బ్రహ్మాండనాయకుడి బ్రహ్మోత్సవం - Tirumala Brahmotsavam


బ్రహ్మాండనాయకుడి బ్రహ్మోత్సవం - Tirumala Brahmotsavam
బ్రహ్మాండనాయకుడి బ్రహ్మోత్సవం
తిరువీధులు గోవిందనామస్మరణతో మారుమోగుతున్న వేళ...
అశేష జనవాహిని మధ్య శ్రీనివాసుడు ఊరేగుతూ కనువిందుచేస్తున్న వేళ...
దేవతలే వాహనాలుగా మారి వైకుంఠనాథుడికి బ్రహ్మరథం పడుతున్నవేళ...
భూలోకమంతా పండగవాతావరణాన్ని సంతరించుకున్న వేళ...
జరగనున్న తిరుమల వేంకటేశ్వరుడి బ్రహ్మోత్సవాల్లో ప్రతి అడుగూ ప్రత్యేకమే, ప్రతి సేవా వైభవోపేతమే.

తిరుమలేశుడి సన్నిధిలో జరిగే బ్రహ్మోత్సవాల సందడి అంబరాన్ని తాకుతుందంటే అతిశయోక్తి కాదు. బ్రహ్మదేవుడే భక్తుడిగామారి శ్రీనివాసుడికి మొట్టమొదటిసారిగా బ్రహ్మోత్సవాలను నిర్వహించాడని భవిష్యోత్తర పురాణం పేర్కొంటోంది. సృష్టికారకుడే స్వయంగా ఆరంభించిన ఉత్సవాలు కావడంతో వీటికి బ్రహ్మోత్సవాలని పేరు. మరో కథనం ప్రకారం - నవబ్రహ్మలు తొమ్మిది రోజుల పాటు జరిపించే ఉత్సవాలు కాబట్టి ఇవి బ్రహ్మోత్సవాలు. అసలీ ఉత్సవాలకూ బ్రహ్మదేవుడికీ ఎలాంటి సంబంధంలేదనీ మిగిలిన ఉత్సవాలతో పోలిస్తే ఇవి చాలా పెద్ద ఎత్తున నిర్వహిస్తారు కనుక వీటిని బ్రహ్మోత్సవాలు అంటారనీ ఇంకొందరి భావన.

వైఖానస ఆగమంలోని క్రతువుల్లో అంకురార్పణం లేదా బీజవాపనం అత్యంత ముఖ్యమైనది. ఏదైనా ఉత్స‌వం నిర్వ‌హించే ముందు అది విజ‌య‌వంతం కావాల‌ని కోరుతూ స్వామివారిని ప్రార్థించేందుకు అంకురార్ప‌ణం నిర్వ‌హిస్తారు. ఇందులో భాగంగా శ్రీవారి త‌ర‌పున సేనాధిపతి అయిన శ్రీ విష్వక్సేనులవారు ఆలయ నాలుగు మాడ వీధుల్లో ఊరేగింపుగా వెళ్లి బ్రహ్మోత్సవాల ఏర్పాట్లను పర్య‌వేక్షిస్తారు. అనంత‌రం అంకురార్ప‌ణ కార్య‌క్ర‌మాల్లో భాగంగా ఆల‌యంలో భూమాత‌కు ప్ర‌త్యేక పూజ‌లు నిర్వ‌హించి పుట్ట‌మన్నులో న‌వ‌ధాన్యాలను నాటుతారు. నవధాన్యాలకు మొలకలొచ్చేవరకు నీరు పోస్తారు. అంకురాలను ఆరోపింపజేసే కార్యక్రమం కాబట్టి ఇది అంకురార్పణం అయింది. అంకురార్పణ ఘట్టం తరువాత రంగనాయకుల మండపంలో ఆస్థానం నిర్వహిస్తారు.

అంకురార్పణం అంటే విత్తనం మొలకెత్తడం. శాస్త్రాల ప్రకారం ఉత్సవానికి తొమ్మిది రోజుల ముందు అంకురార్పణం నిర్వహిస్తారు.
శ్రీదేవి, భూదేవి సమేత వెంకటేశా
అంకురార్పణం – విశిష్టత:
శాస్త్రాల ప్రకారం ఏదైనా ఉత్సవానికి 9, 7, 5, 3 రోజులు లేదా ఒక రోజు ముందు అంకురార్పణం నిర్వహించడం ఆనవాయితీ. ఖగోళశాస్త్రంలోని సిద్ధాంతాల ప్రకారమే ఇలా చేస్తారు. మొక్కలకు అధిదేవత చంద్రుడు కాబట్టి రాత్రి సమయంలోనే విత్తనం నాటుతారు.

ఆగమాల ప్రకారం విత్తనం బాగా మొలకెత్తడాన్ని ఉత్సవం విజయవంతానికి సూచికగా భావిస్తారు. పాలికలు అనే పాత్రలను విత్తనాలను నాటేందుకు వినియోగిస్తారు. బ్రహ్మపీఠాన్ని బియ్యం తదితరాలతో అలంకరించిన తరువాత బ్రహ్మ, గరుడ, శేష, సుదర్శన, వక్రతుండ, సోమ, శాంత, ఇంద్ర, ఇసాన మరియు జయ తదితర దేవతలను ఆహ్వానించి అగ్ని ద్వారా పూజలు చేస్తారు. ఆ తరువాత సోమం రాజ మంత్రాన్ని, విష్ణుసూక్తాన్ని పారాయణం చేస్తారు. విత్తనాలు నాటే సమయంలో వరుణ మంత్రాన్ని పఠించి నీళ్లు చల్లుతారు.

ప్రతిరోజూ ప్రత్యేకమే..!
తిరుమలలో జరిగే బ్రహ్మోత్సవాలకు ఒక ప్రత్యేకత ఉంది. సాధారణంగా ఏ ఉత్సవాలకైనా ప్రారంభించే రోజును తిథివారనక్షత్ర యుక్తంగా నిర్ణయిస్తారు. కానీ ఇక్కడ మాత్రం దీనికి భిన్నంగా బ్రహ్మోత్సవాల్లో చిట్టచివరి ఘట్టమైన చక్రస్నానానికి ముందుగా ముహూర్తం నిర్ణయించి, దానికి అనుగుణంగా మొదటి ఎనిమిది రోజులూ వివిధ వాహనసేవలు నిర్వహిస్తారు. సాధారణంగా స్వామివారి బ్రహ్మోత్సవాలు ధ్వజారోహణంతో ప్రారంభమవుతాయి. ఆలయ ధ్వజస్తంభం మీద గరుడకేతాన్ని ఎగరవేయడమే ధ్వజారోహణం. ఆరోజు రాత్రి నుంచీ వేంకటేశ్వరస్వామి ఉత్సవమూర్తి అయిన మలయప్పస్వామి వివిధ రూపాల్లో వివిధ వాహనాలను అధిరోహించి మాడవీధుల్లో ఊరేగుతాడు. అయితే కొన్ని వాహనాల్లో స్వామి ఒక్కడే తరలివస్తాడు. మరికొన్నింటిలో దేవేరులతో కలిసి అనుగ్రహిస్తాడు. బ్రహ్మోత్సవాల్లో భాగంగా గోవిందుడికి ఉదయం, సాయంత్రం రెండు పూటలా వాహనసేవలు జరుగుతాయి.
  • మొదటిరోజు రాత్రి పెదశేషవాహనం;
  • ✸ రెండోరోజు చినశేష, హంసవాహనాలూ;
  • ✸ మూడోరోజు సింహవాహనం, ముత్యాలపందిరీ;
  • ✸ నాలుగోరోజు కల్పవృక్షం, సర్వభూపాలవాహనం;
  • ✸ ఐదోరోజు మోహినీ అవతారం, గరుడవాహనం;
  • ✸ ఆరోరోజు హనుమంత, గజవాహనాలూ;
  • ✸ ఏడోరోజు సూర్య, చంద్రప్రభవాహనాలూ;
  • ✸ 8వరోజు రథ, అశ్వవాహనాలమీద స్వామి దర్శనమిస్తాడు.
బ్రహ్మోత్సవాల్లో చివరిరోజైన తొమ్మిదోరోజు స్వామివారికి చక్రస్నానం చేయిస్తారు.
దీంతో ఈ ఉత్సవాలు మంగళపూర్వకంగా పరిసమాప్తమవుతాయి.

రచన - మూలము: తితిదే - కోటి మాధవ్ బాలు చౌదరి

buttons=(Accept !) days=(0)

Our website uses cookies. Learn More
Accept !
To Top