నూతన వ్యాసములు:
latest

728x90

header-ad

468x60

5, మార్చి 2018, సోమవారం

తెలుగు జాతి, సంస్కృతి గురించి తెలుసుకోండి ! - Learn about ethnic Telugu cultureసకల ఆచార వ్యవహారాల, జీవన విలువల సమ్మేళనమే సంస్కృతి. జాతి చారిత్రక పునాదులను, పాఠాలను నిత్యం మననం చేసుకొంటూ, వర్తమాన విజయాలను కైవసం చేసుకొంటూ, ఉన్నతమైన ఆశయాలతో, విలువలతో భవిష్యత్ కార్యాచరణ రూపొందించుకొనడానికి సంస్కృతి సహకరిస్తుంది. జాతి మాట్లాడే భాషలోనూ, సంగీతము, సాహిత్యము, నృత్యము, నాటకము, చిత్రలేఖనము మొదలగు కళారూపాలలోను, కట్టూ, బొట్టూ, పలకరింపు, ఆదరణ వంటి సాంప్రదాయిక ఆచార వ్యవహారాల లోను సంస్కృతి ప్రతిబింబిస్తుంది. సంస్కృతికి భాషే పునాది. చరిత్రను విస్మరించిన వానికి భవిష్యత్తు లేనట్లే, భాషను కాదంటే సంస్కృతిని కాదన్నట్టే.
తరతరాలుగా జాతి ప్రతిబింబిస్తున్న మానవతా విలువలను, జాతి యొక్క ప్రత్యేకమైన సంస్కృతి సున్నితమైన సీతాకోక చిలుక వంటిది, భవిష్యత్తులో స్వేఛ్చగా ఎగరాలంటే, శ్రమ, సహనం, పట్టుదలతో కూడిన పరివర్తన, కార్యాచరణ అవసరం. అరచేతులు మూసి గట్టిగా పట్టుకొంటే చితికిపోతుంది, తెర తీసి ఎగరనిస్తే భావి తరాల కోసం మరిన్ని అందాలను తనలో ఇముడ్చుకొంటుంది.

వారసత్వం వంటి ఆలోచనలను, ఆశయాలను, ఆదర్శాలను, సంస్కృతి తనలో ప్రతిఫలిస్తుంది. సంస్కృతి సాగి పోయే నది వంటిది, ఇది స్వవాసంలోనైనా, ప్రవాసంలోనైనా పాత విషయాలను లోపల దాచుకొని, క్రొత్త విషయాలను తనలో కలుపుకొంటూ నిరంతరం సాగిపోయే ప్రవాహం, మారుతున్న కాలంతో మారే భిన్నరుచుల, అభిరుచుల, అభిప్రాయాల సమాహారం. కాలం కాగితంపై ఒక జాతి కలిసికట్టుగా చేసే సంతకం, ఒక తరం మరొక తరానికి అందించే జీవన సందేశం. ఉన్నతమైన విలువలలో పుట్టి, ఉదాత్తమైన సాగర సంగమానికి నిత్యం పరితపిస్తుంటుంది.

తెలుగు సంస్కృతి సనాతన భారతీయ సంస్కృతిలోని అంతర్వాహిని. “మాతృ దేవత (తల్లి), మాతృ భూమి మరియు మాతృ భాష” తెలుగు సంస్కృతికి చిహ్నాలు. “మాతృ దేవో భవ, పితృ దేవో భవ, ఆచార్య దేవో భవ మరియు అతిథి దేవో భవ” అన్న సూక్తులు తెలుగు సంస్కృతికి పునాదులు.  “తెలుగు మన మాతృ భాష, తల్లి దండ్రులే ప్రథమ గురువులు” అనే నినాదం గల “అంతర్జాతీయ తెలుగుబడి” తన కార్య కలాపాలలో తెలుగు సంస్కృతిని ప్రతిబింబింప చేస్తుంది, అందలి మాధుర్యాన్ని పది మందికీ పంచి పెడుతుంది.

రచన: కోటి మాధవ్ బాలు చౌదరి

« PREV
NEXT »