋత్విక్కులు చేసే యజ్ఞాలు కాదండీ. శాస్త్ర ప్రకారం ప్రతి వ్యక్తీ అను నిత్యం పాటించ వలసిన విధులు.  అవి ఏమిటి?

1. దేవ యజ్ఞం 
పూర్వం నిత్యాగ్నిహోత్రులు వుండేవారు. వారు తాము భోజనం చేసే ముందు కొంచెం అన్నాన్ని అగ్నికి ఆహుతి చేసేవారు. దీనికి ఆహుతం అని పేరు. అలాకాక ఇంట్లో వారందరూ అగ్నికి సమిధలు సమర్పించినా ఆహుతం చేసినట్లే. సృష్టికి మూల కారకుడైన దేవదేవుని నిత్యం తలుచుకుని ఆయనకు కృతజ్ఞతలు తెలపటమే దీని ముఖ్యోద్దేశ్యం. 

2. పితృ యజ్ఞం 
మనల్ని కని పెంచి ఇంత వారిని చేసిన తల్లితండ్రలను ప్రేమగా చూడాలి. చిన్నప్పుడు వారు మనల్ని ఎంత ప్రేమగా చూశారో, మన అవసరాలెలా తీర్చారో, అలాగే వారి పెద్ద వయసులో వారిని కనిపెట్టుకుని వుండాలి. ఇలా వారి ఋణాన్ని కొంతయినా తీర్చుకోగలం. ఇది పితృ యజ్ఞం.

3. భూత యజ్ఞం 
గృహస్తు సర్వప్రాణికోటిమీద దయ కలిగి పుండాలి. పశు పక్షులు, క్రిమి కీటకాదులు మానవుడి మీద ఆధార పడి వున్నాయి. అందుకే మనిషికి భూత దయ వుండాలి. అన్నం తినే ముందు ఒక ముద్ద అన్నం పక్షుల కోసం బయట (పక్షులు వచ్చే ప్రదేశంలోపెట్టాలి. ఇంటి ముందు కుక్కకి, ఇంట్లో పిల్లికి అన్నం పెట్టాలి. ఇంట్లో పశువులు వుంటే వాటికి పెట్టాలి.  క్రిమి కీటకాల కోసం కొంచెం అన్నం (తినక ముందు) పక్కన పెట్టాలి.  (మన పెద్దలు వీటిని పాటించటం మీలో కొందరయినా చూసే వుంటారు). జలాశయాలలో జలచరాలకు కూడా ఆహారం వెయ్యాలి.  సర్వ ప్రాణులయందూ దయ కలిగి వుండి ప్రతి నిత్యం కనీసం ఏదో ఒక దానికన్నా ఆహారం ఇవ్వాలి.

4. మనుష్య యజ్ఞం
మన పెద్దలు అతిధి దేవో భవ అన్నారు. అప్పటివారు ఆతిధ్యం కోరి వచ్చినవారు తమకు తెలియనివారయినా వారిని ఆదరించి సత్కరించేవారు. రోజులు మారినాయి. అయినా ఇంటికొచ్చినవారిని మన కులం వారా, మన మతం వారా మన కేవిషయంలో నైనా పనికి వస్తారా లేదా వగైరాలాలోచించకుండా వారు వచ్చిన సమయాన్నిబట్టి తగు విధంగా గౌరవించాలి.  తోటి వారి పట్ల దయ కలిగి వుండాలి.  అందరితో సఖ్యంగా వుండాలి. ఎవరైనా సహాయం కోరితే, మనం చెయ్యగలిగితే నిస్వార్ధంగా చెయ్యాలి. 

5. బ్రహ్మ యజ్ఞం 
ప్రతి వారూ, ప్రతి రోజూ వేద మంత్రాలు కానీ శాస్త్రిలని కానీ చదవాలి. ఇప్పుడు వేద మంత్రాలు చదివే వారి సంఖ్య తక్కువగానీ ప్రతి వారూ ఎవరికి వీలయిన, ఎవరికి ఆసక్తి వున్న, ఎవరికి అనుకూలంగా వున్న శాస్త్రాలను చదవాలి. ప్రతి రోజూ కొత్త విషయాలను తెలుసుకునే ఆసక్తి చూపించాలి.  అంతేకాదు. తను తెలుసుకున్నది ఇతరులకు చెప్పాలి.  

ప్రతి మనిషికీ భగవంతుని పట్ల విశ్వాసం, తల్లిదండ్రుల పట్ల ప్రేమ, భూత దయ, తోటి మనిషులతో కలిసి వుండే మనస్తత్వం, శాస్త్రం తెలుసుకుని నలుగురితో పంచుకునే జిజ్ఞాస వున్నాయనుకోండి.  ఈ ప్రపంచం ఎలా వుంటుందో ఒక్కసారి ఊహించుకోండి.  మనిషిని సక్రమ మార్గంలో నడపటానికే ఈ పంచ యజ్ఞాలను నిర్దేసించారు మన పెద్దలు.

రచన - సేకరణ: గోగులపాటి కృష్ణమోహన్

Wednesday, August 9, 2017

హోమం - Homam

హోమం - Homam
హోమము : మనలోని మలినాన్ని ప్రకృతి సహజము గా తొలగించే విధానాలలో హోమము ఒక పద్దతి . హోమము - దైవప్రీతి, దైవానుగ్రహము, గ్రహశాంతి మొదలైన వాటికోసము అగ్ని లో మూలికలు, నెయ్యి హోమద్రవ్యాలు వేస్తూ చేసే క్రతువు. క్రతువంటే యజ్ఞము .

యజ్ఞం లేదా యాగం ఒక విశిష్టమైన హిందూ సంప్రదాయం. భారతదేశంలో పురాణకాలం నుండి వివిధ రకాలైన యజ్ఞాలు జరిగాయి. దేవతలకు తృప్తి కలిగించడము యజ్ఞం లక్ష్యం. సాధారణంగా యజ్ఞం అనేది అగ్ని (హోమం) వద్ద వేదమంత్రాల సహితంగా జరుగుతుంది. ఇందుకు అనుబంధంగా అనేక నియమాలు, సంప్రదాయాలు ఉన్నాయి. అగ్నిహోత్రం అనేది యజ్ఞంలో ముఖ్యమైన అంశం. యజ్ఞంలోని అగ్నిలో "వ్రేల్చినవి"(వేసినవి) అన్నీ దేవతలకు చేరుతాయని విశ్వాసం ఉంది.

పంచభూతాలలో అగ్ని ఒకటి . ఇది ప్రకృతి సహజముగా లభించే శక్తి అయినా కాలక్రమేనా అగ్నిని రాజేయడం మనిషి కనుక్కునాడు . సుదూరములో ఉండే అగ్ని గోళాన్ని ఆరంభమునుండీ గమనించిన మానవుడు ఈ భూలోకాన్నంతా నడిపిస్తున్న ప్రత్యక్ష దైవము గా సూర్యభగవానుని కొలిచే సాంప్రదాయాన్ని ఆనాడే ఆరంభించాడు . గోళమైనా సూర్యుని ... తెలియక , అంతపాటి శాస్త్రవిజ్ఞానము లేక దేవునిగా కొలిచేడు ... ఆరాదించాడు . సూర్యోదము , సూర్యాస్తమయము రెండూ ఎన్నిసార్లు చూసినా తనివితీరని అపురూప దృశ్యాలే ... ఆ మధురమైన దృశ్యాన్ని తిలకిస్తూ తమ జీవితాలకు ఆధారంగా నిలుస్తున్న ఆ భగవంతునికి ఉదయం , సాయంత్రం సమయాల్లో నమస్కరించి దన్యవాదాలు తెలియజేయడం మానవుని కనీస ధర్మముగా భావించాడు . అలా ప్రారంభమయినదే సూర్యనమస్కార సంప్రదాయము . రెండుపూటలా ప్రతిరోజూ చేయడం శరీరానికి మంచి వ్యాయమము ఎంతో ఆరోగ్యదాయకము . ఏ రోగము దరిచేరదు .

సూర్యుని నుండి ఉష్ణము , కాంతి అందుకునే మానవునికి దానికి మూలమైన అగ్నిని అర్ధము చేసుకునేందుకు కొంచం సమయం పట్టినది . అడవులలో చెట్ల రాపిడికి పుట్టి అడవులనే దహించివేసి భీబత్సవాన్ని సృస్టించిన అగ్నిని చూసి భయపడి దానికి దేవతా స్థానము కల్పించి పూజించడం ప్రారంచాడు ... తన ఇంట వెలుగునిచ్చే దేవుడిగా ప్రార్ధనలు చేసి కొలువసాగాడు . ఇంటనే హోమాలను నిర్వహించడం మొదలుపెట్టేడు . హోమములో ఎటువంటి పుల్లలు వాడాలి .. వాటి ప్రయోజనం ఏవిటి అనేది కాలక్రమేనా అర్ధము చేసుకున్నాడు . ఆ విధంగా హోమము హిందూధర్మ శాస్త్రము లో ఒక సంస్కృతి ... సాంప్రదాయం గా మారినది .

హోమ సామగ్రి : 
హోమము చేయడం అనేది చాలా సులభమే . వాడె వస్తువులు సులువుగా దొరికేవే .
 • పిరమిడ్ రూపములొ ఉండే ఒక రాగి పాత్ర ,
 • ఆవు పిడకలు ,
 • స్వచ్చమైన ఆవు నెయ్యి ,
 • పాలిష్ చెయ్యని బియ్యము (దంపుడు బియ్యము),
 • సూర్యోదయము , సూర్యాస్తమయము వచ్చునట్లు గా ఉన్న ప్రదేశము (చోటు),
 • ఎండు మామిడి పుల్లలు ,
 • కర్పూరము ,
 • పూజా సామగ్రి ,
 • తాటాకుల విసనకర్ర ,
 • ఔషద మొక్కలు , గంధం చెక్కలు , సువాసం ద్రవ్యాలు కొన్ని ,
హోమం లో రకాల్ని బట్టి మిగతా వస్తువులు వాడుతారు .

హోమ శక్తి : ఔషధ ఉపయోగాలు :
 • హోమము చేయడం ఛాందసవాదం గా కొంతమంది పరిగణిస్తారు . కాని వాస్తవానికి దానివలన కలిగే ఆరోగ్య నియంత్రణ , కాలుష్య నివారణా ప్రయోజనాలు ఎన్నో నిక్షిప్తంచేసి ఉన్నాయి . హోమము లో ఉన్నది అగ్ని శక్తి . ఆరోగ్యము కోసం నీటిని మరిగించడానికి అగ్నిశక్తి ని వాడుతాము .
 • హోమము చేయు చోటు లో వెలుతురుకి చుట్టు ప్రక్కలకు క్రిమికీటకాలు చేరవు .
 • హోమాగ్నితో వచ్చే వేడికి హానికరమైన సూక్ష్మజీవులు మరణిస్తాయి .
 • హోమాగ్ని వేదికి కొన్ని హానికర రసాయనాలు మంచి గా మారుతాయి ,
 • మనసులో గూడుకట్టుకొన్న ఒత్తిడులు తొలగిపోయి ప్రశాంతత చేకూరుతుంది ,
 • ప్రదక్షిణలు చేయడం ఒకరకమైన వ్యాయామము వలన ఉపయోగము ,
హోమము నుండి వెలువడే వేడి
 • చర్మాన్ని మెరుగుపరుస్తుంది ,
 • రక్తాన్ని శుబ్రపరుస్తుంది ,
 • మెదడు కణాలకు కొత్త శక్తినిస్తుంది ,
 • శరీరములో ఉన్న రోగకారక సూక్ష్మజీవులను సంహరిస్తుంది ,
 • హోమము నుండి వచ్చే వాయులులు పీల్చడం వలన ఊపిరితిత్తులు సుద్ది అవుతాయి ,
హోమము వలన కలిగే నష్టాలు:
 1. మితిమీరిన పొగ వలన కలిగే అనారోగ్యము ... ఉబ్బస వ్యాధిగ్రస్తులకు ప్రాణ సంకటమే ,
 2. పొగవలన కళ్ళు మండటము , ఎర్రబారిపోవడమూ జరుగును ,
 3. ఎక్కువ వేడి తగిలి చర్మము కందిపోవడము ,
 4. నెయ్యి ,పేడ , బూడిద లో కూదినటువంది తీర్దాలు త్రాగడం వలం ఎసిడిటీ ప్రోబ్లమ్స్ రావడము ,
 5. సమయము వృదా చేయడము ,
మన:సంతృప్తి కి మించిన శక్తి , మందు మరేదీ లేదు . ఆత్యాద్మిక సంతృప్తి ఆరోగ్యప్రదాయిని . ఈ ఆచార వ్యవహారాలు ఇలాగే జరగనీ .. జరగడం అవసరము ఆరోగ్యకరమైన మానవాలికి .
ఒరిగేదేమీ లేక పోయినా మన పురాతన ఆచార సాంప్రదాయాలను తరువాత తరాలవారికి కనుమరుగయిఫోకుండా ఉండేందుకు ఇటువంటి కార్యక్రమాలు చేస్తూఉండాలి . అది మన కనీష ధర్మము .

రచన: కోటి మాధవ్ బాలు చౌదరి

GAU NATURALS - Swadesi Products

Cow Based Cultivated Rice,Dals,Spices.Hand Churned DESI COW GHEE,Panchgavya Products,Ayurvedic Products..
స్వదేశీ గోవు ఆధారిత ప్రకృతి వ్యవసాయం లో పండించిన పంట ఉత్పత్తులు, చేతితో విసిరిన పప్పులు,గానుగ నూనె లు, గోశాల లో తయారు చేసిన ఆవు నెయ్యి, పళ్ళపొడి సబ్బు లు షాంపూలు,ఫినాయిల్ మరెన్నో స్వదేశీ ఉత్పత్తుల సమాహారమే - గౌ నాచురల్స్. www.gaunaturals.com