బెజవాడ కనకదుర్గమ్మ ఆలయం - Kanakadurgamma Temple - Vijayawada

0
బెజవాడ కనకదుర్గమ్మ ఆలయం - Kanakadurgamma Temple - Vijayawada

బెజవాడ కనకదుర్గమ్మ ఆలయం:
కనకదుర్గ గుడి, ఆంధ్ర ప్రదేశ్, భారతదేశం లో ఒక ప్రసిద్ధమైన దేవస్థానం. ఇది విజయవాడ నగరం లో కృష్ణా నది ఒడ్దున ఇంద్రకీలాద్రి పర్వతం మీద ఉన్నది. ఇది ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోనే రెండో పెద్ద దేవాలయం. విజయవాడ పేరు చెప్పగానే కనక దుర్గ ఆలయం గుర్తుకు వస్తుంది. హిందూ పురాణాలలో అమ్మవారి గురించి ప్రస్తావన ఉంది. ఆలయంలో అమ్మవారి విగ్రహం సుమారు నాలుగు అడుగుల ఎత్తు ఉంటుంది. మిరిమిట్లు గొలిపే ఆభరణాలు, పూలతో అలంకరించబడి ఉంటుంది. విగ్రహానికి ఎనిమిది చేతులు ఉన్నాయి. ఒక్కో చేతిలో ఒక్కో ఆయుధం ఉంటుంది. త్రిశూలం తో మహిషాసురుని గుండెలో పొడుస్తున్న భంగిమ లో ఉంటుంది. ఇక్కడ దుర్గా దేవి స్వయంభువుగా (తనకు తానుగా) వెలసిందని క్షేత్ర పురాణంలో చెప్పబడింది. ఆది శంకరాచార్యులవారు తమ పర్యటనలలో ఈ అమ్మవారిని దర్శించి ఇక్కడ శ్రీచక్ర ప్రతిష్ఠ చేసారని ప్రతీతి. ప్రతి సంవత్సరం లక్షలమంది ఈ దేవాలయానికి వచ్చి దర్శనం చేసుకొంటారు.

రాక్షసుల బాధ భరించ లేక ఇంద్రకీలుడనే మహర్షి దుర్గాదేవిని గురించి తపస్సు చేసి అమ్మవారిని తనపైనే నివాసముండి రాక్షసులను సంహరించమవి ప్రార్థించగా, ఆ తల్లి అక్కడ ఇంద్రకీలాద్రి (ఇంద్రకీలుడి కొండ) పై కొలువుతీరింది. అర్జునుడు ఈ కొండ పై శివుని గురించి తపస్సు చేసాడని కూడా ప్రతీతి. ఈ ఆలయానికి హిందూ పురాణాల్లో ప్రత్యేకమైన స్థానం ఉంది. శివలీలలు, శక్తి మహిమలు మొదలైనవి ఆలయంలోని ఆవరణలో అక్కడక్కడా గమనించవచ్చు.

క్షేత్ర వైభవం:
పూర్వం మహా భారత కాలంలో పాండవ మధ్యముడు పాశుపతాస్త్రమును సంపాదించటానికి ఇంద్రకీలాద్రిపై తపమొనరించి నాడట. అందుచేత విజయమును సాధించిన అర్జునిడి నామములలో విజయుని పేరు సార్ధకనామంగా విజయవాడగా రూపొందినదని భావము. అనాది నుండి గొప్ప తీర్థయాత్రా స్థలంగా పేరు గాంచింది. ప్రతి పన్నెండు సంవత్సరాలకి జరిగే కృష్ణ పుష్కరోత్సవములను లక్షలాది మంది యాత్రికులు సందర్శిస్తారు.
ఇంద్రకీలాద్రిపై వెలసిన కనకదుర్గాలయం కొండ మధ్యభాగంలో వున్నది. కొండ క్రిందనే విజయేశ్వరాలయము, ప్రక్కనే శంకరమఠం ముందుగా దుర్గాలయం చేరటానికి మెట్లున్నాయి. ఇప్పుడే నూతనంగా కొండమీదకి సరాసరి రోడ్డుమార్గమును నిర్మించి మినీ బస్సు సౌకర్యంకూడా ఏర్పరిచారు, ఈ మినీ బస్సు నగర ప్రధాన కూడలులను స్పృశిస్తూ సత్యనారాయణ పురం రైల్వే క్వార్టర్సు వరకు వున్నది. 
అమ్మవారు మహా తేజోమహిమతో అలరారుతుంది. నిత్యమూ యాత్రికులు సందర్శించటానికి వీలుగా ఉదయం ప్రాతః కాలంలో 5 గం.ల నుండి 12 గం. ల వరకు, మరల సాయంత్రం 2 గం. ల నుండి రాత్రి 9 గం.ల వరకు పూజలు జరుగుతుంటాయి. విద్యుద్దీపాలంకరణ చూడ ముచ్చటగా చేయబడుతుంది. దుర్గమ్మ వారి ఆలయము ఆనుకునే మల్లేశ్వారాలయం కూడా వుంది. శ్రీ దుర్గా మల్లేశ్వరాలయాల మద్య విద్యుత్ జల ప్రసార వైచిత్రితో రాసలీల, గంగావతరణ దృశ్యాలు కడు రమణీయంగా అమర్చబడినాయి. కొండ మీది అమ్మ వారి దర్శనం చేయగానే సుందరమైన నగరమంతా కృష్ణా నదీ తీర రమ్యతలతో మేళవించి నగర దర్శనం మహాద్భుతమైన అనుభూతి. అలాగే అదే త్రోవనే కొన్ని మెట్లు దిగి మరి కొన్ని మెట్లు ఎక్కిన శ్రీ మల్లేశ్వరాలయం చేరవచ్చును. ఇది కూడా ఒక అనాది దేవాలయము. శ్రీ మల్లేశ్వరుని దర్శించి మెట్లుదిగి కొంత దూరం నడిస్తే క్రొత్తగుళ్ళు అని ప్రసిద్ధి గాంచిన కొన్ని దేవాలయాల సముదాయమును ఒకే చోట కాంచనగును.

ఇక్కడ శ్రీ వెంకటేశ్వర, కోదండరామ, శివాలయములు ఒకే ఆవరణలో వుండటం చూడగా శివకేశవుల అబేధత్వము దర్శనీయ భావన కలుగుతుంది.


రచన: కోటి మాధవ్ బాలు చౌదరి

కామెంట్‌ను పోస్ట్ చేయండి

0 కామెంట్‌లు
* Please Don't Spam Here. All the Comments are Reviewed by Admin.
కామెంట్‌ను పోస్ట్ చేయండి (0)

buttons=(Accept !) days=(0)

Our website uses cookies. Learn More
Accept !
To Top