నూతన వ్యాసములు:
latest

728x90

header-ad

Thursday, August 31, 2017

మత్స్యావతారము - Matsyavataram

మత్స్యావతారము - Matsyavataram

పరీక్షిన్మహారాజు త్రివిక్రముని వైభవమును తెలుసుకునేందుకు భగవానుని మొదటి అవతారమైన మత్స్యావతారమును గూర్చి వివరించమని శుక బ్రహ్మను కోరగా నైమిశారణ్యంలో సూత మహర్షి శౌనకాది మునులకు ఈ విధంగా వివరిస్తు న్నాడు.
  • భగవానుడు గోవులను, బ్రాహ్మణులను, దేవతలను, సాధువులను, వేదములను ధర్మమును రక్షించుటకై అవతారములను ధరించుచుండెను. భగవానుడు ఏ రూపమును ధరించిననూ ఆ రూపము యొక్క గుణ దోషములు తనకు అంటవు.
  • భగవంతుడు ప్రాక్వుత గుణయుక్తులు, ఉచ్ఛనీచాలు జీవుల మధ్య అవతరించినను తాను గుణరహితుడయ్యే అని శుక మహర్షి తెలుపుతున్నాడు.
నైమితిక ప్రళయము సంభవించినది. భూమి మొదలగు లోకములన్నియు జలమయమైనవి. ఆ సమయంలో బ్రహ్మదేవునికి నిద్రవచ్చెను. ఆ సమయంలో ఆయన నిద్రించుచుండగా నోటి నుండి వేదములు జారిపడగా హయగ్రీవుడను రాక్షసుడు వేదములను అపహరించెను. అంతట జగదీశ్వరుడు, ప్రభువు అయిన శ్రీహరి ‘శఫరి’ అను ‘మత్స్య రూపము’ను ధరించి హయగ్రీవుని వద్ద నుండి వేదములను గ్రహించి బ్రహ్మదేవునికి ఇచ్చెను.

హిందూమతం పురాణాలలో శ్రీమహావిష్ణువు యొక్క దశావతారాలలో మొదటి అవతారం మత్స్యావతారం. మత్స్యం అనగా చేప. ఈ అవతారంలో విష్ణువు రెండు పనులు చేసినట్లుగా పురాణ గాథ ప్రళయకాలంలో జీవరాసులను నావలో జలనిధిని దాటించడం. వేదాలను కాపాడడం.

భాగవత పురాణ గాధ
ఒకనాటి కల్పాంత సమయమున మహాయుగసంధిలో (ఛాక్షుస మన్వంతరము ముగిసి,
వైవస్వత మన్వంతరము ఆరంభమగుటకు ముందు) జరిగిన కథ ఇది.

వివస్వతుడు అనే సూర్యుని పుత్రుడు సత్యవ్రతుడు. అతనికి శ్రాద్ధదేవుడు అనే పేరు కూడా గలదు. ఆ సత్యవ్రతుడు కృతమాలిక అనే నదిలో అర్ఘ్యం ఇస్తున్నాడు. అప్పుడు అతని చేతిలోనికి ఒక చేపపిల్ల వచ్చింది. దానిని తిరిగి వదలి పెట్టబోగా అది తనను కాపాడమని కోరింది. సరే అని ఇంటికి తీసికొని వెళ్ళగా అది ఒక్క ఘడియలో చెంబుకంటె పెద్దదయ్యింది. ఇంకా పెద్ద పాత్రలో వేస్తే ఆ పాత్ర కూడా పట్టకుండా పెరిగింది. చెరువులో వేస్తే చెరువు చాలనంత పెరిగింది. నదిలో వేస్తె ఇంకా పెద్దయ్యింది. అప్పుడు రాజు "నీవెవరవు?" అని ఆ చేపను ప్రార్థించగా ఆ చేప తాను మత్స్యాకృతి దాల్చిన విష్ణువునని చెప్పింది. "శ్రీ లలనాకుచవీధీ కేళీ పరతంత్రబుద్ధిన్ క్రీడించు శ్రీహరీ! తామసాకృతిన్ ఏలా మత్స్యంబవైతివి?" అని రాజు ప్రశ్నించాడు.

అప్పుడా మత్స్యం ఇలా జవాబిచ్చింది. "రాజా! నేటికి 7వ దినమునకు బ్రహ్మదేవునకు ఒక పగలు పూర్తియై రాత్రి కావస్తున్నది. అప్పుడు సకల ప్రపంచమూ జలమయమౌతుంది. నా మహిమ వల్ల ఆ ప్రళయసాగరంలో ఒక నావ వస్తుంది. ఆ నావలో నిన్నూ, తపోమూర్తులైన మునులనూ, ఓషధులను, తిరిగి సృష్టికోసం అవుసరమైన మూలబీజాలనూ పదిలం చేసి నా శృంగము (ఒంటి కొమ్ము) తో ఆ నావను లాగి ప్రళయాంబోధిని దాటింతును" అని చెప్పెను.

సృష్టి కార్యంలో అలసిన బ్రహ్మ ఆ కల్పాంత సాయంసంధ్యలో రవ్వంత కునుకు తీసెను. ఇదే అదనుగా చూసుకొని హయగ్రీవుడనే రాక్షసుడు బ్రహ్మ దగ్గరనుండి వేదాలను చేజిక్కించుకొని మహాసముద్రంలోకి ఉరుకెత్తాడు. శ్రీమన్నారాయణుడు మత్స్యరూపంలో ఆ రాక్షసుని వెదకి, చంపి, వేదములను తిరిగితెచ్చి బ్రహ్మకిచ్చాడు.

ఆ రాక్షసుడిని సంహరించిన విధం పోతన భాగవతంలో ఇలా వర్ణించాడు (పోతన పద్యం)
ఉరకంభోనిధిలోని వేదముల కుయున్ దైత్యున్ జూచి వే
గరులాడించి ముఖంబు సాచి పలువీతన్ తోక సారించి మేన్
మెరయన్ దౌడలు గీరి మీసలడరన్ మీనాకృతిన్ విష్ణుడ
క్కరటిన్ దాకి వధించె ముష్టి దళిత గ్రావున్ హయగ్రీవున్
ఆ శ్రీమన్నారాయణుని సత్యవ్రతుడు ఇలా ప్రస్తుతించాడు (పోతన పద్యం)
చెలివై చుట్టమవై మనస్థితుడవై చిన్మూర్తివై ఆత్మవై
వలనై కోర్కెల పంటవై విభుడవై వర్తిల్లు నిన్నొల్లకే
పలువెంటన్ బడి లోకమక్కటా వృధా బద్ధాశమై పోయెడున్
నిలువన్నేర్చునె హేమరాశి గనియున్ నిర్భాగ్యుడంభశ్శయ్యాపహా!
సత్య వ్రతుని కీర్తనలకు సంతోషించి శ్రీమత్స్యావతారమూర్తి అతనికి సాంఖ్యయోగ క్రియను, పురాణ సంహితను ఉపదేశించెను. అందరితోను, మూలబీజములతోను ఉన్న ఆ నావను ప్రళయాంభోనిధిని దాటించెను.

సత్యవ్రతుడు ప్రస్తుతం నడుస్తున్న "వైవస్వత మన్వంతరానికి" అధిపతి అయ్యాడు.

మత్స్యావతారంలో శ్రీమహావిష్ణువు వెలసిన ప్రముఖ ఆలయము.
వేదనారాయణస్వామి ఆలయం నాగలాపురం


రచన: కోటి మాధవ్ బాలు చౌదరి

« PREV
NEXT »