మతమార్పిడిని వ్యతిరేకించిన సంత్‌ రవిదాస్‌ - Sant Ravidas opposes conversion

0
Sant Ravidas
Sant Ravidas
– ప్రవీణ్‌ గుగ్నాని
దాదాపు 650 సంవత్సరాలకు పూర్వం 1398లో మాఘ మాసం పౌర్ణిమ నాడు కాశీలో జన్మించిన సంత్‌ రవిదాస్‌ లేదా సంత్‌ రై దాస్‌ మతమార్పిడులను వ్యతిరేకించిన, మతమార్పిడికి గురైనవారిని స్వధర్మంలోకి తీసుకువచ్చేందుకు పునరాగమనాన్ని ప్రోత్సహించిన ప్రప్రధమ సంత్‌ అని చెప్పవచ్చును.
  భారతదేశంలో చాలాసంవత్సరాలుగా మతమార్పిడులు సాగుతున్నాయి. 12వ శతాబ్దంలో ముస్లిం దురాక్రమకారులు భారత్‌పై దండెత్తినప్పుడు ఇక్కడి అపారమైన సంపదను దోచుకోవడంతోపాటు తమ మత ప్రచారాన్ని కూడా సాగించారు. ఇక్కడి సంస్కృతి, మతాన్ని నాశనం చేసి, ప్రజల్ని బలవంతంగా మతం మార్చడం అన్యాయమని, అధర్మమని వారికి ఎప్పుడు అనిపించలేదు. పైగా అది ఎంతో గర్వించాల్సిన విషయమనుకున్నారు. ఈ రకమైన దుర్మార్గ పూరితమైన ధోరణి వల్లనే ఆ దురాక్రమణకారులు అలాగే ఉండిపోయారుతప్ప ఈ సమాజంలో విలీనం కాలేకపోయారు, ఇక్కడి ప్రజల గౌరవాన్ని పొందలేకపోయారు. ఇక్కడి ప్రజల్లో దురాక్రమణ కారులు అనుసరించిన మతమార్పిడి విధానాలపట్ల భయం, ఆందోళన కలిగాయి. వీటిని ఎదుర్కోవాలను కున్నారు.

దుర్మార్గుడైన విదేశీ పాలకుడైన సికందర్‌ లోడీ సాగించిన హింస, మతమార్పిడులను చూసిన సంత్‌ రవిదాస్‌ ఎంతో బాధపడ్డారు. తీర్థయాత్రలు, వివాహాలు, ఆఖరుకు శవదహనం పై జిజియా పన్ను విధించడం వంటి అన్యాయపురితమైన పన్నులు లోడీ విధించేవాడు. అలాంటి సమయంలో స్వామి రామానందుడు భక్తి ప్రచారం ద్వారా ప్రజల్లో జాతీయభావాన్ని జాగృతం చేశారు. నిరంకుశ, దుర్మార్గ ముస్లిం పాలనకు వ్యతిరేకంగా ఉద్యమాన్ని నిర్మాణం చేశారు. వివిధ వర్గాలకు చెందిన సాధుసంతు లను కలిపి భాగవత శిష్య మండలి స్థాపించారు. సంత్‌ రవిదాస్‌ ఈ మండలి ప్రముఖ్‌గా ఉండేవారు. ముస్లిం పాలకులు హిందువులపై విధించిన వివిధ పన్నులను సంత్‌ రవిదాస్‌ ఆ మండలిలో వ్యతిరేకించారు. అన్యాయ పురితమైన ఆ పన్నులకు వ్యతిరేకంగా ప్రజలలో జాగరణ ఉద్యమాన్ని చేపట్టారు. మండలిలోని సాధుసంతు లంతా దేశమంతా పర్యటిస్తూ ప్రజలలో జాతీయ భావాన్ని, స్వాభిమాన భావాన్ని జాగృతం చేయడం ప్రారంభించారు. సంత్‌ రవిదాస్‌ నేతృత్వంలో సాగిన ఈ ఉద్యమంతో మత మార్పిడులు పూర్తిగా ఆగిపోయాయి. అంతేకాదు ముస్లిం పాలకులను ఎదిరిస్తూ సంత్‌ రవిదాస్‌ మతం మారిన హిందువులను స్వధర్మంలోకి తీసుకువచ్చే పునరాగమన కార్యక్రమాన్ని ప్రారంభించారు.
  సంత్‌ రవిదాస్‌ చేపట్టిన ఈ ఉద్యమం, దాని ఫలితం చూసిన సికందర్‌ లోడీ ఇస్లాం స్వీకరించాలని బెదిరిస్తూ సదన్‌ అనే తన అనుచరుడిన రవిదాస్‌ దగ్గరకు పంపాడు. ఆ సమయంలో సంత్‌ రవిదాస్‌ లోడీ బెదిరింపులకు, ప్రలోభాలకు లొంగిపోయి ఇస్లాం స్వీకరించి ఉంటే హిందూ సమాజానికి ఎంతో నష్టం జరిగి ఉండేది. కానీ సంత్‌ రవిదాస్‌ దృఢంగా నిలబడ్డారు. మతమార్పిడులకు వ్యతిరేకంగా ఉద్యమాన్ని మరింత తీవ్రతరం చేశారు.

అంతేకాదు లోడీ పంపిన సందేశాన్ని తీసుకు వచ్చిన సదన్‌ కూడా ఇస్లాం వదిలి వైష్ణవ మతాన్ని స్వీకరించడంతో దేశమంతా సంభ్రమాశ్చర్యా లలో మునిగిపోయింది. విష్ణు భక్తుడైన సదన్‌ తన పేరును రామదాసుగా మార్చుకున్నాడు కూడా. సంత్‌ రవిదాస్‌ ఎంతటి ప్రభావాన్ని చూపారంటే చిత్తోడ్‌ కు చెందిన మహారాణి మీరా ఆయనను గురువుగా భావించి గౌరవించింది. రాణి మీరా ఆ తరువాత మీరాబాయిగా ప్రసిద్ది చెందింది. ఆమె స్వయంగా రచించిన అనేక పదాలలో సంత్‌ రవిదాస్‌ పట్ల అపారమైన గౌరవాన్ని వ్యక్తం చేసింది.

(లోకహితం సౌజన్యం తో) - విశ్వ సంవాద కేంద్రము

కామెంట్‌ను పోస్ట్ చేయండి

0 కామెంట్‌లు
* Please Don't Spam Here. All the Comments are Reviewed by Admin.
కామెంట్‌ను పోస్ట్ చేయండి (0)

buttons=(Accept !) days=(0)

Our website uses cookies. Learn More
Accept !
To Top