శ్రీ విశాలాక్షి అమ్మవారి ఆలయము: కాశీక్షేత్రం - Sri Visaalaakshi Temple: Kashi


వారణాస్య శ్రీ విశాలాక్షి
భారతదేశమునందు ఉత్తరప్రాంతముగా వున్న భూమిని ఉత్తరప్రదేశ్‌గా పిలుస్తారు. ఇక్కడ వేదవాఙ్మయంలో పుట్టి పెరిగిన హైందవమతం, అహింసను ప్రబోధించిన బౌద్ధమతం యొక్క ప్రధాన వేదికలు, జైనమతం ఉజ్జ్వల శోభతో వెలిగి విస్తరిల్లాయి. రామాయణ, మహాభారత పురాణేతిహాసాల దివ్యపురుషుల నివాసం, ఈ పుణ్యభూమి మీద ఉండుట విశేషం. ఉత్తరప్రదేశ్‌ రాష్ట్రం నందు ఆగ్నేయం వైపుగా వారణాసి జిల్లా వుంది. జిల్లా ముఖ్య పట్టణము వారణాసి నగరం. ఈ పట్టణానికి అతి పురాతన నామం కాశికాపురి. కాశీ అనే పేరుకు అర్థం కాంతినిచ్చే స్థలం. హైందవులకు ఇది ముక్తి కాశిక. అనగా జ్ఞానజ్యోతినిచ్చే పురము. ఈ పట్టణము బెనారస్‌, వారణాసి అనికూడా పిలుస్తారు. కాశీక్షేత్రం వేదపురాణ కాలాల కంటే ముందే అత్యున్నతమైన స్థానాన్ని అలంకరించిన విజ్ఞానకేంద్రం.
అమ్మవారి ఆలయ ముఖ్ద్వారము
క్షేత్రములో పావన గంగానది ఉత్తరవాహినిగా ప్రవహిస్తుంది. గంగానదికి ఉత్తరంగా వరుణానది, దక్షిణాన అసి నదులు గంగానదిలో సంగమిస్తున్నాయి. ఈ రెండింటికి మధ్యనున్న పట్టణమవడం వల్ల వారణాసిగా ప్రసిద్ధి చెందినది. కాశీక్షేత్రంలోని మట్టి, గాలి, నీరు మొదలగునవి హైందవులకు అతి పవిత్రమైనవి. ఇక్కడ అడుగడుగునా తీర్థమే. జంతుజాలమూ, పక్షులూ కూడా మరణసమయం నందు విశ్వేశ్వరుని వల్ల తారకమంత్రోపదేశం పొంది ముక్తి నొందుతాయి. కాశీక్షేత్రం క్రిమికీటకాలు పొందే ఉత్తమపదవిని, వేరొక స్థలమున యోగులు కూడా పొందలేరు. ఇంతటి పవిత్ర, పుణ్యదాయకమైన కాశికాపురి, ఆది దంపతులకు నివాసస్థలము. ద్వాదవ జ్యోతిర్లింగములలో 9వది అయిన శ్రీవిశ్వనాధలింగము మరియు అష్టాదశ శక్తిపీఠాలలో పదిహేడవది అయిన శ్రీ విశాలాక్షి పీఠమును వారణాసి నందు దర్శించగలము.

శ్రీ విశాలాక్షి అమ్మవారి ఆలయము, విశ్వనాథ ఆలయమునకు తూర్పుగా సుమారు 2 ఫర్లాంగుల దూరమున మీర్‌గాట్‌కు దగ్గరలో ధర్మేశ్వర్‌ అనుచోట కలదు. సతీదేవి వామహస్తం పడినచోటుగా ప్రతీతి. ఆలయం నందు విశాలమైన కన్నులు కలిగిన విశాలాక్షి స్వరూపం దర్శించగలరు. ఆమెరూపం స్వయంగా ఏకశిలలో వెలసినది. కాశీనగరంలో నవ గౌరీ మందిరాలున్నాయి. వీటిలో విశాలాక్షి గౌరీ మందిరమునకు ఎంతో ప్రాముఖ్యత కలదు. మిగిలిన వాటిలో మంగళగౌరి, విశాలాక్షి గౌరీ మందిరాలు ముఖ్యమైనవి. విశాలాక్షి మందిరములో జరిగే కుంకుమార్చన సుప్రసిద్ధం. అమ్మ తమ భక్తులకు సమస్త సంపదలనూ ప్రసాదిస్తుంది. భక్తుల కోరికలు నెరవేర్చగల జగన్మాతగా ప్రసిద్ధి. శ్రీ కాశీ విశాలాక్షి అమ్మవారు ఆలయం నందు రెండు మూర్తులు దర్శనమిస్తాయి. ముందు భాగములో గల మూర్తిని జగద్గురు శ్రీ ఆదిశంకరాచార్యులవారు స్థాపించినారు. వెనుకభాగంలో గల మూర్తి స్వయంభూమూర్తిగా ఖ్యాతిపొందినది. ప్రతి నిత్యం ఉదయం మరియు మధ్యాహ్నం నందు అమ్మవారికి అభిషేములు జరుగుతాయి. భాద్రపద శుక్ల పక్ష తదియ అమ్మవారి యొక్క జన్మదినం. నాడు విశేషాలంకరములు, ఉత్సవాలు జరుగుతాయి. అమ్మవారి గర్భాలయం బయట చుట్టూ శివలింగాలు, గణపతి మొదలగు మూర్తులను దర్శించవచ్చును. అమ్మవారి ఎడమవైపున గల మందిరంలో అమ్మవారి వాహనములు, నవగ్రహమండపం ఉన్నాయి.

అమ్మవారి దర్శనము కొరకు వచ్చు భక్తుల సంఖ్యలో, దక్షిణభారతదేశం నుంచి వచ్చువారి సంఖ్య అధికముగా ఉంటుంది. అమ్మవారి ఆలయమునకు ఎడమవైపుగా మీర్‌ఘాట్‌, కుడివైపున శ్రీ విశ్వనాధాలయంనకు చిన్న, చిన్న ఇరుకైన సందులలో ప్రయాణం.
కాశీ క్షేత్రం
విశాలక్షి ఆలయం యొక్క ప్రాముఖ్యత:
విశాలక్షి అమ్మవారి పూజలు చేసే ముందు భక్తులు గంగానదిలో పవిత్ర స్నానం చేస్తారు. 
అమ్మవారికి పూజలు చేస్తూ ఆరాధించడం వలన అష్టైశ్వర్యాలు, సుఖఃశాంతులు పొందుతారు.
అలాగే పెళ్లికాని అమ్మాయిలు తమ వరుడిని, సంతానం లేని తల్లిని, సంతానాన్ని పొందటానికి దురదృష్టవంతులైన ప్రజలను, వారి అదృష్టం కోసం విశాలక్షి అమ్మవారిని ఆరాధిస్తారు.

భక్తులు అక్టోబర్ నెలలో ఈ ఆలయంలో నవరాత్రిని జరుపుకుంటారు, అలాగే  రాక్షసుడైన (మహిషాసుర) పై దుర్గాదేవి విజయాన్ని పండుగలా జరుపుకుంటారు. వారు ఇతర నవరాత్రులను చైత్ర (మార్చి) యొక్క పక్షం రోజులలో జరుపుకుంటారు. ప్రతి తొమ్మిది రోజులలో వారు నవదుర్గ (తొమ్మిది దుర్గాలను) పూజిస్తారు.

పురాణాల ప్రకారం, 52 శక్తి పీఠాలలో విశాలక్షి మణికర్ణిక లేదా విశాలక్షి మణికర్ణి ఒకటి. సతి యొక్క కర్ణ కుండాల (చెవి పోగు) ఇక్కడ పడిందని భావిస్తారు, అందుకే దీనిని మణికర్ణి లేదా మణికర్ణిక అని పిలుస్తారు. పురాణాలలో, మహా ప్రళయ తరువాత కూడా వారణాసి నగరం ఉంటుందని స్పష్టంగా ప్రస్తావించబడింది. విశాలక్షి ఆలయం శక్తివంతమైన శక్తి పీఠం మరియు భక్తులకు ఎంతో ఆరాద్యమైన ఆలయంగా ఉంది.

ఆలయ చిరునామా: శ్రీ కాశి విశాలక్షి దేవి ఆలయం, లాహోరి తోలా, వారణాసి, ఉత్తర ప్రదేశ్ 221001, ఇండియా.

ఆలయానికి చేరుకునే దారి: భారతదేశ నలువైపుల నుంచి భారతీయ రైల్వే వారు రైళ్లను అందుబాటులో ఉంచారు. అలాగే రోడ్డు మార్గం ద్వారా బస్సులు, టాక్సీలు ఇతరత్రా మార్గాల ద్వారా ఇక్కడకు చేరుకోవచ్చు.

గూగుల్ మ్యాప్ ద్వారా ఆలయాన్ని చూడండి:


రచన: కళ్యాణ్

buttons=(Accept !) days=(20)

Our website uses cookies to enhance your experience. Learn More
Accept !
To Top