గ్రామాల్లో వాణిజ్యం (వ్యాపారం) - Village Businesses

0
గ్రామాల్లో వాణిజ్యం (వ్యాపారం)  - Village Businesses
పల్లెల్లో వాణిజ్యం
రైతులు తమకు కావలిసినంత తిండి గింజలను దాచుకొని మిగతా దాన్ని అమ్మేవారు. కాని ఎక్కువగా బెల్లం, వేరుశనగ కాయలు, కూరగాయలు, పండ్లు మొదలగునవి మాత్రమే అమ్మేవారు. దాని ద్వారా మాత్రమే రైతులకు డబ్బులు అందేవి.

కాని ఊర్లలోకి అమ్మ వచ్చే మామూలు వస్తువులకు వస్తు మార్పిడి పద్ధతి అమలులో వుండేది. ఉప్పు కావాలంటే కొంత దాన్యాన్ని ఇచ్చే వారు. వడ్ల విలువ ... ఉప్పు విలువను రైతు మహిళలు బేరీజు వేసుకుని చూసే వారు కాదు. వారికి అతి సులభంగా అందు బాటులో వున్నవి 'వడ్లే'.. ఈ వస్తు మార్పిడి పద్ధతి ఎక్కువగా వడ్లతోనె జరిగేది. చింత పండుకు ఖర్జూర పండ్లు, గనిసె గడ్డలు, ఇచ్చేవారు. ఖర్జూర పండు ఇక్కడ అరుదుగా దొరికేది.

ఖర్జూరానికి సమ తూకానికి సత్తు గిన్నెలు, పాత బడిన రాగి పాత్రలు కూడా ఇచ్చేవారు. కాని దాన్యానికి వస్తువులివ్వడం కేవలం పల్లెల్లో మాత్రమే జరిగేది. సంతల్లో ఇటువంటి వ్యాపారం లేదు. అక్కడ ఏవస్తువైనా డబ్బిచ్చి కొనాల్సిందే. డబ్బు చలామణి అతి తక్కువ.

ముఖ్యంగా రైతు స్త్రీలలో డబ్బును తమ వద్ద వుంచుకున్న వారు ఆ రోజుల్లో బహు అరుదు. ప్రస్తుతం ధాన్యంతో వస్తు మార్పిడి ఎక్కడా లేదు. కాని దాని ఆనవాలుగా .... సీసాలకు, పాత పుస్తకాలకు ఐసు పుల్లలు, చింత గింజలకు గెనిసి గెడ్డలు, కొబ్బారికి కొబ్బెర నూనె, ఆముదాలకు, ఆముదమూ, వేపగింజలకు వేప నూనె, కానుగ గింజలకు కానుగ నూనె ఇలా కొంత వస్తు మార్పిడి ఉంది. ఈ రోజుల్లో ప్లాస్టిక్ సామానులు ఎక్కువయ్యాయి. పల్లెల్లో వీటికి ఆదరణ ఎక్కువ. బిందెలు, బక్కెట్లు వంటి ప్లాస్టిక్ సామాన్లు ఎక్కువగా వాడుతారు. దానికి కారణమేమంటే అవి చాల తేలికగా వుంటాయి. పాడైన పాత ప్లాస్టికి సామానులకు కొత్త ప్రాస్టిక్ సామానులు ఇస్తున్నారు. పాడైన ఇనుప సామాను కూడా తీసుకొని కొత్త పాత్రలను ఇస్తున్నారు. ప్రస్తుతం పట్టణాలలో ఇదొక పెద్ద వ్వాపారం.

సంత:
సంతలో అమ్మకానికున్న అలంకార సామాగ్రి 
పల్లె వాసులు పండించిన కూరగాయలు, మొదలగు వాటిని విక్రయించ డానికి గతంలో వారపు సంతలుండేవి. వారంలో ఒక రోజు ఒక గ్రామంలో సంత జరుగు తుంది. చుట్టు ప్రక్కల పల్లె వాసులు తాము పండించిన కూరగాయలు, పండ్లు ఇతర వస్తువులు అమ్ముకోడానికి, తమకు కావలసిన వస్తువులు కొనుక్కోడానికి ఈ వారపు సంతలు చాల ఉపయోగ కరంగా వుండేవి. 

రైతులేకాక ఆ సం తలో కుమ్మరి వారు కుండలను, మేదరి వారు తట్టలు, బుట్టలు, చాటలను కమ్మరి వారు కత్తులు, కొడవళ్ళు మొదలగు ఇనుప వస్తువులను సంతకు తెచ్చి అమ్మేవారు. ఈడిగ వారు దువ్వెనలు, కుంకుమ బరిణెలు, గాజుల వారు గాజులను ఇలా అనేక వస్తువులను ఈ సంతలలో అమ్మేవారు. ఈ సంతలకు ఇతర ప్రాంతాల నుండి అనేక వస్తువులు అనగా బట్టలు, తినుబండారలు, ఇతర కిరాణా వస్తువులు, అనగా సబ్బులు, పౌడర్లు, మొదలగు అలంకరణ సామాగ్రిని ఎద్దుల బడ్ల మీద తెచ్చి అమ్మేవారు.తాము తెచ్చిన వస్తువులను అమ్ముకొని తమకు కావలసిన వాటిని కొనుక్కోవడాని ఈ సంతలు ఎంతో ఉపయోగ కరంగా వుండేవి. ఒక విధంగా ఇక్కడ పురాతన వస్తు మార్పిడి జరిగేది. ఆ రోజుల్లో సంతలు చాల రద్దీగా వుండేవి.

ఆ సందర్భంలో సంతల్లో చిన్న చిన్న వినోద కార్యక్రమాలు చిన్న పిల్లలకు వినోధాన్ని ఇచ్చేవి. ఆ రోజుల్లో సంతకు వెళ్లడమంటే ఒక జాతరకు వెళ్లడం వంటిదే, ప్రస్తుతం కూడా ఈ వారపు సంతలు జరుగు తున్నాయి. ఇవి ఆ కాలంలో వున్నంత రద్దీగా లేవు. కారణమేమంటే ప్రస్తుతం ప్రతి పల్లెలోను చిన్న చిన్న దుకాణాలు వెలిశాయి. రైతుల అత్యవసర వస్తువుల కొరతను అవి తీరుస్తున్నాయి. అయినా కూరగాయలు, మొదలగు వాటి కొరకు ఇప్పటికి సంతలపైనే రైతులు ఆధార పడి ఉన్నారు. అక్కడక్కడ కొన్ని ప్రత్యేక సంతలుండేవి. పశువుల అమ్మకము, కొనుగోలుకు కొన్ని ప్రాంతాలలో సంతలు జరిగేవి. వాటిని పరస అనేవారు. అక్కడ కేవలము పశువుల అమ్మకాలు... కొనుగోళ్ళు మాత్రమే జరిగేవి.

ఈ సంతల వల్ల సంత జరిగే ఆయా గ్రామాలకు కొంత ఆదాయ వనరు కూడా సమకూరేది. గ్రామ పంచాయితీ వారికి సంతకు వచ్చిన అమ్మకపు దారులు కొంత పన్నుకట్టి సంతలో వస్తువులను అమ్ముకోవలసి వుంటుండి. అదే ఆ గ్రామ పంచాయితీకి ఆదాయ వనరు. ఎప్పుడైనా సంత జరిగే రోజు పండుగ వస్తే.... ఆ సంతను ఒకటి రెండు రోజులు వెనకకు గాని, ముందుకు గాని జరుపుతారు. ఆ విధంగా పలాన రోజున సంత జరుగుతుందని అంతకు ముండు జరిగి సంతలో చాటింపు వేసే వారు.


రచన: కోటి మాధవ్ బాలు చౌదరి

కామెంట్‌ను పోస్ట్ చేయండి

0 కామెంట్‌లు
* Please Don't Spam Here. All the Comments are Reviewed by Admin.
కామెంట్‌ను పోస్ట్ చేయండి (0)

buttons=(Accept !) days=(0)

Our website uses cookies. Learn More
Accept !
To Top