కర్మ మరియు కర్మరాధన సిద్ధాంతం - Karma and Karmardhana Siddantam

0
కర్మ మరియు కర్మరాధన సిద్ధాంతం - Karma and Karmardhana Siddantam

కర్మే ఆరాధన .
నిన్ను నువ్వు దిద్దుకో, నీ కర్తవ్యాన్ని నిర్వర్తిస్తూ ముందుకు పో, చేస్తున్న పని ఏదైనా సరైన సమయంలో సక్రమపద్ధతిలో నియమపూర్వకంగా చెయ్యి!' అని అప్పుడప్పుడు పెద్దవాళ్ళు మనల్ని ఆదేశిస్తారు, హెచ్చరిస్తారు. ఆ ప్రకారం విధుల నిర్వహణను బతుక్కి భరోసాగా చేసుకొని నడచుకొంటే జీవిత నౌక ఆనంద తరంగాల్లో తేలియాడుతుంది. బతుకులో బంగారం పండుతుంది.

పొలంలో బంగారం పండాలంటే రైతుబిడ్డ అదునుపదును చూసుకొని పొలంపనులు చేస్తూ ఉండాలి. ఉద్యోగి తన పనిని తాను సకాలంలో నియమబద్ధంగా చేసుకుంటూపోతే అతని జీవితం నల్లేరుపై బండిలా సాఫీగా హాయిగా సాగిపోతుంది. క్రమశిక్షణతో విద్యనార్జించిననాడే ఆ విద్యార్థి కన్న పసిడికలలు భావిజీవితంలో మేలైన రీతిలో పండుతాయి. కుటుంబ సంరక్షణలో తల మునకలై ఉన్న గృహస్థు కూడా సంఘజీవిగా సాటి మానవుల కష్టసుఖాల్లో పాల్గొని వారికి చేయూతనివ్వాలి. తనకున్న ధన భుజ బుద్ధి బలాలతో ఇరుగుపొరుగు వారికి సాయపడాలి. వృద్ధులైన తల్లిదండ్రుల సేవ చేయాలి. అప్పుడే అతని గృహస్థ జీవితం పది కాలాల పాటు పచ్చగా ఉంటూ పండంటి జీవితంగా అలరారుతుంది. ఈ విధుల నిర్వహణలో ఎన్నో ఆటంకాలు, విఘ్నాలు ఎదురవుతాయి. వాటికి లొంగకుండా నిర్భయంగా ముందుకే సాగిపోవాలి!

ప్రతీవ్యక్తీ తన విధిని తాను సక్రమంగా నిర్వహిస్తే బతుకుబండి గతుకుల్లో పడకుండా సాఫీగా ముందుకు సాగిపోతుంది. బతుకు బంగారమవుతుంది. అదే జీవిత పరిపూర్ణ్త .ప్రకృతి నుండి పుట్టిన ప్రతిజీవి దేవుడే .ప్రకృతే దైవము .రాముడు , యేసు , అల్లా , బుద్ధుడూ ప్రకృతినుండి పుట్టినవారే . అందరి పుట్టుకకు మూలమైన ప్రకృతి అనంతము ,అభేదము ,అజామరము .మిగతా వారంతా ఆప్రకృతి దూతలే .

ప్రకృతి పంచభూతాల సమ్మేళనము:
జీవికి జీవే శత్రువు.
జీవికి జీవే మిత్రుడు ,
జీవికి జీవే దెయ్యము ,
జీవికి జీవే దేవుడు ,
విశ్వదాభిరామ వినురవేమ.
ప్రకృతి ఇచ్చిన జీవే దేవుడు, మనకిచ్చిన వరము .దేవుడు ఎక్కడో లేడు ... మనలోనే ఉన్నాడు . నీలోఉన్న దైవత్వాన్ని మేల్కొపు.. నీ కర్మని సక్రమము గా నిర్వర్తించుము ...ఫలితము దానంతట అదే వస్తుంది .

భారత దేశ ఆధ్యాత్మికత అఖండం. అనితరసాధ్యం. అనాదిగా వారసత్వంగా, రక్తగతంగా వస్తున్న ఆత్మభావన, ఏకాత్మతా అవగాహనే దీనికి కారణం. భారతీయులం కొండల్ని, వృక్షాల్నీ ఆధ్యాత్మిక దృష్టితో చూస్తాం. మన భగవత్‌ జిజ్ఞాస అలాంటిది. ధ్యానంలో నిమగ్నమైన యోగి పుంగవుల్లా, రుషి శ్రేష్ఠుల్లా నిశ్చలంగా, ఏకాగ్రతతో ధ్యానిస్తున్న ఉన్నత పర్వతమూర్తుల్ని ముగ్ధులై భావనా తత్పరతతో తిలకిస్తుంది భారతీయ భక్తిభావం.

భగవంతుడు ఎక్కడ ఉన్నాడు? కొండలు, వృక్షాల్లోనా? కాదు. అంతేకాదు. పుట్టలు, గుట్టలు, పశువులు, పక్షులు, విషసర్పాలు, హీన, దీన బడుగు జీవులు, జంతువులు, చరాచర జీవ వస్తుజాలం... ఇందుగల డందు లేడను సందేహం లేకుండా అంతటా, అన్నిటా, ఎల్లెడలా అణుమాత్రం కాదు కాదు- పరమాణు మాత్రం తేడా లేకుండా నిండిఉన్నాడు. ఈ ప్రకృతి, ప్రపంచం యావత్తూ పంచభూత నిర్మితం అయినప్పుడు, పంచభూతాలను దైవాలుగా కొలుస్తున్నప్పుడు... ఇక దైవం కానిదేముంది? దైవానికి అతీతంగా ఏం మిగిలిఉంది? అద్వైతాన్నీ, ఏకాత్మతా భావాన్నీ గ్రహించి ఆరాధించే భారతీయ తత్వం అణువణువునా ఆత్మ చైతన్యాన్ని గమనిస్తూనే ఉంది. గుర్తిస్తూనే ఉంది. అందుకే కొండలు, వృక్షాలు, సర్పాలు, పక్షులు, పుట్టలు, గుట్టలు, మనుషులు, నదీనదాలు... ఏది కాదు... అన్నీ, అన్నింటా భగవదంశను గుర్తించి వెలికితీసి లబ్ధిపొందే అవకాశాన్ని వదులుకోలేదు. అయితే అక్కడే ఆగిపోకుండా నేతి భావంతో అసలు తత్వంవైపు, ఆత్మభావంవైపు పయనం సాగుతోంది.

ఆనందాలను పంచాలి 
ఎవరి బాధ వారికి ఎక్కువ. ఎవరి దుఃఖం వారికి దుర్భరం. ఎవరి వేదన వారికి భారం. ఇంకెవరైనా ఓదార్చబోతే 'అనుభవిస్తే కాని నా బాధ నీకు తెలిసిరాదు' అని అంటుంటారు. నిస్పృహలో ఎలాంటి మాటైనా వస్తుంది. అది సహజం.

కష్టాలు, దుఃఖాలు, బాధలు - అందరివీ ఒక్కలా ఉండవు. పెద్దగీత, చిన్నగీతల అంతరాలతో ఉన్నట్టుంటాయి. కష్టాల్లో ఉన్నప్పుడు మనిషికి ఆశాజీవిగా బతకటం ఎంత అవసరమో, ఇంకొకరి బాధ చూసినప్పుడు తమ బాధను మరచి వారికొక ప్రోత్సాహకరమైన మాట చెప్పటం అంత అవసరం.

దైవ ప్రసాదితమైన ఈ జీవితంలో మనకు అవకాశాలు ఎప్పుడో కాని రావు. ఎన్నో కాని రావు. వచ్చినప్పుడు వాటిని చటుక్కున అందిపుచ్చుకోవాలి. ఒకర్ని సాంత్వనపరచి సేదతీర్చడంలోని ఆనందాన్ని తనివితీరా అనుభవించాలి. ప్రతి జీవితానికీ ఒక అర్థముందని తెలుసుకోవాలి. అలా తెలుసుకోలేకపోతున్న వాళ్లకు తెలియజెప్పాలి.

మనస్సే సర్వస్వం:
ఏది లేకుంటే మనిషి ఒక్కక్షణమైనా జీవించలేడో అది- 'మనస్సు'. మనస్సును కవులు అనేక విధాలుగా పోల్చారు. కోతి అనీ, హంస అనీ, వూయల అనీ, పీఠం అనీ, ఆకాశం అనీ, పువ్వు అనీ ఎన్ని ఉపమానాలు చెప్పినా- అవన్నీ మనస్సుకు హత్తుకొనిపోయేవే! అయితే మనస్సు స్వరూపం ఈ పోలికలతోనే ఆగిపోలేదు. ఇంకా ఇంకా లోతుల్లోకి వెళ్లి తరచి చూడటం మొదలైంది. ఇలా శోధించడం సనాతన కాలంనుంచే ప్రారంభమైంది. అందుకే ఉపనిషత్తుల్లో రుషులు మనస్సును జగత్తుకు ప్రతిరూపంగానూ, జీవిత సర్వస్వంగానూ చెప్పారు.
'మనస్సే ఈ సమస్త జగత్తు. అందువల్ల ఈ మనస్సును ప్రయత్నపూర్వకంగా సంస్కరించుకొంటూ జీవనాన్ని సాగించాలి. మనస్సు ఏ విధంగా ఉంటే ఫలితం ఆ విధంగానే ఉంటుంది. ఇది సనాతన రహస్యం. ఎప్పుడు మనస్సు సంపూర్ణంగా ప్రశాంత స్థితికి చేరుతుందో అప్పుడు అశుభకర్మలన్నీ నశించిపోతాయి. ప్రశాంతచిత్తంతో ఉండేవారే జీవితానందాన్ని అనుభవించగలుగుతారు. అప్పుడే తరగని ఆనందం వశమవుతుంది. మనిషి తన మనస్సును ఇంద్రియాలపై ఎంత దృఢంగా లీనం చేస్తాడో, అంత దృఢంగా భగవంతుడిలో లీనంచేస్తే అన్ని బంధాలకూ దూరం అవుతాడు' - ఇదీ, రుషి బోధల సారాంశం.
మనస్సు లేకుంటే ఏ ఇంద్రియమూ పనిచేయదు. అన్ని ఇంద్రియాలూ మానవుడికి అవసరమైనవే. వాటిని తన సమున్నత లక్ష్యసాధనకు సాధనాలుగా ఉపయోగించుకోవాలిగానీ, దుర్వినియోగం చేస్తే - ఆరోగ్యానికే ప్రమాదం ఏర్పడుతుంది.

ఇంద్రియాలు గుర్రాలనీ, మనస్సు ఆ గుర్రాలను నియంత్రించే పగ్గమనీ, శరీరం రథమనీ భగవద్గీతలో కృష్ణుడు అర్జునుడికి ప్రబోధిస్తాడు. ఇంద్రియాలనే గుర్రాలను పగ్గంద్వారా అదుపులో పెట్టుకొని మనిషి విజయగమ్యాన్ని చేరుకోవాలేగానీ, పగ్గాల్ని విడిచిపెట్టి ఇంద్రియాల గుర్రాలను స్వేచ్ఛగా వదిలేస్తే ఎలా? అలా విచ్చలవిడిగా పరుగులు తీస్తుంటే శరీరం అనే రథాన్ని పడదోసి, అవి పగ్గాలు విప్పుకొని విశృంఖలంగా పరుగులు తీస్తాయి. అందుకే మనస్సు పగ్గాలను ఎప్పుడూ అదుపులో పెట్టుకోవాలి.

ఆదిశంకరులు 'శివానందలహరి'లో మనస్సును కోతిగా అభివర్ణిస్తూ- అది ఎల్లప్పుడూ కోరికల మహారణ్యాల్లో తిరుగుతూ ఉంటుందనీ, ప్రేమ అనే కొమ్మలమీద గంతులు వేస్తుందనీ, స్వేచ్ఛగా అంతటా తిరుగుతుందనీ, అలాంటి చంచలమైన మనస్సు అనే కోతిని భక్తి అనే తాడుతో కట్టివేసి, నీ అధీనంలో ఉంచేలా వరమీయాలనీ శివుణ్ని కోరతారు. ఈ ఆదిశంకరుల ప్రార్థన అఖిలమానవుల ప్రార్థనే! కనుక మనస్సే సర్వస్వమని భావించి దాన్ని విచ్చలవిడిగా వదిలేయకుండా అదుపులో పెట్టుకోవడం మానవ కర్తవ్యం!

కార్యసాధనలోని రహస్యం:
లోకంలో మనిషి ఏ పని చేయాలన్నా దానికి తగిన ఉపకరణ సామగ్రి అవసరం. అన్నం వండాలంటే మొదట పొయ్యి ఉండాలి. ఆ తరవాత బియ్యం, గిన్నె, నీళ్లు, పొయ్యి వెలగడానికి కావలసిన ఇంధనం ఉన్నప్పుడు వంట చేయడం సులభసాధ్యం. ఇవేమీ లేకుండా, అన్నీ ఉన్నట్లు ఊహించుకుంటే అన్నం వండటం సాధ్యమవుతుందా? కానేకాదు. బ్రహ్మదేవుని సృష్టిలోని విచిత్రం ఏమిటోగానీ, కొన్ని పనులు సాధనాలు సరిగ్గా లేకున్నా గొప్ప ఫలితాలను ఇస్తున్నాయంటే ఆశ్చర్యం కలుగుతుంది. ఇలాంటి సందర్భాల్లో సాధకుల ఆత్మశక్తి ఎంత గొప్పదో స్పష్టమవుతుంది.

మన్మథుడు జగన్మోహనకారకుడు. ఒక్క పూలబాణంతో ఎందరినైనా మరులుగొనేటట్లు చేయగల సమర్థుడు. ప్రేమికుల హృదయాలను గిలిగింతలు పెట్టగలడు. చివరికి కామపురుషార్థానికి 'దాసోహం' అనే విధంగా మార్చివేయగలడు. అలాంటి మన్మథుడికి ఉపకరించే సాధనాలను చూస్తే విస్తుపోవలసివస్తుంది. పురాణాల ప్రకారం- అతడు చేపట్టిన విల్లు పూలతో అల్లింది. ఆ వింటికి ఉండే తాడు తుమ్మెదలబారు. ఆ తుమ్మెదలు స్థిరంగా ఉండక, కదులుతుంటాయి. కామినుల చూపులే బాణాలు. అతనికి సహాయంచేసే మిత్రుడు జడపదార్థం లాంటి చంద్రుడు. ఇంతకూ మన్మథుడికి శరీరావయవాలన్నీ చక్కగా ఉన్నాయా అంటే అవీలేవు. అతడు ఏ శరీరావయవాలూ లేని అనంగుడు. ఇన్నిలోపాలు ఉన్నా మన్మథుడు సమస్త ప్రపంచాన్ని తన వశం చేసుకుంటున్నాడంటే విచిత్రమేకదా!

సూర్యుడు కూడా ఇలాంటివాడే. ఉదయాస్తమయాలూ, నిర్విరామంగా ప్రపంచం చుట్టూ పరిభ్రమించే సూర్యుడు తన ప్రయాణానికి తగిన ఉపకరణాలున్నాయో లేదో అసలే పట్టించుకోడు. అవక్రవిక్రమంగా ముందుకు సాగుతూనే ఉంటాడు. అతడి రథానికి ఉండే చక్రం ఒకటే. రెండు చక్రాలు ఉన్నా, కుదుపులతో సాగే పరిస్థితుల్లో సూర్యుడు ఏకచక్రరథంతోనే ఎల్లలు దాటుతున్నాడు. అతడి రథాన్ని నడిపే సారథి తొడలులేని అనూరుడు. అసలే కదలలేడు. పౌరాణిక కథనాల మేరకు, ఆ రథానికి కట్టిన గుర్రాలు ఏడు. ఆ గుర్రాలను అదుపుచేసే పగ్గాలు వక్రంగా నడిచే పాములు. ఇలా ప్రయాణ సాధనాలు లోపభూయిష్ఠంగా ఉన్నా, వాటిని పట్టించుకోకుండా సూర్యుడు పరుగులు తీస్తున్నాడంటే- కార్యసాధకులకు ఆత్మశక్తి ఉంటే చాలు, సాధనాలు అంతగా ఉండవలసిన అవసరం ఏమీలేదని తెలుస్తుంది.

రాముడు ఇలాంటి కార్యసాధకుల్లో అగ్రగణ్యుడు. దండకారణ్యంలోని పర్ణశాల నుంచి సీతాదేవిని రావణుడు అపహరించుకొనిపోయిన తరవాత, రాముడు సీతను అన్వేషిస్తూ కాలినడకతో ముందుకు సాగాడు. సీత ఏమైందో తెలుసుకొని, రావణసంహారం కోసం లంకపై యుద్ధం చేయడానికి పూనుకొంటాడు. లంకకు వెళ్లాలంటే నూరు యోజనాలుగా విస్తరించి ఉన్న సాగరాన్ని దాటాలి. తనకు సహాయంగా ఉన్నది వానర సమూహమే కాని అపార సైన్యసంపద కాదు. కడలికి వంతెన కట్టడం తనవల్ల సాధ్యమవుతుందా అని చింతించలేదు రాముడు. సకల వానర మృగపక్షిసంఘాలూ, చివరికి ఉడుత బుడుత సహాయాన్ని కూడా వదలక, లక్ష్యాన్ని సాధించాడు. జలధికి వారధికట్టి, రావణాసురుణ్ని కొట్టి, చివరికి సీతను చేపట్టాడు. ఇదంతా ఉపకరణాలవల్ల జరిగిందేనా అంటే, కానేకాదు. సాధకుడిలోని అంతశ్శక్తి మాత్రమే విజయానికి సోపానం అనే సత్యం ఈ వృత్తాంతాలద్వారా తెలుస్తుంది.

ఈ కారణంగా మనిషి ఉన్నత లక్ష్యాలను సాధించాలనుకొన్నప్పుడు సాధనాల్లో కొంత కొరత ఉన్నా పట్టించుకోరాదు. చిన్నచిన్న ఆటంకాలను లెక్కచేయరాదు. అనుకున్న పనిని సాధించేదాకా అలసిపోరాదు. ధైర్యంతో ముందడుగు వేయాలే తప్ప, భయపడి వెనుదిరగరాదు. ఇదే కార్యసాధనలోని రహస్యం.

రచన: కోటి మాధవ్ బాలు చౌదరి

కామెంట్‌ను పోస్ట్ చేయండి

0 కామెంట్‌లు
* Please Don't Spam Here. All the Comments are Reviewed by Admin.
కామెంట్‌ను పోస్ట్ చేయండి (0)

buttons=(Accept !) days=(0)

Our website uses cookies. Learn More
Accept !
To Top