ఆత్మాకు పరమాత్మకు గల పరమార్ధం - Atma paramatma

0
ఆత్మాకు పరమాత్మకు గల పరమార్ధం - Atma paramatma
జితాత్మనః ప్రశాస్తస్య పరమాత్మా సమాహితః’
‘జ్ఞాన విజ్ఞాన తృప్తాత్మా కూటస్థో విజితేన్ద్రియః’
‘యోగీ యుంజీత సతత మాత్మానం రహసి స్థితః’
-ఆత్మ పరమాత్మ అన్యం కాదు.
-వాసనా రహిత జీవనానికి పరమాత్మ అన్యం కాదు.

ఇలా ఆత్మ పరమాత్మలను అద్వైతంగా కాక ‘ఏకం’గా అంగీకరించటమే ఆత్మయోగం… భగవద్గీత చెప్పే ఆత్మ సంయమ యోగం.

జననం – మరణం అన్న ఆలోచన లేకుండటమే యోగం… కర్మాచరణే తప్ప కర్మఫలాసక్తి లేకుండటమే యోగ సాధన. అశాశ్వతత్వంపై కాక శాశ్వతత్వంపై బుద్ధి నిలవటమే బుద్ధియోగం.. సాధనతో ప్రాపంచిక మోహానురక్తి లేకుండటమే బుద్ధులం కావటం. దేహాన్ని తొడుక్కున్న మానవ రూపమే సర్వస్వం, సర్వం, కాదు అన్న తెలివిడే యోగ జీవనం!

అవును, మన మానవ రూపం ఏదో ఒకనాడు అరూపం అయ్యే తీరుతుంది. ఉత్తమం అనుకున్న వ్యక్తి, ఉన్నతం అనుకున్న వ్యక్తిత్వం సైతం కాల ప్రవాహంలో అదృశ్యం అయి తీరతాయన్న స్పృహనే ఆత్మజ్ఞానం. మానవ రూపాన్ని చేరటానికి పూర్వం అదృశ్య ఆత్మగా తన అస్తిత్వాన్ని నిలబెట్టుకుంటూ వచ్చిన ఆత్మ జీవాత్మ రూపేణా మానవ దేహంలో తన అస్తిత్వాన్ని చాటుకుంటూ దేహ త్యాగంతో మళ్లీ అదృశ్య ఆత్మగానే కాలప్రవాహంలో కాంతులీనుతుంటుంది. తనకు తాత్కాలిక చిరునామాగా ఉన్న దేహాన్ని అశాశ్వతం చేస్తూ అదృశ్యంగానే తన శాశ్వత చిరునామాను ప్రకటించుకుంటుంది. మానవత్వాన్ని మించిన దివ్యత్వం, దివ్యత్వాన్ని దాటిన విశ్వత్వంతో తన అస్తిత్వాన్ని చాటుతుంటుంది. ఇదంతా యోగ సాధనా ఫలితం… ఆత్మయోగం.

ఆత్మస్థితి ఒక ఖగోళ భాండంగానే మన మనసులలో మెదలుతుంటుంది. కారణం మనం సైకిక్ బీయింగ్స్ కాబట్టి. అంటే మనం మానసిక జీవులం. శాశ్వత చిరునామాలో మనం ఆత్మజీవులమే అయినా తాత్కాలిక చిరునామాతో బ్రతికి బట్ట కట్టేది మానసిక జీవులుగానే. ఆత్మ జీవులుగానే విశ్వసంచారం చేస్తుంటాం.. అనేక జన్మలుగా ఆవిష్కరింప బడుతుంటాం. అన్నంత మాత్రాన అన్ని జన్మలు మానవజన్మలు కావు… మనం చెప్పుకునే ‘పునరపి జననం.. పునరపి మరణం’ సిద్ధాంతం కేవలం మానవ జన్మకే పరిమితం కాదు.

అయినా, మనం మానసిక జీవులం కాబట్టి, మనకు మనంగా మన ఆలోచనలతో సృష్టిలో ఉన్నతాసనం వేసుకుంటున్నాం కాబట్టి ఇంకా ఈ మానవ అస్తిత్వానే్న కోరుకుంటూ పునర్జన్మలను మానవ ప్రాంగణాలకే పరిమితం చేసుకుంటున్నాం. మానవ జన్మతో పరిపూర్ణులం కాలేక పాప పుణ్య వివేకంతో మానవ రూపానికే కట్టుబడిపోతున్నాం. మనకు తెలిసిన లోకాలకు మనకు తెలీని లోకాలకు మధ్య దేవలోకాన్ని నిలిపి ఆ దేవలోకానే్న కంచెగా చేసుకుని, ఆ కంచెను దాట సాహసించక దానే్న రక్షా కవచంగా చేసుకుని కుదించుకు పోతున్నాం… కుంచించుకు పోతున్నాం.

గట్టు లోపల ఉన్నదే ప్రపంచం అనుకుంటే ఎలా? గట్టు దాటితేనే కదా అసలు గుట్టు వెలుగులోకి వచ్చేది.

అందుకే గట్టు మానవ దేహం కాదు.. ఆ దేహాన్ని చూడగల ఆత్మది. ఆత్మ అంతరనే్వషణ కొంత మటుకే.. తక్కినదంతా అధ్యాత్మ అనే్వషణే. దానికి మనం ముద్దుగా పెట్టుకున్న పేరు ‘ఆధ్యాత్మిక అనే్వషణ’.

* * *

దైహికంగా మనం మానసిక జీవులం.. అంతే, కోరికల పుట్టలం.. ఆశాజీవులం.. మన కోరికకు కాలమానం లేదు. ఆ కోరికకు చేరవలసిన గమ్యం అంటూ లేదు. నిలబడ్డ చోటు నుండి సైతం ప్రయాణించగలదు. ప్రయాణిస్తూ, ప్రయాణిస్తూ అలమటిస్తూ ఆరాలు పడ్తూ ఎగసిపడటం దాని నైజం. ఇలా భౌతికంగా అంటే ప్రాపంచికంగా తచ్చాడుతున్నంత కాలం కోరిక వేదనగానే వెల్లడవుతుంటుంది. దీనికి అక్షర రూపమే గీతలోని అర్జున విషాదయోగం.
ఏదో ఒక మలుపులో అధ్యాత్మక వెలుగు ప్రసరిస్తే తప్ప వేదనామయ వెతుకులాట నెమ్మదించదు… నెమ్మదిస్తే తప్ప దేవతా రహస్యాలు, దివ్యత్వం అందిరావు. ఆ రహస్యాలు ప్రిదిలితే తప్ప ఆత్మ దైవిక ప్రాంగణాలను దాటలేదు. ఆ దివ్య ప్రాంగణాలను దాటితే తప్ప విశ్వ ప్రాంగణాలను చేరలేదు. ఆది స్థితి చేరలేదు.

ఇలా వివేచిస్తుంటే మానవత్వం, దివ్యత్వం, విశ్వత్వం సంగమమే ఆత్మ అని స్పష్టమవుతుంటుంది. అసలు మనసుకే పరిమితమైన ఆత్మ మానవత్వంలోనే సంచరిస్తుంటుంది. అంతరంగానికి చేరుకోగల ఆత్మ దివ్యత్వంతో విహరిస్తుంటుంది. దేహాన్ని, మనసును, అంతరంగాన్ని దాటిన ఆత్మ విశ్వ ప్రాంగణాలలో ప్రాణభూత మవుతుంటుంది. అందుకే మన మానవత్వాను ‘డిజైర్ సోల్’ అని అంటుంది. కోరికలకు అతీతమైనది ట్రూ సోల్!
భగవద్గీతలోని అర్జునాత్మ డిజైర్ సోల్. కృష్ణాత్మ ట్రూ సోల్. మనం సైకిక్ బీయింగ్‌గా మసలుతున్నంత కాలం మనది డిజైర్ సోకగానే పరిభ్రమిస్తుంటుంది. అయితే ఆత్మ తనలోని దివ్యత్వాన్ని పసిగడితే తప్ప ఈ దేహానికి, మనసుకు అతీతమై ప్రయాణించలేదు. దేహానికి, మనసుకు అతీతమైతే తప్ప పూర్ణం కాలేం.

మంచికి పెద్ద పీట వేయాలన్నా కేవలం దేవతా రూపం సరిపోదు… మానవ రూపమే భూమిక కావాలి. గీతలోని కృష్ణుడు ఇలా మానవ అవతారానికి వచ్చిన దివ్యమూర్తినే! మొత్తానికి కోరికలతో అలమటించినవాడు అర్జునుడైతే, ఆత్మ సంయమంతో కోరికలకు అతీతమైనవాడు కృష్ణుడు. అందుకే కృష్ణ గీత అయిన భగవద్గీత ఆత్మగీతనే.
………..
కర్మయోగం:

కర్మయోగ సాధకులకు ఈ సమదృష్టి, సమభావనలఆవశ్యకత ఏమిటి? అంటే సమస్థితచిత్తం వల్లనే వర్తమాన మానవ జన్మలోనే ఈ భౌతిక ప్రాపంచికతకు అతీతం కాగలం.
  • మన మానవ దేహంలో ‘ఆత్మ’ అంతర్యామి!
  • మనను ఆవరించిన విశ్వంలో ‘పరమాత్మ’ అంతర్యామి!
  • మొత్తానికి ఆత్మ అయినా, పరమాత్మ అయినా అంతర్యాములే!
పరమాత్మ తన కార్యాచరణను విశ్వ రచనా రూపంలో కొనసాగిస్తూనే ఉంటుంది. అదే సృష్టి కార్యం. కాబట్టి జీవాత్మ కూడా తన కర్మాచరణను త్యజించవలసిన అవసరం లేదు… కారణం జీవాత్మ కూడా విశ్వ సృజనలో భాగస్వామి కాబట్టి. అయినా భౌతికతలోని కాలుష్యం వల్ల ఆత్మ దేహపరంగా సంచరిస్తున్నా కొన్ని కర్మల స్వాభావికత నుండి విడివడి కర్మాచరణను పూర్తి చేయవలసి వస్తోంది. అంటే రూటు మార్చవలసిన అవసరం లేకపోయినా గేరు మార్చి గమ్యం చేరవలసి వస్తోంది.

ఇలా గేరు మార్చటమే మనం ప్రాపంచికంగాను, దైహికంగాను సన్యసించటం.ఇదే కర్మ
సన్యాసం… సాంఖ్య యోగం. ఇంతకీ సన్యసించటం అంటే జీవాత్మ తన కర్మాచరణను పరమాత్మ పరం చేయటం… భౌతిక కర్మలను అధిభౌతికానికి అంకితం చేయటం… సర్వ సమర్పణ అంటే ఇష్టాలకు అయిష్టాలకు అతీతం కావటం… ద్వైతం నుండి అద్వైతం
కావటం… బంధాల నుండి విడివడటం – సన్యాసం.

నిజానికి ఏ వివక్షా లేని స్థితే సన్యాసం… అంతే తప్ప ప్రతి కర్మనూ త్యజించుకుంటూ పోవటం కదా. ఇలా చూసినప్పుడు సన్యాస యోగానికైనా, కర్మ యోగానికైనా లక్ష్యసిద్ధి ఒక్కటే. అయితే ప్రారంభమూ, గమనమూ వేరువేరు.

మొత్తానికి కర్మలకు సంబంధించిన కర్తృత్వ బాధ్యతను వహించకుండటం కర్మ సన్యాసం.. ఇదే యోగి లక్షణం. ఇక్కడ సన్యాస జీవనం అంటే ఆశారహితులం కావటం.. మమకార రహితులం కావటం.. సంతాప రహితులం కావటం.. అంటే సుఖదుఃఖాలకు, సంతోష సంతాపాలకు మనసును చేర్చకుండటం.

ఇలా సమస్త కర్మ బంధాల నుండి ముక్తం కావటమే సాంఖ్యయోగ నిష్ఠ. ఆ జీవన విధానమే సాంఖ్య యోగ సాధన. అయితే ఈ సాంఖ్య సాధనకు జ్ఞాననిష్ఠ అవసరం.

ఆశలు, మమకారాలు, కోరికలు, ఆనందాలు, ఆవేదనలు, ఆవేశాలు, అవమానాలు, ఆక్రందనలు – ఇటువంటి ఉద్వేగాల సమాహారమే ప్రాపంచిక జీవనం. ఇవేవీ లేని మానవజీవితం ఏమిటి? అన్న ప్రశ్న తలెత్తటం సహజం.

సృష్టిలోని ప్రతి ప్రాణీ తమ ప్రకృతులకు అనుగుణంగానే కర్మలను ఆచరిస్తుంటాయన్న అవగాహన మనందరకు ఉన్నదే. కాబట్టి కర్మాచరణను త్యజించటం జీవన ప్రవృత్తి కాదు అన్నది స్పష్టం.

ప్రకృతిబద్ధమై జీవన యానం సాగించవలసిందే.
మనం చేసే కర్మల విషయంలో ఒక్క ప్రకృతి ప్రభావం అనే కాదు…
మోహ ప్రభావం కూడా ఉంటుంది. దీనికి సంస్కార ప్రభావం తోడవుతుంటుంది. దీనే్న
‘స్వభావజేన.. నిబద్ధః స్వేన కర్మణా కర్తుం నేచ్ఛసి యన్మోహాత్క రిష్యస్యవశోపి తత్’ అని అంటుంది భగవద్గీత.

మనం ఎంత కాదనుకుంటున్నా, వద్దనుకుంటున్నా స్వభావ కర్మ వర్తమాన కర్మను
ప్రేరేపిస్తుంటుంది. ప్రభావితం చేస్తుంటుంది. ఇక్కడ స్వాభావిక కర్మ అంటే గత కర్మ అనే! దీనే్న మనం స్వాభావిక సంస్కారం అని చెప్పుకోవచ్చు. అంటే ఈ జన్మకు సంబంధించిన కర్మాచరణ విషయంలో మనలో సంపూర్ణ ఇష్టత నెలకొని ఉండకపోయినప్పటికీ, స్వాభావిక
సంస్కారం వల్ల వర్తమాన కర్మాచరణ విషయంలో వెనుతిరగటం సాధ్యపడదు. అంటే ఎట్టి పరిస్థితుల్లోనూ కర్మాచరణ తప్పదు.

ఇంతకీ స్వాభావిక కర్మ అనేది గతంతో సంబంధం కలిగి ఉన్నటువంటిది. అందుకే వర్తమాన కర్మాచరణను గత జన్మ కర్మ శేషం అంటుంటాం.. పూర్వజన్మనే ఈ జన్మ కర్మకు కారకం అంటుంటాం.

కాబట్టి వర్తమాన కర్మాచరణ నుండి తప్పుకోవటం సాధ్యం కాదన్నది సామాన్య భావన.
యోగ జీవనంలో వర్తమాన కర్మాచరణకు మూలమైన ప్రకృతికి, స్వభావానికి అతీతం కావటం ముఖ్యం. అంటే స్వభావజనితంగా కాక వివేచనా పూర్వకంగా వర్తమాన కర్మాచరణ పరంగా అడుగులేయటం ముఖ్యం. ఇలా గత కర్మ బంధాల నుండి ముక్తం కావటమే కర్మయోగం.

ఈనాటి మన కర్మాచరణకు మూలమవుతున్న స్వభావం, సంస్కారం అన్నవి మన స్వతంత్ర ప్రవృత్తులుగా అనిపిస్తున్నా నిజానికి అవి పరతంత్రాలే! గత కర్మ శేషాలు కాబట్టి పరతంత్రాలే. పరతంత్రాలయినప్పటికీ స్వతంత్రా లనిపించటమూ మోహ ప్రభావ కారణానే్న! ఇలా ‘కర్మ’ను అర్థం చేసుకునే ప్రయత్నంలో కర్మలు స్వభావ ఫలితాలనుకుంటున్నప్పటికీ గత జన్మ కర్మల సంస్కారాలే ఈ జన్మ స్వభావాలన్న సత్యాన్ని, వాస్తవాన్ని అంగీకరించక తప్పదు. గతం
ప్రకృతి అయితే వర్తమానమే స్వభావం. నాటి ప్రకృతి ప్రతిబింబమే నేటి స్వాభావిక సంస్కారం.

ఇంతకీ కర్మాచరణ పరంగా మనం చేసే యోగ సాధన ఏమిటి? అంటే మమతాసక్తికి దూరం కావటమే కర్మయోగానికి భూమిక. మన ఇంద్రియాలను, మనసును, బుద్ధిని, దేహాన్ని, అంతఃకరణ శుద్ధిపరంగా వినియోగించటమూ యోగ సాధనే. ప్రాపంచిక, భౌతిక, దైహిక స్వార్థాన్ని వీడి నిష్కామ భావనతో యోగ జీవనాన్ని సాగించటమే కర్మయోగం.

నిష్కామ భావనతోనే యోగ సాధకులమైన మనం కర్మ బంధనం నుండి విడివడగలం… అలాగే ఫలాసక్తి లేకపోవటంవల్ల సమదృష్టి సాధ్యమవుతుంది.

ఆత్మాకు పరమాత్మకు గల పరమార్ధం - Atma paramatma
ఆత్మ, పరమాత్మ అనే పదాలను తరచుగా ఆధ్యాత్మిక ప్రసంగాల్లో వింటూ ఉంటాము. అనేకమంది స్వామీజీలు లేదా ఆధ్యాత్మికవేత్తలు ఆత్మ, పరమాత్మల గురించి వారి ఆధ్యాత్మిక ప్రసంగాల్లో వివరిస్తుంటారు. కానీ వారికి ఉండే భాషా పరిజ్ఞానం సామాన్య ప్రజానీకానికి ఉండదేమో, అందువల్లే ఎన్నో కొన్ని గంటలపాటు వారి ప్రసంగాలు విన్నప్పటికీ ఆత్మపరమాత్మ అంటే అర్ధం ఎవ్వరూ చెప్పలేక పోతున్నారు. ఇక్కడ అందరికీ అర్ధమయ్యేలా ఈ విషయంపై చర్చించుకోవాలంటే…

ఆత్మ, పరమాత్మ అనేవి రెండూ ఒకదానికి మరొకటి పర్యాయ పదాలుగా చెప్పుకోవచ్చు. ఒకే ఆబ్జెక్ట్‌కు ఉండే రెండు నామార్ధాలే అవి. అది ఎలా అంటే పరమాత్మ అంటే భగవంతుడు. ఆత్మ ఆయన యొక్క ప్రతి బింబం. అంటే ప్రతి జీవిలో ఉన్నది ఆయన ప్రతి బింబమని ప్రతి ఒక్కరూ భావించవచ్చు. ఇదే విషయాన్ని కురుక్ష్త్రే సంగ్రామ సమయంలో భగవానుడు శ్రీ కృష్ణుడు, తన భకాగ్రేసరుడైన అర్జునకు వివరించాడు. ‘‘అర్జునా! ఈ సమస్త సృష్టి యందునూ ప్రతియొక జీవిలోనూ నేను నిండియున్నాను. నా యొక్క ప్రతి స్వరూపమే ఆత్మస్వరూపాన ఆయొక్క జీవులన్నింటిలోనూ నిండియున్నది.

కనుక అర్జునా! సంశయింపకుము, చంపెడి వాడెవ్వడు, చచ్చెడి వాడెవ్వడు, అంతయూ నేనే, ఇది అంతా నా యొక్క చిద్విలాసము, నీ యొక్క భౌతికస్వరూపము ద్వారా ధర్మ సంస్థాపన చేయుచున్నాను, నీ యందునూ నేనే నిండియున్నాను, నీ యొక్క విధిని నీవు నిర్వర్తింపుము, పాప పుణ్యముల ఫలితమును నాపై వదిలి వేయుము. నీ సంశయమును దీర్పనెంచి నా యొక్క విశ్వరూపమును ప్రదర్శించుచున్నాను’’ అంటూ అర్జునుని యొక్క సందేహములను తీర్చు క్రమంలో తన విశ్వరూపాన్ని ప్రదర్శించి తద్వారా సమస్త ప్రాణకోటికీ ఆత్మపరమాత్మల యొక్క స్వరూప, స్వభావాలను విస్పష్టంగా చెప్పడం జరిగింది.

భగవద్గీతలో శ్రీకృష్ణుడు, అర్జునునకు ఉపదేశించిన విధంగా నీవు, నేను, జంతువు, క్రూరమృగాలు, క్రిమి, కీటకాదులనే భేదంతో నిమిత్తం లేకుండా భగవంతుడి ప్రతి స్వరూపం ప్రతి ఒక్కరిలోనూ నిండియున్నది.
అది ఎలా అంటే… ఇక్కడ ఆత్మ, పరమాత్మ అంటే వేరుకాదు. సాధారణ వ్యావహారిక భాషలో చెప్పుకోవాలంటే ఉదాహరణకు అద్దంలో చూచుకొనే మనిషి అసలు స్వరూపమైతే, అద్దంలో కనబడేది ప్రతిబింబ స్వరూపం. ఎప్పుడైతే మానవుడు అద్దం ముందు నిలబడతాడో ప్రతి బింబం రూపేణా అతడే అద్దంలో కనబడతాడు. ఎప్పుడైతే మానవుడు అద్దం ముందు నుండి తొలగుతాడో, అప్పుడు అతడి ప్రతిబింబం తొలగిపోతుంది. అదే విధంగా జీవి యొక్క అసలు స్వరూపం భగవంతుడు అయినట్లయితే ఆయన ప్రతి రూపమే ఆత్మ. దానినే జీవియొక్క ప్రాణం లేదా జీవంగా పేర్కొనవచ్చు. ఎప్పుడైతే ఐహిక దేహమనే అద్దం నుండి ఆత్మ అనే భగవంతుడి ప్రతి బింబం తొలగి పోతుందో అప్పుడే జీవికి మరణం సంభవిస్తుంది.


రచన: కోటి మాధవ్ బాలు చౌదరి

Post a Comment

0 Comments
* Please Don't Spam Here. All the Comments are Reviewed by Admin.

ఈ వ్యాసం పై మీ అభిప్రాయాలు, సూచనలు క్రింద ఉన్న గడిలో తెలియపరచగలరు !

ఈ వ్యాసం పై మీ అభిప్రాయాలు, సూచనలు క్రింద ఉన్న గడిలో తెలియపరచగలరు !

Post a Comment (0)

buttons=(Accept !) days=(20)

Our website uses cookies to enhance your experience. Learn More
Accept !
To Top