అమీబియాసిస్‌ - కలుషిత ఆహారం వలన వచ్చే ప్రమాదకరమైన వ్యాధి

0
amiobasis-jirnasaya-vyadi

మన చుట్టూ ఉన్న పరిసరాలను మన అలవాట్లతో, ప్రవర్తనతో మలినం చేస్తున్నాము. తినే అన్నాన్ని, త్రాగే నీటిని, పీల్చేగాలిని చేతులారా మనమే కలుషితం చేసి, మన ఆరోగ్యాన్ని హానికరం చేసుకొంటున్నాము. ఇది అందరికి తెలియకపోవడం ఒక కారణమైతే, నిర్లక్ష్యం, అశ్రద్ద, తేలికభావం, జరుగుతన్న పద్ధతుల్లో మార్పుని అంగీకరించలేకపోవడం మరికొన్ని కారణాలు.
సమాజాన్ని పట్టి పీడిస్తున్న అతి సాధారణ వ్యాధుల్లో అమీబియాసిస్‌ ఒకటి. ఈ వ్యాధి ఎంటమీబా హిస్టలిటికా అనే క్రిమి వలన ఒకరినుంచి మరొకరికి అపరిశుభ్రమైన తాగు నీటి ద్వారా, సరిగ్గా ఉడకని, కలుషిత ఆహార పదార్థాల ద్వారా సంక్రమిస్తుంది.

ప్రపంచమంతటా ఈ వ్యాధి ఉన్నప్పటికీ, ఎక్కువగా ఉష్ణమండల ప్రాంతాలలో కనిపిస్తుంది. అమీబియాసిస్‌ను కలుగజేసే క్రిమి సిస్ట్‌ రూపంలోనూ, ట్రోఫోజాయిట్‌ రూపంలోనూ మానవ శరీరంలోకి ప్రవేశిస్తుంది.ట్రోఫోజాయిట్‌ రూపంలో ఉన్నవి జీర్ణాశయంలోని హైడ్రోక్లోరిక్‌ యాసిడ్‌ తాకిడికి నాశనమైపోతాయి. కాని సిస్ట్‌ రూంపలో ఉన్నవి మాత్రం ఆ యాసిడ్‌ ప్రభావాన్ని తట్టుకుని కిందకు ప్రయాణించి, పెద్దప్రేవుల్లో స్థానం ఏర్పరచుకుంటాయి.

ప్రేవులలోని కొన్ని ఎంజైమ్‌ల వలన సిస్ట్‌ చుట్టూ ఉన్న గోడ పలుచన అవుతుంది. తద్వారా ట్రోఫోజాయిట్‌లు బైటికి వెలువడుతాయి. ఇవి మలం ద్వారా వెలుపలికి వచ్చిన తరువాత జీవించలేవు.

ఇవి ప్రధానంగా ద్రవరూపంలో ఉన్న మలం ద్వారా బైటికి వస్తాయి. మలం ద్వారా బైటికి వచ్చిన సిస్ట్‌లు నీటిలోనూ, మట్టిలోనూ చాలాకాలం సజీవంగా ఉండి, అనుకూల పరిస్థితుల కోసం ఎదురు చూస్తుంటాయి. కొన్ని సార్లు వ్యాధి క్రిములు ఉన్న వ్యక్తిలో ఎటువంటి వ్యాధి లక్షణాలు కనిపించవు కానీ, వీరి వలన ఇతరులకు వ్యాధి సోకుతుంది.ఇటువంటి వారిని కేరియర్స్‌ అంటారు.
ఈ వ్యాధి క్రిములు శరీరంలో ప్రవేశించిన తరువాత వ్యాధి లక్షణాలు రెండు వారాలనుంచి రెండు నెలల లోపు బహిర్గతమవుతాయి. కార్టికోస్టీరాయిడ్స్‌, వ్యాధి క్షమత్వ శక్తిని తగ్గించే ఔషధాలు ఈ వ్యాధిని మరింత పుంజుకునేలా చేస్తాయి. ఈ క్రిములు ప్రేవుల్లో ఉండి వ్యాధి లక్షణాలను బహిర్గతం చేస్తుంటే ఇంటెస్టినల్‌ అమీబియాసిస్‌ అనీ, ఇతర భాగాల్లో వ్యాపించి ఉండి వ్యాధి లక్షణాలను బహిర్గతం చేస్తుంటే ఎక్స్‌ట్రా ఇంటెస్టినల్‌ అమీబియాసిస్‌ అనీ అంటారు. ఈ క్రిములు ప్రేవులనుంచి చొచ్చుకునిపోయి, రక్తం ద్వారా కాలేయంలోకి చేరి అక్కడ ఆబ్సె స్‌ను కలుగజేస్తాయి.అరుదుగా ఊపిరితిత్తులు,
మెదడులలోకి కూడా ఇవి ప్రవేశిస్తాయి.

ఇంటెస్టినల్‌ అమీబియాసిస్‌ వ్యాధి ఒక మోస్తరునుండి మధ్యమంగా ఉన్నప్పుడు రోజూ రెండు మూడు ద్రవ రూప విరేచనాలు అవుతాయి. ఇవి జిగురుగా, వాసనతో కూడి ఉంటాయి. కొంతమందిలో కడుపు నొప్పి, కడుపు ఉబ్బరం, దీర్ఘ కాలంగా ఉండే విపరీతమైన నీరసం, బరువు కోల్పోవడం జరుగుతుంది. ఇటువంటి లక్షణాలు కొన్ని రోజులు లేదా వారాలు కనబడుతూ, మరికొంత కాలం అదృశ్యమవుతూ ఉంటాయి. ఈ లక్షణాలేమీ లేని సమయంలో మలబద్ధకం ఉండవచ్చు.అమీబియాసిస్‌ వ్యాధి దీర్ఘకాలంగా ఉండటం వలన పెద్ద ప్రేవుల్లో, ముఖ్యంగా సీకం, డిసెండింగ్‌ కోలాన్‌ ప్రాంతాలలో అల్సర్లు ఏర్పడి, ఫ్లాస్క్‌ ఆకారాన్ని సంతరించుకుని, దళసరిగా తయారవుతాయి. ఆ భాగంలో నొక్కి చూడటం ద్వారా దీనిని గుర్తించవచ్చు.

ఇన్‌ఫెక్షన్‌ ఎక్కువై వ్యాధి తీవ్రరూపం దాల్చినప్పుడు దుర్వాసనతో కూడిన ద్రవరూప మలం రక్తం, జిగురులతో కలిసి రోజూ ఎక్కువసార్లు విసర్జించాల్సివస్తుంది. ఈ పరిస్థితి మరింత అధికమైనప్పుడు రోగికి జ్వరం 105 డిగ్రీల ఫారెన్‌ హీట్‌ వరకూ వస్తుంది. కడుపునొప్పి, మలద్వారం వద్ద అసౌకర్యమయైన నొప్పి, వాంతులు, అస్పష్టమైన కాలేయ వృద్ధి జరుగుతాయి. ఈ పరిస్థితుల్లో ప్రేవుల్లో రంధ్రాలు ఏర్పడి రక్తస్రావం జరుగవచ్చు.అపెండిసైటిస్‌ వ్యాధికి గురి కావచ్చు.

వ్యాధి పెరుగుదలలో భాగంగా పెద్ద ప్రేవులలో ఒక్కొక్కమారు ఒకటి కాని, అనేకం కాని చిన్ని లేదా ఒక మోస్తరు గ్రంథులలాంటి నిర్మాణాలు తయారవుతాయి.ఎండోస్కోపి ద్వారా వీటిని పరీక్షించవచ్చు. ఇవి చాలా ఎర్రగా ఉండి, తగిలిన వెంటనే రక్తం కారే స్వభావాన్ని కలిగి ఉంటాయి. బయాప్సీపరీక్ష ద్వారా గ్రాన్యు లేషన్‌ కణజాలాన్ని, అమీబా క్రిమిని స్పష్టంగా గుర్తించవచ్చు. వీటికి అమీబియాసిస్‌కు చేయాల్సిన చికిత్స జరుపకుండానే, శస్త్ర చికిత్స చేస్తే ప్రాణాపాయం కూడా సంభవించవచ్చు. వ్యాధి క్రిములు కాలేయానికి సోకినప్పుడు హెపాటిక్‌ అమీబియాసిస్‌ అంటారు. ఇందులో కాలేయం భాగం పెద్దదిగా తయారై నొప్పితో కూడి అసౌకర్యంగా ఉండి, జ్వరం, దగ్గుతోపాటు ఆకలి లేకపోవడం వంటి లక్షణాలు కనిపిస్తాయి. చెమటలు పడుతుంటాయి. కుడిభుజంలో నొప్పి ఉంటుంది.
హెపాటిక్‌ అమీబియాసిస్‌లో లివర్‌లో చీము తయారై పారంకైమా కణజాలాన్ని దెబ్బతీసి డయాఫ్రం అనే కండరాన్ని చొచ్చుకుపోయి, ఊపిరితిత్తులలోకిచీము చేరుతుంది. అది దగ్గు ద్వారా బైటికి వస్తుంది.
హెపాటిక్‌ అమీబియాసిస్‌ లక్షణాలు ఉన్నట్లుండి కాని, క్రమంగా కాని కనిపిస్తాయి. అరుదుగా లివర్‌లో ఇన్‌ఫెక్షన్‌ లేకపోయినప్పటికీ, ప్రేవులలోని అమీబా క్రిముల ప్రభావంతో లివర్‌ ఎన్‌లార్జిమెంట్‌ ఉంటుంది. యాంటీ అమీబిక్‌ చికిత్స ద్వారా దీనిని నయం చేయవచ్చు.

ఈ వ్యాధి నిర్ధారణకు మలపరీక్ష, ఎక్స్‌రే, సిగ్మాయిడోస్కోపి ఉపకరిస్తాయి. హెపాటిక్‌ అమీబిక్‌ లివర్‌ ఆబ్సెస్‌ను ఎక్స్‌రే ద్వారానూ, స్కాన్‌ిం ద్వారానూ, చీమును ఆస్పిరేట్‌ చేసి పరీక్షించడం ద్వారానూ నిర్ధారించవచ్చు. అమీబియాసిస్‌ చికిత్సకు ఆయుర్వేదంలో కుటజఘనవటి, కుటజఫాణితం, కుటజారిష్ట, బిల్వాదిగుటిక తదితర అనేక ఔషధాలు ఉన్నాయి. వీటిని వైద్యపర్యవేక్షణలో వాడటం వలన మంచి ప్రయోజనం ఉంటుంది.

రచన: కోటి మాధవ్ బాలు చౌదరి

కామెంట్‌ను పోస్ట్ చేయండి

0 కామెంట్‌లు
* Please Don't Spam Here. All the Comments are Reviewed by Admin.
కామెంట్‌ను పోస్ట్ చేయండి (0)
Translate this post ⬇

buttons=(Accept !) days=(0)

Our website uses cookies. Learn More
Accept !
To Top