రామాయణాన్ని ఎలా అర్థంచేసుకోవాలి - The reading methodology for Ramayana

0
రామాయణాన్ని ఎలా అర్థంచేసుకోవాలి - The reading methodology for Ramayana
రామాయణాన్ని ఎలా చదవాలి??? ఎలా అర్థంచేసుకోవాలి?????

శ్రీ రాముడు కొన్ని వేల సంవత్సరాల క్రితం పుట్టాడు. తండ్రి మాట కోసం అడవులు వెళ్ళాడు. సీతను రావణుడు ఎత్తుకపోతే , సుగ్రీవుని సేన తో హనుమంతుని సాయంతో లంకకు వెళ్లి, రాక్షసులని మాట్టు పెట్టి, సీతతో కలసి అయోధ్య తిరిగి చేరి రాజ్యం పాలించాడు. ఇది, ఇలా ఒక కథలా విన్నా, చదివినా, అందులో నుండి పొందే ప్రయోజనం అతి స్వల్పం. ఎప్పుడైతే దీనిని కథగా కాకుండా ఇతిహాసముగా(ఇతిహాసం అంటే, ఇలాగే జరిగినది) చదివి, రాముడు సాక్షాత్తు అది నారాయణుడే అయినా కానీ, తన జన్మాన్తరము అది ఎరుకలోనికి తీసుకురాకుండా, ఒక నరుడిగా మాత్రం జీవించాడు. ఇలా ఎందుకు జీవించాలి? నారాయణుడే కనుక, రావణుడిని చంపడానికి అంతగా ఎందుకు శ్రమించాలి? అంతగా ఎందుకు కష్టపడాలి? ఎందుకంటే అన్ని

అవతారములలో లాగ నారాయణుడు దేవుని గా రామావాతారములో అవతరించలేదు. ఒక నరుడిగా పుట్టి, పెరిగి, నరుడిగా కస్టాలు పడి , నరుడిగా రాక్షసులను అంతమొందించి, నరుడు ధర్మమును పట్టుకొని ఎలా బతకాలో ఈ లోకానికి స్వయంగా తాను జీవించి నిరూపించి, చూపించడానికే రామావతారం ఎత్తాడు.

తాను ఎంత కష్టంలో నైన ఉండ నివ్వండి, తాను ఎప్పుడు పట్టుకొని ఉన్నది మాత్రం ధర్మమే. లోకంలో అప్పటి వరకు రావణుడిని ఓడించ గలిగిన వారు కేవలం ఇద్దరు. ఒకడు వాలి, మరొకరు కార్తవీర్య అర్జునుడు. సుగ్రీవుని బదులుగా , వాలితో చేయి కలిపివుంటే రావణుడిని వధించడానికి కష్టపడవలసిన అవసరమేలేదు. కాని అతి బలవంతుడైన వాలిని కాదని, సుగ్రీవునితో స్నేహం ఎందుకు చేయాలి? వాలిని ఎందుకు చంపాలి? కేవలం ధర్మమే.

తండ్రి మరణించిన తరువాత, భరతుడు, గురువులు, ప్రజలు అందరు కలసి వచ్చి, రామునుని మరల అయోధ్యకు వచ్చి రాజ్య పాలన చేయమని అడిగినా కాని, తన తల్లి కైకేయియే స్వయంగా వచ్చి, తాను కోరిన వరాలను ఉపసంహరించుకుంటాను అని చెప్పినా కాని రాముడు ఎందుకు ఒప్పుకోలేదు? మళ్ళి ధర్మమే.అంత యుద్ధం చేసి, రావణుడిని చంపినా పిదప, శవమై పడి ఉన్న రావణుడిని చూసి, తన సొంత తమ్ముడైన విభీషణుడు అన్నగారికి అంత్యేష్టి సంస్కారములను చేయలేను అని అంటే, అది తప్పని చెప్పి, విభీషణుడికి నీతి చెప్పాడు. అంత శత్రువైన, ఎంత పాపము చేసినవాడైన, మరణించాక ఆ శత్రుత్వం అక్కడితో పోయింది అని ధర్మం చెప్పాడు. ఇలా అడుగడుగునా ధర్మమే. గురువులను గౌరవించడములో కాని , సీత కళ్యాణ విషయములో జనకునితో సంభాషణలో కాని , పితృ వాక్య పరిపాలనలో కాని , భరతునికి చెప్పే రాజ నీతిలో కాని , వాలిని చంపడములో కాని , సుగ్రీవునితో మైత్రిలో కాని, కబంధుడి,జటాయువు అనాధ ప్రేత సంస్కారములో కాని, రావణ వధయందు కాని, వధ తరువాత కాని, ఆఖరికి సీతా అగ్ని ప్రవేశమందు కాని, అన్ని చోట్ల ధర్మమూ తప్ప వేరోక్కటి పట్టి ఎరుగడు రాముడు. అల ధర్మాని పట్టి నిలబడి ఈ జగత్తుకు ఒక నరుడిగా జీవించి ఆదర్శంగా నిలిచినా మహావాతారము శ్రీ రామ అవతారము.

జై శ్రీ సీతారామచంద్ర.


రచన: కోటి మాధవ్ బాలు చౌదరి

కామెంట్‌ను పోస్ట్ చేయండి

0 కామెంట్‌లు
* Please Don't Spam Here. All the Comments are Reviewed by Admin.
కామెంట్‌ను పోస్ట్ చేయండి (0)

buttons=(Accept !) days=(0)

Our website uses cookies. Learn More
Accept !
To Top