అగ్ని సాక్షిగా వివాహం ఎందుకు చేయాలి - Fire Rituals in Vedic Wedding - Agni Shakshi

0
అగ్ని సాక్షిగా వివాహం ఎందుకు చేయాలి - Fire Rituals in Vedic Wedding - Agni Shakshi
పంచభూతాలలో ఒకటయిన అగ్ని ఎన్నో కర్మలకి సాక్షీ భూతం అని మన పురాణా లలో వ్యవహరించారు. అగ్ని పవిత్రతకి, శక్తికి మారు పేరు. వేదాలలో అగ్ని దేవుడు దేవతల పురోహితుడు అని చెప్పబడింది. ఈయన ఆగ్నేయానికి దిక్పాలకుడు.

అగ్ని సాక్షిగా వివాహం అనేది మన హిందూ సాంప్రదాయం. అయితే అగ్నినే ఎందుకు సాక్షిగా పెడతాం అన్న విషయం ఋగ్వేదంలో వివరించారు.
“సోమః ప్రధమో వివిధే, గంధర్వో వివిధ ఉత్తరః
తృతీయాగ్నిష్టే పతిః తురీయప్తే మనుష్యచౌః”
అని వివాహ సమయములో వరుడు స్త్రీతో అంటాడు. అంటే నిన్ను ప్రారంభ కాలంలో సోముడూ, తరువాత గంధర్వుడూ, ఆ తరువాత అగ్నీ ఏలారు. ఇహ నాల్గవ వానిగా నేను నిన్ను ఏలుతాను అని అర్థం. అమ్మాయి పుట్టిన వెంటనే తన ఆలనా పాలనా చూడవలసినది సోముడు (చంద్రుడు). ఎన్ని సార్లు చూసినా చంద్రుడు ఎంత ఆకర్షణీయంగా ఉంటాడో అలానే పసి పాపను చూసినప్పుడు కూడా అదే భావన కలగటానికి కారణం చంద్రుని పాలన. కొంత వయసు వచ్చాక గంధర్వునికి ఇచ్చేసి చంద్రుడు వెళ్ళిపోతాడు. ఇప్పుడు ఆమెని చంద్రుని సాక్షిగా గంధర్వుడు స్వీకరించాడు. “లావణ్యవాన్ గంధర్వః” అన్నట్టు గంధర్వుడు ఆమెలో అందాన్ని ప్రవేశ పెడతాడు. గంధర్వులు గాన ప్రియులు కనుక అందమయిన కంఠాన్ని లేదా సంగీతాన్ని ఇష్టపడే మనసుని ఇస్తాడు. అలా అందాన్ని, చందనాన్ని ఇచ్చేసి నా పనయిపోయింది ఇక నీదే పూచీ అని కన్యని అగ్నికి అప్పచెప్పి గంధర్వుడు వెళిపోతాడు. ఇప్పుడు ఆమెని గంధర్వుని సాక్షిగా అగ్ని స్వీకరించాడు. “అగ్నిర్వై కామ కారకః” అన్నట్టు అగ్ని ఆమె శరీరంలోకి కామ గుణాన్ని (కామాగ్ని) ప్రవేశ పెడతాడు. ఇలా ఒక కన్య చంద్రుని ద్వారా ఆకర్షణని, గంధర్వుని ద్వారా లావణ్యతని, అగ్ని ద్వారా కామ గుణాన్ని పొందుతుంది. ఇహ ఆమె వివాహానికి యోగ్యురాలని భావించిన అగ్ని, ఆమెను వేరొకరికి ఇచ్చి తను వెళ్ళాలి కనుక కళ్యాణ సమయములో ఆమెను నరునికి ఇస్తాడు. అలా ఆమెను “అగ్ని సాక్షిగా” వరుడు స్వీకరిస్తాడు.

అగ్ని ఉన్న ప్రదేశాన్ని బట్టి వివిధ నామాలతో పిలువ బడుతుంది. అవి:

క్రోధాగ్ని:
కోపము వలన పుట్టేది క్రోధాగ్ని. ఇది ఎక్కువగా కళ్ళలో ఉంటుంది. పరమేశ్వరునికి మూడు కన్నులూ సూర్యుడు, చంద్రుడు మరియు అగ్ని. అందువలననే శివుడు మూడవ కన్ను తెరిస్తే అది అగ్ని రూపము కనుక క్రోధాగ్ని జ్వాలలలో భస్మం అవుట తధ్యం.

బడబాగ్ని:
ఇది సముద్రము అడుగు భాగములో ఉండే అగ్ని. దీనినే బ్రహ్మాగ్ని అని కూడా అంటారు. దీనికి ఆహారం సముద్రోదకం అనగా సముద్రములోని నీరు.

జఠరాగ్ని:
ఇది ప్రతీ ప్రాణిఉదరములోనూ ఉండి ఆహార జీర్ణనకి ఉపయోగపడుతుంది. దీని విలువ గురించి ప్రతీ ఒక్కరూ తెలుసుకోవలసిన అవసరం ఎంతయినా ఉంది.
“అహం వైశ్వానరో భూత్వా ప్రాణినాం దేహమాశ్రితఃప్రాణాపాన సమాయుక్తా పచామ్యన్నం చతుర్విధం”
అని భగవద్గీతలో చెప్పారు. ఈ శ్లోకం నిత్యం భోజనం చేసే ముందు చదువుకుని తినటం ఒక అలవాటు. ఇక్కడ అహం అంటే పరమాత్మ, వైశ్వానరుడు అనే పేరుతో ప్రాణుల (ఇవి నాలుగు రకాలు – జరాయుజాలు అనగా తల్లి గర్భం నుండి ఉద్భవించేవి, అండజాలు అనగా గ్రుడ్డు నుండి పుట్టేవి, స్వేదజాలు అనగా చెమట నుండి పుట్టేవి మరియు ఉద్భిజ్జములు అనగా భూమిని చీల్చుకుని పుట్టేవి) దేహములో (శరీరములో) ఉన్నాడు. అన్నం చతుర్విధం అన్నారు అంటే నాలుగు విధములయిన పదార్థాలు [అవేమనగా భక్ష్యం (కొరికి తినేవి), భోజ్యం (నమిలి తినేవి), లేహ్యం (నాకి తినేవి), చోష్యం (పులుసు, మొదలయినవి)] మన భోజనములో ఉంటూ ఉంటాయి. మనం తినే భోజనం జీర్ణమయ్యి మన ప్రాణాన్ని నిలపెడుతుంది. అంటే అగ్నిలో ఆహుతయ్యి ఆ అగ్ని (హవ్యా వాహనుడు) శరీరమంతా ప్రాణ వాయువు రూపములో వ్యాపిస్తుంది. తిన్న ఆహారమును జీర్ణము చేసి మలమూత్ర శుక్ర రూపములో క్రిందకి తోసేది అపాన వాయువు. త్రాగిన వాటినీ, తిన్న వాటినీ రక్తముగా, పిత్తముగా, శ్లేష్మముగా మార్చి శరీరానికి సమానముగా అందించేది సమాన వాయువు. ఇది ఈ శ్లోకం యొక్క అర్థం.

ఇటువంటి భోజనాన్ని మనలో ఉన్న వైశ్వానరుడు అనే అగ్నికి ఇచ్చే హవిస్సు క్రింద భావించాలి. అప్పుడే మనకి యజ్ఞం చేసినంత పుణ్య ఫలము లభించును. కనుక భోజనం చేసే ముందు ఈ శ్లోకాన్ని చదువుకుంటూ హోమం చేస్తున్నంత శ్రద్ధగా తినాలి.
“బ్రహ్మార్పణం బ్రహ్మహవిః బ్రహ్మాగ్నౌ బ్రహ్మణాహుతంబ్రహ్మైవ తేన గంతవ్యం బ్రహ్మ కర్మ సమాధినా”
అన్నారు. అంటే హవిస్సు బ్రహ్మే, అగ్నీ బ్రహ్మే, హోత అనగా హోమం చేసేవాడూ బ్రహ్మే అన్నీ ఆయనే కనుక మనం చేసిన యజ్ఞం కాని, అన్నం కాని ఏదయినా సరే ఆ బ్రహ్మకే అర్పిస్తున్నాం అన్న భావనతో ఉండాలి. “సర్వం కల్విదం బ్రహ్మ” అన్నారు కదా! అందుకే “అన్నం పరబ్రహ్మ స్వరూపం” అంటారు.

జ్ఞానాగ్ని:
ఆత్మలో నిత్యం రగిలే అగ్నిని జ్ఞానాగ్ని అంటారు. “జ్ఞానాగ్నిః సర్వ కర్మాణి భస్మసాత్ కురుతేర్జునా” అని భగవద్గీతలో శ్రీకృష్ణుడు చెప్తాడు. అంటే జ్ఞానం అనే అగ్ని పుడితే సర్వ కర్మలూ (ఆగామి, సంచితం, ప్రారబ్ధం) భస్మమయిపోతాయి అని అర్థం. ఈ అగ్ని మనకి ముఖ్యముగా రామాయణము లో తారసపడుతుంది. సీతాదేవి అగ్ని ప్రవేశం వెనుక ఉన్న అంతరార్థాన్ని గ్రహిస్తే ఈ జ్ఞానాగ్ని మనకి బోధపడుతుంది.

సీతాదేవి జీవుడికీ, శ్రీరామచంద్రమూర్తి పరమాత్మకీ ప్రతీకలు. సీతాదేవి బంగారు లేడిని కోరటం వలన రాముడికి దూరమయ్యింది. అంటే జీవుడికి కోరికలు కలుగుట వలన పరమాత్మ నుండీ దూరమవుతాడు. ఇక్కడ ఉపనిషత్తులలో చెప్పబడిన ఒక చిన్న కథను చెప్పుకోవాలి.

శరీరము అనే మామిడి చెట్టు మీద జీవ పక్షి, ఈశ్వర పక్షి ఉన్నాయిట. చెట్టు నిండా ఉన్న మామిడి పండ్లను చూసిన జీవ పక్షి తింటాను అంటే ఈశ్వర పక్షి వద్దని వారిస్తుందిట. అయినా వినకుండా జీవ పక్షి ఆ చెట్టుకి ఉన్న పండ్లన్నీ తినేస్తుందిట. తిన్నాక ఆ వనంలో ఉన్న మరొక చెట్టు, మరొక చెట్టు అలా తినాలి అన్న కోరిక వలన ఎన్నో చెట్లు మారుతూ ఈశ్వర పక్షికి దూరమవుతుంది. అదే విధముగా జీవుడు కూడా కోరికలని పెంచుకుంటూ ఎన్నో జన్మలెత్తుతూ పరమాత్మకి దూరమవుతున్నాడు. ఇలా దూరమయిన జీవుడు పంచభూతాలకి మాత్రమే వశమవుతాడు.

“బహూనాం జన్మనామంతే జ్ఞానవాన్ మాం ప్రపద్యతే” అని భగవద్గీతలో చెప్పినట్టు అసలు నేను ఎవరిని? ఎక్కడ నుండి వచ్చాను అన్న జ్ఞానాన్ని తెచ్చుకున్నప్పుడు కైవల్యం పొంది పరమాత్మ వద్దకు తిరిగి చేరగలడు. ఈ జ్ఞానం సన్యాసాశ్రమంలో తురీయావస్థలో పొందగలరు. సన్యాసాశ్రమం లోకి ప్రవేశించే ముందు వీరి సర్వ కర్మలు, కోరికలు అన్నీ భస్మం చేయటం కోసం విరజా హోమం చేస్తారు. అదే విధముగా సీతాదేవి రూపములో ఉన్న జీవుడు, రాముని రూపములో ఉన్న పరమాత్మను చేరటానికి విరజా హోమమనే జ్ఞానాగ్నిలో అగ్ని ప్రవేశం చేసి, సర్వ కర్మలూ, కోరికలనూ భస్మం చేసి పరమాత్మ అయిన రాముని వద్దకు వచ్చింది అని అంతరార్థం. దీనిని॥స్వయముగా చేసి జనానికి చూపించటమే సీతమ్మ వారి అగ్ని ప్రవేశ ఘట్టంలోని ఆంతర్యం.
“మర్త్యావతారం త్విః మర్త్య శిక్షణంరక్షోవధాయై న చ కేవలం విభోః”
అన్నారు. మర్త్యులు (మరణం కలిగిన వారు) అనగా మానవులు. శ్రీహరి మానవావతారం అయిన రామావతారంలో కేవలం రాక్షస సంహారం కోసమే కాక, మానవులు ఎలా క్రమశిక్షణలో ఉండాలి అని ఆయన నడిచి చూపించాడు. అందుకనే రాముడు నడిచినట్టు నడవాలి, కృష్ణుడు చెప్పినట్టు చెయ్యాలి అంటారు.
అగ్ని సాక్షిగా వివాహం ఎందుకు చేయాలి - Fire Rituals in Vedic Wedding - Agni Shakshi

దావాగ్ని:
ఇది ఎండు పుల్లల రాపిడి, ఘర్షణ వలన పుడుతుంది. ఎక్కువగా అడవులలో పుట్టడం వలన ఇది కలుగ చేసే నష్టం కూడా తీవ్రమయినది. యజ్ఞ యాగాదులకి ఉపయోగించేది కూడా దావాగ్నే. గుంటలు త్రవ్వి, అందులో కర్రలను పేర్చి, నిప్పును రగల్చి ఉంచేవారు. వీటినే గుండాలు అని అంటారు. మెల్లిగా వీటి నుంచే వాడుకని బట్టీ అగ్ని గుండాలు, హోమ గుండాలు వచ్చాయి.

ఎండు పుల్లల రాపిడితో పాటూ, కవ్వంతో మజ్జిగ చిలికినట్టు అరణిలో మధించి అగ్నిని పుట్టించేవారు. ఈ రకముగా తయారయినటు వంటి, యజ్ఞ యాగాదులకి ఉపయోగించే అగ్ని మూడు రకాలు. అవి దక్షిణాగ్ని, ఆహవనీయం (ఆహుతులిచ్చేది), గారహపత్యం (గృహస్థాశ్రమంలో ఉన్నవారు చేసేది). ఈ మూడిటినీ కలిపి త్రేతాగ్నులు అంటారు. ఇది వరకు నిత్యాగ్నిహోత్రులు ఉండేవారు. అటువంటివారు ఈ త్రేతాగ్నులనీ ఖచ్చితముగా వెలిగించేవారు. యజ్ఞము వలన ఉద్భవించిన అగ్ని పర్యావరణానికి ఎంతో మేలు చేస్తుంది. సప్త జిహ్వాయనుడు (ఏడు నాలుకలు కలవాడు) అని ఈయన పేరుకి తగ్గట్టుగా హోమం చేసిన ఆహుతులని ఏడు నాలుకలతో ఈయన స్వీకరిస్తాడుట.

వజ్రాగ్ని:
ఇది ఇంద్రుని వజ్రాయుధంలో ఉండే అగ్ని. దధీచి మహర్షి వెన్నుముక వజ్రాయుధం అని మనందరికీ తెలిసినదే. మన పురాణాల ప్రకారం ప్రప్రధమంగా నిప్పును కనుగొన్నది దధీచి మహర్షి. అందుకనే ఆయన గౌరవార్థం మన భారత ప్రభుత్వం ఒక తపాలా స్టాంపును కూడా విడుదల చేసింది. మెరుపులు, పిడుగులు అగ్ని స్వరూపాలే కదా! మన పురాణాల ప్రకారం మెరుపు ఇంద్రుని వజ్రాయుధ మనీ, పిడుగు వజ్రాయుధా ఘాతమనీ ఉంది. ఇక్కడ మనం తెలుసుకోవలసిన విషయం వెన్నుముకకీ అగ్నికీ ఉన్న సంబంధం. మనిషి వెన్నెముక ఒక గొట్టంలా ఉంటుందనీ అందులో కొన్ని నాడులు ఉంటాయనీ మనకి తెలిసినదే. అయితే ఈ వెన్నెముక అనే గొట్టములో ఉండే ప్రధానమయిన నాడి సుషుమ్న నాడి. ఆ సుషుమ్న లోపల వజ్ర నాడి (దీనినే సూర్య నాడి అంటారు), ఈ వజ్ర నాడి లోపల చిత్ర నాడి (దీనినే చంద్ర నాడి అంటారు) ఉంటాయి. ఈ మూడు (సుషుమ్న, వజ్ర, చిత్ర) నాడులనీ కలిపి spinal cord అంటారు. వీటిలో సుషుమ్న నాడి ఎఱ్ఱగా అగ్ని లాగా ఉంటే, అందులో ఉండే వజ్ర నాడి వజ్రము వలే ప్రకాశముతో ఉంటుంది. ఆ ప్రకారముగా ఈ రెంటినీ కలిపి వజ్రాగ్ని అన్న వాడుక వచ్చింది. అలా వెన్నెముకలో వజ్రాగ్ని ఉంటుంది.

సూర్యాగ్ని:
సూర్యుని రూపములో కనిపించే అగ్నిని సూర్యాగ్ని అంటారు. దీనినే ఆదిత్యాగ్ని అని కూడా అంటారు. “అగ్ని సోమాత్మకం జగత్” అని తైత్తరీయోపనిషత్తులో చెప్పబడింది. అంటే ఈ ప్రపంచం మొత్తం అగ్నీ, చంద్రుల రూపములో ఉందనీ, ఈ అగ్నే సూర్యుని రూపములో ప్రకాశిస్తోందనీ అర్థం. శివ-శక్తులు, ప్రకృతి-పురుషులు, వెలుగు-నీడలు లాగానే సూర్య-చంద్రుల ప్రమేయం సృష్టి వికాసానికి మూలమన్నది వాస్తవం. ప్రశ్నోపనిషత్తులో “కర్మ సాక్షి”గా సూర్యుడిని ఎన్నుకున్నారు అని చెప్పబడింది. అందువలననే అగ్నిసాక్షిగా అని వాడినా సూర్యుని సాక్షి అన్న అర్థం అంతర్లీనంగా ఉంటుంది. ఆ విధముగా రక్షకునిగా, సృష్టి వికాస ప్రక్రియా ప్రేరకునిగా అగ్నిని సాక్షిగా నియమించారని తెలుస్తున్నది.

యోగాగ్ని:
అంటే కేవలం యోగము లేదా ఆలోచన వలన పుట్టేది. ఈ యోగాగ్నిని సతీదేవి, దధీచి మహర్షి పుట్టించారు. దక్షయజ్ఞ సమయములో తనకి పరాభవం ఎదురయ్యిందని సతీదేవి బాధతో కన్నీటి చుక్కను వదిలి దానిని కాలి బ్రొటన వేలితో రాసినప్పుడు అగ్ని పుట్టి అందులో ఆవిడ దగ్ధమయ్యింది. అలానే దేవతల ఆయుధాలన్నీ కావాలన్నప్పుడు దధీచి మహర్షి యోగాగ్నిని పుట్టించి దగ్ధమయ్యి తన అవయవాలను ఇచ్చాడు. దీనిని బట్టి చూస్తే గొప్ప వాళ్ళు, మహా యోగులు వారి యోగా శక్తితో తలుచుకున్న వెంటనే అగ్నిని పుట్టించి వారి శరీరాన్ని వారే దగ్ధం చేసుకునేవారని తెలుస్తుంది.

ప్రేతాగ్ని:
దీనినే స్మశానాగ్ని అని కూడా అంటారు. దీనిని తలుచుకో గానే రామాయణములోని ఒక ఉపమానం జ్ఞప్తికొస్తుంది. అదేమిటంటే స్మశానాగ్ని కూడా అగ్నే అయినా మంచి పనులకి ఎలా పనికి రాదో అదే విధముగా రావణుడు ఎంత తేజోసంపన్నుడైనా రాముని ముందు పనికి రాలేదు అని. మానవ దేహం పంచభూతా లతో చేసినదే కనుక మనిషిని దహనం చేసి మళ్ళీ ఆ పంచభూతాలలో ఐక్యం చేస్తారు. ఇలా శరీర దహనానికి ఉపయోగపడే అగ్నినే ప్రేతాగ్ని అంటారు.

మన మంత్రపుష్పంలో ఈ అగ్ని గురించిన ప్రస్తావన ఉంది. ప్రతీ మనిషిలోనూ భగవంతుడున్నాడు. ఎలా ఉన్నాడయ్యా అంటే ఒక అగ్నిశిఖ రూపములో, నల్లని మబ్బులో విద్యుల్లత (మెరుపు) వెలిగినట్టు, సూక్ష్మంగా, పచ్చగా ఉన్నాడుట. ఆ అగ్నిశిఖ మధ్యలో ఉన్న ఈయనే శివుడు, ఈయనే బ్రహ్మ, ఈయనే విష్ణువు అని చెప్పబడింది.

మనది పవిత్రమయిన భారత దేశం. భా అంటే వెలుగు లేదా కాంతి. “భాయాం రతః” భారతః అన్నారు. ఎవరయితే ఈ అగ్ని రూపములో ఉన్న పరమాత్మ వెలుగుని ఉపాసన చేసి మనోవాక్కాయ (“భా” అంటే భావం అనగా మనసు, “ర” అంటే రవం అనగా వాక్కు, “త” అంటే తనువు అనగా కాయం) కర్మలలో ఏకత్వాన్ని పొందుతారో వారే భారతీయులు అని చెప్పబడింది. అంతటి గొప్ప ప్రఖ్యాతలు ఉన్న మనం వీటన్నిటినీ ఆచరించి, ఆలంబించినప్పుడే ఈ జన్మకి, మన పుట్టుకకి ఒక సార్థకత.

రచన: కోటి మాధవ్ బాలు చౌదరి

కామెంట్‌ను పోస్ట్ చేయండి

0 కామెంట్‌లు
* Please Don't Spam Here. All the Comments are Reviewed by Admin.
కామెంట్‌ను పోస్ట్ చేయండి (0)

buttons=(Accept !) days=(0)

Our website uses cookies. Learn More
Accept !
To Top