రామసేతు వాస్తవమే అని తేల్చిన శాస్త్రవేత్తలు..

0


రామసేతు మానవ నిర్మితమేనా? సీతను విడిపించేందుకు రాముడే దీనిని కట్టాడా? అసలు నిజంగా ఈ వంతెన ఉందా? లాంటి ప్రశ్నలతో ‘‘రామసేతు గాథ’’ మరోసారి వార్తల్లో నిలిచింది. డిస్కవరీకి చెందిన సైన్స్‌ ఛానెల్‌ ‘వాట్‌ ఆన్‌ ఎర్త్‌’ పేరిట ఓ ప్రత్యేక కార్యక్రమం నిర్వహిస్తోంది. తాజాగా దీనిలో రామసేతు గురించి ప్రసారం చేయనున్నట్లు ప్రోమో విడుదల చేసింది. నాసా ఉపగ్రహ చిత్రాలు, పురాతత్వ శాస్త్రవేత్తల పరిశోధనల ఆధారంగా.. ఈ వంతెన ‘‘మానవ నిర్మితమే’’నని ఛానెల్‌ దీనిలో చెబుతోంది.

దిల్లీ: రామసేతుపై సరికొత్త వాదన తెరపైకి వచ్చింది. రామసేతు పొడవు దాదాపు 30 మైళ్లు. ఇది తమిళనాడులోని పంబన్‌ దీవి, శ్రీలంకలోని మన్నార్‌ దీవులను కలుపుతోంది. ఇసుక తిన్నెపై సున్నపు రాళ్లను జతచేసినట్లు కనిపించే ఈ నిర్మాణాన్ని శాస్త్రీయ కోణంలో పరిశోధకులు విశ్లేషించారు. ఇక్కడి ఇసుక తిన్నెలు సహజమైనవేనని, కానీ దానిపై రాళ్లు మాత్రం వేరొకచొటి నుంచి తీసుకొచ్చారని తేల్చారు. దీని కోసం రాళ్లు, ఇసుక వయసును నిర్ధారించే పరిజ్ఞానాన్ని ఉపయోగించారు. దీంతో రాళ్లు 7,000 ఏళ్లనాటివని తేలిందని ప్రముఖ పురావస్తు శాస్త్రవేత్త చెల్సియా రోస్‌ తెలిపారు. ఇసుక తిన్నెలు మాత్రం నాలుగు వేల ఏళ్లనాటివని గుర్తించినట్లు వివరించారు. అంతేకాదు ఈ వంతెన దాదాపు ఐదు వేల ఏళ్ల కిత్రం నిర్మించి ఉండొచ్చని అంచనావేశారు. దీన్ని ‘‘అద్భుత మానవ నిర్మాణం’’గా అభివర్ణించారు. మరోవైపు భారత దేశం, లంకలను కలిపేందుకు శ్రీరాముడు ఈ వంతెనను నిర్మించాడనే విశ్వాసాన్నీ దీనిలో ప్రముఖ భూగర్భ శాస్త్రవేత్త డా.అలాన్‌ లెస్టెర్‌ ప్రస్తావించారు.

భిన్న వాదనలు ప్రచారంలో.. 
రామసేతుపై భిన్న వాదనలు ప్రచారంలో ఉన్నాయి. మంచు యుగంనాడు భారత్‌, శ్రీలంకను ఇది కలిపేదని కొందరు చెబుతుంటే.. శ్రీలంక, భారత్‌ ఒకప్పుడు కలిసేవుండేవని, 1,25,000 ఏళ్ల కిత్రం ఇవి విడిపోయాయని మరికొందరు వివరిస్తున్నారు. రావణుడి చెర నుంచి సీతను విడిపించేదుకు శ్రీరాముడు దీన్ని నిర్మించినట్లు రామాయణం చెబుతోంది. సేతు సముద్రం ప్రాజెక్టుపై సుప్రీం కోర్టులో విచారణ జరుగుతున్నప్పుడు.. ప్రస్తుతం ఇక్కడ వంతెనే లేదని యూపీఏ ప్రభుత్వం కొట్టిపారేసింది.

ఏమిటీ సేతు సముద్రం? 
ప్రస్తుతం మన దేశ తూర్పు తీరం నుంచి పశ్చిమ తీరానికి నౌక చేరుకోవాలంటే శ్రీలంకను చుట్టిరావాల్సి వస్తోంది. దీంతో ప్రయాణ సమయాన్ని తగ్గించడమే లక్ష్యంగా సేతు సముద్రం ప్రాజెక్టును యూపీఏ-1 తెరపైకి తెచ్చింది. రామసేతు గుండా పడవలు ప్రయాణించేలా దీనిలో ప్రాజెక్టులు ప్రతిపాదించారు. దీంతో దాదాపు 350 నాటికల్‌ మైళ్ల ప్రయాణ సమయం కలిసి వస్తుందని అంచనా. దీన్ని సవాల్‌చేస్తూ సుప్రీం కోర్టులో వరుస పిటిషన్లు దాఖలయ్యాయి. వీటిపై 2008లో సుప్రీం విచారణ చేపట్టింది. అసలు ఈ వంతెన మానవ నిర్మితమా? కాదో తేల్చాలని భారత చారిత్రక పరిశోధన మండలి (ఐసీహెచ్‌ఆర్‌)కి బాధ్యతలు అప్పగించింది. ప్రస్తుతం ఈ విషయంపై పరిశోధన సాగుతోంది.

డీఎంకే బాటలో కాంగ్రెస్‌! 
సుప్రీం కోర్టులో రామసేతు వాదనను కాంగ్రెస్‌ తిరస్కరించడానికి డీఎంకేనే కారణమని తాజాగా వెలుగులోకి వచ్చింది. ఆనాడు సోలిసిటర్‌ జనరల్‌గా పనిచేసిన మోహన్‌ పరాశరన్‌ స్పందించారు. ‘ఆ సమయంలో భిన్నమైన వాదనలు కేంద్రం ముందున్నాయి. అప్పటి నౌకాయాన మంత్రి డీఎంకేకు చెందినవారు. రామసేతుపై డీఎంకేకు విశ్వాసం లేదని అప్పట్లో వార్తలు వినిపించేవి. బహుశా రామసేతును కాంగ్రెస్‌ తిరస్కరించడానికి ఇదీ ఒక కారణమై ఉండొచ్చు’అని ఆయన వివరించారు.

భాజపా వాదననే నొక్కిచెప్పింది 
రామసేతుపై భాజపా వాదననే తాజా ఛానెల్‌ పరిశోధన నొక్కి చెప్పిందని కేంద్ర మంత్రి పీయూష్‌ గోయెల్‌ చెప్పారు. రాముడు ఇక్కడ జీవించాడని భాజపా నమ్ముతున్నట్లు ఆయన పునరుద్ఘాటించారు. ‘హిందూ మతం విషయంలో కాంగ్రెస్‌ ఎప్పుడూ క్షమాపణలు చెప్పుకోవాల్సిన పరిస్థితులు రావడం దురదృష్టకరం. రామసేతు వివాదం ఇక్కడితో సద్దుమణిగిందని అనుకుంటున్నా. ఆ మహా నిర్మాణాన్ని మనం గౌరవించాలి. దానికి ఎలాంటి హానీ జరుగకూడదు’అని ఆయన చెప్పారు.

____EENADU

రచన: కోటి మాధవ్ బాలు చౌదరి

కామెంట్‌ను పోస్ట్ చేయండి

0 కామెంట్‌లు
* Please Don't Spam Here. All the Comments are Reviewed by Admin.
కామెంట్‌ను పోస్ట్ చేయండి (0)

buttons=(Accept !) days=(0)

Our website uses cookies. Learn More
Accept !
To Top