హోలీ - Holi Festival

హోలీ
హొలీ అనేది రంగుల పండుగ. వసంతోత్సవం లేదా కామునిపండుగ అని కూడా పిలుస్తారు. నీళ్ళలో రంగులు కలిపి చల్లుకోవడం, రంగు పౌడర్ మొహాలకు రాసుకోవడం చేస్తారు.
హోలీ...రంగుల కేళీ!
ఫాల్గునమాసం... పౌర్ణమిసమయం... చల్లగాలులు వేడెక్కే వేళ... లేలేతచిగుళ్లతో విరబూసిన పూరెమ్మలతో చెట్లన్నీ వసంతరాగాలతో పులకిస్తుండగా... హోలీ వచ్చేస్తుంది... రంగుల వసంతాన్నీ ఆనందాల తుళ్లింతల్నీ వెంటేసుకుని.

చిన్నాపెద్దా అంతా వీధుల్లో గులాములు చల్లుకుంటూ రంగునీళ్లల్లో తడిసిముద్దవుతూ కేరింతలతో తుళ్లిపడుతూ చెమ్మకేళీలు ఆడుకునే ఆనందాలహేలే హోలీ లేదా రంగ్‌పంచమి లేదా కాముని పున్నమి. దసరా, దీపావళి మాదిరిగానే దేశవ్యాప్తంగా ఈ సంబరం జరుపుకోవడం విశేషం. పౌరాణిక ప్రాశస్త్యంలో ప్రాంతాలవారీగా తేడాలుంటే ఉండొచ్చుగాక... జరుపుకునే పద్ధతి మాత్రం దాదాపుగా ఒకటే.

మనదేశంతోపాటు నేపాల్‌, బంగ్లాదేశ్‌, పాకిస్తాన్‌, శ్రీలంక, ఇంకా హిందువులు ఎక్కువగా ఉన్న సురినామ్‌, గయానా, దక్షిణ ఆఫ్రికా, ట్రినిడాడ్‌, ఇంగ్లాండ్‌, అమెరికా, మారిషస్‌, ఫిజి దేశాల్లోనూ ఏటా హోలీ వేడుకలు ఘనంగా జరుగుతాయి.
హోలీ - Holi Festival
రాధాకృష్ణుల చెమ్మకేళి
రాధాకృష్ణుల చెమ్మకేళి!
బ్రజ్‌ ప్రాంతంలో హోలీ అంటే ప్రేమబాసలూ చిలిపి తగవులూ అయితే మధుర, బృందావనం, నందగావ్‌, బర్సానాల్లో ఈ వేడుక తీరే వేరు. సుమారు 16 రోజులపాటు హోలీ జరుగుతుంది. నందగావ్‌ని శ్రీకృష్ణజన్మస్థలంగానూ బర్సానాని రాధ పుట్టిన ఊరుగానూ భావించి అక్కడ పండగ చేసుకుంటారు. వీళ్లిద్దరి ప్రేమబాసలూ చిలిపితగవులూ అక్కడి జానపదసాహిత్యంలో ఇప్పటికీ నిలిచే ఉన్నాయి. వాటిని ప్రతిబింబిస్తుంది అక్కడి హోలీ పండగ. నందగావ్‌ కృష్ణులు బర్సానాలోని రాధారాణి ఆలయం దగ్గర జెండా పాతి మాదే విజయం అన్నట్లుగా గేలిచేస్తుంటే లావుపాటి కర్రలతో వాళ్లను వెళ్లగొట్టేందుకు ప్రయత్నిస్తారు బర్సానా రాధలు. చివరిరోజున ఇరుపక్షాలూ రంగులు చల్లుకోవడంతో ఈ వేడుక ముగుస్తుంది. అందుకే ఈ వేడుకను 'లాత్‌మార్‌ హోలీ' అంటారక్కడ. అంతేకాదు, పాలమీగడవంటి రాధ ఒంటిఛాయతో తన శ్యామవర్ణాన్ని పోల్చుకుని కృష్ణయ్య చిన్నబుచ్చుకుంటే యశోద రాధ వెుహానికి ఇంత రంగుపూసిందనీ అలా ఈ పండగ వెుదలైందనీ చెప్పే కథలు అక్కడ ప్రాచుర్యంలో ఉన్నాయి.

హోలికాదహనం:
ఇక ఉత్తరభారతంలో అయితే రాక్షసత్వం నశించి దైవత్వం నిలిచి ఉంటుందనడానికి సూచనగా ఈ పండగ చేసుకుంటారు. అందుకే హోలీకి ముందురోజు హోలికా దహనం చేస్తారు ప్రహ్లాదుడిని స్మరిస్తూ.

ప్రహ్లాదుడినోట హరినామస్మరణ వినలేని హిరణ్యకశిపుడు అతన్ని రకరకాలుగా హింసిస్తుంటాడు. ఏదీ ఫలించక చివరకు విసిగిపోయి హోలిక(ప్రహ్లాదుడి అక్క)ఒడిలో కూర్చుని మంటలకు ఆహుతి కమ్మని ఆజ్ఞాపిస్తాడు. హోలిక కప్పుకున్న కంబళికున్న శక్తులవల్ల ఆ మంటలు ఆమెనేమీ చేయలేవు. కానీ ఆశ్చర్యకరంగా ఆ కంబళి జారి ప్రహ్లాదుడిని చుట్టుకుంటుంది. హోలిక చనిపోతుంది. అందుకే దానికి హోలికాదహనం అని పేరు.

మన్మథలీల:
మనతోపాటు మిగిలిన దక్షిణాది రాష్ట్రాల్లో ఈ పండగను కాముని పున్నమి లేదా కామదహనం అని పిలుస్తారు. దీని పౌరాణికగాథ వేరు. పార్వతి బాధ చూడలేని మన్మథుడు శివదీక్షకు అంతరాయం కలిగించి ఆ దేవదేవుని మనసులో ప్రేమభావనలు అంకురింపచేసేందుకు పూలబాణం వేస్తాడు. కానీ ముక్కంటి ఆగ్రహించి మూడోనేత్రం తెరవడంతో కామదేవుడు భస్మం అవుతాడు. ఆ తరవాత రతీదేవి ప్రార్థించడంతో మన్మథుణ్ణి బతికిస్తాడుగానీ అతనికి దేహం ఉండదు. దాంతో ఆమె అతన్ని చూడగలుగుతుంది కానీ తాకలేదు. అందుకే ఆ రోజు గడ్డితో మన్మథుడి బొమ్మ చేసి మంటల్లో కాల్చి కాముని దహనంగా జరుపుకుంటారు. క్షణికమైన భౌతికవాంఛలకీ అదుపులేని కోరికలకీ అడ్డుకట్ట వేయాలన్నదే ఈ పండుగలోని పరవోద్దేశం.

గుజరాత్‌లో అయితే మంటలతోపాటు పురుషులు ఉట్టికొడుతుంటే స్త్రీలు వాళ్లమీద రంగునీళ్లు చల్లడం ద్వారా హోలీ జరుపుకుంటారు. మహారాష్ట్రియన్లు మంటలు వేసి అగ్నిదేవునికి రకరకాల ఫలహారాలతో నైవేద్యం పెట్టి పూర్వీకుల్ని తలచుకుంటారు. రాజస్థానీయులు ఎలుగెత్తి పాడి ఆడే జానపద పాటలూ నృత్యాలతో ఈ రంగులసంబరం అంబరాన్ని తాకుతుంది. ఈశాన్యరాష్ట్రాలతోపాటు కాశ్మీర్‌లోనూ హిమాచల్‌ప్రదేశ్‌లోనూ హోలీ మంటలూ రంగులూ పూజలూ ఉల్లాసాన్ని పంచిస్తాయి.

వసంతపంచమి:
పశ్చిమబెంగాల్‌, బంగ్లాదేశ్‌ల్లో మాత్రం ఈ పండగను వసంతపంచమి పేరుతో జరుపుకుంటారు. ఉదయాన్నే పిల్లలు కాషాయరంగు లేదా తెలుపు దుస్తులు ధరించి పూలమాలలు మెడలో వేసుకుని ఎక్‌తారా, డబ్రి, వీణ వంటివి వాయిస్తూ పాటలు పాడుతూ నృత్యం చేస్తారు. దీన్నే డోల్‌ పూర్ణిమ, ఊయల పండగ అని కూడా అంటారు.

హోలీని జాతీయ పండగగా జరుపుకునే నేపాల్‌లో ముస్లింలు, క్రిస్టియన్లు కూడా పాల్గొంటారు. తేజోవంతమైన ఈ పండగ దుఃఖాన్ని పోగొట్టి జీవితాన్ని రంగులమయం చేస్తుందని భావిస్తారు వాళ్లు. ఈ పండగజాడలు పలు ప్రపంచదేశాల్లోనూ వివిధపేర్లతో కనిపిస్తున్నాయి.

పేర్లు వేరయినా, పూజలూ ప్రసాదాలూ పిండివంటలూ వేరయినా, జరుపుకునే పద్ధతులు వేరయినా రంగుల పండగలోని పరవోద్దేశం ఒక్కటే... చలికాలం వెళ్లి వేసవి వచ్చే వేళలో వసంతరుతువుకి ఆహ్వానం పలికే వేడుకే హోలీ. వాతావరణం మారే ఈ సమయంలో జ్వరాలూ జలుబులూ వచ్చే అవకాశం ఉంది. అవేమీ రాకుండా ఉండేందుకే వేప, బిల్వ, అగ్నిపూలు... వంటి ఔషధగుణాలున్న ఆకులూ పువ్వుల పొడుల్ని పసుపూ కుంకుమలతోపాటుగా నీళ్లలో కలిపి చల్లుకునే ఈ వేడుక పుట్టుకొచ్చిందన్నది ఆయుర్వేద పండితుల విశ్లేషణ. ఎందుకంటే ఈ నీళ్లు శరీరాన్ని చల్లబరుస్తాయి. తరవాత చలువచేసే పానీయాలు తాగి మిఠాయిలు తింటారు. మనదగ్గర శ్రీరామనవమికి బుక్కాపిండి, పసుపునీళ్ల వసంతాల్ని చల్లుకోవడం కూడా ఈ కోవకు చెందినదే.

అయితే ఆనాటి ఆరోగ్యకరమైన సంప్రదాయం క్రమంగా రంగులపండగగా మిగిలిపోయింది. వసంతంలో విరబూసే పూలచెట్లు క్రమంగా అంతరించిపోవడంతో కృత్రిమరంగులు ఆ స్థానాన్ని భర్తీచేశాయి. దాంతో ఈ పండగ ప్రమాదకరంగానూ మారింది. కృత్రిమరంగులవల్ల చర్మక్యాన్సర్లు, ఎలర్జీలు, కళ్లు దెబ్బతినడం వంటి నష్టాలెన్నో. ఇటీవలఆరోగ్యస్పృహ పెరగడం, రంగుల్లోని విషపదార్థాల గురించి విస్తృతంగా ప్రచారం చేయడంతో సేంద్రియ రంగులతోనే... చెమ్మకేళీ అంటున్నారంతా. అదే జరిగితే హోలీ... అందరికీ ఆనందాన్ని పంచే అసలు సిసలైన రంగులకేళి!

రచన: కోటి మాధవ్ బాలు చౌదరి

buttons=(Accept !) days=(0)

Our website uses cookies. Learn More
Accept !
To Top