పూర్వం తపస్సు ఎందుకు చేసేవారు ? - Rishi Tapassu

0
పూర్వం తపస్సు ఎందుకు చేసేవారు ?  - Rishi Tapassu

భగవంతుని కోసం నిరంతము పరితపించడాన్నే తపస్సు అంటారు .

మనోవాక్కాయకర్మల యందు ఆధ్యాత్మిక చింతనతో తపించ టాన్నే తపస్సు అంటారు .
నిత్య కృత్యాలు నేరవేరుస్తున్నా భగవంతుని తో అనుసంధానం అయి ఉంది కార్యాచరణను కావించటాన్నే తపస్సు అంటారు.

'తపస్సు...!' ఈ మాట వినగానే మన మహర్షులు, యోగులు, సిద్ధులు, మునులు ఏళ్లతరబడి చేసిన తపస్సే గుర్తుకొస్తుంది. వారు తమకోసం కాక, లోక కల్యాణార్థం వాయుభక్షణచేస్తూ నిరాహారులై తపస్సు చేశారు. సిద్ధి పొందారు. గీతాకారుడు కృష్ణపరమాత్మ భగవద్గీతలో తపస్సును సాత్విక, రాజసిక, తామసికాలనే మూడు విధాలుగా వర్గీకరించి ప్రబోధించాడు. దీన్నే దేవతలు, గురువులు, జ్ఞానుల్ని పూజిస్తూ సేవిస్తూ, శుచి, నిష్కపటం, బ్రహ్మచర్యం, అహింస కలిగి ప్రవర్తించటం శారీరక తపస్సుగా చెబుతారు. ఇతరుల్ని బాధించే మాటలు పలకకుండా, సత్యంగా, ప్రియంగా మాట్లాడటం వాజ్మయ తపస్సు అంటారు. ప్రసన్నంగా, ప్రశాంతంగా ఉంటూ మౌనం, ఆత్మనిగ్రహం, భావశుద్ధి కలిగి ఉండటం మానసిక తపస్సు. మదాహంకారాలతో మూఢంగా ఇతరుల్ని పీడిస్తూ పరుల నాశనం కోరడం ద్వారా తన వినాశనాన్ని పరోక్షంగా ఆహ్వానించడం తామసిక తపస్సుగా చెబుతారు. అలా తామసి తప్పక 'తా' 'మసి' అయిపోతాడని తాత్పర్యం. పౌరాణిక, చారిత్రక వేదికలపైన మనకీ మూడువర్గాలవారూ కనిపిస్తారు. ఒక పవిత్ర లక్ష్యంతో ఏకాగ్రతతో, చిత్తశుద్ధితో, నిస్వార్థ చింతనతో, పరహితార్థభావనతో, తపనతో చేసే దీక్షనే తపస్సు అంటారు. క్రమశిక్షణ, సమయపాలన, ధర్మాచరణ, ధ్యానం తపస్సులోని కీలకాంశాలు.

మనమంతా ఇప్పుడు తపస్సు చేస్తూనేఉన్నాం. నిర్దిష్ట సమయాల్లో నిత్యకృత్యాలను శ్రద్ధగా నిర్వర్తించుకుంటూ కార్యాలయాల్లో కానీ, బయట కానీ, ప్రభుత్వ ప్రభుత్వేతర నిర్దేశిత కార్యక్రమాలను, విధులను నెరవేరుస్తున్నాం. నేర్చుకున్న జ్ఞానానికీ, విద్యకు, కళకు, అంకితమైపోయి జాతి శ్రేయం కోసమే వాటిని సద్వినియోగం చేయడం మన సనాతన ధార్మిక, తాత్విక సంస్కృతిని పరిపోషించడం, మానవసేవా యాగసమిధలమైపోవడం, సాటి ప్రాణిలో దైవత్వాన్ని చూసి గౌరవించడం, అభిమానించడం, సత్యం, ధర్మం, కరుణ, ప్రేమ, సత్సాంగత్యం వంటి తపస్సులోని అంతస్సూత్రాలే. తపస్సుకున్న లక్షణాలే.

ఇక్కడే మనం ఆత్మాన్వేషణ చేసుకోవాలి. ఆంతరిక విశ్లేషణ చేసుకోవాలి. మన ఈ తపోగానంలో ఎన్ని అపశ్రుతులు దొర్లుతున్నాయో, అంతర్వీక్ష చేసుకోవాలి. కొంతమంది కాలకృత్యాలు తీర్చుకోవడం దగ్గరనుంచీ ప్రతిదీ వాయిదా వేసుకుంటూంటారు. సమయపాలనకు విలువ ఇవ్వరు. అవసరం లేకున్నా అసత్యాలు వందలు వందలుగా వల్లిస్తూనే ఉంటారు. ఎక్కడ, ఎలా అవకాశం దొరుకుతుందా? ఎవడ్ని ఎలా దోచుకుతిందామా అన్న ఆలోచనలతో ఎదకు, మెదడుకూ పదును పెడుతుంటారు. తక్కువ శ్రమతో ఎక్కువ ధనమూ, సుఖమూ ఎలా లభ్యమవుతాయా అన్న తపనే తపస్సయిపోతోంది ఇవాళ. ఈ రకమైన ఆలోచనా విధానాన్ని త్యజిస్తేకానీ తపస్సుకు అర్థం బోధపడదు. అది ఒకసారి అవగతమై హృదయంలో తిష్ఠవేసుకుందీ అంటే, అప్పటి ఆనందం అనుభవైకవేద్యం. అది వివేచనాపరులకే సాధ్యం.

ఏదైనా అడుగుతూ తపస్సు చేశామంటే ఆ సర్వజ్ఞుడి విజ్ఞతను తక్కువ అంచనా వేసే అట్టడుగు స్థాయిలో ఉన్నామని అర్థం.

కొంచెం శ్రద్ధ, మరికొంత సంయమనం, ఇంకొంచెం సంస్కారం, మరికాస్త జ్ఞానం, మరింత పట్టుదల ఉంటే జీవనయానమనే తపస్సు సాధ్యమే. మన సనాతన రథసారథులు సాధకులకోసం మోక్ష ద్వారాన్ని చేరుకోవడానికెన్నో సుగమమైన మార్గాలు చెప్పారు. అవి తెలుసుకోవడానికి మరీ అంత కష్టపడవలసిన పనిలేదు. ఆసక్తి ఉంటే చాలు, 'ఆ'శక్తి దానంతటదే మనల్ని ఆవహిస్తుంది. విజయసుధల్ని ఆహ్వానిస్తుంది. ఆ ఆసక్తిని కూడా చూపక నిరాసక్తులమై, బద్ధక చక్రవర్తులమైతే జీవితంలో ఇంక సాధించేదేంటి? భూమికి భారంగా, చరిత్రహీనంగా జీవించే హక్కు భగవంతుడు మనకివ్వలేదు!

భగవంతుణ్ని మనమేదైనా అడిగే బదులు, అడక్కుండానే మన అవసరాన్ని గ్రహించి ఆయనే తనంతతానుగా మనకు ఇచ్చే విధంగా 'అర్హత'ను మనం ఆర్జించడమే ఉత్తమమైన తపస్సు.

నిత్యజీవన విధానంలోని అంశాలన్నింటినీ- అంటే- స్నానం, ధ్యానం, ఆహారం, నిద్ర, కర్తవ్యం మొదలైనవాటిని తపస్సులోని ప్రధానాంశాలుగా, పవిత్రమైన అంశాలుగా, భావించి, ఆచరించిననాడు మోక్షగవాక్షం మనకళ్ల ముందే ప్రత్యక్షమవుతుంది. అందుకు మనం కటిబద్ధులం కావాలి, నవబుద్ధులం కావాలి!    రచన:- చిమ్మపూడి శ్రీరామమూర్తి

అనువాదం: కోటి మాధవ్ బాలు చౌదరి

కామెంట్‌ను పోస్ట్ చేయండి

0 కామెంట్‌లు
* Please Don't Spam Here. All the Comments are Reviewed by Admin.
కామెంట్‌ను పోస్ట్ చేయండి (0)

buttons=(Accept !) days=(0)

Our website uses cookies. Learn More
Accept !
To Top