మానవ జీవన స్తంభాలు - Four pillars of human life

0
మానవ జీవన భవన స్తంభాలు - Four pillars of human life

లోకంలో ఎవరైనా ఇల్లు కట్టుకోవాలంటే, నాలుగు వైపులా నేలలో పునాదులు తీసి, మొదట స్తంభాలు నిర్మించాలి. ఆ స్తంభాలపైన మాత్రమే ఇల్లు కట్టుకోవాలి. ఇది గృహ నిర్మాణ విషయంలో ప్రాథమిక సత్యం. అలాగే మానవుని జీవనం కూడా ఒక భవనంలాంటిదే. అది నూరేళ్లూ చలించకుండా, ఆరోగ్యంగా, ఉండాలంటే నాలుగు స్తంభాలు తప్పనిసరి. ఆ స్తంభాలే ధర్మార్థ కామమోక్షాలు. ఈ నాలుగింటి గురించి వివరించడానికే వేదాలు, ఉపనిషత్తులు, పురాణాలు, ఇతిహాసాలు, కావ్యాలు... ఒక్క మాటలో చెప్పాలంటే సమస్త విశ్వసాహిత్యం నేటికీ అంకితమై ఉంది. ఈ నాలుగు విషయాలూ జటిలంగా, గంభీరంగా కనబడినంత మాత్రాన వాటి గురించి తెలుసుకోవడం సామాన్యులకు అసాధ్యమేమీ కాదు. మనసుపెట్టి ఒక్కసారి వీటిలో ఉన్న అసలు సంగతి ఏమిటో గ్రహించడానికి ప్రయత్నించాలి. అప్పుడు జీవనం అమృతమయభావనం అవుతుంది.
  1. 'ధర్మం' అనే మాటకు విశేషార్థాలు ఎన్నో ఉన్నా- స్థూలంగా చెప్పాలంటే 'సదాచారమే' అంటే మంచి నడవడి అనేదే ధర్మం. ఇంతకన్న మంచి నిర్వచనం మరొకటి లేదు. మనిషి జీవితం కేవలం వైయక్తిక కర్మలతో మాత్రమే ముడివడి ఉండదు. ప్రతిమనిషికీ అతని జన్మకు కారణమైన పూర్వుల వారసత్వం ఉంటుంది. కుటుంబ జీవనం ఉంటుంది. సామాజిక బాధ్యతలు ఉంటాయి. తాను పుట్టినందుకు తన వంశానికి, సమాజానికి, వారసులకు హితాన్ని కలిగించే కర్తవ్యాలు సాక్షాత్కరిస్తాయి. వీటన్నింటినీ నిర్మల గుణాలతో ఆచరించి చూపడమే ధర్మం. ఇందులోనే చదువు, సంస్కారం, ఓర్పు, నేర్పు, దయ, దాక్షిణ్యం, సమభావం లాంటి గుణాలన్నీ అంతర్భవిస్తాయి.
  2. 'అర్థం' అంటే ప్రయోజనం. లోకంలో మానవులు చేసే ప్రతిపనికీ ఒక ప్రయోజనం ఉండి తీరుతుంది. అందుకే 'ప్రయోజనం అనేది లేకుండా వెర్రివాడు కూడా పనిచేయడు' అని పెద్దలంటారు. ఈ ప్రయోజనం ఎలాంటిదై ఉండాలి అన్నదే మనిషికి ఒక పరీక్షలాంటిది. లోకంలో ఏ పని కావాలన్నా డబ్బు ప్రధానం. అందుకే 'అర్థం' అంటే 'డబ్బు' అని వ్యవహారంలోకి వచ్చి చేరింది. మంచిపనులు చేయడంకోసం డబ్బును సంపాదించాలి, సంపాదించిన డబ్బుతో మంచి పనులు చేయాలి అనేదే అర్థానికి గల పరమ ప్రయోజనం. అందుకే పెద్దలు ధర్మాన్ని చక్కగా ఆచరిస్తూ డబ్బు సంపాదించాలని అంటారు. ఇది నిజంగా వేదవాక్కు.
  3. 'కామం' అంటే కోరిక. శృంగారం విషయంలో పొందే అనుభూతికి ఈ పేరును పర్యాయపదంగా వ్యవహరిస్తున్నా, నిజంగా 'కామం' అంటే మనస్సులో కలిగే సంకల్పం అనేదే శబ్దార్థం. ఈ కోరిక ఎలా ఉండాలో తెలుసుకోవాలంటే మన ఇతిహాసాలను బాగా చదవాలి. కామం విషయంలో రావణుడిలా ఉండకూడదని రామాయణం చెబుతుంది. దుర్యోధనునిలా ఉండకూడదనీ, కీచకునిలా మారకూడదనీ మహాభారతం చెబుతోంది. అంటే కామానికీ ఒక ధర్మం ఉండాలి అనీ, ఆ ధర్మాన్ని అనుసరించకపోతే 'కామం' పిశాచంగా మారుతుందే గానీ- మనశ్శాంతిని ఏ మాత్రం ఇవ్వలేదనేది తాత్పర్యం. రావణ దుర్యోధన కీచకాదులకు తుదకు పట్టిన గతిని పరికిస్తే ఈ విషయంలోని మర్మం తెలుస్తుంది.
  4. 'మోక్షం' అనేది అన్నింటికన్న చివరిది. ఇది మనిషికి బతికి ఉండగానే లభిస్తుందని కొందరూ, మరణానంతరమే సంప్రాప్తిస్తుందని కొందరూ అంటారు. ఈ నిర్వచనాలు ఎలా ఉన్నా, అన్ని బంధాలనుంచీ విముక్తం కావడమే 'మోక్షం' అని చెప్పడం సముచితం. మనిషికి పుట్టిననాటినుంచి ప్రతి విషయంలోనూ బాధ్యతలూ బంధాలూ తాళ్లవలె, గొలుసులవలె బంధిస్తాయి. అంటే ప్రతిమనిషీ కనబడని తాళ్లతో, గొలుసులతో ఎప్పుడూ బంధితుడై ఉంటాడే కాని, స్వేచ్ఛగా ఉండలేడు. ఇది సమాజ ధర్మం. కనుక సంసారంలోనే ఉంటూ మానసికంగా దేనికీ చిక్కకుండా ఉండే రాజయోగి జనకునిలా జీవించడం మనిషి నేర్చుకోవాలి. అప్పుడు ఏ బరువులూ ఏ బాధ్యతలూ మానవుణ్ని వశపరచుకోలేవు.
సకలహితాన్ని కోరే ధర్మం, ఆ ధర్మం ద్వారా సంపాదించే అర్థం, ఆ అర్థాన్ని ధర్మంతో అనుసంధానించి అనుసరించే కామం- చివరికి ఏ బంధాలకూ లొంగని మోక్షానికి దారితీస్తాయి. ఇదే నాలుగుస్తంభాల మీద కట్టుకునే మానవ జీవన భవన దృశ్యం.

రచించినది: కోటి మాధవ్ బాలు చౌదరి

కామెంట్‌ను పోస్ట్ చేయండి

0 కామెంట్‌లు
* Please Don't Spam Here. All the Comments are Reviewed by Admin.
కామెంట్‌ను పోస్ట్ చేయండి (0)

buttons=(Accept !) days=(0)

Our website uses cookies. Learn More
Accept !
To Top