వాస్తుశాస్త్ర పరముగా గృహమునందు బావులు,నూతులు ఉండవలసిన స్థానములు - Gruha Vastu, Bavulu, Nutulu

0
: వాస్తుశాస్త్రరీత్యా బావులు, నూతులు ఉండవలసిన స్థానములు :

వాస్తుశాస్త్ర పరముగా గృహమునందు బావులు,నూతులు ఉండవలసిన విధానములు తెలుసుకొనుటకు ఈ వ్యాసము ఉపయోగపడుతుందని తెలియచేస్తున్నాము.

గృహమునందు నివసించువారికి ఉదయము లేచినది మొదలు స్నానము, వంటకు, త్రాగుటకు, ఇతరమైన పనులకు నీటితోనే ముడిపడియున్నది. నీరు లేనిదే మన అవసరాలు తీరుటకు అవకాశము లేదు. అందుచేత మనిషి గృహావసరాల నిమిత్తం నీటిని ఏఏ దిశలలో ఉంచుకుంటే గృహస్తులకు ఉపయోగమో, వాస్తు శాస్త్రపరముగా ఎటువంటి లాభాలు కలుగుతాయో ఈ క్రింది విషయాల ద్వారా మనకి మనమే తెలుసుకోవచ్చును.

ముందుగా నీటికోసం త్రవ్వే బావులు లేక నూతులు ఎక్కడ వుంటే ఏఏ ఫలితాలు కలుగుతాయో చూద్దాం.

ఐశాన్యాం కూపపుష్టి: పూర్వాస్యా మైశ్వర్యమ్‌ । ఆగ్నేయ్యాం పుత్రనాశ: దక్షిణస్యాం స్త్రీ వినాశ: పీడాంఉత్తరస్యాం సుఖం గృహస్వామిన: ఇతి తథా।। అని శాస్త్ర ప్రమాణం, 
1. ఈశాన్యము నందు ఉంటే పుష్టి (శుభం),
2. తూర్పున ఉంటే ఐశ్వర్యము (శుభం),
3. ఆగ్నేయమున పుత్రహాని (అశుభం),
4. దక్షిణమున స్త్రీలకు హాని (అశుభం),
5. నైఋతిలో ఉంటే మరణము (అశుభం),
6. పడ మరలో ఉంటే సంపద (శుభం),
7. వాయవ్యంలో ఉంటే శతృపీడ (అశుభం),
8. ఉత్తరమున సౌఖ్యము అని చెప్పబడినది.

ఇంకనూ శాస్త్రము నందు గల విషయాలను పరిశీలిద్దాం. ‘‘ పూర్వోత్తరేశాన జలేశు దిక్షు కృతం జలం సౌఖ్య సుత ప్రదంచ ’’ అని కూడా కలదు. తూర్పు, ఉత్తరము, ఈశాన్యము, పడమర ఈ నాలుగు దిశలలో బావులు ఉంటే శుభములు కలుగునని చెప్పబడినది.

శ్రీముఖము, విజయము, ప్రాన్త, దుందుభి, మనోహర, చూడామణి, దిగ్బద్రము, జయము,  నందము, శంకరము అని పేర్లు కూడా ఉన్నవి, ఈ పేర్లు నేటి వాస్తు పండితులకు తెలియదు.
మరియు కాళిదాసు ‘‘సౌమ్య, ప్రాగ్జలాధీశ, కూపఖననం, కర్తూశ్ఛలక్ష్మీప్రదం అనగా ఉత్తరము, తూర్పు, పడమర దిశయందు నుయ్యి ఉన్నచో లక్ష్మీప్రదం అని చెప్పియున్నాడు అంటే కాళిదాసు మొదటిలో చెప్పుకున్న నాలుగు దిశలలో ఈశాన్యము ఉండగా ఇతని అభిప్రాయము ప్రకారము ఈశాన్యమున నుయ్యి చెప్పలేదు.
ఇదే విధానంలో మానసారము మొదలైన ప్రామాణిక గ్రంధములలో ఆగ్నేయ,వాయువ్యములందు కూడా బావులను నిర్మించుకోవచ్చని తెలుపబడినది. అంటే పై విషయములను గ్రహించగా దక్షిణ దిశయందు, నైఋతి దిశయందు కాకుండా మిగిలిన ఆరు దిశలయందు అనగా పడమర, వాయువ్య, ఉత్తర, ఈశాన్య, తూర్పు, ఆగ్నేయములయందు నూతులు, బావులు మొదలైనవి నిర్మించు కోవచ్చునని కొద్ది బేధాభిప్రాయముతో మహర్షులు అందరూ అంగీకరించినారు.

మరియు ‘‘ వీధీం బంధానుజే కూపస్ధానం ప్రకీర్తితం । తధాభావే కుత్ర చిద్వా వీధీ ముద్దిశ్య కల్పయేత్‌ అని చెబుతూ వీధికి చేరియున్న దిశలలో బావులను తవ్వుకోవచ్చని, అట్టి అవకాశము లేనిచో దక్షిణ దిశను విడచి మిగిలిన భాగములలో నూతులను తవ్వుకోవచ్చని స్పష్టమగుచున్నది. ఇలా చేయడం వలన ప్రక్క ఇళ్ల వార్కి కూడా నీటిని తోడు కుని వాడుకునే మంచి సంప్రదాయము మన పెద్దలు శాస్తప్రమాణంగా ఆలోచించి అంగీకరించినారు. (పూర్వం రోజు ల్లో మన పెరటిలోని నీరు ఇతర ఇండ్లవారు కూడా తీసుకువెళ్లేవారు గమనించండి. పరులకు నీటి దానం(సహాయం) వల్ల గతించిన పెద్దలు స్వర్గాన ఉండేవారు )

అంటే నైఋతి దిశయందు కూడా నూతులను త్రవ్వుకోవచ్చునని అర్థమవుతున్నది. నైఋతి దిశయందు నుయ్యి త్రవ్వే విషయమై చాలా మందికి చాలాచాలా అనుమానాలు రావచ్చును. దీని విషయమై అపరాజితపృచ్ఛ, సమరాంగణ సూత్రధారము అనే గ్రంధములో మహేంద్ర, ఇంద్ర, ఇంద్రజయ అనే వాస్తు పదములయందు బావి త్రవ్వినచో శుభప్రదమని తెలుపబడినది. అయితే ఈ విషయంలో విశేషమైన ఆలోచన చేయవలసియున్నది.
ఈ నైఋతి దిశ ఇంటికి నైఋతిదిశా? లేక స్థలమునకు నైఋతి దిశా? అనే ఆలోచన చేయవలసివస్తున్నది.
దీనికి వాస్తు పురుషుని పదవిన్యాస చిత్రమును అవలోకించవలసి వస్తుంది.
వాస్తు పురుషుని పద విన్యాస చిత్రంలో చెప్పినట్లుగా ఇంటి ఖాళీస్థలము యొక్క మొత్తం స్థలంలో 9వ వంతు స్థలాన్ని ఇంటిచుట్టూ విడిచిపెట్టగా మిగిలిన స్థలము ఇంటి స్థలము అగును.
అంటే ఇంటి చుట్టూ విడిచిపెట్టిన 9వ వంతు స్థలంలో నైఋతిదిశ నూతులకు పనికిరాదు.ఇంటికి ఉన్న స్థలంలో ఇంటిని ఆనుకుని నైఋతిదిశలో నూతులను తీసుకోవచ్చును అని స్ఫష్టముగా చెప్పబడినది.


ఇలా చాలా సందర్భాల్లో ఉన్న ఇళ్లు ఉన్నవి. కానీ కాల క్రమంలో శాస్త్ర ప్రమాణములు తెలియని వాస్తు పండితులు ఎక్కువగుటచే ప్రామాణిక విషయాలు మరుగున పడినవి. మరియు శాస్త్ర ప్రమాణం ఉన్న పుస్తకాలు లభ్యము కానం దున కూడా శాస్త్ర విషయాలు తెలియుటలేదు. ఈ పటంలో చూపిన విధముగా స్థలానికి నైఋతిలో నూయి దోషముగా భావించాలి. ఇంటికి ఆనుకుని ఉన్న బావిదోషము ఉండదు ఎందుకంటే ఇది శాస్త్ర ప్రమాణముగా వాస్తు పురుష పద విన్యాసమును బట్టి ఇంద్ర, ఇంద్రజయ అనే పదమునందు కట్టబడుతుంది కావున దోషములేదు. ఇటువంటి ఇళ్లు ప్రస్తుతము రాజమండ్రి, కాకినాడ, అమలాపురం, తిరుపతి మొదలైన పట్టణాల్లో ఇప్పటికీ కలవు.
ఇలా శాస్త్ర ప్రమాణంతో బావులు, నూతులు తీసుకున్నవార్కి ఏ విధమైన హాని జరగదు, మరియు శుభమైన ఫల ములు కలుగును.

ఈ మధ్య వాస్తు శాస్త్రం అనేక వెర్రివేషగాళ్లలో చిక్కి, దక్షిణం నుయ్యి ఉన్నా, లేక ఆగ్నేయం, వాయవ్యం, పడమర ఇలా దిశలలో నూయి ఉంటే పెళ్లాం వేరే వాడితో లేచిపోతుంది, మగపిల్లలకు రోగాలు, ఆడ పిల్లలకు పెళ్లి కాకపోవడం, లేచి పోవడం, అనారోగ్యాలు, గుండె జబ్బులు, ఆర్ధిక సమస్యలు ఇలా ఒకటేమిటి అనేక దోషాలు చెప్పి ప్రజలను భయపెడుతున్నారు. ఇంకనూ ఎత్తు పల్లాలను చూపి పడమరలో నూయి ఉంటే పల్లము కనుక దోషమని చెప్పి వాది స్తున్నారే తప్ప ప్రమాణం చూపడం లేదు. ఎత్తు పల్లాలు అనేవి నేల యొక్క స్థితిగతులే తప్ప నిర్మాణ పరంగా ఉండే నూతలకు లేదు. నిర్మాణ పరమైన విశేషాలను గమనించుకుని నూతులను ఏర్పాటు చేసుకోవచ్చు.

వాస్తుపరంగా వ్యతిరేక దిశలలో ఏదైనా ఉంటే ఆరోగ్యవిషయాలలో లోపమే తప్ప పై చెప్పినదోషాలు ఏమీ జర గవు, ప్రతీ సమస్యను నూతులకు ఆపాదించరాదు, గృహ నిర్మాణంలో లోపాలు, ఇల్లు అర్వణం కుదరకపోయినా కొన్ని దోషాలు ఉంటాయే గాని ప్రత్యేకం నూతుల వల్లకాదు. నూతులు, బావుల విషయాలలో ఇంటి నిర్మాణ విషయంలో తగిన ప్రమాణము చూపే సిద్దాంతులను ఎన్నుకుని మాత్రమే గృహనిర్మాణంచు కోమని సలహాగా సూచిస్తున్నాము.

రచన: కోటి మాధవ్ బాలు చౌదరి

కామెంట్‌ను పోస్ట్ చేయండి

0 కామెంట్‌లు
* Please Don't Spam Here. All the Comments are Reviewed by Admin.
కామెంట్‌ను పోస్ట్ చేయండి (0)

buttons=(Accept !) days=(0)

Our website uses cookies. Learn More
Accept !
To Top