ఆధ్యాత్మిక జీవనం, సాంస్కృతిక ఔన్నత్యమ్ - Adhyatmika Jivanam - Spiritual life

0
ఆధ్యాత్మిక జీవనం, సాంస్కృతిక ఔన్నత్యమ్ - Adhyatmika Jivanam - Spiritual life
ఆధ్యాత్మిక జీవనం
: ఆధ్యాత్మిక జీవనం :
వేదభూమి, పుణ్యభూమి, కర్మభూమిగా పేరు పొందిన భరతభూమి, భారతీయ సంస్కృతి, నాగరికతలు ఎంతో ఉత్కృష్టమైనటువంటివి. ప్రపంచంలో దాదాపు అన్ని దేశాలు మన సంస్కృతీ నాగారికతల ఔన్నత్యాన్ని గుర్తించి ప్రశంసించినవే!

ఈ ప్రకృతి, అందులోని చరాచారాలన్నింటిలోనూ దైవాన్ని దర్శించగలగడం, పూజించడం మన ప్రత్యేకత. అంతేకాకుండా మనం పాటించే ఆచారవ్యవహారాలు, సాంప్రదాయాలు, మనం జరుపుకునే పండుగలు, పర్వదినాలు అన్నింటిలోనూ ఎన్నో ఉత్తమమైన విషయాలు దాగున్నాయి. ఎన్నో ఆరోగ్య రహస్యాలు ఉన్నాయి. అంతేకాదు, ప్రతిరోజూ నిద్రలేవడం నుంచి తిరిగి రాత్రి నిద్రకు ఉపక్రమించేంత వరకూ పాటించాల్సిన నియమాలు ఎన్నో ఉన్నాయి. ఇవన్నీ ధర్మశాస్త్రాలు, పురాణాల్లో పేర్కొనబడ్డాయి.

వీటన్నింటినీ ఆచరించడం వల్ల మానసిక ప్రాశాంతత కలుగుతుంది. మారుతున్న సామాజిక పరిస్థితులు, ఆహారపు అలవాట్ల వల్ల తలెత్తే అనారోగ్య సమస్యల నుంచి దూరమై, ఆరోగ్యకరమైన జీవితాన్ని గడపవచ్చు. ప్రాచీనకాలంనుంచీ వస్తున్న సాంప్రదాయాన్ని గమనిస్తే, తెల్ల వారుఝామునే నిద్రలేవడం అనేది భారతీయ సాంప్రదాయంలో ఒక భాగం. ఈ కాలాన్ని ‘బ్రాహ్మీముహూర్తం’ అని అంటారు. సూర్యుడు ఉదయించడానికి సుమారు ఒకటిన్నర గంట ముందు ఉండే కాలాన్నీ బ్రాహ్మీముహూర్తం అని చెప్పవచ్చు. అంటే సుమారు నాలుగు – నాలుగున్నర గంటల మధ్యకాలం. ఈ కాలంలో ప్రతిదినం నిద్రలేవడం అనేది మంచిది. నిత్య జీవితంలో అనుసరించాల్సిన నియమాల్లో ఇది ప్రధానమైనది. బ్రాహ్మీముహూర్త సమయంలో నిద్రించడంవల్ల పుణ్యఫలాలన్నీ నశిస్తాయి అని చెప్పబడుతోంది.

నిద్రలేస్తున్న సమయంలో భగవంతుని స్మరించుకోవడం మంచిది. నిద్రలేచి కూర్చుండగానే “కర్మదర్శనం” చేయాలని శాస్త్రవచనం. అంటే కుడిచేతిని చూసుకోవాలి. చూస్తూ –
“కరాగ్రే వసతే లక్ష్మీః కరమధ్యే సరస్వతీ
కర వృష్టే చ గోవిందః ప్రాతే కరదర్శనమ్”  అనే శ్లోకాన్ని పఠించాలి.

అంటే, అరచేతి చివర లక్ష్మీదేవి, మధ్యలో సరస్వతీదేవి, చేతి మొదట్లో శ్రీమహావిష్ణవు ఉంటారని భావం. నిద్రలేస్తూనే అరచేతిని దర్శిస్తూ, పై శ్లోకాన్ని పఠించడం వల్ల లక్ష్మీదేవి, సరస్వతి, శ్రీమహావిష్ణువులను దర్శించినట్లు లెక్క. అంతేకాకుండా నిద్ర లేచే సమయంలో కుడివైపు నుంచి నిద్ర లేవడం శ్రేష్ఠం.
   ఈ విధంగా నిద్రలేచి, పడకమీద కూర్చుని చేతిని చూసుకున్న అనంతరం దైవప్రార్ధన చేయడం ముఖ్యం. అంటే, ఎవరికీ ఇష్టమైన దేవతలను వారుస్మరించుకుంటూ, వారిని స్తుతిస్తూ గుర్తున్న శ్లోకాలను మననం చేసుకోవడం మంచది. అంతే కాకుండా, గతంలో దర్శించినటువంటి పుణ్యక్షేత్రాలను గుర్తుకు తెచ్చుకుని, కళ్ళు మూసుకుని వాటిని దర్శించినట్లు ఊహించుకుంటూ, వాటిని కళ్ళముందు సాక్షాత్కరింపజేసుకుని ప్రార్థించవచ్చు. ఈ విధంగా ఉదయాన్నే దైవస్మరణ చేయడం వల్ల ఆ రోజంతా మానసిక ప్రశాంతతను పొందడంలో పాటూ పుణ్యఫలాలను కూడా పొందవచ్చు.
తర్వాత భూమిపైన కాళ్ళుమోపుతూ –
“సముద్రవసనేదేవి పర్వతస్తమండలే
విష్ణుపత్ని నమస్తుభ్యం పాదస్పర్శం క్షమస్వమే” అనే శ్లోకాన్ని పఠిస్తూ భూదేవికి నమస్కరించాలి.  అంటే – “సముద్రము వాస్తంగా కలిగి, పర్వతాలను స్తనములుగా కలిగిన శ్రీమహావిష్ణువు భార్య అయినా ఓ భూదేవి! నీకు నమస్కరిస్తున్నాను. నా కాళ్ళు నీకు తగులుతున్నందుకు నన్ను క్షమించు” అని అర్థం.

పంచభూతములైన భూమి, నీరు, అగ్ని, వాయువు, ఆకాశాలన్నీ మనకు దైవంతో సమానం. తొలిరోజుల నుంచి వీటిని పూజించడం జరుగుతోంది. వాటిల్లో భూమి ఒకటి. ఈ భూమిని భూదేవిగా భావిస్తాం. భూదేవి శ్రీమహావిష్ణువు యొక్క సతీమణి. నిత్యం మన భారాన్ని మోస్తున్న మహాతల్లి. ప్రతిదినం ప్రాతఃకాలాన భూమిపైన కాలు మోపుతూ, ఆ చల్లని తల్లిని ప్రార్థించడంవల్ల, భూదేవి ఆశీస్సులతో పాటూ శ్రీమన్నారాయణుడి కరుణాకటాక్షాలు కూడా లభిస్తాయి.

నిద్రలేస్తూ ముఖం కడుక్కుని మంచినీళ్లు సేవించాలని శాస్త్రాలు చెబుతున్నాయి. కనీసం సుమారు ఒక లీటరు మంచినీరు తాగడం ఆరోగ్యదాయకమని ఆయుర్వేదం కూడా చెబుతోంది. నీటిని సేవించడం అనేది మలమూత్రాదుల విసర్జనకు, ‘పళ్ళుతోముకోవడాని కంటే ముందే చేయాలి. అది కూడా ముందురోజు రాత్రి రాగిచెంబులో నీరు పోసి ఉంచి, మారునాటి ఉదయమే సేవించడం శ్రేష్టం. లేదంటే మట్టికుండలోని నీరుసేవించాలి. ఈ విధంగా నీటిని సేవించిన అనంతరమే మాలమూత్ర విసర్జనలు చేయాలని శాస్త్రాలు చెబుతున్నాయి. ఇలా ప్రతిదినం నిద్రలేవగానే, పళ్ళు కూడాతోమకుండా నీరు త్రాగడం వల్ల చాలా అనారోగ్యాలు దరిచేరవని ఆయుర్వేదశాస్రం చెబుతోంది. అంతేకాకుండా, నేటి ఆధునిక వైద్యులు, శాస్త్రజ్ఞులు సైతం ఈ విషయాన్ని అంగీకరిస్తున్నారు. అనంతరం స్నానంచేయాలి. ఈ స్నానవిధికి సంబంధించి మన సాంప్రదాయాలు అనేక నిబంధనలను ఏర్పాటుచేశాయి. 
    ప్రతిదినం వేకువఝామునే స్నానం చేయాలనేది శాస్త్రవచనం. స్నానం చేసే సమయంలో “సంకల్పం” చెప్పుకోవాలని నిబంధన. (పూజలు, వ్రతాలు వంటివి చేసే సమయంలో ఏ విధంగా ఆస్మిన్ వంమాన వ్యావహారిక చాంద్రమానేన….అని చెప్పుకున్నట్లు) ప్రతిదినం చల్లని నీటిలో స్నానమాచరించాలి. అభ్యంగనస్నానం చేయాలని శాస్త్రాలు చెబుతున్నాయి. అంటే తలస్నానం నిత్యం ఆచరించవలెనని. స్నానం చేసే సమయంలో పూర్తిగా బట్టలు విప్పి నగ్నంగా స్నానంచేయరాదు. నగ్నంగా స్నానం చేస్తే నరకబాధలు అనేకం అనుభవించాల్సి వస్తుంది అని పురాణాలు చెబుతున్నాయి. ప్రధానంగా ఉపవాసం ఉండే రోజుల్లో, పితృకర్మలు చేయు రోజుల్లో , అంటే ఆబ్దికం వంటివి జరిపంచే రోజుల్లో, తర్పణాలు, పిండప్రదానాలు చేసే రోజుల్లో తలంటుకుని స్నానం చేయరాదు. ఇంకా సంక్రమణ దినాలు, తదియ, సప్తమి, షష్ఠి, అష్టమి, నవమి, చతుర్దశి, పూర్ణిమ, అమావాస్య తిథులు ఉన్న రోజుల్లోనూ, ఆది, మంగళ, గురు, శుక్రవారాల్లో తలంటుకుని స్నానం చేయరాదు. మిగతా రోజుల్లో చేయవచ్చు. ఈ దినాల్లో తలంటుకుని మాములుగా తలస్నానాలు ఆచరించవచ్చు. అలాగే కార్తీక, మాఘ, వైశాఖ మాసాల్లో కూడా తలంటుస్నానం చేయరాదని శాస్త్రవచనం.
“గుణాదశ స్నాన పరస్యసాధో
రూపంచ పుష్టిశ్చ బలంచ తేజః
ఆరోగ్య మాయుశ్చ మనోసురుద్ వ
దు: స్వప్న ఘాతశ్చ తవశ్చ మేధా” అని దక్షస్మృతిలో చెప్పబడింది. అంటే – స్నానం వలన రూపం, పుష్ఠి, బలము, తేజస్సు, ఆరోగ్యం, దీర్ఘఆయుర్ధాయం, చిత్తప్రసన్నత, దుఃస్వప్న నాశనము, తపస్సు, గ్రంథాధారణ చేసేందుకు తగిన బుద్ధి, శక్తి అనే పది ప్రత్యక్ష లాభాలు కలుగుతాయని అర్థం.
అట్లే విష్ణుస్మృతిలో –
అజ్ఞానాద్యాది వా మోహద్రాత్రే
యుద్దరితం కృతమ్
ప్రాతః స్నానానికి తత్సర్వం
శోధయంది ద్విజోత్తమా!! అని పేర్కొనబడింది. అంటే, అజ్ఞానం వలనగానీ, మొహం వలనగానీ, రాత్రులందు చేసే పాపకార్యాలవలన శరీరదోషాలు ప్రాప్తిస్తాయి. ప్రాతః స్నానంతో ఆ దోషాలు తొలగిపోతాయి అని అర్థం.

అంతటి పవిత్రమైన స్నానం చేసే సమయంలో ఈ క్రింది శ్లోకాన్ని పఠించవలెను.

తీక్షణదంష్ట్ర! మహాకాయ!కల్పాందత దహనోపమ!
భైరవాయ నమస్తుభ్యం అనుజ్ఞాం దాతుమర్వసి
గంగే చ యమునే చైవ గోదావరీ సరస్వతీ
నర్మదే సింధు కావేరి జలెస్మిన్ సన్నిధిం కురు
గంగా గంగేతి యోబ్రూయాత్ యోజయానాం శతైరపి
ముచ్యతే సర్వపాపేభ్యో విష్ణులోకం సగచ్ఛతి
యో సా సర్వగతో విష్ణుః చిత్ స్వరూపీ నిరంజనః
న ఏవ ద్రరూపేణగంగాంభో నాత్రా సంశయః అనే శ్లోకాన్ని పఠించడం శ్రేష్ఠం.
లేదంటే కనీసం –
గంగే చ యమునే చైవ గోదావరీ సరస్వతీ నర్మదే సింధు కావేరి జలెస్మిన్ సన్నిధిం కురు” అనే శ్లోకాన్నైనా పఠించి స్నానం చేయడం మంచిది.
స్నానానంతరం “విభూతి” ని, కుంకుమను, గంధములను నుదుట ధరించాలని భారతీయ సాంప్రదాయం.

“భూతిర్ధూతికరీ పవిత్ర జననీ పాపౌఘవిధ్వంసివే
సర్వోపద్ర నవనాశినీ శుభకరీ సర్వార్థ సంపత్కరీ
భూత ప్రేత పిశాచ రాక్షసగణారిష్టాది సంహారిణీ
తేజోరాజ్యవిశేష మొక్షణకరీ భూతిం పదా ధార్యతాం!!” అని చెప్పబడింది.
విభూతి సంపదలను ప్రసాదిస్తుంది. పవిత్రతను కలిగిస్తుంది. పాపాలన్నింటినీ నాశనం చేస్తుంది. సర్వ అరిష్టాలను తొలగించి సకలశుభాలను, అష్టైశ్వర్యాలను ప్రసాదిస్తుంది. గ్రహాబాధలు, భూతప్రేతపిశాచాది బాధలను దూరం చేసి తేజస్సును ప్రసాదిస్తుంది. ముక్తిని చేకూరుస్తుందని చెప్పబడింది. 

విభూతిని ధరించే సమయంలో ఈ క్రింది శ్లోకాలను పఠించాలి.
“త్రాయుషం జమదగ్నేః
కశ్యపశ్య త్రాయుషమ్
యద్దేవేషు త్ర్యాయుషమ్
తన్నోస్తు త్రాయుషమ్”
అంటే జమదగ్ని, కశ్యపుడు దేవదేవుల యొక్క ఆయుర్దాయం కంటే మూడురెట్లు ఆయుర్దాయం కలుగుగాక అని అర్థం.

“శ్రీకరంచ పవిత్రంచ
శోకరోగ నివారణ
లోకే వశీకరణం పుంసాం
భస్మం త్రైలోక్యపావనమ్”
ముల్లోకాలను పావనం చేసే మంగళప్రదమైన భస్మధారణంతో సకల రోగాలు, పాపాలు, సకల శోకాలు నిర్మూలనం కాగవలని అర్థం.

అలాగే, గంధం ధరించే సమయంలో –
“శంఖ చక్ర గదాపాణే
ద్వారకానిలయాచ్యుత
గోవింద పుండరీకాక్ష
రక్షమాం శరణాగతిమ్!!” అనే శ్లోకాన్ని పఠించాలి.

కుంకుమను ధరించే సమయంలో –
ఓంకార పంజర శుకీం
ఉపనిషాదుద్యాన కేళికలకంఠీమ్!
ఆగమ విపిన మయూరీ
మార్యా మంతర్విభావయే గౌరీం!! అనే శ్లోకాన్ని పఠించడం శ్రేష్టం.
స్నానంతరం ఈ విధంగా విభూతి, కుంకుమ గంధాలను ధరించిన తరువాత, ఇష్టదేవతా పూజను, అర్చనలు చేయాలి. 

అంతేకాకుండా, ఈ చరాచరజగత్తుకు వెలుగును, ఆరోగ్యాన్ని ప్రసాదించే ప్రత్యక్ష దేవుడైన సూర్యునికి నమస్కరించుకోవాలి.
“జపాకుసుమ సంకాశం
కాశ్యపేయం మహాద్యుతిమ్
తమోరీమ్ సర్వపాపఘ్నం
ప్రణతోస్మి దివాకరమ్!!”
ఎర్రనిపువ్వులు, ఎరుపు రంగు ప్రతీకారమైన కశ్యపుని సంతానమైన దివాకారునికి నామస్కరిస్తున్నాను. నా పాపాలను పటాపంచలు చేసి, నన్ను రక్షించగలవంటూ సూర్యునికి నమస్కరించవలెను. 
ఈ శ్లోకమే కాకుండా…
ఆదిదేవ నమస్తుభ్యం ప్రసీద మమ భాస్కర!! దివాకర్ నమస్తుభ్యం ప్రభాకర నమోస్తుతే!!
అనే శ్లోకాన్ని పఠించి అయినా నమస్కరించవచ్చు. అనంతరం, తులసి వృక్షం వద్ద దీపాన్ని వెలిగించి, ప్రదక్షిణలు చేసి ఈ క్రింది శ్లోకంతో నామస్కరించడం మంచిది.

యన్మూలే సర్వతీర్థాని యన్మధ్యే సర్వదేవతాః
యదగ్రే సర్వవేదాశ్చ తులసీ త్వాం నమామ్యహామ్
నమస్తులసీ కళ్యాణీ నమో విష్ణుప్రియే శుభే
నమో మోక్షప్రదే దేవి నమః సంపత్ప్రదాయని అని పఠిస్తూ నమస్కరించాలి.

అలాగే, శమీవృక్షం, రావిచెట్టు, వేపచెట్టు వంటి దేవతావృక్షాలు, ఇంటి పెరట్లోగాని, చుట్టుప్రక్కలాగాని ఉన్నట్లయితే, వాటికి కూడా నమస్కరించడం వల్ల సత్ఫలితాలు కలుగుతాయి. మధ్యాహ్నం, రాత్రిపూట భోజనం చేసే ముందు, భోజనం చేసే సమయంలోనూ కొన్ని నిబంధనలను పాటించాలని శాస్త్రాలు చెబుతున్నాయి. భోజనానికి తూర్పు ముఖం గానూ, లేదంటే దక్షిణ ముఖంగాను కూర్చుని భుజించడం మంచిది. తూర్పుముఖంగా కూర్చుని భుజిస్తే ఆయుష్షు, దక్షిణముఖంగా కూర్చుని భుజిస్తే యశస్సు కలుగుతాయని చెప్పబడుతోంది. భోజనానికి కూర్చునే ముందు, కాళ్ళు, చేతులు, నోటిని శుభ్రంగా కడుక్కోవాలి. బిగుతుగా ఉండే దుస్తులను ధరించారాదు. తలపైన టోపీ వంటివి ధరించారాదు. నెలపైన పద్మాసనస్థితిలో కూర్చుని భుజించడం మంచిది. 

భోజనానికి ముందు ఈ క్రింది నియమాలను పాటించాలి.
భోజన పదార్థములన్నీ విస్తారాకులోగానీ, పళ్ళేలలోగాని వడ్డించిన అనంతరం, నీటిని కుడిచేతిలోనికి తీసుకుని, గాయత్రీ మంత్రాన్ని జపించి, ఆ నీటిని తినబోవు భోజనంపై చల్లాలి. అనంతరం మళ్ళీ చేతిలోకి నీరు తీసుకుని –
“సత్యం త్వరైన పరిషించామి” – అని అంటూ కుడిచేతిని ఎడమవైపు నుంచి కుడిచేతివరకు ప్రదక్షిణగా విస్తరించుట్టూ ఆ నీరు విడువవలెను.

అదే రాత్రిపూట భోజనం చేసే సమయంలో –
ఋతంత్వా సత్యేవ పరిషించామి” అని అంటూ నీటినిం విడువవలెను. అనంతరం ఐదుసార్లు ఎన్నో కొద్దీ కొద్దిగా తీసుకుని – “ఓం ఉదావాయస్వాహా, ఓం ఆపావాయస్వాహా, ఓం వ్యానాయ స్వాహా, ఓం ఉదానాయస్వాహా, ఓం సమానాయ స్వాహా” అనే మంత్రాలను పఠిస్తూ నోట్లో వేసుకుని నమలకుండా మింగాలి.

ఈ విధంగా చేయలేనివారు, కనీసం భోజన సమయంలో ఈ క్రింది శ్లోకాలనైనా పఠించాలి.
“త్వదీయం వాస్తు గోవిందా
తుభ్యంఎవ సమర్పయామి!
గృహానికి సముఖోభూత్వా
ప్రసీత పరమేశ్వరం||”
ఓ గోవిందా! నీ వస్తువును నీకే అర్పిస్తున్నానుశీ నీవు నాయందు ప్రసన్నుడవై, ప్రసన్నముఖంతో దీనిని గ్రహించు అని అర్థం.

“బ్రహ్మర్పణం బ్రహ్మహవిః
బ్రహ్మగ్నే బ్రహ్మణా హుతమ్!
బ్రహ్మైవ తేన గంతవ్యం
బ్రహ్మకర్మ సమాధినా||”
ఆహారాన్ని భుజించే ముందు, నివేదన చేసిన అనంతరం, పైశ్లోకాన్ని పఠించిన అనంతరం, భుజించాలి. అంతేకాకుండా – “అహం వైశ్వానరోభూత్వా ప్రాణినాందేహ మాశ్రితః| ప్రాణాపాన సమాయుక్త పచామ్యన్నం చతుర్విధమ్||”

నేను జఠరాగ్ని రూపంగామారి, ప్రాణుల శరీరాలను ఆశ్రయించి, ప్రాణా పానములతో కూడినవాడినై, నాలుగు రకాలైన అన్నాన్ని పచనం చేస్తున్నానని చెప్పి భుజించడం మంచిది. భోజనం చేయడం ముగించిన అనంతరం – “అమృతాపి ధానమాసి రౌరవే ఆపుణ్యానిలయే పద్మార్డుద| నివాసినామ్ ఆర్థినాం ఉదకం దత్తం అక్షయ్యముపతిష్టతు” అని శ్లోకాన్ని పలుకుతూ నీటిని అప్రదక్షిణంగా విస్తరిచుట్టూ తిప్పాలి.

భోజనం చేయడం ముగించి లేచిన అనంతరం చేతులు, కాళ్ళను కడుక్కోవాలి. నోట్లో నీటిని పోసుకుని పుక్కిలించాలి. అనంతరం ఈ శ్లోకాన్ని పఠించాలి.
“ఆగస్త్యం వైనతేయఇపశ్చ
శవఞ్చ బడబానలమ్
ఆహార పరిపాకార్థం స్మరే
ద్దీమఞ్చ పఞ్చమమ్”
అగస్త్యుడు, గరుత్మంతుడు, శనీశ్వరుడు, బడబానలుడు భీములను స్మరించడం వాళ్ళ ఆహారం సమంగా జీర్ణం కాగలదని అర్థం. అలాగే పిల్లలకు ఆహారం పెట్టిన అనంతరం – “జీర్ణం జీర్ణం వాతాపి జీర్ణం” అని పొట్టను రుద్దాలి. పెద్దలు కూడా పొట్టపైన చేతిని ఉంచి రుద్దుకుంటూ ఈ శ్లోకాన్ని పఠించవచ్చు.

సాధారణంగా సాయంత్రం సూర్యాస్తమయం అవుతూనే ఇంటిముందు లైట్లు వేయడం, దీపాన్ని వెలిగించడం ఆచారం. లైట్లు వేయగానే దేవుడి పటంవైపు చూసి నమస్కరిస్తుంటాం. అంతేకాకుండా, దీపాన్ని వెలిగించాక గానీ, లైట్లు వేశాక గానీ –
దీపంజ్యోతి పరబ్రహ్మః
దీపం సర్వ తమోపహమ్
దీపేన సాధ్యతే సర్వమ్
సంధ్యాదీప నమోస్తుతే!!” అనే శ్లోకాన్ని పఠించాలి.

అంతేకాకుండా,
“దీపంజ్యోతి పరబ్రహ్మః
దీపం జ్యోతి జనార్ధన
దీపేన హారతే పాపం
సంధ్యాదీప నమోస్తుతే!!”
“దీపమే పరబ్రహ్మ, దీపమే జనార్ధనుడు. సకల పాపాలను హరింపజేస్తుంది – దీపం. అటువంటి సంధ్యాదీపానికి నామస్కరిస్తున్నాను” అని దీపానికి నమస్కరించాలి.

అలాగే, సాయంత్రం లక్ష్మీదేవిని, ఇషా దేవతలను పూజించవచ్చు. తులసికోట వద్ద దీపాలను వెలిగించి, ప్రదక్షిణం చేసి నమస్కరించవచ్చు. సాయంత్రం ఇంట్లో దీపం వెలిగించేముందు లేదా లైటు వేసే సమయంలో ఇంటి ప్రధాన వాకిలిని తెరచి ఉంచాలి. పెరటివైపునున్న వాకిలిని మూసి ఉంచాలి.

“యదాతు మానసిక్లాంతే కర్మాత్మానః క్లామాన్వితాః!! విషయేభ్యో నివర్తంతే తదాస్వపితి మానవః!!”
అని చరకసంహితలో పేర్కొనబడింది. మనస్సు అలసట చెందినటువంటి స్థితిలో ఇంద్రియాలన్నీ తమ తమ కర్తవ్యాలను మన మనస్సునకే కైవసం అవ్వడంవల్ల శారీరక మానసిక పనులు చేయలేక విశ్రాంతిని కోరుతాయి. అదే నిద్రావస్థ:-
  • ప్రతిమనిషి కనీసం ఆరుగంటలు నిద్రించాలని శాస్త్ర గ్రంథాలు చెబుతున్నాయి. 
  • నిద్రించే ముందు కొన్ని నియమాలను పాటించాలి. 
  • నిద్రించే సమయంలో తడికాళ్ళతో పడుకోరాదు. 
  • తడికాళ్ళతో పడుకుని నిద్రిస్తే ఆయుష్షు క్షీణిస్తుంది అని శాస్త్రవచనం. 
  • తూర్పువైపుగానీ, దక్షిణంవైపు గానీ తల ఉంచి పడుకుని నిద్రించాలి. 
  • ఇతరుల ఇంట్లో పడుకునే సమయంలో పడమర వైపు తల ఉంచి నిద్రించాలి.
  • ఎప్పటికీ ఉత్తరంవైపున తలఉంచి పడుకుని నిద్రించరాదు. 
  • ఎడమవైపు తిరిగి పడుకుంటే ఆరోగ్యరీత్యా మంచిదని చెప్పబడుతోంది.
  • నిద్రలేచే సమయంలో కుడివైపు నుంచి నిద్ర లేవాలి.
  • నిద్రపోవడానికి ముందు ఈ క్రింది శ్లోకాన్ని పఠించాలి.

“కరచరణకృతం వా కర్మా వాక్కా యజం వా
శ్రవణ సయసజంవా మానసంవా ప రాధామ్
విహిత మావిహితం వా సర్వమేతత్ క్షమస్వ
శివశివ కారుణాబ్దే హి మహాదేవ శంభో”
“చేతులతోగానీ, కాళ్లతోగానీ, మాటలవల్లగానీ, చేతలవల్లగానీ, శరీరంచేతగానీ, చెవులతోగానీ, కళ్ళతోగానీ, మనస్సుతోగానీ, తెలిసిగానీ, తెలియకగానీ, చేసిన నా సర్వ అపరాధాలను కారుణామయుడవైన ఓ శివుడా క్షమించు” అని ప్రార్థించి నిద్రించాలి. బ్రాహ్మిముహూర్తంలో నిద్రలేచినప్పటి\నుంచి రాత్రి నిద్రించే వరకు, ఈ విధంగా విధులను ఆచరించడంవల్ల జీవితం సుఖవంతమవుతుంది. అంతేకాకుండా, ఇంకా వివిధ సమయాల్లో వివిధ శ్లోకాలను పఠించడంవల్ల అనేక సత్ఫలితాలు లభిస్తాయి.

నిద్రించే సమయంలో స్వప్నాలు వచ్చినా…. చెడుకలలు రాకుండా ఉండేందుకు –
“రామం స్కంధం హనుమంతం
వైనతేయం వృకోదరం
శయనేయః పఠేనిత్యం దుస్స్వప్నం తస్యనశ్యతి” అనే శ్లోకాన్ని పఠించాలి. 

ఉరుముతున్నప్పుడు, పిడుగులు పడుతున్న సమయంలో అర్జునునిని స్తుతించాలని పురాణకథనం.
అర్జున ఫల్గుణః పార్థః
కిరిటీ శ్వేత వాహనః
బీభత్సో విజయః కృష్ణః
సవ్యసాచీ ధనుంజయః అనే శ్లోకాన్ని పఠించాలి. 

ఆనారోగ్యంవల్ల ఏమైనా మందులు వేసుకునే సమయంలొ ఈ క్రింది శ్లోకాన్ని పఠించాలి.
“ధన్వంత్రిణం గరుత్మంతం – ఫణిరాజంత చ కౌస్తుభం|
ఆచ్యుతం చామృతం చంద్రం – స్మరేత్ ఔషధ కర్మణీ|
శరీరే జర్ఘరీ భూతే – వ్యాధిగ్రస్తే కళేబరే|

ఔషధం జాహ్నవీతోయం -వైద్యోనారాయణోహరిః||” ప్రతినెలా అమావాస్య తర్వాత వచ్చే క్రొత్తనెలలో చంద్రుదు ఉదయిస్తాడు. ఉదయిస్తున్న చంద్రబింబాన్ని నెలబాలుడు అని పిలుస్తారు. సాధారణంగా నెలబాలుని ఆకాశంలో చూస్తూనే, దేవుడి ఫోటోను గానీ ఇష్టమైనవారి ముఖాన్నిగానీ చూస్తుంటారు. అంతేకాకుండా, నూలు పోగును తీసి చంద్రుని వైపు వేస్తుంటారు.

అలాగే నెలబాలుని దర్శిస్తూనే ఈ క్రింది శ్లొకాన్ని పఠించడం మంచిది.
“క్షీరసాగర సంపన్న లక్ష్మీప్రియ సహోదర
హిరణ్మకుట వాసాయా బాలచంద్ర నమొస్తుతే||”

అలాగే, ఇంటినుంచి బయటకు వెళ్ళేముందు –
“యశ్శివో సమారూపాభ్యాం యా దేవి సర్వమంగళా
తయో సంస్మరణాతే పుంసాం సర్వతో జయమంగళం
లాభాస్తేషాం జయస్తేషాం కుతస్తేషాం పరాభవే యేషామిందీవర్శ్యామే హృదయాస్థో జ్ఞార్ధనః” అనే శ్లోకాన్ని పఠించడం మంచిది.

రచన: నాగవరపు రవీంద్ర

కామెంట్‌ను పోస్ట్ చేయండి

0 కామెంట్‌లు
* Please Don't Spam Here. All the Comments are Reviewed by Admin.
కామెంట్‌ను పోస్ట్ చేయండి (0)
Translate this post ⬇

buttons=(Accept !) days=(0)

Our website uses cookies. Learn More
Accept !
To Top