పితృదేవతారాధన - Ancestors Worship: పెద్దల పండుగ అంటే ఏమిటి?

పితృదేవతారాధన - Ancestors Worship
ప్రతి వస్తువుకి జీవము ఉంటుంది ... కొన్నింటికి అంతర్గతముగాను కొన్నింటికి బహిర్గతము గాను , అంతర్గతం గా జీవమున్న వస్తువులను మనిషి జీవము లేనివిగా భావిస్తాడు .... ఎందుకంటే తానూ బహిర్గతముగా జీవము ఉన్నవాడు అయినందున. ఇక్కడ మనము -పెద్దల పండగ,పితృదేవతారాధన- గురించి తెలుసుకొని ఆనందించి జీవన విధి-విధానం లో మన పాత్రేమిటో తెలుసుకిందాం .--
కళ్లముందు కనిపించకపోవచ్చు. భౌతికంగా దూరమై ఉండవచ్చు. అంతమాత్రాన, దివంగతులతో మన బంధం తీరిపోదు. వారి కలల్నీ ఆశయాల్నీ నిజం చేయాల్సిన బాధ్యత మనదే. వారి జ్ఞాపకాలకు ట్రస్టీలమూ మనమే.
శతాధిక వృద్ధుడు. చేతులు వణుకుతున్నాయి. అయినా, సత్తువంతా కూడదీసుకుని గొయ్యి తవ్వుతున్నాడు. పొలంలో మామిడి మొక్క నాటుతున్నాడు. అటుగా వెళ్తున్న రాజుగారు చూశారు. 'ఆ...గొయ్యి తవ్వుకోవాల్సిన ముసలి, ఈ...గొయ్యి తవ్వుతున్నాడే!' అని నవ్వుకున్నారు. ఆటపట్టించాలన్న కోరిక కలిగిందేవో. 'ఎంత ఆశ! ఎంత ఆశ! బతుకు మీద మమకారం చావలేదా! ఈ మొక్క పెరిగి, పెద్దయి, పూలుపూసి, పిందెలేసి, కాయలు కాయాలంటే ఎన్నేళ్లు పడుతుందో! పండు తినేదాకా పండుటాకు రాలకుండా ఉంటుందా తాతా?' వెక్కిరింతగా మాట్లాడారు. తాత బోసినవ్వులు నవ్వాడు. 'ఈ ప్రయత్నం నాకోసం కాదు మహారాజా. నా కొడుకుల కోసం. నా మనవల కోసం. నా మునిమనవల కోసం. వాళ్లకు పుట్టబోయే బిడ్డల కోసం. నా వంశస్తులు ఈ చెట్టు కొమ్మకు వూయలలూగాలి. ఈ చెట్టు నీడలో సేదతీరాలి. ఈ చెట్టు కాయలతో పచ్చడి చేసుకోవాలి. ఈ చెట్టు పండ్లతో పండగ చేసుకోవాలి...' వందేళ్ల కలను, వెయ్యేళ్ల కలను ఆవిష్కరించాడు తాతయ్య. మహారాజు తన అజ్ఞానానికి బాధపడ్డాడు. పశ్చాత్తాపంతో క్షమాపణ కోరాడు.

మనకూ తాతలున్నారు. ముత్తాతలున్నారు. కథలోని తాతయ్యలాగానే మనకోసం తపించే ఉంటారు. మన గురించి కలలుకనే ఉంటారు. మన కోసం త్యాగాలు చేసే ఉంటారు. మన మూలాలకు కారణమైన మూలవిరాట్టులను, మనకు జన్మనిచ్చినవారికి ప్రాణంపోసిన పుణ్యమూర్తులను, జన్యు సంపదనిచ్చిన మహాదాతలను...ఏ మేరకు గౌరవిస్తున్నాం? కనీసం, వాళ్ల పేర్లయినా గుర్తున్నాయా?
తండ్రిపేరు చెప్పండి?
ఠక్కున చెప్పేస్తాం.
తాత పేరు చెప్పండి?
కాస్త తడుముకుంటాం.
ముత్తాత పేరు?
కష్టం. చాలా కష్టం.
ఒక్క ఫొటో అయినా ఉందా?
ఆ పెద్దలే కట్టించిన లంకంత ఇంట్లో అణువణువూ గాలించినా, ఒక్క ఆనవాలూ దొరకదు. గౌరవం అంటే, బతికున్నన్నాళ్లూ ఇష్టంగానో అయిష్టంగానో భరించడం కాదు. చనిపోయాక కూడా గుర్తుంచుకోవడం. జ్ఞాపకాల్ని భద్రంగా దాచుకోవడం. వారి ఆలోచనల్నీ కలల్నీ కోరికల్నీ నిజం చేయడం. ఏం చేసినా చేయకపోయినా, ఏడాదికి ఒక్కసారి ప్రేమగా తలుచుకోవడం. క్రైస్తవంలో 'ఆల్‌ సోల్స్‌డే' అని పిలవవచ్చు, హిందూధర్మంలో 'పితృపక్షం' అని వ్యవహరించవచ్చు. పేరేదైనా ప్రధాన ఉద్దేశం అదే. అసలు పితృదేవతలంటూ ఉన్నారా, దివ్యలోకాల నుంచి దిగొస్తారా, మనం పెట్టే ప్రసాదాలు భోంచేస్తారా, మనల్ని ఆశీర్వదిస్తారా...అన్నది నమ్మకాలకు సంబంధించిన వ్యవహారం. కానీ వందేళ్ల క్రితవో, యాభై ఏళ్లక్రితవో వాళ్లంతా జీవించి ఉన్నారన్నది నిజం. ఒక్కో ఇటుకా పేర్చి ఇల్లంటూ కట్టారన్నది నిజం. అది ఏడంతస్తుల మేడ కావచ్చు. పెంకుటిల్లూ కావచ్చు. కట్టిందేదో స్థోమతకు మించే కట్టుంటారు. కొడుకులూ కోడళ్లూ, మనవళ్లూ మనవరాళ్లూ, ఆ మనవళ్ల పిల్లలూ సుఖంగా సంతోషంగా ఆ ఇంట్లో జీవించాలని ఆకాంక్షించి ఉంటారు. ఆ ప్రేమను గుర్తుచేసుకోవడంలో తప్పేంలేదుగా!

కరవులూ వరదలూ అప్పులూ తిప్పలూ...ఎన్నొచ్చినా ధైర్యంగా తట్టుకున్నారు. ఒక ఎకరం అమ్ముకుంటే అప్పులు తీరిపోయేవేవో. ఇంకో ఎకరం లేదనుకుంటే బిడ్డల పెళ్లిళ్లు ఘనంగా జరిగిపోయేవేవో. అయినా అమ్మలేదు. అప్పుల్నీ అవమానాల్నీ భరించారు. కారణం...రేపటి తరాలకు అన్యాయం చేయకూడదన్న ముందస్తు ఆలోచన. తినో తినకో మనకంటూ ఆస్తులు మిగిల్చారు. అది అరఎకరం కావచ్చు. పాతిక ఎకరాలు కావచ్చు. ఆ మట్టిలో అపారమైన మమకారం దాగుంది. ఆ నేలలో పండిన ప్రతి గింజ మీదా పెద్దల ఆశీర్వచనాలు ఉంటాయి. వారి త్యాగాలకు కృతజ్ఞతలు తెలపడం నేరమేం కాదుగా!

అందరూ అంతస్తులు ఇవ్వకపోవచ్చు. ఆస్తులు పంచకపోవచ్చు. అయితేనేం, విలువలతో కూడిన చరిత్రను ఇచ్చారు. ఫలానావారి బిడ్డలం అనో, మనవళ్లం అనో, మనవరాళ్లం అనో సగర్వంగా చెప్పుకోడానికి సరిపడా గతాన్నిచ్చారు. ఆ వారసత్వాన్ని నెమరేసుకోవడం మన బాధ్యత. అది కూడా మొక్కుబడిగా కాదు, శ్రద్ధగా చేయాలి. శ్రాద్ధం అంటే అదే. హిందూ సంప్రదాయం ప్రకారం... మహాలయ పక్షంలో పితృదేవతలందరికీ శ్రాద్ధం పెడతారు. సూర్యుడు కన్యారాశిలో ఉన్నప్పుడు వచ్చే కృష్ణపక్షమే, పితృపక్షం. 'భాద్రపద మాసం, కృష్ణపక్ష పాడ్యమి నుంచి పదిహేను రోజుల పాటు పైలోకాల్లో ఉన్న పితృదేవతలకు ప్రత్యేక సెలవులు. భూలోకానికి వచ్చి వారసుల్ని ఆశీర్వదించి వెళ్తారు. ఆ అపురూప అతిథులకు, మనం చేసే సపర్యలే శ్రాద్ధకర్మలు' అని గరుడ పురాణం చెబుతోంది. ఆ సందర్భంగా తల్లివైపు మూడు తరాల కీర్తిశేషుల పేర్లూ తండ్రివైపు మూడుతరాల కీర్తిశేషుల పేర్లూ తలుచుకుంటారు. దివంగతులైన ఆత్మీయుల్నీ స్నేహితుల్నీ గుర్తుచేసుకుంటారు. వారి ప్రతినిధులుగా ఎంతోకొంతమందికి కడుపునిండా భోజనం పెడతారు. పుట్టినరోజున స్నేహితులకు పార్టీ ఇచ్చినట్టు, పెళ్లిరోజున బంధువులకు విందు ఇచ్చినట్టు, ప్రవోషన్‌ వచ్చినప్పుడు సహోద్యోగుల్ని రెస్టారెంట్‌కు తీసుకెళ్లినట్టు...మహాలయపక్షంలో ఏ లోకాల్లోనో ఉన్న పితృదేవతలకు నైవేద్యం పెడతారు. తర్పణాలు వదులుతారు. నిజానికి, దివంగతుల్ని గుర్తుచేసుకోడానికి శ్రాద్ధకర్మలే చేయాల్సిన పన్లేదు. చాలా మార్గాలున్నాయి. అనాథ ఆశ్రమంలో ఓ పూట అన్నదానం, పేద విద్యార్థులకు పుస్తకాలు, దిక్కులేనివారికి వెచ్చని రగ్గులు...స్థోమతను బట్టి, ఓపికనుబట్టి ఏ సత్కార్యమైనా చేయవచ్చు. ఆత్మీయులతో చిన్న సంస్మరణ సమావేశం నిర్వహించుకోవచ్చు. పెద్దలు చేసిన మంచిపనుల్ని తలుచుకోవచ్చు. ఏదీ కుదరకపోతే, ఇంట్లో ఉన్న ఫొటోలకు దండవేసి దండం పెట్టుకోవచ్చు. స్థూలంగా 'పితృపక్షం' అంతరార్థమిదే. ఆపని ఎప్పుడైనా చేయవచ్చని చెబితే, బద్ధకస్తుడైన మనిషి ఎప్పుడూ చేయడని మన పూర్వీకులకు బాగా తెలుసు. అందుకే ఏడాదిలో ఓ పదిహేను రోజుల్ని ప్రత్యేకంగా కేటాయించారు. మహాలయ అమావాస్యదాకా గడువు ఇచ్చారు.
--------
పితృదేవతారాధన - Ancestors Worship
ఆశయాల్ని బతికించుకుందాం:
ధర్మశాస్త్రాల ప్రకారం మనిషి పుట్టుకతోనే రుణబంధాల్లో చిక్కుకుపోతాడు. ఆధ్యాత్మికత ద్వారా దేవరుణాన్ని, సేవ ద్వారా రుషి రుణాన్ని, దానధర్మాల ద్వారా మనుష్యరుణాన్ని తీర్చుకోవాల్సి ఉంటుంది. పితృరుణాన్ని తీర్చుకోడానికి ఒకటే మార్గం...మంచి మనిషిగా పేరు తెచ్చుకోవడం, మంచిపనులతో పెద్దల పేరు నిలబెట్టడం, వారి ఆశయాల్ని నిజం చేయడం. వూళ్లో బడో గుడో కట్టాలన్న పెద్దల కల కలగానే మిగిలిపోయి ఉండవచ్చు. నలుగురు పేద పిల్లలకు చదువు చెప్పించాలన్న కోరిక కోరికగానే మిగిలిపోయి ఉండవచ్చు. పాతింటిని లైబ్రరీగా మారిస్తే వూరికి ఉపయోగపడుతుందన్న ఆలోచన ఆలోచన స్థాయిలోనే ఆగిపోయి ఉండవచ్చు. గంపెడు సంతానం, నష్టాల వ్యవసాయం, అనారోగ్యాలు, అప్పులు...ఇలాంటి కారణాలేవో వారి ప్రయత్నాలకు అడ్డుతగిలి ఉండవచ్చు. తీరని కోరికలూ తీర్చాల్సిన బాధ్యతలూ జీవుడి పరలోక ప్రయాణంలో రాళ్లూరప్పలై బాధపెడతాయని చాలామంది విశ్వాసం.
పితృదేవతారాధన - Ancestors Worship
వరాహపురాణంలో ఓ కథ ఉంది. శ్వేతమహారాజు అపర కుబేరుడు. అన్నదానం చేయమని వశిష్టమహర్షి అతనికి సలహా ఇస్తాడు. ఆ మాట విని రాజుకు కోపం వస్తుంది. 'వజ్రవైఢూర్యాలు దానం ఇవ్వగల సంపన్నుడినే! నన్ను పట్టుకుని కేవలం అన్నదానం చేయమంటాడేమిటి' అని విసుక్కుంటాడు. యజ్ఞయాగాలు నిర్వహించి... అపారమైన సంపదల్ని ప్రజలకు పంచుతాడు కానీ, ఒక్క మెతుకు కూడా విదిలించడు. మరణం తర్వాత, స్వర్గలోక ప్రవేశం లభిస్తుంది. అన్నపానాలు మాత్రం దొరకవు. ఆకలితో అలమటించిపోతాడు. భూలోకంలోని వారసులు అన్నదానాలు చేసేదాకా తన శరీరాన్ని తానే భుజిస్తూ బతుకుతాడు.

హిందూధర్మంలో 'పితృదేవతలు' అన్న మాటకు చాలా విశాలమైన పరిధి ఉంది. దివంగతులైన ఆత్మీయులు ఎవరైనా పితృదేవతలే. అది ప్రాణస్నేహితుడు కావచ్చు, పాఠం చెప్పిన గురువు కావచ్చు, కష్టసమయంలో ఆదుకున్న సహచరుడూ కావచ్చు. మియాపూర్‌లో ఉంటున్న రిటైర్డ్‌ ఇంజినీర్‌ జోళదరాశి చంద్రశేఖరరెడ్డి కర్ణాటకలోని బళ్లారిలో చదువుకున్నారు. ఏడో తరగతిలో తెలుగు మాస్టారు కప్పగల్లు సంజీవమూర్తి పాఠాలు ఆయన మీద చెరగనిముద్ర వేశాయి. సాహిత్యాభిమానిగా మార్చాయి. ఆ ప్రభావంతో పద్య కవిత్వం రాశారు. దాదాపు యాభైఏళ్ల తర్వాత, సంజీవమూర్తి కుటుంబ సభ్యుల్ని కలుసుకునే అవకాశం వచ్చింది. అప్పుడే, తన గురువుగారి అముద్రిత రచనల గురించి తెలిసింది. జీర్ణస్థితిలో ఉన్న ఆ కాయితాల్ని అపురూపంగా అందుకున్నారు. వందలకొద్దీ పద్యాలు. ఒక్కోటి ఓ ఆణిముత్యమే. తానే పరిష్కరించారు. పండితుల ఆవోద ముద్ర కూడా వేయించుకున్నారు. పుస్తక ప్రచురణకు సంజీవమూర్తి కుటుంబసభ్యులు ఉత్సాహంగా ముందుకొచ్చారు. 'సుమకరండం' కంపోజింగ్‌ నుంచి ఆవిష్కరణ దాకా...అన్ని బాధ్యతలూ చంద్రశేఖరరెడ్డి భుజానికేసుకున్నారు. 'తన పద్యాల్ని పుస్తక రూపంలో తీసుకురావాలన్న ఆలోచన మా గురువుగారికి లేదేవో. ఉన్నా బతకలేని బడిపంతులు జీతం, గంపెడు సంసారం...ఆర్థిక పరిస్థితులు అనుకూలించి ఉండకపోవచ్చు. భాష మీద మమకారం కలిగించిన మహానుభావుడి రుణం ఈ రూపంగా అయినా తీర్చుకున్నందుకు సంతోషంగా ఉంది' అంటారాయన.

పంజాబ్‌కు చెందిన పూరణ్‌సింగ్‌ మూడుపదుల వయసులో ఆస్ట్రేలియా వెళ్లిపోయారు. జట్కాబండి తోలుతూ బతుకుబండి లాగించారు. కుటుంబ బాధ్యతల కారణంగా పెళ్లి కూడా చేసుకోలేదు. 1947లో అక్కడే మరణించారు. స్థానికులే దహన సంస్కారం జరిపారు. తన అస్థికల్ని గంగానదిలో కలపాలన్నది పూరణ్‌సింగ్‌ చివరి కోరిక. ఎవరు తీరుస్తారు? అరవై ఏళ్లపాటూ అవి ఆస్ట్రేలియాలోని ఓ శ్మశానవాటికలో మగ్గిపోయాయి. ఆయన కుటుంబ సభ్యుల్లో మూడోతరానికి చెందిన హర్మెల్‌కు ఆ విషయం తెలిసింది. ఈమధ్యే తీసుకొచ్చి గంగలో కలిపారు. 'పూరణ్‌సింగ్‌జీ పంపిన డబ్బుతో మా కుటుంబాలు బాగుపడ్డాయి. మా ఆర్థిక స్థితి మెరుగుపడింది. ఆయన రుణం తీర్చుకోడానికి ఇదో గొప్ప అవకాశంగా భావించాను' అని చెబుతారు హర్మెల్‌.

విద్యారణ్య చురుకైన విద్యార్థి. సమాజానికి తన వంతు సేవ చేయాలన్న తపన ఉండేది. అమెరికాకు వెళ్లి పెద్దచదువులు చదువుకున్నాడు. అక్కడే మంచి ఉద్యోగం వచ్చింది. ఆర్థికంగా స్థిరపడటంతో, ఓ ట్రస్టు ప్రారంభించాలని నిర్ణయించుకున్నాడు. విధి నిర్ణయం మరోలా ఉంది. అతనికి క్యాన్సర్‌. ఎంతోకాలం బతకలేదు. ఆ యువకుడి ఆశయాల్ని నిజం చేయడానికి కుటుంబసభ్యులు 'విద్యారణ్య ట్రస్టు' స్థాపించారు. 'మేం చేసే ప్రతి మంచి పనికీ అన్నయ్య ఆశీస్సులు ఉంటాయన్నదే మా నమ్మకం' ఉద్వేగంగా చెబుతారు హైదరాబాద్‌లోని ఓ ఇంజినీరింగ్‌ కాలేజీలో అసోసియేట్‌ ప్రొఫెసర్‌గా పనిచేస్తున్న శంకర్‌.

మనం చేసే మంచిపనుల వల్ల దివంగతులైన ఆత్మీయులకు రౌరవాది నరకాలు తప్పుతాయో లేదో తెలియదు. కానీ, ఓ అనాథ ఆకలికూపం నుంచి బయటపడతాడు. స్వర్గలోక యాత్రలో ఆటంకాలు తొలగిపోతాయో లేదో తెలియదు. కానీ, ఓ నిరుపేద విద్యార్థి చదువు నిర్విఘ్నంగా సాగుతుంది. ఈ సత్యాన్ని, ఆస్తికులైనా నాస్తికులైనా అంగీకరించాల్సిందే. ఆ మంచిని, మనుషులైనా దేవతలైనా స్వాగతించాల్సిందే.

వినండి పితృదేవతారాధన మంత్ర శ్లోకము:
అనుకోని అతిథి...
కర్మలూ తర్పణాలూ సంస్మరణ కార్యక్రమాలూ దివంగతుల ఛాయాచిత్రాలూ అంతర్లీనంగా మనిషిలో మరణం అంటే ఉన్న భయాన్ని పోగొడతాయి. ఏదో ఒకరోజు మనమూ ఆ వరుసలో చేరాల్సినవాళ్లమే అన్న సత్యం బోధపడుతుంది. నిజానికి, జీవితం మీద మితిమీరిన మమకారం పనికిరాదు. భారతీయ తత్వశాస్త్రం ప్రభావంతో కవిత్వం రాసిన జోసెఫ్‌ బ్లాంకోవైట్‌ మరణాన్ని ఇలా వర్ణిస్తారో చోట... 'పగటిపూట సృష్టించబడిన ఆదిమ దంపతులు రాబోయే రాత్రి గురించి చాలా భయపడ్డారు. కానీ సూర్యుడు అస్తమిస్తూ చీకట్లు అలుముకునే సమయానికి, తారలహారం వేసుకుని రాతిరి కన్యక అద్భుతంగా దర్శనమిచ్చింది. ఈ అందాల్ని దూరం చేసి, పగలు మన కళ్లు కప్పింది సుమా' అని ఆశ్చర్యపోయారు. ముక్తాయింపుగా...'మనం మరణాన్ని మాత్రం ఎందుకు తిరస్కరించాలి? వెలుతురు వోసం చేసినట్టే, జీవితం కూడా వోసం చేయదని భరోసా ఏమిటి?' అని ప్రశ్నించుకున్నారు.
ఎంత గొప్ప ప్రశ్న!
ఎన్ని భ్రమల్ని దూరం చేసే ప్రశ్న!
మనం బాగా అభిమానించేవారి ఇంటికి వెళ్లినప్పుడు, అయిష్టంగా వీడ్కోలు తీసుకుంటాం. కొన్నిసార్లు కావాలనే చేతిగుడ్డో కళ్లజోడో అక్కడే వదిలేసి వస్తాం. ఆ సాకుతో అయినా మళ్లీ వెళ్లొచ్చన్న ఆశ. నలుపు-తెలుపు ఛాయాచిత్రాలూ, పాతకాలం ఇళ్లూ, చేతికర్రలూ, పందిరిమంచాలూ, పడక్కుర్చీలూ మన పితృదేవతలు వదిలేసి వెళ్లిన అలాంటి ఆనవాళ్లే.

పునరపి జననం.
పునరపి మరణం
ఏదో ఒకరోజున, మళ్లీ వస్తారేవో?
నివాళి ఘటిస్తూ..
పేరు మారవచ్చు. తేదీ మారవచ్చు. పూజావిధానం మారవచ్చు. కానీ, పితృదేవతారాధన అన్ని దేశాల్లోనూ ఉంది. వంశాభివృద్ధికి పెద్దల ఆశీస్సులు అవసరమని చాలా మతాలు విశ్వసిస్తాయి.

జైనమతంలో:
జననమరణాల చక్రం నుంచి బయటపడమని చెబుతాడు మహావీరుడు . వోక్షమే పరవోన్నతమని బోధిస్తాడు. జైనులు కార్తీక పౌర్ణమి రోజున పితృదేవతలకు పూజలు చేస్తారు. ప్రసాదాన్ని కుటుంబ సభ్యులు మాత్రమే స్వీకరిస్తారు. దానధర్మాలకు ప్రాధాన్యమిస్తారు.

సిక్కుమతంలో:
సిక్కులు దివంగతులను పూజించరు. దేవుడిని తప్ప ఎవర్నీ కొలువకూడదని 'గ్రంథ్‌సాహిబ్‌' చెబుతోంది. గురునానక్‌ పితృకర్మలను తీవ్రంగా నిరసించారు. 'గంగలో నీళ్లు వదిల్తే, పక్క వూళ్లో ఉన్న పొలమే తడవదే! అలాంటిది, ఏ లోకాల్లోనో ఉన్న పితృదేవతల దాహం ఎలా తీరుతుంది?' అని ప్రశ్నించారు.

బౌద్ధంలో:
కోరికలే అన్ని దుఃఖాలకూ హేతువులు. నిరంతర సాధనతో మనిషి కోరికల్ని జయించాలంటాడు బుద్ధుడు. బౌద్ధం పితృదేవతల ఆరాధనను వ్యతిరేకించలేదు. అలా అని ప్రోత్సహించనూ లేదు. తైవాన్‌, జపాన్‌, చైనా, శ్రీలంక..తదితర దేశాల్లోని బౌద్ధులు వివిధ రూపాల్లో ఆత్మల పండగ చేసుకుంటారు.

క్రైస్తవంలో:
నవంబరు ఒకటిన 'ఆల్‌ సెయింట్స్‌డే' ... దివంగతులైన సాధుసత్పురుషుల కోసం. రెండున 'ఆల్‌ సోల్స్‌డే'... దివంగతులు అందరికోసం. ఆ రెండు రోజులూ ప్రభువు సామ్రాజ్యం నుంచి వచ్చే అపురూప అతిథుల కోసం ప్రార్థనలు చేస్తారు. కీర్తనలు పాడతారు. పెద్దల త్యాగాల్ని గుర్తుచేసుకుంటారు.

ఇస్లాంలో:
'షబ్‌-ఎ-బరాత్‌' సందర్భంగా రాత్రంతా జాగరణ చేస్తారు. తెల్లవారుజాము ప్రార్థనకు ముందు... దివంగతుల సమాధుల్ని దర్శించుకుంటారు. పెద్దలకు స్వర్గలోక ప్రవేశాన్ని కల్పించమని అల్లాను వేడుకుంటారు.

జొరాస్ట్రియన్లులో:
జొరాస్ట్రియన్లు లేదా పార్సీలు శుద్ధికి చాలా ప్రాధాన్యం ఇస్తారు. ఆలోచనలు, మాటలు, చర్యలు పరిశుద్ధంగా ఉండాలంటారు. పితృదేవతలకు ప్రార్థనలు జరిపే సంప్రదాయం వీరికీ ఉంది. పార్సీల క్యాలెండరు ప్రకారం వచ్చే, ఎనిమిదోనెల పదో రోజున పితృదేవతల పండగ జరుపుకుంటారు.

పెద్దల కోసం... రుగ్వేదంలో పితృదేవతలకు కొన్ని రుక్కులు కేటాయించారు. ఆతర్వాత వచ్చిన 'గరుడపురాణం' శ్రాద్ధ కర్మల గురించి విపులంగా చర్చించింది.
 • ఈజిప్టు పిరమిడ్లు పితృదేవతల ఆరాధనలో భాగమే. మరణానంతర జీవితం సాఫీగా సాగాలని ఎంత ఆశో! దివంగతుల సమాధుల్లో వారికి ఇష్టమైన ఆహార పదార్థాలూ పానీయాలూ పెట్టేవారు. ధనకనక రాశులూ సమర్పించేవారు.
 • మెక్సికన్లు నవంబరు రెండవ తేదీని దివంగతులకు కేటాయించారు. పక్షులకూ జంతువులకూ కూడా ఆరోజు సంతాపం తెలుపుతారు.
 • తైవానీయుల పెద్దల పండగ 'చింగ్‌ మింగ్‌'. దేవతలకు ముడుపు కట్టినట్టు, ఏడాది కాలంలో పితృదేవతల కోసం దాచి ఉంచిన 'ఆత్మ ధనాన్ని' సమాధుల దగ్గర కాల్చి బూడిద చేస్తారు. పొగ రూపంలో ఆ డబ్బు పెద్దలకు చేరుతుందని నమ్మకం. అలా ఇవ్వకపోతే, ఆర్థిక సమస్యలతో వారు భూతప్రేతాల రూపంలో భూలోకానికి వచ్చేస్తారని భయపడతారు.
ప్రజల్లో నానుతున్న కొన్ని స్మృతులు:
 • మరణించినవారు...స్వార్థపరులు.
 • మనం వెక్కివెక్కి ఏడుస్తున్నా...ఒక్కసారైనా వూరడించరు.
 • వాళ్లంతే!
 • నడవడానిక్కూడా బద్ధకమే.
 • భుజాన వోయించుకుంటారు.
 • పిల్లల్లా స్నానం చేయించుకుంటారు.
 • ఎంత దర్పవో.
 • మనకు తెలియని సత్యాలేవో తెలిసినట్టు, మనం చూడని లోకాలేవో చూసినట్టు.
 • వెళ్లేప్పుడు, మాటవరసకైనా చెప్పరే!
 • మహామొండిఘటాలు.
 • హెచ్చరిస్తున్నట్టో...
 • మనల్ని నిందిస్తున్నట్టో...
 • మొహం మాడ్చుకునుంటారు.
 • తమమాటే నెగ్గాలన్నట్టు బిర్రబిగుసుకుపోతారు.
 • తామే ప్రత్యేకమైనట్టు... కర్రల రథమెక్కి వూరేగుతారు.
 • మహా మతిమరుపు!
 • ఏదీ గుర్తుంచుకోరు. ఎవర్నీ గుర్తుంచుకోరు.
 • మనం మాత్రం గుర్తుచేసుకోవాలి...
 • ఏడాదికోసారైనా.
రచించినది: కోటి మాధవ్ బాలు చౌదరి

buttons=(Accept !) days=(0)

Our website uses cookies. Learn More
Accept !
To Top