నూతన వ్యాసములు:
latest

728x90

header-ad

468x60

31, మార్చి 2020, మంగళవారం

ఆత్మజ్ఞానంతో చింతలు దూరం, "గీతామృతం" సదా అనుసరణీయం - Athmaganamtho Chinthulu Dooram

ఆత్మజ్ఞానంతో చింతలు దూరం, "గీతామృతం" సదా అనుసరణీయం - Athmaganamtho Chinthulu Dooram
ఆత్మజ్ఞానంతో చింతలు దూరం - గీతామృతం
ఆఫీసులో కిందిస్థాయి ఉదోగికి ఏదైనా కష్టం వస్తే.. తన పైఅధికారిని కలవడం సహజమే. అదేవిధంగా జీవితంలో కష్టాలు, అవరోధాలు ఎదురైనపుడు జ్ఞానవంతుడి దగ్గరకు వెళ్లి సలహా తీసుకోవడం అందరూ చేయాల్సిన పని. సజ్జనులు, జ్ఞానవంతుల సాంగత్యంతో శారీరక, మానసిక స్థాయిలోని క్లేశాలను దూరం చేసుకునే స్థితికి చేరుకోగలం. అర్జునునికి కలిగిన గొప్ప చింతను తొలగించడానికి జగద్గురువైన శ్రీకృష్ణుడు నేరుగా అతడికి ఆత్మజ్ఞానాన్ని బోధించాడు.
  • ‘అర్జునా! ఆత్మ ఎటువంటి ఆయుధాలతో ఛేదింపబడదు, అగ్నిచే కాలిపోదు, నీటితో తడిసిపోదు, వాయువుచే ఎండిపోదు’’ (భగవద్గీత 2.23) 
  •  ‘‘ఆత్మను ఛేదించడం గాని, కరిగించడం గాని, దహించడం గాని, ఎండిపోయేలా చేయడం గాని అసాధ్యం. అది నిత్యమైనది, సర్వత్రా వ్యాపించి ఉండేది, మార్పు రహితమైనది, కదలనిది, సనాతనమైనది’’ (భగవద్గీత 2.24). 
అంటే మనిషి ఆత్మజ్ఞానాన్ని తెలుసుకొన్నప్పుడే దేహమనోబుద్ధి స్థితుల కంటే ఎత్తుకు ఎదుగుతాడు. ఆత్మస్థితిలోకి చేరినవాడికి బుద్ధి చురుకవుతుంది. మానసికచింత తగ్గుతుంది. శారీరక క్లేశంపై భయం దూరమవుతుంది.

శరీరాన్ని సుఖపెట్టి మనిషి సాధించేది ఏదీ ఉండదు. సుఖం కావాలనుకునేవాడు అతి త్వరలో రోగి కావడం అందరి అనుభవంలోనిదే. అట్టి వ్యక్తి జీవితంలో ఏదీ సాధించలేడు. పుట్టిన శరీరం గిట్టక తప్పదు. ఒక శరీరాన్ని విడిచిన జీవుడు మళ్లీ జన్మించక తప్పదు. కాబట్టి శారీరక స్థాయిలో గాని, మానసిక స్థాయిలోగాని వర్తించక బుద్ధిమంతుడు ఆత్మస్థాయిలో నిలిచి విజయం పొందుతాడు. పదుగురికి లాభం చేస్తాడు. స్వధర్మ నిర్వహణ గావిస్తాడు.
‘‘ఆత్మస్థితి అంటే మాకు సంబంధించినది కాదులేండి’’ అని అందరూ నవ్వుతూ ఉంటారు. కాని ఆ స్థితికి రానిదే నిజమైన వ్యక్తి, వ్యక్తిత్వం మీలో రూపొందదనేది అక్షరసత్యం. నీ గురించిన పూర్తి ఎరుక, నీలో కలుగుతున్న ఆలోచన స్రవంతి, నీ బుద్ధికి పదును పెట్టే సంకల్పం, ఇతరుల శక్తిని గుర్తించడం, వారిని నీతో సమానులుగా భావించడం ఇవన్నీ ఆత్మదర్శన లక్షణాలే. ఎవ్వరి దగ్గరనైతే ఈ లక్షణాలు అత్యున్నత స్థాయిలో ఉంటాయో వారే నాయకులై విరాజిల్లుతారు.
క్షత్రియుడికి యుద్ధమనేది స్వధర్మం, విద్యుక్తధర్మం. ఈ జగత్తులో అత్యంత కష్టమైన కార్యం యుద్ధం చేయడం. ఆ కార్యంలో ఏ క్షణమైనా ప్రాణం పోవచ్చు. ఏ క్షణంలో అయినా విజయం కలగవచ్చు. అంతటి మానసిక ఒత్తిడిలో కర్తవ్యం నిర్వర్తించాలి. అయితే యుద్ధరంగంలో మరణించేవాడికి స్వర్గప్రాప్తి కలుగుతుందని శాస్త్రవచనం. ఇక అతడు యుద్ధంలో జయిస్తే రాజ్యభోగం లభిస్తుంది. అలాకాకుండా రణరంగం నుంచి ప్రాణభయంతో పలాయనం చిత్తగిస్తే అపకీర్తి మిగులుతుంది. అందుకే సుఖదుఃఖాలను, లాభనష్టాలను, జయాపజయాలను సమానంగా చూస్తూ యుద్ధం చేయమని కృష్ణభగవానుడు అర్జునుని ఆదేశించాడు (భగవద్గీత 2.38).

భగవద్గీత నుంచి మనిషి నేర్చుకోవాల్సింది ఏమిటంటే.. ఒక్క విజయంతోనే నీ కర్తవ్యం పూర్తయిందని భావించవద్దు. మరిన్ని విజయాలు సాధించే దిశగా ముందుకు సాగాలి. అటువంటి వ్యక్తి నిజంగా ఆత్మస్థితిలో ఉన్నవాడే అవుతాడు. ప్రతి అపజయానికీ మరింత పదును తేలుతాడు. ప్రతి కష్టం నుంచి మంచి పాఠం నేర్చుకుంటాడు. ప్రతీ ఎదురీతకు అనుభవంతో పండిపోతాడు. అలాగే ప్రతి విజయానికీ ఆత్మబలం పెంచుకుంటాడు. అందరి చేయూతను అర్థం చేసుకుంటాడు. గొప్ప నాయకుడై తరతరాలకు ఆదర్శనీయుడవుతాడు.

సంకలనం: (భగవద్గీత యథాతథము అధారంగా) డాక్టర్‌ వైష్ణవాంఘ్రి సేవక దాసు అంతర్జాతీయ కృష్ణచైతన్య సంఘము (ఇస్కాన్‌). ఈ-మెయిలు: vaishnavanghri@gmail.com

« PREV
NEXT »