మరణం అనివార్యం, ఎందుకు ? Maranam - Why Death ?

0
మరణం అనివార్యం, ఎందుకు ? Maranam - Why Death ?
రణం అనివార్యం. కానీ మనుషులు దాన్ని జీర్ణించుకోలేరు. మరణమంటే భయపడతారు. మరణమన్నది జీవితంలో భాగంగా స్వీకరించలేరు. అర్థం చేసుకోరు. మనం జన్మించింది మరణించడానికే. మరణమన్నది భూతం కాదు. జీవితంలో జరిగే ఒక సహజక్రియ. అనుబంధాలకు అంటుకున్నవాడు మరణాన్ని చూసి కంపిస్తాడు. అర్థం చేసుకున్నవాడు దాని అనివార్యతను ఆమోదిస్తాడు. పగలు వెళుతుంది. రాత్రి వస్తుంది. జీవితమయినా అంతే. పుడతాం. గిడతాం. కానీ దాన్ని మనుషులు జీర్ణించుకోలేరు. అనివార్యతని ఆమోదించడంలో ఆనందముంది. ఆహ్లాదముంది. జీవితమప్పుడే అర్థవంతమవుతుంది.

ఒక సందర్భంలో మహావిష్ణువు శివుణ్ణి కలవాలని వెళ్లాడు. తన వాహనమయిన గరుత్మంతుడిపై వెళ్లాడు. మహావిష్ణువు వాహనం దిగి శివుడి నిలయానికి వెళ్లాడు. గరుత్మంతుడు వెలుపలే ఉన్నాడు. గరుత్మంతుడు ఇటూ అటూ చూశాడు ఎదరుగా ఓ పావురం. భయంతో వణికిపోతుంది. నిస్సహాయంగా నీరుగారిపోతున్నట్లనిపించింది. గరుత్మంతుడికి దాన్ని చూసి జాలేసింది. గరుత్మంతుడు దాని దగ్గరకి వెళ్లాడు. దాన్ని చూసి ”ఏమిటి? ఏమయింది? ఎందుకంతలా వణికిపోతున్నావు? ఎందుకంత భయపడిపోతున్నావు? నేను ఉన్నాను. నువ్వు భయపడాల్సిన పనిలేదు” అన్నాడు. పావురం భయం తగ్గలేదు. వణుకు తగ్గలేదు. అది గరుత్మంతుణ్ణి చూసి ”పక్షిరాజా! నువ్వు గొప్పవాడివి. మహావిష్ణువు అండదండలు నీకున్నాయి. నీకు ఎప్పుడూ ఎట్లాంటి ప్రమాదమూ, భయమూ ఉండదు. నేను సామాన్య పక్షిని. నన్నెవరు రక్షిస్తారు?” అంది.

గరుత్మంతుడు ”ఎందుకు అంతగా భయపడుతున్నావు? నేను నీకు అభయమిస్తున్నాను. నిన్ను రక్షిస్తాను. ఇంతకూ నీకు వచ్చిన ప్రమాదమేమిటి ?” అన్నాడు. పావురం ”స్వామీ! ఇంతకు ముందే మీరు రావడానికి ముందే యమధర్మరాజు శివుడి దర్శనానికి లోపలికి వెళ్ళాడు. వెళుతూ నన్ను చూసి నవ్వాడు. ” ఈరోజు మృత్యువు నిన్ను సమీపించబోతోంది” అన్నాడు. అప్పటినుంచి నాచావు తలచుకుని నేను వణికిపోతున్నాను. యముడే చెబితే ఇక నన్ను ఎవరు రక్షిస్తారు?” అంది.

గరుత్మంతుడు ”నువ్వు ఆరోగ్యంగా ఉన్నావు. నీకు అప్పుడే మృత్యువేమిటి? నేను నిన్ను రక్షిస్తాను. ఇక్కడికి వేలమైళ్ల దూరం ఉన్న ‘లోకాలోక’ పర్వతం పైన నిన్ను వదుల్తాను. అక్కడ నీకు ప్రాణభయముండదు” అని పావురాన్ని తన రెక్కలమీద ఎక్కించుకుని వేలమైళ్ల వాయువేగ, మనోవేగాలతో వెళ్ళి కొన్ని క్షణాల్లో దాన్ని అక్కడ వదిలి తిరిగి కైలాసపర్వతం చేరాడు. కాసేపటికి శివుణ్ణి దర్శించిన యముడు బయటకి వచ్చాడు. పిట్టగోడపై పావురం లేదు. యముడు ”ఇక్కడొక పావురం ఉండాలి. ఏమైంది?” అన్నాడు.

”అది ప్రాణభయంతో ఉంటే తీసుకెళ్లి లోకాలోకపర్వతంపైన వదిలాను” అన్నాడు గరుత్మంతుడు. యమధర్మరాజు ”మంచి పని చేశావు. నేను పావురాన్ని ఇక్కడ చూసి ఆశ్చర్యపోయాను. వేలమైళ్ల దూరంలో ఉన్న లోకాలోక పర్వతంలో మృత్యువు దీనికోసం ఎదురు చూస్తూంటే ఇక్కడ ఏం చేస్తోందబ్బా! అని ఆశ్చర్యపోయాను” అన్నాడు. మరణాన్ని ఎవరూ తప్పించుకోలేరు.

రచన: కోటి మాధవ్ బాలు చౌదరి

కామెంట్‌ను పోస్ట్ చేయండి

0 కామెంట్‌లు
* Please Don't Spam Here. All the Comments are Reviewed by Admin.
కామెంట్‌ను పోస్ట్ చేయండి (0)

buttons=(Accept !) days=(0)

Our website uses cookies. Learn More
Accept !
To Top