శ్రీ మహాలక్ష్మి - Goddess Sri Lakshmi, Lakshmi devi

త్రిమూర్తులలో ఒకరయిన మహావిష్నువుని భార్య ... లక్ష్మి . చాలా మంది దేవతలకు వలెనే లక్ష్మికి ఎన్నో పేర్లు, అష్టోత్తర శతనామ స్తోత్రం, సహస్ర నామ స్తోత్రం వంటివి ఉన్నాయి. అధికంగా లక్ష్మిని సంబోధించే నామాలలో కొన్ని - లక్ష్మి, శ్రీ, సిరి, భార్గవి, మాత, పలుకు తేనెల తల్లి (అన్నమయ్య సంబోధన), నిత్యానపాయిని, క్షీర సముద్ర రాజ తనయ, పద్మ, పద్మాక్షి, పద్మాసన, కమల, పద్మప్రియ, రమ, ఇందిర.
మహాలక్ష్మి సిరిసంపదలకు అధిదేవత. జీవన సౌభాగ్యానికి దివ్యప్రతీక. సృష్టికి కారణభూతమైన ఆద్యపరాశక్తిని మన ప్రాచీన మహాద్రష్టలు సుమనోజ్ఞరూపాల్లో చిత్రించి ఆరాధించారు. ఆ శక్తి మహిమలను, దివ్యత్వ శోభలను అనేక దేవతామూర్తులుగా మలచారు. ప్రతిరూపం ఒక దివ్యసంకేతం. ప్రతి సంకేతం వెనక ఒక రహస్య సందేశం కనిపిస్తుంది.
మహాలక్ష్మిగా మనకు కనిపించే దేవి హిరణ్యవర్ణంలో భాసించే మధురమోహనమూర్తి. ఆమె చతుర్భుజాలతో పూర్ణవికసితపద్మంపై ఆశీనురాలై ఉంటుంది. ఆమె హస్తంలో ఒక పద్మం మొగ్గరూపంలో ఉంటుంది. సౌందర్యానికి, వినిర్మలతకు సంకేతం అది. పద్మం బురద నుంచి పుడుతుంది. మనలో ఏ వాతావరణ పరిస్థితులల్లోనైనా వికసించే అపరిమితశక్తికి ఈ పంకం సంకేతం.

మహాలక్ష్మి చుట్టూ నీరు ఆవరించి ఉంటుంది. ఈ నీరు జీవానికి సంకేతం. ఈ నీరు నిత్యప్రవాహశీలమై ఉంటుంది. అలా ప్రవహించకపోతే అది నిల్వఉండి పాడైపోతుంది. ధనం కూడా ప్రవహిస్తూ చలామణీ అవుతుండాలి. అందువల్లనే దాన్ని కరెన్సీ అన్నారు. కరెంటు (ప్రవాహమని ఒక అర్థం) అనే ఆంగ్లపదం నుంచి ఈ కరెన్సీ పదం వచ్చింది. ఈ ధన ప్రవాహాన్ని ఆపి, ధనాన్ని కూడబెట్టేవారు ధనం, జీవితం అంటే ఏమిటో అర్థం చేసుకోలేరు. ఆరోగ్యప్రదమైన ఆర్థిక వ్యవస్థ వెనక కీలక రహస్యం చలామణీ.

జాజ్వల్యమానమైన శ్రీలక్ష్మీదేవి అతిలోక తేజస్సును, సుసంపన్నతను ప్రసరిస్తూ ఉంటుంది. ఆమె చతుర్భుజాలు చతుర్విధ పురుషార్థాలకు సంకేతాలు. అవి ధర్మార్థకామమోక్షాలు. జననమరణాల చక్రంనుంచి మనిషిని విముక్తంచేసి ఆమె మహాసత్యంవైపు నడుపుతుంది. ఆ పురుషార్థాలు మన జీవనస్తంభాలు. వేదోపనిషత్తులకు పునాదులు. మహాలక్ష్మి ఆకుపచ్చని చీర ధరిస్తుంది. అది అభివ్యక్త శక్తికి, వికాసానికి, సారభూతమైన భూదేవి పచ్చదనానికి సంకేతం. అప్పుడప్పుడు ఆమె ధరించే ఎర్రని చీర రంగు- కార్యశీలతకు, అంతశ్శక్తికి ప్రతీక.

లక్ష్మీదేవికి ఇరువైపులా రెండు శ్వేతగజాలు నిలబడి నీటిని చిమ్ముతూఉంటాయి. తన ధర్మాన్ని అనుసరించి వివేకంతో, నిర్మల మనస్సుతో, ఐహిక, ఆధ్యాత్మిక సంపదల కోసం నిరంతరాయంగా చేసే ప్రయత్నానికి అది సంకేతం. మహాలక్ష్మి చెంతనే ఒక తెల్లగుడ్లగూబ కనిపిస్తుంది. దీని వెనక రెండు సంకేతార్థాలు ఉన్నాయి. ఒక ప్రతీకకు అర్థం వివేకం, అదృష్టం. మరొక సంకేతార్థం తెలివిహీనత. సంపద తెలివిహీనుల గర్వం, అహంకారం కారణంగా మాయమవుతుంది. అందువల్లనే లక్ష్మిని చంచల అన్నారు. లక్ష్మికి ఒక సోదరి ఉంది. ఆమె పేరు అలక్ష్మి. ఆమె దురదృష్టానికి హేతువు. ధన నియమాలు పాటించకపోతే కలిగే దుస్థితి అది. లక్ష్మి అనే పదం సంస్కృత పదం లక్ష్యం నుంచి వచ్చింది. విస్పష్టమైన జీవన లక్ష్యం ఉన్నవారి చెంత లక్ష్మి సుస్థిరంగా ఉంటుంది. లక్ష్మీ పూజకు సాయంసమయం అనువైనది. పరిశుభ్రంగా ఉన్న ఇంటిలోకి మాత్రమే ఆమె ప్రవేశిస్తుందని నమ్మకం. మనస్సు, ఆత్మ సామరస్య, సౌందర్య ప్రాభవంతో వెలుగుతున్నచోట, ఆలోచనలు, సంవేదనలు, సామరస్య సౌందర్యమాధుర్యాలతో విలసిల్లేచోట- జీవితం, పరిసరాలు, కదలికలు, మన బాహ్య చర్యలు అతిలోక రామణీయకతతో శోభిల్లినప్పడు శ్రీమహాలక్ష్మి శాశ్వతంగా ఉండిపోతుందని చెబుతారు. ఆమె అడుగుపెట్టినచోట అద్భుతావహ ఆనంద స్రవంతులు పొంగిప్రవహిస్తాయి. శ్రీమహాలక్ష్మి సిరిసంపదలతోపాటు జీవితాన్ని భగవదానందప్రదీప్తం చేస్తుంది. సంతోషంలేని సంపదలు దేనికి? ఆమెను మనసారా ఆరాధిస్తే జీవితం అతిమనోహరకళాఖండంగా ప్రకాశిస్తుంది. పవిత్ర ఆనంద సుధామయమంత్రగీతమై రవళిస్తుంది. మన వివేకాన్ని మహదాశ్చర్యశిఖరాలపై నిలుపుతుంది ఆమె. సమస్త జ్ఞానాన్ని అధిగమించే ఆనందపు అంతర్నిక్షిప్త రహస్యాలు ఆమె మనకు సమావిష్కరిస్తుంది.

అపార విశ్వాసం, భక్తిప్రపత్తులు కలిగినవారి దృస్టిలో శ్రీమహాలక్ష్మి సిరిసంపదలు అనుగ్రహించడమే కాదు... వ్యర్థ జీవన చక్ర భ్రమణాన్ని అమృతరసప్లావితంచేసే దేవత!

ప్రధాన గాధలు:
లక్ష్మీ దేవి గురించి వివిధ గాథలు పురాణాలలోను, ఇతిహాసాలలోను ఉన్నాయి. శ్రీ మహా విష్ణువునకు సృష్ట్యాది నుండి లక్ష్మి తోడుగానే ఉన్నదని, ఆమె 'నిత్యానపాయిని' (ఎన్నడూ విడివడనిది), లక్ష్మీనారాయణులు వేరు వేరు కారని అని శ్రీవైష్ణవ సంప్రదాయంలో చెబుతారు.
సృష్ట్యాదిలో దేవి (మహాశక్తి) సృష్టిని పాలించడానికి విష్ణువుకు తోడుగా ఉండమని లక్ష్మిని ప్రసాదించిందని దేవీ భాగవతంలో చెప్పబడింది. ఒకమారు లక్ష్మి విష్ణువునుండి వేరు కావడం వలన విష్ణువు శక్తి హీనుడయ్యాడు. అప్పుడు బ్రహ్మ ఆనతిపై భృగు మహర్షి తపస్సు చేయగా లక్ష్మి భృగువు, ఖ్యాతిల కుమార్తెగా జన్మించింది. ఆమెను భృగువు విష్ణువుకు ఇచ్చి పెళ్ళి చేశాడు. కనుక లక్ష్మిని 'భార్గవి' అని కూడా అంటారు.

తరువాత ఒకమారు దూర్వాసుని శాపకారణంగా లక్ష్మి వైకుంఠాన్ని వీడి పాల సముద్రంలో నివసించసాగింది. అమృతం పొందాలని దేవతలు రాక్షసులు పాలసముద్రన్ని మందర పర్వతాన్ని కవ్వంగా చేసి వాసుకిని కవ్వపు త్రాటిగాచేసె చిలకడం ప్రారంభించారు. ఆ సమయంలో పాలసముద్రం నుండి కామదేనువు, ఐరావతం, కల్పవృక్షం మొదలైన వాటితో లక్ష్మిదేవి అవతరించింది. పాలసముద్రలో నుండి జనించింది కనుక ఆమె 'సముద్రరాజ తనయ' అయ్యింది. ఆమెతో బాటే జన్మించిన చంద్రుడు లక్ష్మికి సహోదరుడయ్యాడు. ధనాధి దేవత ఐయిన ఈ దేవిని శ్రీమహావిష్ణువు పత్నిగా స్వీకరిచాడు.

విష్ణువు శక్తికి, మాయకు కారణం ఆయనకు లక్ష్మి తోడుండడమే అంటారు. భూదేవి కూడా లక్ష్మికి మరో అంశ అని చెబుతారు. దేవీ మహాత్మ్యంలో మహాశక్తియే మహాలక్ష్మిగా చెప్పబడింది. ఆమెను అష్ట భుజ మహాలక్ష్మిగా వర్ణించారు.

విష్ణువు అవతారాలతోబాటు లక్ష్మి కూడా అవతరిస్తుందని చెప్పబడింది. రామావతారంలో సీత గా, కృష్ణావతారంలో రుక్మిణి గా, కలియుగంలో వెంకటేశ్వర స్వామికి తోడు అలమేలు మంగగా లక్ష్మి విష్ణువుకు తోడై ఉంది.
హిందూమతంలో వైదికకాలంనుండి లక్ష్మీదేవి ఆరాధన జరుగుతున్నదనడానికి ఆధారాలున్నాయి. ఋగ్వేద కాలంలో అదితి, రాకా, పురంధ్రి మొదలగు దేవతలను మాతృమూర్తులుగా, సంప్త్పదాయినులుగా ఆరాధించారు. అధర్వణ వేదం "సినీవాలి" అనే దేవతను "విష్ణుపత్ని"గా నుతించింది. వీరిలో ఏ దేవత లక్ష్మీదేవికి మాతృరూపమో తెలియడంలేదు.
వివిధ నామాలు
చాలా మంది దేవతలకు వలెనే లక్ష్మికి ఎన్నో పేర్లు, అష్టోత్తర శతనామ స్తోత్రం, సహస్ర నామ స్తోత్రం వంటివి ఉన్నాయి. అధికంగా లక్ష్మిని సంబోధించే నామాలలో కొన్ని - లక్ష్మి, శ్రీ, సిరి, భార్గవి, మాత, పలుకు తేనెల తల్లి (అన్నమయ్య సంబోధన), నిత్యానపాయిని, క్షీర సముద్ర రాజ తనయ, పద్మ, పద్మాక్షి, పద్మాసన, కమల, పద్మప్రియ, రమ, ఇందిర.

లక్ష్మి రూప చిత్రణ
అధికంగా లక్ష్మీదేవి చతుర్భుజాలతోను, ధన కుంభంతోను, పద్మాసనగా, పద్మాలను చేతబట్టి, సకలాభరణ భూషితయైనట్లుగా చిత్రించబడుతుంది. లక్ష్మీ దేవి వాహనం గుడ్లగూబ.
వాఙ్మయాధారాలలో ఋగ్వేదం పదవ మండలంలోని శ్రీసూక్తం సర్వ శుభ లక్షణ నిలయ, సకల సంపత్ప్రదాయిని అయిన లక్ష్మీదేవి స్వరూపాన్ని ఆవిష్కరిస్తున్నది. ఆమె బంగారు మేనికాంతి కలది (హిరణ్యవర్ణాం), బంగారు ఆభరణములు దాల్చినది (సువర్ణ రజతస్రజాం), వెన్నెలలా మెరుస్తున్నది (చంద్రాం), గజరాజుల ఘీంకారములతో సంబోధింపబడుచున్నది (హస్తినాద ప్రబోధినీం), చిరునగవులు చిందించునది (కాంసోస్మితాం), కీర్తిచే శోభిల్లునది (యశసా జ్వలన్తీం), సకల దారిద్ర్యములను నశింపజేయునది (అలక్ష్మీర్మే నశ్యతాం), పద్మమాలను ధరించినది (పద్మమాలినీం), పద్మమునుండి జనించినది (పద్మోద్భవాం), అందరికి ప్రీతిపూర్వకమైన మాత (ప్రజానాం భవసి మాతా).

యజుర్వేదం పురుష సూక్తంలో శ్రీ, లక్ష్మీ అనే ఇరువురు దేవతలు నారాయణునికి దేవేరులుగా పేర్కొనబడ్డారు. తైత్తరీయారణ్యకం, వాజసనేయ సంహిత లలో ఈ ఇద్దరు దేవతలు స్తుతించబడ్డారు. పురాణయుగంలో మత్స్య, విష్ణు, విష్ణు ధర్మోత్తర పురాణాలలో లక్ష్మీదేవి అపూర్వ సౌందర్యమూర్తి, అద్భుత శక్తి సమన్వితగా కీర్తించబడింది. లక్ష్మీదేవి ప్రతిమను శిల్పీకరించే విధానాన్ని మత్స్య పురాణంలో ఇలా చెప్పారు - "దేవి ప్రతిమ యౌవనాకృతి కలిగి ఉండాలి. దళసరి చిబుకములు, ఎర్రని పెదవులు, చక్కని కనుబొమలు కలిగి సర్వాభరణములు ధరించి ఉండవలెను. ముఖం గుండ్రంగా ఉండాలి. దివ్యాంబరమాలా కంకణధారియై యండాలి. ఎడమచేతిలో పద్మం, కుడిచేతిలో బిల్వఫలాలు ఉంచాలి. పద్మాసీనయైన దేవి చుట్టుప్రక్కల నల్ల తుమ్మెదలు తిరుగాడుచున్నట్లుగాను, ఇరువైపుల తొండములయందలి పాత్రలతో అభిషేకించు గజరాజులను, ప్రణమిల్లు గంధర్వ గుహ్యకులను చిత్రించాలి. అగ్ని పురాణం ప్రకారం శ్రీమాత శంఖ-చక్ర-గదా-పద్మ-ధారిణి. విష్ణుధర్మోత్తర పురాణానుసారం దేవి విష్ణుసహితయైనప్పుడు ద్విభుజయై పద్మమునుదాల్చి సర్వాభరణభూషితయై యుండును. స్వతంత్రమూర్తిగా మలచినపుడు చతుర్భుజయై, ఉన్నత సింహాసనాసీనయై, పద్మము, అమృతపాత్ర, బిల్వఫలములు, శంఖములు దాల్చి గజములచే అభిషేకింపబడుచున్నట్లు చూపవలెను. శిరస్సుమీద సువికసిత పద్మములుండవలయును.

అమ్మవారి చేతనున్న శంఖము అదృష్టమును, బిల్వఫలములు ప్రపంచమును, పద్మము సంపదను సూచించును. రెండు గజములు శంఖ పద్మనిధులకు సూచకములని విష్ణుధర్మోత్తర పురాణంలో చెప్పబడింది. వరాహమిహిరుని బృహత్సంహితలో దేవతా ప్రతిమల ఆకృతులు వివరంగా చెప్పబడినవి కాని లక్ష్మీదేవి ఆకృతిగురించి చెప్పలేదు. కారణం తెలియడంలేదు.

అష్ట లక్ష్ములు
లక్ష్మీ దేవి వివిధ రూపాలలో అష్టలక్ష్ములు ప్రసిద్ధం. వారు - ఆదిలక్ష్మి, ధైర్య లక్ష్మి, ధాన్యలక్ష్మి, గజలక్ష్మి, సంతాన లక్ష్మి, విజయ లక్ష్మి, విద్యాలక్ష్మి, ధన లక్ష్మి - ఆయా రూపాలలో ఆ దేవి ఆయా ఫలితాలను ఇస్తుందని భక్తులు విశ్వసిస్తారు.

ఇతర మతాలు, సంప్రదాయాలు
జైన, బౌద్ద కళలలో కూడా లక్ష్మీదేవి రూపకల్పన కొన్నిచోట్ల గమనించవచ్చును. గ్రీకు పురాణ దేవత ఆఫ్రొడైట్ మరియు రోమన్ పురాణ దేవత వీనస్ ల స్వరూప, కథాంశాలలోను లక్ష్మి స్వరూప కథాంశాలలోను కొంత సారూప్యత కనిపిస్తుంది.

బౌద్ధమతం సాహిత్యంలో మిళింద, పన్హ, సిరికాలకణ్ణి జాతక కథము, ధమ్మపధ అట్టకథలు శ్రీమాతను "సిరిమా" దేవతగా పేర్కొన్నాయి. ఆ కథల ప్రకారం ఆమె సౌందర్య, అదృష్ట, ప్రజ్ఞా శక్తులు ప్రసాదించే కరుణాంతరంగ. జైనమతం కల్పసూత్రం ప్రకారం వర్ధమాన మహావీరుడు జన్మించడానికి ముందు అతని తల్లికి కలిగిన స్వప్నాలలో శ్రీమాత కూడా ఉంది. సింధులోయ నాగరికతకు సంబంధించి లభించిన ప్రతిమలలో ఆభరణ భూషితలైన మాతృదేవతల ప్రతిమలున్నాయి. మౌర్యుల కాలానికి చెందిన కొన్ని శిల్పాలలో కూడా అలాంటి మాతృదేవతామూర్తులున్నాయి. ఈ మూర్తులే లక్ష్మీదేవి రూపానికి స్ఫూర్తినిచ్చి ఉండవచ్చును.

పూజలు, ఆచారాలు:
  • దీపావళి
  • శుక్రవారం
  • శ్రావణ శుక్రవారం (వరలక్ష్మీ వ్రతం)
మహాలక్ష్మ్యష్టకం:

శ్రీ లక్ష్మీ అష్టోత్తర స్తోత్రము - శ్రీ లక్ష్మీ అష్టోత్తర శత నామ స్తోత్రము

దేవ్యువాచ
దేవదేవ! మహాదేవ! త్రికాలఙ్ఞ! మహేశ్వర!
కరుణాకర దేవేశ! భక్తానుగ్రహకారక! ||
అష్టోత్తర శతం లక్ష్మ్యాః శ్రోతుమిచ్ఛామి తత్త్వతః ||
ఈశ్వర ఉవాచ
దేవి! సాధు మహాభాగే మహాభాగ్య ప్రదాయకమ్ |
సర్వైశ్వర్యకరం పుణ్యం సర్వపాప ప్రణాశనమ్ ||
సర్వదారిద్ర్య శమనం శ్రవణాద్భుక్తి ముక్తిదమ్ |
రాజవశ్యకరం దివ్యం గుహ్యాద్-గుహ్యతరం పరమ్ ||
దుర్లభం సర్వదేవానాం చతుష్షష్టి కళాస్పదమ్ |
పద్మాదీనాం వరాంతానాం నిధీనాం నిత్యదాయకమ్ ||
సమస్త దేవ సంసేవ్యమ్ అణిమాద్యష్ట సిద్ధిదమ్ |
కిమత్ర బహునోక్తేన దేవీ ప్రత్యక్షదాయకమ్ ||
తవ ప్రీత్యాద్య వక్ష్యామి సమాహితమనాశ్శృణు |
అష్టోత్తర శతస్యాస్య మహాలక్ష్మిస్తు దేవతా ||
క్లీం బీజ పదమిత్యుక్తం శక్తిస్తు భువనేశ్వరీ |
అంగన్యాసః కరన్యాసః స ఇత్యాది ప్రకీర్తితః ||

ధ్యానమ్
వందే పద్మకరాం ప్రసన్నవదనాం సౌభాగ్యదాం భాగ్యదాం హస్తాభ్యామభయప్రదాం మణిగణైః నానావిధైః భూషితామ్ |
భక్తాభీష్ట ఫలప్రదాం హరిహర బ్రహ్మాధిభిస్సేవితాం పార్శ్వే పంకజ శంఖపద్మ నిధిభిః యుక్తాం సదా శక్తిభిః ||
సరసిజ నయనే సరోజహస్తే ధవళ తరాంశుక గంధమాల్య శోభే |
భగవతి హరివల్లభే మనోఙ్ఞే త్రిభువన భూతికరి ప్రసీదమహ్యమ్ ||
ఓం ప్రకృతిం, వికృతిం, విద్యాం, సర్వభూత హితప్రదామ్ |
శ్రద్ధాం, విభూతిం, సురభిం, నమామి పరమాత్మికామ్ || 1 ||
వాచం, పద్మాలయాం, పద్మాం, శుచిం, స్వాహాం, స్వధాం, సుధామ్ |
ధన్యాం, హిరణ్యయీం, లక్ష్మీం, నిత్యపుష్టాం, విభావరీమ్ || 2 ||
అదితిం చ, దితిం, దీప్తాం, వసుధాం, వసుధారిణీమ్ |
నమామి కమలాం, కాంతాం, క్షమాం, క్షీరోద సంభవామ్ || 3 ||
అనుగ్రహపరాం, బుద్ధిం, అనఘాం, హరివల్లభామ్ |
అశోకా,మమృతాం దీప్తాం, లోకశోక వినాశినీమ్ || 4 ||
నమామి ధర్మనిలయాం, కరుణాం, లోకమాతరమ్ |
పద్మప్రియాం, పద్మహస్తాం, పద్మాక్షీం, పద్మసుందరీమ్ || 5 ||
పద్మోద్భవాం, పద్మముఖీం, పద్మనాభప్రియాం, రమామ్ |
పద్మమాలాధరాం, దేవీం, పద్మినీం, పద్మగంధినీమ్ || 6 ||
పుణ్యగంధాం, సుప్రసన్నాం, ప్రసాదాభిముఖీం, ప్రభామ్ |
నమామి చంద్రవదనాం, చంద్రాం, చంద్రసహోదరీమ్ || 7 ||
చతుర్భుజాం, చంద్రరూపాం, ఇందిరా,మిందుశీతలామ్ |
ఆహ్లాద జననీం, పుష్టిం, శివాం, శివకరీం, సతీమ్ || 8 ||
విమలాం, విశ్వజననీం, తుష్టిం, దారిద్ర్య నాశినీమ్ |
ప్రీతి పుష్కరిణీం, శాంతాం, శుక్లమాల్యాంబరాం, శ్రియమ్ || 9 ||
భాస్కరీం, బిల్వనిలయాం, వరారోహాం, యశస్వినీమ్ |
వసుంధరా, ముదారాంగాం, హరిణీం, హేమమాలినీమ్ || 10 ||
ధనధాన్యకరీం, సిద్ధిం, స్రైణసౌమ్యాం, శుభప్రదామ్ |
నృపవేశ్మ గతానందాం, వరలక్ష్మీం, వసుప్రదామ్ || 11 ||
శుభాం, హిరణ్యప్రాకారాం, సముద్రతనయాం, జయామ్ |
నమామి మంగళాం దేవీం, విష్ణు వక్షఃస్థల స్థితామ్ || 12 ||
విష్ణుపత్నీం, ప్రసన్నాక్షీం, నారాయణ సమాశ్రితామ్ |
దారిద్ర్య ధ్వంసినీం, దేవీం, సర్వోపద్రవ వారిణీమ్ || 13 ||
నవదుర్గాం, మహాకాళీం, బ్రహ్మ విష్ణు శివాత్మికామ్ |
త్రికాలఙ్ఞాన సంపన్నాం, నమామి భువనేశ్వరీమ్ || 14 ||
లక్ష్మీం క్షీరసముద్రరాజ తనయాం శ్రీరంగధామేశ్వరీమ్ |
దాసీభూత సమస్తదేవ వనితాం లోకైక దీపాంకురామ్ ||
శ్రీమన్మంద కటాక్ష లబ్ధ విభవద్-బ్రహ్మేంద్ర గంగాధరామ్ |
త్వాం త్రైలోక్య కుటుంబినీం సరసిజాం వందే ముకుందప్రియామ్ || 15 ||
మాతర్నమామి! కమలే! కమలాయతాక్షి!
శ్రీ విష్ణు హృత్-కమలవాసిని! విశ్వమాతః!
క్షీరోదజే కమల కోమల గర్భగౌరి!
లక్ష్మీ! ప్రసీద సతతం సమతాం శరణ్యే || 16 ||
త్రికాలం యో జపేత్ విద్వాన్ షణ్మాసం విజితేంద్రియః |
దారిద్ర్య ధ్వంసనం కృత్వా సర్వమాప్నోత్-యయత్నతః |
దేవీనామ సహస్రేషు పుణ్యమష్టోత్తరం శతమ్ |
యేన శ్రియ మవాప్నోతి కోటిజన్మ దరిద్రతః || 17 ||
భృగువారే శతం ధీమాన్ పఠేత్ వత్సరమాత్రకమ్ |
అష్టైశ్వర్య మవాప్నోతి కుబేర ఇవ భూతలే ||
దారిద్ర్య మోచనం నామ స్తోత్రమంబాపరం శతమ్ |
యేన శ్రియ మవాప్నోతి కోటిజన్మ దరిద్రతః || 18 ||
భుక్త్వాతు విపులాన్ భోగాన్ అంతే సాయుజ్యమాప్నుయాత్ |
ప్రాతఃకాలే పఠేన్నిత్యం సర్వ దుఃఖోప శాంతయే |
పఠంతు చింతయేద్దేవీం సర్వాభరణ భూషితామ్ || 19 ||
ఇతి శ్రీ లక్ష్మీ అష్టోత్తర శతనామ స్తోత్రం సంపూర్ణమ్

రచన: కోటి మాధవ్ బాలు చౌదరి


"తెలుగు-భారత్" జాలిక లాభాపేక్ష లేకుండా నడపబడుతున్నది. మన సంస్కృతీ, సంప్రదాయాలను మరింత లోతుగా విశ్లేషించి ప్రపంచానికి తెలియచేస్తూ మన ధర్మాన్ని కాపాడేందుకు మీ వంతు సహాయం చేయండి.
Supporting From Bharat:#buttons=(Accept !) #days=(20)

Our website uses cookiesLearn..
Accept !
To Top