నూతన వ్యాసములు:
latest

728x90

header-ad

468x60

- ఆర్ఎస్ఎస్ -

ఆర్ఎస్ఎస్
ఆధ్యాత్మిక జీవనం లేబుల్‌తో ఉన్న పోస్ట్‌లను చూపుతోంది. అన్ని పోస్ట్‌లు చూపించు
ఆధ్యాత్మిక జీవనం లేబుల్‌తో ఉన్న పోస్ట్‌లను చూపుతోంది. అన్ని పోస్ట్‌లు చూపించు

31, మార్చి 2020, మంగళవారం

ఆత్మజ్ఞానంతో చింతలు దూరం, "గీతామృతం" సదా అనుసరణీయం - Athmaganamtho Chinthulu Dooram

ఆత్మజ్ఞానంతో చింతలు దూరం, "గీతామృతం" సదా అనుసరణీయం - Athmaganamtho Chinthulu Dooram
ఆత్మజ్ఞానంతో చింతలు దూరం - గీతామృతం
ఆఫీసులో కిందిస్థాయి ఉదోగికి ఏదైనా కష్టం వస్తే.. తన పైఅధికారిని కలవడం సహజమే. అదేవిధంగా జీవితంలో కష్టాలు, అవరోధాలు ఎదురైనపుడు జ్ఞానవంతుడి దగ్గరకు వెళ్లి సలహా తీసుకోవడం అందరూ చేయాల్సిన పని. సజ్జనులు, జ్ఞానవంతుల సాంగత్యంతో శారీరక, మానసిక స్థాయిలోని క్లేశాలను దూరం చేసుకునే స్థితికి చేరుకోగలం. అర్జునునికి కలిగిన గొప్ప చింతను తొలగించడానికి జగద్గురువైన శ్రీకృష్ణుడు నేరుగా అతడికి ఆత్మజ్ఞానాన్ని బోధించాడు.
 • ‘అర్జునా! ఆత్మ ఎటువంటి ఆయుధాలతో ఛేదింపబడదు, అగ్నిచే కాలిపోదు, నీటితో తడిసిపోదు, వాయువుచే ఎండిపోదు’’ (భగవద్గీత 2.23) 
 •  ‘‘ఆత్మను ఛేదించడం గాని, కరిగించడం గాని, దహించడం గాని, ఎండిపోయేలా చేయడం గాని అసాధ్యం. అది నిత్యమైనది, సర్వత్రా వ్యాపించి ఉండేది, మార్పు రహితమైనది, కదలనిది, సనాతనమైనది’’ (భగవద్గీత 2.24). 
అంటే మనిషి ఆత్మజ్ఞానాన్ని తెలుసుకొన్నప్పుడే దేహమనోబుద్ధి స్థితుల కంటే ఎత్తుకు ఎదుగుతాడు. ఆత్మస్థితిలోకి చేరినవాడికి బుద్ధి చురుకవుతుంది. మానసికచింత తగ్గుతుంది. శారీరక క్లేశంపై భయం దూరమవుతుంది.

శరీరాన్ని సుఖపెట్టి మనిషి సాధించేది ఏదీ ఉండదు. సుఖం కావాలనుకునేవాడు అతి త్వరలో రోగి కావడం అందరి అనుభవంలోనిదే. అట్టి వ్యక్తి జీవితంలో ఏదీ సాధించలేడు. పుట్టిన శరీరం గిట్టక తప్పదు. ఒక శరీరాన్ని విడిచిన జీవుడు మళ్లీ జన్మించక తప్పదు. కాబట్టి శారీరక స్థాయిలో గాని, మానసిక స్థాయిలోగాని వర్తించక బుద్ధిమంతుడు ఆత్మస్థాయిలో నిలిచి విజయం పొందుతాడు. పదుగురికి లాభం చేస్తాడు. స్వధర్మ నిర్వహణ గావిస్తాడు.
‘‘ఆత్మస్థితి అంటే మాకు సంబంధించినది కాదులేండి’’ అని అందరూ నవ్వుతూ ఉంటారు. కాని ఆ స్థితికి రానిదే నిజమైన వ్యక్తి, వ్యక్తిత్వం మీలో రూపొందదనేది అక్షరసత్యం. నీ గురించిన పూర్తి ఎరుక, నీలో కలుగుతున్న ఆలోచన స్రవంతి, నీ బుద్ధికి పదును పెట్టే సంకల్పం, ఇతరుల శక్తిని గుర్తించడం, వారిని నీతో సమానులుగా భావించడం ఇవన్నీ ఆత్మదర్శన లక్షణాలే. ఎవ్వరి దగ్గరనైతే ఈ లక్షణాలు అత్యున్నత స్థాయిలో ఉంటాయో వారే నాయకులై విరాజిల్లుతారు.
క్షత్రియుడికి యుద్ధమనేది స్వధర్మం, విద్యుక్తధర్మం. ఈ జగత్తులో అత్యంత కష్టమైన కార్యం యుద్ధం చేయడం. ఆ కార్యంలో ఏ క్షణమైనా ప్రాణం పోవచ్చు. ఏ క్షణంలో అయినా విజయం కలగవచ్చు. అంతటి మానసిక ఒత్తిడిలో కర్తవ్యం నిర్వర్తించాలి. అయితే యుద్ధరంగంలో మరణించేవాడికి స్వర్గప్రాప్తి కలుగుతుందని శాస్త్రవచనం. ఇక అతడు యుద్ధంలో జయిస్తే రాజ్యభోగం లభిస్తుంది. అలాకాకుండా రణరంగం నుంచి ప్రాణభయంతో పలాయనం చిత్తగిస్తే అపకీర్తి మిగులుతుంది. అందుకే సుఖదుఃఖాలను, లాభనష్టాలను, జయాపజయాలను సమానంగా చూస్తూ యుద్ధం చేయమని కృష్ణభగవానుడు అర్జునుని ఆదేశించాడు (భగవద్గీత 2.38).

భగవద్గీత నుంచి మనిషి నేర్చుకోవాల్సింది ఏమిటంటే.. ఒక్క విజయంతోనే నీ కర్తవ్యం పూర్తయిందని భావించవద్దు. మరిన్ని విజయాలు సాధించే దిశగా ముందుకు సాగాలి. అటువంటి వ్యక్తి నిజంగా ఆత్మస్థితిలో ఉన్నవాడే అవుతాడు. ప్రతి అపజయానికీ మరింత పదును తేలుతాడు. ప్రతి కష్టం నుంచి మంచి పాఠం నేర్చుకుంటాడు. ప్రతీ ఎదురీతకు అనుభవంతో పండిపోతాడు. అలాగే ప్రతి విజయానికీ ఆత్మబలం పెంచుకుంటాడు. అందరి చేయూతను అర్థం చేసుకుంటాడు. గొప్ప నాయకుడై తరతరాలకు ఆదర్శనీయుడవుతాడు.

సంకలనం: (భగవద్గీత యథాతథము అధారంగా) డాక్టర్‌ వైష్ణవాంఘ్రి సేవక దాసు అంతర్జాతీయ కృష్ణచైతన్య సంఘము (ఇస్కాన్‌). ఈ-మెయిలు: vaishnavanghri@gmail.com

3, జనవరి 2020, శుక్రవారం

భగవద్గీత - పరమార్ధము - What is the meaning of Bhagawad Gitaభగవద్గీత - పరమార్ధము - What is the meaning of Bhagawad Gita
భగవద్గీత అంటే ఏమిటి?
 • ✹ జీవితమంతా అయిపోయిన తర్వాత చదువుకోవాల్సిన పుస్తకమా?
 • ✹ రిటైర్‌మెంట్‌ రోజు  సహోద్యోగులు ఇచ్చే బహుమతా?
 • ✹ ఎవరైనా మరణించినప్పుడు ప్లే చేసే సీడీనా?
 • ✹ అది కేవలం హిందువులదా?
 • ✹ పనీపాటా వదిలేసి సన్యసించమని చెబుతుందా అది?
కాదు
అవన్నీ అపోహలు. ఒక్కముక్కలో చెప్పాలంటే *భగవద్గీత ‘డైనమిక్‌ ప్రిస్కిప్షన్‌ ఫర్‌ లైఫ్‌’* సంతృప్తిసంతోషాలు నిండిన జీవితం గడపాలంటే, చేస్తున్న పనిలో విజయం సాధించాలంటే గీతను అర్థం చేసుకోవాలి.

卍. భగవద్గీత హిందువులది, కనుక నేను దాన్ని చదవను, నాకు దాని అవసరం లేదు’ అని చెప్పేవాళ్లు ఎలాంటివాళ్లంటే ‘భూమ్యాకర్షణ సిద్ధాంతం న్యూటన్‌ కనిపెట్టాడు, అది బ్రిటిష్‌ వాళ్లది – మనం దాని జోలికి పోవద్దు’ అనేవాళ్లతో సమానం. గీత భారతీయులు అందరిదీ.

卍. సంతోషంగా ఉండాలి అని ఏవేవో చేస్తుంటాం. వాస్తవానికి కోరిక లను అధిగమించినప్పుడు మీరు సంతోషంగా ఉంటారు. ఉదాహరణకు ప్రమోషన్‌ కావాలి, కావాలి… అనుకుని నిరంతరం దాని గురించే ఆలోచించే వ్యక్తికి చింత తప్ప మరేం మిగలదు. అదే తన పని తాను నిజాయితీగా సమర్థంగా చేసుకుపోయే వ్యక్తికి ఆలోచించనవసరం లేకుండా ప్రమోషన్‌ లభిస్తుంది. గీత చెప్పేదీ అదే. నీ పని నువ్వు చెయ్యి, ఫలితం గురించి ఆలోచించకు అని.*

卍. సన్యాసం అనేది కాషాయదుస్తులతో రాదు. అదొక మానసిక స్థితి. వందమంది మధ్యన ఉన్నా, వంద పనులున్నా కూడా తామరాకు మీద నీటిబొట్టు మాదిరిగా ఉండటమే సన్యాసమంటే.*

卍. ఇంద్రియాలను అదుపులో పెట్టుకోవాలి అంటే దానర్థం అన్నిటినీ వదిలేసి మిమ్మల్ని మీరు ఇబ్బంది పెట్టుకోవడం కానేకాదు. ప్రపంచ ం అందిస్తున్న అన్నిటినీ ఇంద్రియాల సాయంతో, తెలివిగా వాడుకోమని. అలా వాడుకుంటే ప్రశాంతత, తద్వారా విజయం లభిస్తాయి.*

卍. ఒక క్రీడాకారుడు ఉన్నాడనుకోండి. అతని సామర్థ్యం, ఫిట్‌నెస్‌ అన్నీ ఒకేలా ఉన్నప్పటికీ, ఒకరోజు విజయం సాధిస్తాడు, మరుసటి రోజు చిత్తుగా ఓడిపోతాడు, ఆ మర్నాడు మామూలైన ఆటతీరును ప్రదర్శిస్తాడు. ఎందుకలా? అదే మైండ్‌ చేసే మేజిక్‌. మైండ్‌ ప్రశాంతంగా ఉంటే, ఉత్సాహంగా ఉంటే దేన్నైనా సాధించవచ్చు.

ప్రశాంతతను సాధించడమెలాగో భగవద్గీత చెబుతుంది. కేవలం మీకోసమే అనుకుని మీరు చేసే పనుల్లో రాణించలేకపోవచ్చు. ‘నేను’ అన్నదాన్ని అధిగమిస్తే మీకు కొత్త శక్తి వస్తుంది. ఉదాహరణకు ‘కేవలం నా ఆనందం కోసమే ఆడుతున్నాను’ అనుకునే క్రీడాకారుడి భవిష్యత్తు అక్కడితో ఆగిపోతుంది. అదే దేశం కోసం ఆడాలి అనుకుంటే వెంటనే అతడిలో కొత్త ఉత్సాహం వస్తుంది, ఏకాగ్రతతో ఆడతాడు, అతణ్ని విజయం వరిస్తుంది. ‘నాకోసం కాదు’ అనుకుని చూడండి ఏ పనిలోనైనా మీకు బాధ్యత పెరుగుతుంది, ఏకాగ్రత పెరుగుతుంది. భగవద్గీత చెప్పేది అదే.*

అసలు భగవద్గీత ఏం చెబుతుంది?
 • ✹ ధర్మాధర్మాల గురించి చెబుతుంది.
 • ✹ కర్తవ్యం గురించి చెబుతుంది.
 • ✹ నాగరికత అంటే కోరికలను తీర్చుకోవడం కాదు… అదుపులో పెట్టుకోవడమని చెబుతుంది.
 • ✹ ఆనందంగా జీవించడం ఎలాగో చెబుతుంది.
 • ✹ సుఖం… శాంతి… త్యాగం… యోగం… అంటే ఏమిటో చెబుతుంది.
 • ✹ ఏది శాశ్వతమో ఏది అశాశ్వతమో చెబుతుంది.
 • ✹ పాప పుణ్యాల వివరణ ఇస్తుంది.
 • ✹ ఆత్మ తత్త్వ నిరూపణ చేస్తుంది. స్వకల్యాణం కోసం కాక లోక కల్యాణం కోసం జీవించమని చెబుతుంది.
 • ✹ జ్ఞానం… మోక్షం… బ్రహ్మం… ఆధ్యాత్మం అంటే ఏమిటో చెబుతుంది.
 • ✹ ఎవడు పండితుడో ఎవడు స్థితప్రజ్ఞుడో చెబుతుంది.
 • ✹ ప్రతిఫలాపేక్ష లేకుండా కర్మ చేయడంలో ఉండే ఆనందం ఎంతో చెబుతుంది.
 • ✹ మంచి పనులు చేసేవాడికి లభించే శాశ్వత కీర్తి ఎంతో చెబుతుంది.
 • ✹ పరమాత్ముడికి ఎవడు ఇష్టుడో చెబుతుంది. ఆయన్ను చేరే మార్గాన్ని చూపిస్తుంది.
 • ✹ కర్మ, భక్తి, జ్ఞాన మార్గాల ద్వారా వేలు పట్టుకుని నడిపించి, మనిషిని దైవాన్ని చేస్తుంది.
 • ✹ నీలానే ఇతర ప్రాణికోటినీ ప్రేమించమని చెబుతుంది. అనారోగ్యకరమైన భావోద్వేగాలను నియంత్రిస్తుంది.
అందుకే భగవద్గీత సర్వమానవాళి కోసం.
అర్థం చేసుకున్నవారు ధన్యులు.నిన్ను నన్ను మన అందరి గురించి మాట్లాడుతుంది భగవద్గీత. మానవుడు ఎలా అభ్యున్నతి సాధించాలో చెబుతుంది.

గీత చదువుకో - నీ రాత మార్చుకో.....

రచన: కళ్యాణ్ 

19, అక్టోబర్ 2019, శనివారం

సన్యాసము మరియు వైరాగ్యము - వ్యత్యాసము - Sanyasamu Vairagyamu

వైరాగ్యము – సన్యాసము
వైరాగ్యము అంటే మమతానురాగముల నుండి భయముతో పారిపోవడము, సోమరిగా, నిర్వీర్యముగా, అర్థరహితముగా జీవించుట కాదు. జీవిత సమస్యల నుండి దూరముగా పారిపోవుట కాదు. నీవు ఎక్కడికి పారిపోయినను నీ సంసారము నీతో పాటే వస్తుంది (సంసారము మానసికము కనుక). వైరాగ్యము అంటే నిష్క్రియా పరమైనది కాదు.

వైరాగ్యము అనగానే గుర్తుకు వచ్చేది సన్యాసము:
సన్యాసము అనునది సంసార బాధలను భరించలేక వాటినుండి విముక్తి కొరకు స్వీకరించునది కాదు. కర్మ ఫలత్యాగము సన్యాసము. కర్తృత్వ భావన లేకుండా కర్మ చేయగలుగుట సన్యాసము. జీవిస్తూ జీవించని వాడిగా ఉండుట సన్యాసము. కర్మను చేయుటయందు కుశలత్వము కలిగియుండుట సన్యాసము. తామరాకుపై నీటిబొట్టులాగా సంసారము యందు మెలగగలుగుట సన్యాసము.

సన్యాసం : బాహ్యంగా అన్ని పనులు చేస్తూ, అంతరంగా మనసులో సమస్తాన్ని త్యజించడాన్నే ‘‘సన్యాసం’’ అంటారు. (భగవద్గీత)
వైరాగ్యం : ప్రతి పనిని చేస్తూ (ఆచరిస్తూ) దాని మీద అనురాగాన్ని మరియు మమకారాన్ని మనసులో వదిలి వేయడాన్ని ‘‘వైరాగ్యం’’ అంటారు. (భగవద్గీత)

రచన: కోటి మాధవ్ బాలు చౌదరి

10, జనవరి 2018, బుధవారం

ఋణానుబంధం అంటే అర్ధమేంటో మీకు తెలుసా ! - Runanubhandam

ఋణానుబంధం అంటే అర్ధమేంటో మీకు తెలుసా ! - Runanubhandam
ఎన్నటికీ వీడనిది ఋణానుబంధం

"పువ్వు తొడిమనుండి విడిపోతుంది, పండు చెట్టునుండి రాలిపోతుంది, కానీ ఎన్ని కష్టాలు ఎదురైనా తల్లిదండ్రులు మాత్రం తమ పిల్లలను విడిచిపెట్టరు’ అని మహాభారతం చెబుతోంది. పిల్లలపై తల్లిదండ్రులకున్న అనుబంధం ఎలాంటిదో కృష్ణుని ఎడబాటును భరించలేని యశోదానందుల హృదయావేదనను ఒక్కసారి తెలుసుకుంటే అర్థమవుతుంది.

శ్రీకృష్ణుడు మధురకు వెళ్ళినప్పుడు ఆ ఎడబాటును సహించలేక తల్లి యశోద దుఃఖసాగరంలో మునిగిపోయింది. దుఃఖంతో కుమిలిపోతున్న యశోదను చూసి నందుడు కూడా ’కన్నయ్య లేకుండా మేము బ్రతకలేం’ అని కన్నీరుమున్నీరు కాసాగాడు. అలాగే శ్రీకృష్ణుడు కూడా తల్లిదండ్రులను వదిలి మధురకు వచ్చినప్పుడు అవ్యక్తావేదనతో యశోదమ్మను తలచుకుంటూ ఉద్ధవునితో, "ఉద్ధవా! నాకన్నయ్య భోజనం చేస్తే గానీ నేను పచ్చి మంచినీళ్ళైనా ముట్టను’ అని మొండి పట్టుదలతో కూర్చొనే నాతల్లి యశోదమ్మను నేను మరువలేకున్నాను" అని చెబుతూ కృష్ణుడు విలపించసాగాడు.

కంసుని చెరాలనుంచి దేవకీ వసుదేవులను విడిపించిన తరువాత బలరామకృష్ణులు వారికి పాదాభివందనాలు చేసి, వారి పట్ల కృతజ్ఞతాభావాన్ని ఇలా వ్యక్తపరిచారు:
మాకు నిన్నాళ్ళు లేదయ్యె మరియు వినుడు
నిఖిల పురుషార్థ హేతువై నెగడుచున్న
మేనికెవ్వార లాఢ్యులు మీరు కారె
యా ఋణము దీర్ప నూరేండ్లకైన జనదు (దశమస్కంధం - పోతన భాగవతం).
’అమ్మా! నాన్నా! మేము ఇన్నాళ్ళూ మీ ప్రేమ, ఆప్యాయతలను పొందే అదృష్టానికి నోచుకోలేదు. ధర్మార్థ కామ మోక్షాలనే పురుషార్థాలు సాధించడానికి అవసరమైన ఈ దేహాన్నిప్రసాదించిన వారు మీరు. అలాంటి దుర్లభమైన మానవదేహాన్ని ఇచ్చిన మీ ఋణం తీర్చడానికి మాకు నూరేళ్ళైనా సాధ్యం ాదు.’

బలరామకృష్ణులు పలికిన మాటల వల్ల తల్లితండ్రుల స్థానం ఎంతటి మహోన్నతమైనదో మనం అర్థం చేసుకోవచ్చు. నిరంతరం తల్లిదండ్రులు మన చెంత ఉండడం వల్ల వారి విలువ ఏమిటో మనం గుర్తించలేకపోతున్నాం. అందువల్ల వారిపట్ల నిర్లక్ష్య వైఖరినీ, నిర్దాక్షిణ్యాన్నీ చూపుతున్నాం. తల్లిదండ్రులే ఇలలో ప్రత్యక్షదైవాలనీ, వారి ఋణం ఎన్ని జన్మలైనా తీర్చలేనిదనీ నిరూపించిన వినాయకుడు, శ్రీకృష్ణుడి జీవితాలు మనకు ఆదర్శం కావాలి.

రచన: కోటి మాధవ్ బాలు చౌదరి

27, ఆగస్టు 2017, ఆదివారం

దీపారాధన - వెలిగించవలసిన వత్తులు మరియు ఆధ్యాత్మిక జీవనం - How many threads are incorporated in Light Worship

దీపారాధన - వెలిగించవలసిన వత్తులు మరియు ఆధ్యాత్మిక జీవనం - How many threads are incorporated in Light Worship
నిత్యం దీపారాధన భారతీయుల సంప్రదాయం. ఉభయసంధ్యల్లో ఇంట్లో వెలిగించిన దీపం ఐశ్వర్యకారకం- అని ధార్మిక గ్రంథాలు బోధిస్తున్నాయి. 'ఏదైనా కోరిక తీరాలంటే, ఒక దీపాన్ని వెలిగించి- ఖర్జూరమో, ఎండుద్రాక్షో లేదో ఏదైనా ఫలమో నైవేద్యం పెట్టి నమస్కరించితే చాలు' అని ఆనవాయితీగా దీపారాధన కొనసాగుతోంది. ఇలా దీపారాధన చేయడంవల్ల ఏ ప్రయోజనమైనా పొందవచ్చు- అన్నది శాస్త్రోక్తి.
 • దీపారాధన చేయడానికి కొన్ని పద్దతులు ఉన్నాయి. ఎలాగంటే అలా చేయకూడదు. దీపరాధన చేసేముందు వత్తి వేసి తరువాత నూనె పొస్తూంటారు కాని అది పద్దతి కాదు, దీపారాధన చేసేటప్పుడు ముందుగా నునె పొసి తర్వాత వత్తులు వేయాలి.
 • వెండి కుందులు, పంచ లోహ కుందులు,ఇత్తడి కుందులు మంచివి. మట్టి కుందులు కూడా ఉపయోగించవచ్చు. స్టీలు కుందుల్లో దీపారాధన చేయరాదు. కుందులను కూడా రోజు శుభ్రంగా కడిగి ఉపయోగించాలి. అంతేగాని శుభ్రపరచకుండా వత్తులను మార్చడం పద్దతి కాదు.
జన్మ తేదీల రీత్యా... వెలిగించవలసిన వత్తులు

1. మార్చి 21 నుండి ఏప్రిల్‌ 20 వరకు - (5) పంచవత్తులు
2. ఏప్రిల్‌ 21 నుండి మే 20 వరకు - (7) సప్తవత్తులు
3. మే 21 నుండి జూన్‌ 20 వరకు - (6) షణ్ము వత్తులు
4. జూన్‌ 21 ఉండి జూలై 20 వరకు - (5) పంచముఖి వత్తులు
5. జూలై 21 నుండి ఆగస్టు 20 వరకు - (3) త్రివత్తులు
6 ఆగస్టు 21 నుండి సెప్టెంబరు 20 వరకు - (6) షణ్ముఖ
7. సెప్టెంబరు 21 నుండి అక్టోబర్‌ 20 వరకు - (7) సప్త వత్తులు
8. అక్టోబర్‌ 21 నుండి నవంబర్‌ 20 వరకు - (2) ద్వి వత్తులు
9. నవంబర్‌ 21 నుండి డిసెంబర్‌ 20 వరకు - (5) పంచమ వత్తులు
10. డిసెంబర్‌ 21 నుండి జనవరి 20 వరకు - (6) షణ్ముక వత్తులు
11. జనవరి 21 నుండి ఫ్రిబవరి 20 వరకు - (5) షణ్ముక వత్తులు
12. ఫిబ్రవరి 21 నుండి మార్చి 20 వరకు - (2) ద్వి వత్తులు

అదృష్ట సంఖ్యల రీత్యా వెలిగించవలసిన వత్తులు

1. 1.10.19 - 1 (ఏక లేదా ద్వాదశ వత్తులు)
2. 2.11.20 - 2 ( ద్వి వత్తులు)
3. 3.12.21 - 5 ( పంచమ వత్తులు)
4. 4.13.22 - 8 (అష్టమ వత్తులు)
5. 5.14.23 - 4 (చతుర్‌ వత్తులు)
6. 6.15.24 - 6 (షణ్ముఖ వత్తులు)
7. 7.16.25 - 9 (నవ వత్తులు)
8. 8.17.26 - 7 (సప్త వత్తులు)
9. 9.18.27 - 3 (త్రి వత్తులు)

నవరత్నములు ధరించని వారు వెలిగించవలసిన వత్తులు....

1. కెంపు - 1 ఏక వత్తి లేదా 12 ద్వా దశ వత్తులు
2. ముత్యము - 2 ద్వి వత్తులు
3. పగడము - 3 త్రి వత్తులు
4. జాతిపచ్చ - 4 చతుర్‌ వత్తులు
5. కనకపుష్యరాగం - 5 పంచవత్తులు
6. వత్రము - 6 షణ్ముఖ వత్తులు
7. ఇంద్రనీలము - 7 సప్త వత్తులు
8. గోమేధికము - 8 అష్ట వత్తులు
9. వైఢ్యూర్యము - 9 నవ వత్తులు

సకల శుభ కార్యములకు వెలిగించవలసిన వత్తులు

1. ఆరోగ్యము కొరకు - 1 ఏకవత్తి
2. మానసిక రోగములు నివారణకు - 2 ద్వి వత్తులు
3. వివాహ ప్రాప్తికొరకు - 3 త్రి వత్తులు
4. కుజ దోష నివారణకు - 3 త్రి వత్తులు
5. విద్యాప్రాప్తి కొరకు - 4 చతుర్‌ వత్తుల
6. ఉద్యోగ ప్రాప్తి కొరకు - 5 పంచమ వత్తులు
7. ఋణ బాధలు తీరుటకు - 6 షణ్ముక వత్తులు
8. వ్యాపారాభివృద్ధి కొరకు - 6 షణ్ముక వత్తులు
9. ఏలినాటి అష్టమ శని కొరకు - 7 సప్త వత్తులు
10. సర్వదోష నివారణ - 8 అష్టమ వత్తులు
11. సంతానప్రాప్తి కొరకు - 9 నవమి వత్తులు
12. అపమృత్యుదోష నివారణకు - 10 దశమ వత్తులు
13. ధనప్రాప్తి కొరకు - 12 ద్వా దశ వత్తుల
14. నాయకత్వము కొరకు - 14 చతుర్దవ వత్తుల

వెండి దీపాలతో దీపారాధన వలన కలిగే ఫలితాలు.....
1. వెండి ప్రమిదల్లో నేతితో కాని కొబ్బరి నూనెతో కానీ నువ్వుల నూనెతో కానీ పొద్దుతిరుగుడు నూనెతో దీపారాధన చేస్తే వారికి వారి ఇంట్లో వారికి అష్టనిధులు కలుగును.
2. గతపతిని లక్ష్మినారాయణ స్వామికి లలితాత్రిపుర సుందరీ దేవికి, రాజ రాజేశ్వరి అమ్మ వారికి సాల గ్రామములకు శ్రీ గాయత్రీమాతకు గాని, వెండి ప్రమిదల్లో వత్తులను వేసి దీపారాధన చేస్తారో వారు అను కున్న పనులన్నీ వెంటనే సకాలంలో పూర్తవుతాయి.

రచన: కోటి మాధవ్ బాలు చౌదరి


3, జులై 2017, సోమవారం

ఆధ్యాత్మిక యోగము - Spiritual Practice

ఆధ్యాత్మిక యోగము - Spiritual Practice
జీవితంలో అనుసరించవలసిన నియమాలగురించీ, సాధించవలసిన లక్ష్యాలగురించీ వివిధ అభిప్రాయాలు ఉన్నప్పటికీ వాటి సాధనకు పాటించే మార్గాన్నియోగము అని అంటారు. ప్రతి మనిషి తన జీవిత పరమార్థాన్ని చేరుకోవడానికి యోగులు వివిధ రకాలైన పద్ధతులను ఉపదేశించారు. వీటిలో ఏదైనా ఒక యోగాన్ని సాధన చేసేవారిని యోగి అని అంటారు. భగవద్గీత, యోగ సూత్రాలు, హఠయోగ ప్రదీపిక మరియు వీటన్నింటికీ మూల గ్రంథాలైన ఉపనిషత్తులు యోగం కోసం అంకితమైనవి. ఎవరైనా ఆధ్యాత్మిక లక్ష్యాన్ని (మోక్షం, సమాధి, లేదా నిర్వాణం)చేరుకోదలచిన వారు,
క్రింద పేర్కొన్న మార్గాలను అనుసరించ వచ్చు.
 • భక్తి యోగం (ప్రేమ మరియు భక్తితో కూడిన మార్గం)
 • కర్మ యోగం (విధులను సక్రమంగా నిర్వర్తించడం )
 • రాజ యోగం (ధ్యాన మార్గం)
 • జ్ఞాన యోగం (జ్ఞాన సముపార్జన)
ఒక మనిషి తన ఇష్టాన్ని బట్టి లేదా అర్థం చేసుకొనే శక్తిని బట్టి ఈ నాలుగింటిలో ఏదో ఒక మార్గాన్ని ఎంచుకొనవచ్చు. కానీ కొన్ని ఆధ్యాత్మిక సంస్థలు ఈ కలియుగంలో భగవంతునికి చేరువ కావడానికి భక్తి మార్గం కంటే మించిన మార్గం మరొకటి లేదని చెపుతుంటారు. ఒక మార్గాన్ని అనుసరించడం ద్వారా మరొక మార్గాన్ని అనుసరించకూడదని నియమమేమీ లేదు. ఉదాహరణకు జ్ఞాన యోగాన్ని శ్రద్ధగా ఆచరించడం ద్వారా పవిత్రమైన ప్రేమను కూడా సాధించవచ్చు. ధ్యాన యోగాన్ని అనుసరించేవారు తప్పని సరిగా కర్మ యోగం, జ్ఞాన యోగం మరియు భక్తి యోగ భావనల్ని ఇముడ్చు కోవాల్సి ఉంటుంది.

వివిధ యోగాల ఆచరణ గురించీ, వాటిలోని భేదాల గురించీ, వాటి మధ్యనున్న సమన్వయం గురించీ అనేక గ్రంథాలు, సూత్రాలు, అభిప్రాయాలు, ఆచారాలు ఉన్నాయి.

రచించినది: కోటి మాధవ్ బాలు చౌదరి

1, జులై 2017, శనివారం

మనసు - Mind, Heartstrings

మనసు - Mind, Heartstrings
Mind, Heartstrings, మనసు - గురించి తెలుసుకొని ఆనందించి జీవన విధి-విధానం లో మన పాత్రేమిటో తెలుసుకుందాం . --

మనసుకు రూపమంటూ లేదు. కాని, అది విశ్వమంతటా విస్తరిస్తుంది. రెక్కలు లేకుండానే అంబరవీధిలో ఎగిరిపోతుంది. పాదాలు లేకుండానే నేలమీద పరుగులు తీస్తుంది' అన్నాడో మహాకవి. నిజమే... రంగు, రుచి, వాసన ఏమి లేకపోయినా మనిషిని జీవించినంతకాలం నడిపించేది మనసే. అది తలచుకుంటే హిమోన్నత శిఖరాల మీద కూర్చోబెడుతుంది. లేదా అధఃపాతాళానికైనా తొక్కేస్తుంది. 'నేరం నాది కాదు, నా మనసుది' అంటే చెల్లదు. మనసు బుద్ధి చెప్పినట్లు నడుచుకోక తప్పదు.

మనసును అదుపులో ఉంచుకోగలిగితే మనిషి మహోన్నతుడు. లేకుంటే మహాపతితుడు. ప్రతి దినమూ మనసును సాధనతో ఆరాధనతో శుభ్రంగా, పవిత్రంగా ఉంచుకోక తప్పదు. మనసు మన అధీనంలో ఉండక పోవడానికి ప్రధాన కారణాలు- మన తిళ్లు, ఒత్తిళ్ళు. ఈ రెంటిమీద శ్రద్ధవహించడం అత్యవసరం. సాత్వికాహారం మనసును క్రమపద్ధతిలో నియంత్రించ గలుగుతుంది. ధ్యానం దాన్ని పవిత్రంగా ఉంచగలుగుతుంది. అప్పుడే ఏకాగ్రత పెరుగుతుంది. మానవ జీవన పయనంలో నేడు మానసిక ఒత్తిడి రాజ్యమేలుతోంది. ఈ ఒత్తిడికి బానిసైన మనిషి వివేకం, జ్ఞానం కోల్పోయి- ఉన్మాదిలా ప్రవర్తిస్తున్నాడు. మనుషుల్లో పెరుగుతున్న మానసిక రుగ్మతల వల్లనే దౌర్జన్యాలు, అత్యాచారాలు, ఆత్మహత్యలు, హత్యలు విశృంఖలంగా పెరుగుతున్నాయి.
మానసిక సమస్యలు, సంఘర్షణలు ఏదో ఒక కారణంవల్ల, పరిస్థితుల ప్రభావంవల్ల ఎదురైనా వివేచనతో, విజ్ఞతతో వాటిని అధిగమించే ప్రయత్నం చేయాలి.
మనసు తాలూకు ప్రవృత్తి తరంగంలా చంచలమైనది. దాని తేజస్సు అగ్నికన్న వేడైనది. దాన్ని అతిక్రమించడం పర్వతారోహణకన్న కఠినమైనది. అనంతమైనది. అనంతమైన సుఖదుఃఖాది భావాలు, అనుభూతులు మనసునుంచే ఆవిర్భవిస్తున్నాయి. మనసుది ఓ బాల్య చాపల్యం. క్షణికానందం, క్షణికావేశం, క్షణిక సంతృప్తి, క్షణిక రౌద్రం మొదలైనవన్నీ చంచల హృదయం దుర్లక్షణాలు. ఈ దుర్లక్షణాలను మనం దూరం చేసుకోవాల్సి ఉంటుంది.

మనసే జగత్కర్త. మనసే పురుషుడు. మనోనిశ్చయంవల్ల సంపాదితమయ్యేది మనసు తాలూకు ప్రతిబింబమే అవుతుంది. ఏకీకృత మనసుతో చేసే ఏ కార్యమైనా సఫలీకృతమవుతుంది. సత్ఫలమిస్తుంది. చివరికి బ్రహ్మ వరకు అన్నీ మనసు ద్వారా సాధించవచ్చునంటారు. మనసు దేనికి అనుసంధానమవుతుందో, కర్మేంద్రియాలు దానికి అనుగుణంగా స్పందిస్తాయి. విత్తనం నుంచి వృక్షం, లత, పుష్పం, ఫలం- ఇవన్నీ పుట్టినట్లు మనసునుంచే ప్రేమ, శాంతం, క్రోధం, ద్వేషం మొదలైనవన్నీ పుడుతున్నాయి. అయితే మనసులోని ఆలోచనలు సక్రమంగా ఉన్నంత వరకు కర్మలు కూడా సక్రమంగా, సధార్మికంగా ఉంటాయి. మనసు గతి తప్పితే మనిషికి దుర్గతే! మనసు అమలినంగా ఉంటే లోకమంతా పవిత్రంగానే కనపడుతుంది. తనను గురించి మనసులో ఆలోచించేవాడు మానవుడు, అందరి గురించి ఆలోచించేవాడు భగవంతుడు. మనసుకు, సత్వ-రజ-స్తమో గుణాలని మూడు గుణాలున్నాయి. సత్వగుణం మంచిమనిషి లక్షణం. మిగిలిన రెండు గుణాలూ మనోదోషాలు. అంటే మనసును పదిమందిలోనూ దూషింపజేసేవి, వ్యాధులకు కారణం అయ్యేవి. మానసిక ఆరోగ్యానికి, ఆధ్యాత్మికతకు కారణభూతమైన సత్వగుణాన్ని సర్వదా పెంపొందించుకునే ప్రయత్నం చేయాలి.

మనోవేగాన్ని మించిందిలేదు. అయితే మనసుకంటె శక్తిమంతమైంది బుద్ధి. దానికన్న శక్తిమంతమైంది ఆత్మ. ఆత్మ, బుద్ధి ప్రేరణతో మనసు సద్భావనా ప్రవాహంలో ప్రయాణిస్తూంటుంది. ధర్మాధర్మాలకు, బంధమోక్షాలకు మనసే కేంద్రం. 'ఈ మనసు ప్రమధనశీలమైంది. అంటే, క్షోభ కలిగిస్తుంది. ఎంత మొండిదో, అంత బలవంతమైంది. దీన్ని అధీనంలో ఉంచుకోవడమంటే గాలిని గుప్పెటలో పట్టుకున్నంత కష్టతరమైంది. అయితే అభ్యాసం, వైరాగ్యం ద్వారా మాత్రమే మనసును స్వాధీనంలో ఉంచుకోవచ్చు' అంటాడు కృష్ణపరమాత్మ భగవద్గీతలో.

మనసనేది ఈ నేలమీద పుట్టిన ప్రతి మనిషినీ ప్రభావితం చేస్తుందన్నది అక్షర సత్యం. మనసు మనిషిచేత తప్పుచేయించిందీ- అంటే, వెంటనే ఆ తప్పు తెలుసుకుని పశ్చాత్తాపం కలగజేయడమూ ఆ మనసు పనే. అప్పుడే అది నిజమైన పథనిర్దేశిక, దిక్సూచిక అనిపించుకుంటుంది.

జితేంద్రియుడైనవాణ్ని, విరాగిని, జ్ఞానిని, అనుభవశీలిని, సాధకుణ్ని మనసు ఏ విధంగాను ప్రలోభపెట్టలేదు. నీరు పల్లంవైపు ప్రవహించినట్లే, మనసు చెడువైపే మొగ్గుతుంది. అప్పుడు మనసును పరిపరివిధాల చరించకుండా నిరోధించాలి. నియంత్రించాలి. మనసు రెండు విధాలు- శుద్ధ మనసు, కల్మష మనసు. కామసంకల్పంతో నిండింది కల్మష మనసు. కామవాసనా రహితమైనది శుద్ధ మనసు. అనుచితమైన కోరికలకు బానిసవుతున్న మనసును అదుపులో పెట్టుకోవలసి ఉంటుంది. ఏ విషయ వాసనాసక్తీలేని మనసు ముక్తి పొందడానికి అర్హత సంపాదిస్తుంది. ఆధ్యాత్మిక చింతనను స్వచ్ఛంగా ఆహ్వానిస్తుంది. మనసు కవ్విస్తే, మనిషి తలొగ్గితే అన్నీ అనర్థాలే!

ఆదిశంకరులన్నారు- 'నా మనసనే కోతి మోహమనే అడవిలో సంచరిస్తోంది. డబ్బు, కోరికలనే చెట్లకొమ్మలపైన ఎగురుతోంది. ఈ కోతిని అధీనంలో ఉంచుకో ప్రభూ!'... ఈ ఆవేదన సకల మానవజాతి ఆవేదన. కాముడి బారినుంచి బ్రహ్మ రుద్రేంద్రాదులు కూడా తప్పించుకోలేక భంగపడ్డారు. అయితే మానవజాతికి ఉన్న గొప్ప అవకాశమేమంటే- మనసును సర్వదా నిర్మలంగా ఉంచుకోవడానికి భగవన్నామస్మరణం చేయడం. ఈ కలియుగంలో మనసును ముక్తిమార్గాన నడిపించేందుకు శంకర భగవత్పాదులే చెప్పారు.- 'భజగోవిందం' అని అంతకుమించిన ధన్యోపాయం లేదు. మానవుడు ఇదొక్కటి ఆచరణలో పెడితే చాలు, తెరుచుకుంటాయి మోక్షద్వారాలు!

- చిమ్మపూడి శ్రీరామమూర్తి @ ఈనాడు దినపత్రిక

రచించినది: కోటి మాధవ్ బాలు చౌదరి

20, జూన్ 2017, మంగళవారం

మానవ జీవన స్తంభాలు - Four pillars of human life

మానవ జీవన భవన స్తంభాలు - Four pillars of human life

లోకంలో ఎవరైనా ఇల్లు కట్టుకోవాలంటే, నాలుగు వైపులా నేలలో పునాదులు తీసి, మొదట స్తంభాలు నిర్మించాలి. ఆ స్తంభాలపైన మాత్రమే ఇల్లు కట్టుకోవాలి. ఇది గృహ నిర్మాణ విషయంలో ప్రాథమిక సత్యం. అలాగే మానవుని జీవనం కూడా ఒక భవనంలాంటిదే. అది నూరేళ్లూ చలించకుండా, ఆరోగ్యంగా, ఉండాలంటే నాలుగు స్తంభాలు తప్పనిసరి. ఆ స్తంభాలే ధర్మార్థ కామమోక్షాలు. ఈ నాలుగింటి గురించి వివరించడానికే వేదాలు, ఉపనిషత్తులు, పురాణాలు, ఇతిహాసాలు, కావ్యాలు... ఒక్క మాటలో చెప్పాలంటే సమస్త విశ్వసాహిత్యం నేటికీ అంకితమై ఉంది. ఈ నాలుగు విషయాలూ జటిలంగా, గంభీరంగా కనబడినంత మాత్రాన వాటి గురించి తెలుసుకోవడం సామాన్యులకు అసాధ్యమేమీ కాదు. మనసుపెట్టి ఒక్కసారి వీటిలో ఉన్న అసలు సంగతి ఏమిటో గ్రహించడానికి ప్రయత్నించాలి. అప్పుడు జీవనం అమృతమయభావనం అవుతుంది.
 1. 'ధర్మం' అనే మాటకు విశేషార్థాలు ఎన్నో ఉన్నా- స్థూలంగా చెప్పాలంటే 'సదాచారమే' అంటే మంచి నడవడి అనేదే ధర్మం. ఇంతకన్న మంచి నిర్వచనం మరొకటి లేదు. మనిషి జీవితం కేవలం వైయక్తిక కర్మలతో మాత్రమే ముడివడి ఉండదు. ప్రతిమనిషికీ అతని జన్మకు కారణమైన పూర్వుల వారసత్వం ఉంటుంది. కుటుంబ జీవనం ఉంటుంది. సామాజిక బాధ్యతలు ఉంటాయి. తాను పుట్టినందుకు తన వంశానికి, సమాజానికి, వారసులకు హితాన్ని కలిగించే కర్తవ్యాలు సాక్షాత్కరిస్తాయి. వీటన్నింటినీ నిర్మల గుణాలతో ఆచరించి చూపడమే ధర్మం. ఇందులోనే చదువు, సంస్కారం, ఓర్పు, నేర్పు, దయ, దాక్షిణ్యం, సమభావం లాంటి గుణాలన్నీ అంతర్భవిస్తాయి.
 2. 'అర్థం' అంటే ప్రయోజనం. లోకంలో మానవులు చేసే ప్రతిపనికీ ఒక ప్రయోజనం ఉండి తీరుతుంది. అందుకే 'ప్రయోజనం అనేది లేకుండా వెర్రివాడు కూడా పనిచేయడు' అని పెద్దలంటారు. ఈ ప్రయోజనం ఎలాంటిదై ఉండాలి అన్నదే మనిషికి ఒక పరీక్షలాంటిది. లోకంలో ఏ పని కావాలన్నా డబ్బు ప్రధానం. అందుకే 'అర్థం' అంటే 'డబ్బు' అని వ్యవహారంలోకి వచ్చి చేరింది. మంచిపనులు చేయడంకోసం డబ్బును సంపాదించాలి, సంపాదించిన డబ్బుతో మంచి పనులు చేయాలి అనేదే అర్థానికి గల పరమ ప్రయోజనం. అందుకే పెద్దలు ధర్మాన్ని చక్కగా ఆచరిస్తూ డబ్బు సంపాదించాలని అంటారు. ఇది నిజంగా వేదవాక్కు.
 3. 'కామం' అంటే కోరిక. శృంగారం విషయంలో పొందే అనుభూతికి ఈ పేరును పర్యాయపదంగా వ్యవహరిస్తున్నా, నిజంగా 'కామం' అంటే మనస్సులో కలిగే సంకల్పం అనేదే శబ్దార్థం. ఈ కోరిక ఎలా ఉండాలో తెలుసుకోవాలంటే మన ఇతిహాసాలను బాగా చదవాలి. కామం విషయంలో రావణుడిలా ఉండకూడదని రామాయణం చెబుతుంది. దుర్యోధనునిలా ఉండకూడదనీ, కీచకునిలా మారకూడదనీ మహాభారతం చెబుతోంది. అంటే కామానికీ ఒక ధర్మం ఉండాలి అనీ, ఆ ధర్మాన్ని అనుసరించకపోతే 'కామం' పిశాచంగా మారుతుందే గానీ- మనశ్శాంతిని ఏ మాత్రం ఇవ్వలేదనేది తాత్పర్యం. రావణ దుర్యోధన కీచకాదులకు తుదకు పట్టిన గతిని పరికిస్తే ఈ విషయంలోని మర్మం తెలుస్తుంది.
 4. 'మోక్షం' అనేది అన్నింటికన్న చివరిది. ఇది మనిషికి బతికి ఉండగానే లభిస్తుందని కొందరూ, మరణానంతరమే సంప్రాప్తిస్తుందని కొందరూ అంటారు. ఈ నిర్వచనాలు ఎలా ఉన్నా, అన్ని బంధాలనుంచీ విముక్తం కావడమే 'మోక్షం' అని చెప్పడం సముచితం. మనిషికి పుట్టిననాటినుంచి ప్రతి విషయంలోనూ బాధ్యతలూ బంధాలూ తాళ్లవలె, గొలుసులవలె బంధిస్తాయి. అంటే ప్రతిమనిషీ కనబడని తాళ్లతో, గొలుసులతో ఎప్పుడూ బంధితుడై ఉంటాడే కాని, స్వేచ్ఛగా ఉండలేడు. ఇది సమాజ ధర్మం. కనుక సంసారంలోనే ఉంటూ మానసికంగా దేనికీ చిక్కకుండా ఉండే రాజయోగి జనకునిలా జీవించడం మనిషి నేర్చుకోవాలి. అప్పుడు ఏ బరువులూ ఏ బాధ్యతలూ మానవుణ్ని వశపరచుకోలేవు.
సకలహితాన్ని కోరే ధర్మం, ఆ ధర్మం ద్వారా సంపాదించే అర్థం, ఆ అర్థాన్ని ధర్మంతో అనుసంధానించి అనుసరించే కామం- చివరికి ఏ బంధాలకూ లొంగని మోక్షానికి దారితీస్తాయి. ఇదే నాలుగుస్తంభాల మీద కట్టుకునే మానవ జీవన భవన దృశ్యం.

రచించినది: కోటి మాధవ్ బాలు చౌదరి

శివసిద్ధి : Shiva Siddhi

శివసిద్ధి : Shiva Siddhi
ధ్యాత్మిక జీవితానికి అంకితమైన అనేకమంది ద్వంద్వ భావాలతో సందేహాలతో సతమతమవుతుంటారు. ముఖ్యంగా 'నేను' అనే భావననుంచి, దానికి సంబంధించిన 'అహంకారం'నుంచి బయటపడేందుకు బహువిధాలుగా ప్రయాస పడుతుంటారు. మాయ ఎంత బలీయమైనదంటే- ఒక్క క్షణంలోనే చంచలత్వాన్ని మనసులోకి ప్రవేశపెట్టేస్తుంది. అయోమయం ఆవహింపజేస్తుంది. మహాత్ములు సైతం తమ సాధనా కాలంలో ఈ దురవస్థలతో బాధపడినవారే.

సాక్షాత్తు శివాంశ సంభూతునిగా చెప్పుకొనే ఆదిశంకరులకూ ఇలాంటి అవస్థ ఒకసారి కలిగింది. మార్గంలో ఒక చండాలుడు ఎదురైనప్పుడు ఆదిశంకరులు ఏవగింపుతో 'తప్పుకో... తప్పుకో...' అని మందలించగా, అతడు నవ్వుతూ 'స్వామీ! తమరు దేన్ని తప్పుకోమంటున్నారు? అశాశ్వతమైన ఈ శరీరాన్నా, అనంతస్వరూపమైన ఆత్మనా?' అని ప్రశ్నించాడు. తక్షణం ఆదిశంకరుల్లో అజ్ఞానపు తెర మటుమాయమైంది. తదనంతర కాలంలో ఆయనలోంచి శివతత్వం గంగా తరంగాలుగా ప్రవహించింది. శివానందలహరి, సౌందర్యలహరి, భజగోవిందం వంటి అనితర సాధ్యమైన రచనలను భక్త లోకానికి అందించారు.

'శివాజ్ఞ లేనిదే చీమైనా కుట్టదు' అనటంలోని ఆంతర్యం- చీమనుంచి బ్రహ్మవరకు సర్వం శివాజ్ఞకు లోబడి ఉంటుందనే. సమస్త విశ్వమూ, సృష్టిలోని అణువణువూ శివమయమే. శివం కానిది 'శవ'మంటారు జ్ఞానులు. అంటే మృతపదార్థమని అర్థం. శివమే సత్యం, శివమే సుందరం, శివమే నిత్యం. శివమే అనంతం. శివమే జ్ఞానం. శివమే చైతన్యం. శివమే సర్వజగత్తులకు మూలాధారం. అనేక లక్షల జన్మల అనంతరం లభించే మానవజన్మ, ముక్తి సోపానానికి ముందుమెట్టు లాంటిది. దీన్ని సద్వినియోగం చేసుకోవాలంటే శివభక్తిని వదలకూడదు.

శివానందలహరిలో ఒక శ్లోకముంది. సారాంశం ఏమిటంటే- శివుని పేరు పలికే నాలుకే నాలుక, శివుని దర్శించే కన్నులే కన్నులు, శివుని పూజించే చేతులే చేతులు. శివుని సదా స్మరించేవాడే ధన్యుడు.

పరిపూర్ణ జ్ఞానస్థితికి చేరుకున్న ఆదిశంకరులను 'నీవెవరు?' అని అడిగినప్పుడు- 'చిదానంద రూపం శివోహం శివోహం'- నేను చిదానంద స్వరూపుడనైన శివుణ్ని. మిగతా మరేమీ కాను అని ఆత్మస్థితిలో చెప్పగలిగారు. అదే 'శివసిద్ధి'. అంటే, సాధకుడు అనేక జన్మలనుంచి అనుభవిస్తున్న అజ్ఞానపు పొరల్ని ఒక్కొక్కటిగా చీల్చుకుంటూ బయటికి వచ్చి, తనను తాను చూసుకున్నప్పుడు, తాను ఆత్మననీ, అనగా సాక్షాత్తు శివస్వరూపమని గ్రహిస్తాడు. పూజలు, అర్చనలు, ప్రార్థనలు, ఉపవాసాలు, తపస్సులు, గురుశుశ్రూషలు- ఇవన్నీ ఈ అత్యున్నత స్థితిని అందుకోవటానికే.

శివానుగ్రహం అత్యంత సులభతరం. అందరికీ అందుబాటులో ఉంచటానికే- బిల్వార్చన, రుద్రాక్షధారణం, విభూతి లేపనం, అభిషేకంవంటి అతి సామాన్య విధానాలను పరమశివుడు భక్తుల కోసం ఏర్పరచాడంటారు.

జీవితకాలంలో మన ప్రతి చర్యనూ శివారాధన భావనతో ఆచరించడానికి మనసును అనుక్షణం హెచ్చరిస్తూ, అప్రమత్తంగా ఉంచుతుండాలి. అప్పుడు మనం సదా శివసాన్నిధ్యంలో ఉన్నట్లే. క్రమంగా అదే మన ఆత్మకు శివసిద్ధిని కలిగిస్తుంది. అదే పరమపదం.

రచించినది: కోటి మాధవ్ బాలు చౌదరి

11, జూన్ 2017, ఆదివారం

విజయానికి ఆధ్యాత్మిక సూత్రాలు - Devotional ways to success

విజయానికి ఆధ్యాత్మిక సూత్రాలు - Devotional ways to success
ప్రతివారికీ ఒక సమున్నత లక్ష్యం ఉండాలి. దానిని సాధించేందుకు తగిన సాధన సంపత్తిని బలపరచుకోవాలి. అయితే ఆ లక్ష్యం స్వార్థపూరితమైనది కాకుండా, వ్యక్తిని నియంత్రించి విశ్వహితం కలిగించేదిగా ఉండడం సముచితం.

జీవితంలో ఏ రంగంలో విజయం సాధించాలన్నా కావలసినవి ఏమిటి? ఈ విషయమై అనుభవజ్ఞులు, మేధావులు చాలా సూచనలు చేయడం, చిట్కాలు చెప్పడం మామూలే.
మన సనాతన గ్రంథాలలో - కార్యదక్షత, కర్మశీలతపై ఎంతో అధ్యయనంతో ఆచరణయోగ్యమైన సూత్రాలను సాధన రూపంలో అందించారు.

ఒక్కసారి రామాయణాన్ని పరిశీలిస్తే నిలువెత్తు ఆదర్శాలు కోకొల్లలుగా కనిపిస్తాయి.
బుద్ధిమంతుడు, మహావాగ్మి, కార్యదక్షుడు, బలశాలి - అయిన హనుమంతుడు మనముందుంటే చాలు... కార్యసాఫల్యానికి కావలసిన లక్షణాలు అవగతమవుతాయి.

బుద్ధిర్బలం యశోధైర్యం
నిర్భయత్వం అరోగతా |
అజాడ్యం వాక్పటుత్వంచ
హనుమాన్‌ స్మరణాద్ధవేత్‌|| -

అన్నారు పెద్దలు. దీనిని మంత్రంలా, భజనలా దర్శించడంతో సరిపుచ్చకూడదు. హనుమంతుని ప్రవర్తన ద్వారా మనం గమనించి, అలవరచుకోవలసిన లక్షణాలివి... అని అసలైన అంతరార్థం.

(1) మొదట - సముద్ర లంఘనానికి సిద్ధపడినప్పుడు, ''ఈ సముద్రాన్ని నేను అవలీలగా దాటుతాను. పనిని సఫలం చేసుకువస్తాను'' అని వానరులకు అభయమిచ్చాడు. దీనిద్వారా, ఒక పనికి మొదట కావలసినది 'ఆత్మ విశ్వాసం' అని చాటి చెప్పాడు.
(2) సముద్ర లంఘన సమయంలో మొదట ఎదురైనది మైనాక పర్వతం. తన శిఖరాలపై కాసేపు విశ్రమించి ఆతిథ్యం స్వీకరించమన్నది. ఏనాడో హనుమంతుని తండ్రి వాయుదేవుని సహాయం వల్ల క్షేమంగా సముద్రంలో ఉన్నాడు మైనాకుడు. అందుకు కృతజ్ఞతగా సహకరించే అవకాశం ఇప్పుడు వచ్చిందని, వాయు తనయునికి ఆతిథ్యమిచ్చి తన ప్రేమను ప్రకటించడానికి సిద్ధపడ్డాడు. (ఇది గమనిస్తే - ఒక వ్యక్తికి కృతజ్ఞత ఎంత అవసరమో తెలుస్తుంది. సహకరించినవాని పట్ల మాత్రమే కాక, వారి తరువాతి తరం వారికి కూడా కృతజ్ఞత ప్రకటించాలని, ఆ అవకాశం కోసం ఎదురు చూస్తున్న ఈ సంస్కారం ఎంత గొప్పది!)
కానీ 'అనుకున్న పని నెరవేరే వరకు విశ్రమించను'- అని ఆదరంగా చెప్పి, హనుమంతుడు ముందుకు సాగాడు. దీని ద్వారా తెలుసుకోవలసినది - విజయానికి రెండవ సూత్రం 'అవిశ్రాంత ప్రయత్నం'.
(3) అటు తరవాత, సురస అనే శక్తి అడ్డుకొని తన నోటిలోనికి ప్రవేశించమని, అది దేవతల ఆజ్ఞ అని చెప్పగా - యుక్తితో అల్పాకారం దాల్చి ప్రవేశించి వెలికి వచ్చాడు. ఇక్కడ ప్రకటించింది- వినయాన్నీ, యుక్తిని. ఎదురైన అడ్డంకిని 'యుక్తి'తో ఎదుర్కొనే లక్షణం ఇందులో గోచరిస్తుంది.
(4) ఆ పిమ్మట - 'సింహక' అనే రాక్షసి పట్టు నుండి బలిమితో బయటపడి లంకను చేరాడు. అక్కడి లంకిణికి బుద్ధి చెప్పాడు. ఇక్కడ 'శక్తి'ని ప్రదర్శించి అవాంతరాలను అధిగమించాలి- అనే పాఠం ఉంది.

ఇలా ఆత్మవిశ్వాసాన్నీ, శ్రద్ధనీ, యుక్తినీ, శక్తినీ విజయసోపానాలుగా మనకు నేర్పించిన ఆచార్యుడు హనుమ.

ఈ సందర్భంలో హనుమను కీర్తిస్తూ దేవతలు చెప్పిన మాటలు - ధృతిఃదృష్టిః మతిః దాక్ష్యం స్వకర్మసు నసీదతి.

-ఇది వాల్మీకి చెప్పిన అద్భుతమైన విజయసూత్రం.

1. ధృతి, 2. దృష్టి, 3. మతి, 4. దాక్ష్యం - ఈ నాలుగు ఉన్నవారు తమ పనిలో విజయాన్ని సాధించి తీరతారు.

1. ధృతి - పట్టుదల. ఎట్టి పరిస్థితులలోనూ సడలని ప్రయత్నమే ధృతి.
2. దృష్టి - ఏకాగ్రత, పనియొక్క పరిపూర్ణతను ముందుగా దర్శించగలగడం. దీనినే దార్శనికత అనవచ్చు.
3. మతి - బుద్ధిబలం - ప్రణాళిక రచన (ప్లానింగ్‌) చక్కగా ఆలోచించడం.
4. దాక్ష్యం - (దక్షత) సమర్థత. పనికి తగిన శరీర, బుద్ధుల పనితీరు.
- ఈ నాలుగూ ఎవరికి ఉంటాయో విజయం వారినే వరిస్తుంది.

లంకలో రాక్షసుల కంటపడకుండా తనని తాను తగ్గించుకొని తిరిగి అన్వేషణ కార్యంలో లీనమయ్యాడు హనుమ. 'అనువుగాని చోట అధికులమనరాదు' అన్న వేమన సూక్తికి ఇది ఉదాహరణ. తనని తాను ఎక్కడ పూర్తిగా బైటపెట్టుకోవాలో, ఎక్కడ ఎంత మరుగుపరచుకోవాలో తెలియాలి. అహంకారంతో అన్నిటా తన పూర్తి బలాన్ని ప్రకటించుకుని గుర్తింపు పొందాలనే తాపత్రయం పనికిరాదని ఇందులో పాఠం.

అన్వేషణలో భాగంగా అంతఃపురంలో స్త్రీలలో సీతకోసం చూస్తూ సాగుతున్న మారుతి - ''పరస్త్రీలను నిద్రాస్థితిలో మైమరచి ఉండగా చూడడం తగునా?''- అని ప్రశ్నించుకున్నాడు. తిరిగి, తనను తాను విశ్లేషించుకొని ''స్త్రీని స్త్రీలలోనే వెతకాలిగనుక, అంతఃపురంలో అన్వేషిస్తున్నాను. పైగా నా దృష్టి అన్వేషణాత్మకమే కానీ, వికారంతో కూడినది కాదు'' అని తన హృదయాన్ని తాను దర్శించుకున్నాడు. కార్యసాధకుడు ఏ వికారాలకు లోనుకాని ధీరత్వాన్ని కలిగి ఉండాలని ఇక్కడి పాఠం. అంతేకాదు- ''ఆత్మ పరిశీలన'' ముఖ్యం అనే అంశం... ఏ విజయంలోనైనా 'సచ్ఛీలత' (క్యారెక్టర్‌) చాలా ముఖ్యం. మన మనస్సుని మనం విశ్లేషించుకొని నిష్పాక్షికంగా మనల్ని మనం గమనించుకుంటే చాలు.

పై గుణాలతోపాటు, ఉత్సాహం, సాహసం, ధైర్యం, ఉద్యమం (ప్రయత్నం) విజయానికి అవసరం- అని ప్రాచీన గ్రంథాలు చెబుతున్నాయి.

(అతి) నిద్ర, కునుకుపాటు, బద్ధకం, ఉద్రేకం, వాయిదాలు వేసే మనస్తత్వం (నిద్రా, తంద్రా, భయం, క్రోధం, ఆలస్యం, దీర్ఘసూత్రతా) ఉన్నచోట విజయం లభించదు - అని కూడా ఋషుల మాట. పవిత్రతతో కూడిన కార్యదక్షత మాత్రమే విజయానికి మూలభూమిక.

రచించినది: కోటి మాధవ్ బాలు చౌదరి