Page Nav

HIDE
FALSE
HIDE_BLOG

Classic Header

{fbt_classic_header}

తాజా విశేషాలు:

latest

నవగ్రహ దోష నివారణ ముద్రలు - Navagraha Dosha Nivarana Mudralu

నవగ్రహ దోష నివారణకు నవగ్రహ ముద్రలు: వ్యాధులు తగ్గించడానికి ఆయుర్వేద మందులు ఎంత బాగా పని చేస్తాయో అంత కంటే ముద్రలు వేసి ధ్యానం చేస్తే వ్య...

నవగ్రహ దోష నివారణ ముద్రలు - Navagraha Dosha Nivarana Mudralu
నవగ్రహ దోష నివారణకు నవగ్రహ ముద్రలు:
వ్యాధులు తగ్గించడానికి ఆయుర్వేద మందులు ఎంత బాగా పని చేస్తాయో అంత కంటే ముద్రలు వేసి ధ్యానం చేస్తే వ్యాధులు వేగంగా తగ్గుతాయి. కొన్ని సార్లు కేవలం ముద్రలు వల్లే వ్యాధులు తగ్గినట్లు అనుభవాలు వున్నాయి.ఆసనాల కంటే ముద్రలు లోతైనవి. ఇవి శరీరాంగాలకు అతీత శక్తులకు సంబంధించినవి. వాటి ద్వారా జ్ఞానేంద్రియాలను ప్రభావితం చేసి లోపాలను సవరించవచ్చును.

ఆయా గ్రహాదిపతులను ఉపాసించు సమయమున ఆయా గ్రహదీపతుల కు ఇష్టమైన ముద్రలను ప్రదర్శించాలి. జప పూజాదుల సమయము నందు ఆయా ముద్రలను ప్రదర్శించి ఆయా గ్రహధిపతుల కరుణాకటాక్షములను, ప్రసన్నం చేసుకోవడానికి ముద్రలను ప్రదర్శిస్తూ వుంటారు. మన చేతుల్లో శక్తి ప్రవహిస్తూ ఉంటుందని, మన చేతికున్న ఐదు వేళ్ళూ ఐదు తత్వాలకు సంకేతమని అంటారు.

బొటని వేలు అగ్నికి, చూ పుడు వేలు వాయువుకు, మధ్యవేలు ఆకాశం, ఉంగరం వేలు పృధ్వి, చిటికెనవేలు జలానికి సంకేతాలు గా చెప్తారు. ఈ ఐదు తత్వాల అసమతుల్యత వల్లనే వ్యాధులు వస్తాయని, వీటిని మందులు, ఆత్మశక్తి, ముద్రల సాయంతో సరిచేయవచ్చని అంటారు.

ఈ ముద్రలను రోజూ అరగంట సాధన చేస్తే చాలు.
అష్టోత్తర శాతం ముద్రా బ్రహ్మణా యా ప్రకీర్తితాః
తాసాం తు పంచపంచాతదేతా గ్రాహ్యాస్తు పూజనే ||

బ్రహ్మదేవుడు చెప్పిన 108 ముద్రలలో 55 ముద్రలు మాత్రమే పూజలలో వినియోగించబడతాయి.
ముద్రాం బినాతు యజ్జప్యం ప్రాణాయామః సురార్చనమ్
యోగో ధ్యానాసనే చాపి నిష్పలాని చ భైరవ ||

జపం,ప్రాణాయామం,ధ్యానమ,ఆసనాలు అన్నీ ముద్రలు లేకుండా చేస్తే చేసిన పూజ నిష్పలమంటారు.
శిఖరిణీ ముద్ర (సూర్యగ్రహ ముద్ర):
ముష్టిర్దక్షిణ హస్తస్య యదోర్ధాంగుష్టికా భవేత్
సాస్యాచ్చికరిణీ ముద్రా,బ్రహ్మీ సూర్య ప్రియాచసా ||

కుడిచేతిని పిడికిలిగా బిగించి బొటన వ్రేలిని మాత్రం నిటారుగా ఉంచితే శిఖరిణీ ముద్ర అంటారు.ఇది సూర్యునికి ప్రీతికరమైన ముద్ర.
అర్ధధేను ముద్ర (చంద్రగ్రహ ముద్ర):
అనామికే కనిష్ఠేచ సంయోజ్య వాయునా పునః మాధ్యమా తర్జనీనాంతు
ధేనుముద్రేన బంధనమ్ సార్ధధేనురితిఖ్యాతా చంద్రప్రీతి వివర్ధినీ ||
ఎడమ,కుడి చేతుల అనామిక కనిష్ట వ్రేళ్ళు నిటారుగా కలిపి ,తర్జనీ మధ్యమాంగుళులను ధేనుముద్రగా వస్తే అర్ధధేను ముద్ర అవుతుంది.ఇది చంద్రునికి ప్రీతికరమైన ముద్ర.

సమ్మీలిని ముద్ర (కుజగ్రహ ముద్ర):
కరయోరంగుళీనాంతు,సర్వాగ్రాణ్యేకతః స్థితా నియోజ్య ద్వేతలేచైవ,తదధోపి నియోజ్య చ అగ్రైరగ్రై యోజయేతు,ముద్రా సమ్మీలినీతు సా భౌమ భూమి మునీ శానాం,ప్రీతి వివర్ధినీ ||
రెండుచేతుల వ్రేళ్ళ కొసలను విడివిడిగా ఉంచి,అరచేతులను,అరచేయి మూలాన్ని ఒకటిగా కలిపితే సమ్మీలినీ ముద్రా అవుతుంది.ఇది కుజునికి ప్రీతికరమైన ముద్ర.
కుండ ముద్ర (బుద్ధగ్రహ ముద్ర):
సర్వాంగుళీస్తు సంయోజ్య,దక్షస్య కరస్య చ కియద్భాగం తధానమ్యతలం
కుర్యాత్ తు కుండవత్ సమాఖ్యాతా కుండముద్రా,బుధ వాణీ శివప్రియా ||

కుడిచేతియొక్క అన్నీ వ్రేళ్ళను ఒకటిగా కలిపి కొంచెం లోపలి వైపుకు వంచి,రెండు అరచేతులను కుండ ఆకారంలో కలిపితే కుండ ముద్ర అవుతుంది.కుండ ముద్ర బుధునికి,శివునికి,సరస్వతికి ప్రీతికరమైన ముద్ర.
చక్రముద్ర(గురుగ్రహ ముద్ర):
సర్వాంగుళీనాం మధ్యంటు,వామహస్త్పయ చాంగుళీః ప్రసార్యాంగుష్ఠ యుగళం,సంయోజగ్రేణ భైరవ తదంగుష్ఠ ద్వయం కార్య సమ్ముఖం వితరమేతతఃచక్రముద్రా సమాఖ్యాతా గురువిష్ణుశ్శివప్రియాః ||
ఎడమచేతి యొక్క నాలుగు వ్రేళ్ళు బ్రొటన వ్రేలు కాకుండా కుడిచేతి యొక్క నాలుగు వ్రేళ్ళ మధ్యగా పోనిచ్చి ,రెండుచేతుల బొటన వ్రేళ్ళ చివరాలు ఒకటిగా కలిపి ,రెండు బొటన వ్రేళ్ళను సాధకుని వైపు వ్యాపించినచో అది చక్రముద్ర అవుతుంది.చక్రముద్ర గురునికి,విష్ణువుకి,శివునికి ప్రీతికరమైన ముద్ర.
శూల ముద్ర (శుక్రగ్రహ ముద్ర):
అంగుష్టం మధ్యమాంచైవ నామయిత్వా కరస్యతు దక్షణస్య పరాస్తిస్రో యోజయేదగ్రతఃపునః శూలముద్రా సమాఖ్యాతా మమ శుక్ర గ్రహప్రియాః ||
కుడిచేతి యొక్క బొటనవ్రేలుతో మద్యవ్రేలును కొంచెం లోపలివైపుకు వంచి మిగతా మూడు వ్రేళ్ళ చివరలు ఒకటిగా కలిపితే శూలముద్ర అవుతుంది.ఇది శుక్రునికి,శివునికి ప్రీతికరమైన ముద్ర.
సింహముఖి ముద్ర (శనిగ్రహ ముద్ర):
నిమబ్జీకృత్యతు కరౌ వామాంగూళి గణస్య తు అగ్రాణీయో జయోన్మాధ్యే ,తలస్యా సవ్య హస్తతః అధః కృత్వా వామహస్తం ముద్రా సింహముఖీ స్మృతా ఇయం ప్రత్యైటు దుర్గాయాః సూర్యపుత్రస్య చక్రిణః  ||
రెండు అరచేతులు ఒకటిగా కలిపి ఎడమచేతి 5 వ్రేళ్ళ కొసలు కుడి అరచేతిలో ఉంచి ,ఎడమచేతిని కొంచెం క్రిందికి జార్చినచో సింహముఖి ముద్ర అవుతుంది.దుర్గాదేవికి,విష్ణువుకు,శనీశ్వరునికి ఇది ప్రీతికరమైన ముద్ర.
భగముద్రా (రాహుగ్రహ ముద్ర):
భగముద్రా కర్ణమూలే గోముఖాఖ్యం ప్రకీర్తితా
మమ విష్ణో స్తధా రాహుః సర్వదా ప్రీతిదాయినీ ||

రెండు చేతివ్రేళ్ళను గోముఖాకారంలో చేసి చెవుల దగ్గర ఉంచితే భగ ముద్ర అవుతుంది.ఇది శివునికి,విష్ణువుకు,రాహువునికి ప్రీతికరమైన ముద్ర .
త్రిముఖ ముద్ర (కేతుగ్రహ ముద్ర):
అంగుష్ఠ తర్జనీ మధ్యా అగ్రభాగం నియోజ్యచ మధ్యమాంచ కనిష్థాంచా ఆకుంఠ్య దక్షిణేకరే త్రిమూఖాఖ్యా సమాఖ్యాతా విశ్వదేవ ప్రియాసదా కేతోతః ప్రియేయం సతతం మాతృణామాపి తుష్టిదా ||
కుడిచేతి బొటనవ్రేలు,చూపుడువ్రేలు మధ్యవ్రేళ్ళ యొక్క చివరలు ఒకటిగా కలిపి,అనామిక కనిశ్తికాంగుళులను లోపలకుముడిస్తే త్రిముఖ ముద్ర అవుతుంది.ఇది కేతువుకు,విశ్వేదేవతలకు,మాతృగాణాలకు ప్రీతికరమైన ముద్ర.
నవగ్రహ ముద్రలను దైనందిన పూజా కార్యక్రమాల్లో వినియోగించుకొనిన యెడల, నవగ్రహల అనుగ్రహం కలుగుతుంది.

రచన: కోటి మాధవ్ బాలు చౌదరి