బంధాలు, భవబంధాల - Bhandam


“ బంధనం ”
దశావతారాల్లో వరాహావతారం ఒకటి. వరాహస్వామిగా ఆయన్ని మనం పూజిస్తాం. అయితే, నిజ జీవితంలో ఒక పందిని చూస్తే మనం చీదరించుకుంటాం. పటాలపైన, సినిమాల్లో అమ్మవారో, లేదా అయ్యవారో నాలుగు చేతులు, నాలుగు తలలు కలిగివుంటే, ఎంతో పరవశంతో నమస్కారాలు చేస్తాం. అదే నిజ జీవితంలో అలాంటివాళ్ళు కనిపిస్తే మరోమాటలేకుండా పారిపోతాం. ఇది మనిషియొక్క ఒక విచిత్రమైన మానసిక స్థితి.

మన పురాణాలలో ఇంద్రుడికి కలిగినన్ని శాపాలు మరెవరికీ కలగలేదు. ఒకానొక సమయంలో, ఒకానొక సందర్భంలో, ఒక ముని ఇంద్రుడు చేసిన పనివల్ల కోపించి, ‘నీవు మగ పందివై, భూమ్మీద ఒక సంవత్సరకాలం జీవింతువుగాక’ అని శపించాడు. ముని వాక్యం అమోఘం. వెంటనే ఇంద్రుడు భూమ్మీద ఒక మగ పందిగా పుట్టాడు. కొంతకాలానికి, ఆ పంది ఒక సుందరమైన ఆడ పంది ప్రేమలోపడి, మోహించి, వ్యామోహితుడై, ఆ సుందరాంగి లేకపోతే బ్రతుకే వృధాఅని, ఇక బ్రతుకలేనని అనుకోని, ఆ ఆడ పందిని సమీపించి తన ప్రేమ విషయాన్ని చెప్పాడు. వారి ప్రేమ సుఖాంతం అయింది. వారి పెళ్ళి అయింది. కొంతకాలం వారి ప్రణయ జీవితం హాయిగా జరిగింది. అప్పటికే సంసారమనే పాముతో కాటేయబడ్డ ఇంద్రుడికి (మగ పంది) విషం పైపైకి ఎక్కటం మొదలైంది. ఆ జంటకి అనేకంగా పిల్లలు పుట్టారు. ఆ పిల్లలను, తన భార్యను చూస్తూ, ఎంతో ఆనందిస్తూ, బురదగుంటల్లో పొర్లుతూ, దొర్లుతూ, వారిద్దరూ ఆనందంగా జీవిస్తున్నారు.

చూస్తుండగానే ఒక సంవత్సరకాలం తెలియకుండానే కరిగిపోయింది. ఇంద్రుడికి స్పృహేలేదు. ఆనందంగా, విలాసంగా వున్నాడు. ఇంతలో, అక్కడ ఇంద్రలోకంలో, దేవతలందరూ ఇంద్రుడి రాకకై ఎదురుచూస్తూ, స్వాగత ఏర్పాట్లు అన్నీ చేసుకొని సిద్ధంగావున్నారు. సమయానికి, ఇంద్రుడు రాలేదు. కారణం తెలియక, వారు అగ్నిదేవుడ్ని పిలిచి, భూమ్మీదకువెళ్ళి, ఏంజరిగిందో తెలుసుకొని రమ్మన్నారు. అగ్నిదేవుడు వెళ్ళి, బురదగుంటలో భార్యా, పిల్లల సమేహితుడై ఇంద్రుడు ఆనందంగా వుండటం చూసాడు. అప్పుడు, అగ్నిదేవుడు, ఆర్యా, మీరు ఇందృడు, స్పృహలోకిరండి; మీ శాపం సమయం తీరిపోయింది. కాబట్టి, వెంటనే ఇంద్రలోకానికి విచ్చేయండి, అందరూ మీ రాకకై వేచిచూస్తున్నారు అని విన్నవించాడు. ఆ మాటలువిన్న ఇంద్రుడు, అగ్నిదేవా, నాకు ఇక్కడ చాలా బాగుంది, అంతేకాకుండా నేను నా భార్యని, ముద్దులొలికే నా పిల్లల్ని వదిలి ఇప్పుడు రాలేను. కాబట్టి నీవు వెళ్ళిపో. నేను కొంతకాలం తరువాత వస్తాను అని చెప్పాడు. అయినీ, అగ్నిదేవుడు చాలాసార్లు వచ్చేయమని బతిమాలాడు. ఇంద్రుడుకి కోపంవచ్చి, నేను ఆజ్ఞాపిస్తున్నాను వెళ్ళీపో అని అన్నాడు. చేసేదిలేక ఆయన వెళ్ళిపోయి, జరిగిందేమిటో దేవతలందరికీ చెప్పాడు. ఆతరువాత వరుణుడుకూడా వెళ్ళి ప్రయత్నంచేసి, విఫలుడై తిరిగి వచ్చాడు. ఏంచేయాలో వారికి తెలియలేదు. ఇంద్రలోకంలో ఇంద్రుడులేక పరిపాలనంతా ఆగిపోయింది. అప్పుడు మరొక దిక్పాలకుడు యముడుని పిలిచి నీవు వెళ్ళి ప్రయత్నంచేసి రమ్మన్నాడు. నేను వెళ్ళినా అదే జరుగుతుందికదా ఏమిటి ప్రయోజనం? అని అన్నాడు. అప్పుడు ఆ దిక్పాలకుడు, యమా, ఒకవేళ ఇంద్రుడు నీమాట విని రాకపోతే, వరాహరూపంలోవున్న ఆయన్ని చంపివేయి. ఏం జరుగుతుందో నీకే తెలుస్తుంది, వెళ్ళిరా అని పంపించాడు.

యమధర్మరాజు వెళ్ళి ఇంద్రుడిని స్వర్గలోకాని రమ్మని బతిమాలాడు. ఆయనకు చాలా కోపం వచ్చింది. మీరందరూ, ఒకరితరువాత మరొకరువచ్చి, నన్ను విసిగిస్తున్నారు. ఇక్కడ నేను నా భార్యా,పిల్లలతో నేను చాలా సుఖంగావున్నాను. మీరు నన్ను ఇన్నిసార్లు విసిగించారుకనుక, నా నిర్ణయం చెబుతున్నాను విను: నేను స్వర్గలోకానికి ఇక ఎప్పటికీ రాను. నాకు ఇక్కడే స్వర్గలోకంల్లాగావుంది. ఇక వెళ్ళిపో అని హూంకరించాడు. సరేనని చెప్పి, యముడు కొంచెం దూరం వెళ్ళి, వెనుకగా వచ్చి, ఆ మగపందిని తన కత్తితో చంపేసాడు. పంది శరీరం పడిపోయిందికాబట్టి, చేసేదేమీలేక, ఇంద్రుడు ఆ పంది శరీరాన్ని వదిలివేయాల్సివచ్చింది. అప్పటివరకూ ఆ వరాహ శరీరంతోవున్న బంధనం తెగిపోయింది. వాస్తవాన్ని తెలుసుకున్న ఇంద్రుడు స్వర్గలోకానికి చేరుకున్నాడు.

సామాజిక జీవనంలో మనిషికి మరొక మనిషి తోడుకావాలి. తప్పులేదు. వివాహం చేసుకోవటం, ఒక భార్యని కలిగివుండటం, చక్కటి పిల్లల్ని కలిగివుండటం సహజం, తప్పులేదు; కోరదగ్గదే. మానవజాతి మనుగడకు ఇదంతా కావాల్సిందే. అయితే, కేవలం శరీరంమీదవున్న వ్యామోహంతో, ఈ శరీరమే నేను అన్న ఒక అపోహతో, మనిషి అనేక బంధనాలని తనకుతానుగా కల్పించుకొని, వాటితో పెనవేసుకొని, వాటిని విప్పుకోలేక, వాటిలో ఎల్లకాలం ఇమడలేక, సతమతమవుతూ వుంటాడు. ఎప్పటికో, వయసుమీరిన సమయానికి ఆ బంధనాలనుంచి బయటపడినా, అప్పుడు అతడు ఏమీ చేసే స్థితిలో వుండడు. మిగిలింది విచారం; అసంతృప్తి; అసంతృప్తితో కూడిన మరణం; పాతవాసనలతోకూడిన మరొక క్రొత్త పుట్టుక!!

మనం జాగ్రత్తగా పరిశీలిస్తే, మనిషి జీవితం, అమ్మ పొట్టలోవున్నప్పటినుంచే గట్టి బంధనంతో మొదలవుతుంది. ‘ మాయ ’ అనబడే ‘ మావి త్రాడు ’తో తల్లీ,బిడ్డల బంధనం మొదలవుతుంది. భూమ్మీదకు వచ్చాక, అతనికి ఒక జన్మ నక్షత్రంతో, ఒక రాశితో, ఒక ఋషి గోత్రంతో, ఒక స్వంత పేరుతో, ఒక లింగభేదంతో, ఒక కులం, మతంతో, ఒక ఊరు, దేశంతో, ఒకరికి కొడుకుగా, మరికొందరికి అన్న/తమ్ముడుగా/మేనల్లుడుగా/బాబాయిగా/మామగా ఇలా ఎన్నో చుట్టరికపు అనుబంధాలతో బంధనాలు ఏర్పడుతాయి. అందరూ మనకు కావాల్సిందే. అయితే, వారితో, వాటితో మనకు అవసరమైనంతమేరకే సంబంధం పెట్టుకుంటే, వారిపై, వాటిపై వ్యామోహం లేకుండావుంటుంది. లేకపోతే, ఇంద్రుడిలాగా సంసారమనే బురదగుంటలో కూరుకొని, ఇరుక్కుపోతాము.

నాకనిపిస్తుంది, పూర్వకాలంలో ఒక్కొక్కరి ఇంట్లో పదిమంది పిల్లలు వుండేవారు. అంతమందితో సతమతమవుతూ, ఏ ఒక్కరిమీదా అతిగా ప్రేమ, వ్యామోహాలు పెంచుకునేవారుకారు. కానీ, సంసార తాపత్రయంలో కొట్టుమిట్టులాడుతూ వుండేవారు. ప్రస్తుత కాలంలో, ఒకరు లేక ఇద్దరు పిల్లలున్న సంసారాల్లో, తల్లి,తండ్రులకి పిల్లలమీద, పిల్లలకు అమ్మా,నాన్నలమీద ప్రేమ, అనుబంధాలు చాలా ఎక్కువైపోతున్నాయేమో అని అనిపిస్తున్నది. వున్నదంతా, సంపాదించినదంతా పిల్లలికి కాకపోతే మరెవరికి ఇస్తాం? అనే ధోరణి; మా అమ్మా,నాన్నలు మాకు కాకపోతే మరెవరికి ఇస్తారు ఈ ఆస్తినంతా అన్న ధోరణి పిల్లల్లో ఎక్కువగా కనిపిస్తున్నది. అతిగా దేనినీ కోరుకోకూడదు; అతిని విడిచి పెట్టాలి అని పెద్దలు చెప్పారు. ఇది పాటించకపోతే, మన శరీరానికి, మన మనస్సుకు కలిగే నష్టం అంతాఇంతకాదు.

గమనిక: ఎన్నో, ఎన్నెన్నో బంధాలను, భవబంధాలను మనం చూస్తూనేవున్నాము. అయితే, ఒక క్రొత్త, విచిత్రమైన అనుబంధం ఈ మధ్య మనుషులకు ఏర్పడింది. ఆ విషయం చెబితే అందరూ ఆశ్చర్యపోతారు. తెలిసికూడా ఈ వ్యామోహాన్ని, బంధాన్ని తెంచుకోలేకపోతున్నారు మనుషులు. అదే, ‘ సెల్ ఫోన్ మరియు అంతర్జాల ’ బంధం. దీనిని గురించి నేను ప్రత్యేకంగా చెప్పనక్కరలేదు. దీనివలన, ప్రమోదమా లేక ప్రమాదమా అనేది జనులే తెలుసుకోవాలి. స్వస్తి.

గమనిక: “ పూజ్య స్వామీజీ తత్వవిదానంద చెప్పిన కథను ఆధారంగా వ్రాసిన వ్యాసం ఇది ”.

రచన: పబ్బరాజు మాధవరావు 

buttons=(Accept !) days=(0)

Our website uses cookies. Learn More
Accept !
To Top